Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

మాజీ ప్రధాని, కర్ణాటక సీఎంకు జరిగిన అవమానానికి బాధ్యులెవరు?

0
0

తిరుపతి, డిసెంబర్ 23: వైకుంఠ ఏకాదశి పర్వదినాన సాక్షాత్తు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలకు తీరని అవమానం జరిగినందుకు తాను స్పందించానని, ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజును ఉద్దేశించి కన్‌ఫర్మ్‌డ్ ఐఏఎస్ అన్నందుకు తాను పత్రికా ముఖంగా క్షమాపణలు చెబుతున్నానని, అయితే రాజ్యాంగపరంగా ఇద్దరు అత్యంత ప్రముఖులకు జరిగిన అవమానానికి ఎవరు బాధ్యత వహిస్తారని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ ప్రశ్నించారు.
కన్‌ఫర్మ్‌డ్ ఐఏఎస్ అన్నందుకు తనకు పరువునష్టం జరిగిందని, క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా వెళతానని శ్రీనివాసరాజు టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణకు లీగల్ నోటీసు ఇచ్చారు. దీంతో తీవ్రంగా స్పందించిన ఓవి రమణ ఆదివారం తన నివాసంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీనివాసరాజు తనకు ఆయన వాట్సాప్‌లోను, నేరుగాను లీగల్ నోటీసులు పంపించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రికి, కర్ణాటక ముఖ్యమంత్రికి జరిగిన అవమానాన్ని, లోపాలను ఎత్తిచూపించానని అన్నారు. వాటిని అధికారులు సరిదిద్దు కోకుండా దీన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని జేఈఓ తన పరువుకు నష్టం జరిగిందని, లీగల్ నోటీసులు జారీ చేయడాన్ని ఏవిధంగా భావించాలన్నారు. తాను కిందిస్థాయి కన్‌ఫర్మ్‌డ్ ఐఏఎస్ అన్నమాట వాస్తవమేనని, తనకు తెలిసిన నిజం కూడా ఇదేనని, అయితే మరే విధంగానైనా ఆయన ఐఏఎస్ అయితే తనకు తెలియదన్నారు. అయితే తన వ్యాఖ్యలు నిజంగా ఆయనకు పరువునష్టం కలిగిందని భావిస్తే అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
రాష్ట్ర అతిధులుగా వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవేగౌడకు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా టీటీడీ, పోలీసులు, సబ్ కలెక్టర్‌లు పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కుమారస్వామికి, మాజీ ప్రధాని హోదాలో దేవెగౌడకు మహాద్వార ప్రవేశం అర్హత ఉన్నప్పటికీ వారిని అక్కడ కాకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోను, వృద్ధుల క్యూలైన్‌లో పంపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కుమారస్వామిని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన అనంతరం మీరు ఇక్కడ కాదు మీరు రాంభగీచా వద్ద ఏర్పాటు చేసిన ప్రవేశమార్గం గుండా వెళ్లాలని టీటీడీ సిబ్బంది సూచించారన్నారు.
దీంతో వెనుతిరిగి కార్ల వద్దకు వచ్చామన్నారు. అప్పటికే బయట ఉన్న సెక్యూరిటీ లేకపోవడం, వాహనాలు లేకపోవడం, కనీసం సెల్‌ఫోన్ కూడా లేకపోవడంతో సీఎం కుమారస్వామి దాదాపు 15 నిమిషాలు రోడ్డుపైన వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది ఆయన ఎటు వెళ్లారో తెలియక ఆందోళన చెందారని అన్నారు.
రాజ్యాంగ పరిధిలోని ముఖ్యమంత్రి స్థాయిగల వ్యక్తి పర్యటనకు సంబంధించి సరిగ్గా సమన్వయం చేసుకోకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి వెనక్కి పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను కూడా టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశానని అన్నారు. అలాగే 13 కమిటీల్లో సభ్యుడిగా కూడా పని చేశానన్నారు. ఈక్రమంలోనే పదేళ్లపాటు తాను ఏ రోజు కూడా టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడలేదన్నారు. ఇప్పుడు కూడా తాను అడుగుతున్నది ఏమిటంటే ఇద్దరు ప్రముఖులకు ఇలాంటి అసౌకర్యం కలగడం ఎంతవరకు సమంజసమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చెప్పడానికే మీడియా ముందుకు వచ్చానన్నారు. కానీ ఇలాంటి సంఘటనలతో టీటీడీ ప్రస్తుతం ప్రతిష్ఠ దిగజారుతోందని, అందుకే మాట్లాడాల్సి వస్తోందన్నారు.
దేవెగౌడ కుటుంబం ప్రతి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు రావడం ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గత 9 సంవత్సరాలుగా జేఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసరాజు ఏనాడు వారిని కలిసి పలకరించిన సందర్భం లేదని ఓవి రమణ అన్నారు. అయితే గతంలో పనిచేసిన ధర్మారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం వంటి అధికారులు అందరూ దేవెగౌడ కుటుంబ సభ్యులను కలిసి మంచి మర్యాదలు పాటించేవారని చెప్పారు. కాని నేడు మాజీ ప్రధాని విషయంలో నిర్లక్ష్యం జరగడం బాధాకరమన్నారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుని స్పందిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడా? టీటీడీనా? అని, పది రోజుల్లో పత్రికాముఖంగా చెప్పాలన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలన్నారు.
కానిపక్షంలో బెంగళూరులో జాతీయ మీడియా ముందుకు వెళ్లి మాజీ ప్రధానికి, కర్ణాటక ముఖ్యమంత్రికి తిరుమలలో జరిగిన అసౌకర్యాలను సవివరంగా తెలియజేస్తానన్నారు. అలాగే ఢిల్లీలో జాతీయ మీడియాతో కూడా మాట్లాడతానన్నారు. ఇప్పటికే కర్ణాటకలోని అన్ని చానళ్లలో మాజీ ప్రధాని దేవెగౌడకు, ముఖ్యమంత్రి కుమారస్వామికి అవమానం జరిగినట్లు వార్తలు ప్రసారం అయ్యాయన్నారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికే కాకుండా కేంద్రం దృష్టికీ వెళ్లిందన్నారు.
86 సంవత్సరాల వయస్సు కలిగిన మాజీ ప్రధాని, ఆయన సతీమణిని తీసుకువెళ్లడానికి పద్మావతి గెస్ట్‌హౌస్‌లోని ఒక మేనేజర్‌ను నియమించడం సబబా అన్నారు. కనీసం జేఈఓ స్థాయి అధికారి ఉండాలని ఒకవేళ ఆయన పని ఒత్తిడిలో ఉంటే డిప్యూటీ ఈఓ స్థాయి అధికారిని నియమించాల్సిన బాధ్యత టీటీడీపైన లేదా అని ప్రశ్నించారు. ఒక మాజీ ప్రధాని పట్ల అంత నిర్లక్ష్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, టీటీడీ అప్రతిష్ఠపాలు కాకూడదన్నదే తన ఆలోచనని ఓవి రమణ అన్నారు.


4న పార్లమెంట్ ముందు భారీ ధర్నా

0
0

రాజమహేంద్రవరం, డిసెంబర్ 23: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నినదిస్తూ జనవరి 4న ఢిల్లీలో పార్లమెంట్ ముందు తలపెట్టిన భారీ ధర్నాలో కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని, ఢిల్లీ దద్దరిల్లేలా నినదించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ అనుబంధ రాజమహేంద్రవరంలోని జట్లు లేబర్ యూనియన్ వజ్రోత్సవ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో పొరపాటున మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రైవేటుకిచ్చేసే ప్రమాదంవుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి భూమిపిచ్చి, ప్రైవేటు పిచ్చి పట్టుకుందన్నారు.చంద్రబాబు ఎపుడూ ఎవరో ఒకరు తనకు అడ్డువస్తున్నట్టు గోలపెడుతున్నారని, పవన్ అయితే అడ్డురావడం లేదని, ఇక జగన్ ఎపుడూ అసెంబ్లీకి పోకుండా పాదయాత్రలోవుంటే, రోజా జబర్ధస్త్‌లో ఉన్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు బిర్యానీలు తింటూ విశ్రాంతి తీసుకుంటుంటుంటే ఇక చంద్రబాబుకు ఎవరు అడ్డం వస్తున్నారో అర్ధం కావడం లేదని ఎద్దేవాచేశారు. రాజధాని పేరుతో 53వేల ఎకరాలను స్వాధీనం చేసుకుని కార్పొరేట్లకు కట్టుబెడ్తున్నారని ఆరోపించారు. 16,095 ఎకరాలు సింగపూర్ కన్సార్టియంకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐదు ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను దెబ్బకొడుతున్నారని, విద్యా, వైద్యాన్ని ప్రైవేటుకిచ్చేసి, చంద్రబాబు ప్రభుత్వం ఏంచేస్తుందని నిలదీశారు. రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీలకు వీసీలు లేరని, 3600 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం లంచాల మయంగా మారిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అన్ని మాఫియాల్లోనూ ఉన్నారని ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు రాకూడదని, 2019లో జనసేన వామపక్షాలతో కలసి కొత్త రాజకీయాలకు నాంది పలుకుతుందన్నారు. పవన్ కళ్యాణ్ రూ. కోట్ల కుంభకోణాల్లో కూరుకుపోయి జైలుకు పోడనే గ్యారంటీ ఇవ్వొచ్చని, కష్టపడేవారి తరపున మాట్లాడేవారే కమ్యూనిస్టులని, ప్రపంచమంతా ఎర్ర జెండా వుండాలని కాంక్షించడంతోనే పవన్‌తో సీపీఐ చేతులు కలిపిందన్నారు. కార్మికులంతా మార్పు వైపు కదలి రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నారు. మరింత ఉద్ధ తమైన కార్మిక పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలోనే ఐక్యతగా పనిచేసే యూనియన్ రాజమహేంద్రవరంలోని జట్లు లేబర్ యూనియన్ అని రామకృష్ణ కితాబిచ్చారు. జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు వి కొండలరావు అధ్యక్షతన జరిగిన సభలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకట సుబ్బయ్య, రాష్ట్ర హమాలీ ఫెడరేషన్ అధ్యక్షుడు చల్లా చిన ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి, నల్లా రామారావు తదితరులు ప్రసంగించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల సత్యనారాయణ జట్లు లేబర్ యూనియన్ వజ్రోత్సవ నివేదిక సమర్పించారు.

రాశిఫలం 12/24/2018

0
0
తిథి: 
బహుళ విదియ రా.8.02, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
పునర్వసు రా.9.50
వర్జ్యం: 
ఉ.10.33 నుండి 12.03 వరకు తిరిగి రా.తె.5.18 నుండి
దుర్ముహూర్తం: 
మ.12.24 నుండి 01.12 వరకు తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం: 
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ఈరోజు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనారోగ్య బాధలతో సతమమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. స్ర్తిలమూలకంగా ధనలాభముంటుంది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఋణప్రయత్నాలు ఫలించును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు.
Date: 
Monday, December 24, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

నీతి ఆయోగ్ ప్రతిపాదన

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశంలో వైద్య రంగాన్ని ఒకే పరిధి కిందకు తెచ్చే ఉద్దేశ్యంతో జాతీయ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. వైద్య రంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విఫలమయ్యాయని పేర్కొన్నారు. వీటి స్థానంలో జాతీయ స్థాయిలో మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయాలని విధానపత్రంలో నీతి ఆయోగ్ పేర్కొంది. నర్సింగ్ విద్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, వీటిని క్రమబద్ధీకరించేందుకు స్పష్టమైన విధానం ఉండాలని పేర్కొంది. వైద్య రంగంలో ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉంటున్నాయని తెలిపింది. వైద్యుల కొరత నివారించేందుకు విదేశాల్లో ఉన్న భారతీయ వైద్యులు స్వదేశానికి వచ్చేందుకు వీలు కల్పించాలని ప్రతిపాదించారు. ఎయిమ్స్, ఇతర పెద్ద ఆసుపత్రులకు విదేశాల్లో పనిచేసిన వైద్య నిపుణులను విజిటింగ్ ప్రొఫెసర్లుగా నియమించాలని పేర్కొన్నారు. డిప్లమో ఆఫ్ నేషనల్ బోర్డ్, డిప్లమో ఫ్రమ్ కలాజీ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్ల వ్యవస్థను విస్తరించాలని పేర్కొన్నారు. వైద్య రంగంలో డాక్టర్లు, నర్సుల సంఖ్య తగ్గిపోతోంది.

నెలాఖరులోగా మూడు బ్యాంకుల విలీన యత్నానికి కార్యరూపం

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాం క్, దేనా బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదన ఈనెలాఖరులోగా కార్యరూపం దాల్చనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జనవరి 8 వరకు జరిగే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బ్యాం కుల విలీన పథకం చర్చకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఈ మూడు బ్యాంకులకు సంబంధించిన బోర్డులు విలీన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి. ప్రమోటర్ నుంచి ఎంత మూలధనం అవసరం, వాటాల వివరాలపై కూడా స్పష్టత వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తొలిసారిగా జరుగుతున్న మూడు బ్యాంకుల విలీనం తర్వాత తగినన్ని నిధులు సమకూర్చేందుకు ప్ర భుత్వం హామీ ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా ఈ బ్యాం కుల విలీనం అనంతరం వచ్చే సరికొత్త బ్యాంకు కార్యాచరణ మొదలవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది భారతీయ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసిన అనంతరం, భారతీయ మహిళా బ్యాంకు నిర్వహణను సైతం ఎస్‌బీఐ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచంలోని 50 ప్రముఖ బ్యాంకుల జాబితాలోకి ఈ బ్యాంకు చేరింది. ఆక్రమంలోనే మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి కూడా బాటలు పడ్డాయి. గత సెప్టెంబర్‌లో జరిగిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ఆల్టర్నేటివ్ మెకానిజం (ఏఎల్) సమావేశంలో ఈ మూడు బ్యాంకుల విలీన ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

దావోస్‌లో వచ్చే నెల 21నుంచి ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాలు

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: స్విడ్జర్లాండ్‌లోని దావోస్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఈఎల్) వార్షిక సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోబాటు మరో ముగ్గురు కేంద్ర క్యాబినెట్ మంత్రులు హాజరయ్యే అవకాశాలున్నాయి. వారితోబాటు కొత్తగా ఎంపికైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తోబాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరో వందమంది సీఈవోలు హాజరుకానున్నారు. జనవరి 21 నుంచి 25 వరకు జరిగే ఈ వార్షిక సమావేశంలో మైక్రోసాఫ్ట్‌కు సీఈవో సత్యనాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ సైతం పాలుపంచుకుంటారు. వీరితోబాటు ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ముప్పై యేళ్లలోపు వయసున్న ఆరుగురు యువనేతలు కూడా హాజరవుతారు. వీరిలో బాసిమా అబ్బుల్ రహ్మాన్ (ఇరాక్), జాన్ డేవిడ్ అరిస్టిజాబాల్ (కొలంబియా), నౌరా బెర్రౌబా (స్వీడన్), జూ లియా లస్కాంబే (అమెరికా), మహమ్మద్ హుస్సేన్ మహమూద్ (కెన్యా), అకీరా సకానో (జపాన్) ఉన్నారు. వాణిజ్య, రాజకీయ, ప్రభుత్వ, మీడియా తదితర రంగాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రముఖులు వివిధ దేశాల నుంచి తరలిరానున్న ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయంటున్నారు. వరుసగా రెండోసారి దావోస్‌లో ఈ ప్రపంచ స్థాయి సమావేశం జరుగనుంది. 3ప్రపంచీకరణ 4.0, నాలుగవ పారిశ్రామిక విప్లవానికి అనుగుణంగా ప్రపంచ స్వరూప మార్పు2 అనే అంశంపై జరుగనున్న ఈ సమావేశంలో భారత దేశానికి సంబంధించిన పలు అంశాలపై సైతం ప్రత్యేక సెషన్లు నిర్వహించి చర్చించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం దేశ రాజకీయ స్థితిగతులు ఈ సమావేశంలో చర్చకు వస్తాయంటున్నారు. కాగా నాలుగవ పారిశ్రామిక విప్లవానికి ప్రతిబంధకంగా నిలిచే సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని డబ్ల్యుఈఎప్ వ్యవస్థాపకుడు, కార్యనిర్వాహక చైర్మన్ క్లాస్ స్క్వాబ్ తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, జీవవైవిధ్యం, యాంత్రీకరణ కారణంగా ఉద్యోగాల తరుగుదల, పలు దేశాల మధ్య ప్రమాదకంగా సన్నగిల్లుతున్న సంబంధాలు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వస్తాయని ఆయన తెలిపారు.

మూడు వారాలుగా వెల్లువెత్తిన విదేశీ పెట్టుబడులు

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత ప్రధాన మార్కెట్లలోకి గడచిన మూడు వారాలుగా విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా విదేశీ ఇనె్వస్టర్లు ఈ మూడువారాల్లో మదుపు చేశారు. అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి విలువ పెరగడం, ముడిచమురు ధరల్లో తరుగుదల ఈ పరిణామానికి దోహదం చేశాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన నవంబర్ నాటికి సుమారు పదినెలల గరిష్టానికి ఈక్విటీ, రుణ రంగాల్లో విదేశీ పెట్టుబడులు సుమారు 12,266 కోట్ల రూపాయలు వచ్చిన అనంతరం ఈ మూడు వారాల పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. డిసెంబర్ 3 నుంచి 21 వరకు విదేశీ ఇనె్వస్టర్లు ఈక్విటీల్లో రూ.1.332 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్లో రూ.2,552 కోట్ల రూపాయలు మదుపు చేశారని డిపాజిటరీస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 15 నెలల కనిష్టానికి చేరుకోవడం విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు ఊతం ఇచ్చింది. డిసెంబర్ 7 నుంచి రూ.383 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపర్లు వెనక్కు తీసుకున్నారు.
అయితే అదే సమయంలో రుణ సంబంధ మార్కెట్లోకి 2,744 కోట్ల రూపాయలు విదేశీయులు పెట్టుబడులు పెట్టడం జరిగింది. డిసెంబర్ 6న ఒక్కరోజే విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ఆస్తులను 361 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిపారు. చైనాకు చెందిన హై ప్రొఫైల్ కార్యనిర్వహణాధికారిని అరెస్టు చేయడం అంతర్జాతీయ మార్కెట్లను బలహీనపరిచిన క్రమంలో ఇలా రెండు రోజులపాటు ప్రభావం భారత మార్కెట్లపై పడిందని మార్నింగ్ స్టార్ ఇనె్వస్ట్‌మెంట్ అడ్వయిజర్ ఇండియా రీసెర్చ్ విభాగం సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాత్సవ విశే్లషించారు. విదేశీ మదుపర్లు ఈ యేడాది ఇప్పటి వరకు సుమారు 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.

బుమ్రా బౌలింగ్‌లో పరుగులు ఈజీ కాదు!

0
0

మెల్బోర్న్, డిసెంబర్ 23: మెల్బోర్న్‌లో జరిగే మూడో టెస్టులో పర్యాటక జట్టులోని పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆతిధ్య క్రికెటర్లు పరుగులు తీయడం అంత సులువు కాదని ఆసిస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ అన్నాడు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల్లో ఇప్పటికే పూర్తయిన రెండు టెస్టుల్లో బుమ్రా 11 వికెట్లు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించాడు. లియాన్ తర్వాత అ త్యధిక వికెట్లు తీసిందే బుమ్రానేనన్నాడు.


అశ్విన్ డౌటే!

0
0

మెల్బోర్న్, డిసెంబర్ 23: ఆతిధ్య ఆస్ట్రేలియాతో ఈనెల 26న బాక్సింగ్ డే సందర్భంగా జరిగే మూడో టెస్టుకు టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడే అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న అశ్విన్ ఇంకా కోలుకునే పరిస్థితి లేకపోవడంతో అతని స్థానంలో ఎడమచేతి వాటం ఆఫ్ స్నిన్నర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గాయం కారణంగా ఆసిస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో చోటుదక్కని జడేజా ఇంకా పూర్తిగా కోలుకోకున్నా మూడో టెస్టులో ఆడడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయిన సమయంలో జట్టు నలుగురు పేసర్లను నమ్ముకుని బరిలోకి దిగి పొరపాటు చేసిందని, ఫలితంగా టెస్టును జారవిడుచుకుందని ఇంటాబయట ఎన్నో విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పిన్నర్ అవసరాన్ని గుర్తించి యాజమాన్యం జడేజా వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సైతం తొలి రెండు టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇపుడు బాక్సింగ్ డే సందర్భంగా మెల్బోర్న్‌లో జరిగే మూడో టెస్టులో ఆడేందుకు శారీరకంగా సన్నద్ధంగా ఉండడంతో అతని ఎంపికకు కొద్దిరోజుల కిందట మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మూడో టెస్టు జరిగేందుకు ఇంకా మరో 48 గంటల సమయం ఉన్నందున అశ్విన్ ఆడేది, లేనిది ఇప్పుడే చెప్పలేమని టీమిండియా ప్రధాన కోచ్ రవి శాస్ర్తీ క్రికెట్.కామ్.ఏయూకు తెలిపాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఇపుడు మూడో టెస్టులో సైతం రోహిత్ ఆడే అవకాశాలు కన్పించడంలేదు.

కూర్చుని ఎన్నైనా విమర్శలు చేయొచ్చు

0
0

మెల్బోర్న్, డిసెంబర్ 23: ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా జట్టు కూర్పు సరిగా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిపోయిందని వస్తున్న పలువును మాజీ క్రికెటర్ల విమర్శలు, ఎత్తిపొడుపులను భారత ప్రధాన కోచ్ రవి శాస్ర్తి తీవ్రంగా ఖండించాడు. రెండో టెస్టులో భారత్ 146 అత్యధిక పరుగులతో ఓటమి చెందడానికి జట్టు కూర్పులో విఫలం చెందిన కోచ్ రవి శాస్ర్తీతోపాటు జట్టు సారధి విరాట్ కోహ్లీనే కారకులని మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించాడు. వేలాది మైళ్ల దూరంలో కూర్చుని ఎన్నైనా విమర్శలు చేయడం చాలా సులువని, జట్టు కూర్పు మైదానం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేసిందే తప్ప నష్టం చేసేది కాదని అన్నాడు. ఎవరి పేరును ప్రస్తావించకుండా రవిశాస్ర్తి మాట్లాడుతూ తాము దక్షిణ ధృవంలో ఉన్నామని, సుదూరంలో కూర్చుని చేసిన విమర్శలు అక్కడ వరకే పరిమితం అవుతాయని పేర్కొన్నాడు. టీమ్‌లో టాప్ ఆర్డర్ వైఫల్యం గురించి మాట్లాడుతూ గడిచిన రెండు టెస్టుల్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ విఫలమైన విషయం వాస్తవమేనని అన్నాడు. జట్టులోకి మయాంక్ అగర్వాల్‌కు తీసుకునే విషయమై ప్రస్తావిస్తూ టీమ్ మేనేజిమెంట్ సైతం ఈ దిశగా ఆలోచన చేస్తోందని, మయాంక్ మంచి నైపుణ్యం కలిగిన క్రికెటర్ అని అన్నాడు. తమ కుర్రాళ్లు ఎలా ఆడాలో, వారి సామర్థ్యం ఏమిటో తమకు బాగా తెలుసునని అన్నాడు. మూడో టెస్టుపై ఆధిపత్యం సాధిస్తామని, ఇంతకుముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టూర్‌లో సైతం ఇదే పరిస్థితి ఎదురైన అనుభవాన్ని ప్రస్తావించాడు.

రికార్డుల రాణి మైకెలా

0
0

అమెరికా, డిసెంబర్ 23: అమెరికాకు చెందిన మైకెలా షిఫ్రిన్ స్కై రేసులో 50 వరల్డ్ కప్ విజయాలకు చేరువకానున్న పిన్నవయస్కురాలిగా రికార్డు పుటల్లో చోటుదక్కించుకోనుంది. వచ్చే ఏడాది మార్చి 24న తన పుట్టినరోజు కంటే ముందుగానే వరల్డ్ కప్‌లో అర్ధ సెంచరీ విజయాలను అందుకోనుంది. తాజాగా ఫ్రెంచ్ ఆల్పాస్‌లో జరిగిన ఒక పోటీలో 0.29 సెకన్ల తేడాతో ప్రత్యర్థి పెట్రా వ్లోవాపై విజయం సాధించింది. ఒలింపిక్ చాంపియన్ కూడా అయిన షిఫ్రిన్ స్కై రేసులో మహిళల విభాగంలో అర్ధ సెంచరీ విజయాలను దక్కించుకోవడం గర్వకారణం.

రియల్ మాడ్రిడ్ హ్యాట్రిక్

0
0

స్పెయిన్, డిసెంబర్ 23: స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం రియల్ మాడ్రిడ్ హ్యాట్రిక్ టైటిళ్లను అందుకుంది. ప్రత్యర్థి బార్సెలోనాతో దుబాయ్‌లోని ఆల్ ఎయిన్‌లో జరిగిన స్ట్రెయిట్ క్లబ్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఘన విజయం సాధించడం ద్వారా మూడోసారి ఈ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్ పోరులో రియల్ మాడ్రిడ్‌కు చెందిన లూకా మోడ్రిక్, సెర్జియో రామోస్ స్కోర్లు చేయడంతో 4-1తో ఆతిధ్య టీమ్‌ను మట్టి కరిపించింది.

భారత్‌దే పైచేయి

0
0

మెల్‌బోర్న్, డిసెంబర్ 23 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్-భారత్ నడుమ ఈ నెల 26న బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రను చూసుకుంటే 14 సార్లు నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ ఏడు సార్లు సిరీస్‌ను గెలవగా, ఆస్ట్రేలియా ఐదుసార్లు విజయం సాధించింది. 2003-04 మధ్య జరిగిన సిరీస్‌లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలవగా, మిగతా రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయ. దీంతో ఆ ఏడాది సిరీస్ ఫలితం ఎటూ తేలకుండా పోయంది. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ఇంకో రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలిఉండగా, ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలిచాయ.
చివరగా 2016-17లో ఆసీస్-్భరత్ తలపడగా భారత్ 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. మొత్తంగా చూస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ పైచేయ సాధించింది.
అందరి చూపు పిచ్ పైనే..
ఆసీస్-భారత్ రెండో టెస్టులో పెర్త్ ముందుగా సీమర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించడంతో మూడో టెస్టు జరిగే మెల్‌బోర్న్ పిచ్‌పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పిచ్ మాజీ లు, రిఫరీలతో సహా పలువురు కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే పెర్త్ పిచ్‌కు తక్కువ రేటిం గ్ ఇచ్చాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ పిచ్‌కు ఫుల్ రేటింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా క్రికెట్‌లో పిచ్‌ల పాత్ర చాలా ఉంటుందని, పిచ్‌లే విజయాల్ని నిర్ధాయస్తా యని చెప్పుకొ చ్చారు. ఆటగాళ్ల నైపుణ్యం బయటకు రావాలంటే నైపుణ్యమైన పిచ్‌లను తయారు చేయాలని అన్నారు. పెర్ త పిచ్ ఎంతమాత్రం యావరేజ్ కాదని తేల్చి చెప్పాడు. మరోవైపు మాజీ ఆటగాళ్లు మిచెల్ జాన్సన్, మైఖేల్ వాన్ సైతం పెర్త్ పిచ్‌పై కామెంట్ చేశారు. పిచ్‌లో లోపమేమీ కనిపించలేదని జాన్సన్, పెర్త్ అద్భుత పిచ్ అని మైకెల్‌వాన్ బ్యాట్స్‌మెన్లతో పాటు బౌలర్లకు సహకరిస్తుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మెల్‌బోర్న్‌కు 165 ఏళ్ల చరిత్ర..
మెల్‌బోర్న్ క్రికెట్ మైదానానికి దాదాపు 165 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఈ మైదానం 148 వనే్డ ఇంటర్నేషనల్, 110 టెస్టులు, 12 టీ20లకు వేదికగా నిలిచింది. పిచ్ ఇక్కడి పిచ్ ఇటు బౌలర్లకు, అటు బ్యాట్స్‌మెన్లకు సహకరించే విధంగా రూపొందించారు.

చిత్రం..మెల్‌బోర్న్ క్రికెట్ మైదానం

తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

0
0

తిరుపతి, డిసెంబర్ 23: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై బంగారుపల్లకిపై వేర్వేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంతకు చేరారు. ఈసందర్భంగా స్వామివారు ఒకవైపు, అమ్మవార్లు మరోవైపు తూర్పు, పడమరగా వేంచేపుచేశారు. ఈసందర్భంగా అర్చకస్వాములు వేర్వేరుగా ఆళ్వార్ దివ్యప్రబంధాలను స్తుతించారు.
అనంతరం అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసి ఒకరిపై ఒకరు పూలబంతులు విసరడం, స్వామివారు పుష్పఘాతుకాల నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలను భక్తులు భక్తిపారవశ్యంతో తిలకించి తరించారు. ఈకార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్, వీఎస్‌ఓ మనోహర్, ఓఎస్‌డీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రణయ కలహోత్సవ వేడుకను పురస్కరించుకుని తిరుమలలో ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు

వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

0
0

కొత్తగూడెం, డిసెంబర్ 23: రానున్న ఐదేళ్లలో సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా రూ. 35వేల కోట్లు లాభాలను గడించాలనే ధ్యేయం తో పనిచేస్తున్నట్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియం ఆవరణలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శ్రీ్ధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల ఏర్పాటు కోసం సింగరేణి సంస్థ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో ఆరు కొత్త బ్లాకుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ. 1200 కోట్లు లాభాలు ఆర్జించిన సింగరేణి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1300 కోట్లు లాభాలు ఆర్జిస్తుందని విశ్వాసం ప్రకటించారు. సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి సింగరేణి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దక్షిణ భారతదేశంలోని వందలాది విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయటంలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సైతం లాభాలు గడిస్తూ దేశ అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోందన్నారు. సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఏడాది 130 మెగావాట్ల ఉత్పత్తికి పనులు వేగవంతంగా సాగుతున్నాయని సీఎండీ శ్రీ్ధర్ వివరించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్, డైరెక్టర్లు భాస్కర్‌రావు, శంకర్, బలరాం, గుర్తింపు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్రావ్, సీఎంవోఏ అధ్యక్షుడు గడిపెల్లి కృష్ణప్రసాద్, జనరల్ మేనేజర్లు బసవయ్య, ఆనందరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న సింగరేణి సీఎండీ శ్రీ్ధర్


15 నిమిషాల్లో చార్జింగ్

0
0

ముంబయి, డిసెంబర్ 23: ఒకవైపు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు పెనుభారంగా మారుతుండగా, వాటికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే అడుగిడుతున్న బ్యాటరీ వాహనాలకు చార్జింగ్ పెద్ద సమస్యగా పరిణమించింది. వాటి చార్జింగ్‌కు గంటలు గంటల సమయం పడుతుండటంతో వినియోగదారులు వాటిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఆ సమస్యకు తాము పరిష్కారం కనుగొన్నామని చెబుతున్నారు ముంబయికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వారు. వీరు తాము అభివృద్ధి చేసిన నూతన బ్యాటరీని కేవలం 15 నిముషాల లోపే చార్జింగ్ చేయవచ్చునని ప్రకటించారు. ప్రస్తుతం వాడుతున్న లిథియమ్-ఐయాన్ బేటరీ స్థానంలో వీటిని అభివృద్ధి చేసినట్టు ముంబయికి చెందిన అంకుర సంస్థ జిగాడిన్ ఎనర్జీ సహవ్యవస్థాపకుడు జుబిన్ వర్గేస్ వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) ధరలో 40 శాతం బ్యాటరీ ధరే ఉంటోందని, ఇది వినియోగదారులకు పెనుభారమని చెప్పారు. అయితే 2030 నాటికి బ్యాటరీల ధర, వాటి చార్జింగ్‌కు పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించగలిగితే బ్యాటరీ వాహనాలు అందరికీ అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న లిథియమ్-ఐయాన్ బ్యాటరీల చార్జింగ్‌కు అధిక సమయం పడుతోందని తెలిపారు. అయితే ఇప్పుడు వస్తున్న ఆధునిక టెక్నాలజీతో త్వరగా చార్జింగ్‌ను చేయవచ్చునని, సూపర్ కెపాసిటర్లతో పాటు క్విక్ ఎనర్జీ డెన్సిటీ కనె్వన్షనల్ బేటరీలతో చార్జింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని, తాము తయారు చేసిన ఆధునిక బేటరీ కేవలం 15 నిముషాల లోపే చార్జింగ్ అవుతుందని ఆయన చెప్పారు. 2020 కల్లా వాణిజ్య మార్కెట్లోకి తమ బ్యాటరీలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాము ఎలక్ట్రోస్టాటిక్, ఎలక్రో కెమికల్‌విధానం అవలంబిస్తున్నామని, దీని ద్వారా బ్యాటరీ చార్జింగ్ 50 రెట్లు వేగంగా జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దీని ధర లిథియం బ్యాటరీ అంతే ఉంటుందని భావిస్తున్న భవిష్యత్‌లో బాగా తగ్గుతుందని ఆయన చెప్పారు. అలాగే ఈ బ్యాటరీలను కేవలం వాహనాలకే కాక టెలికాం టవర్స్, వినియోగదారుల వస్తువులు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో ఉపయోగింవచ్చునని ఆయన చెప్పారు.

నాపై ఓ వర్గం కుట్ర

0
0

ముంబయి, డిసెంబర్ 23: కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఒక వర్గం మీడియా తనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, తాను చేసిన ప్రకటనలను వక్రీకరిస్తూ, నాపై కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘గెలిచినప్పుడు బాగానే ఉంటుంది.. ఓడిపోయినప్పుడు కూడా ఆ నాయకత్వం బాధ్యత తీసుకోవాలి’ అంటూ పూణెలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ అధిష్ఠానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని కొంతమంది విశే్లషించడం తెలిసిందే. దీనిపై స్పందించిన గడ్కరీ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తనకు, పార్టీకి మధ్య వైరుధ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాని అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ అధికారానికి దూరమైన విషయం తెలిసిందే.

మీ దేశంలో మైనార్టీలకు భద్రత ఉందా?

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పాకిస్తాన్ మైనార్టీల పట్ల ఆకృత్యాలకు, దారుణాలకు పాల్పడిన దేశమని, కొన్ని లక్షల మందిని హతమార్చిన చరిత్ర పాక్‌కు ఉందని బీజేపీ ధ్వజమెత్తింది. భారత్‌లో మైనార్టీలకు భద్రత లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శించింది. పాకిస్తాన్ మైనార్టీలపై జరిగిన దాడుల మధ్య 1947లో ఆవిర్భవించిందన్నారు. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్ల యాత్ర చేసినట్లుగా ఇమ్రాన్ ఖాన్ కామెంట్లు ఉన్నాయన్నారు. 1947లో పాకిస్తాన్ ఆవిర్భవించిన తర్వాత ఆ దేశంలో మైనార్టీలైన హిందువులు, సిక్కులను దేశం నుంచి తరిమిగొట్టారని, పెద్ద సంఖ్యలో ప్రజలను హతమార్చారని చెప్పారు. తమ మాట వినని వారిని మతమార్పిడులు చేయించారన్నారు. అదే భారత్‌లో మైనార్టీలు సురక్షితంగా ఉన్నారని, అభివృద్ధిలో భాగస్వాములయ్యారన్నారు. పాక్‌లో మైనార్టీలు రెండుశాతం ఉన్నారన్నారు. పాక్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిని హిందీ నటులు యూసుఫ్ ఖాన్ అలియాస్ దిలీప్ కుమార్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖాన్ ప్రజల హృదయాలను దోచుకున్నారన్నారు. ఇక్కడ భారతీయులు ఈ నటులను ఆరాధించారన్నారు. పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక ఆర్టిస్టు పేరును ఇమ్రాన్ ఖాన్ చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.

అభివృద్ధి పూజ్యం.. గణాంకాలు ఘనం

0
0

కోల్‌కతా, డిసెంబర్ 23: తప్పుడు గణాంకాలతో తన ప్రభుత్వ విజయాలను ఏకరవు పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆర్థిక స్థితిగతుల వాస్తవాలు ఒకలా వుంటే, మోదీ గణాంకాలు తిమ్మిని బమ్మిని చేసే రీతిలో వున్నాయని ఆయన అన్నారు. 99శాతం వస్తుసేవలు, 18శాతం జీఎస్టీ పరిధిలోకి తెస్తామని అంతకంటే దిగువకు పన్నును తగ్గిస్తామని ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ప్రస్తావించిన ఏచూరి ‘ఇప్పటికే 97శాతం వస్తు సేవలు, 18శాతం జీఎస్టీ పన్ను పరిధిలో వున్నాయి’ అని అన్నారు. ఈ విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానం గోబెల్స్‌ని మరిపించేలా వుందని వ్యాఖ్యానించారు. జర్మనీని నాజీలు పాలిస్తున్న కాలంలో హిట్లర్ ప్రచార మంత్రిగా వున్న గోబెల్స్ ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని చేసేవారని ఏచూరి అన్నారు. వాస్తవాలను వక్రీకరించే రీతిలో అదే తరహాలో మోదీ కూడా గణాంకాలతో విన్యాసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్ల్‌మార్క్స్ 200వ జయంతి సందర్భంగా ఆదివారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఏచూరి మాట్లాడారు. ప్రధాని మోదీ అలాగే బీజేపీలు తమ ప్రయోజనాలకు అనుకూలంగా అభివృద్ధి లెక్కలను తారుమారు చేస్తున్నారని ఆ కోణంలోనే తమ ఘనతను చాటుకుంటున్నారని ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఇందులో భాగంగానే సమాజంలో చీలికలు తెస్తున్నారని ఏచూరి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వాస్తవాలే ఎన్‌డీఏ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.

చిత్రం..కార్ల్‌మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

తప్పుడు వివరాలిచ్చినా అనర్హతే

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: శాసనమండలి ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇస్తూ డిక్లరేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికైన తర్వాత అనర్హత వేటు వేసే విధంగా చట్టానికి సవరణలు తేవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు విధించాలని ఈసీ పేర్కొంది. ఎన్నికల సమయంలో అవినీతికి పాల్పడే వారిపై కాగ్నిజబుల్ నేరం కింద కేసులు నమోదు చేయాలని ఈసీ యోచిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జనవరి 8వ తేదీతో ముగుస్తాయి. ప్రధాన ఎన్నికల కమిషన్ తరహాలోనే ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు రాజ్యాంగ బద్ధమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తూ చట్టాన్ని రూపొందించాలని ఈసీ కేంద్రాన్ని కోరింది. ప్రధాన ఎన్నికల కమిషన్‌ను పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంటు అభిశంసన తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషనర్లను తొలగించే అధికారం రాష్టప్రతులకు ఉంటుంది.

Viewing all 69482 articles
Browse latest View live