Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేనిది

$
0
0

బాలాపూర్, డిసెంబర్ 15: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు నాకు అందించిన ఈ విజయాని ఎప్పటికి మరులేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన విజయ అభినందన సభలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సబితారెడ్డిని కలిసి శాలువలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సబితారెడ్డి మాట్లాడుతూ.. సేవా చేయటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అధికారంతో స్థానికంగా నెలకొన్న మంచి నీరు, రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారంతో పాటు చెరువుల ప్రక్షళన కోసం తగిన కృషి చేస్తానని హమీ ఇచ్చారు. మీరు నాపై చుపిస్తున్న ఈ అదరణ అభిమానన్ని నేను ఎప్పటికి మరులేనిదని అన్నారు. నా రాజకీయ జీవితంలో మీరు ఇచ్చిన ఈ గెలుపు ప్రధానంగా గుర్తుంటుందని పేర్కొన్నారు. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు. సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రం రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చల్లా నర్సింహ రెడ్డి, మాజీ ఎంపీపీలు జిల్లెల కృష్ణారెడ్డి, సిద్దాల లావణ్య బీరప్పా, జిల్లెలగూడ మున్సిపాలిటి కాంగ్రెస్ అధ్యక్షుడు బండి నాగేష్ యాదవ్, భూపాల్ రెడ్డి, బీ బ్లాక్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మీనా నాగేష్ యాదవ్, మహేశ్వరం అసెంబ్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ కామేష్ రెడ్డి, ఎంపీటీసీలు పోరెడ్డి బాస్కర్ రెడ్డి, ఏనుగుల అనిత అనిల్ యాదవ్, గజ్జల పార్వతమ్మ రాంచందర్, సిద్దాల బాలమణి బాలప్పా, కోట్యా నాయక్, జిల్లెలగూడ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బాలమణి, జిల్లెలగూడ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సబితమ్మకు అభినందనలు
బాలాపూర్, డిసెంబర్ 15: మహేశ్వరం అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పీ.సబితా ఇంద్రారెడ్డికి బాలాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ యూసుప్ పటేల్ అనుచరులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. యూసుప్ పటేల్ మాట్లాడుతూ.. ఆమె చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పట్టం కట్టారని అన్నారు.
సబితమ్మతోనే అభివృద్ధి, సంక్షేమమని ప్రజల గాఢ విశ్వాసమని పేర్కొన్నారు. సబితమ్మ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరి ప్రత్యేక దన్యావాదాలు అని అన్నారు.


వారానికి నాలుగు సార్లు కరీంనగర్- తిరుపతి రైలు

$
0
0

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 15: దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలోనడుస్తున్న కరీంనగర్‌తిరుపతి రైలు ఇకనుంచి వారానికి నాలుగు సార్లు నడవనుంది. ప్రస్తుతం వారానికి ఒకరోజు మాత్రమే నడుస్తుండగా, ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ట్రిప్పులు పెంచేందుకు దక్షిణ మద్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు, పార్లమెంటు సభ్యుడు బి.వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్ సీ ఆర్ జీ ఎం వినోద్‌కుమార్ గుప్తాతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా పలు రైల్వే అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. నగర పరిధిలోని తీగలగుట్టపల్లిలో గల లెవల్ క్రాసింగ్ వద్దరూ.102 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సైతం రైల్వే బోర్డు అనుమతిచ్చిందని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. మనోహరాబాద్‌కొత్తపల్లి నూతన రైలు మార్గంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు వచ్చే ఏడాది మార్చి 21 వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు, గజ్వేల్ నుంచి కొత్తపల్లి వరకు డిసెంబర్ 31 2019 వరకు రైలు నడిపేలా పనులు శరవేగంగా కొనసాగిస్తున్నారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

కేటీపీపీ షట్‌డౌన్

$
0
0

భూపాలపల్లి/గణపురం, డిసెంబర్ 15 : జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) మొదటి, రెండో దశలు శనివారం షట్ డౌన్ చేశారు. వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో గత్యంతరం లేక అధికారులు మొదటి దశ 500 మెగావాట్లు, రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లను నిలిపివేశారు. గురువారం రెండో దశ 600 మెగావాట్ల ప్లాంట్‌లోని టర్బన్ జనరేటర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలు సరిచేసిన ఇంజనీర్లు తిరిగి ప్లాంట్‌ను అదే రోజు రాత్రి సింక్రనైజేషన్ చేసేందుకు సిద్దం కాగా మరోసారి సాంకేతిక లోపం బయటపడి ప్లాంట్ నిలిచిపోయింది. దీంతో అధికారులు ఢిల్లీ నుండి ప్రత్యేక బృందాలను పిలిపించి మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. రెండో దశ పరిస్థితి ఇలా ఉండగా మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్ బాయిలర్ ట్యూబ్ లీకేజి కావడంతో ఆ ప్లాంట్‌ను కూడా షట్ డౌన్ చేశారు. కేటీపీపీ చరిత్రలో 48 గంటల వ్యవధిలో రెండు ప్లాంట్లు షట్ డౌన్ కావడం ఇదే మొదటి సారి అని కార్మికులు అంటున్నారు. గత ఎనిమిది నెలలుగా విద్యుత్ ప్లాంట్‌లో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు నాసిరకం బొగ్గును వాడటంతో విద్యుత్ ప్లాంట్‌లు తరచూ మొరాయించడం వలన జెన్-కోకు ప్రతి రోజు కోట్లలో నష్టం వాటిల్లుతుందని విమర్శలు వ్య క్తమవుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిలిచిపోయినప్పటికి అధికారులు ఆ విషయాన్ని గోప్యంగా ఉం చుతున్నారు. గతంలో కేటీపీపీలో పీ ఆర్‌వోను ఏర్పాటు చేసి ప్లాంట్‌లో ఎలాంటి సమాచారాన్నైనా మీడియాకు తెలియజేసేవారు. కానీ నూతనంగా వచ్చిన సీ ఈ కనీసం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలైన కేటీపీపీ విద్యుత్ ప్లాంట్‌లపై కొందరు అధికారులు పెత్తనం చలాయించడం వలనే ప్లాంట్ల పరిస్థితి ఈ విధంగా తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్లాంట్లు వరుసగా నిలిచిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు బాహటంగానే విమర్శిస్తున్నారు. రెండు ప్లాంట్లు తిరిగి విద్యుద్‌త్పత్తి కావాలంటే నాలుగు రోజులు పడుతుందని సమాచారం.

హుజూర్‌నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉంటా

$
0
0

హుజూర్‌నగర్, డిసెంబర్ 15: హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇక మీదట అందుబాటులో ఉండి పనిచేస్తానని స్థానిక ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పార్టీల గెలుపు, ఓటములు సహజమన్నారు. తనకు పీసీసీ చీఫ్ బాధ్యతలు ఉండటంతో నియోజవర్గానికి ఎక్కు వ సమయం కేటాయించలేపోయానన్నారు. దానివల్ల జరిగిన నష్టాన్ని గమనించానన్నారు. ఇక ముందు హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యత తనతో పాటు కార్యకర్తలపై ఉందన్నారు. త్వరలో సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాలు, ఎంపీల ఎన్నికలు రానున్నందునా కార్యకర్తలు ధైర్యంతో ప్రజల మధ్య ఉండి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనీయర్ నాయకులు సామల శివారెడ్డి, మంజూనాయక్, నిజాముద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణలో బీజేపీని రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేస్తామని, లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అవుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. ఈ నెల 24న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వస్తారని, పార్టీలో సమీక్ష జరుగుతుందని అన్నారు. జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. 2019లో నరేంద్రమోదీని మరోసారి ప్రభుత్వంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. కేసీఆర్ వాపును చూసి బలుపు అనుకోని , బీజేపీకి 150 కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు రావని, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి, తెలంగాణకు చేసింది ఏమిటో ప్రజలకు తెలుసని చెప్పారు. క్ష్లస్టర్లు వారీ 24వ తేదీన అమిత్ షా విశే్లషణ చేస్తారని చెప్పారు. బీజేపీ ఓట్లు మాత్రమే జాబితాల నుండి గల్లంతు అయ్యాయని, వాటిపై విశే్లషణ చేస్తున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో కుమార పట్ట్భాషేకం, ఇపుడిపుడే అయిందని కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం తీరుపై స్పందిస్తామని చెప్పారు. ఈవీఎంల సాంకేతికతపై తమ అభ్యర్ధులకు కూడా కొన్ని అనుమానాలున్నాయని, దానిపై కమిటీ వేసి చర్చిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ ఒంటెద్దు పోకడలకు వెళ్తె ప్రజలు తిరగబడతారని, సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్ గట్టెక్కిందని గుర్తించాలని పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి సమిష్టి బాధ్యత ఉందని, ప్రధాని స్వయంగా తెలంగాణలో ప్రజలకు బీజేపీ పట్ల ఎంతో ప్రేమ ఉందని చెప్పారని, కానీ ఓట్లు రాకపోవడంపై సమీక్ష జరుపుతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దానికన్నా ఎక్కువ సెంటిమెంట్ ఈసారి వచ్చిందని తమకు రావల్సిన ఓట్లు కూడా టీఆర్‌ఎస్‌కు వెళ్లాయని చెప్పారు. మోదీ అవినీతి రహిత పాలన చూసి బురదజల్లే కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని, సైనికుల స్థైర్యం దెబ్బతినే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని అన్నారు. రాఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ పార్టీ తమ దుష్ప్రచారాన్ని మానుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అవినీతి మచ్చపడకుండా పారదర్శకంగా పాలన కొనసాగిస్తోందని అన్నారు.అధికారం కోసం తరచూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిందని అన్నారు. 2019లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ విరామం లేకుండా బీజేపీ అనుబంధ సంస్థలు , మోర్చాలూ ప్రజలతో మమేకం కావాలని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అమిత్ షా సూచించారని చెప్పారు. పార్టీని బలోపేతం చేసి , ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంపై దృష్టి పెడతామని చెప్పారు. జనవరి 11,12 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వ్యూహాన్ని రూపొందిస్తామని, తెలంగాణలోని 14 పార్లమెంటు స్థానాలను సాధించేందుకు సమీక్ష చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నుండి అన్ని మోర్చాల సమావేశాలు జాతీయ స్థాయిలో జరుగుతాయని చెప్పారు.
చిత్రం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

రాఫెల్‌పై జేపీసీ ఏర్పాటుకు భయమెందుకు?

$
0
0

విజయవాడ, డిసెంబర్ 15: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రరత్నభవన్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల అనుమానాలు నివృత్తి చేసేందుకు లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి నిజం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తులసిరెడ్డి అన్నారు.

తుపాను హెచ్చరికతో

$
0
0

కాకినాడ సిటీ, డిసెంబర్ 15: తూర్పుగోదావరి జిల్లాపై పెథాయ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తుపానును ఎదుర్కొనేందుకు శనివారం అధికారులతో జిల్లా కలెక్టరేట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. తుపాను అల్లవరం మండలం ఓటలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్యలో తుపాను తీరందాటే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు ఇటీవల తిత్లీతుపాన్ సమయంలో స్పెషల్ అధికారులుగా పనిచేసిన నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. కోనసీమ ప్రాంతంలో 50కిపైగా పునరావాస కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్వావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. తుపాను జిల్లాలో తీరం దాటే సమయంలో గంటకు 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్న కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా సెల్ టవర్లు వద్ద జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా సెల్ టవర్లవద్ద జనరేటర్లను ఏర్పాటుకు ఏజెన్సీలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన తక్షణం కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం కలగకుండా సెల్ టవర్లు వద్ద జనరేటర్లను ఉంచి రానున్న ఆరు, ఏడురోజుల పాటు అవి నిరంతరాయంగా పనిచేసేటట్లు కృషిచేయాలని కోరారు.
తుపాను తాకిడికి గురయ్యే 12తీర మండలాల్లో టెక్నీషియన్లు అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేయాలని కలెక్టర్ మిశ్రా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మొబైల్ కనెక్టవిటీకి ఎటువంటి అంతరాయం లేకుండా అవి నిరంతరాయంగా పనిచేసే విధంగా ఈవారం రోజులు అధికారులు అందరూ సమిష్టిగా కృషిచేయాలన్నారు.
మొబైల్ 1జిబి సెట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తక్షణం తరలించాలని కలెక్టర్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసి-2 సిహెచ్ సత్తిబాబు, డీఆర్వో సుబ్బలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వైద్య పరికరాల ఎగుమతులపై ‘మెడ్‌టెక్’ ముద్ర

$
0
0

గాజువాక, డిసెంబర్ 15: వైద్య పరికరాలు, విడి భాగాల ఎగుమతులతో ప్రపంచ దేశాల్లో విశాఖపట్నం మెడ్‌టెక్ ముద్ర పడుతుందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో రెండు నెలల్లో ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో తయారయ్యే పరికరాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ ప్రాముఖ్యతపై మాలకొండయ్య ‘ఆంధ్రభూమి’కి శనివారం వివరించారు. దక్షణ ఆసియాలో ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌లో మాత్రమే సకల సౌకర్యాలతో వైద్య పరికరాల తయారీకి అవకాశాలు ఉన్నాయన్నారు. వైద్య ఉపకరణాలు, విడి భాగాల తయారీ మొదలుకొని తనిఖీ, ధ్రువీకరణల వరకు దేశంలో అన్నీ ఒకే చోట ఉన్న ప్రాంగణం విశాఖ మెడ్‌టెక్ జోన్ అన్నారు. జోన్‌లోని వివిధ పరిశ్రమల్లో తయారయ్యే పరికరాలు భవిష్యత్ జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల్లో కనిపిస్తాయన్నారు. ఆయా దేశాల్లో విశాఖలో తయారైన వైద్య పరికరాల ఉత్పత్తి లభ్యతతో మెడ్‌టెక్ జోన్ మార్కు కనిపిస్తోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు వైద్య పరికరాల తయారీ సంస్థల ఏర్పాటుకు మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖలు విశాఖ మెడ్‌టెక్ జోన్ ప్రాముఖ్యతను ప్రపంచ దేశాల పెట్టబడిదారుల దృష్టికి తీసుకు పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నారు. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కచ్చితమైన ఫలితాలను తెలిపే వైద్య పరికరాలు తయారు అవుతాయన్నారు. గర్భిణులకు వైద్య పరీక్షలను నిర్వహించేందుకు సరికొత్త పరికరాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. రక్త పరీక్షలు, రక్తపోటు తనిఖీలను అత్యంత కచ్చిత్వతంతో ఆశ కార్యకర్తలు కూడా నిర్వహించేలా పరికరాన్ని రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా గర్భిణులులు, చిన్నారులు తరుచుగా రక్త నమూనాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు తరుచూ అసౌకర్యానికి గురవుతున్నారని, ఈ నూతన పరికరంతో అటువంటి సమస్యలకు చెక్ పెట్ట వచ్చునన్నారు.
2020లో విశాఖ వేదికగా డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ సదస్సు
ఉక్కునగరం: ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020లో 5వ అంతర్జాతీయ సదస్సును విశాఖపట్నంలోనే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్‌లో ఏర్పాటవుతున్న పరిశ్రమల ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు 5వ అంతర్జాతీయ సదస్సును విశాఖపట్నంలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడ్‌టెక్ ప్రారంభం రోజునే కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో 2020లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకారం కూడా లాంఛనీయం కానున్నదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.


ఏపీకి ప్రధాని ద్రోహం చేయలేదు

$
0
0

విజయనగరం, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ద్రోహం చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్రోహం చేశారని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్ అన్నారు. శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ముందుకు వస్తే వారు కమిషన్ ఇవ్వరని జిఎంఆర్‌కు కట్టాబెట్టాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసిందన్నారు. కాగా, ఇక్కడ ఎంపీగా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పటికీ దేనికి నోరు మెదపడం లేదని, అలాంటపుడు మంచివ్యక్తి అయితే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియాగాంధీ ఇద్దరూ ఆంధ్రులకు ద్రోహం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీలను చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కంటిమీద కునుకు రావడం లేదన్నారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ బీజేపీ తన అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని విలేఖరులు అడగ్గా బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుందన్నారు. వచ్చే నెల 6న ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తారని, ఏయే ప్రాంతాల్లో పర్యటించనున్నదీ మరో రెండు రోజుల్లో స్పష్టం చేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నిమ్మక జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శివప్రసాద్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

17 నుండి పీఏసీఎస్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

$
0
0

విజయవాడ(సిటీ), డిసెంబర్ 15: వేతన సవరణతో పాటు పలు సమస్యల పరిష్కారం కోరుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలలో (పీఏసీఎస్) పని చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 17 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏపీస్టేట్ అగ్రికల్చరల్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఈసమ్మెకు స్పష్టం చేసింది. ఉద్యోగుల సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని గతంలో హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 14 నుండి తలపెట్టిన సమ్మెను ఉద్యోగులు వాయిదా వేసుకున్న సందర్భంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరవధిక సమ్మె నిర్ణయం తీసుకున్నారు.
యూనియన్ అనుబంధాలతో సంబంధం లేకుండా ఈ సమ్మెలో వ్యవసాయ పరపతి సంఘాలలో పని చేస్తున్న ఉద్యోగులందరూ నిర్ణయించారు. 2014 ఏప్రిల్ నుండి వేతనాలను సవరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ సవరించకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్సిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాకోర్టు నుంచి మోదీ తప్పించుకోలేరు

$
0
0

విజయవాడ, డిసెంబర్ 15: రాఫెల్ కుంభకోణంపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిందని జబ్బలు చరుచుకుంటున్న ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రజాకోర్టులో దోషులుగా నిలవడం ఖాయమని, దేశ రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం చేసిన కుంభకోణం నుంచి బీజేపీ అంత తేలిగ్గా తప్పించుకోలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకోవడం మోదీ, షా ద్వయానికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియదన్న సంగతి ఇప్పటికే దేశ ప్రజలందరికీ అర్థమైందన్నారు. బీజేపీ నిజంగా ఏ తప్పూ చేయనప్పుడు రాఫెల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయపడానికి ఎందుకు వెనుకంజ వేస్తుందో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల ద్వారా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులను మేనేజ్ చేయలేమన్న భయంతోనే అరకొర సమాచారంతో సుప్రీంను ఆశ్రయించి, ఆ కోర్టు ఇచ్చిన తీర్పుతో తామంతా సచ్ఛీలురైనట్లు బీజేపీ నేతలు భావిస్తే అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదని యామినీ శర్మ తేల్చి చెప్పారు.
ఒక అర్చకుడి మరణాన్ని ఏపీ ప్రభుత్వానికి ఆపాదించాలని, తద్వారా తమకు మేలు చేకూర్చుకోవాలని భావిస్తున్న వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయన్నారు. ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, కోన రఘుపతి బ్రాహ్మణుల ముసుగులో తెలుగుదేశంపై బురదజల్లాలని చూడడం ఎంత మాత్రం భావ్యం కాదన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి దుర్మార్గపు చర్యలను దివంగత వైఎస్ నుంచి వైసీపీ అధినేత జగన్‌కు వారసత్వంగా లభించాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రూ. 285 కోట్లను బ్రాహ్మణుల సంక్షేమానికి వినియోగించారన్నారు.

రీల్ లైఫ్ ఫాదర్‌గా..

$
0
0

కంటెంట్ కథలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న క్రేజీ ప్రాజెక్టును మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలనటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా కనిపించనుంది. చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. ఎబిసిడి చిత్రానికి పాజిటివ్ సైన్ తోడయ్యింది. మెగాబ్రదర్ నాగబాబు హీరో తండ్రిగా నటించిన గీతగోవిందం, అరవింద సమేత చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అల్లు శిరీష్‌కి ఫాదర్‌గా నాగబాబు నటించటం యూనిట్ అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ నాకు రియల్ లైఫ్ అంకుల్, ఇప్పుడు రీల్ లైఫ్ ఫాదర్‌గా కనిపించనున్నారు. ఆయనతో కలిసి నటిస్తున్న సన్నివేశాల్లో చాలా ఎంజాయ్ చేస్తున్నా. మా మెగాఫ్యామిలీ హీరోలతో మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఎబిసిడి చిత్రం మంచి ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నా అన్నారు.

గీతామహేష్!?

$
0
0

సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా తీయడానికి ప్రతి ప్రొడ్యూసర్ ఆసక్తి చూపిస్తాడు. అలా తెలుగు ఇండస్ట్రీలో ఓ కొత్త కాంబినేషన్‌కు స్క్రీన్‌కు వస్తుంది. అదే గీతామహేష్. గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హీరో మహేష్‌బాబుతో ఓ ప్రాజెక్టు చేయడానికి సంయుక్త ప్రణాళిక సిద్ధమైందట. ప్రస్తుతం మహర్షి షూటింగ్ బిజీలోవున్న మహేష్, తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. సుకుమార్ సినిమా తరువాత అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ ప్రాజెక్టుని అల్లు అరవింద్ చేపట్టనున్నాడట. తరచూ సందీప్, మహేష్‌లు కలిసి చాలాచోట్ల కనిపించగా, వీరిరువురి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని అందరూ అనుకున్నారు. కానీ వీరి సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత అన్న సమాచారం బయటకు పొక్కడంతో, కాంబినేషన్ సెట్టైనట్టేనన్న టాక్ బలపడింది. ఇక అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.

ఓకేసారి వస్తాం.. బ్రదర్

$
0
0

సీనియర్ యన్‌టిఆర్ జీవితం ఆధారంగా కొడుకు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం -యన్‌టిఆర్. క్రిష్ డైరెక్షన్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. డిసెంబర్ 16న హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేసి, 21న నిమ్మకూరులో ఆడియో విడుదల నిర్వహించాలని చిత్రబృందం తొలుత భావించింది. అయితే, తాజా అప్‌డేట్‌లో రెండు వేడుకలూ ఒకేసారి నిర్వహిచాలని భావిస్తున్నట్టు సమాచారం. రెండు కార్యక్రమాలూ డిసెంబర్ 21నే నిర్వహించాలని నిర్ణయించినట్టు యూనిట్ వెల్లడిస్తూ, ‘యన్‌టిఆర్’లోని బాలకృష్ణ సరికొత్త లుక్‌ను విడుదల చేశారు. యన్టీఆర్ కోసం అప్పట్లో డిజైన్ చేసిన బాబీ కాలర్ మోడల్ తెల్ల చొక్కాను ధరించిన బాలకృష్ణ కళ్లద్దాలు పెట్టుకుని ప్రొజెక్టర్‌పై చేయివేని నిలబడిన స్టిల్‌ను అభిమానుల కోసం విడుదల చేశారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ‘కథానాయకుడు’, జనవరి 25న ‘మహానాయకుడు’ పేరిట విడుదల చేయనున్నారు. తొలిభాగంలో ఎన్టీఆర్ సినిమా విశేషాలు, రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రాధాన్యతను చూపించనున్నారు.

రేస్‌లో మారి-2

$
0
0

చివరి సినిమాల రేస్‌లోకి తాజాగా తమిళ హీరో ధనుష్ కూడా వచ్చి చేరాడు. మారి సాధించిన సెనే్సషనల్ హిట్టుతో మారి-2ని సీక్వెల్‌గా తెస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సైతం వచ్చే శుక్రవారం అంటే -డిసెంబర్ 21న విడుదలయ్యే చిత్రాల రేసులోకి తీసుకొచ్చారు. దీంతో వచ్చ శుక్రవారం ఆరు సినిమాల మధ్య గట్టి పోటీయే కనిపిస్తోంది. డిసెంబర్ చివరిలో వరుస పెట్టేస్తోన్న చిత్రాలు అటు జనాల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయ. మారి-2లోధనుష్‌తో సాయపల్లవి జోడీ కట్టింది. ముఖ్యపాత్రల్లో కృష్ణ, వరలక్ష్మీ శరత్‌కుమార్ కనిపించనున్నారు. పూర్తి మాస్ యాక్షన్ చిత్రంగా వస్తున్న మారిపై పెద్ద అంచనాలే ఉన్నాయ. బాలాజీమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సెనే్సషన్ సృష్టించాయ. తెలుగులో ధనుష్‌కు పెద్దగా మార్కెట్ లేకున్నా, మారి-2తో మంచి మార్కెట్ సాధించగలనన్న నమ్మకంతో ఉన్నాడు. ఇదిలావుంటే వచ్చే శుక్రవారం విడుదలవుతున్న చిత్రాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది -మెగా హీరో వరుణ్‌తేజ్ అంతరిక్షం. ఘాజిలాంటి కొత్త చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి టాలీవుడ్ స్పేస్ బ్యాక్‌డ్రాప్ సినిమా ఇది. ఇప్పటికే యావత్ ప్రేక్షకుల్లో ఓ రేంజ్ ఆసక్తి రేపిందిది.
అలాగే శర్వానంద్ -సాయిపల్లవి జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘పడి పడి లేచే మనసు’. పూర్తి లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమాపై యూత్‌లో ఫాలోయింగ్ వుంది. వీటితోపాటు కన్నడ హీరో యష్ నటించిన కెజిఎఫ్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీలో అత్యంత భారీగా రిలీజవుతోంది. ఇవికాకుండా బైక్ రేసర్‌గా కొత్త అవతారం ఎత్తిన కార్తి చిత్రం దేవ్ సైతం వచ్చేవారమే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకుని తెరకెకిన యాత్ర చిత్రం సైతం అదే రోజున విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా వచ్చేవారం కూడా కనీసం ఆరు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.


స్వాధ్యాయ సందోహం-170

$
0
0

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
మేమూ దేవాధిదేవుని ఆజ్ఞలను, నియమాలను ఏ విధంగా అతిక్రమించాం? లోకంలో ఈ విషయాన్ని ఎవడు పూర్తిగ తెలుసుకొంటున్నాడో వాడు సహజ మిత్రులైన దేవతలపైన కూడ కోపంతో ఉండడు. పాపఫలమైన దుఃఖంచేత భయకంపితులు కాక ధర్మాచరణ చేసే వారికి అన్నం, బలం, జ్ఞానం సమస్తమూ సిద్ధిస్తాయి.
వివరణ:- సైనికులు తమ చేతిలో ఆయుధాలతో ప్రజలను చంపుతూ ఉంటే ధార్మికుడైన రాజు లేదా రాజ్యవ్యవస్థ చూస్తూ ఊరుకోదు. సైనికుల నుండి ఆయుధాలను వెంటనే స్వాధీనపరచుకొంటుంది. అంతేకాదు వారికి తగిన దండన కూడ విధిస్తుంది. అదే విధంగా మానవులు తమవద్దనున్న మారణాయుధాలతో తోటి మానవులకు ఉపకారానికి బదులుగా అపకారాన్ని చేస్తూ ఉంటే మరియు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటే ధర్మాధీశుడైన భగవంతుడు వారి నుండి ఆ మారణాయుధాలను ఉపసంహరించి ఎన్నడూ పాపాచరణకు అవకాశమే లేని జీవులుగా వారిని పుట్టిస్తాడు. లోకంలో ఎక్కడైనా అల్పజ్ఞుడైన ప్రభువు దండనీతిలో స్ఖాలిత్యముండవచ్చునేమో గాని సర్వజ్ఞుడైన పరమాత్ముని దండనీతి వ్యవస్థలో అట్టి స్ఖాలిత్యమే ఉండదు. తనవద్దనున్న ఎటువంటి సాధన సంపత్తినైనా దైవముపసంహరిస్తే వివేకవంతుడయిన వ్యక్తి విచారించక ‘కిం స్విన్నో రాజా జగృహే’ ‘రాజరాజేశ్వరుడు మావద్దనుండి వేనిని లాగుకొన్నాడు?’’అని సమాధానపడతాడు. అంతేకాదు ‘కదస్యాతి వ్రతం చకృమా కో వివేద’ దైవాజ్ఞలను మే మేవిధంగా ఉల్లంఘించామో మాలో ఎవరికి మాత్రం తెలుసు?’’అని పశ్చాత్తాప్తుడవుతాడు.
లోకంలో పాపులు పాపకార్యాలను చేస్తారు. కాని తాము పాపాలు చేసిన విషయానే్న మరచిపోతారు. కాలక్రమంలో ఆ పాపకార్య ఫలాలు సంప్రాప్తం కాగానే గాభరాపడి చివరకు దైవదూషణకు పాల్పడతారు. కాని బుద్ధిమంతులు దుఃఖం పాపకర్మ ఫలమేనని గ్రహించుకొంటాడు.
పాపమే చేయకుంటె దుఃఖ మెక్కడినుండి ప్రాప్తిస్తుంది. ఈ సత్యాన్ని తెలిసికొన్న బుద్ధిమంతులు దైవదూషణ చేయక ‘కదస్యాతి వ్రతం చకృమా కో వి వేద’ ‘‘దైవ శాసనాలను మేము ఎనె్నన్నివిధాలుగా అతిక్రమించామో!’’అని ఆత్మవిమర్శ చేసికొని పాప ఫలాలననుభవిస్తూ ధర్మమార్గాన్ని వీడక ధర్మాచరణ ఎడల దృఢ వ్రతులవుతారు.
ఈ విధంగా ‘శ్లోకో న యాతామపి వాజో అస్తి’ ‘‘స్థిరచిత్తంతో పాప ఫలమైన దుఃఖం చేత విచలితులుకాక ధర్మాచరణ చేసే వారికి కీర్తి, ఆహార సమృద్ధి, బలం, ఐశ్వర్యం తప్పక సిద్ధిస్తాయి.’’
ఈ వేదమంత్రోపదేశాన్ని చిత్తశుద్ధితో గ్రహించి దుఃఖాన్ని తమ పాపకర్మల ప్రతిఫలంగా భావించి దైవనిందకు పాల్పడక సంతోషంగా అనుభవిస్తూ ధర్మాచరణకు దృఢ నిశ్చయంతో పూనుకొన్నవానికి సమస్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాకాక దుఃఖం చేత విచలితులై దైవనిందకు పూనుకొన్నవారికి ఈ లోకంలో దుష్కీర్తితోబాటు సుఖీజీవనం కూడ లభ్యంకాదు.
**
జీవన రాత్రిలో నిన్ను పొందినవాడు అదృష్టవంతుడు
ఆరే అస్మదమతిమారే అంహ ఆరే విశ్వాం దుర్మతిం యన్నిపాసి
దోషా శివః సహసః సూనో అగ్నే యం దేవ ఆ చిత్సచసే స్వస్తి॥
ఋ.4-11-6.
భావం:- ఓ అగ్నీ! ఎప్పుడు నీవు జీవులను రక్షిస్తావో అప్పుడే నీవు వారి అజ్ఞానాన్ని - కర్మశూన్యతను- నాస్తికత్వాన్ని దూరంచేస్తావు. పాపాలను హరిస్తావు.
మనసులోని దురాలోచనలను పూర్తిగా నిర్మూలిస్తావు. బలవంతులను కూడ అణచివేయగల ఓ అగ్నీ! దివ్యమైన రాత్రియందు వచ్చి ఆనందకరంగా దర్శనమిచ్చే శివ భగవానుడవు కూడ నీవే.
వివరణ:- మానవుడు భయంకర పాపప్రవాహంలో కొట్టుకుపోయేటప్పుడు లోకంలో నిలువనీడ కొంచెం కూడ ఉండదు. ఆత్మకు తన తప్పిదంవలన ఇంద్రియాలు శత్రువులై వశంకాక స్వేచ్ఛగా సంచరింపసాగితే విధిలేక వానికి ఆత్మ వివశమై వశపడితే దానికి పాపమనే సూది గ్రుచ్చుకొన్నట్టే. ఈ విషయాన్ని వివరిస్తూ శుక్లయజుర్వేదమీ విధంగా వర్ణించింది.
అసుర్యా నామ తే లోకా అంధేన తమసావృతాః
తాన్ స్తే ప్రేత్యాపి గచ్ఛంతి యే కే చాత్మహనో జనాః యజు.40-3॥
భావం:- ‘‘తమ ఆత్మలను స్వయంగా నాశనం చేసుకొనేవారు మరణించిన పిమ్మట ఘోరాంధకారంతో ఆవరించబడిన లోకాలలో (కేవలం దుష్కర్మ ఫలాలను అనుభవించే జన్మలలో) పడిపోతారు.’’అంటే ఆ జన్మలో వారు ఎన్నడూ వెలుగులను అనగా సుఖాలను చూడనే చూడలేరు.
ఇంకావుంది...

సుందరకాండ

$
0
0

ఆ గుహలలో సూక్ష్మ శరీరంతో నివసిస్తూన్న భూతాలు కూడా ఉండలేకపోయినవట. మహావృక్షాలు గుండెలకు రాస్తూ ఉండగా స్వామి నిష్ప్రమాణ స్వరూపుడై ఎదిగిపోతున్నాడు. ఇక్కడ స్వామిని విద్యాధరులు దర్శయంతో మహావిద్యాం అనినట్లు చూస్తున్నారు. స్వామి యోగ విద్యాస్వరూపమై ఉన్నాడు.
మార్గమాలోకయాన్ దూరాదూర్థ్యం ప్రణిహితే క్షణ:
రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్.
దూరంనుండి మార్గాన్ని చూస్తున్నాడు. ప్రాణాన్ని హృదయ స్థానంలో నిరోధించేడు. భ్రూమధ్యాన్ని చూసే ప్రణహితే క్షణత్వంతో ఆకాశాన్ని చూస్తున్నాడు. స్వామి నాభిదేశమందలి మణిపూర పద్మమందున్నాడు.
ఇది విష్ణుతత్త్వం కలది. దీనికి పది దళాలు ఉంటాయి. మహర్షి ఈ శ్లోకంలో కూడా పది మాటల్నే వాడేరు.
ఇది ప్రాణమయ కోశానికి సంబంధించినది. విద్యుత్తులతో నిండిన మేఘకాంతితో ఉంటుంది. ఇక్కడ ఉండే లాకినీ అనే దేవతాముఖమందు సరస్వతి ఉంటుంది. అందుకనే విద్యాధరులకు మహావిద్యాస్వరూపంగా కనబడుతున్నాడు.
ఆ తరువాత:
ససూర్యాయ మహేంద్రాయ
పవనాయ స్వయంభువే
భూతే భ్యశ్చాంజలిం కృత్వా
చకార గమనేమతిం.
అంజలిం ప్రాజ్ముఖ:
కృత్యా పవనాయాత్మయోనయే
తతో భివవృధేగంతుం
దక్షిణో దక్షిణాందిశమ్.
అని స్వామి సర్వదేవతా నమస్కారం చేసేడు. సూర్యునితో కలిసిన ఇంద్రునకు నమస్కరించేడు. వాయువునకు నమస్కరించేడు. బ్రహ్మకు నమస్కరించేడు పంచభూతాలకు నమస్కరించేడు. తూర్పు దిక్కునకు నమస్కరించేడు. తన జన్మ కారకుడైన వాయువునకు నమస్కరించేడు. స్వామి దక్షిణుడయ్యేడు. అభివృద్ధిని పొందేడు. ఈ వృద్ధి అంతా దక్షిణ దిక్ప్రయాణాన్ని గురించే. ఇక్కడ మహర్షి చాలా చిత్రమై విషయాల్ని చెప్పేరు.

ఇంకావుంది...

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

సామాన్య సాధకులకసాధ్యములు, మీదుమిక్కిలి ప్రమాదకరములు, సంపూర్ణమగు నింద్రియ నిగ్రహమున్ననే కాని సమీపమునకుగూడ బోధగని సాధనలివి. కాని జితేంద్రియ చక్రవర్తియు జగజ్జనని ముద్దుబిడ్డడునగు శ్రీరామకృష్ణుడు వీనినన్నిటి నవలీలగా సాధింపగలుగుటాశ్చర్యము కానేరదు. అతని ప్రతిభాతిశయ మెట్టిదో దీనిమూలముననే మనకు దెలియగలదు. ఈ తాంత్రిక సాధన నానా రూపములలో పరమేశ్వరీ సాక్షాత్కారము నాతనికి బ్రసాదించుటయేకాక, ప్రతి స్ర్తియును సాక్షాత్ పరమేశ్వరీ స్వరూపమే యనునిశ్చయము నాతని హృదయమున నెలకొల్పెను.
శ్రీరామకృష్ణుడు డవలంబించిన సాధనలలో వైష్ణవ సాధనలు తరువాత గణింపదగినవి. ఈ మార్గమున సఖ్య దాస్యవాత్సల్య మధురభావములను వానిలో నేదయోయొక భావమున భగవానునితో సన్నిహిత సంబంధము నేర్పఱచుకొని సాధకుడు భగవానుని భజించును. ఒకదాని వెంబడినొకటిగా శ్రీరామకృష్ణుడు వీనినన్నిటిని సాధించెను. మఱియు (్భగవానుడు తన చెలికాడని భావించునది సఖ్యభావము, ప్రభువనుకొనునది దాస్యభావము, ముద్దుబిడ్డయనుకొనునది వాత్సల్యభావము, తన ప్రియభర్తయని తలచునది మధురభావము.)
ఈ భావములెవ్వరియందు రూపుదాల్చెనో అట్టి పురాణపురుషులతో సాధనకాలమున నాతడు తాదాత్మ్యము నొందువాడు- దాస్యభావమున దాను హనుమంతుడననియు మధురభావమున రాధననియు- ఈ విధముగా భావించి యత్యద్భుతమైన సాధనలనొనర్చెను. తాదాత్మ్యమును బొందునపుడాతడు సరిగా ఆయా పురాణ పురుషులవలెనే సంచరించుచు, అచ్చముగా అట్టిమనోభావములనే- అట్టి దివ్యానుభవములనే- పొందువాడు. సఖ్యభావమును మధురభావమును సాధించునపు డాత డనేక మాసముల పర్యంతము స్ర్తిల నడుమ స్ర్తివలెనే మెలగెను; ఆ సమయమున ఆ స్ర్తిలకుగాని, యాతనికి గాని అందు ప్రకృతి వైరుధ్య మేమియు, వైచిత్య్రమేమియు, పొడకట్టనే లేదు. అతని మనోభావములును ప్రవర్తనమును అంతటి సహజములై, వినిర్మలములై యొప్పెను. అట్టి యపూర్వపరిణామమును మనశ్శరీరములందు బడయగల్గుట కాతని విశుద్ధసంకల్ప ప్రభావమే కారణము.
పిమ్మట (1864-వ సంవత్సరమున) అద్వైత వేదాంతియు యతివరేణ్యుడునగు శ్రీతోతాపురితో శ్రీరామకృష్ణునకు సమావేశము లభించెను. దైవనిమంత్రితుడై తోతాపురి శ్రీరామకృష్ణుని గలిసికొని యాతనికి సన్న్యాసదీక్షనొసగెను. ఇంతవఱకును శ్రీరామకృష్ణుడు సగుణస్వరూపమున దైవమునుపాసించుచుండెను.
తోతాపురి శిక్షణమున నాతకు నిర్గుణ నిరాకార బ్రహ్మధ్యానమున నుత్తీర్ణుడై అఖండ బ్రహ్మ సాక్షాత్కారమును బడసెను. బ్రహ్మానుభవవాఙ్మయమున దుదిమాటను సమస్త సాధనలకును పరమావధియనగు నిర్వికల్ప సమాధి శ్రీరామకృష్ణునకు మూడు దినములలో కరతలామలయమయ్యెను. అనుకూల పరిస్థితులు లభించునెడ దోరకాయ ముగ్గుట కెంతకాలము కావలయును? ఎచ్చటనైనను మూడు దినములకంటె నెక్కువ నిలువని పరివ్రాజకోత్తముడగు తోతాపురి శ్రీరామకృష్ణుని యఖండ ప్రతిభచే నాకృష్ణుడై యించుమించుగానొక సంవత్సరమాతని సాంగత్యమున గడపెను. శ్రీరామకృష్ణుడద్భుతరీతిని గురువునకు గురువై సగుణ బ్రహ్మభావమును- జగన్మాతృభావమును- తోతాపురి కలవరించెను. ఏమి నిరుపమాన విజయం! 1866-వ సంవత్సరమున శ్రీరామకృష్ణుడు ‘సూఫీ’ సంప్రదాయమునకు జెందిన గోవిందుడను పకీరునొద్ద మహమ్మదీయ మతసాధనల నభ్యసించి హిందూ మత సాధనల మూలమున దానుబొందిన మహాఫలమే తన్మార్గమునను బడయనగునని స్వానుభవముచే గనుకొనెను.
ఇంకా ఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

నైమిశారణ్యం - పవిత్రత

$
0
0

పూర్వం ఋషులందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. వారంతా బ్రహ్మదేవునికి నమస్కరించి మేము ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశాన్ని ఇవ్వమని అడిగారు. వారి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషించారు. ‘నేను నా రథ చక్రాన్ని విసురుతాను. అది వెళ్లి ఆగిన చోట పవిత్రమైన ప్రదేశంగా భావించండి. అక్కడ మీరు మీమీ తపస్సులు, రచనలు సాగించండి. ఆ ప్రదేశం నేమి నిలిచిన చోటుకనుక నైమిశారణ్యంగా ప్రఖ్యాతి వహిస్తుంది. ’అని చెప్పాడు.
దాంతో ఋషులంతా ఆనాటినుంచి నైమిశారణ్యంలోనే తపస్సు సాగించారు. వ్యాసమహర్షి శ్రీభాగవతాన్ని రచించారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న గోమతీ నదీతీరంలో వ్యాసుల వారు వేదాలు విభజన చేశారు. శీరామచంద్రుడు కూడా ఈ నైమిశారణ్యంలో అశ్వమేధ యాగం చేశాడట. పాండవులు అరణ్యవాసకాలం ఇక్కడే గడిపారట. ఈ ప్రదేశాన్ని దర్శించటం, ఇక్కడ పురాణ కాలక్షేపం చేయడం, గోమతీ తీర్థంలో స్నానమాచరించటం లాంటివి పుణ్యప్రదాలు అని పెద్దలు చెబుతున్నారు.

కౌశికోపాఖ్యానము-75

$
0
0

‘‘ఓ మహాత్మా! నాకు ఇవి సిద్ధించడానికి కారణం నీవే. స్వయంగా లోపలికి వచ్చి చూడు’’ అని అతను కౌశికుని ఇంటిలోపలికి తీసుకొని వెళ్లాడు. లోపల ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంది. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు శుభ్రమైన వస్త్రాలు ధరించి భోజనం చేసి లోపల ఒక అరుగుమీద కూర్చుని ఉన్నారు. ఒకవైపు పడుకోవడానికి మంచాలు ఉన్నాయి. ధర్మవ్యాధుడు వారి పాదాలు స్పృశించి నమస్కరించాడు. వారు అతన్ని దీవించి ఇలా అన్నారు. ‘‘్ధర్మం నిన్ను సదా రక్షించుగాక! నీచే సేవించబడుతూ మేము సంతోషంగా ఉన్నాము. ఉత్తమ పుత్రునిగా నీవు మాపట్ల అన్ని విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నావు. నీ మనస్సు పవిత్రంగా ఉంది. నీవు శమదమాదులు కలిగి ఉన్నావు. నీవు మా పట్ల చూపే గౌరవం, నీ ఇంద్రియ నిగ్రహం మాకు మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది’’. తర్వాత వ్యాధుడు కౌశికుని వారికి పరిచయం చేయగా వారు అతన్ని తగినరీతిలో సత్కరించి గౌరవించారు.
తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు - ‘‘మహాత్మా! నాకు మా తల్లిదండ్రులే ముఖ్యమైన దేవతలు. దేవతలకు చేసే పూజలను నేను వీరికే చేస్తాను. వీరికే పూలు, పండ్లు, రత్నాలు ఇచ్చి సంతోషపెడ్తాను. విద్వాంసులు చెప్పే అగ్నులు, యజ్ఞాలు అన్నీ నాకు వీరే. నా భార్యాపుత్రులతో నిత్యము వీరినే సేవిస్తాను. నేనే స్వయంగా వీరికి స్నానం చేయిస్తాను. స్వయంగా ఆహారం వండి వడ్డిస్తాను. వీరికి ఇష్టం లేని విషయాలు మాట్లాడను. ఓ బ్రాహ్మణోత్తమా! ఆత్మోన్నతిని కోరే వ్యక్తికి తండ్రి తల్లి అగ్ని పరమాత్మ గురువు ఈ ఐదుగురే గురువులు. వీరిని సేవిస్తే యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఇదే సనాతన ధర్మం. నా తల్లిదండ్రుల సేవ వలన కలిగిన ప్రభావం చూడు. నాకు దివ్యదృష్టి కలిగింది. పతిసేవ చేయడం వలన ఆ ఇల్లాలు నా గురించి నీకు చెప్పింది.’’
వ్యాధుడు ఇంకా ఇలా అన్నాడు ‘‘ఓ బ్రాహ్మణోత్తమా! నాకు నీపై అనుగ్రహం కలుగుట చేతనే ఇదంతా నీకు చెప్పాను. నీవు నీ విద్య కోసం తల్లిదండ్రులను విడిచి వచ్చావు. నీవు చేసినది ఉచితం కాదు. నీ తల్లిదండ్రుల సేవయే నీ ధర్మం. పితృసేవకు దూరం అవడం చేత నీ ధర్మానుష్ఠానం అంతా వ్యర్థము. ఇప్పుడే బయలుదేరి వెళ్లి వాళ్ల సేవ చేయుట ప్రారంభించు. ఇంతకంటే గొప్ప ధర్మం ఇంకొకటి లేదు’’.
అతని బోధలు విన్న కౌశికుడు ఆనదంతో ఇలా అన్నాడు. ‘‘మహాత్మా! నా అదృష్టం వలన నీ సాంగత్యం లభించింది. ధర్మమార్గాన్ని చూపేవారు దుర్లభులు. నరకంలో పడబోతున్న నన్ను ధర్మమార్గం చూపించి ఉద్ధఱించావు. ఇకపై నీవు చెప్పిన విధంగా నడుచుకుంటాను. నీకు తెలియని ధర్మం లేదు. మరి నీకు ఈ శూద్రజన్మ ఏ కర్మఫలితమో నాకు తెలియాలి. దయచేసి వివరించు’.
ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ‘‘ద్విజోత్తమా! నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదాధ్య యనం చేశాను. ఆ జన్మలో ధనుర్వేద పారంగతుడైన రాజు నాకు మిత్రుడు అయ్యాడు. అతని సాంగత్యం వలన నేను ఆ ధనుర్విద్య నేర్చుకున్నాను. ఒకసారి అతనితో నేను కూడా వేటకు వెళ్లాను. అతను ఒక మహర్షి ఆశ్రమం దగ్గర ఎన్నో మృగాలను వేటాడాడు. నేను కూడా ఒక బాణం వదిలాను. అది ఒక మునికి తగిలింది. అప్పుడు అతను నేలపై బడి ‘‘నేను ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. మరి ఈ పాపకార్యం ఎవరిది?’’ అని శోకించాడు. నేను అది ఒక కౄరమృగంగా భావించి అక్కడికి వెళ్లి నా బాణం చేత దెబ్బతిన్న మునిని చూశాను.
‘‘మహాత్మా! తెలియక తప్పు చేశాను. క్షమించుమని’’ ఆయన కాళ్ల మీద పడ్డాను. కాని ఆగ్రహంతో ఆ ముని ‘‘కౄరాత్మా! నీవు శూద్రజాతిలో పుట్టిన వ్యాధుడిగా జీవిస్తావు’’ అని శపించాడు. అప్పుడు నేను ‘‘మహాత్మా! తెలియక చేసిన ఈ తప్పుకు ఇంత శిక్ష వేయకు’’ అని ప్రార్థించాను. కాని ఋషి ‘‘తప్పుకు శిక్ష పడవలసిందే. నీవు శూద్రజాతిలోనే పుడ్తావు. కాని నీకు అన్ని ధర్మాలు తెలిసి ఉంటాయి. నీవు తల్లిదండ్రుల సేవాభాగ్యం వలన మహత్వాన్ని, సిద్ధిని పొందుతావు. చివరకు స్వర్గానికి వెళ్తావు. శాపఫలం పోయినతర్వాత మరల బ్రాహ్మణుడివి అవుతావు’’ అని పలికాడు. కనుక బ్రాహ్మణోత్తమా! ఆయన చెప్పినట్లు నేను స్వర్గానికి వెళ్తాను’’.
కౌశికుడు ఇలా అన్నాడు ‘‘మహాత్మా! నీవు తల్లిదండ్రుల సేవ వలన సాధించినది ఇతరులకు దుర్లభం. నా దృష్టిలో ఇంత జ్ఞానం కల నీవు బ్రాహ్మణుడివే. మానవుడు సదాచారం వల్లనే బ్రాహ్మణుడు అవుతాడు. కర్మదోషం వల్లనే వారికి దుర్గతి సంభవిస్తుంది’’.
ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు. ‘‘‘సత్యం తెలిసిన వారు తమ శరీరానికి కలిగిన వ్యాధులను మందులతోను, మానసిక వ్యాధులను, కష్టాలను ప్రజ్ఞ చేత తొలగించుకుంటారు. కాని చింతించరు. కాని మందబుద్ధులు సత్యానికి దూరంగా ఉంటారు. కనుక ప్రతీదానికి దుఃఖిస్తూ ఉంటారు. త్రిగుణాల వల్ల ఒకసారి సంయోగం ఇంకొకసారి వియోగాన్ని పొందుతారు. వీటిలో ఏదీ శోకకారణం కాదు. బాధపడినందువల్ల ప్రయోజనం లేదు. జ్ఞానతృప్తులు సుఖదుఃఖాలను వదిలి జ్ఞానంలో సంతోషంగా ఉంటారు. వారు ఆ మార్గంలోనే వెళ్ళి పరమాత్మ సాక్షాత్కారం పొందుతారు. ఏ విషయంలోను శోక విషాదాలు పొందకుండా పనిచేయాలి. అలా ప్రయత్నిస్తే దుఃఖం నుండి విముక్తి పొందుతారు. ప్రపంచంలో అన్ని పదార్థాలు అనిత్యం. ఒక పరమాత్మ మాత్రమే సత్యం’’.,
బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ‘‘నీవు శోక దుఃఖాతీతుడవు. నీవు జ్ఞానివి. నీవు ధర్మాలను చక్కగా ఆచరిస్తావు. జ్ఞానంతో తృప్తి పొందుతావు. కనుక నీ విషయంలో నీవు చేస్తున్న వృత్తి గురించి ఇక నేను చింతించను. ఈ విధంగా ఈ ఉపాఖ్యానంలో పతివ్రతా ధర్మాలయొక్క మాహాత్మ్యం ,ఇక నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను’’ ఇలా అని అతను వ్యాధుని పాదాలకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు అన్ని విధాలుగా సేవలు చేశాడు. వారు కూడా అతని సేవలకు ఎంతో ఆనందించారు. ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పిన తల్లిదండ్రుల సేవ యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వివరించాడు.

ఇంకావుంది...

Viewing all 69482 articles
Browse latest View live