Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1968 | 1969 | (Page 1970) | 1971 | 1972 | .... | 2069 | newer

  0 0

  ఒకవేళ నాతడు తన వాగ్దానమును మఱచినను తద్వ్యతిరిక్తముగా వర్తింపనాతని మనశ్శరీరములే నిరాకరించి విషయమును జ్ఞప్తికిదెచ్చెడివి. జగజ్జననికి సర్వము తానర్పించినను సత్యమును మాత్రమర్పింప జాలనైతివనియు, సత్యము నర్పించినచో తనయాత్మార్పణమే అసత్యమైపోవుననియు నాతడు వచించెను. నిజముగా ఆతని గంభీర వ్యక్తిత్వమును బరిశీలించినచో అందు సుగుణరత్న రాసులనంతముగా గాన్పించును.
  జగద్గురువు
  కల్యాణ గుణములకు పెన్నిధానమగు శ్రీరామకృష్ణుని జీవితము లోకమునకెట్టి మేల్కొనగూర్చెనో మనమిక గమనింపవలసియున్నది. శ్రీరామకృష్ణుని జగద్గురుత్వ మీవఱకే ప్రారంభమైనను 1875-వ సంవత్సరమున నాతడు బ్రాహ్మ సమాజ మహానాయకుడగు కేశవ చంద్రసేనుని గలిసికొనిన నానుండియు నాతనియుపదేశామృతము లోకమున నవిచ్ఛిన్నముగా బ్రసరింపసాగెను.
  అతని యసమానప్రతిభను - అద్వితీయాన్నత్యమును- గూర్చి మహావక్తయు సుప్రసిద్ధతత్త్వవేత్తయు నగు కేశవచంద్రసేనుడు తన మహోపన్యాసములచే, రచనములచే, లోకమునకు జాటనారంభించెను. అంతట కలకత్తాపౌరులు, ముఖ్యముగా విద్యాధికులు, ఆబాలవృద్ధము తీర్థ ప్రజవలె శ్రీరామకృష్ణ సందర్శనార్థమై రాసాగిరి.
  ప్రతాపచంద్ర మజుందారు, శివనాథశాస్ర్తీ, విజయ కృష్ణగోస్వామి, దేవేంద్రనాథ ఠాకూరు, ఈశ్వర చంద్రవిద్యాసాగరుడు, బంకిమ్‌చంద్ర చట్టోపాధ్యాయుడు, మైకేల్ మధుసూదనదత్తు, అశ్వినికుమారదత్తు, గిరిశ చంద్రఘోషు మున్నగు నాటి సుప్రసిద్ధ వ్యక్తులనేకులు శ్రీరామకృష్ణుని సందర్శించి, యాతని యెడ నఖండ పూజ్యభావమును వహించి, లోకమునకు బ్రకటింపసాగిరి.
  ఇటులాతని సందర్శించిన ముముక్షువులలోననేకులు క్రమముగా నొకభక్త బృందమై వెలసిరి. కాలాంతరమున వీరే శ్రీరామకృష్ణుని సందేశమును దేశదేశాంతరములలో వ్యాప్తమొనర్చిన ధన్యాత్ములు. సంసారులైయున్న పెద్దలు, సంసార బంధమునింకను బైవైచుకొనని యువకులు- విద్యార్థులు- ఇటులీబృందమున నిరు తెగల వారుండిరి.
  ఇందుగొందఱు బాలురు. ఈ సమయమున నరేంద్రనాథ దత్తు అనబఱగిన శ్రీవివేకానందస్వామి నాయకత్వమున వీరలే కాలాంతరమున శ్రీరామకృష్ణాశ్రమ సన్న్యాసులై గురుసందేశ ధర్మజ్యోతిని బ్రజ్వలింప జేయసాగిన యతీంద్రులు. నరేంద్రనాథుడు ఈ బాల శిష్య బృందమున శ్రీరామకృష్ణునకత్యంత ప్రీతిపాత్రుడై, అఖండానుగ్రహపాత్రుడై కాలక్రమమున వివేకానందుడై గురుసందేశమును ప్రాక్పశ్చిమ ఖండములందంటను వ్యాప్తియొనర్చిన మహనీయుడు. తన యఖండ సేవలచే నవీన భారతదేశమున ఈ యతీశ్వరుడు నూతనోత్తేజమును నూతన చైతన్యమును బ్రభవింపజేసి దేశభక్తాగ్రగణ్యుడై సిలసిల్లెను.
  శ్రీరామకృష్ణుడు తన జీవిత శేషమును ఈ భక్తబృందమునకు బోధించుటకై- వారల జీవనవిధానమును మహోన్నతాదర్శదీప్తి మొనరించుటకై- వినియోగింపసాగెను. శిష్యుల కాతడాప్తబంధువు, ప్రాణమిత్రుడు. తాను గురుడనని యాతడు కలనైనను దలచి యెఱుగడు. జగజ్జనని చేతిలో తాను కేవలము ఉపకరణమనని యాతడు భావించెను. ఇట్టి సంపూర్ణాత్మార్పణము వలననే ఆచార్యశక్తి యాతనియందఖండముగా ప్రకాశితము కాసాగెను. ఆతని సాన్నిధ్యమునుబొందిన సర్వము పవిత్రమై, మహనీయమై వఱలెను. పరుస వేదితాకున నినుము బంగారమగునట్లు పతితులాతని సంసర్గ ప్రభావమున పావనులై యొప్పిరి.
  ఇంకా ఉంది
  శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి


  0 0

  ఒక జీవితకాలంలో మీరు దీనిగురించి తెలుసుకోవాలనుకుంటే అది చాలా కష్టమైన పని. కాని ప్రజలు తమ శరీరంలో ఎంతలోతుగా చిక్కుకుపోయి ఉన్నారంటే వాళలు శరీరాన్ని సాధనంగా చూడలేనంతగా. శరీరంతో వారి అనుబంధం, గుర్తింపు ఎంత లోతుగా ఉన్నాయంటే వాళలు దీన్ని ‘నేను’ గానే చూడడం కొనసాగి స్తున్నారు. ఈ శరీరాన్ని మీరు ‘నేను’గా చూసిన క్షణంలోనే దానికి బోలెడంత భావోద్వేగం జోడింపబడుతుంది. ఇక మనం దాన్ని సాధనంగా ఉపయోగించలేం.
  యోగాలో భూత శుద్ధి ప్రక్రియ అంతా ఇదే - పంచభూతాలనుండి విముక్తం కావడమే. మీరు ప్రభావవం తంగా మీకూ, పంచభూతాలకూ మధ్య దూరాన్ని సృష్టించగలిగితే, అప్పుడు మీకూ, మీ శరీరానికీ మధ్య స్పష్టమైన దూరం ఉంటుంది.
  ఒకసారి మీకూ, మీ శరీరానికీ మధ్య మీరు దూరాన్ని సృష్టించుకుంటే మీకు ఎటువంటి యంత్రం లభించిందో తెలుసుకున్న ఆనందం కలుగుతుంది. దానిలో బానిసత్వానికీ, స్వేచ్ఛకూ కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. దీన్ని మీరు దైవంగా మలచుకోగలరు - మీ శరీరం దివ్యమయ్యే విధంగా మీ శక్తి వ్యవస్థను మలచుకోగలరు. లేదా ఒక శవం లాగా ఉండిపోగలరు. అంటే, మీరు మీ శరీరాన్నీ ఒక శవంగానైనా మార్చుకోగలరు లేదా శివంగానైనా మార్చుకోగలరు. శవం అంటే మృతకళేబరం, శివం అంటే పరమొన్నతమైనది. దాన్ని ఏం చేయగలరో మీమీదే ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి ఈ విధంగా పనిచేయగలడని మీరు ఊహించలేని విధంగా మీ శరీరం పనిచేస్తుంది.
  ఈ రోజుల్లో, ముఖ్యంగా నగరాల్లో ఉన్నవారికి, దాదాపు 95% మందికి ఆరోజు చంద్రుడి దశ ఏమిటో తెలియదు. మీరు వాళ్లను తిధి ఏమిటని అడిగితే, వాళలు గూగుల్‌లో చూస్తారు తప్ప ఆకాశం వైపు కాదు. మీ శరీరం మీద, మానసిక నిర్మాణం మీద చంద్రుడి దశల ప్రభావం విస్తృతమయినది.
  చంద్రుడి దశలకు మొత్తం మహా సముద్రానే్న పైకి లాగగల శక్తి ఉంది. కానీ మీ మీద మాత్రం ఏమి ప్రభావం లేదని మీరెందు కనుకుంటు న్నారు? ఎందుకంటే మీరు జ్ఞానాన్ని పోగుచేసుకునే సమాజంలా తయ్యారయ్యారు, అంతే తప్ప అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని సంపాదించడం లేదు. ప్రతిదానికోసం మనం ఏదో పుస్తకం చదవాలి. మెల్లమెల్లగా మనం నిజమైన జీవితాన్ని గడపడం వదిలి, కూపస్థ మండుకాలుగా మారుతున్నాం. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరెన్నో జరుగుతాయి కూడా. ప్రస్తుతానికి ఈ వైఖరిని మార్చగల స్థితి లోనే మనం ఉన్నాం. పరిస్థితి మరింత అధోగతిపాలైతే, సరిదిద్దడం అంత తేలిక కాదు.
  సౌరమండల వ్యవస్థ - కుమ్మరి చక్రం
  యోగాలో సౌరమండల వ్యవస్థను కుమ్మరి చక్రంగా భావిస్తాం. ఆ చక్రం తిరుగడం నుండే మనం ఉద్భవించాం. సౌర వ్యవస్థకూ, శరీరానికి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాం. అందుకే దానితో సమన్వయించడానికి అనేక అభ్యాసాలను నిర్మించడం జరిగింది. మన శరీరంలో 72,000 శక్తి వాహికలున్నాయి. అవి విశిష్టరీతిలో 114 చోట్ల కలుస్తాయి. రెండు భౌతిక శరీరానికి వెలుపల ఉంటాయి. నాలుగింటిలో మీరు మార్పుచేయగలిగిందేమీలేదు. అంటే మీరు వాస్తవంగా పరివర్తింప గలిగినవి 108 అన్నమాట.
  108 అనే సంఖ్యకు భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉంది. సూర్యుని గురించిన శాస్త్రం ‘సూర్యసిద్ధాంతం’ అని ఒక ప్రాచీన గ్రంథం ఉంది. భూమికీ, సూర్యుడికీ మధ్య దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు అని ఈ గ్రంథం చెప్తుంది. భూమికీ, చంద్రుడికీ మధ్య దూరం చంద్రుడి వ్యాసానికి 108 రెట్లు. మానవ వ్యవస్థ కూడా దీనితో సమన్వయంతో ఉంటుంది.
  ఇంకావుంది...


  0 0
 • 12/19/18--05:43: అనంతం-14
 • ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం-
  కలివికోడికి మనిషి పొడే గిట్టదు. తాకితే రెండురోజుల్లోనే ప్రాణాలు విడుస్తుంది. అంత అలర్జీ ఎందుకో?
  భారతీయులేనా, అమెరికావాళ్ళు అంటుకున్నా చనిపోతుందా? అన్నది పరిశోధనలో తేలాలి!
  మూడో రౌండు పూర్తయ్యింది! రాగ్యా గుర్తొచ్చాడు!
  ‘ఆపరేషన్’ పూర్తయ్యేదాకా తన వెంట రాగ్యా ఉండి తీరాలి...
  అడవిలో వాడు కొండంత అండ!
  వాడికి అడవి పుత్రుల్ని నమ్మించే మాటకారితనం వుంది. లౌక్యం వుంది. అవసరమైతే ఎవర్నైనా ఎదిరించగల గుండె ధైర్యం, జబ్బపుష్ఠి వుంది.
  ముల్లును ముల్లుతోనే తియ్యాలి.
  అడవి పుత్రుల్ని అడివి పుత్రుడితోటే ఎదుర్కోవాలి.
  వాడికి తండావాళ్ళ స్వభావం తెలుసు. అమాయకత్వంతో ఎలా మోసపోతారో తెలుసు. ఎలా బుట్టలోవెయ్యాలో తెలుసు. వాళ్ళ మూఢ విశ్వాసాలు ఆచారాలు కట్టుబాట్లూ తెలుసు.
  తండాలు ఖాళీచేయించి, అడవి భూముల్ని స్వాధీనం చేసుకొని బహుళ జాతి కంపెనీలకు అప్పగించాలంటే రాగ్యా సహకారం కావాలి!
  పైగా,
  వ్యసనాలు మరిగి రాగ్యా బాగా రాటుతేలాడు. నాగరికుల స్నేహంకోసం తహతహలాడుతూ, వాళ్ళతో తిరిగితే తనూ గొప్పవాడై పోతానన్న భ్రమతో కర్చుక్కూడా వెనుకాడటం లేదు.
  ఈమధ్య నాలుగు ఇంగ్లీషుముక్కలు కూడా నేర్చాడు. సినిమాలు చూస్తున్నాడు.
  పట్నం కుర్రాళ్ళని వెంటపెట్టుకొని బార్లకువెళ్తూ, బిల్లులు తనే చెల్లిస్తూ స్వంత లాభం తగలేస్తున్నాడు.
  అలాంటివాడు, అప్పనంగా డబ్బు వేళకింత మందూ అనువైన భోజనం దొరికితే చెప్పిందెందుకు చెయ్యడూ!
  ‘‘మంచింగ్ సార్’’ అన్నాడెవ్వరో సేవకుడొచ్చి.
  ‘‘వ్వాట్ మంచింగ్?’’ గరుడాచలం అడిగాడు.
  ‘జాతీయ పక్షి’.
  ‘వాడ్డూయూ మీన్?’’
  ‘‘నెమలి మాంసం!’’
  ‘‘అది తెలుసు...’’
  ‘‘్ఫరిన్ విస్కీతో ఇండియన్ నెమలి మాంసం తింటే స్వర్గం కనిపిస్తుంది.’’
  ‘‘చూపించు’’అన్నాడు గరుడాచలం.
  సేవకుడు బైటికి వెళ్ళాడు. గుడారం నిశ్శబ్దంగా వుంది.
  * * *
  దూరంగా అడవిలోనుంచి నలుపు, తెలుపు మేఘాల్లా పొగలు గాలి వాటుకు గుడారాల వైపు రావటం అక్కడేవున్న ఓ పోలీసు ఉద్యోగి గమనించాడు!
  అవ్వి గుడారాల దగ్గరున్న గాడి పొయ్యిల పొగలు కావు. అడవిలోనుంచే వస్తున్నాయి.
  ఏమై ఉంటుంది?
  అడవిలోనుంచి పొగలెందుకు వస్తున్నట్టు?
  అడవికి నిప్పంటుకుందా?
  సందేహం లేదు! అడవి పుత్రులు పక్షినో, జంతువునో వేటాడి చిదుగు మంటల్లో కాలుస్తున్నట్టుంది. అందుకే అంత దట్టమైన పొగలు.
  పోలీసు ఉద్యోగి భృకుటి ముడిపడింది!
  వాళ్లు నెమలిని పట్టికాల్చటం లేదు కదా?
  అదే నిజమైతే, కావాల్సిన కార్యం గంధర్వులే తీర్చినట్టవుతుంది!
  నెమిలిని కాల్చి తినటం చట్టరీత్యా నేరం! అది జాతీయ పక్షి!
  పోగలు వస్తున్నవైపు సిబ్బందితో వెళ్లాలి. అడవిపుత్రులు నెమళ్ళను చంపి మంటల్లో కాలుస్తుంటే వలపన్ని పట్టుకోవాలి. అరెస్టు చేసి ఖైదు కొట్టుకు పంపించాలి.
  అలా వేధింపుల పర్వం ప్రారంభించి కీర్తిని తనే కొట్టెయ్యాలని బయల్దేరాడా పోలీసు అధికారి. సిబ్బంది కూడా అతని వెంట కదిలారు. మధ్య మధ్యలో తలలు పైకెత్తి పొగల వైపు చూస్తూ గబగబా నడుస్తూ ముందుకు సాగిపోతున్నారు.
  వాళ్ళకది అత్యుత్సాహంగా వుంది!
  అనుకున్నట్టే నేరం చేస్తూ అడవిపుత్రులు స్పాట్లో దొరికితే లాఠీలతో కుళ్ళబొడిచి, చేతులకు సంకెళ్ళు వెయ్యొచ్చు!
  లాఠీ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళంతా ఆర్తనాదాలు చేస్తే ఎంత మంచి సంగీత రాగాలు వినిపిస్తాయో!?
  పోలీసు సిబ్బంది వేగంగా నడుస్తూ నల్లకొండ అటు వైపునకు చేరుకున్నారు.
  ఇద్దరు అడవి పుత్రుల్ని దూరం నుంచి చూసి-
  ‘‘ఎవర్రా.. మీరు?’’ అని పెద్దగా అరిచారు.
  లోహఘంటల గర్జారావమై గగనంలో కూడా ప్రతిధ్వనిస్తూ కర్ణకఠోరంగా వినిపించిన అరుపులు అడవిని తుళ్ళించి, గూటి పక్షుల్ని వణికించి- నెమలి గుట్ట దగ్గర నర్తిస్తూ పరవశించిపోతోన్న నెమళ్ళను భయపెట్టి-
  అపుడు వినిపించాయి తేనెపట్టు దగ్గరికి!
  బాణావతు కాళీచరణ్ గడగడా వణికిపోతూ భయంతో గువ్వల్లా కృంగిపోయారు.
  ఇనుప నాడాల బూట్ల చప్పుళ్ళ వెంటే వస్తున్న పోలీసు సిబ్బందిని దూరంగా చూసి స్థాణువులై నిల్చున్నారు.
  సాయుధ పోలీసులు అక్కడికిచేరారు.
  పూర్తిగా ఆరని చిదుగుల వైపూ అడవి పుత్రుల వైపూ మార్చి మార్చిచూస్తూ-
  ‘‘నెమళ్ళను చంపారా?’’ అని ఓ పోలీసు ఉద్యోగి అడిగాడు.
  ‘‘సంపలేద్దొరా’’ బాణావతు చెప్పాడు.
  ‘‘మంటల్లో కాల్చిందేమిటి?’’
  ‘‘తేనెపట్టుకు పొగెట్టినావు.. అంతే..’’
  ‘‘నీ పేరు?’’
  ‘‘బాణావొదు’’
  ‘‘వాడి పేరు?’’
  ‘‘కాలీశరన్’’
  ‘‘ఏ తండా మీది?’’
  ‘‘రెడ్డియానాయక్ తండా’’
  పోలీసు సిబ్బంది ఉలిక్కిపడ్డారు! ముందుగా ఖాళీ చేయించాల్సిందా తండానే!’’
  ‘‘తేనెపట్టు కొట్టి తేనె పడుతున్నారా?’’
  ‘‘ఔ.. దొరా’’
  ‘‘తేనెనేం చేస్తారు?’’
  ‘‘గౌరారఁవ్ సంతలో అమ్ముతావు’’
  ‘‘ఎవడబ్బ సొమ్మని అమ్ముతార్రా.. దొంగనా కొడకల్లారా! ప్రతి దొంగనా కొడుక్కీ అడవి ఇష్టారాజ్యమైపోయింది. అడవి బిడ్డలం అంటూ అడవిని దోచుకుంటున్నారు. ఎన్‌కౌంటర్ చెయ్యాలి’’ అని ఆ పోలీసు ఉద్యోగి నేలమీద కనిపించిన కంబళ్ళు అందుకున్నాడు. కోపంగా చిదుగులమీదికి విసిరేశాడు.
  (ఇంకా ఉంది)


  0 0

  ఆంజనేయస్వామి పూజలలో హనుమత్ వ్రతము ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ వ్రత విశిష్టత శౌనకాది ఋషులకు సూతమహాముని వివరించినట్లుగా పరాశర సంహితలో తెలియబరచబడినది.
  ధీమంతుడైన హనుమ మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున లోకమాతయైన సీతామాతను అశోక వనమందు చూచి ఆత్మహత్యనుండి విరమింపచేసి శ్రీరామచంద్ర ప్రభు క్షేమవార్తచెప్పి తన విశ్వరూపమును చూపెను. అప్పుడు సీతామాత హనుమంతుని మహారుద్రుడుగా భావించి అనేక విధముల స్తుతించెను. ఆమె మిక్కిలి సంతోషముతో ఈరోజున యెవ్వరైతే హనుమద్వ్రతమాచరించుదురో అట్టివారికి హనుమత్‌స్వామి సీతాదేవి అనుగ్రహించినది.
  ఒకప్పుడు వ్యాస మహర్షి ద్వైత వనమనకు విచ్చేసి ధర్మరాజాది పాండవులను యోగక్షేమములు విచారించు సమయమున వారికి హనుమద్వ్రత మాచరించిన శుభములు బడయవచ్చని చెప్పి ఆ వ్రత విధానమును వివరించెను. పూర్వము శ్రీకృష్ణునిచే చెప్పబడగా ద్రౌపది యా వ్రతమాచరించి పదమూడు ముడులుగల తోరమును ధరించినది. అర్జునుడు పరిహసింపగా ద్రౌపది యాతోరమును విడిచివేసెను. ఆరోజునుండి పాండవులకు అరణ్యవాసము 12 సంవత్సరములు, ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలసి వచ్చినది. ధర్మరాజా ఈ వ్రతమాచరించిన యెడల నీకు శుభములు కలుగునని చెప్పిన పాండవులు, ఆ వ్రతమాచరించి తిరిగి సంవత్సరములో రాజ్యసుఖములు పొందగలిగి ఈ వ్రతమును శ్రీరామచంద్ర ప్రభువు, సుగ్రీవుడు యథావిథిగా ఆచరించెను. రావణ సంహారము శ్రీరామ పట్ట్భాషేకములు దిగ్విజయముగా జరిగినవని శాస్త్రప్రమాణము.
  పూర్వము సోమదత్తుడనే రాజు, తన విశాలమైన సామ్రాజ్యమును పరిపాలించు సమయమున తన చుట్టూవున్న శతృరాజులు అందరు కలసి గుమిగూడి సోమదత్తుని ఓడించి రాజ్యమును కైవసము చేసుకొనిరి. భార్యతోగూడ అడవుల పాలైన సోమదత్తుడు గార్గ్యాశ్రమును చేరినవాడాయెను. మునీశ్వరుని దయతో ఆంజనేయ వ్రతమాచరించి తిరిగి సమస్త సామ్రాజ్యమును జయించినవాడై, ఏకచ్ఛత్రాధిపత్యముతో నూరు సంవత్సరములు పాలించి పుత్రపౌత్రులతో సుఖసంతోషములతో వర్ధిల్లి అంత్యమందు బ్రహ్మలోకమును చేరినవాడాయెను.
  ఒకప్పుడు విభూషణుడు సర్వసంపదలతో తులతూగుచు లంకా రాజ్యమేలు చుండెను. విభీషణుని కుమారుడు నీలుననువాడు తనకు చింతామణి, కామధేనువు కావలెనను కోరికతో రాక్షస గురువైన శుక్రాచార్యుని ప్రార్థించి ప్రసన్నుని చేసుకుని తన కోరికను తెలిపెను. అందుకు ఈ పని నా శక్తికి మించినది. నీవు హనుమద్వ్రతమాచరించి స్వామిని ప్రసన్నుని చేసుకొనిన యెడల ఆయనే నీ కోర్కె తీర్చగలడని శెలవిచ్చెను. ఆ ప్రకారము హనుమద్వ్రతమాచరించి ఇంద్రాది దేవతలతో ప్రచండ యుద్ధముచేసి జయించి, స్వామిదయతో తాను కోరుకున్న చింతామణి, కామధేనువు, కల్పవృక్షములనేగాక దేవతా స్ర్తిలలో శ్రేష్టమైన రూపయవ్వన లావణ్యములతో మొప్పారు వనసుందరిని గూడ బహుమతిగా పొంది తిరిగి తన లంకకేతెంచి సుఖసంతోషములతో తులతూగెనని హనుమద్వ్రత కథ ద్వారా తెలియుచున్నది.
  దేవుళ్లకు దేవుడైన హనుమని ఆరాధించి సకలైశ్వర్యములు పొందవలెనని పెద్దల కోరిక హనుమంతుడు ఒక్కడే దేవుడని, హనుమన్మంత్రమొక్కటే శరణ్యమని భక్తుల భావన.


  0 0

  అదీ విచిత్రం! ఐతే శిఖరాగ్రం చేరుకున్నాక, అధిరోహించేందుకు మరేమీ లేనప్పుడు జరిగే పరిణామమేమిటి? నింగికి దూసుకుపోయిన తోకచుక్క నేలకు రాలక తప్పదుగదా!
  మంజరి జీవిత చరమాంకం ఆ దశనే గుర్తుచేస్తుంది.
  ఆ క్రమానుగత పరిణామాన్ని, వెండితెర వెనుక భాగోతాలను, కుట్రలు, కుతంత్రాలను, విశ్వసనీయతతో, నిశిత దృష్టితో, మనకళ్లముందుంచేందుకు భరద్వాజ గారు చిత్తశుద్ధితో చేసిన సద్యత్నమే పాకుడురాళ్లు.
  తనకు ఆ నవల ఎందుకు నచ్చిందో ఆలపాటి వెంకట్రామయ్యగారు 1963లో ముందుమాటగా ఇలా వివరించారు. సినిమా వెనుకగల సినిమా చరిత్రను, రచయిత కథాత్మకంగా చిత్రించడమేగాదు.
  జరిగిన, జరుగుతున్న, జరగడానికి అవకాశాలున్న వేలాది సంఘటనలను మనోజ్ఞంగా తన రచనలో పోహళించడం కూడా కాదు.. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా భాసిస్తూ, వేలాది మందిని తన వైపునకు ఆకర్షించే ఈ రంగంలో పాతుకుపోయిన అవాంఛనీయమైన శక్తులను గురించి రచయిత మనకు కనువిప్పు కలిగిస్తున్నాడు.
  చిరునవ్వుల వెనుక మణిగిపోయే ఆత్మఘోష, తళుకు చూపుల చాటున దాగిన కన్నీరు, తియ్యని మాటలమాటున పొంచి వున్న విషజ్వాలలు మనకు ఈ నవలలో ప్రత్యక్షమవుతాయి.
  నిజం. ప్రతి మాటా అక్షరసత్యం. అత్యుక్తికి తావే లేదు. ఇంతటి వాస్తవికతను, కఠోర సత్యాల్ని నింపుకున్న నవల గనుకే తెర వెనుక సినీ జీవితాల్లోని వెలుగునీడలకు అద్దంపట్టిన ప్రామాణిక గ్రంథంగా మన్నన పొందింది; సాహితీ లోకానికి ఎనలేని సేవ చేసింది; కాలపరీక్షకు నిలువగలిగింది.
  అంతటి ప్రామాణిక గ్రంథానికి కేంద్ర బిందువు మంజరి. ఎన్నో పాత్రలు మంజరి చుట్టూ పరిభ్రమిస్తాయి. ముఖ్యంగా ఎన్నదగినవాడు చలపతి.
  అడుగడుగునా తనతో వుంటూ, తనకు అంతరంగికులుగా, మార్గనిర్దేశకురాలిగా వ్యవహరించిన సహనాయిక కళ్యాణి, తన పూర్వాశ్రమమైన వెలయాలి జీవితంలో తోడుగా వుండిన రాజమణి తన ద్వారా గాయనిగా సినీరంగ ప్రవేశం చేసిన వసంత, కథానాయకులు, ప్రత్యర్థులైన రావు, మూర్తి, చంద్రం, పాత్రికేయుడు శర్మ. తన శరీర లావణ్యాన్ని వాడుకుని తోడ్పడిన నిర్మాతలు, పంపిణీదారులు, తన కత్యంత విశ్వాసపాత్రురాలైన పనిమనిషి తాయారమ్మ. మంజరి నట జీవిత ప్రారంభంలోనూ, అంత్య దశలోనూ విశిష్ట స్థానంలో నిలిచిన మాధవరావు మినహా మిగిలినవారందరూ చదరంగం పావుల్లాంటివాళ్లు.
  మగవాడి బలహీనతలేమిటో, ఎప్పుడు వాటిని లాభసాటిగా వాడుకోవాలో మంజరికి క్షుణ్ణంగా తెలుసు.
  అందుకే సినీ వ్యాపారస్తులను వ్యామోహంలో ముంచి, ప్రతి ఒక్కడికీ తను స్వంతమన్నట్టు నమ్మించి తన పబ్బం గడుపుకోగలిగిన జాణ ఆమె. తన జీవితంలో అడుగడుగునా తిన్న దెబ్బలు, అనుభవించిన నరకయాతన, మంజరి జీవితాన్ని తీర్చిదిద్దాయి. అనుభవాల నుంచి జీవరసాన్ని పీల్చుకుని, తన వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకున్న నేర్పరి.
  - సశేషం

  రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


  0 0

  సీ. ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగ లేదు
  ద్రవ్యమిమ్మని వెంటఁదగుల లేదు
  కనకమిమ్మని చాలఁ గష్టపెట్టఁగలేదు
  పల్లకిమ్మని నోట పలుక లేదు
  సొమ్ము లిమ్మని నిన్ను - నమ్మి కొల్వఁగ లేదు
  భూములిమ్మని పేరు పొగడ లేదు
  బలము నిమ్మని నిన్ను బ్రతిమాలఁ గా లేదు
  పసుల నిమ్మని పట్టుపట్టలేదు
  తే. నేను కోరిన దొక్కటే నీల వర్ణ
  చయ్యనను మోక్షమిచ్చిన ఁజాలు నాకు
  భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
  దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

  భావం: ఓ నరసింహప్రభూ! సిరిసంపదలు, డబ్బు, బంగారం, పల్లకీలు, నగలు, పొలాలు, పాడిపశువులు కావాలని నేను నిన్ను కోరలేదు వాటికొరకై నిన్ను పొగడటం, బ్రతిమాలటం , పేచీపడటం లాంటి పనులు ఏమీ చేయలేదు. నే కైవల్య మొక్కటే నిన్ను కోరుతున్నాను. లౌకిక సంపదలెందుకు క్షణభంగురమైనవి? నిత్యమూ శాశ్వతము అయిన పరమేశ్వరుని సాయుజ్యముచాలుగదా.


  0 0
 • 12/19/18--06:16: రంగవల్లి
 • వై. పద్మావతి, రాజంపేట, కడప జిల్లా
  =====================================
  ముగ్గులకు ఆహ్వానం

  నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
  సూచనలు
  * ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
  * ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
  * ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
  * ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
  * డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.
  ======================================================
  ముగ్గులు పంపాల్సిన చిరునామా:

  ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.


  0 0

  మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు పెద్దలు. జన్మనిచ్చేది తల్లిదండ్రులైనా జ్ఞాననేత్రం తెరిపించేది గురువు. పూర్వకాలంలో గురుకులాల్లో విద్య నేర్పేవారు. విద్య నేర్చుకోవటానికి డబ్బుతో పనిలేదు. అక్కడ ఆశ్రమ జీవితం గడపాలి. గురువుగారు చెప్పినట్లు నడుచుకోవాలి. ఆయనకి కుబేరుడయినా, కుచేలుడయినా ఒకటే! దయగలిగినపుడు విద్య నేర్పుతాడు. విద్యను అర్థించి వచ్చేవాడు కనుకనే శిష్యుడిని ‘విద్యార్థి’ అన్నారు. కాలం మారిపోయింది. గురుకులాలు అంతరించి పాఠశాలలు, కళాశాలలు ఏర్పడ్డాయి. అయినా గురువు స్థానంలోని వ్యక్తికి గౌరవం తగ్గలేదు.
  మా చిన్నతనంలో మాస్టారంటే ఎంతో భయభక్తులు ఉండేవి. ఆయన ఎదురుగా ఉన్న టేబుల్‌ని తాకటానికి కూడా భయం వేసేది. హెడ్మాస్టర్ ఎప్పుడు చూసినా ‘తాట తీస్తాను, వీపు చీరేస్తాను’ అనేవారు. కానీ ఎప్పుడూ పిల్లల్ని ఒక్క దెబ్బ కూడా వేయలేదు. ఆయన ముఖంలో సీరియస్‌నెస్ చూస్తేనే పిల్లలు వణికిపోయేవాళ్ళు. వాళ్ళ ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉండేది. నేను, హెడ్మాస్టరు గారబ్బాయి, ఇంకా మా స్నేహితుల బ్యాచ్ అందరూ సాయంత్రంపూట ఆడుకోవటానికి అక్కడికి వెళ్ళేవాళ్లం. ఆయన ఏదో పనిమీద అటువైపునకు రాగానే పిల్లలందరూ భయంతో బిగుసుకుపోయి, చేతులు కట్టుకుని నిలబడిపోయేవాళ్ళు. ఆయన నవ్వి ‘‘చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. ఇది ఆడుకునే సమయం. చక్కగా ఆడుకోండి’’ అని చెప్పారు. స్కూల్లో వున్నపుడు ఎంత సీరియస్‌గా ఉంటారో, ఇంటిదగ్గర అంత శాంతంగా, సౌమ్యంగా ఉండేవారు.
  లెక్కల మాస్టారు పేద విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు కొని ఇచ్చేవారు. పిల్లవాడు తీసుకోవటానికి జంకుతూంటే ‘తీసుకోరా వెధవా!’ అని కళ్ళతో ఉరిమి చూసేవారు. ఆ పిల్లవాడు హడలిపోయి గభాలున అందుకునేవాడు. అందరిలోకి తెలుగు మాస్టారు పిల్లలతో కొంచెం చనువుగా ఉండేవారు. నవ్వుతూ మాట్లాడతారు. కథలు చెబుతారు. ఏ రోజూ తిట్టడం కానీ, కొట్టడం కానీ చేయలేదు. కోపం వస్తే ‘ఓరి నీ పొట్టలో పాలు పొయ్య’ అనేవారు. చూడటానికి అది తిట్టులా ఉంటుందిగానీ, ఆ భావం గ్రహిస్తే ఎవరికీ కోపం రాదు. పరీక్షలు జరిగేటపుడు పరీక్ష పేపర్ ఇచ్చి ‘మొదట మీ పేర్లు, గోత్రాలు రాసి ఏడవండి’ అనేవారు.
  ఇంగ్లీషు మాస్టారు లావుగా, పొడుగ్గా, గంభీరంగా చూపులకే భయం కలిగించేటట్లు ఉండేవారు. పుస్తకంలోని పాఠాలు అన్నీ చదవలేదేమని నేను అడగను. ఇంగ్లీషు మన మాతృభాష కాదు, పరాయి భాష. పరాయి భాష నేర్చుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. మీరు చదవగలిగినంతవరకే పరఫెక్ట్‌గా చదవండి. నిజాయితీగా రాయండి. మార్కులు తగ్గినా ఏమీ అనను. కాపీ కొడితే మాత్రం సహించను అని చెప్పేవారు. దానితో పరీక్షలంటే మాకు భయం ఉండేది కాదు. మార్కులు తగ్గినా ఫర్వాలేదు, కాపీ కొట్టకుండా రాస్తేచాలు అని ధైర్యంగా ఉండేది. క్రమశిక్షణ తప్పితే కన్నకొడుకునైనా శిక్షించేవారు. అంతదూరం నుంచీ ఆయన ఒక్క అరుపు అరిచారంటే పిల్లలంతా బిక్కచచ్చిపోయేవాళ్లు. ఆ రౌద్ర రూపం చూడటానికి ఇష్టం ఉండేది కాదు. అంతవరకూ రాకుండా చెప్పినట్లు నడుచుకునేవాళ్లు.
  పైకి మెత్తగా కనబడుతూ, తడిగుడ్డతో గొంతులు కోసేవాడిని ‘గోముఖ వ్యాఘ్రం’ అంటారు. కానీ ఈ ఉపాధ్యాయులు మాత్రం పైకి కఠినంగా కనబడినా, మనసు మాత్రం మెత్తనిది. ఆ కఠినత్వం వెనక పిల్లల క్షేమమే ఉంటుంది. వీరిని ‘వ్యాఘ్రముఖ గోవులు’ అంటే బాగుంటుందేమో!
  ఇవన్నీ ఒకప్పటి పరిస్థితులు. ఇప్పటి ఉపాధ్యాయులను తలచుకుంటే మనసు కలుక్కుమంటుంది. ఇపుడు ఎవరికి ఇష్టమైన శైలిలో వారు పాఠం చెప్పటానికి వీలు లేదు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో పాఠాలు చెప్పాలి. ప్రభుత్వం చెప్పినట్లే పరీక్షలు నిర్వహించాలి. అవి ఎంతవరకు సాధ్యమో గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నవారికి తప్ప ఇతరులకు అర్థంకాదు.
  ఇక విద్యార్థులను చూసి ఉపాధ్యాయుడు భయపడే పరిస్థితులు ఇపుడున్నాయి. ‘్ఫలానా మాస్టారు వేధిస్తున్నాడు’ అని ఏ అమ్మాయి అయినా చెబితే చాలు, అది నిజమా, అబద్ధమా అని కూడా ఆలోచించరు. వెంటనే ఆయనమీదకు యుద్ధానికి వెళతారు. పొరపాటున మాస్టారు ఒక దెబ్బవేస్తే ఆ విద్యార్థి వెళ్లి పోలీసు కంప్లయింట్ ఇస్తాడు. తల్లిదండ్రులు, అధికారులు, చట్టాలు అన్నీ విద్యార్థి పక్షమే! ఉపాధ్యాయుడు బలహీనుడు. ఎప్పుడైతే విద్యార్థి ఉపాధ్యాయుడి కంట్రోల్ తప్పిపోయాడో అప్పుడే విద్యావ్యవస్థ గాడితప్పినట్లు లెక్క!


  0 0

  అది బెంగాల్ రాష్ట్రం.. అక్కడ కొన్ని గ్రామాల మహిళలందరూ ఒకేచోట చేరారు. అందరూ ఒకేమాటపై నిలబడ్డారు. చేయి చేయి కలుపుకుని తమ గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లను వాళ్లే వేసుకున్నారు. వారికి సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. దాంతో పదిహేనురోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తయింది. అలా వేసుకున్న ఆ రోడ్డు 17 గ్రామాల ప్రజల జీవితాలను మారుస్తోంది. ఎందుకంటే అక్కడ సరైన రోడ్డు లేక గర్భస్రావాలు జరిగాయి. పిల్లల చదువులు ఆగిపోయాయి. రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వం అటువైపు తొంగి కూడా చూడలేదు. దాంతో ఆ మహిళలు తమ తలరాతను తామే మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని రుజువు చేసి చూపించారు. సరైన రోడ్డు వేసుకుని తమ జీవితాలను మార్చుకున్నారు.
  ఒకప్పుడు.. ఆ దారంతా ఒకటే బురద.. గుంతలు.. రోడ్డు దాటాలంటే.. చాలా కష్టం. చీరపైకి పట్టుకోవాల్సిందే.. ఇక అలాంటి రోడ్లపై బండ్లు కదులుతాయా? ఇరుక్కుపోయేవి.. ఇక అలాంటి రోడ్డుపై రోగులు కానీ, గర్భిణులు కానీ నడిస్తే.. అంతే సంగతులు.. ఈ విషయం గురించి గీత అనే మహిళ కంటే మరెవ్వరికీ తెలియదేమో.. ఎందుకంటే ఈమె గర్భిణిగా ఉన్నప్పుడు ఈ రహదారిపై నడుస్తూ జారిపడింది.. ఆ సమయంలో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె.. రోడ్డు లేక గర్భిణులు చాలా అవస్థలు పడేవాళ్లు. ఇక ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఓ పల్లకీ వంటి తాత్కాలిక నిర్మాణంలో మహిళను కూర్చోబెట్టి భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లేవారు. ఇలా వివిధ సందర్భాల్లో మహిళలు ఎదుర్కొన్న రకరకాల సమస్యలే రోడ్డు నిర్మాణంలో వారిని ఒక్కటి చేశాయి. ఇప్పుడు ఆ రోడ్డే పిల్లల బంగారు భవిష్యత్తుకూ మార్గం చూపుతోంది.
  బెంగాల్లోని త్రిడిప్ నగర్ గ్రామంలో పానీపూరీ అమ్ముకునే మీనా గయెన్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘నా బండి ప్రతిసారీ గుంతల్లో ఇరుక్కుపోయేది. కొన్నిసార్లు నేను రోడ్డుకి దూరంగా బండిని నిలిపినప్పుడు జనాలు దొంగతనంగా పానీపూరీలను తీసుకెళ్లిపోయేవారు. ఒక్కోసారి జారిపడేదాన్ని. చివరికి మేమంతా కలిసి సొంతంగా ఇక్కడ రోడ్డును నిర్మించుకున్నాం.. చాలా ఆనందంగా ఉంది. రేపటి నుంచి మాకు ఎలాంటి సమస్యలూ ఉండవు..’ అని చెబుతోంది సంతోషంగా.. అలాగే పిల్లలకు కూడా ఈ రోడ్డు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే గతుకుల రోడ్డుపై స్కూలుకు వెళ్లడానికి నానాయాతన పడేవారు. నేడు ఆ బాధ తీరింది. మట్టిలో గాజుపెంకులు గుచ్చుకోవడం, రోడ్డుపై జారిపడినప్పుడు దుస్తులు శుభ్రం చేసుకుని స్కూలుకు వెళ్లేసరికి ఆలస్యమయిపోయేది. పరీక్షలప్పుడైతే మరీ ఇబ్బందులు పడేవారు విద్యార్థులు.. ఇప్పడు వారి సమస్య తీరిపోయింది. మహిళలందరూ కలిసి నిర్మించిన చిన్న ఇటుకల రోడ్డు ఇప్పుడు విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ప్రభుత్వమో, అధికారులో తీసుకొచ్చిన వెలుగు కాదిది. మహిళలందరూ చేయి చేయి కలుపుకుని తమకు తాముగా సాధించుకున్నది.


  0 0

  ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద పదేళ్లుగా అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అర్జున్ జంధ్యాల మెగా ఫోన్ పట్టనున్నారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌లా ఉండే బోయపాటి సినిమాల్లాగానే తన శిష్యుని సినిమా కూడా ఉండబోతోంది. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి, బోల్డంత క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నారు. తొలి చిత్రంలో మాస్ యాక్షన్, మంచి రొమాన్స్‌తో స్క్రీన్‌పై కనిపించారు కార్తికేయ. తాజా చిత్రంలోనూ ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. టీవీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంస్థలు ఈ చిత్రం ద్వారా సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అనిల్‌కుమార్, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. ఈనెల 27న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుందని నిర్మాతలు తెలిపారు.


  0 0

  బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన తనీష్ నచ్చావులే సినిమాతో హీరో అయ్యాడు. పలు చిత్రాల్లో నటించినా వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. బిగ్‌బాస్ టీవీ షో తరువాత కొత్త ఎనర్జీతో అడుగులేస్తున్న తనీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు. నటుడిగా కెరీర్ మొదలై ఇరవై ఏళ్ళు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభవాలు పంచుకున్నాడు.
  పదేళ్ల కెరీర్..: హీరోగా నచ్చావులే సినిమాతో కెరీర్ మొదలై పదేళ్లు పూర్తయింది. ఈ దాదాపు 20 సినిమాలు చేశాను. అయితే బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు పూర్తయ్యాయి. అందులో 60కిపైగా సినిమాలు.. 20కిపైగా టీవీ సీరియల్స్ చేశాను. సినిమా రంగంలోకి వస్తానని అనుకోని వాడిని, నా ప్రయాణం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది.
  నటుడిగా..: చిన్నప్పటినుంచి డాన్స్ ఇష్టం. అందుకు చిరంజీవే స్ఫూర్తి. నాన్న మిలటరీ పర్సన్ కావడంతో, కాంపస్‌లో ఈవెంట్స్ జరిగేవి. అలాంటి షోలలో డాన్స్ చేస్తుంటే అంబికా కృష్ణ చూసి సినిమాల్లో చేస్తావా అంటూ ఇవివికి పరిచయం చేశారు. తరువాత ఆయన దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేశా. తరువాత ఉత్తేజ్ ద్వారా ప్రేమించుకుందాం రా సినిమాలో ఛాన్స్ దక్కింది. అలా సినిమాలు చేశా. ఇంటర్ తరువాత బాలనటుడిగా చేయొద్దని ఫిక్సయ్యాను. ఆ సమయంలో రవిబాబు నచ్చావులే సినిమాకు ఆడిషన్ జరుగుతుందని తెలిసి వెళ్లాను. అక్కడ ఆడిషన్ చేసి చాలా బొద్దుగా వున్నావ్.. ఇరవై రోజుల్లో సినిమా మొదలవుతుంది, కాస్త వెయిట్ తగ్గితే ఓకె అన్నారు. అప్పటికే నాకు మరో సినిమా ఛాన్స్ వచ్చింది. దాన్ని వద్దని.. ఇరవై రోజుల్లో ఏడు కిలోలు తగ్గాను. వెంటనే రవిబాబును కలవడంతో ఆయన షూటింగ్ మొదలుపెట్టారు. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఇన్నాళ్లుగా నటుడిగా మీ ముందు నిలబడ్డాను. రవిబాబుని మాత్రం నా జీవితంలో మర్చిపోలేను.
  ఎత్తుపల్లాలు..: నా కెరీర్‌లో కొన్ని తప్పులు చేశాను. వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బిగ్‌బాస్ టీవీ షో ద్వారా ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయ్యాను. ఇకపై కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలన్నది నా ఆలోచన. ప్రస్తుతం ఓ కథ చర్చల్లో వుంది. త్వరలోనే తెలియజేస్తా.


  0 0

  శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాల్ నిర్మించిన హుషారు మంచి టాక్ తెచ్చుకోవడంతో కెరీర్‌పై మంచి హుషారుతో ఉంది హీరోయిన్ ప్రియావడ్లమాని. ఆ ఆనందంలో మీడియాకు చెప్పిన విశేషాలు.
  ‘హుషారు’ సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలీడంలేదు. సినిమాను ఇంకెంత ప్రమోట్ చేయొచ్చు అనేదే ఆలోచిస్తున్నాం. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు ఆ భయం లేదు. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానా? లేదా? అన్నది చెప్పలేను. ఎందుకంటే మనసంతా యాక్టింగ్‌మీదే ఉంది. ఫ్యూచర్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. నేను క్లాసికల్ డాన్స్ 12 ఏళ్లు నేర్చుకున్నా. కెరీర్ మొదట్లోనే క్యూట్ ప్రేమకథలో నటించడం, పూర్తిగా యూత్ నేపథ్యంలో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఇక శుభలేఖలు సినిమా పూర్తిస్థాయిగా ఫ్యామిలీ సినిమా అయితే అందులో సిగరెట్ తాగే సన్నివేశాల గురించి చాలామంది అడుగుతున్నారు. నిజానికి నేను సిగరెట్ తాగింది కేవలం పాత్ర మాత్రమే. నేను పక్కా తెలుగమ్మాయినే. టెన్త్, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. బిటెక్ బెంగుళూరులో చేశా. మా నాన్న బిజినెస్‌మెన్. మాది మధ్యతరగతి ఫ్యామిలీ. నాకు దర్శకురాలు అవ్వాలన్న ఆలోచనతో పరిశ్రమకు వచ్చాను. వంశీ పైడిపల్లి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. మహర్షి సినిమాకు పనిచేశాను. అదే సమయంలో ‘హుషారు’ ఛాన్స్ వచ్చింది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఓకె చెప్పాను. తరువాత వెంటనే శుభలేఖలు, మరో సినిమా చేశా. ఈ సినిమాలో లిప్‌లాక్ కూడా వుంది. కథ ప్రకారమే అందులో ముద్దు సన్నివేశం ఉంటుంది. ఇక నటిగా భిన్నమైన పాత్రలు పోషించాలని ఉంది. తెలుగులో అమ్మాయిలకు ఛాన్సులు రావన్న అపవాదు నిజమే. ఎందుకంటే తెలుగు అమ్మాయి అయినందుకు నాకు కొన్ని అవకాశాలు పోయాయి. అయితే ఇక్కడ టాలెంట్ వుంటే మంచి అవకాశాలు వస్తాయని నాలాంటి వాళ్లం ప్రూవ్ చేస్తున్నాం. ఈ సినిమా తరువాత ఓ ప్రాజెక్టు చర్చల్లో వుంది. త్వరలోనే దాని గురించి తెలియజేస్తా అంటూ ముగించింది.


  0 0

  వరుత్‌తేజ్, అతిదిరావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000’. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతగా చిత్రం రూపొందింది. డిసెంబర్ 21న సినిమా విడుదలసందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొలి టికెట్‌ను రామ్‌చరణ్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతూ ‘ఏడాదికి ఓ సినిమా చేస్తే గొప్ప. రెండు సినిమాలు చేస్తే అదృష్టం. మా అందరికీ రెండు సినిమాలు చేయాలనే ఉంటుంది. ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆనందం మా సినిమాకన్నా ఆనందంగా ఉంటుంది. వరుణ్ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. వరుణ్‌పైన ఉన్న ప్రేమకన్నా ట్రైలర్ చూసిన తర్వాత ఇంత మంచి ట్రైలర్ చూసిన అభిమానం, గౌరవంతో ఫంక్షన్‌కి వచ్చాను. మంచి విజనరీతో గ్రేట్ టీం ఫ్యాషనేట్‌గా చేసిన సినిమాగా అనిపించింది. జ్ఞానశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్‌కి అభినందనలు. కంచె తర్వాత రాజీవ్, క్రిష్ చేసిన సినిమాకు రావడం ఆనందంగా ఉంది. తెలుగు నిర్మాతలుగా ఇలాంటి డేరింగ్ సినిమా చేయడం గర్వంగా అనిపిస్తుంది. దర్శకుడు సంకల్ప్ కటౌట్‌కి, విజన్‌కి సంబంధం లేదు. మనిషికన్నా గొప్పది ఆలోచన. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఉన్నతస్థాయిలో ఉంటారనేది నా నమ్మకం. అలాంటి గ్రేట్ ఆలోచనలున్న దర్శకుల్లో రాజవౌళి, సుకుమార్, క్రిష్, రేపు ఆ ప్లేస్‌కి సంకల్ప్ రావాలని ఆశిస్తున్నా. వరుణ్ చేసిన కొన్ని సినిమాలు చూసి అసూయ పడ్డాను. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు దొరకవు’ అన్నారు.
  వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘మా చిట్టిబాబు.. చిట్టి అన్నయ్య ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. థాంక్స్ అన్న.. ఏదైనా కొత్త సినిమా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ సమయంలో సంకల్ప్ కథ చెప్పగానే మోటివేట్ అయ్యాను. ప్రతివారం మన దగ్గరకు చాలా సినిమాలు వస్తాయి. కానీ అంతరిక్షం లాంటి సినిమా రేర్‌గా వస్తుంది. ఇలాంటి సినిమాకు టీంవర్క్ ముఖ్యం. ఆ విషయంలో మా టెక్నికల్ టీం సక్సెస్ అయ్యందనే అనుకుంటున్నా. ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమానూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమా చేయడానికి ఎంకరేజ్ చేసింది చరణ్ అనే్న. ఈ సినిమా చూసిన తర్వాత నేనొక భారతీయుడ్ని అని అందరూ గర్వపడతారు అన్నారు. చిత్ర దర్శకుడు సంకల్ప్ మాట్లాడుతూ ‘నేను డైరెక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడటం కన్నా సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడితేనే బావుంటుంది. ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందరికీ సినిమా చూపించాలనిపిస్తుంది అన్నారు.


  0 0

  ఇటీవల ‘హ్యాపీ వెడ్డింగ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగా డాటర్ నిహారిక కొణిదెల సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఆమె ‘సూర్యకాంతం’లో నటిస్తుంది. యువ హీరో రాహుల్ విజయ్ నిహారికకు జోడీ. లీడ్ పెయిర్‌తో రూపొందించిన చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలై ఆకట్టుకుంటుంది. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న చిత్రాన్ని కొత్త దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి తెరకెక్కిస్తున్నాడు. వచ్చే జనవరిలో చిత్రం విడుదలకానుంది.


  0 0

  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్ తాప్సి. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘గేమ్ ఓవోర్’. ఈ చిత్రంలో తాప్సి వీడియో గేమ్ డెవలపర్ పాత్రలో నటిస్తోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ‘మాయ’ ఫేమ్ అశ్విన్ శరవణ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే తమిళ్‌తోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ చిత్రంతోపాటు తాప్సి ప్రస్తుతం మరో మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఈ ఏడాది తాప్సి ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాటిలో ముల్క్, సూర్మ మంచి విజయాలను సాధించాయి.


  0 0

  భిన్నమైన కథలతో... అంతకంటే భిన్నమైన సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు శర్వానంద్. హీరోయిజానికి దూరంగా కథలకే ప్రాధాన్యనిస్తూ అటు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇటు యూత్‌కు దగ్గరయ్యాడు. తాజాగా ‘పడి పడి లేచే మనసు’ అంటూ సాయి పల్లవితో జోడిగా వస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 21న విడుదల అవుతున్న సందర్భంగా శర్వాతో ఇంటర్వ్యూ...

  * సినిమా ఎలా వచ్చింది?
  -బాగా వచ్చింది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
  * ఇంతకీ కథేమిటి?
  -ఇదో మంచి ప్రేమకథ. అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ అంతే. కాకపోతే దాన్ని ఎలా భిన్నంగా చూపించామన్నదే సినిమా. కథ మొత్తం కలకత్తా నేపథ్యంలోనే. ట్రైలర్‌లో చెప్పినట్టు.. హీరో అర కిలోమీటరు దూరంనుండి అమ్మాయిని చూస్తూ ప్రేమిస్తుంటాడు..
  * రియల్ లైఫ్ లవ్‌లోనూ పడి లేచినట్టున్నారు?
  -ఇప్పుడు కాదు... సరైన టైంలో చెబుతా.
  * టైటిల్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
  -బాగా నచ్చింది. ప్రేమలో పడటం లేవటం ఉంటాయిగా.. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని పెట్టాం.. అందరికీ బాగా నచ్చింది.
  * మీ పాత్ర గురించి?
  -నా పాత్ర పేరు సూర్య. యాక్టివ్ పర్సన్. సూర్యుడిలా బ్రెయిట్‌గా ఉంటాడు. సూర్యుడు ప్రపంచానికి వెలుగు పంచితే ఈ సూర్య అమ్మాయికి ప్రేమను పంచుతాడు. ఇందులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తా.
  * మణిరత్నం సఖి ఛాయల్లో ఉంటాయంటున్నారు?
  -ఆ సినిమాకు ఈ సినిమాకు ఎక్కడా పోలిక ఉండదు. కాని అలా ఓ గొప్ప సినిమాతో పోలిస్తే బెటరే. అలా అనిపించడానికి కారణం హీరోయిన్ ఇందులో డాక్టర్ కావడం. పైగా లవ్ సన్నివేశాలు హను అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకేనేమో...
  * సాయి పల్లవితో కెమిస్ట్రీ ఎలా ఉంది?
  -ఆమె గొప్ప నటి. అద్భుతంగా నటించింది.. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడానికి కారణం అదే కావొచ్చు.
  * సాయి పల్లవి గొడవ చేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది.. మీకు అలాంటి సందర్భం ఎదురైందా?
  -నిజంగా అది ఎవరు చెప్పారో కానీ సాయి పల్లవి మంచి అమ్మాయి. నెట్‌లో చూసి, ఇలా రాసారేమిటి అని అడిగాను. తాను చాలా మంచి నటి. మంచి అమ్మాయి. మా టీమ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. కావాలని ఎవరో నిందలు వేస్తున్నారు.
  * దర్శకుడు హను గురించి?
  -హనుతో ఎప్పటినుండో సినిమా చేయాలని ఉంది. తాను చేసిన లై సినిమా తరువాత ఈ స్క్రిప్ట్ చెప్పాడు. కథ కొత్తగా అనిపించింది. అర కిలోమీటరు దూరం నుండి ప్రేమించడం అన్న పాయింట్ బాగా వచ్చింది. నాకు తెలిసి ఏ లవర్ అలా ప్రేమించడేమో... తాను మంచి టెక్నీషియన్. నిజంగా చెప్పాలంటే జూనియర్ మణిరత్నం.
  * ప్రస్థానం లాంటి సినిమాలు చేయడం లేదు?
  -అలాంటి కథలు వస్తున్నాయి.. కానీ అందులో కంటెంట్ నచ్చక చాలా వద్దనుకున్నా.. నాకు స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా చేస్తా. గిరి గీసుకోను.
  * సుధీర్‌వర్మ సినిమా ఎంతవరకు వచ్చింది?
  -సుధీర్‌వర్మ సినిమా దాదాపు సగం అయిపోయింది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.
  * 96 రీమేక్‌లో నటిస్తున్నారా?
  -తమిళ్‌లో సూపర్ హిట్ అయిన 96 రీమేక్ గురించి త్వరలో చెబుతా. ప్రస్తుతం చర్చల్లో ఉంది. ఆ సినిమా చూసాను చాలా బాగా వచ్చింది.
  * నెక్స్ట్ సినిమాలు?
  -ప్రస్తుతానికి కథలు వింటున్నాను.. ఇంకా ఏవీ ఫైనల్ చేయలేదు.


  0 0

  శ్రీకాకుళం(టౌన్), డిసెంబర్ 19: ఆగ్రిగోల్డ్ యాజమాన్యానికి మేలు చేసే విధంగావ్యవహారిస్తున్న చర్యలను దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీలు మానుకోవాలని సిపి ఐ పార్టీ జిల్లా కార్యదర్శి, అగ్రిగోల్డ్ జిల్లా బాధిత సంఘం గౌరవ అధ్యక్షులు సనపల నర్శింహులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎన్ ఆర్ దాసరి క్రాంతిభవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగ్రిగోల్డ్ యాజమాన్యానికి మేలు చేసేందుకు బీజేపీ భీజం వేస్తుంటే దానికి రాష్ట్రంలోని వైసీపీ నీరు పోస్తుందని విమర్శించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ల వెల్ఫేర్ అసోసియేషన్ తరుపున నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేసినప్పటికి బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్రంలోని టీడీపీ విఫలమయిందన్నారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అగ్రిగోల్డ్ బాధితుల పట్ల వైసీపీకి ఎనలేని ప్రేమ, బాధ్యతలు కల్గడం వెనుక ఆంతర్యం ప్రజలకు తెలుసని అన్నారు. దేశంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం అరెస్ట్ కాకుండా కేంద్రంలోని బీజేపీ రక్షణ కల్పిస్తుందని, దీనితో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రస్తుతం బాధితులకు న్యాయం జరిగే చివరి దశలో బీజేపీ, వైసీపీలు అగ్రిగోల్డ్ బాధితుల సంఘాన్ని బలహీనపర్చడానికి కొత్త సంఘం ఏర్పాటుచేస్తున్నామని, దీనికి అందరూ సహకరించి మద్దతు తెలిపితే పోరాటం ఉధృతం చేస్తామని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాధితుల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 12వందలు కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులకు అందజేసే దిశగా కృషి చేయలన్నారు. ఈనెల 4వ తేదీనుండి 7వ తేదీ వరకు బాధితులకు న్యాయం జరిగేందుకు ఇంటింటికి ప్రచారం కార్యక్రమం చేపట్టామని, 21వ తేదీన బాధిత కుటుంబాల్లో విద్యార్థులతో అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉన్న గాంధి విగ్రహాలకు పాలాభిషేకం, 22న బాధిత కుటుంబాల మహిళలతో బైరివానిపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తామన్నారు. అదేవిధంగా 23 నుండి 27వరకు విజయవాడ ధర్నా చౌకలో రిలే నిరాహరదీక్షలు చేపడుతున్నామన్నారు. ఇందులో ప్రతీ జిల్లా నుండి 5గురు ఈ రిలే నిరాహరదీక్షలు పాల్గొంటారన్నారు. ఈనెల 28న సిపి ఐ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పుప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు బి.వి.రెడ్డి, తిరుపతిరావులు నిరవధిక నిరాహార దీక్ష చేపడతామన్నారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకు ఈ నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగుతాయని, ఈ కార్యక్రమంలో ప్రతీ బాధిత కుటుంబ సభ్యులు, అగ్రిగోల్డ్ ఏజెంట్లు, సిపి ఐ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కె.రాజారావు, శ్రీనివాసరావు, ఎస్.కోటీశ్వరరావు, చాపర వెంకటరమణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  జలుమూరు, డిసెంబర్ 19: గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన ఈదురుగాలులు, వర్షంతో జనాలు అనేక ఇబ్బందులు పడిన సంగతి తెల్సిందే. బుధవారం ఉదయం ఒక్కసారి ఉదయించిన సూర్యుని తేజస్సు చూసి ఆనందం వ్యక్తపరిచారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కనీసం ఒంటిపై బట్టకూడా ఆరని పరిస్థితుల్లో సూర్యుని వెలుగుతో ప్రతీ కుటుంబం పలు పనులు చేపట్టారు.
  అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించండి
  జలుమూరు, డిసెంబర్ 19: మండలం లింగాలవలస పంచాయతీ ఉసిరికిజ్వాల గ్రామంలో బుధవారం జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా కమ్యూనిటీ హెల్త్ అధికారి వెంకటరావు మాట్లాడుతూ గడిచిన మూడురోజులు తుఫాన్ ప్రభావం వలన నీరు కలుషితమైందని, కలుషిత నీటిని వినియోగించకూడదని, ప్రతీ కుటుంబ సభ్యులు వేడి నీరు తాగాలని సూచించారు. ప్రస్తుతం ఎటువంటి వ్యాధులు సోకకుండా గ్రామంలో ప్రభుత్వ బావులను క్లోరినేషన్ చేయించారు. తదుపరి ప్రజలకు ఆరోగ్యసూత్రాలు, పలు సూచనలు అందజేశారు. ఉచిత మందులను సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య పర్యవేక్షకులు చినరాజులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
  గ్రంథాలయానికి కుర్చీలు వితరణ
  పాతపట్నం, డిసెంబర్ 19:మండలం శాఖాగ్రంథాలయానికి శ్రీరామ్‌ప్రసాద్ సుమారు రూ.6వేలు విలువగల కుర్చీలను వితరణ చేశారు. తెలుగుయువత సదస్సులును నిర్వహిస్తున్న సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడు జన్మదిన వేడుకలలో భాగంగా ఈ వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని వీరు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి గెలుపొందినవారికి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత నాయకులు పైల బాబ్జితో పాటు రిటైర్డ్ హెచ్ ఎం పి.దాసునాయుడు మాస్టర్, శాఖా గ్రంథాలయాధికారి కాల్లరాజు, ప్రభుత్వ డిగ్రీకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కొంచాల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

  హెల్త్ అసిస్టెంట్‌ను పాతపట్నంలోనే ఉంచాలి
  పాతపట్నం, డిసెంబర్ 19: మండలం బైదులాపురం పి హెచ్‌సికి సంబంధించి పాతపట్నం, అత్యుతాపురం ఏరియా పరిథిలో గల హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణరావును పాతపట్నంలోనే విధులును కొనసాగింపజేయాలని పాతపట్నం ప్రజలు, ఆశావర్కర్స్ కోరారు. లక్ష్మణరావుకు ఒత్తిడి మేరకు కొరసవాడ గ్రామానికి విధులకు పంపించారని పాతపట్నంలో ఎక్కువ శాతం స్కూల్లు, హాస్టల్స్ ఉన్నాయని వీటి అవసరం నిమిత్తం పురుష హెల్త్ అసిస్టెంట్ అవసరమని వీరు తెలిపారు. ఆశావర్కర్స్ హిళలు కావడంతో ఇక్కడ మగ హెల్త్ అసిస్టెంట్ ఎంతో అవసరమని వీరు ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు సమస్యలను దృష్టిలోపెట్టుకొని పాతపట్నం విధులు నిర్వహించేలా చూడాలని కోరారు.
  ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
  పోలాకి, డిసెంబర్ 19: మండలం గుప్పిడిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిథిలో గల గ్రామాలలో పలకరింపు రెండవ విడత కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ బలగ మురళి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిహెచ్‌సి పరిథిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించారో లేదో తెల్సుకోవడం, టిబి లక్షణాలు తెలియజేయడం, స్వైన్‌ఫ్లూ లక్షణాలు వివరించి వాటన్నింటిని గుర్తించి వాటి పట్ల నివేదికలు తయారుచేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే చిన్నారిచూపు కార్యక్రమంలో భాగంగా పిహెచ్‌సి పరిథిలో గల స్కూల్స్ అన్నింటికి వెళ్లి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు, అందులో వచ్చిన లోపాలను గ్రహించి సంబంధిత కంటి వైద్యులు దగ్గరకు పంపించి మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఇది ఒక చక్కని అవకాశమని ఆయన అన్నారు. అలాగే తుఫాన్ ప్రభావం వలన ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా తక్షణమే నాకు గాని, సిబ్బందికి గాని తక్షణమే తెలియజేయాలని, అలా తెలియజేసినట్లయితే వెంటనే వైద్యసదుపాయం కల్పిస్తామన్నారు.

  శత శాతం చెత్తనుండి సంపద కేంద్రాలు పూర్తిచేయాలి
  * జెడ్పీ సిఈవో జి.నగేష్
  నరసన్నపేట, డిసెంబర్ 19: జిల్లాలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేస్తున్న చెత్తనుండి సంపద కేంద్రాలను తప్పనిసరిగా శతశాతం పూర్తయ్యే దిశగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా జెడ్పీ సి ఈవో జి.నగేష్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ పల్లె, గ్రామం పరిశుభ్రంగా ఉన్ననాడే ప్రతీ ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించగలుగాతమని వివరించారు. ఈ దిశగానే ప్రతీ పంచాయతీలో చెత్తనుండి సంపద కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన వాటి నిర్మాణాలు చేపడతున్నామని, అయితే వీటి నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మన జిల్లా 13వ స్థానంలో ఉందని, ఇది మనజిల్లాకు ఎంతో అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని స్పందించి ఈనెల 27వ తేదీలోగా శతశాతం పూర్తయ్యే దిశగా పనిచేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెత్తనుండి సంపద జిల్లా కో ఆర్డినేటర్ హేమసుందరరావు, డివిజనల్ పంచాయతీ అధికారి రామ్‌ప్రసాద్, పోలాకి, సారవకోట, జలుమూరు, నరసన్నపేట ఎంపీడీవోలు అలివేలుమంగమ్మ, జగదీశ్వరరావు, వాసుదేవరావు, విద్యాసాగర్, తహశీల్దార్‌లు మురళి కృష్ణ, ఈశ్వరమ్మ, ప్రవళ్లిక ప్రియ తదితరులు పాల్గొన్నారు.
  చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలు పంపిణీకి సిద్ధం
  నరసన్నపేట, డిసెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రేషన్ కార్డ్ వినియోగదారులకు ఉచితంగా అందజేస్తున్న చంద్రన్న కానుకలు పంపిణీ చేయుటకు సిద్ధం చేశారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ బలగ నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం ఎమ్ ఎల్ ఎస్ కేంద్రం వద్ద డీలర్లుకు ఈమేరకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం క్రిస్మస్, చంద్రన్న కానుకలతో పాటు రంజాన్ కానుకలను కూడా శక్తివంచన లేకుండా పంపిణీ చేస్తుందని ఆయన స్పఫ్టం చేశారు. ప్రతీ ఒక్క వినియోగదారునికి తప్పనిసరిగా సరుకులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పోలాకి, నరసన్నపేట మండలాలకు 45,341 మంది లబ్ధిదారులకు వీటిని అందజేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంపీటీసీ శకుంతల మాట్లాడుతూ ఒక సంచెతో పాటు కందిపప్పు అరకేజి, శనగపప్పు అరకేజి, బెల్లం అరకేజి, నెయ్యి 100గ్రాములు, అరలీటర్ నూనె, కేజీ అట్టాపిండిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జె.రామారావు, ఎంపీటీసీలు కృష్ణ, ఎన్.్భరతి, రెవెన్యూ అధికారులు సరోజిని, హైమవతి, డీలర్లు పాల్గొన్నారు.

  ఉపాధ్యాయుడు మృతి
  సారవకోట, డిసెంబర్ 19: మండలంలోని బురుజువాడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న చలపాక లక్ష్మీనారాయణ (53) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మెదడుకు సంబంధించిన వ్యాధికి గురై కొన్ని రోజులుగా బెంగుళూర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సల అనంతరం చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు అతని సోదరుడు సారవకోట మాజీ సర్పంచ్ చలపాక శ్రీనివాసరావు తెలిపారు. మృతునికి భార్య రోజారమణి, ఇద్దరు పిల్లలున్నారు. గురువారం సారవకోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి ఎమ్.విరమణ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుండి రావలసిన సహాయాన్ని తక్షణమే అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  శరవేగంతో ఆలయ పునఃనిర్మాణం
  సారవకోట, డిసెంబర్ 19: ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతున్న బుడితి గ్రామంలో పురాతనమైన రామలింగేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. బుడితి బస్టాండ్ వద్ద గల ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి ఆలయాన్ని ఆధునిక పద్ధతిలో పునఃనిర్మించవలసిన ఆవశ్యకతను స్థానికులు శాసనసభ్యుల దృష్టికి తెచ్చారు. దీనితో ఆలయాన్ని తొలుత దేవాదాయ పరిథిలోనికి బదలాయింపు చేసిన ఎమ్మెల్యే రమణమూర్తి ఆలయ పునఃనిర్మాణానికి రూ.40లక్షలును మంజూరు చేయించారు. కాకినాడకు చెందిన గుత్తేదారుడు పురాతన ఆలయాన్ని తొలగించి నూతన పద్ధతిలో వాస్తుమేరకు నిర్మాణం పనులను చేపట్టారు. శివరాత్రి నాటికి ఆలయ నిర్మాణపనులు పూర్తికావచ్చని భావిస్తున్నారు.

  అభివృద్ధిపథానికి కంప్యూటర్ ఎంతో అవసరం
  * జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి
  శ్రీకాకుళం (టౌన్), డిసెంబర్ 19: నేటి తరం అభివృద్ధి పథంలో పయనించాలంటే కంప్యూటర్ రంగం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అన్నారు. స్థానిక ఎల్‌ఐసి ఆఫీస్ వద్ద గల కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బుధవారం జస్ట్ 2కె18 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి కంప్యూటర్ విజ్ఞానం ఎంతో అవసరమని, ప్రతీ పరీక్షలోకూడా దాని ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, కంప్యూటర్ ఈవెంట్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ విభాగ అధిపతి ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, ప్రాంతీయ సంచాలకులు బి. ఎస్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ ఎ.చంద్రశేఖర్, సెక్రటరీ ఎన్‌కె దీపక్‌రెడ్డి, అకడమిక్ కో ఆర్డినేటర్ డిఈవిల్ నాయుడు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


  0 0

  పాలకొండ (టౌన్), డిసెంబర్ 19: పాలకొండ నుంచి వీరఘట్టం వెళ్లే రహదారిపై గజాలఖానా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామానికి చెందిన అంపావిల్లి ఉమ పట్నాయక్ (32) మృతి చెందారు. వీరఘట్టం వైపు నుంచి వస్తున్న చెరకు లారీ పాలకొండ నుంచి వీరఘట్టం ద్విచక్ర వాహనంపై వెళుతున్న పట్నాయక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఎస్ ఐ వాసు నారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
  రెండు ద్విచక్రవాహనాలు ఢీ
  * పలువురికి గాయాలు
  పోలాకి, డిసెంబర్ 19: మండలంలో గల బెలమర గ్రామ సమీపాన నరసన్నపేట నుండి బెలమరవైపు సుమారు రాత్రి 8గంటలకు జీరు తేజేశ్వరరావు, కొడుకు రాజేష్ వస్తుండగా బొడ్డాం గ్రామం నుండి ఎదురుగా వస్తున్న పిట్టా అప్పలనాయుడు, శ్రీను ద్విచక్రవాహనం పై వచ్చి నేరుగా తేజేశ్వరరావు ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా పలువురుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన అనంతరం 108 వాహనానికి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి గాయపడిన ఇరువురిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతం నరసన్నపేట నుండి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని స్తానిక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈయనతో పాటు సిబ్బంది రమేష్, రమణమూర్తి, పలువురు పాల్గొన్నారు.


  0 0

  కడప,డిసెంబర్ 19: మూలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ విద్యాప్రాజెక్టు కడప జిల్లాకు రావడం గర్వకారణమని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. బుధవారం సాయంత్రం కడప రిమ్స్ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.30కోట్ల బడ్జెట్ అంచనాతో చేపట్టిన వౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ క్యాంపస్ మొదటిదశ నిర్మాణం పనులు సంబంధిత డైరెక్టర్ కె.ఈశ్వరప్రసాద్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జి.ప్లస్ -3, పైన ప్లస్-2 షెడ్స్‌తో మొదటి దశ నిర్మాణం పనులు జరుగుతున్నాయని, మొదటిదశ నిర్మాణం పనులకు ప్రభుత్వం రూ.30కోట్లు నిధులు మంజూరు చేసిందని ‘మాను’ డైరెక్టర్ ఈశ్వరప్రసాద్ తెలిపారు. ఇది మొత్తం 18నెలల ప్రాజెక్టు అని 2020 నాటికి పూర్తిచేయాల్సివుందన్నారు. పాలిటెక్నికల్ కాలేజి భవన నిర్మాణం (జిప్లస్-3) ,వర్క్ షాప్స్ , అంతర్గత రోడ్ల నిర్మా ణం, సేవాలైన్, నీటి సరఫరా లైన్లు, భూగర్భసంపు, సెఫ్టిక్ ట్యాంక్, విద్యు త్ సౌకర్యం, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, స్ట్రీట్ లైటింగ్, వాటర్ డ్రైన్స్ తదితర సివిల్ నిర్మాణ పనులను మ్యాప్ ద్వారా డైరెక్టర్ ఈశ్వరప్రసాద్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంతపెద్ద విద్యాప్రాజెక్టు జిల్లాకు రావడం మైనార్టీలకు వరమని, జిల్లాకు గర్వకారణమన్నారు. నిర్మాణ పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదని సూచించారు. ఈప్రాజెక్టు పూర్తిచేసేందుకు కలెక్టర్‌గా తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని సూచించారు.


older | 1 | .... | 1968 | 1969 | (Page 1970) | 1971 | 1972 | .... | 2069 | newer