Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

హైకోర్టులో సజ్జన్‌కుమార్‌కు చుక్కెదురు

$
0
0

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోతలో జీవితఖైదు శిక్షపడిన కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. తాను లొంగిపోవటానికి నెలరోజులు గడువు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయన చూపిన కారణాల వల్ల గడువు పెంచాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.


అమెరికా రక్షణ మంత్రి రాజీనామా

$
0
0

వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ రాజీనామా చేశారు. సిరియాలో సైనిక బలగాలను అధ్యక్షుడు విరమించుకోవటంతో విభేదించిన మాటిస్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాటిస్ ట్రంప్‌కు డోర్ డెలీవరీ చేశారు.

ప్రసాదంలో పురుగులు మందు కలిపాం..

$
0
0

బెంగళూరు: కర్ణాటకలోని సులవడి గ్రామంలో ఉన్న మారెమ్మ ఆలయంలో ప్రసాదం తిని 15 మంది భక్తులు మృతిచెందిన విషయం విదితమే. ఈ కేసులో అరెస్టు అయిన ఆలయ పూజారి ఇమ్మడి మహాదేవ్ నేరాన్ని అంగీకరించారు. ప్రసాదంలో తామే పురుగుల మందు కలిపామని పోలీసుల విచారణలో వెల్లడించారు.

నిఘా సంస్థలకు మరిన్ని అధికారాలు

$
0
0

న్యూఢిల్లీ: సైబర్ నేరాలను అరికట్టేందుకు ఏ కంప్యూటర్‌లోని సమాచారాన్నైనా పరిశీలించేందుకు నిఘా సంస్థలకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్ నుంచి జనరేట్ అయ్యే సమాచారాన్ని ఎప్పుడంటే అప్పుడు పరిశీలించేందుకు పది దర్యాప్తు సంస్థలకు అధికారం ఇస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.

తిరుపతిలో ఎర్రచందనం స్వాధీనం

$
0
0

తిరుపతి: తిరుపతిలో టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ హౌసింగ్ కాలనీలో స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం అందటంతో తనిఖీలు నిర్వహించగా స్మగ్లర్లు పరారయ్యారు. ఘటన స్థలంలో ఎర్రచందనం దుంగలు, కారు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

షోహ్రబ్ ఎన్‌కౌంటర్ కేసులో 22మందికి ఊరట

$
0
0

ముంబయి: షోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో 22 మందికి ఊరట లభించింది. ఈ మేరకు ముంబయి స్పెషల్ సీబీఐ కోర్టు 22 మంది పోలీసు ఆఫీసర్లను నిర్దోషులుగా స్పష్టం చేసింది. పోలీసు అధికారులను నిందించటానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. షోహ్రాబ్ ఎన్‌కౌంటర్ 2005, నవంబర్ 25న జరిగింది. ఆరపణలు ఎదుర్కొంటున్న 22మందిలో రాజస్థాన్, గుజరాత్ జూనియర్ స్థాయ పోలీసులే ఉన్నారు.

అనూహ్య హత్య కేసు దోషికి ఉరిశిక్షే సరైంది..

$
0
0

ముంబయి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాను సనఫ్‌కు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది. దేశంలో పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నిందితుడికి విధించిన శిక్ష సరైందేనని హైకోర్టు పేర్కొంది. ఏపీలోని మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆ యువతి 2013లో క్రిస్మస్ సెలవుల తరువాత తిరిగి ముంబయి వెళ్లిటానికి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. స్టేషన్‌లో దిగిన ఆమెను దొంగతనం చేయటానికి వచ్చిన చంద్రభాను సనఫ్‌తో ట్యాక్సీ మాట్లాడుకుంది. ట్యాక్సీ పనిచేయటం లేదని ఆమెను బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆ తరువాత పెట్రోల్ పోసి హత్య చేశాడు. సీసీ కెమెరాల్లో ఈ దారుణ ఘటనలు బయటపడ్డాయి. సాక్ష్యాధారాలను బట్టి చంద్రభానుకు మహిళా న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. మరణ శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం కూడా కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.

27కి రాజ్యసభ వాయిదా

$
0
0

న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలకు విస్తత్ర అధికారాలు కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ గెజిట్ వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా ఉందని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ అని దీనిని మళ్లీ జారీ చేశామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. దేశ భద్రతపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని జైట్లీ అన్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకోవటంతో చైర్మన్ సభను 27వ తేదీకి వాయిదా వేశారు.


రాష్టప్రతికి ఘన స్వాగతం

$
0
0

హైదరాబాద్: శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రామనాథ్ కోవింద్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్టప్రతికి గవర్నర్ నరసింహాన్, సీఎం కేసీఆర్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈనెల 23న ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. 24 వరకు విడిది చేయనున్న రాష్టప్రతి దంపతులు అదేరోజు ఢిల్లీకి పయనమవుతారు. రాష్టప్రతి పర్యటన నేపథ్యంలో బొల్లారం రాష్టప్రతి నిలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

తీవ్ర నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

$
0
0

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల పాలయ్యాయి. ఒక్కసారిగి 689 పాయింట్లు నష్టపోయి రూ.2.26 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెనె్సక్స్ 35742.07 పాయింట్ల వద్ద ఉండగా, నిఫ్టీ 10754 పాయింట్లకు చేరుకుంది.

మహాభారతంలో ఉపాఖ్యానాలు-80

$
0
0

అప్పుడు అంబ ఇలా అంది ‘‘ప్రభూ! నేను శోకం అనే ఊబిలో కూరుకొనిపోయాను. నన్ను ఉద్ధరించు’’ అలా అని ఆమె జరిగినదంతా భార్గవరామునికి నివేదించింది. అప్పుడు అతను అంబతో ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నిన్ను భీష్ముని దగ్గరకు పంపుతాను. అతను నా మాట జవదాటడు. ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే యుద్ధంలో అతన్ని నా శస్త్రాలతో దహించివేస్తాను. అది నీకిష్టం లేకపోతే వీరుడైన సాళ్వుని ఈ పని చేయమంటాను.’’
అంబ ఇలా అంది - ‘‘్భగవాన్! నేను అంతా వివరంగా మీకు చెప్పాను. ఇప్పుడు ఏది యుక్తమో అది చేయండి. కాని నా ఈ దుఃఖానికి భీష్ముడే కారణం. ఎవరి వల్ల నేను ఇంత దుఃఖమనుభవిస్తున్నానో ఆ భీష్ముని చంపండి. ఆ భీష్ముడు నీచుడు, లోభి, జయకాంక్ష కలవాడు. అతడిని చంపితే నా కోరిక తీరుతుంది’’.
అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు. ‘‘రాజపుత్రీ! నేను వేదవేత్తలైన వారి గురించి తప్ప నేను శస్త్రం పట్టటానికి ఇష్టపడను. సాళ్వుడు, భీష్ముడు ఇద్దరూ నా మాట వింటారు. నేను నీ పని చేస్తాను. నువ్వు దుఃఖించకు’’.
అంబ మళ్లీ ఇలా అంది ‘‘ప్రభూ! మీరు నా దుఃఖాన్ని పోగొట్టాలి. అది కూడా భీష్ముని వల్లనే కలిగింది. భీష్ముడిని యుద్ధానికి పిలిచి చంపు. నీవు ప్రతిజ్ఞ నిలబెట్టుకో’’.
ఈ సంభాషణ విన్న ఆకృతవ్రణుడు ఇలా అన్నాడు. ‘‘రామా! నీ శరణుకోరిన ఈ కన్యను విడిచి పెట్టరాదు. అతను నీతో యుద్ధం చేసే సమయంలో భీష్ముడు నీ చేతిలో ఓడిపోవాలి లేదా నీ మాట పాటించాలి. అప్పుడే ఈ అమ్మాయి కోరిక నెరవేరుతుంది. నీ మాట కూడా నిలబడుతుంది. నీవు చేసిన ప్రతిజ్ఞ ఇది - భయంతో శరణుకోరి వచ్చిన శరణార్థులను వదిలి వేయను. భీష్ముడు అందరి క్షత్రియు లను జయించి ఉన్నాడు. కనుక అతని తో యుద్ధం చేసి జయించు’’.
దానికి పరశురాముడు ఇలా అన్నాడు. ‘‘ఈ కార్యం నేను సామోపాయం చేతనే జరిగేలా చూస్తాను. ఈ కన్య మనసులో కోరుకున్న పని చాలా గొప్పది. నేను ఈమెను తీసుకొని స్వయంగా భీష్ముని దగ్గరకు వెళతాను. భీష్ముడు నా మాటను పాటించకపోతే అప్పుడు యుద్ధం చేస్తాను’’ ఇలా అని తరువాత పరశురాముడు ఆ బ్రహ్మజ్ఞానులందరితో కలిసి అంబను వెంటపెట్టుకొని కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఆ ఋషులం దరూ పరశురామునితో సహా సరస్వతీ నదీతీరంలో విడిది చేశారు.
తర్వాత మూడోరోజున పరశురాముడు హస్తినాపురం బయట నిలబడి భీష్మునికి ఇలా సందేశం పంపాడు. ‘‘రాజా! నేను వచ్చాను. నాకు ప్రియమైనది చేయి’’.
తన గురువు అయిన భార్గవరాముడు రాజ్యం పొలిమేరలోకి వచ్చాడని తెలిసి భీష్ముడు ఆనందంగా అతన్ని కలియడానికి వెళ్ళాడు. పండితులతో గోవులతో పురోహితులతో కలిసి వెళ్ళి గురువును సత్కరించాడు. రాముడు అతని సత్కారాన్ని స్వీకరించి భీష్మునితో ఇలా అన్నాడు.
‘‘కాశీరాజు కూతురు అంబను వివాహం చేసుకోవాలనే కోరిక లేకపోతే ఎందుకు తీసుకొని వచ్చావు? మళ్ళీ ఆమెను ఎందుకు వదలిపెట్టావు? నీ వల్ల ఈమె ధర్మభ్రష్టురాలైంది. కనుక నా ఆజ్ఞ మేరకు ఈమెను వివాహం చేసుకో. ఈమెను ఇలా అవమానపరచడం నీకు తగదు’’.
అప్పుడు భీష్ముడిలా అన్నాడు - ‘‘బ్రహ్మర్షీ! నేను నా తమ్మునికిచ్చి ఈమెకు వివాహం చేయలేను. ఆమె పూర్వమే తాను సాళ్వునికి చెందానని చెప్పింది. నేను సరేనని ఆమెను సాళ్వుని దగ్గరకు పంపాను. భయం చేత కాని, ఇష్టం వలన కాని, దయచేత కాని, ధనలోభం చేత కాని నేను నా క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టను అని వ్రతం పూనాను’’.
భీష్ముని మాటలతో ఆగ్రహం చెంది భార్గవరాముడు ఇలా అన్నాడు - ‘‘్భష్మా! నా మాటను వినకపోతే నిన్ను ఇప్పుడే చంపగలను’’.
భీష్ముడు తన గురువుని అనునయ వాక్యాలతో శాంతపరిచాడు. కాని అతని ఆగ్రహం చల్లారలేదు. భీష్ముడు మరల ఇలా అన్నాడు - ‘‘మీరు నాతో యుద్ధం చేయడానికి ఎందుకు సంకల్పించారు? నాకు చతుర్వేద శాస్తమ్రులు మీరే ఉపదేశించారు కదా! నేను మీ శిష్యుడిని.’’
దానికి భార్గవరాముడు ఇలా అన్నాడు - ‘‘మూర్ఖుడా! నీవు నన్ను గురువుగా గుర్తిస్తున్నావు. కాని నా ఆదేశాన్ని పాటించడం లేదు. నేను చెప్పినట్లు కాశీరాజు కూతుర్ని స్వీకరించడం లేదు. ఈమెను స్వీకరించి నీ వంశాన్ని రక్షించుకో. ఈమె నీ వల్ల భ్రష్టు రాలైది. భర్తను పొందలేకపోతోంది’’.
భీష్ముడు దానికి ఇలా సమాధానం చెప్పాడు - ‘‘బ్రహ్మర్షీ! అది జరిగే పని కాదు. నాకు ఆజన్మ బ్రహ్మచర్యవ్రతం ఉంది. అదీ గాక పరపురుషునియందు ప్రేమ కలిగిన స్ర్తీని తెలిసి తెలిసి ఎవరు ఇంటిలో ఉంచుకుం టారు? నేను నా ధర్మాన్ని విడిచిపెట్టను. కార్యాకార్యాలు తెలియక చెడుమార్గంలో నడుస్తున్న అహంకారపూరితమైనవాడు గురువు అయినా విడిచిపెట్టాలి. నేను నిన్ను గురువని గౌరవించాను. కాని నీవు గురు ధర్మాన్ని తెలుసుకోలేకపోయావు. కనుక నీతో యుద్ధం చేస్తాను. నిన్ను యుద్ధంలో చంపను. నీవు గురువువు, పైగా బ్రాహ్మణుడివి, మహాతపస్వివి. బ్రాహ్మణోత్తమా! నేను క్షత్రియుడిని. రామా! నీవు న్యాయాన్ని అతిక్రమిస్తున్నావు కనుక నీతో యుద్ధం చేయడం తప్పు కాదు. మనం కురుక్షేత్రంలో యుద్ధం చేద్దాము. అనేక సభలలో ఒక్కడినే క్షత్రియుల దర్పం అణిచాను అని చెప్పుకుం టున్నావు. అప్పుడు ఈ భీష్ముడు పుట్టలేదు. నీవు గడ్డిపరకలలాంటి రాజులతో యుద్ధం చేశావు. ఇప్పుడు నీ దర్పాన్ని యుద్ధంలో నాశనం చేస్తాను’’.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-175

$
0
0

పశుజాతికి భిన్నంగా తనకు మరియు తమ జాతి అభ్యున్నతికై ఎప్పుడూ విచారణచేస్తూ ఆ ప్రయత్నాలలో నిమగ్నమై యుంటారు. కేవలం ప్రస్తుత జన్మలోనే కాదు భవిష్యజ్జన్మలలో కూడ సుఖజీవనంకోసం ప్రయత్నాలను ఈ జన్మలోనే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పుత్ర, మిత్ర, కళత్రాదులు, బంధువులు, ఐశ్వర్యం, ధనధాన్యాలు, గృహావాసాలు ఇలాంటి వెనె్నన్నో మానవ జీవితానికి సుఖకారకాలే అయినా మానవుడు వీనినన్నింటినీ పొంది కూడ సుఖ సంతోషాలను పొందడం లేదు. పొందినా తాననుకొన్నంత సుఖసంతోషాలను పొందలేకపోవడం కూడ ఉంది. ఆ కారణంగా వ్యాకులచిత్తుడై ఏదో ఒక వాస్తవిక సుఖముందని తలంచి దానికోసం తహతహలాడుతూ అనే్వషిస్తూ ఉన్నాడు. ఆ అనే్వషణలో విచార తత్పరుడికి ‘వి యస్తస్తంభ రోదసీ చిదుర్వీ ప్ర నాకమృష్వం నునుదే బృహంతమ్’ (ఋ.7-86-1) ‘విశాలమైన ఈ ద్యావాపృథువులను స్తంభంవలె ఆధారం చేసికొన్నవానికి ఆ మహాసుఖాన్ని అవే కల్పిస్తాయి’అన్న సంగతి బోధపడుతుందని ఋగ్వేదం స్పష్టంచేసింది.ద్యానాపృథువులే ఆ సుఖాన్ని కల్పిస్తాయంటే ఆ రెండింటిమధ్య జీవించే కాలంలోనే అనగా వర్తమాన జన్మలోనే ఆ సుఖం ప్రాప్తమవుతుందని భావం.
ఈ చర్చనుబట్టి మనిషిలో ఉండే ప్రత్యేకమైన జ్ఞానమే అనే్వషించేవానికి సుఖకారణమవుతుంది. కాబట్టి సుఖాభిలాషి అట్టి జ్ఞానార్జనకొఱకు ‘ఇహ త్వా భూర్యా చరేదుప త్మన్’ ‘ఈ జన్మలోనే మానవుడు సర్వాత్మనా ఓ దేవా! నినే్న ఆరాధించాలి’అని వేదం పేర్కొంటూంది. ఈ ఆరాధన రేపటికి వాయిదావేసేదికాదు. ఏమో!! రేపటికి వాయిదావేస్తే ఈలోగా మృత్యువే రావచ్చునేమో. జీవిత పర్యంతమూ భగవదారాధనకే ప్రాముఖ్యమీయాలి.
ఇంకావుంది...

బలవంతుడైన దేవుడు

$
0
0

‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతని పేరు’
-యెషయా 9:6
‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికిదే మీకానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టెలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను’
-లూకా 2:11-12
ఈయన బాలుడుగా వచ్చాడేగాని బలవంతుడు సుమా! ఆ ప్రాంతములో గొల్లలు పస్కాను ఆచరించటానికి బలి ఇచ్చే గొర్రెలను పెంచి సిద్ధపరచేవారు. పొత్తిగుడ్డలతో చుట్టబడి యుండుట పస్కా ఆచరించటానికి సిద్ధపరచిన గొర్రెపిల్లను సూచిస్తుంది. యోహాను భక్తుడు చెప్పినట్లు, ‘ఇదిగో లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల’ ఈ బాలుడే ఆ గొర్రెపిల్ల. బాలుడేగాని లోక పాపములన్నిటిని మోసుకుపోవటానికి వచ్చిన బలవంతుడు.
ప్రాణాలు తీయటం బలముకాదు. పాపాలు కడిగి ప్రాణాలు పోయటం నిజమైన బలము. లోకాన్ని బ్రతికించటానికి ప్రాణాలిచ్చి, మరణపు ముల్లు నించి మృత్యుంజయుడై తిరిగి లేచిన బలవంతుడు యేసు ప్రభువు. దౌర్జన్యం చేశారు. వధించారు. అయినా నోరు తెరువక వధకు తేబడిన గొర్రెవలె వౌనముగా ఉండిన బలవంతుడు.
ఆయన చిందించిన అమూల్యమైన రక్తముచేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముచేత లోకానికి పాప విమోచనము కలిగింది. నీతి విషయమై మనము జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన అందరి పాపములను సిలువ మీద మోసెను. ఈ సంగతి నమ్మిన వారి పాపాలు కొట్టివేయబడతాయన్నదే శుభవార్త. ఆయన పొందిన గాయములచేత మనకు స్వస్థత కలుగుతుంది.
ఆకాశ మహాకాశములు పట్టజాలనివాడై యుండి పసిబాలునిగా మనుష్య కుమారునిగా తగ్గించుకోవటం. శిష్యుల పాదాలు కడిగేటంతగా తగ్గించుకోవటం ఆయన మహాబలము.
ఒక్కమాటలో సర్వాన్ని సృష్టించిన దేవుడు - చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు దెయ్యాలను వెళ్లగొట్టిన ప్రభువు రోగాలను బాగుచేసే బలవంతుడు. ఆశీర్వదించి అభివృద్ధి చేసి రక్షించి భద్రపరచే దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టటానికి, కొరడా దెబ్బలు తినటానికి, చేతులలో కాళ్లలో మేకులు కొట్టించుకోవటానికి తలకు ముళ్ల కిరీటం పెట్టించుకోవటానికి రక్తము చిందించటానికి ధైర్యముతో సిలువకెక్కిన బలవంతుడు. మొదటి ఆదాము నుండి రాబోయే తరాల వారి పాపాలన్నీ భరించి వాటిని సిలువలో ఆయన శరీరమందు కొట్టివేసి లోకానికి విముక్తిని ఇచ్చిన బలవంతుడే ఈ పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెల పరుండియున్న బలవంతుడైన దేవుడు.
‘రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అని ఎన్నో వందల సంవత్సరాల ముందు ప్రవచించారు. రెండువేల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం నెరవేరింది. రక్షకుడు అంటే తెలివిగలవాడు బలముగలవాడు జ్ఞానము గలవాడు అన్ని విషయాలు తెలిసినవాడై ఉండాలి. మానవ లోకమంతా సాతానుని చేతిలో బందీలై యున్నారు. ఏదో ఒక పాపము చేసి సాతాను బంధకాలలో జీవిస్తున్నారు. పాపము చేస్తున్న సంగతి తెలిసినా బయటపడే మార్గము లేక సర్దుకుపోతున్నాడు. తినగ తినగ చేదు కూడా తీపిగా ఉన్నట్టు పాపాలకు అలవాటై పోయారు. ఇంకా కొంతమంది తప్పుల నుండి అప్పుల నుండి బయటపడాలని నీతిగా న్యాయంగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారు. ఈ అంధకార జీవితాల నుండి బయటకు రావాలని ఉంది. క్రీస్తు వెలుగై యున్నాడు. లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచు లోకములో ఉన్న చీకటిని పారద్రోలేటంత బలవంతుడే ఈ బాలుడుగా జన్మించిన క్రీస్తు.
తన బలము వలన ఆయన సముద్రమును రేపును. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తిచేత పర్వతములను సిద్ధపరచువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. విస్తార జలముల ఘోష కంటెను బలమైన తరంగముల కంటెను ఆకాశము నందు యెహోవా బలిష్టుడు. దీర్ఘశాంతుడు మహాబలము కలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గర్జించి ఆరిపోజేయును. నదులన్నిటిని ఎండిపోచేయును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన కోపము అగ్నివలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. అగ్నిగుండముల నుండి తప్పించగలడు. సింహపు నోళ్లు మూయించగలడు. ఆకాశమును మూసివేసి వానలు పడకుండా చేయగలడు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశ మండలములో పుట్టును. భూమ్యాంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా మెరుపులు పుట్టించును. మహత్యమును ప్రభావమును ధరించినవాడు. వస్తమ్రువలె వెలుగును కప్పుకొన్నవాడు. తెరను పరచినట్లు ఆకాశ విశాలమును పరచినవాడు. సముద్రములో త్రోవ కలుగజేయువాడు. వడిగల జలములలో మార్గము కలుగజేయువాడు.
ఆకాశములో తనకై మేడ గదులు కట్టుకొనువాడు. ఆకాశ మండలమునకు భూమిపై పునాదులు వేసిన వాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడు. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు. మేఘము వస్తమ్రుగాను గాడాంధకారమును పొత్తిగుడ్డగా చుట్టిన దేవుని బలము ఎంతైనది మనకు అంతుపట్టదు. శూన్యముపైకి ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యములో భూమిని వ్రేలాడచేసిన శక్తిమంతుడు. మేఘములు చినిగి పోకుండా, మేఘములలో నీటిని దాచెను. ఆయన తన బలముచేత బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు. తన బలము వలన ఆయన సముద్రమును రేపును. అధికారమును భీకరత్వమును ఆయనకి తోడైయున్నవి. ఆయన బలమును ఎరిగిన దావీదు మహారాజు వ్రాసిన 14వ అధ్యాయములో, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా శృంగము నా ఉన్నత దుర్గము మరణపు ఉరుల నుండి తప్పించే బలమైన దేవుడని.
ఈయన బలమెరిగి.. ఈ మహాబలవంతుడైన దేవుని ఆశ్రయిస్తే, ఆయన చాటుకు వస్తే వేటకాని ఉరిలో నుండి విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా కాపాడతాడు. తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకు యుందువు. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్క పది వేల మంది కృంగినను అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకాజ్ఞాపించును.
బలవంతుడైన ఈ దేవుని ప్రేమించి ఆయనను ఎరిగి, ఆశ్రయించిన వారిని ఘనపరచును. తోడై ఉంటాడు. శ్రమ నుండి తప్పిస్తాడు గొప్ప చేస్తాడు దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. రక్షణ ఇస్తాడు. శ్రీరక్షకుండు జన్మించిన ఈ దినాలలో బలవంతుడు రక్షకుడునైన యేసుక్రీస్తును చేరి పూజించి సాగిలపడి కానుకలిచ్చి, ఆయన బలమైన ఆశీర్వాదము పొందుకునే భాగ్యము పరిశుద్ధాత్ముని ద్వారా మనకందరికి కలుగును గాక. ఆమేన్

సుందరకాండ

$
0
0

నాయనా! చాలా దుష్కరమైన కర్మను చేస్తున్నావు కాస్సేపు నా శృంగములయందు యధా సుఖంగా విశ్రమించు. శ్రీరాముని కుల మందు పుట్టిన వారిచేతనే ఈ సాగరుడు వృద్ధిలోనికి వచ్చేడు. అందువలన రామ కార్యార్థం వెడుతూన్న నిన్ను సాగరుడు అర్చించుకొనాలని అనుకొన్నాడు. అందుకని నన్ను పంపేడు. కాని - నేను కేవలం సాగరుడు పంపటంవలన మాత్రం రాలేదు.
అస్మాక మపి సంబంధః కపి ముఖ్య త్వయాస్తివై
నాకు కూడా నీతో సంబంధముంది. అందుకని వచ్చేను. ఏమిటా సంబంధం?
ఇంద్రుడు పర్వత పక్షచ్ఛేదం చేస్తున్నాడు. నీ తండ్రి నన్ను కరుణించి ఈ సముద్రంలోకి తోసి దాచేడు. అందువలన సుఖంగా ఉన్నాను.
నాకు ఉపకారం చేసిన వాయువు యొక్క పుత్రుడవు నువ్వు. అందుకుని నీ యందు నాకు కృతజ్ఞతా భావం.
తతో‚హం మానయామిత్వాం మాన్యోహి మమ మారుతః
స్వామి సంతోషించేడు. మైనాక అతిథ్యాన్ని స్పృశించేడు. స్వీకరించలేదు. తన వేగాన్ని సవరింపనూ లేదు. అలాగని స్నేహాన్ని వదలి పెట్టలేదు.
ప్రీతో‚స్మి కృత మాతిధ్యం మన్యురేషో‚పనీయతాం
త్వరతే కార్యకాలోమే అహశ్ఛాప్యతివర్తతే
ప్రతిజ్ఞాచమయాదత్తా సస్థాతవ్యమిహంతరే.
సంతోషించేను. నీ ఆతిథ్యం అందింది. కోపగించుకొనకు. పనితొందర సమయమూ తొందరిస్తోంది. సాయం కాలమవుతోంది. మధ్యలో ఆగనని మాటిచ్చేను. ఇదే మాటాడే సొగసు. ఎంత అందమైన మాట ఋషి భాష ఇంత మృదువుగా ఉంటుంది. ఆగలేదు. స్నేహాన్ని పోగొట్టుకొనలేదు.

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

ఔదార్యమాతని జీవన సౌరభమైనచో, సరళతయే యందలి చక్కదనము, పసిబాలుని నమ్మికను బోలు నమ్మిక గలిగి సత్యమును బ్రహ్మచర్యమును బరిపాలించుటయే సాక్షాత్కారమునకు నిశ్చితమార్గమని- వినిర్మల హృదయముననే భగవానుడు విస్పష్టముగా గోచరించునని- శిష్యుల కాతడు ప్రకటించును. ఏ రూపమున నొనర్చినను మనఃపూర్వకమగు ప్రార్థనము జపమును ధ్యానమును భగవంతుని వశమొనర్చు కొన గలవని యాతడు వక్కాణించును.
శ్రీరామకృష్ణుని బోధన నవరస భరితము. నవ్వుచు, పరిహసించుచునే అతి గభీర విషయములను- ఆధ్యాత్మిక విషయములను- ఆతడతి విచిత్రముగా బోధించును. అతని సంభాషణము లొకప్పుడు కడుపు చెక్కలగునట్లు నవ్వించును, మఱియొకప్పుడు శ్వాసలుకట్టువడ నిశే్చష్టులనొనర్చును; ఇంతలో అఖండావేశము గలిగించును; అంతలో అపూర్వ చిత్తశాంతిని జేకూర్చును. భక్తి పరవశుడై యాతడొక కీర్తనమును బాడి జగజ్జనని నామము నుచ్చరించుచు నృత్యము చేయును. పిమ్మట ప్రాయికముగా భగవానుని సగుణనిర్గుణ స్వరూప సమన్వయమువంటి వేదాంత రహస్యములను గూర్చి సహజ సరళరీతి నత్యద్భుతముగా బోధించును. అమాయకుడగు యోగీంద్రున కాత డెట్లు బేరమాడ వలయునో తెల్పెను; నిరంజనుని దుడుకుతనమును నిరసించి నిరోధించెను; స్ర్తిల యెడ ద్వేషభావము జూపుచుండిన హరికి వారియెడ పూజ్యభావము నలవరుచుకొనుమని బోధించెను; ఏకపుత్త్రుని గోల్పోయి కుందుచుండిన మణిమల్లికు నోదారెచ్చను; ఆలుబిడ్డల నలక్ష్యముచేయుచుండిన యొకని చీవాట్లు పెట్టెను. భక్తిగానిండు, వేదాంతముగానిండు, లోకవర్తనము గానిండు- దేనిని గూర్చి బోధించినను, అతని బోధనలు హాస్య చమత్కారములతో, మనోహర దృష్టాంతములతో నీతి కథారత్నములతో, వంగీయ గ్రామ్యసంభాషణ శైలిలో మృదుమధుర స్వరమున ప్రాణప్రదీప్తములై యలరారుచుండెడివి. ఈ సంభాషణముల నడుమ నాతడు భక్తి పరవశుడై మహోత్తమ సమాధిస్థితులను బొందుతుంచుట జూచి జనులబ్బురపడుచుండెడివారు.
ఇట్లు తరచు సమాధినిమగ్నుడయ్యు, (సదా) భగవదేకార్పితచిత్తుడయ్యు, నిత్యకృత్యములతో అల్ప విషయములందు సైతమాతడు జూపు శ్రద్ధయత్యద్భుతము. శౌచమునందేమి, గృహోపకరణములను యథాక్రమమున నుంచుట యందేమి యాత డతిజాగరూకుడు. చినిగిన గుడ్డలతోడను తెగిన చెప్పులతోడను జనులు సంచరించుటనిన, అతనికి రోత. తానెచ్చటికి వెడలినను, తన కుపయుక్తమగు వస్తువులను గైకొని మరీ వెడలను. మరియు తమ్ము పిలిచినవారికిబ్బంది కలుగురీతినగాని, అట్టి సమయమునగాని యెన్నడును వెడలవలదని శిష్యులకుద్బోధించును. జోడుకాని, గొడుగు గాని, అంగవస్తమ్రు కాని జీవితమునాతడెన్నడును నెచ్చటను మఱచివచ్చి యెఱుగడు. అతని కన్ను సూక్ష్మదర్శిని, మరియు దూరదర్శిని. అతడొక భవనమున బ్రవేశిచినచో, అందలి వస్తువులను-ఇతరులు గమనింపని వానిని సైతము- ఒక్కుమ్మడి కటావీక్షణముననే పరిశీలించి వాని నిజరూపస్థితులను ఎంతకాలమునకు బిమ్మటనైనను అచ్చముగా కంటికి గట్టినట్లు వర్ణింపగలుగువాడు.
సద్గురువరేణ్యుడడు శ్రీరామకృష్ణు డీరీతిని మహోత్త మాదర్శమును దన జీవితమున లోకమునకు బ్రకటించుచు, తన బోధామృతమును గ్రోలు తమకమున దన్ను సందర్శించు ముముక్షుకోటికి నిద్రాహారములను మరచి బోధింపసాగెను. విశ్రాంతి నెరుగని ఇట్టి ప్రబోధపరంపరచే నాతని సుకుమార శరీరము సడలిపోసాగెను-అతని కంఠములో (1885వ సంవత్సరమున) వ్రణము బయలుదేరెను. భక్తులాతని కలకత్తా నగరమునకు దీసికొని వెడలి సుప్రసిద్ధుడగు మహేంద్రలాల్ సర్కారుచే చికిత్స చేయింపసాగిరి. కాని వ్యాధి నానాటికి ప్రబలమగుచుండెను. అగ్గి కప్పురమును హరించునట్లు ఆ ఘోరవ్యాధి యాతని జీవితమును హరింపసాగెను. కాని యాతని బ్రహ్మానందమునకుగాని, నిరంతర బ్రహ్మానుభూతికిగాని అణుమాత్రమును లోపము కలుగకుండెను.
శ్రీరామకృష్ణుని యుపదేశ సుధ లోకమున కవిచ్ఛిన్నముగా లభించిన దీసమయముననే.
ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి


అనంతం-16

$
0
0

‘‘అటు సూడు’’ అన్నాడు.
యాదయ్య తలెత్తి అటువైపు చూశాడు.
అక్కడ, వాల్యా, చాంద్‌నీ పొదల్లో దాగుడుమూతలు ఆడుతున్నారు.
ఇంకొంచెం ముందుకు వెళ్లారు.
ఇపుడు చాంద్‌నీ స్పష్టంగా కనిపిస్తున్నది!
రాగ్యా నరాలు జివ్వున లాగాయి!
ఇనుమడించిన అందంతో చాంద్‌నీ మరింత అందంగా వుంది. నపు వెల్తరు వలయం ఆమె చుట్టూ ప్రకాశిస్తున్నది!
అడవి పూల సుగంధమో, మేని పరిమళమో గాలి తరంగాల వెంట తేలివస్తూ ఆహ్లాదంగా వుంది.
రాగ్యా యాదయ్యను అక్కడే ఆపి, ఒక్కడే చాంద్‌నీ దగ్గరికి వెళ్ళాడు.
‘‘ఇయ్యాళింకా సక్కంగుండావు. ఒకపాలి..’’ అంటూ వంకరగా నవ్వుతూ అర్థోక్తిగా ఆపాడు.
‘‘ఏటొకపాలి?’’ అడిగింది చాంద్‌నీ.
తడుముకున్నాడు. సమాధానం లేదు.
‘‘సెప్పవేటి?’’
బేలగా చూస్తూ నిల్చున్నాడు రాగ్యా.
‘‘ఒకపాలి సెంబుతో గొట్టిందిసాల్లేదురా నీకు! ఒక్కపాలి అని మళ్లా అడిగినావంటే సీపుర్తో గొడతాను. జాగరాత’’ అని రాగ్యా మొహమీదే కాండ్రించి ఉమ్మేసింది చాంద్‌నీ.
వాల్యా చెయ్యి అందుకొని గుడిసెల వైపునకు వెళ్లిపోయింది.
యాదయ్యకు అంతా అయోమయంగా వుంది.
ప్రశ్నార్థకంగా రాగ్యా వైపు చూస్తూ-
‘‘ఎవ్వరా అమ్మాయి? నిన్ను చెంబుతో కొట్టిందా?’’ అని అడిగాడు.
‘‘సెంబూ లేదు గింబూ లేదు. శాందినీ అంటార్దాన్ని’’ అని పేలవంగా నవ్వాడు రాగ్యా.
‘‘నీ వాలకం చూస్తే కొట్టినట్టే వుంది’’
‘‘సెప్పుతో గొట్టినా, సెంబుతో గొట్టినా..చివరాకరికైనా ఒక్కపాలి తొంగుంటే సాలు దాన్తో! దీని యిసయవ్ గరుడాచలం సార్తో జెప్పాలి.’’
‘‘ఏమని చెప్తావ్?’’ యాదయ్య అడిగాడు.
‘‘ఈ పిట్టమీద పరిశోధన సెయ్యవని’’
‘‘అంత తీరికా సారుకు’’
‘‘నాకోసరవ్ సారేమైనా శాత్తాడు’’ అన్నాడు రాగ్యా.
గుడారాల దగ్గరికి చేరారు.
వాతావరణం చూసి రాగ్యా భయపడ్డాడు!
డేగ కళ్ళతో చూస్తున్న సాయుధ పోలీసులు- సూటు బూట్లలో హుందాగా, హడావుడిగా తిరుగుతున్న అధికారులూ...
‘‘సారు యాడుండాడు?’’ అని రాగ్యా అడిగాడు.
‘‘అదే, గరుడాచలంసారు గుడారం.. లోపలికి వెళ్ళు’’ అని చూపుడు వ్రేలుతో గుడారాన్ని చూపించాడు యాదయ్య.
కాపలా పోలీసు సిబ్బంది రాగ్యాను అడ్డుకోలేదు. ఎలాంటి ప్రశ్నలూ వెయ్యలేదు. యాదయ్య సైగలతో అతన్ని లోపలికి అనుమతించారు.
రాగ్యా ఎందుకో కొంచెం జంకుతూనే వెళ్లాడు.
ఒంటరిగా కూర్చొని మందు తాగుతూ ఏదో ఆలోచిస్తున్న గురుడాచలం తలెత్తి రాగ్యాని చూశాడు.
‘‘అక్కడే ఆగావేం! వచ్చి కూర్చో’’ అన్నాడు నవ్వుతూ.
సంకోచిస్తూ నిలబడే ఉన్నాడు రాగ్యా.
‘‘ఎందుకు భయపడుతున్నావు?’’
రాగ్యా వౌనంగా నిల్చున్నాడు. సమాధానం లేదు.
గ్లాసులో వున్న మందంతా ఒకేవిడత తాగాడు గరుడాచలం.
నిషా తలకెక్కి తాత్త్వికత మొలకెత్తిందేమో!
‘‘రాగ్యా! సృష్టి విచిత్రమైంది కదూ! ‘నేను’ అంటే ఎవరు? ‘నువ్వు’ అంటే ఎవరు?’’
‘‘మీరు గరుడాశలవ్ సారు.. నేను రాగ్యాగాడ్ని’’ అని మధ్యలోనే చెప్పాడు రాగ్యా.
గరుడాచలం మూడ్ పాడైంది!,
రాగ్యా అడ్డు తగలకపోతే, నిర్నిరోధంగా తత్త్వం బోధించి ఆ అజ్ఞానిని జ్ఞానిగా మార్చేవాడే!
సదవకాశం కోల్పోయినందుకు సానుభూతిగా రాగ్యా వైపు చూస్తూ,
‘‘మందు తాగుతావా’’ అని అడిగాడు గరుడాచలం.
వౌనంగా తల వూపాడు రాగ్యా.
తన గ్లాసు, మరో గ్లాసు-రెండు గ్లాసుల్లో మందు పోసి ‘కానివ్వు’ అన్నాడు.
రాగ్యా నిలబడే మందంతా తాగాడు.
‘కూర్చో’ అన్నాడు గరుడాచలం.
ఖాళీ గ్లాసును చూస్తూ నిల్చునే ఉన్నాడు రాగ్యా.
‘కూర్చో’ అని మళ్లీ అన్నాడు.
‘‘తవరి ముందు కూకోటవా.. తప్పు’’ అని, రాగ్యా టీపాయ్‌మీది సీసా అందుకున్నాడు. గ్లాసులో మందు వొంపుకున్నాడు.
గరుడాచలం ఇంకా గ్లాసు ఖాళీ చెయ్యలేదు.
రాగ్యా ఆ గ్లాసు కూడా పూర్తిచేశాడు!
ఖాళీ గ్లాసు టీపాయ్‌మీద పెట్టి, తల గుడ్డ తీసి భుజమీద వేసుకున్నాడు. కొంచెం తూల్తూ-
‘‘తవర్తో సగవాసవ్ యనక జల్మ పునె్నం’’ అంటూ గరుడాచలానికి ఎదరగా వున్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు.
గ్లాసులోకి మందు వొంపుకున్నాడు.
గరుడాచలం అదేమీ పట్టించుకోలేదు. రాగ్యావైపు తాత్త్వికంగా చూస్తూ-
‘‘అనంత విశ్వంలో మనం నలుసులకన్నా తక్కువ! పెద్ద చిన్న అన్నది మనుషుల మధ్య అంతరాలు సృష్టించేందుకు మనసు చేసే మాయాజాలం.. అంతే కదూ!’’ అని అడిగాడు.
‘‘గళాసులో మందు ఆ మోపునే వుంది’’ అని
గరుడాచలానికి గుర్తుచేశాడు రాగ్యా.
‘‘తల్లిగర్భంలో వున్నపుడు తెలియని అంతరాలు పుట్టి పెరిగాకనే తెలుస్తున్నాయంటే, అవ్వన్నీ కల్పితాలు కదూ’’ అని గ్లాసు ఖాళీచేశాడు గరుడాచలం.
‘‘తల్లి కడుపులో వుండప్పుడేటి తెలుసుద్దేటి’’ అని, రాగ్యా ఎంతో చనువుగా రెండు గ్లాసుల్లోకి తనే మందు వొంపాడు.
‘‘తండా సంగతులేమిటి?’’ గురుడాచలం అడిగాడు.
‘‘ఏటుంటయ్యి సారూ.. మావూలే’’
‘‘నాకోసం నువ్వొక సహాయం చెయ్యాలి’’.
‘‘నిప్పుల్లో దూకేనా సారూ’’
‘‘నాకేమిటి లాభం’’
‘‘ఏం గావాల్నేటీ..’’
(ఇంకా ఉంది)

గురుశ్రేష్ఠుడు దత్తాత్రేయుడు

$
0
0

వేదకాలంలో ఇంద్రాది దేవతల ప్రాముఖ్యం అధికం. పురాణకాలమందు మూర్తిత్రయం ఏర్పడినది. బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురు మూర్తులు భిన్నులు కారని, ఒక్కరేయని, దేవుడు ఒక్కడే అనే వేద ప్రమాణమును అన్వయించేందుకే దత్తాత్రేయ ఉద్భవ సందర్భం కలిగింది.
అలాగే పాతివ్రత్య మహాత్మ్యం చేత సాక్షాత్ దేవదేవులనైనా, తారుమారు చేయవచ్చునని బోధించడం కూడా త్రైమూర్త్య స్వరూప ఆవిర్భావ ఉద్దేశితం. భూలోకంలో పేరుమోసిన స్ర్తిరత్నమైన అనసూయ పాతివ్రత్యం గురించి, పరీక్షించేందుకు భార్యల ఆలోచనల ఫలితంగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలతో అత్రి మహాముని ఆశ్రమానికి రాగా, తమకు ఆకలిగా ఉందని, విగత వస్తయ్రై భోజనం పెట్టాలని కోరగా, తన భర్తతో అనూసయ ఆలోచన చేయగా, ఆత్మజ్ఞానియైన అత్రికి వచ్చినవారు త్రిమూర్తులేనని గ్రహిస్తాడు. భర్త ఇచ్చిన మంత్రోదకం ముగ్గురిపై చల్లడంతోనే పసిపాపలుగా ముల్లోకాధిపతులు మారగా, వారికి స్తన్యం ఇచ్చి తృప్తి పరుస్తుంది.
ఈ విషయం నారదుని ద్వారా విన్న లక్ష్మి, పార్వతి, సరస్వతి నారదుని వెంట వెళ్ళి, బాలురై క్రీడిస్తూ ఉన్న భర్తలను గాంచి, గర్వభంగంపొంది, తమ పతులను తమకు ఈయవలసిందిగా ప్రార్థిస్తారు. మళ్ళీ మంత్రోదకం చల్లడం ద్వారా విధి, నీలకంఠ, నీలవర్ణ రూపులైన త్రిమూర్తులను నిజరూపాలతో అప్పగిస్తుంది. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు వరం కోరుకొమ్మన్న సందర్భంలో, తమకు వారు పుత్రులుగా జన్మించాలని, కోరగా, వెంటనే వారి అంశలతో, ముని దంపతులకు కుమారుడుగా పుడతాడు. త్రిమూర్తుల స్వరూపుడు, త్రిముఖ దేహుడు, దేవుడు అయిన దత్తాత్రేయుడు గురు స్వరూపానికి మూలం. కృత, త్రేతాది యుగాల్లో విష్ణుమూర్తి రాక్షస సంహారార్థం భువిపై అవతరించారు.
అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞాన జ్యోతులను వెలిగించేవాడు గురువు. అలాంటి గురు స్వరూపానికి మూలం దత్తాత్రేయుడు. కలియుగంలో మానవజాతికి జ్ఞాన కాంతులను ప్రసరింప జేసేందుకు గురు రూపంలో దత్తాత్రేయుడు అవతరించారు. ఆయన అవతరించినది మార్గశీర్ష శుక్ల చతుర్దశి అయినా, జయంతిని జరుపుకునే దినమే మార్గశిర పౌర్ణమి అనగా ‘దత్తపౌర్ణిమ’. అనసూయా, అత్రి మహాముని పుత్రునిగా జన్మించిన దత్తుని అవతారం మహిమాన్వితం. అనసూయ కోరిక తీర్చేందుకు త్రిమూర్తుల ఆత్మజుడైన దత్తుడు గురుమూర్తిగా, అవదూతగా, ప్రాణిమాత్రులను సంసారజాలం నుండి విముక్తి చేస్తూ, ఆత్మ సాక్షాత్కరం చేయడం కోసం అవతరించాడు. దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి. ఆయన మార్గశిర శుక్ల పక్ష చతుర్దశి కృత్తికా నక్షత్రం నాడు జన్మించారు. దత్తాత్రేయుడు యదు మహారాజుకు స్వశరీర పవ్రితత, పరుశురామునికి శ్రీవిద్యా మంత్రం, సుబ్రహ్మణ్య స్వామికి ఆధ్యాత్మవిద్యోపదేశం, ప్రహ్లాదుకి జ్ఞానమార్గోపదేశ, నాగార్జునునికి ధాతు విద్యా ప్రక్రియను, రసశాస్త్రాన్ని, ఆది శంకరులకు సహస్రనామోపదేశం చేశారు. దత్తాత్రేయుడు ఉగ్ర దేవతగా గర్గసంహిత చెపుతున్నది. అందుకే కాబోలు దేశంలో దత్త దేవాలయాలు మిక్కిలి తక్కువగా ఉన్నాయి. యమదంష్ట్రులను తుదముట్టించినందుకు సంతోష సూచకంగా ఉగ్ర దైవమగు దత్తునికి ఇష్టమైన గురువారం పూజించడం ఆచారంలోనికి వచ్చింది. ఔదంబరం (అత్తి-మేడి) మొదట్లో ఉండడం ఆయనకు ప్రియం కనుక జంతుఫలి అని పేరు కలిగిన మేడిని హిందువులు పూజ్యభావంతో చూస్తారు. ఆ చెట్టుకింద కూర్చుని, దత్త మంత్రం పఠిస్తే అమోఘ ఫలితం ఉటుందని విశ్వాసం. జన్మ, కర్మ, గుణ, రూప, మాయ, నాశనాలు లేని సర్వాంతర్యామియైన దత్తాత్రేయుని జన్మదిన వేడుకలను సాంప్రదాయ రీతిలో జరుపుకోవడం అనవాయితీ. ఉట్టి ఉత్సవాలు, పూజాదికాలు, కీర్తీనలు, పురాణ శ్రవణాలు నిర్వహించడం ఆచరణీయం.

పాకుడురాళ్లు - రావూరి భరద్వాజ

$
0
0

దాంతో సజావైన మార్గానికన్నా డొంక తిరుగుడు దోవకే విలువ ఎక్కువవుతోంది. నాడూ, నేడూ, సినిమా పద్మవ్యూహంలో ప్రవేశించాక, అక్కడ ఇమడలేక, బయటపడలేక, నశించినవారి సంఖ్య పెద్దదే.
ఇప్పుడైతే లేరు గానీ, టాకీయుగం కౌమార దశలో వేంప్స్-అంటే వగలాడి వయ్యారిభామలకు ప్రాబల్యముండేది. వాళ్లనే వనె్నల విసనకర్రలని పిలిచేవారు. ఇపుడు కథానాయికకూ, వేంప్‌కూ తేడా ఏమీ లేదనుకోండి. జ్యోతిలక్ష్మి, హలం వంటివారు పోషించిన పాత్రలీనాటి తారామణులలో లీనమైపోయాయి గదా. అలాగే హేమమాలిని, వైజయంతీమాల వంటి దక్షిణాది తారలు అప్పటి హిందీ సినిమా రంగంలో వెలిగిపోతే రుూ రోజుల్లో తెలుగుతెరమీద తెలుగురాని ఆంధ్రేతర తారలు ఇలా వెలిగి అలా మాయమైపోతున్నారు.
అలాంటి స్వల్పకాలిక తారలీనాడు నిర్మాతల్నీ, దర్శకుల్నీ శాసించలేకపోయినా, 50-60 దశకాలలో ‘స్టార్ సిస్టమ్’ ఆవిర్భవించడంతో, అగ్ర నటీనటులు తమ ఆధిక్యాన్ని పెంచుకోగలిగారు. కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్ వంటి దర్శకులు, నాగిరెడ్డి వంటి నిర్మాతల వద్ద మాత్రం, వాళ్ళు తమ పరిధుల్లో వుండేవారు.
వీరందరినీ మించి ఆ రోజుల్లో పంపిణీదారుదే చివరిమాటగా వుండేది.
చిత్ర నిర్మాణం విషయంలో జెమినీ, ఎవిఎం, వాహిని, విజయ, శోభనాచల వంటి పెద్ద నిర్మాతలు మినహాయిస్తే, మిగిలిన చిత్ర నిర్మాతలు పెట్టుబడి కోసం డిస్ట్రిబ్యూటర్‌ని ఆశ్రయించక తప్పేదిగాదు. దాంతో పూర్ణా, నవయుగ, చమ్రియా వంటి ప్రధాన డిస్ట్రిబ్యూటర్స్ రారాజుల్లా తమ మాట చెల్లించుకోగలిగేవారు.
అన్ని గ్రహాలు వారి చుట్టే ప్రదక్షిణచేసేవి. అకారణంగా సాంఘికాలన్నా పౌరాణిక, చారిత్రక చిత్రాల సంఖ్యే ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేదంటే ఆశ్చర్యమేమీ లేదు.
ఐనప్పటికీ సినిమా అన్నది ఒక కళా మాధ్యమం అన్న విషయాన్ని సంస్కారవంతులైన అప్పటి దర్శక నిర్మాతలు విస్మరించలేదు. ముందుగానే కథా సంవిధానం సిద్ధం చేసుకుని, సర్వసన్నద్ధంగా చిత్ర నిర్మాణానికుపక్రమించేవారు.
షూటింగ్ ఆషామాషీగా, ద్రువ గమనంతో గాక, సాఫీగా, ఒక పథకం ప్రకారం సాగేది గనుకే అపజయాలంతగా వుండేవి గావు. సినీ జగత్తులో సంభవించే గాలివానలు, ఎదురయ్యే సుడిగుండాలు వారికి అధిగమించరాని అవరోధాలుగా వుండేవిగావు.
చివరిమాటగా చెప్పాలంటే పరస్పర వైరుధ్యాలతో, చీకటి వెలుగులతో ఆనాటి సినీ జీవుల ఉత్థాన పతనాలతో, సమ్మిళితమైన ఆనాటి సినీ జగత్తు సమగ్ర చిత్రాన్ని ప్రప్రథమంగా మన ముందుంచగలిగిన పరిపూర్ణ నవల పాకుడురాళ్లు.
రచయిత అవగాహన, విశే్లషణ, చిత్రణ గ్రంథాన్ని సమున్నత స్థానంలో నిలిపాయి. దురభిప్రాయాలకూ, దురభిమానానికీ తావు లేకుండా, సానుభూతితో, సదాశయంతో సాగిన రచన కారణంగా దానికంతటి ఉత్కృష్టత. అందుకు డాక్టర్ రావూరి భరద్వాజ బహుధా అభినందనీయులు.

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ॥ చిత్తశుద్దిగ నీకు సేవ చేసెదఁగాని
పుడమిలో జనుల మెప్పులకు గాదు
జన్మ పావనతకై స్మరణఁ జేసెదఁగాని
సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁ గాదు
ముక్తికోసము నేను మ్రొక్కి వేడ ఎదఁ గాని
దండి భాగ్యము నిమిత్తంబుగాదు
నిన్ను బొగడు విద్య నేర్చితినే కాని
కుక్షినింపెడి కూటి కొఱకుఁగాదు
తే. పారమార్థకమునకు వేఁ బాటుపడితి
కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!
భూషణ వికాస ! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహప్రభూ! నిండు మనస్సుతో నీ సేవ చేస్తాను గాని లోకుల పొగడ్తలాసించి కాదు. నాజీవితాన్ని పవిత్రం చేసుకోవాలని నీ పూజ చేస్తాను గాని సాటివారిలో పేరు గడించాలని కాదు. భవబంధాన్ని విడిపింపమని కోరి,ముక్తినిమ్మని నీకు నమస్కరించి ప్రార్థన చేస్తానే గాని భోగభాగ్యాలు ఆశించి కాదు.

‘ఇష్టంగా’ వస్తున్న ప్రేమ జంట

$
0
0

ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘ఇష్టంగా’. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ హీరో హీరోయన్లు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లో స్టార్ కమెడియన్ ప్రియదర్శి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. 28న సినిమా విడుదల సందర్భంగా చిత్రం ప్రెస్‌మీట్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. నటుడు దువ్వాసి మోహన్ మాట్లాడుతూ ‘ప్రతినిత్యం ఇష్టంగా ఎన్నో చేస్తుంటాం. ఆ ఇష్టాన్ని టైటిల్‌గా పెట్టారు. సంపత్ వి రుద్ర ఈ చిత్రానికి దర్శకుడవ్వడంతో అంచనాలు పెరిగాయి. ప్రియదర్శినితోపాటు నటించాను. నవతరం నాయకానాయికలు చక్కగా నటించారు. ఈ సినిమాకి రచన, సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రతిదీ బాగా కుదిరాయి. నిర్మాతలు అభిరుచితో సినిమా తీశారు. పెద్ద విజయం సాధిస్తుందన్న ధీమా ఉంది’ అన్నారు. నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘కొత్తవారిని ప్రోత్సహిస్తే మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నాం. నటీనటుల ప్రదర్శన, సాంకేతిక నిపుణుల పనితనం తెరపై ఆకట్టుకుంటాయి. అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు’ అన్నారు. దర్శకుడు సంపత్ వి రుద్ర మాట్లాడుతూ ‘ఇది తొలి చిత్రం. 30 రోజుల్లో పూర్తిచేయాలనుకున్న సినిమా కాన్వాసు మారి, బడ్జెట్ పెరిగింది. అందుకు తగ్గట్టే ప్రామిస్సింగ్ కంటెంట్, విజువల్స్‌తో సినిమా తెరకెక్కించాం. నిర్మాత రాజీపడకుండా కావాల్సినవి సమకూర్చారు. గోవాలో 10 రోజులపాటు సినిమాను చిత్రీకరించాం. లొకేషన్స్‌పరంగా అద్భుతాలను తీశాడు సినిమాటోగ్రాఫర్. హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. పెద్ద విజయం అందుకుంటాం’ అన్నారు.
హీరో అర్జున్ మహి మాట్లాడుతూ ‘ఒక వెబ్‌సైట్‌లో పనిచేసే కంటెంట్ రైటర్ హీరోని ప్రేమిస్తుంది. బాధ్యతలేని కుర్రాడితో ప్రేమలోపడినా ప్రేమ స్వచ్ఛమైనదని కథానాయిక పాత్ర నిరూపిస్తుంది. అమ్మాయి-అబ్బాయి సహజీవనం అంటే సెక్స్ లేదా ఇంకేదో ఊహించుకుంటారు. కానీ అంతకుమించి అని తెరపై చూస్తారు. వినోదంతోపాటు సందేశం ఆకట్టుకుంటుంది. అవకాశం కల్పించిన నా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సీజన్‌లో ఓ చక్కని రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. విజయం అందుకుంటాం’ అన్నారు. కథానాయిక తనిష్క్ మాట్లాడుతూ ఇష్టంగా కథాబలం ఉన్న చిత్రం. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. ఇంకా కార్యక్రమంలో ఆనంద్, ఎలేందర్, నాగేశ్వర్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశే్వష్వర్, నెమిలికొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తోన్న చిత్రానికి రచన సహకారం చిట్టిశర్మ, సినిమాటోగ్రఫీ ఆనంద్ నడకట్ల.

Viewing all 69482 articles
Browse latest View live