Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1983 | 1984 | (Page 1985) | 1986 | 1987 | .... | 2069 | newer

  0 0

  లక్నో, డిసెంబర్ 23: సహనానికి భారత్ పెట్టింది పేరని, మన దేశంలో ఉన్నంతమంది సహనశీలురు ప్రపంచంలో ఎక్కడా లేరని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ- భారతదేశంలో ఉన్నంత సహనం మరే దేశంలోనూ లేదని, ఒకవేళ భారతీయుల్లో సహనం నశిస్తే.. ఇక ప్రపంచంలో ఏ మూలవెతికినా అది కనిపించదని అన్నారు. భిన్న మతాలు, సంప్రదాయాలకు చెందిన జనులంతా శాంతియుతంగా మెలగుతూ దేశాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల బులందర్‌షహర్‌లో ఒక పోలీసును దారుణంగా చంపిన విషయంపై ప్రముఖ సినీనటుడు నజీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విలేఖరులు ప్రస్తావించగా, ‘ఈ విషయమై ఇప్పటికే పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేశానని, ఇక బయట చెప్పేదేమీ ఉండదని’ అన్నారు.

  చిత్రం..లక్నోలో ఆదివారం జరిగిన కేజీఎమ్‌ఏ 114వ సంస్థాపక దినోత్సవ కార్యక్రమంలో
  ఓ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానం 1984 అల్లర్లలో ఊచకోతకుగురైన సిక్కుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భారతరత్న పురస్కారాన్ని తొలగించాలని తీర్మానం చేసిన అసెంబ్లీ ఆ తర్వాత ఈ తీర్మానంతో సంబంధం లేదని పేర్కొనడం విడ్డూరమన్నారు. అసలు తీర్మానంలో గాంధీకి భారతరత్నను తొలగించాలనే అంశం లేని, ఇది సవరణ మాత్రమేనని ఉపముఖ్యమంత్రి శివోడియా అన్నారన్నారు. ముందుగా తీర్మానం ఆమోదించడం, ఆ తర్వాత ఆ తీర్మానం ఆమోదించలేదనడం పరస్పర విరుద్ధమైన కథనాలను ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొన్నదన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు 1984 అల్లర్లకు గురైన బాధితుల కుటుంబాలను బాధించాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వంద్వ ధోరణులకు ఈ తీర్మానం నిదర్శనమన్నారు. దశాబ్ధాలు గడచినా, సిక్కు బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దోషులను శిక్షించేందుకు కోర్టులను ఏర్పాటు చేశారన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్‌పై సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణల్లో పసలేదన్నారు. దేశంలో చొరబాటుదారులను గుర్తించి పంపించివేస్తామన్నారు. కాని వీరిని రాహుల్ గాంధీని వెనకేసుకునిరావడంపై ఆయన కాంగ్రెస్‌నునిలదీశారు. అసోంలో జాతీయ పౌరరిజిస్టర్ విషయంలో కాంగ్రెస్ హడావుడి చేసి ఈ రోజు వౌనంగా ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందన్నారు. తాను సీదాసాదా నేతనని చెప్పుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు పోలీసు బందోబస్తు లేకుండా ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నారన్నారు.


  0 0

  పంబా, డిసెంబర్ 23: శబరిమలలో అయ్యప్పస్వామిని మహిళలు దర్శనం చేసుకునే విషయంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 11 మంది మహిళల బృందం ఆదివారం స్వామిని దర్శించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని స్థానిక భక్తులు, నిరసనకారులు అడ్డుకుని తరిమికొట్టడతో వారు దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. చెన్నైకు చెందిన ‘మణితి’కి చెందిన 11 మంది మహిళల బృందం ఆదివారం పోలీసుల సహాయంతో అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు అడవుల నుంచి ఉన్న పాదమార్గం ద్వారా గుడి సమీపానికి చేరుకున్నారు. అయితే వందలాది మంది భక్తులు వారిని తరిమికొట్టారు. వారిని చూసిన పోలీసులు, మహిళలు పరుగుతీసి దగ్గరలోని గార్డు రూములో తలదాచుకున్నారు. అటవీ మార్గాన్ని వందలాది మంది భక్తులు మూసివేసి మహిళా భక్తులు గుడిలోకి చేరకుండా అడ్డుకున్నారు. మహిళలను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని, దారికి అడ్డు తగలాలని పోలీసులు చేసిన హెచ్చరికలు చేసి కొంతమందిని అరెస్టు చేసినా భక్తులు లెక్కచేయలేదు. ఈ సందర్భంగా మణితి సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
  తొలుత ఆదివారం ఉదయం 3.30 గంటలకే 11 మహిళల బృందం ఇడు క్కి-కంభమేడు మార్గానికి చేరుకున్నారు. ఈ బృదంలో ఆరుగురు మహిళలు సంప్రదాయ ఇరుముడిని సైతం ధరించారు. అయితే అటవీ మార్గం కూడా వీరు వెళ్లకుండా భక్తులు అయ్యప్ప నామజపం చేస్తూ అడ్డుకోవడంతో ఆరు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కాగా కేరళకు చెందిన దళిత ఉద్యమనేత అమ్మినీ ఆదివారం తాను నడకమార్గం ద్వారా అయ్యప్పను దర్శించుకుంటానని ప్రకటన చేసినా, భక్తుల నిరసనలతో వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుముందు 11 మంది మహిళా బృందాన్ని పోలీసులు అయ్యప్ప స్వామి వద్దకు తీసుకువెళ్లడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇలావుండగా తిరువనంతపురంలోని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు, ఇతరులు అయ్యప్ప నామ జపం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ శ్రీ్ధరన్ పిళ్లై మాట్లాడుతూ పవిత్రమైన అయ్యప్పస్వామి దేవాలయాన్ని యుద్ధ ప్రదేశంగా మార్చడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ట్రెక్కింగ్ ద్వారా భక్తులను కొండపైకి చేర్చిన సంఘటనలు ఇప్పటిదాకా ఎప్పుడూ చోటుచేసుకోలేదని, దీనిపై నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాము సోమవారం రాష్టవ్య్రాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల మాట్లాడుతూ పినరయి ప్రభుత్వం ఆలయ పవిత్రతను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కొంతమంది మహిళా నేతలను పోలీసుల సహాయంతో అయ్యప్పదర్శనానికి తీసుకురావడాన్ని దేవస్థానానికి చెం దిన పండలం కుటుంబం ఖండించింది. దీనిపై రాష్ట్ర మంత్రి ఈపీ జయరాజన్ విలేఖరులతో మాట్లాడుతూ ‘దర్శనానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించడం మా బాధ్యత, శబరిమలలో మేము శాంతిని కోరుకంటున్నాం’ అని తెలిపారు.
  ఇలావుండగా 41 రోజుల పాటు చేపట్టే మొదటి విడత మండల పూజ ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఇలావుండగా అన్ని వయసుల మహిళలు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చునని సెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పలువురు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను కొందరు భక్తులు అడ్డుకుంటుండటంతో ఇంతవరకు నెరవేరలేదు.
  చిత్రం..అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన
  11మంది మహిళలను దారిలోనే నిలిపి వేసిన భక్తులు


  0 0

  హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణ భారత రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడ ప్రముఖులకు ‘తేనీటి విందు’ (ఎట్ హోం) ఏర్పాటు చేశారు. ఎట్‌హోం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎట్ హోం సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌తో పాటు ఆయన భార్య కూడా అతిథులకు అభివాదం చేశారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఎట్‌హోం కార్యక్రమం తిరిగి జాతీయ గీతం ఆలాపనతో ముగిసింది. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నర్సింహన్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ కే. స్వామిగౌడ్, హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నాయకుడు పి. సుధాకర్‌రెడ్డి, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా తదితరులు హాజరయ్యారు. త్రివిద దళాల అధికారులు కూడా పాల్గొన్నారు. ఎట్ హోం కార్యక్రమానికి కొద్ది మంది వీఐపీలనే ఆహ్వానించారు.
  భారత రాష్ట్రపతి గా ఎవరున్నప్పటికీ ఏటా దాదాపు 10 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పర్యటనకోసం హైదరాబాద్ వస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఈ పర్యాయం రాష్ట్రపతి కోవింద్ కేవలం నాలుగురోజుల పాటే ఇక్కడ ఉంటున్నారు. కరీంనగర్ జిల్లాలో శనివారం పర్యటించారు. ఆదివారం ఎట్‌హోం ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం కోవింద్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. 10 రోజుల అధికారిక కార్యక్రమాన్ని నాలుగు రోజులకు ఎందుకు కుదించారో అధికారులెవరూ వివరించలేకపోయారు. ఏటా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చిన సమయంలో బొల్లారంలోని రాష్టప్రతి భవన్‌లో భస చేస్తారు. 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో 11 గదులతో రాష్ట్రపతి భవనం విరాజిల్లుతోంది. వాస్తవంగా ఈ భవనాన్ని నిజాం నవాబు 1860 లో నిర్మించారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసిన తర్వాత ఈ భవనాన్ని భారత రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. అందుకే ఈ భవన ప్రాంతాన్ని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా సామాజిక అటవీవనం, ఔషధవనం, పూలు, పళ్లతోటలు ఉన్నాయి. హైదరాబాద్‌కు అధికారికంగా రాష్ట్రపతి ఇక్కడ ఉన్నన్ని రోజుల పాటు తన పరిపాలనావ్యవహారాలను ఇక్కడి నుండే కొనసాగిస్తారు.
  మీడియాను అనుమతించలేదు
  ఎట్ హోం కార్యక్రమానికి ఈ పర్యాయం మీడియా ప్రతినిధులను ఆహ్వానిచలేదు. సాధారణంగా మీడియాను ఎట్‌హోం కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. రాష్ట్రపతి నిలయంలో మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. రాష్ట్రపతి పర్యటన ఖరారైన వెంటనే మీడియా ప్రతినిధుల పేర్లను సమాచార శాఖ సేకరించి, పాస్‌లు ఇస్తుంటారు. ఈ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఎట్‌హోంకు అనుమతిస్తూ వస్తున్నారు. ఈ పర్యాయం మీడియా ప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వలేదు. ఎట్‌హోంకు మీడియా ప్రతినిధులను ఆహ్వానించే బాధ్యత సాధారణ పరిపాలనాశాఖ (పొలిటికల్ విభాగం) చేపడుతుంది. మీడియాను ఎందుకు ఆహ్వానించలేదన్న అంశంపై అధికారులు ఎవరూ వివరణ ఇవ్వలేకపోయారు.

  చిత్రం..ఎట్‌హోం కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్,
  ఆయన భార్య విమలా నర్సింహన్, హోంమంత్రి మహమూద్ అలీ


  0 0

  హైదరాబాద్, డిసెంబర్ 23: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలను లేకుండా చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ దుయ్యబట్టారు. ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకాన్ని ఆయన ‘రైతు బంద్’గా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
  ఈ సమవేశంలో పార్టీ నాయకులు శ్రీరాములు, మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయడం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరపరిచినట్లే అవుతుందని ఆయన తెలిపారు. శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ కే.స్వామిగౌడ్ రాజకీయ వత్తిళ్ళకు లొంగడం బాధాకరమని అన్నారు. వత్తిడికి లొంగి టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల చేరికను విలీనంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు లభించిన తర్వాత కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుం డా చేయాలని యత్నించడం అత్యంత బాధాకరమన్నారు. టీఆర్‌ఎస్‌తో బీజేపీ కుమ్మక్కైందని జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా, ఆయన తోసిపుచ్చారు. టీఆర్‌ఎస్-మజ్లిస్ కలిసి పోటీ చేశాయని అన్నారు. రైతుబంధు పథకం రైతు బంద్‌గా మారిందని ఆయన విమర్శించారు. రైతు బంధు పథకం ఇంకా 9 లక్షల మందికి అందాల్సి ఉంద ని, 5 లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు రాలేదని ఆయన తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరగలేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జేపీసీ విచారణ కోరడంలో అర్థం లేదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 300 స్థానాలకు తగ్గకుండా విజయం సాధించి, తిరిగి అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అవుతారని ఆయన చెప్పారు.
  బాబు ప్రచారంతో..
  ప్రజా కూటమి తరఫున టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం వల్ల టీఆర్‌ఎస్‌కు మేలు జరిగిందని ఆయన తెలిపారు. కూటమి వస్తే మళ్లీ చంద్రబాబు అధిపత్యం చెలాయిస్తారని భావించిన ప్రజలు కూటమిని, బీజేపీని, ఇతర పార్టీలను పక్కన పెట్టి టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు ధీటుగా తాము వ్యూహం చేశామని, సీట్లు రాకపోయినా గతంలో వచ్చినట్లే 7 శాతం ఓట్లు వచ్చాయని దత్తాత్రేయ వివరించారు. లోగడ ఇంత కంటే ఘోరమైన ఓటమిని చవి చూశామని, ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చామని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తాము కుంగిపోలేదని అన్నారు.


  0 0

  హైదరాబాద్, డిసెంబర్ 23: పంచాయతీరాజ్, జెడ్‌పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ కృష్ణయ్య అధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాకు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కృష్ణయ్య ప్రసంగిస్తూ ఎస్‌సి, ఎస్‌టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని గరిష్ట పరిమితి సుప్రీంకోర్టు పెట్టడంలో ఏ మాత్రం ఔచిత్యం లేదన్నారు. రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్ విధించడం భావ్యం కాదన్నారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టిన తర్వాత బీసీల్లో, మహిళల నాయకత్వం పెరిగిందని గుర్తు చేశారు. కాబట్టి సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసి ‘స్టే’ తెచ్చి 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.


  0 0

  హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ ఏబీవీపీ నూతన అధ్యక్షునిగా డాక్టర్ ఎం. ప్రసాద్ (ఓయూ, హైదరాబాద్), కార్యదర్శిగా అంబల కిరణ్ (కేయు, వరంగల్)ను నియమిస్తూ ఎన్నికల అధికారి డాక్టర్ కనుప బాల రాజు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఎం. ప్రసాద్ 1986 నుంచి ఏబీవీపీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి దశ నుంచి చురుగ్గా పాల్గొంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ ప్రసాద్ 2018-19లో రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. అంబల కిరణ్ 2913 నుంచి ఏబీవీపి కార్యకర్తగా, వరంగల్ జిల్లాలో విద్యార్థి ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలలో పాల్గొన్నారు. కిరణ్ మొదటి సారి (2018-19) బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి గుజరాత్‌లో జరిగే జాతీయ మహా సభల్లో వీరిరువురు బాధ్యతలు స్వీకరించనున్నారు.


  0 0

  మహబూబ్‌నగర్, డిసెంబర్ 23: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని తెరాసలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ నుండి మొదలుకుని పార్టీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన్నప్పటి నుండి నివురు గప్పిన నిప్పులా కల్వకుర్తి టీఆర్‌ఎస్‌లో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు ఆదివారం ఎట్టకేలకు భయటపడ్డాయి. శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతు ఇవ్వకుండా ఇతర పార్టీల వారికి సహకరించారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. ఆదివారం కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని సాయిబాలాజీ పంక్షన్ హాలులో టీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి హజరు కావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా కుర్చీలను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై విసరడంతో సమావేశం రణరంగంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి వేరే అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని కొందరు తెరాస కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్సీపై కుర్చీలు విసిరి వీరంగం సృష్టించారు. సమావేశ ప్రాంగాణానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాగానే జైపాల్‌యాదవ్ వర్గీయులు ఒక్కసారిగా కూర్చిలను సమావేశంలో విసరడం ప్రారంభించారు. వేదికపై వచ్చిన కసిరెడ్డి నారాయణరెడ్డిని జైపాల్‌యాదవ్ వర్గీయులు, తెరాస కార్యకర్తలు చుట్టుముట్టి ఆయనతో వాగ్వీవాదానికి దిగారు. కొందరు విసిరిన కుర్చీలు కసిరెడ్డి నారాయణరెడ్డికి తగలడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని సమావేశం నుండి పోలీసుల రక్షణతో భయటకు తీసుకువచ్చి అక్కడి నుండి సురక్షితంగా పంపించేశారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేసిన్నందుకే కార్యకర్తలు ఆగ్రహనికి గురైయ్యారని జైపాల్‌యాదవ్ అనుచురులు అంటుండగా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన్నందుకే కల్వకుర్తిలో టీఆర్‌ఎస్ గెలిచిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయుల వాదన.

  చిత్రం..కల్వకుర్తిలో తెరాస కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపైకి కుర్చీలు విసరడంతో వేదికపై పడి విరిగిన కుర్చీలు


  0 0

  హైదరాబాద్, డిసెంబర్ 23: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లో పీవీ ఘాట్ వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో పాటు పలువురు నేతలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై పీవీకి నివాళులు ఆర్పించారు. మాజీ మంత్రులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నరసింహారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య నివాళి అర్పించిన ముఖ్యుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ, పీవీ రాజకీయ దురంధరుడన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు నడిపిన అపర చాణక్యుడని కొనియాడారు. అయితే అంతటి మహానాయకుడికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయకపోవడం బాధకరమన్నారు. దక్షిణాది రాష్ట్రాల నేతల పట్ల ఉత్తరాదిన వివక్ష కనబరుస్తున్నారని అన్నారు. దేశ రాజకీయాల్లో పీవీ నరసింహారావు తనదైన బలమైన ముద్ర వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశానికి ప్రధాన మంత్రి అయిన తొలి వ్యక్తి పీవీనేన్నారు. ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలతో దేశానికి ప్రపంచంలోనే ఒక గునర్తింపు తీసుకొచ్చారన్నారు. ఇలా ఉండగా గాంధీభవన్‌లో కూడా పీవీ వర్ధంతి వేడుకలు జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీవీ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు ఆర్పించారు.

  చిత్రాలు.. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో పీవీ ఘాట్ వద్ద నివాళిలర్పిస్తున్న నేతలు


  0 0

  కొత్తగూడెం, డిసెంబర్ 23: కార్మికుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. కార్మికుల సొంతింటి నిర్మాణానికి వడ్డీలేని రూ 10లక్షల రుణాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సంస్థ చర్యలు తీసుకుంటుందని అన్నారు. సింగరేణి ఏరియాల్లో 300మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను తయారు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ ఏడాది 130 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. భూగర్భ గనుల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయటం వల్ల ప్రమాదాలను నివారిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 52మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఉండగా ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల స్థాయికి తీసుకొచ్చామని అన్నారు. భూగర్భ బావులను ప్రారంభించి తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. సింగరేణి సంస్థ ఉన్న ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ దక్షిణ భారతదేశంలోని విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేస్తోందని అన్నారు. చత్తీస్‌ఘడ్, ఓడిషా రాష్ట్రాల్లో ఆరు కొత్త బ్లాకులను ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రూ 1300కోట్ల లాభాలను అర్జించేందుకు బొగ్గు ఉత్పత్తి, రవాణా చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ ఉత్పత్తిరంగం వైపు సింగరేణి చర్యలు చేపట్టి జైపూర్ విద్యుత్ కేంద్రం ద్వారా జాతీయ స్థాయిలో 5వ స్థానానికి చేరినట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా ఈ ఏడాది కేవలం నాలుగు ప్రమాదాలు మాత్రమే జరిగాయన్నారు. భవిష్యత్‌లో ప్రమాదరహిత సింగరేణి సంస్థగా ఉండేందుకు విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోయగూడెం, గౌతంఖని ఓపెన్‌కాస్ట్, జెవిఆర్ ఓపెన్‌కాస్ట్ విస్తరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఏటా మొక్కలు నాటేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్, డైరక్టర్లు శంకర్, భాస్కర్‌రావు, బలరాం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్రావు, సింఎంవోఎ రాష్ట్ర అధ్యక్షులు గడిపెల్లి కృష్ణప్రసాద్, జనరల్ మేనేజర్ పర్సనల్ బసవయ్య, జిఎం వెల్ఫేర్ ఆనందరావు, సేఫ్టీ జీఎం వెంకటేశ్వర్లు, ఎస్టేట్ జీఎం ఆంతోని రాజా, కంపెనీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  రాబోవు ఎన్నికలకు సమాయత్తం కావాలి
  * టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కిళ్ళపల్లి
  ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 23: రానున్న గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కిళ్లపల్లి రవీందర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఖమ్మం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం యావత్తు ప్రజలు టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారన్నారు. ఖమ్మం జిల్లా కొంత నిరాశకు గురిచేసందని, ఓటమికి కుంగి పోకుండ రానున్న గ్రామపంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఓటర్ల నమోదు ఎంతో ముఖ్యమని అందులో నాయకులు, కార్యకర్తలు ముందుండాలన్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపి సీతారామనాయక్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయని టిఆర్‌ఎస్ బలోపేతానికి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రజలు మద్దతు టిఆర్‌ఎస్‌కు ఉందన్న విషయం జరిగిన ఎన్నికలతో తేటతెల్లమైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలకు అనేక సంక్షేమాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయని టిఆర్‌ఎస్ గెలుపుకోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, గ్రంథలయ సంస్థ చైర్మన్, ఖమర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఆర్‌జెసి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  ఇల్లందు, డిసెంబర్ 23: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ క్యాడర్ దృష్టి పెట్టాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం ఇల్లందులో జరిగిన నియోజక వర్గ స్థాయి టిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగంతోపాటు ఇతర వర్గాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామ పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని కోరారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయటంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అర్హులైన పేదలకు అందినప్పుడే ఆయా పథకాలకు సార్థకత చేకూరుతుందని అన్నారు. జిల్లా పరిశీలకులు నూకల నరేష్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ క్యాడర్ సైనికుల్లా పనిచేయాలని కోరారు. గెలుపు, ఓటములు సహజమేనని ఓటమితోను బాధపడాల్సిన పని లేదన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ శక్తివంతంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఆ శక్తిని రెట్టింపు చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. ఓటర్ల జాబితా విషయంతోపాటు ఇతర అన్ని విషయాల్లోనూ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. వివిధ అంశాలపై సమావేశంలో నాయకులు చర్చించారు. నియోజక వర్గంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలతోపాటు పార్టీ అధినాయకత్వం సూచించే వాటిని అమలు చేసే విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమష్టి కృషితో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తీర్మానించారు. విస్తృత స్థాయిలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, నాయకులు మడతా వెంకట్‌గౌడ్, మధుకర్‌రెడ్డి, లక్కినేని సురేందర్, దిండిగాల రాజేందర్, సిలివేరు సత్యనారాయణ, పులిగండ్ల మాధవరావు, దేవీలాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
  ఘనంగా క్రిస్మస్ వేడుకలు
  నేలకొండపల్లి, డిసెంబర్ 23: ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం మండలంలో పలు గ్రామాలలో చర్చిలలో భక్తిశ్రద్దలతో వేడుకలు నిర్వహించారు. అలాగే చర్చిలన్నీ వివిధ రకాల పూలతో, క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ తాత మస్కులు, రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. మండల పరిధిలోని కొత్తకొత్తూరు గ్రామంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ వేశదారులతో సంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆటల, పాటల పోటీలు నిర్వహించి విద్యార్ధులకు బహుమతులు అందించారు. లోక రక్షకుడైన ఏసుక్రీస్తు మానవాళి మనుగడుకు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని ఉపాధ్యాయులు ఈ సందర్బంగా విద్యార్ధులకు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి స్వీట్‌లు, బహుమతులు పంచుకున్నారు. ఈ వేడుకలలో ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ ఉపాధ్యాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


  0 0

  మణుగూరు, డిసెంబర్ 23: సింగరేణి కాలరీసు సంస్థ 130 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఆవిర్భావ వేడుకలను మణుగూరు ఏరియాలో ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక భద్రాద్రి స్టేడియం ప్రాంగణంలో సింగరేణి జెండాను ఎగురవేసి సింగరేణి గీతాన్ని ఆలపించిన అనంతరం ఉత్సవ వేడుకల ప్రాంగణంలో స్థానిక కార్మికులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ వేడుకల్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు పాల్గొని ఆవిర్భావ వేడుకలను ఉద్ధేశించి సింగరేణి భవిష్యత్ లక్ష్యాలను దిశానిర్ధేశం చేశారు. సంస్థ ఉత్పత్తి, లక్ష్యంలో అధికారి, కార్మికుడు అన్న బేదం లేకుండా సమిష్టి కృషి చేసి మణుగూరు ఏరియాను సింగరేణి ఉత్పత్తి లక్ష్యంలో ప్రధానభూమిక పోషించేలా అన్ని ఏరియాల్లోకి ఆదర్శప్రాయంగా నిలిచేలా కార్మికులు కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు.
  ఆకట్టుకున్న స్టాల్స్
  సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా స్థానిక భద్రాద్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ కార్మిక కుటుంబాలను, స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సింగరేణి కొండాపురం అండర్‌గ్రౌండ్ మైన్‌లో కోల్‌కటింగ్‌కు సంబంధించిన స్టాల్స్, మణుగూరు ఓపెన్‌కాస్టు నమూనా స్టాల్స్, సింగరేణి సంస్థలో ఉపయోగించే యంత్రాల తీరును వివరించే స్టాల్స్‌తో పాటు సింగరేణి మహిళలు తాము సేవా సమితి ద్వారా నేర్చుకున్న చేతివృత్తులకు సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించారు. వీటితో పాటుగా గని కార్మికులు ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు రవాణా విభాగంలో సింగరేణి సంస్థ యాంత్రీకరణను ఏ విధంగా ఉపయోగించుకుటుందో తెలిపే అప్‌లోడింగ్ ప్రక్రియలకు సంబంధించిన డంపర్, కోల్‌హ్యాండింగ్ వంటి విభాగాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పలువురు సింగరేణి అధికారులతో పాటు కార్మికులు, కార్మిక కుటుంబాలు పాల్గొన్నాయి.


  0 0

  కొత్తగూడెం, డిసెంబర్ 23: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి ప్రకాశం స్టేడియం గ్రౌండ్ వరకు నిర్వహించిన 2కె రన్‌ను సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ ప్రారంభించారు. అనంతరం ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి జెండాను ఆవిష్కరించారు. సింగరేణి బొగ్గు అనే్వషణలో కీలకపాత్ర పోషించే ఎక్స్‌ఫ్లోరేషన్ విభాగపు స్టాళ్లను ఆయన ప్రారంభించారు. అనే్వషణ విభాగంలో వినియోగిస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థ పరిధిలోని వివిధ విభాగాలు నిర్వహిస్తున్న పనులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి యాజమాన్యం చేపడుతున్న కార్యక్రమాలను పర్యావరణ అధికారులు వివరించారు. కార్మికులు సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు, స్వయం ఉపాధి కోసం నిర్వహిస్తున్న పనులను ఫారెస్ట్ అధికారులు చేపడుతున్న నర్సరీలు, మొక్కల పెంపకంపై చైర్మన్‌కు వివరించారు. విజిలెన్స్ విభాగం నిర్వహిస్తున్న విధులు, కార్మికుల వైద్యం కోసం చేపడుతున్న కార్యక్రమాలను సింగరేని ప్రధాన వైద్యాధికారి వివరించారు. సెంట్రల్ వర్క్‌షాప్‌లో చేపడుతున్న పనులు, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను సింగరేణి అధికారులు వివరించారు. సింగరేణీయుల కుటుంబీకుల సంక్షేమం, విద్యపై నిర్వహించిన స్టాళ్లను పరిశీలించారు. సింగరేణి సూపర్ బజార్, ఫుడ్ కోర్ట్, పాలిటెక్నిక్ విద్యార్ధులు పర్యావరణ పరిరక్షణ కోసం వినియోగిస్తున్న వాహనాలను పరిశీలించారు. సింగరేణి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌ను సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరక్టర్ (పా) చంద్రశేఖర్, డైరక్టర్లు శంకర్, భాస్కర్‌రావు, బలరాం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్రావ్, సిఎంవోఎ అధ్యక్షుడు గడిపెల్లి కృష్ణప్రసాద్, కంపెనీ కార్యదర్శి గుండా శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పర్సనల్ బసవయ్య, జనరల్ మేనేజర్ సిఎస్సార్ ఆనందరావు, జనరల్ మేనేజర్ ఎస్టేట్స్ ఆంతోని రాజా, సేఫ్టీ జిఎం వెంకటేశ్వర్లు, పర్సనల్ మేనేజర్లు కుమార్‌రెడ్డి, దీక్షితులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


  0 0
 • 12/24/18--04:49: అనంతం-18
 • వాళ్ళ చేతుల్లో అధికార పార్టీ జెండాలూ, జేబుల్లో సర్వీసు రివాల్వర్లూ ఉన్నాయి.
  ‘‘్భరత్ మాతాకీ జై.. పెంటారెడ్డికీ జై’’ అని గొంతెత్తి అరుస్తూ మఫ్టీ కానిస్టేబుళ్ళు తండా అంతా ఓ చుట్టు చుట్టి, చివరకి ఎమ్మెల్యేతో కలిసి చింతచెట్టు క్రిందకి చేరారు.
  గుమికూడిన తండావాళ్ళ నుద్దేశించి-
  ‘‘నా ప్రియమైన అడవి పుత్రులారా’’ అనగానే-
  ‘‘మీ కాట్టాలు గాల.. మీ పీనిగెలెల్ల.. తలేపు దీపవెట్ట.. మీ పీనిగెల్ని రాబొందుల్దిన.. మిమ్మల్ని వొలుకుల్లో గాల్స..’’ అని గొంతెత్తి అరుస్తూ బాణావతు భార్య లక్ష్మీబాయి సుడిగాల్లా విరుచుకుపడుతూ ఎమ్మెల్యే ముందుకు వచ్చింది.. అందరూ నిర్ఘాంతపోయారు.
  ఎమ్మెల్యే శాంతంగా ఒక్క క్షణం ఆలోచించాడు.
  ‘‘నా సోదరికేదో కట్టం వచ్చినట్టుంది’’ అన్నాడు.
  ‘‘నా పెనివిట్ని పోలీసోళ్ళు గొట్టారు. పక్కనుండ కాలీశరాన్నీ గొట్టారు. గొడ్లని బాదినట్టు సావబాదారు.
  తేనె బట్టటవ్ తప్పంట.. అడవి మీ అబ్బ సొత్తా? అని అడిగినారంట.. మాదీ మీదీ గాదది, దేవుడిచ్చిన అడివి.
  అడివిలోబుట్టి అడివిలోనే వుంటన్న మాగ్గాక యింకెవుడికుంటుంది అదికారఁవ్? తడాగూడా ఖాళీజేసి ఎలిపోవాల్నంట.
  ఊళ్ళల్లో ఉండనియ్యకా, అడువుల్లో ఉండనియ్యకా... ఇంకేడికి బోవాలె మేవంతా’’అని ఎమ్మేల్లేని నిలదీసింది లక్ష్మీబాయి.
  ‘‘కొట్టారా’’ శాంతంగా అడిగాడు ఎమ్మెల్లే.
  ‘‘సావగొట్టారు.’’
  ‘‘ఎవరు.’’
  ‘‘పోలీసోళ్ళే.’’
  ‘‘నేను ఖండిస్తున్నాను’’ అన్నాడు ఎమ్మెల్లే.
  ‘‘కండిచ్చి ఏంబీకుతావ్’’అంటూ, గుంపులోనుంచి ముందుకు వచ్చింది చాంద్‌నీ. ‘‘మా అయ్యని సూత్తే ఏడుపొత్తుంది లాటీదెబ్బలకి వొళ్ళంతా సీరుకుపోనాది’’అన్నది, ఆవేశం బాధ మిళితం చేసి.
  కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్లే పెంటారెడ్డి చాందినీ మీదనుంచి చూపులు మరల్చుకోలేకపోయాడు.
  ఎంత అందంగా వుంది!
  ‘‘నీ పేరేమిటి’’అని అడిగాడు.
  ‘‘శాందినీ.’’
  ‘‘ఎవరమ్మాయివి.’’
  ‘‘కాలీశరణ్ కూతుర్ని.’’
  ‘‘మీ నాన్నని కూడా కొట్టారా.’’
  ‘‘సావగొట్టారు.’’
  ‘‘ఐతే పీకుతా! వాళ్ళని ఉద్యోగాల్లోనుంచి పీకేస్తా! వెంటనే కమిటీవేసి విచారణ జరిపిస్తా’’అని హామీఇచ్చాడు ఎమ్మెల్లే.
  సద్దుమణిగింది.
  ‘‘నా ప్రియమైన అడవి పుత్రులారా! నేను తండా బాటపట్టింది ఎందుకంటే...’’
  ‘‘కానిస్టేబుళ్ళ ఉజ్జోగాలూడబీకి అప్పుడొచ్చిచెప్పు’’అన్నది లక్ష్మీబాయి పెద్దగా... తండావాళ్ళంతా ముసిముసి నవ్వులు నవ్వుతూ. అక్కడ్నించి దూరంగా వెళ్ళిపోయారు.
  చింత చెట్టుక్రింద ఎమ్మెల్లే, మఫ్టీ కానిస్టేబుళ్ళు మాత్రమే మిగిలారు... ఇక, ఉపన్యాసం ఎవరికి చెప్పాలి?
  తండా బాట గురించి కానిస్టేబుళ్ళకు చెప్పటం అనవసరం అనుకున్నాడు ఎమ్మెల్యే! చేసేదేమీ లేక-
  గుడారాల బాట పట్టాడు!
  ఎమ్మెల్లే వెంట పార్టీ జండాలతో వచ్చినవాళ్ళు వరిబువ్వ పెట్టకుండానే వెళ్ళిపోవటంతో,
  ‘‘వరి బువ్వ...వరి బువ్వ’’అంటూ పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు వాల్యా!
  * * *
  రాగ్యా నిద్ర లేచాడు. నిషా పూర్తిగా తగ్గిపోయింది.
  చన్నీళ్ళతో మొహం కడుక్కొని తలగుడ్డతో తుడుచుకున్నాడు.
  గరుడాచలం కోసం చూశాడు.
  ‘‘నిద్ర లేచావా...గుడ్’’ అన్నాడు అప్పుడే బైట్నించి వచ్చిన గరుడాచలం.
  ‘‘నిషా తలకెక్కింది. తొంగున్నాను. గొడవేఁవీ సెయ్యలేదుగదా’’అని గరుడాచలాన్ని రాగ్యా అడిగాడు.
  ‘‘అలాంటిదేమీ లేదు. మామూలే’’అన్నాడు తేలిగ్గా కొట్టిపారవేస్తూ. రాగ్యా కళ్ళు షోకేస్ వైపుకు తిరిగాయి.
  ‘‘మళ్ళీ కావాలా’’ అడిగాడు గరుడాచలం.
  ‘‘తఁవరూ దాగాల.’’
  ‘‘అలాగే’’ అన్నాడు గరుడాచలం.
  తాగుతూ కూర్చున్నారు.
  ‘‘చాంద్‌నీ అంత బాగుంటుందా’’ మధ్యలో గరుడాచలం అడిగాడు.
  ‘‘సూత్తేనే గుబులైతది. శారెడంత కళ్ళూ సందమాఁవ మొకఁవూ... మొగిలి పువ్వులా వుంటుంది’’ చెప్పాడు రాగ్యా.
  ‘‘చలాకి పిల్లేనా.’’
  ‘‘దాని శలాకీతనఁవ్ సూడార్నంటే దేవర సంబరాల్లోనే!’’
  ‘‘సంబరం అంటే.’’
  ‘‘జాతర. కొండదేవర జాతర.’’
  ‘‘ఏం చేస్తారూ.’’
  ‘‘అడివిలో వుండ అన్ని తండాలవోళ్ళూ నల్లకొండ కొత్తారు..’
  ‘‘వచ్చి, ఏం చేస్తారూ.’’
  ‘‘గులాపులు సల్లుకుంటా, కొమ్ము బూరాలూదుకుంటా, డప్పులు వాయిచ్చుకుంటూ సిందులేత్తారు. కల్లుదాగినోళ్ళు, తాగనోళ్ళు గూడా తప్పెట్లసప్పుడికి సిందులేత్తారు. దేవరకి బలులిచ్చి, బువ్వలో రగ్తం గలిపి బలెన్నఁవ్. నైవీజ్జిగఁవెడతారు- కొండ దేవరకి.’’
  ‘‘చాంద్‌నీ చలాకితనానికీ, దానికీ ఏమిటి సంబంధం.’’
  ‘‘శాందినీ కాలికి గజ్జెకట్టుద్ది. కోక ఎగ్గట్టుద్ది...అది సిందులేసినట్టు సంబరఁవ్లో ఎవ్వురూ ఎయ్యలేరుసారూ’’ అన్నాడు రాగ్యా.
  ఇక చాందినీ విషయం ఎత్తలేదు. కర్తవ్యం గుర్తొచ్చింది గరుడాచలానికి. విషయాన్ని మరోవైపుకు మళ్ళిస్తూ-
  ‘‘మనం అడవికి వెళ్ళాలి. కలివికోడి జాడలకోసం వెతకాలి. త్వరగా భోంచేసి వెళ్ళొద్దాం’’ అన్నాడు రాగ్యాతో.
  సేవకు భోజనాలు వడ్డించారు. మందు గ్లాసులు తీసి, మంచినీళ్ళ గ్లాసులు పెట్టారు.
  వహ్వా... ఏం భోజనం!
  మృష్టాన్న భోజనం.
  సంపన్నుల భోజనం.
  (ఇంకా ఉంది)


  0 0

  కిడ్నాప్
  రచన: షేక్ అహమద్ భాష
  వెల రూ.150/- లు ప్రచరణ- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ
  H.No. 33- 22-2 చంద్రం బిల్డింగ్స్ , చుట్టుగుంట, విజయవాడ =520 004 ఫోను- 0864- 2430302
  ============================================================
  అరణంలోని దృశ్యాలను అద్భుతంగా వర్ణించిన నవల షేక్ అహమద్ భాషగారి ‘కిడ్నాప్’. అడవిలో ఏడురోజులు అంటూ ఆదివారం, సోమవారం ఏడురోజుల్లో ముగిస్తారు నవలని. రచయిత షేక్ అహమద్ భాషాగారు.
  దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు దర్పం ఈ నవల అన్నట్టు ఈ రచన. ప్రతీ అంశాన్నీ అత్యద్భుతంగా వర్ణిస్తూ, అరణ్యంలోని సొబగులన్నింటినీ జలపాతాలనూ, అడవి మొక్కలను ఔషధమొక్కలను ఆ వాతావరణాన్ని అక్కడి వన్యమృగాలనీ, పశుపక్షాదులనీ తాను స్వయంగా చూసి అనుభవిస్తూ పాఠకులకు కూడా అలాగే అనుభవించేలా, అనుకుంటూ రచన సాగిస్తారీ రచయిత.
  ఎక్కడా బోరు కొట్టించకపోగా ఏకబిగిన చదివిస్తుంది. ఎన్నో విజ్ఞాన విషయాలను తెలుపుతుంది. కులమతాలు, అవినీతి, రాజకీయాలకు లొంగని నవసమాజాన్ని ఆశీస్తాడీ రచయత. ఈగ్రంథాన్ని దేశాభ్యున్నతి కోసం పాటుబడే అధికారులకు అంకితం చేస్తారు నవలని. భాష భావం అన్నీ సులువుగా అర్థమవుతూ ఆసక్తికలిగిస్తూ ఆలోచింపచేస్తూ చదివించే నవల కిడ్నాప్.


  0 0

  గెలుపుకిరణాలు
  రచన: డా. సునీత మూలింటి
  వెల:రూ.150/-లు.
  పుస్తకం దొరుకుచోటు జ్యోతి వలబోసు ఫోన్ నెం.80963140
  ==========================================================
  తన అనుభవాలను మాలగుచ్చిడా. సునీత మూలింటి ప్రచురించిన యథార్థ గాథల కూర్పు, ఈ ‘గెలుపుకిరణాలు’ గ్రంథం. ఈ గ్రంథం ధైర్యకిరణాలను ప్రసరించేది. ఇందులోని సంఘటనలలో కొన్ని గుండెనిపిండేస్తే, మరికొన్ని సంఘటనలు ఎటో లాక్కుపోతాయి. క్యాన్సర్ రోగం పేరు వినగానే, సగం ప్రాణం పోతుంది. ఆ రోగులకు ధైర్యం చెబుతూ జబ్బు నయం చేయాలనుకొనే డాక్టరు సాక్షాత్తూ నారాయణ మూర్తులే.. ఆ శ్రీహరి స్వరూపాలే. (అందుకే ‘వైద్యోనారాయణో హరి’ అన్నారు.) కొన్ని సందర్భాలలో డాక్టర్లు ఇచ్చే మందులకన్నా వారి చిరునవ్వుల పలకరింపులూ, దైర్యాన్నిచ్చేమాటలే అధికంగా పనిచేస్తాయి. డాక్టరు కేవలం యాంత్రికంగా మందులిచ్చుకుంటూ పోతే, గుడి ఎంత గొప్పదయినా , గుళ్లో పూజారి గౌరవించకపోతే ఆ గుడికి పోవాలనిపించకపోవడం, ఎంత సహజమో ఇదే అంతే సహజం. క్యాన్సర్ లాంటి కఠినమైన మొండిరోగాన్ని కుదిర్చే డాక్టరు మనసు పెట్టి నాలుగు తియ్యని మాటలు చెబుతూ ట్రీట్ మెంట్ చేస్తూ ఉంటే రోగి సగం బాధ మరిచిపోయి, తను కోలుకుంటూ ఉన్న అనుభవాన్ని పొందుతాడు. అలా రోగులతో సంభాషిస్తూ ట్రీట్‌మెంట్ చేసిన జ్ఞాపకాల మాల డా॥ గ్రంథం గెలుపుకిరణాలు. రచయిత్రిగా కూడా ఈగ్రంథం ద్వారా సునీతగారు ధైర్యాన్ని ప్రసాదించడం అభినందనీయం. ‘క్యాన్సర్ ఓడింది. ప్రేమ గెలిచింది’ ఓ కూతురి కథ, చీకట్లో చిరుదీపం యథార్థ సంఘటనల కథాకూర్పు అద్భుతం అవసరం కూడా చాలామంది ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి.


  0 0

  కొల్లాయి గట్టితేనేమి? నవలలోని కథా వస్తువు 1920లో ప్రారంభవౌతుంది. ఈ నవలలోని ప్రధాన పాత్ర రామనాథం. రామనాథం వెంటా, రామనాథం చుట్టూ ఈ నవల నడుస్తుంది. అంటే ఒక వ్యక్తి జీవిత కేంద్రంగా సామాజిక జీవితాన్ని ఆవిష్కరించిన నవల ఇది. గాంధీజీ పిలుపు మేరకు, తాను చదువుతున్న చదువుకు స్వస్తి చెప్పి, కళాశాలను బహిష్కరించి జాతీయోద్యమంలో భాగస్వామి కావటానికి రామనాథం ప్రయాణం కావటంతో ఈ నవల మొదలౌతుంది.
  ఈ నవలలోని కథ ప్రారంభమయ్యేనాటికి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధానంతరం సైన్యంలో అసంతృప్తి ప్రబలింది-్ధరలు పెరగటం, మోయరాని పన్నుల భారం ఒకవైపు, పరాయి పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న జాతీయోద్యమం మరోవైపు, వీటిని అణచటానికి రౌలట్ చట్ట ప్రయోగం, జలియన్‌వాలాబాగ్ దారుణ మారణకాండ, గాంధీ పిలుపు కారణంగా సహాయ నిరాకరణోద్యమం-
  ఇదంతా ఈ నవలకు నేపథ్యం-
  జాతీయోద్యమ భావ బీజాలు, ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత, కాంగ్రె స్ పార్టీలో గాంధీ నాయకత్వం, విదేశీ వస్తద్రహనం, ఇంగ్లీషు చదువులను బహిష్కరించటం, ఖద్దరు వస్త్రాలు ధరించటం, చరఖా మీద నూలు వడకటం, ఇదంతా నవలకు పూర్వరంగం. గాంధీ సహాయ నిరాకరణోద్యమ ప్రభావంతో రామనాధం తాను చదువుతున్న కాలేజీ చదువును బహిష్కరించి, విదేశీ వస్త్రాలు దహనం చేసి, ఖద్దరు ధరించి, తన స్వగ్రామమైన ముంగండకు వస్తాడు. ఆముంగండ ఎట్లాంటిదీ అంటే పరమ నైష్ఠికతకూ, ఛాంద సంప్రదాయాలకూ, కరడుగట్టిన ఆధిపత్యానికి మారు పేరు! దళితులను చాలా హీనంగా చూస్తూ, వాళ్లు తాగటానికి చెరువు నీళ్లు ఇవ్వటానికి ఇష్టపడని అగ్రకులాల కొంప అది! విదేశీయానం చేసినవారు ఆవు పేడ మింగి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే-నిజానికి ఈ ముంగండ రచయిత మహీధర గారి స్వంత వూరే. ఆ వూరి అగ్రకులం నెరపే పాశవిక అనాగరిక దుశ్చర్యలు ఆయన కళ్లారా చూసినవే! అలాంటి వర్ణాన్ని పూచిక పుల్లలా విసిరి పారేవేస్తాడు రచయిత ఈ నవలలో-
  రామనాథం, గాంధీజీ భావజాలంతో ప్రేరితుడైన మంచి మనిషి- అతడు గ్రామంలో ప్రవేశించగానే తన సంస్కరణ, ఆశయాలను అమలు జరపటానికి ప్రయత్నిస్తాడు. దళితులకు తన తోటలోని బావిని తాగునీటికోసం ఇస్తాడు. దాని ప్రారంభానికి దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిని పిలుస్తాడు. ఊళ్లో అందరిచేత వెలి అవుతాడు-అయినా సాహసోపేతంగా తను నమ్మిన సంస్కరణను అమలు జరుపుతాడు. ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపిస్తాడు. దాన్ని సందర్శించటనాకి గాంధీజీ లాంటి మహానాయకుణ్ణి ఆహ్వానిస్తారు.
  రామనాధం తన స్వగ్రామానికి వచ్చేటపుడు దారిలో ‘స్వరాజ్యం’ అనే నాయుళ్ల అమ్మాయి పరిచయమవుతుంది. స్వరాజ్యం తండ్రి ‘అబ్బాయి నాయుడు’ బ్రహ్మ సమాజం భావాలు కలిగినవాడు-వీరేశలింగం శిష్యుడు. ఆడపిల్లలకు చదువు అవసరం గుర్తించిన వాడు. అందువల్ల కూతురుకు ఇంగ్లీషు చదువు చెప్పించాడు. అప్పటికే ఆమెకు పెళ్లయింది. ఆడపిల్ల చదువుకోవటం వాళ్లకి నచ్చలేదు.
  - సశేషం
  రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


  0 0

  సీ. గౌతమీ స్నానాన ఁ గడతేరుదామంటే
  మొనసి చన్నీళ్లలో మునుఁగలేను
  తీర్థయాత్రల చేఁ గృతార్థుఁడౌదామంటే
  బడలి నే మంబు నే నడవలేను
  దాన ధర్మముల సద్గతి జెందుదమంటే
  ఘనముగా నా వద్ద ధనములేదు
  తపమాచరించి సార్థకత నొందుద మంటే
  నిమిషమైన మనసు నిలువలేదు
  తే. కష్టముల కోర్వ నా చేతఁగాదు నిన్ను
  స్మరణ చేసేద నాయథాశక్తి కొలది
  భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
  దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

  భావం: స్వామీ గోదావరిలో స్నానం చేసి తరిద్దాం లెమ్మనుకొంటే ఆ చన్నీటిలో నేను మునగలేను. పుణ్యతీర్థాలు తిరిగి ప్రయోజకుణ్ణి అవుదామనుకొంటే నియమ నిష్టల్ని పాటించలేను. దాన ధర్మాలు చేద్దాం లెమ్మనుకొంటే నా వద్ద డబ్బులు లేవు. తపస్సు చేద్దామనుకొంటే క్షణకాలం కూడా మనస్సు కుదుటగా ఉండటం లేదు. నేను కష్టాల్ని సహించలేను. నా శక్తికొలది నిన్ను ధ్యానిస్తాను.


  0 0
 • 12/24/18--04:56: maatata
 • Cross Image: 
  Date: 
  Tuesday, December 25, 2018

  0 0
 • 12/24/18--05:08: రంగవల్లి
 • 21చుక్కలు
  5వరుసలు ఇటు అటు వదిలి 5 వరకు

  ఎన్.శాంతి హైదరాబాద్

  ======================================================================
  ముగ్గులకు ఆహ్వానం
  నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
  సూచనలు
  * ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
  * ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
  * ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
  * ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
  * డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

  ముగ్గులు పంపాల్సిన చిరునామా:
  ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.


older | 1 | .... | 1983 | 1984 | (Page 1985) | 1986 | 1987 | .... | 2069 | newer