Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నేడు కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

$
0
0

రాయ్‌పూర్, డిసెంబర్ 16: గత మూడు రోజులుగా చత్తీస్‌గఢ్ విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నేత భూపేష్ బాగేల్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలువురు రాష్ట్ర నేతలు, ఎఐసీసీ నేతలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గే రాయ్‌పూర్‌కువెళ్లి పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని సేకరించి పార్టీ హైకమాండ్‌కు నివేదించారు. 17వ తేదీ సోమవారం రాయ్‌పూర్‌లో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా భూపేష్ బాగేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వివరాలను ఖర్గే విలేఖర్లకు చెప్పారు. ప్రస్తుతానికి బాగేల్ ఒకరే ప్రమాణస్వీకారం చేస్తారు.
57 ఏళ్ల ఓబీసీ నేత భూపేష్ పార్టీ విజయానికి విశేష కృషి చేశారు. ముఖ్యమంత్రి పదవికి టీఎస్ సింగ్ దేవ్, తమ్రధ్వజ్ సాహు, చరణ్‌దాస్ మహంత్ పోటీపడ్డారు. రాష్ట్రంలో సీఎం పోస్టుకు పోటీపడుతున్న నలుగురు నేతలు గట్టివారని, సమర్థులని, ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలో సంక్లిష్ట పరిస్థితి తలెత్తిందని ఖర్గే చెప్పారు. ఈ నలుగురి నేతలతో గత రెండు మూడు రోజులుగా రాహుల్ గాంధీ సంప్రదింపులు జరిపారు.
అనంతరం ఆదివారం రాయ్‌పూర్‌లో సీఎల్‌పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూపేష్‌ను ఎమ్మెల్యేలు సీఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందువల్ల అనేక సవాళ్లు తమ ముందున్నాయని ఖర్గే చెప్పారు. కాగా కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతతో వ్యవహరిస్తుందని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.


పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: కమల్

$
0
0

చెన్నై, డిసెంబర్ 16: రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామా లేక ఇతర పార్టీలతో పొత్తులుంటాయా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు కమల్ హసన్ ఆదివారం పేర్కొన్నారు. పార్టీని పటిష్టపరిచేందుకు కమల్ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తారా లేక ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా అని విలేఖరులు ప్రశ్నించగా, దీనిపై అప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలకు ఏది మేలు చేకూరుస్తుందో అలాంటి నిర్ణయమే తీసుకుంటానని కమల్ వెల్లడించారు. నవంబర్‌లో తుపాను వల్ల దెబ్బతిన్న గాజా ప్రాంతాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో కమల్ విలేఖరులతో మాట్లాడారు. అన్నా డీఎంకేకు చెందిన 18 మంది రెబెల్ ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించడంతోపాటు మరో రెండు స్థానాలు (ఎం కరుణానిధి - తిరువరూర్), (ఏకే బోస్ - తిరుపరన్‌కుండ్రమ్) ఖాళీ ఏర్పడ్డాయి. ఈ స్థానాలకు కూడా త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.

ఉగ్రవాదంపై ఉక్కు పాదం

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో అంతర్గత భద్రత మెరుగుపడిందని, ఉగ్రవాదం, తీవ్రవాదం కార్యకలాపాలు క్రమేపి తగ్గాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం ఇక్కడ విజయదివాస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వామపక్ష తీవ్రవాదం 90 జిల్లాల్లో ఉండేదన్నారు. ఎన్డీఏ సర్కార్ తీసుకున్న కఠిన చర్యల వల్ల 12 జిల్లాలకు తగ్గిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటుదారులు, మిలిటెన్సీ 80 శాతం తగ్గిందన్నారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన చెప్పారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం పనిచేస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు త్యాగనిరతితో రాజీలేకుండా శత్రువుల చొరబాటును అరికడుతున్నారన్నారు. వారికి స్వేచ్ఛనిచ్చామన్నారు. యువతీ యువకుల్లో జాతీయవాదం పెంపొందించేందుకు మాజీ సైనికులు కృషి చేయాలన్నారు. బ్రిగేడర్ మహ్మద్ ఉస్మాన్, మేజర్ సోమనాథ్ శర్మ లాంటి వీర సైనికులు త్యాగనిరతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. దేశ భక్తి అంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ గుర్తుకు వస్తారన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను అక్కున చేర్చుకుంటామన్నారు. 1971లో మన సైనికులు చూపిన తెగువ వల్ల బంగ్లాదేశ్ అవతరించిందన్నారు. ప్రపంచ సైన్యాల్లో భారత్ సైన్యం మంచి నైపుణ్యం సాధించిందన్నారు. యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబ సభ్యులకు ఆయన సన్మానం చేశారు. అలాగే వెటరన్స్ ఇండియా అసోసియేషన్ న్యూస్ లెటర్‌ను విడుదల చేశారు.

చిత్రం..విజయ్‌దివాస్ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో
మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబ సభ్యుల్ని సన్మానిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

మళ్లీ వచ్చేది.. మోదీ ప్రభుత్వమే..!

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 16:వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆయన సారథ్యంలో దేశ వ్యాప్తంగా కమలం వికసించడం ఖాయమని ఆదివారం ఇక్కడ జరిగిన మహిళా హూంకార్ ర్యాలీలో ఉద్ఘాటించారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేర్చే బృహత్తర బాధ్యతను చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలకు ఈ సందేశాన్ని చాలా బలంగా అందించాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళల మద్దతును కూడా విశేషంగా చూరగొనే ప్రయత్నం చేయాలని ఢిల్లీ బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఇరానీ పార్టీ శ్రేణుల్ని కోరారు.
మోదీ సారథ్యంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తామని, అభివృద్ధి,మహిళా సాధికారత విషయంలో మోదీ సాధించిన విజయాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం దేశ సమగ్ర వికాసానికి, అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేసిందని తెలిపారు. ఆ ప్రభుత్వానే్న 2019 సాధారణ ఎన్నికల్లోనూ మళ్లీ ఎన్నుకునేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య ఘటన జరిగి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ హూంకార్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సహా పలువురు పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తివారీ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆప్ ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయిందని, గతంలో చెప్పినట్టుగా బస్సుల్లో మహిళల రక్షణ కోసం మార్షల్‌ను నియమించడంలోనూ విఫలమైందన్నారు.

చిత్రం..ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన హుంకర్ ర్యాలీలో
కేంద్రమంత్రి సృతిఇరానీ, బీజేపీ మహిళా ప్రతినిధులు నినాదాలు చేస్తున్న దృశ్యం

మూడు రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి రండి

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లో జరిగే ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అశోక్ గెహ్లాట్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు లేఖ రాశారు. మతతత్వశక్తులపై రాజీలేకుండా పోరాడేందుకు చేతలు కలుపుతామని గెహ్లాట్ ఆ లేఖలో తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని చంద్రబాబును ఫోన్‌లో వ్యక్తిగతంగా కోరారు. ఈ ఆహ్వానాన్ని టీడీపీ అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బాగోల్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వానం అందింది.

ప్రధాని అభ్యర్థి పేరు ముందే ఎందుకు?

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాల కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరును డీఎంకే నేత స్టాలిన్ ఆదివారం చెన్నైలో ప్రతిపాదించిన నేపథ్యంలో అనేక పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమి తరఫున ఎవరినీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి తేకూడదన్నది ఈ పార్టీల అభిప్రాయంగా కన్పిస్తోంది. బీజేపీని ఓడించగలిగే శక్తి రాహుల్‌గాంధీకే ఉందని, ఆయననే బీజేపీయేతర కూటమి తరఫున ప్రధాన అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించిన నేపథ్యంలో విపక్ష కూటమి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా సమాజ్‌వాద్ పార్టీ, బీఎస్పీ, టిఎంసి, ఎన్సీపీలు స్టాలిన్ ప్రతిపాదన పట్ల విముఖతను వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించాలే తప్ప ఇప్పడే అలాంటి ప్రతిపాదన ఏమిటని ఈ పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రసిద్ధ ఫోరెన్సిక్ శాస్తవ్రేత్త డాక్టర్ గాంధీకి పిన్నమనేని విశిష్ట పురస్కార ప్రదానం

$
0
0

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 16: పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 28వ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని ప్రసిద్ధ ఫోరెన్సిక్ శాస్తవ్రేత్త డాక్టర్ గాంధీ పూర్ణచంద్ర కాజాకు ప్రదానం చేశారు. రూ. 5లక్షల నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ రంగస్థల నటులు, జానపద కళా నిపుణులు కర్నాటి లక్ష్మీనరసయ్యకు రెండో పురస్కారంగా జ్ఞాపిక, రూ. లక్ష నగదు బహుమతిని డా. రామకృష్ణప్రసాద్, డా. చదలవాడ సుధ, డా. నాగేశ్వరరావు, డా. గొల్లపల్లి నాగేశ్వరరావు అందజేశారు. ఈసందర్భంగా డా. గాంధీ మాట్లాడుతూ ప్రజలను ప్రేమించకపోతే ప్రజాసేవ చేయలేమని అన్నారు. 15గుణాలు కలిగి నిత్యం దేశం కోసం, ప్రజల కోసం పోరాడిన నేత అబ్దుల్ కలాం అని గుర్తుచేశారు. రంగస్థల నటుడు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ కళలు జాతి వికాసానికి దోహదపడతాయని, జానపద కళలు ప్రజల్ని చైతన్యపరిచే సాధనాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చక్రవర్తుల రాఘవాచారి, డాక్టర్ ధూళిపాళ్ల రామకృష్ణ, టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

చిత్రం..డా. గాంధీ పూర్ణచంద్ర కాజాకు పురస్కారం ప్రదానం చేస్తున్న ప్రముఖులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలకృష్ణ

$
0
0

విజయవాడ, డిసెంబర్ 16: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థిగా ఆపస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) తరపున జనె్నల బాలకృష్ణను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్‌కుమార్, పీ రవిప్రసాద్ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ సన్నాహక సమావేశంలో మూడు జిల్లాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మూడు జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారని వారు తెలిపారు.


ఆర్థిక సంస్కరణలతో ఆశించిన ఫలితాలు

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణ విధానాలు అనుకున్న ఫలితాలు ఇస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా వస్తు సేవలణ పన్ను (జీఎస్టీ), నల్లధన నిరోధంపై చట్టం, దివాలాకోడ్ వంటివి ఉద్దేశిత ఫలితాలను అందిస్తున్నాయని, వీటన్నింటి ఉమ్మడి ఫలితంగా భారత్ ఉజ్వల భవితం సంతరించుకోబోతున్నదని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశవ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో ప్రజలు బ్యాంకింగ్ పరిధిలోకి రావడం వల్ల పన్ను రేటు కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆదివారం నాడిక్కడ నీతిఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పరివర్తన భారత అవార్డులు-2018 ప్రదాన కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ఏ లక్ష్యంతో అయితే 500, వెయ్యి రూపాయల నోట్లను మోదీ రద్దు చేశారో అది నెరవేరిందని, అంతకుముందు వరకు గోప్యంగా ఉన్న నల్లధనం అంతా బయటకు వచ్చిందని తెలిపారు. మొత్తం నగదును బ్యాంకింగ్ రంగంలోకి తీసుకురావడమే పెద్దనోట్ల రద్దు ఉద్దేశమని, దాదాపుగా ఆ లక్ష్యం నెరవేరినట్టేనని చెప్పడానికి గణనీయ పరిణామంలో నల్లధనం వెనక్కి రావడమే నిదర్శనమన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా భారత్‌లో అమలవుతున్న పన్నుల సంస్కరణల విధానాల పట్ల విదేశీ ఇనె్వస్టర్లు కూడా ఎంతగానో ఆకర్షితురవుతున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పెరగడం ఆర్థిక సంస్కరణల ఫలితమేనని ఆయన చెప్పారు. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత ఎంతమొత్తం బ్యాంకింగ్ రంగంలోకి తిరిగి వచ్చింది, ఎంతమొత్తం ఇంకా గోప్యంగా ఉందన్నది ఆర్‌బిఐ, ఆదాయపు పన్ను విభాగం వెల్లడించాల్సిన అంశాలని ఆయన అన్నారు. భారత అభివృద్ధికి సంబంధించి సరికొత్త పథాన్ని నిర్దేశించే సమాన అవకాశాలు దేశ యువతీయువకులకు లభిస్తున్నాయని, అలాంటి నవభారతం అతిత్వరలోనే ఆవిష్కృతం కానుందని ఆయన తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంకుర పరిశ్రమలు భారత్‌లోనే ఆవిష్కృతమవుతున్నాయని పేర్కొన్న ఆయన ఈ విషయంలో మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తే పురుషులకంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారని అన్నారు. భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం 17 శాతం ఉంటే చైనాలో ఇది 41 శాతం ఉందని తెలిపారు. ఇందుకు కారణం అనేక రంగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు పురుషుల కంటే కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడమేనని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని మహిళలందరికీ విద్యావిధానాన్ని అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించిన ఆయన చట్టసభల్లో వీరికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును గట్టెక్కించాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు చేయూతను ఇవ్వాలని వెంకయ్యనాయుడు కోరారు.
చిత్రం..నీతిఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పరివర్తన
భారత అవార్డులు-2018 ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మావి పారదర్శక ఒప్పందాలు

$
0
0

రాయ్‌బరేలి (యూపీ): తమ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టే రక్షణ ఒప్పందాలపై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలతో నోరుపారేసుకుంటందని, తమ పార్టీలో ఖత్రోచి అంకుల్స్, క్రిస్టియన్ మిచెల్స్ మామలు లేకపోయినా అర్థం లేని నిరసనలు చేపడుతూ అసత్యాలు ప్రచారం చేస్తోందని యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పైగా ఆ పార్టీ న్యాయవ్యవస్థపై లేనిపోని అనుమానాలు సృష్టిస్తోందన్నారు. రఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం ప్రధాని మోదీ బహిరంగంగా ఈ విషయంపై మాట్లాడటం ఇదే తొలిసారి. అంతేకాక ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన అనంతరం బీజేపీ సోనియాగాంధీ నియోజకవర్గంలో తొలిసారిగా చేపట్టిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భారత రక్షణ దళాలు పటిష్టంగా ఉండటం కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. దేశానికి ముఖ్యంగా రెండు అవసరాలున్నాయని, రక్షణ దళాలను సాధ్యమైనంత వరకు పటిష్టంగా తయారు చేయడం, రెండు ఎట్టి పరిస్థితుల్లో ఆ దళాల ద్వారా భారత్ బలహీనం కాకుండా చూడటం అని మోదీ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ వైఖరి చూస్తే రక్షణ దళాలు పటిష్టంగా తయారు కావడం ఇష్టం లేనట్టు అన్పిస్తోందని, ప్రజలు కూడా ఈ విషయాన్ని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రామచరిత మానస్‌లోని కొన్ని వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా ఉదహరించారు. దాని ప్రకారం ‘సమాజంలో కొందరు వింత మనుషులుంటారు.. వారు నిత్యం అబద్ధాలే వింటారు. ఇతరులకు అబద్ధాలే ప్రచారం చేస్తారు’ అది కాంగ్రెస్‌కు అన్వయిస్తుందని, వారి ఉద్దేశంలో కూడా రక్షణ శాఖ మంత్రి, రక్షణ శాఖ, భారత వైమానిక దళం అధికారులు, ఫ్రాన్స్ ప్రభుత్వం వీరు చెప్పేవన్నీ అబద్ధాలేనని వారు పేర్కొన్నారని, ఇప్పుడు వారికి సుప్రీం కోర్టు కూడా అసత్యంగా కన్పిస్తోందని మోదీ విమర్శించారు.
రక్షణ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడటం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, ఖత్రోచి మామతో వారికే సంబంధం ఉందని మోదీ విమర్శించారు. 1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బోఫోర్సు ఒప్పందంలో ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఖత్రోచి మధ్యవర్తిగా వ్యవహరించారని, ఈ సందర్భంగా కోట్లరూపాయలు చేతులు మారిన విషయం తెలిసిందేనని అన్నారు. అలాగే అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కేసులో కూడా అనేక అక్రమాలు జరగడంతో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్‌ను భారత్ రప్పించామని ప్రధాని తెలిపారు.
ఈ విషయంలో మిచెల్ తరఫున వాదించడానికి కాంగ్రెస్‌కు చెందిన లాయర్ వెళ్లడం అందరూ చూశారన్నారు. అలాంటి కాంగ్రెస్ పదేపదే తమ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే మేము చేసిన రక్షణ ఒప్పందాల్లో ఖత్రోచి మామ కాని, క్రిస్టియన్ మిచెల్ కాని లేరు.. అందుకే ఆ పార్టీ పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఆ పార్టీ న్యాయవ్యవస్థను సైతం వదలడం లేదని, దానిపై కూడా సంశయాలను లేవనెత్తుతోందని మోదీ ఆరోపించారు. కార్గిల్ సంఘటన తర్వాత అధునాతన విమానాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించిందని చెప్పారు. పది సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం వైమానిక దళం పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనికి కారణం ఏమిటి? ఎవరి వత్తిడి ఉందని ఆయన ప్రశ్నించారు.
భారత జవాన్లకు కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చడంలో సైతం కాంగ్రెస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలని అప్పటి యూపీఏ-2 ప్రభుత్వాన్ని ఆర్మీ కోరగా ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో 50వేల జాకెట్లను కొనుగోలు చేశామని ఆయన వివరించారు. అలాగే ఈ ఏడాది మరో 1.86 జాకెట్ల కొనుగోలుకు ఆర్డన్ ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు.

చిత్రం..ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించిన అనంతరం హారతి ఇస్తున్న ప్రధాని మోదీ,
రాష్టగ్రవర్నర్ రామ్‌నాయక్, ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ

$
0
0

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ భవన్‌లో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఘనంగా జరిగింది. బసవతారకం ఆసుపత్రి నుంచి ఆటపాటలు, నృత్యాల మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అనంతరం తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌కు హోం మంత్రి మహమ్మూద్ అలీ, మాజీ మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం

$
0
0

జైపూర్: రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

విశ్వసుందరిగా ఫిలిప్పెన్స్ భామ

$
0
0

బ్యాంకాక్: 2018 విశ్వసుందరి పోటీల్లో ఫిలిప్పెన్స్ భామ క్యాట్రియోనా ఎలిసా గ్రే ఎన్నికయ్యారు. ఈ పోటీల్లో ఫస్ట్న్న్రరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తమారిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనుజువెలాకు చెందిన స్టీఫెనీ గ్యుటెరాజ్ ఎంపికయ్యారు. ఎరుపురంగు గౌనులో మెరిసిపోయిన క్యాట్రియోనా న్యాయనిర్ణేతలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మనీలాలోని మురికివాడల ప్రదేశానికి వెళ్లి సేవ చేస్తానని, అక్కడివారి ముఖాల్లో అందం, ఆనందం అదేనని అన్నారు.

కాకినాడలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

$
0
0

విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా కాకినాడలో విద్యుత్ సరఫరా పూర్తి గా నిలిచిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కాకినాడకు200 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమైంది.

కోస్తా అంతటా అప్రమత్తం

$
0
0

అమరావతి: పెథాయ్ తుపాను కాకినాడకు చేరువకావటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏ క్షణానైనా తీరందాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటకు 19 కి.మీ వేగంతో కదులుతున్న పెథాయ్ తుని-యానం మధ్య తీరందాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంథ్ర జిల్లాల్లో 80-90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


విమానాలు, రైళ్ల రాకపోకలు రద్దు

$
0
0

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారటంతో విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన విమానాలను, రైళ్లను అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్లను కూడా రద్దు చేయటంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

కారు బోల్తాపడి ఇద్దరు ఏపీ సచివాలయ ఉద్యోగులు మృతి

$
0
0

కోదాడ: దొరకొంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో సచివాలయ ఉద్యోగులు హరికృష్ణ, పీఎస్ భాస్కర్ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మీ, పాపయ్యను నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు.

సిక్కుల ఊచకోతలో సజ్జన్ కు జీవిత ఖైదు

$
0
0

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చింది ఢిల్లీ హైకోర్టు. ఆయనకు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టులో సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా తేల్చగా.. ఆ తీర్పును హైకోర్టు తిరగరాసింది. ఈ నెల 31లోపు కోర్టులో లొంగిపోవాల్సిందిగా సజ్జన్‌కుమార్‌ను ఆదేశించింది. 1984, నవంబర్ 1న ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని రాజ్‌నగర్ ప్రాంతంలో ఐదుగురు సిక్కులను ఊచకోత కోసిన కేసులో సజ్జన్‌కు శిక్ష పడింది.

తీరం తాకిన పెథాయ్‌

$
0
0

అమరావతి : పెథాయ్‌ తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్

$
0
0

తిరుపతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామం అనంతరం గవర్నర్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు గవర్నర్ నరసింహన్ దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజు గవర్నర్ దంపతులకు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టువస్ట్రాంతో సత్కరించారు.అనంతరం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను గవర్నర్ పరిశీలించారు. పద్మావతి విచారణ కార్యాలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు నడిచి వెళ్లి పర్వదిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో అరా తీశారు.

Viewing all 69482 articles
Browse latest View live