Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కానుకలు.. కేరింతలు.. క్రిస్‌మస్ కాంతులు..

$
0
0

ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ.. దేశవిదేశాల్లో సందడే సందడి.. పిల్లలకైతే చెప్పలేనంత సరదా.. అదే క్రిస్‌మస్ వేడుక.. మరి దీని వింతలూ, విశేషాలూ తెలుసుకోకపోతే ఎలా? క్రిస్‌మస్ పండుగని చేసుకోవడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత.. మరి ఎక్కడెక్కడ ఎలా చేసుకుంటారో తెలుసుకుందామా..
* ఫ్రాన్స్‌లో క్రిస్‌మస్ పండుగ సంబరాలు సెయింట్ నికోలస్ డే సందర్భంగా డిసెంబరు ఆరు నుంచే మొదలవుతాయి. ఆ రోజు నుంచే చిన్నారులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, మిఠాయిలు పంచుకోవడం చేస్తుంటారు. ఎక్కడ చూసినా రకరకాల అలంకరణలే కనిపిస్తుంటాయి. ఇక్కడ అల్సాస్ ప్రాంతంలోనే 14వ శతాబ్దంలో తొలిసారిగా క్రిస్‌మస్ చెట్లను అందంగా అలంకరించడం ప్రారంభించారని చెప్పుకుంటారు. ఇవాళ చిన్నారులంతా కలిసి పొగగొట్టాల దగ్గర పాలిష్ చేసిన తమ బూట్ల జతల్ని ఉంచుతారు. వీటిల్లో ఫాదర్ క్రిస్‌మస్ మిఠాయిలను కానుకగా ఉంచుతారని వీరి నమ్మకం.
* ఇంగ్లండులో ఈ రోజు ఇళ్లన్నీ రంగు రంగుల లైట్లతో అలంకరిస్తారు. చక్కగా ముస్తాబు చేస్తారు. వీటిని చూడ్డానికి సందర్శకులు కూడా వస్తారు. వీరి దగ్గర ఇంటి యజమానులు డబ్బుల్ని సేకరించి స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు.
* ఉక్రెయిన్‌లో క్రిస్‌మస్ చెట్లలో సాలెగూళ్లను ఉంచుతారు. వాటిని కనిపెట్టిన వారికి అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.
* ఫిలిప్పీన్స్‌లో వెదురు, కాగితంతో లాంతర్లు తయారుచేస్తారు. ముగ్గురు జ్ఞానులకు క్రీస్తు జన్మస్థలం ఎక్కడుందో దారిచూపే ‘బెత్లెహామ్’ తారలా ఉంటుందిది.
* ఐస్‌ల్యాండ్‌లో చిన్నపిల్లలంతా కలిసి తమ ఇంటి కిటికీల దగ్గర తమ బూట్లను ఉంచుతారు. శాంతాక్లాజ్ వాటిని చిన్న చిన్న బహుమతులతో నింపుతారు.
* ఆస్ట్రేలియాలో ప్రత్యేకంగా క్రిస్‌మస్ పిక్‌నిక్‌లు ఏర్పాటుచేస్తుంటారు.
* వెనిజులాలో క్రిస్‌మస్ ముందు రోజు చాలామంది బొటనవేలుకి ఓ తాడును కట్టి నిద్రపోతారు. ఆ తాడు చివర పడకగది కిటికీకి వెలుపల కనిపించేలా వేలాడదీస్తారు. ఇదో సంప్రదాయం. ఉదయానే్న లేచి స్కేటింగ్ చేస్తూ క్రిస్‌మస్ ప్రార్థనలకు వెళ్లేవారంతా ఆ తాడును చూసి అప్పటికీ నిద్రపోతున్న వారిని లేపుతూ ముందుకెళతారు.
* మనదేశంలో కొన్ని ప్రదేశాల్లో క్రిస్‌మస్ చెట్లకు బదులు అరటిచెట్లు, మామిడి కొమ్మలు ఉంచుతారు.
* నార్వేలో క్రిస్‌మస్ తాత శాంతాక్లాజ్‌ను ‘జులెనిస్సే’గా పిలుస్తుంటారు. ఇవాళ చిన్నారులంతా క్రిస్‌మస్ తాతయ్య కోసం ఎదురు చూస్తుంటారు. ఈ రోజు ఏ ఇంట్లోనూ చీపురు కట్టలు కనిపించవు. వాటిపై దెయ్యాలు విహరిస్తాయనే భయంతో వాటిని దాచేస్తారు.
* క్రిస్‌మస్ వేడుకల సందర్భంగా ఇటలీలో తొట్టిని గడ్డితో నింపుతారు. ‘ఎపిఫనీ డే’ని జనవరి ఆరు. చేసుకుంటారు. ఆ రోజు బహుమతులు ఇచ్చుకుంటారు. ఒకరికొకరు ‘బుయానో నటాలే’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మెర్రీ క్రిస్‌మస్ అని దీని అర్థం.


కేకుల పండుగ

$
0
0

క్రిస్‌మస్ అంటేనే కేకుల పండుగ.. ఇక కేకులంటే పిల్లలకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే.. వారికి ఇష్టమైన కేకులను.. ఇంట్లోనే వండి.. మీకు ఎంత కావాలంటే అంత తినండి.. అని అనుమతినిస్తే వారి ఆనందానికి అస్సలు అవధులు ఉండవేమో.. అలా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేకుల తయారీ మీకోసం..

రెడ్ వెల్వెట్ కప్ కేక్

కావలసిన పదార్థాలు

గుడ్డు: ఒకటి
పంచదార: అరకప్పు
మజ్జిగ: పావుకప్పు
వెన్న: రెండు చెంచాలు
వెనిగర్: అరచెంచా
వంటసోడా: పావుచెంచా
మైదా: అరకప్పు
మొక్కజొన్నపిండి: పావుకప్పు
ఎరుపు ఆహారపు రంగు: చిటికెడు
చాక్లెట్ పొడి: పావుకప్పు
వెనిల్లా ఎసెన్స్: అరచెంచా

తయారుచేసే విధానం

గుడ్డుసొన, పంచదార, వంటసోడా, మైదా, మొక్కజొన్న పిండి, ఆహార రంగు, చాక్లెట్‌పొడి ఓ గినె్నలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరువాత కరిగించిన వెన్న, వెనిల్లా ఎసెన్స్, మజ్జిగ, వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కప్పుల్లో సగం వరకూ తీసుకుని 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో పది నుంచి ఇరవై నిముషాలు బేక్ చేసుకుంటే చాలు.. ఎంతో రుచికరమైన రెడ్‌వెల్వెట్ కప్ కేక్ తయారు.

నట్టీ ఫ్లోరెంటైన్

కావలసిన పదార్థాలు

ఉప్పు కలిపిన వెన్న: రెండున్నర కప్పులు
పంచదార: ముప్పావు కప్పు
బాదాం ముద్ద: చెంచా
మైదా: కప్పు
బియ్యప్పిండి: అరకప్పు
వేయించిన బాదాం పలుకులు: రెండు చెంచాలు
వాల్‌నట్ పలుకులు: పావుకప్పు
ఎండు చెర్రీలు: పావుకప్పు
మైదా: చెంచా

తయారుచేసే విధానం

ముందుగా కేక్ బేస్ తయారుచేసుకోవాలి. ముప్పావు వంతు వెన్న, సగం పంచదార ఓ గినె్నలోకి తీసుకుని రెండింటినీ కలపాలి. అందులో బాదాం ముద్ద, మైదా, బియ్యప్పిండి వేసి ముద్దలా అయ్యేవరకూ కలిపి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాత్రలో తీసుకుని ఒవెన్‌లో ఇరవై ఐదు నిముషాల వరకూ బేక్ చేసుకుని తీసుకోవాలి. ఇది కేక్‌లా తయారవుతుంది. తరువాత మిగిలిన వెన్న, పంచదార, విడిగా పెట్టుకున్న చెంచా మైదా తీసుకుని కలపాలి. అందులో బాదాం, వాల్‌నట్ పలుకులూ, ఎండు చెర్రీలు వేసుకుని కలపాలి. కేకుపై ఈ మిశ్రమాన్ని పూతలా రాసి మరో పదిహేను నిముషాలు బేక్ చేసుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి.. ముక్కల్లా కోస్తే సరిపోతుంది.

ఎగ్‌లెస్ జీబ్రా కేక్

కావలసిన పదార్థాలు

మైదా: కప్పు
పంచదార పొడి: పావుకప్పు
బేకింగ్ సోడా: చెంచా
బేకింగ్ పొడి: చెంచా
వెన్న: పావుకప్పు
మిల్క్‌మెయిడ్: పావుకప్పు
పాలు: పావుకప్పు
కోకోపొడి: రెండు చెంచాలు
వెనిల్లా ఎసెన్స్: చెంచా
వెనిగర్: చెంచా

తయారుచేసే విధానం

ఓ గినె్నలో మైదా, పంచదారపొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో గినె్నలో వెన్న, మిల్క్ మేడ్, పాలు, వెనిల్లా ఎసెన్స్, వెనిగర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని మరో గినె్నలోకి తీసుకుని కోకో పొడి వేసి బాగా కలపాలి. నూనె రాసిన కేకు పాత్రలో ఒక గరిటెతో ఈ రెండు మిశ్రమాలను ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సగం పాత్ర నింపి ఒవెన్‌లో 180 డిగ్రీల వద్ద 25 నిముషాల పాటు బేక్ చేసి తీస్తే ఎగ్‌లెస్ జీబ్రా కేక్ సిద్ధమవుతుంది. కోడిగుడ్డు తిననివారు ఇలాంటి కేక్ చేసుకుని ఆనందంగా తినేయచ్చు.

కాంటినెంటల్ ఆపిల్ కేక్

కావలసిన పదార్థాలు

మైదాపిండి: కప్పు
బేకింగ్ పౌడర్: రెండు చెంచాలు
వెన్న: 50 గ్రాములు
పంచదారపొడి: ఒకటిన్నర కప్పు
గుడ్లు: రెండు
పాలు: 100 మి.లీ.
ఆపిల్స్: మూడు
దాల్చినచెక్క పొడి: ఒక చెంచా

తయారుచేసే విధానం

మొదట ఆపిల్స్ తొక్కతీసి పలుచని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. తరువాత మైదాపిండిలో బేకింగ్ పొడి వేసి కలపాలి. అందులోనే వెన్న, ఒక కప్పు పంచదార పొడి, గుడ్లు, పాలు పోసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కేకు టిన్నులో పోయాలి. దానిపై ఆపిల్ ముక్కల్ని పరిచి, పైన మిగిలిన పంచదారపొడి, దాల్చినచెక్క పొడి చల్లాలి. ఇప్పుడు 190 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద అరగంటసేపు బేక్ చేసి తీయాలి. పిల్లలు ఎంతో ఇష్టపడే కాంటినెంటల్ ఆపిల్ కేకు తయారు.

చాక్లెట్ కేక్

కావలసిన పదార్థాలు

మైదా: ముప్పావుకప్పు
బేకింగ్ పౌడర్: అరచెంచా
ఉప్పు: అరచెంచా
గుడ్లు: ఐదు
పంచదార: కప్పు
తీపిలేని చాక్లెట్: రెండు పెద్ద ముక్కలు
నీళ్లు: రెండు చెంచాలు
ఐసింగ్ షుగర్: అరకప్పు
డార్క్ చాక్లెట్: నాలుగు పెద్ద ముక్కలు
క్రీం చీజ్: ఒక చిన్న ప్యాకెట్
వెనిల్లా ఎసెన్స్: అరచెంచా

తయారుచేసే విధానం

ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి పెట్టుకోవాలి. ఓ గినె్నలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లించి పెట్టుకోవాలి. మరో గినె్నలో గుడ్లసొన తీసుకుని క్రీములా తయారయ్యేవరకు గిలక్కొట్టాలి. అందులో ముప్పావు కప్పు పంచదార వేసి అది కరిగేవరకూ కలపాలి. తరువాత మైదా వేయాలి. ఇప్పుడు చాక్లెట్‌ను కరిగించుకోవాలి. అంటే ఓ గినె్నలో సగం వరకూ నీళ్లు తీసుకుని స్టవ్‌పైన ఉంచాలి. అందులో చాక్లెట్ ముక్కలున్న గినె్నను ఉంచాలి. అది కరిగాక నీళ్లూ, మిగిలిన పంచదార వేసి కలిపి దింపేయాలి. దీన్ని మైదాలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదా చల్లిన కేక్ పాన్‌లో తీసుకుని ఒవెన్‌లో ఉంచాలి. పద్దెనిమిది నుంచి ఇరవై నిముషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి. ఇది చల్లారేలోగా దీనిపై పూత తయారుచేసుకోవాలి. డార్క్ చాక్లెట్‌ను ఓ గినె్నలో తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. అది కరిగాక దింపేసి క్రీం చీజ్, వెనిల్లా ఎసెన్స్, ఐసింగ్ షుగర్ వేసి క్రీములా తయారయ్యేవరకూ కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్ అంతా పట్టిస్తే సరిపోతుంది. అంతే తీయతీయని చాక్లెట్ కేక్ రెడీ..

మహాభారతంలో ఉపాఖ్యానాలు-82

$
0
0

అప్పుడు పరశురాముడు భయంకరమైన ఒక శక్తిని వదిలాడు. అది ప్రళయకాల సూర్యుడిలా వెలుగుతూ భీష్మునిపైకి వచ్చింది. అతను ఆ శక్తిని మూడు ముక్కలు చేసి భూమిపై పడవేశాడు. దాంతో కోపం వచ్చిన భార్గవుడు పనె్నండు ఘోరశక్తులను భీష్ముడిపై వదిలాడు. భీష్ముడు బాణమయవలను ప్రయోగించి వాటిని ఖండించాడు. తర్వాత భీష్ముడు తన దివ్యాస్త్రాలతో పరశురాముని దివ్యాస్త్రాలను సూతుల సహితంగా ఖండించాడు. అప్పుడు పరశురాముడు వేసిన బాణాలు భీష్ముని రథాన్ని సూతుని గుర్రాలను కప్పివేశాయి. వారిరువురు ఆ బాణాలవల్ల తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాస్తమయం అవడంచేత యుద్ధం ఆగింది.
మరునాడు సూర్యోదయ సమయంలో మరల యుద్ధం మొదలైంది. పరశురాముడు ఒక ఎతె్తైన రథం మీద నిలబడి బాణవర్షం కురిపించగా భీష్ముని సూతుడు మూర్ఛపోయాడు. అతని ప్రాణాలు పోయాయి. ఇంకొక బాణంతో రాముడు భీష్ముని వక్షస్థలం మీద కొట్టాడు. దానితో అతను క్రింద పడిపోయాడు. అతను చనిపోయాడు అనుకొని రాముడు మహానాదం చేశాడు. భీష్ముని కంటికి అష్టవసువులు కన్పించారు. వారు అతన్ని తమ చేతులతో పొదివి పట్టుకున్నారు. ‘్భయపడకు, నీకు శుభమగుగాక’’ అని దీవించారు.
అప్పుడు అతని రథం మీద సారథిగా గంగాదేవి కన్పించింది. అతను తల్లికి మ్రొక్కి మరల రథం మీద ఎక్కాడు. ఆమె అతని రథాన్ని గుర్రాలతో సహా కాపాడింది. తర్వాత భీష్ముడు తనే స్వయంగా రథం నడుపుకుంటూ పరశురామునితో సాయంత్రం వరకు యుద్ధం చేశాడు. భీష్ముడు వదలిన బాణంతో రాముడు మూర్ఛితుడయ్యాడు. కాని వెంటనే అతను లేచి కాలాగ్ని సదృశమైన బాణాన్ని భీష్మునిమీద ప్రయోగించబోతుంటే మహర్షులు అతన్ని వారించారు. రాత్రి అవటం చేత వారిరువురు యుద్ధం ఆపారు.
ఆ రాత్రి భీష్ముడు నిద్రకు ముందు ఇలా ఆలోచించాడు. ‘‘రామా! నేను జయించగలిగే మాటుంటే నాకు ఈ రాత్రి దేవతలు ప్రసన్నంగా దర్శనం ఇత్తురు గాక!’’. ఇలా తలచి అతను నిదురబోయాడు. రాత్రి కలలో అతన్ని ప్రొద్దున రథంలో పడిపోతున్నప్పుడు లేపి పట్టుకొన్నారే వారు కన్పించి ఇలా అతనితో అన్నారు. ‘‘గాంగేయా! లే! భయపడకు. నీవు మా వాడివి. నిన్ను మేము రక్షిస్తాము. రాముడు నిన్ను ఏ విధంగానూ జయించలేడు. నీవే రాముడిని జయిస్తావు. ఇదిగో ప్రస్వాపం అనే అస్త్రం. దీని ప్రయోగ ఉపసంహారాలు నీకు పూర్వజన్మలో తెలుసు. ఇది విశ్మకర్మచేత నిర్మింపబడింది. ఇది ఏ మానవుడికీ తెలియదు. దీన్ని స్మరించి ప్రయోగించు. నీకు సిద్ధిస్తుంది. కాని రాముడు దానితో నాశనం కాడు. కనుక నీకు పాపం అంటదు. ఈ బాణం వల్ల అతను నిదురపోయినట్లుంటాడు. మరల ఇంకొక బాణంతో నీవే అతడిని నిద్రలేపగలవు. కనుక తెల్లవారగానే ఈ అస్త్రం ప్రయోగించు’’ ఇలా చెప్పి వారు
అదృశయులైనారు.
ఆ మరునాడు వారిరువురికి జరిగిన యుద్ధం చూసిన సమస్తప్రాణులు గజగజ వణికాయి.
పరశురాముడు ముందటిలాగానే మరల శక్త్యాయుధాన్ని భీష్మునిపై ప్రయోగించాడు. అది యముని దండంలా అతి వేగంగా వచ్చి అతని వక్షఃస్థలాన్ని తాకింది. అప్పుడు భీష్ముడు పాము విషంతో సమానమైన బాణాన్ని భార్గవరామునిపై వేశాడు. మరల రాముడు ఇంకొక బాణాన్ని భీష్ముని గుండెపై వేయగా అతడు రక్తసిక్తమై నేలపై పడ్డాడు. అతను లేచి ఇంకొక తీవ్రమైన బాణాన్ని రామునిపై వేశాడు. జమదగ్నిసుతుడు కోపంతో భీష్మునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని ప్రతిఘటించడానికి భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు అస్త్రాలు మధ్యలో ఢీకొన్నాయి. అప్పుడు ఆకాశంలో తేజస్సు కన్పించింది. ఋషులు, గంధర్వులు, దేవతలు, సమస్తప్రాణులు ఆ అస్త్రాలచేత సంతాపాన్ని పొందారు. పర్వతాలు, వనాలు, వృక్షాలతో సహా భూమి కంపించింది. ఆకాశం నిండా మంటలు రేగాయి. దేవతలు, అసురులు, రాక్షసులతో సహా అందరూ హాహాకారాలు చేశారు. భీష్ముడు వసువులు చెప్పిన విధంగా ప్రస్వాపనాస్త్రాన్ని రామునిపై వేద్దామను కున్నాడు. వెంటనే ఆ మంత్రం అతనికి స్ఫురించింది.
కాని ఇంతలో ఆకాశం నుండి ‘‘్భష్మా! ఆ అస్త్రం ప్రయోగించకు’’ అన్న వాక్కులు వినిపించాయి. భీష్ముడు ఆ మాటలు విని కూడా అస్త్రాన్ని భార్గవరామునిపై ఎక్కు పెట్టాడు. అప్పుడు నారదుడు భీష్ముని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘గంగాసుతా! ఆకాశంలో దేవతలు అందరూ చూస్తున్నారు. వారంతా నిన్ను వారిస్తున్నారు. కనుక ఈ అస్త్రం ప్రయోగించకు.
భార్గవుడు తపస్వి. బ్రహ్మజ్ఞుడు. బ్రాహ్మణుడు. పైగా నీకు గురువు. అతన్ని ఏ విధంగానూ అవమానించకు. అప్పుడు భీష్మునికి ఆకాశంలో నిల్చుని ఉన్న ఆ ఎనిమిది మంది బ్రహ్మవాదులు కన్పించారు. వారు కూడా అతన్ని నారదుడు చెప్పినవిధంగా చేయమన్నారు. భీష్ముడు అస్త్రాన్ని ఉపసంహరించాడు. అది చూసి సంతోషించిన పరశురాముడు ‘‘మందబుద్ధినైన నేను భీష్మునిచే ఓడింపబడ్డాను’’ అని అన్నాడు. అప్పుడు అతనికి తండ్రి జమదగ్ని, అతని తండ్రి ఋచీకుడు కన్పించారు. వారు అతనిని అనునయించి ఇలా అన్నారు. ‘‘ఎప్పుడూ ఇలాంటి సాహసం చేయకు. భీష్మునితో అందునా క్షత్రియునితో యుద్ధం చేయడం మంచిది కాదు. యుద్ధం క్షత్రియధర్మం. బ్రాహ్మణునికి స్వాధ్యాయం, వ్రతానుష్ఠానం పరమధర్మం. భీష్మునితో చేసిన ఈ యుద్ధంలో ఇంతవరకు జరిగిన విధ్వంసం చాలును. ఇక యుద్ధం నుండి తొలగిపో. ఇక విల్లు ఎక్కు పెట్టకు. తపస్సు చేసుకో’’.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-177

$
0
0

వాస్తవానికి ధనత్యాగంలో సుఖముంది. దాచుకోవడంలో దుఃఖముంది. ఏ కారణంచేతనయినా ఐశ్వర్యం అరకొరగా లభిస్తే ఏమిచేయాలి? దానిని భగవదర్పణంగా పరోపకారార్థమే త్యాగం చేయాలా? వేదమావిధంగా చెప్పలేదు. ‘యద్యశ్రాతం మమత్తన’ ఐశ్వర్యం అరకొరగా ఉంటే అధికంగా ఆశించక దానితో సంతృప్తి చెందుమని హితవు చెప్పింది. అంటే స్వల్పసంపద నిమిత్తంగా దుఃఖపడరాదు. దానిని ఇంకా ఇంకా పెంచి దాచుకోవడానికి ప్రయత్నించరాదు అని వేదోపదేశ పరమార్థం. ఇదే లాభ-అలాభాలు సంభవించినపుడు పొంగిపోరాదు. క్రుంగిపోరాదన్న భగవద్గీత సందేశం. ఇట్టివాడినే ‘స్థితప్రజ్ఞు’డని గీత బహుధా ప్రశంసించింది.
**
మాకు మంచి ధనమేదో నీవే చెప్పు
కిం నో అస్య ద్రవిణం కద్ధ రత్నం వి నో వోచో జాతవేదశ్చికిత్వాన్‌
గుహాధ్వనః పరమం యన్నో అస్య రేకు పదం న నిదానా అగన్మ॥ ఋ.4-5-12.
భావం:- సర్వజ్ఞుడైన ఓ అగ్నీ! నీవు అన్నీ తెలిసినవాడవు. అందువలన మా రుూ సంశయాలకు సమాధానాలను తెలుపు. వివిధ రూపాలలో ఉన్న ధనాలలో ఉత్తమమైన ధనమేది? సంపదలలో అమూల్యమైన సంపద ఏది? అనేక జన్మలుగా ప్రయాణిస్తున్న ఈ జీవన మార్గం రహస్యమైనదా? ఇక ఇట్టి సంశయాత్మకమైన మార్గంలో మేము నడువజాలం.
వివరణ:- లోకంలో మానవులు ఇది ధనమనేభావనతో ఎన్నింటినో సంపాదించుకొంటున్నారు. అవి ఏవీ కూడడ తమ వద్ద నిలువక ఒక్కొక్కటి జారిపోతున్నాయి. ఈ అనుభవం జీవితంలో అందరకు ఎదురయ్యేదే. సామాన్యులు పోయినదానిని తిరిగి ఎలా పొందాలా? అని తీవ్రంగా ప్రయత్నిస్తారు. కాని ఎవరో విచారణశీలురు మాత్రమే వ్యాకులచితుతలై దాని మర్మమేమిటో తెలిసికొనేందుకు ప్రయత్నిస్తారు. మరి ఆ మర్మాన్ని ఎవరు చెప్పగలరు? ఒక్క సర్వజ్ఞుడైన భగవానుడు తప్ప. ఈ మంత్రంలో తన సంశయాలకు సమాధానాలను విప్పి చెప్పమన్న ఒక తాత్త్వికుని విన్నపం ఇలా వర్ణించబడింది. ‘వి నో వోచో జాతవేదశ్చికిత్వాన్’ ‘‘సర్వజ్ఞుడవైన ఓ అగ్నీ! నీ కన్నియూ తెలుసు. నా రుూ సంశయాలకు సమాధానాలను తెలుపు.’’ ‘కిం నో అస్య ద్రవిణమ్’ ‘‘వివిధ రీతులుగా ఉన్న ఈ ధనాలలో ఏది ఉత్తమమైన ధనం?’’ తృప్తితో, సంతోషంతో జీవిత యాత్రను సుఖంగా నడిపించేది ధనం మాత్రమే. అలాకాక వస్తూ - పోతూ ఉండే ఈ ధనం వలన శాశ్వతమైన తృప్తి కలిగేనా? నీవు దానశీలురైన దాతల కొఱకు ఋగ్వేదంలో ‘దధాతి రత్నం విధతే’ (ఋ.4-12-3) ‘‘రత్నాలను నిర్మిస్తున్నావు లేదా రత్నాలను దాతలకు ప్రదానం చేస్తున్నావు’’ అయితే ‘కద్ధరత్నమ్’ ఆ రత్నాలలో అమూల్యమైనది ఏది?
మేము సంసార చక్రభ్రమణంలో పడి చిరకాలంగా అదే సంసార మార్గంలో నడుస్తూ వస్తున్నాం. ఆ మార్గంలో ఎంతకాలం ప్రయాణం చేయాలి? ‘గుహాధ్వసః పరమం యన్నో అస్య’ ఆ మార్గంలోని రహస్యమేమిటి?’ దానికేమైనా లక్ష్యంగాని, పరమగమ్యం గాని ఉందా? మాకేమీ అర్థం కావడం లేదు. కేవలమది ప్రయాణమేనా? లేదా అందులో యేమైనా సార్థక్యముందా? అది మకు తెలియకూడని రహస్య విషయమా? విచారణ చేస్తే మా బుద్ధికి ఏమీ అందడం లేదు. నీవు ‘చికిత్వాన్’ సర్వమూ తెలిసినవాడవు. నీవు మాత్రమే తెలియజెప్పగలవాడవు. నీవే చెప్పకుంటే ‘రేకు పదం న నిదానా అగన్మ’ ‘‘సందేహంతో అడుగువేస్తూ నడువజాలం. ‘‘సందేహాస్పద స్థితిలో కలిగేది భయమే.
‘సంశయాత్మా వినశ్యతి’ ‘‘సంశయ- మనస్కుడు నశిస్తాడు’’ అని భగవద్గీత (4-40) చెప్పింది. సంశయగ్రస్తుడు తన కర్తవ్యాన్ని కూడ నిర్వహించలేడు. అట్టివానికి భవిష్యత్తు కూడ సిద్దించదు. కాబట్టి జీవిత భవిష్యత్తును సంరక్షించుకొనేందుకు ముందుగా సంశయ విముక్తుడు కావాలి. కాబట్టి ఓదేవా! మా రుూ సర్వసంశయాలను విచ్ఛేదం చేసి మమ్ము సన్మార్గాన నడిపించు.
ఇంకావుంది...

28న మంచు కురిసే..

$
0
0

రామ్ కార్తీక్, ప్రణాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’. మోషన్ పోస్టర్, టీజర్, ఆడియోకి మంచి స్పందన వచ్చింది. సెన్సార్ నుంచి క్లీన్ యు లభించటంతో, 28న చిత్రం విడుదలకు సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ మంచు కురిసే వేళలో అందమైన లొకేషన్స్, అంతే అందమైన కథ కథనాలతో తీసిన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం అన్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అన్నారు.
రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇది ఉత్తమ చిత్రం అవుతుందని, హీరోయిన్ ప్రణాళి అందచందాలు, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుందన్నారు. ఈ సీజన్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌ని అందిస్తున్నామని, కుటుంబ సమేతంగా మంచు కురిసే వేళలో చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చారు.

మారి’న్ని థియేటర్లలో..

$
0
0

రఘువరన్ బిటెక్‌తో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైన ధనుష్, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా వచ్చిన చిత్రం మారి 2. తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రతాపరాజు సమర్పణలో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐకాన్ మూవీస్ అధినేత శ్రీరామ్ నైజాం, సీడెడ్, ఆంధ్రలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ మంచి టాక్‌తో సినిమా నడుస్తున్న నేపథ్యంలో 28నుంచి థియేటర్లు పెంచుతున్నామన్నారు. ద్వితీయార్థంలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఆడియన్స్‌కి బాగా కనెక్టైందని, ధనుష్ పెర్ఫార్మెన్స్ చిత్రానికి ప్లస్ అన్నారు. క్రిస్మస్ బరిలో నాలుగు సినిమాలతో పోటీపడి విడదలైన చిత్రం సంతృప్తికరమైన ఫలితాలు ఇచ్చిందని వెల్లడించారు.

భయపెడుతున్న పీకేసీ

$
0
0

ఒకప్పటి హిట్టు చిత్రం ప్రేమకథా చిత్రమ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ప్రేమకథా చిత్రం -2 టీజర్ సెనే్సషన్ సృష్టించింది. ప్రేమకథా చిత్రమ్, జక్కన్న చిత్రాల తరువాత హ్యాట్రిక్ చిత్రంగా ఆర్పీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఆర్ సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రమిది. ఈ చిత్రంతో హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ది ఇద్నాని హీరో హీరోయిన్లు. చిత్రంలో కామెడీకి పెద్ద పీట వేశారని స్పష్టమవుతోంది. సినిమా షూటింగ్ పూర్తికావడంతో, జనవరిలో థియేటర్లకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇదికూడా ప్రేమ కథా చిత్రమ్ రేంజిలోనే హిట్టవుతుందన్న అభిప్రాయాన్ని టీజర్ చూసినవాళ్లు వ్యక్తం చేశారన్నారు. సుమంత్ అశ్విన్, సిద్దిలు ప్లెజంట్‌గా నటిస్తే, నందిత శే్వత తన విశ్వరూపం చూపించిందని అన్నారు.

కృష్ణంరాజుకు జీవిత సాఫల్యం

$
0
0

అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శోభన్‌బాబు పురస్కారాల వేడుకను నేటి సాయంత్రం హైదరాబాద్ ఎన్‌కనె్వన్షన్‌లో నిర్వహించనున్నారు. అవార్డుల కార్యక్రమానికి ముందు సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి ఉంటుంది. సీనియర్ నటుడు కృష్ణంరాజుకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రసాద్ లాబ్స్ అధినేత ఎ రమేష్ ప్రసాద్ అందిస్తారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు ఇతోధిక కళామ సేవ చేసిన నటీనటులు, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులకు శోభన్‌బాబు ఎవర్‌గ్రీన్ అవార్డు ప్రదానం చేయనున్నారు. అవార్డులు అందుకునేవారిలో కె రాఘవేంద్రరావు, సి అశ్వీనీదత్, బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, రోజా, బి సత్యానంద్, ఎస్ గోపాల్‌రెడ్డి, దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. ఉత్తమ చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, ఉత్తమ జానపద చిత్రం బాహుబలి, ఉత్తమ సాంఘిక చిత్రం ఖైదీ నెంబర్ 150, ఉత్తమ ప్రేమకథా చిత్రంగా అర్జున్‌రెడ్డి, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా శతమానంభవతిలకు అవార్డులు అందించనున్నారు.


ఆది.. ఆపరేషన్

$
0
0

ఎన్‌ఎస్‌జి కమాండో అర్జున్ పండిట్‌గా ఆది, ఎయిర్‌టెల్ మోడల్‌గా శషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యనరేశ్, మనోజ్‌నందం, కృష్ణుడు, అబ్బూరి రవి తదితరులు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆపరేషన్ గోల్డ్ఫిష్’. వినాయకుడు టాకీస్ బ్యానర్‌పై అడివి సాయికిరణ్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు సాయికిరణ్ అడివి మాట్లాడుతూ సినిమాలో ఎన్‌ఎస్‌జి కమెండోగా ఆది నటిస్తున్నాడని, త్వరలోనే టీజర్ విడుదల చేస్తామన్నారు. నిజ ఘటనల ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ స్టోదీ పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉందని, వాటిని పూర్తిచేసి త్వరలో చిత్రం విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు

నీలకంఠ జామ్ జామ్

$
0
0

బాలీవుడ్ క్వీన్‌ను దక్షిణాదిలోని అన్ని భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. మలయాళంలో ‘జామ్ జామ్’ పేరిట తెరకెక్కిన ‘క్వీన్’లో మంజిమా మోహన్ లీడ్ రోల్ చేశారు. మలయాళ వర్షన్‌కు తెలుగు దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించి మలయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. నాలుగు భాషల్లో విడుదల చేసిన రీమేక్ టీజర్లకు మంచి ఫలితాలు వచ్చాయ. త్వరలోనే ట్రయిలర్ విడుదల చేసి, సినిమా విడుదల తేదీ ప్రకటించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. మీడియెంట్ ఫిల్మ్ పతాకంపై రూపొందుతున్న సినిమాలో మంజిమా మోహన్‌తోపా సన్నీవేన్, షిబానీ దండేకర్, బాయిజు, ముత్తుమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగానూ అత్యున్నతంగా కనిపిస్తున్న చిత్రానికి సినిమాటోగ్రఫీ మిచెల్లే టబురెక్సీ, సంగీతం అమిత్ తివారీ అందించారు.

మార్కెట్.. మొదలైంది

$
0
0

మూవీ మొఘల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజర్ షేక్ నిర్మిస్తోన్న చిత్రం ‘మార్కెట్’. దాసరి గంగాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కిషోర్, దివ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ నా మొదటి సినిమా. ప్రతి ఊరిలో నేర చిత్ర ఉంటుంది. రాత్రి సమయంలో జరిగే క్రైమ్ ఇన్సిడెంట్స్‌ను తీసుకుని ఇప్పటివరకు ప్రపంచానికి చూపించని నేర సామ్రాజ్యాన్ని చూపించడమే ఈ చిత్ర కథాంశంఅన్నారు. నిర్మాత అజర్ షేక్ మాట్లాడుతూ- సినిమాల్లో నా మొదటి ప్రయాణం గంగాధర్ చెప్పిన కథ నచ్చి చేయడానికి ఒప్పుకున్నాను. జనవరిలో షూటింగ్ ప్రారంభించి మార్చిలో సినిమా పూర్తిచేసి మీ ముందుకు తీసుకువస్తాం అన్నారు. హీరోయిన్ దివ్య మాట్లాడుతూ -ఈ చిత్రంలో నటించేవాళ్ళందరూ కొత్తవాళ్ళే. మాకు మీ సపోర్టు తప్పక కావాలి అన్నారు.

నా సినిమా మోసం చేయదు

$
0
0

సత్యదేవ్, నందితా శే్వత జంటగా రూపొందిన చిత్రం ‘బ్లఫ్‌మాస్టర్. తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్న ‘చతురంగ వేట్టై’ ఆధారంగా డైరెక్టర్ గోపీ గణేష్ పట్ట్భా తెరకెక్కించిన చిత్రం. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో గోపీ మాట్లాడుతూ సినిమాటోగ్రాఫర్ కావాలని పరిశ్రమకు వచ్చి దర్శకుడినయ్యానన్నాడు.
తొలి చిత్రం రోమియో చేశానని, ఆ కథకు తన గురువు పూరీ ‘బిజినెస్‌మేన్’ చిత్రం ఇన్‌స్పిరేషన్ అన్నాడు. మరో కథను సిద్ధం చేసుకుని నిర్మాతను కలిసినపుడు, చతురంగ వేట్టై సినిమా చూడమని సజెస్ట్ చేశాడన్నాడు. మాతృకతో కాకుండా చిన్న చిన్న మార్పులు చేద్దామని నిర్మాతకు సజెస్ట్ చేశానని, అందులో భాగంగా వినోద్‌ను కలిశానన్నాడు. అప్పుడాయన ఖాకీ సినిమా చిత్రీకరిస్తున్నారని చెప్పాడు. అయితే సత్యదేవ్ కంటే ముందు నలుగురైదుగురు హీరోలు ప్రాజెక్టులోకి వచ్చి వెళ్లారని, కథలో మెయిన్ హీరో ఓ కామన్‌మెన్‌గా కనపిస్తాడన్నాడు. అందుకే సినిమా అందరికీ కనెక్టైందని, మాతృక నుంచి సోల్‌ని తీసుకుని తెలుగు నేటివిటీకి దగ్గరగా కథ తయారు చేశామన్నారు. సంభాషణలూ తనే రాసుకున్నానని, కొన్ని సన్నివేశాల సంభాషణలకు పులగం చిన్నారాయణ సహకారం అందించారన్నారు. సంభాషణలకు పూరినుంచి మంచి ప్రోత్సాహం లభించిందని, హీరో సత్యదేవ్‌తో తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లి, తనుతప్ప మరెవరూ ఈ పాత్రను చేయలేరన్నంత బాగా చేశాడన్నాడు. సిట్యుయేషన్‌కు తగినట్టు సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మంచి ట్యూన్లు, అద్భుతమైన ఆర్‌ఆర్ అందించాడన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మంచి మెసేజ్‌ను సినిమా ఇస్తుందని, థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని బ్లఫ్ చేయదని అన్నాడు.

కంఫర్ట్ కోరుకుంటా

$
0
0

భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది మలయాళ బ్యూటీ సాయిపల్లవి. వెండితెరపై రాణించాలంటే అందాల ఆరబోతతోనే కాదు, అభినయంతోనూ ఆడియన్స్‌కు దగ్గర కావొచ్చని నిరూపించిన హీరోయిన్లలో సాయి పేరునూ చేర్చుకోక తప్పదు. తాజాగా హను రాఘవపూడి డిజైన్ పడి పడి లేచె మనసు చిత్రంలో శార్వానంద్‌తో మంచి కెమిస్ట్రీ పండించిన సాయిపల్లవి -గ్లామర్ విషయంలో తనకు ఎలాంటి మొహమాటాలు లేవుగానీ, ఎక్స్‌పోజింగ్ తనకు కంఫర్ట్ కాదని చెప్పేస్తోంది. ‘గ్లామర్ షోకి నేను వ్యతిరేకం కాదు. కానీ, అల్ట్రా సన్నివేశాల్లో నటించాలంటే కంఫర్ట్‌గా ఫీలవ్వలేను. ఇక లిప్ లాక్ సన్నివేశాలు కథ డిమాండ్ మేరకే పెడితేనే బాగుంటాయి. అయితే అలాంటి సన్నివేశాల్లో సైతం నేను కంఫర్ట్‌గా చేయలేను’ అన్నది ఆమె మాట. మెడిసిన్ వదిలేసి స్క్రీన్‌కు వచ్చింది గ్లామర్ షో చేయడానికి కాదని, అవకాశాలు వచ్చినన్ని రోజుల్లో మంచి పాత్రలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన ఆలోచన అన్నది చెప్పేస్తోంది. ‘నేను చేసిన సినిమా చూసి మా పేరెంట్స్ సైతం ప్రశంసించాలి. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు’ అని తెగేసి చెప్పేస్తోంది సాయి. తాజా చిత్రంలో మెడికో క్యారెక్టర్ చేసిన సాయిపల్లవి, రియల్ లైఫ్‌లో మెడికో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. ‘కొన్ని సన్నివేశాల్లో చేసేటపుడు -రెండేళ్ల క్రితంనాటి జ్ఞాపకాలు వెంటాడాయి. ఆ అనుభవాలే నన్నింత దూరం తీసుకొచ్చాయేమో. అందుకే -గతాన్ని మర్చిపోతే భవిష్యత్ ఉండదంటారు’ అంటూ నవ్వేసింది. మెడికోగా ఉన్నపుడే 2015లో ప్రేమమ్ చాన్స్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చానని, ఆ సినిమా సౌత్‌లో తనకు మంచి పేరు తెచ్చిందని అంటోంది. ఇక తెలుగులో పడిపడి లేచె మనసు, తమిళంలో మారి 2 చిత్రాలు ఒకేసారి థియేటర్‌కు వచ్చిన అనుభూతిని పంచుకుంటూ -ఈ ఫీల్ చాలా గొప్పగా ఉంది. రెండు భాషల్లో రెండు చిత్రాలు ఒకేసారి థియేటర్ రావడం నా కెరీర్‌లో ఇదే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. నేనేం చేసినా మనస్ఫూర్తిగా చేస్తా. ఫలితం భారం దేవుడికే వదిలేస్తా. థాంక్‌గాడ్, మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. శర్వా క్యారెక్టర్‌ను డామినేట్ చేశాననడంలో సహేతుకత లేదని, ఇండస్ట్రీలో తనకంటే సీనియర్ అయిన శర్వానుంచి కంఫర్ట్ దొరికిందే తప్ప, ఇప్పుడు తన కోస్టార్ మంచి మిత్రుడంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, అటు తమిళం, ఇటు మలయాళంలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పింది సాయిపల్లవి.

వేడుకకు రెడీ

$
0
0

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న 12వ చిత్రం ‘వినయ విధేయ రామ’ షూటింగ్ ఈనెల 26తో పూర్తిగానుంది. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 27న యూసఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుందని, ఈ వేడుకలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న ఈచిత్రంలో ప్రశాంత్, ఆర్యన్‌రాజేష్, స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్ర బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని సమాచారం. చరణ్ నటించిన రంగస్థలం ఈఏడాదిలో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దాంతో ఆయన నటిస్తున్న వివిఆర్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పంచాయతీ పోరుకు సిద్ధవౌతున్న పార్టీలు

$
0
0

ఇల్లందు, డిసెంబర్ 24: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నోటిఫికేషన్ వెలువడనప్పటికీ ఎన్నికలు ఎపుడు జరిగినా సమర్దవంతంగా నిర్వహించేందుకు అధికారలు ముందస్తు చర్యలు చేపట్టారు. అధికారుల తీరు కారణంగా రాజకీయ పార్టీలు సహితం పంచాయతీ పోరుకు సిద్ధవౌతున్నాయి. పంచాయతీల వారిగా ఓటర్ల జాబితా రూపొందించటం, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు ఇతర అవసరమైన ఏర్పాట్లపై అధికారగణం దృష్టిపెట్టింది. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా నిర్వాహణకోసం తాము సిద్ధమని అధికారులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దాంతో పదవులు ఆసిస్తున్న ఆశావాహులు పంచాయతీ పోరుకు సై అంటున్నారు. శాసనసభ ఎన్నికలు జరిన కొద్దిరోజులకే స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తుండటంతో ప్రదాన పార్టీలతో పాటు ఇతర పార్టీల నేతలకు సహితం ఇబ్బందికరంగానే ఉంది. స్థానికబలం నిరూపించుకోవాలంటే పంచాయతీ బరిలోకి దిగక తప్పదు. ఒకవైపు నియోజకవర్గాల్లో ఓటమిపాలు కావటానికి జరిగిన పరిణామాలు ఇతర కారణాలపై ప్రధాన పార్టీల నేతలు సమీక్షలు నిర్వహిస్తుంన్నారు. పనిలో పనిగా సమావేశాలకు హాజరైన నాయకులు, కార్యకర్తలకు పంచాయతీ ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన దశ దిశ నిర్దేశాలు ఇస్తుంన్నారు. నియోజకవర్గ ఎన్నికల్లో గెలిచిన పార్టీ అభ్యర్థికి పంచాయతీ ఎన్నికల్లో మరోసారి తన పవర్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమిపాలైన అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా అత్యధిక గ్రామ పంచాయతీలు గెలుచుకునే తన ప్రజా బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో గ్రామ పంచాయతీల ఎన్నికలు శాసనసభా ఎన్నికల్లో పోరాడిన అభ్యర్థులకు ఆయా పార్టీల నేతలకు సవాలుగా మారాయి. శాసనసభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుంది. పదుల ఓట్ల తేడాతోనే గ్రామ పంచాయతీల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములు తారుమారు అవుతుంటాయి. ఈ మేరకు పంచాయతీ పోరులో ప్రతీ ఓటరును తమ వైపు తిప్పుకుంటేనే స్థానిక సంగ్రామంలో విజయం సిద్ధిస్తుంది. లేదా మరోసారి పరాజయం చవిచూడాల్సి ఉంటుంది. ప్రతిష్ఠాత్మకంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు శక్తి యుక్తులను కూడగడుతున్నారు. పంచాయతీ ఎన్నికల నగారా ఎప్పుడు మ్రోగుతుందా అని గ్రామాలలోని జనం ఆసక్తిగా ఎదురు చూస్తుంన్నారు.


కోర్టుకేసుల నివేదికలను వెంటనే సమర్పించాలి

$
0
0

ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 24: జిల్లాలోని పలు శాఖల్లో ఉన్న పెండింగ్ కోర్డు కేసులకు సంబంధించి సమాధానాలు పంపి వెంటనే ఆ నివేదికను సమర్పించాలని కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ జిల్లా అధికారులకు ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్‌డేలో వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. దీంతోపాటు పలు శాఖల్లో పెండింగ్‌లో ఉన్న హైకోర్టుకు సంబంధించిన కేసులపై కౌంటర్ ఫైల్‌ను దాఖలు చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న గ్రీవెన్స్ విజ్ఞప్తులపై ఆయన సమీక్షించారు. కారేపల్లికి చెందిన రైతు పి రాములు గత నెలలో తన పంట అగ్ని ప్రమాదానికి గురైందని, తనకు పూర్తిగా నష్టం జరిగిందని, తనను ఆదుకొని నష్ట పరిహారం అందించాలని విన్నవించారు. సింగరేణి మండలం పేరేపల్లి గ్రామస్తులు మద్దెనపు కోటేశ్వరరావు, సుధాకర్‌రావులు రెయిన్‌ఫెడ్ ఏరియా డవలప్‌మెంట్ కింద గేదెలు పంపిణీ చేయాలని దరఖాస్తులు సమర్పించగా అధికారులు పట్టించుకోలేదని, తమ సమస్యను పరిష్కరించాలని వారు విన్నవించారు. వేంసూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన వంటషెడ్డుకు సంబంధించి బిల్లులు చెల్లింపు కాలేదని, తమకు బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు. అదే గ్రామానికి చెందిన కంభంపాటి మల్లయ్య తన వృద్ధాప్య పెన్షన్ నిలిచిపోయిందని బోనకల్ మండలం రావినూతలకు చెందిన వట్టికొండ వెంకటేశ్వరరావులు విన్నవించారు. 50వ డివిజన్ రామన్నపేటకు చెందిన పర్వగాని నాగేశ్వరరావు, మన్నం లక్ష్మయ్య తమ గ్రామంలోని సర్వే నెంబర్ 119లో గల చెరువు ఆక్రమణకు గురైందని, సర్వే చేసి హద్దులు చూపించాలని వారు విన్నవించారు. జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్‌ఖానం మాట్లాడుతూ ప్రభుత్వ భూములకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై జిల్లా అధికారులకు ఇవ్వబడిన నిర్ధిష్ట ప్రోఫార్మర్‌లో పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులకు సూచించారు. ట్రైకార్ రుణాల మంజూరును పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమాధికారిని ఆదేశించారు. కలెక్టర్, జెసిలు ప్రజల వినతులను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్వో మదన్‌గోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిభాయి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు.

లోక రక్షకుడు యేసుక్రీస్తు
* వెల్లివిరిసిన క్రిస్మస్ సందడి * ఇంటింటా నక్షత్ర వెలుగులు
ఖమ్మం రూరల్, డిసెంబర్ 24: ప్రపంచ వ్యాప్తంగా నేడు రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను కన్నుల పండువగా జరుపుకుంటున్నారు. క్రీస్తు జన్మదినంతో ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నిండాలని ఖమ్మం మేత్రాసనం పీఠాధిపతి బిషప్ మైపన్‌పాల్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని చర్చీలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. చర్చీలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాలయేసు సెట్టింగ్స్ ఎంతో ఆకర్షణగా నిలిచాయి. పలు చర్చీలు, పాఠశాలలు తదితర ప్రదేశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా జరుపుకున్నారు. యేసుప్రభువు జన్మదినం సూచకంగా గ్రామాలలో ఇళ్ళపై ఏర్పాటు చేసిన నక్షత్రాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. క్రిస్మస్ సందర్భంగా నాయుడుపేట ఆర్‌సియం సంస్థ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి చర్చీలలో యేసుప్రభువు జన్మదిన వేడుకలను ప్రారంభించారు. కరుణగిరి చర్చీలో ఖమ్మం మేత్రాసనం పీఠాధిపతులు బిషప్ మైపన్‌పాల్ కీస్తుయేసు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సందేశాన్నిచ్చారు. యేసుప్రభువు జన్మదినం మరణ ఛాయలో ఉన్నవారికి జీవాన్ని, చీకట్లో ఉన్నవారిపై వెలుగు ప్రకాశిస్తుందని బైబిల్ గ్రంధం పేర్కొంటోందని తెలిపారు. యేసుప్రభువు అనంత ప్రేమను పంచేందుకు మానవుడిగా జన్మించాడన్నారు. ఆయన తన దివ్య హస్తంతో ఇచ్చే దీవెనలు మీ జీవితాలలో ఉన్న భయభ్రాంతులు, నిరాశానిస్పృహలను దూరం చేసి వెలుగు, జీవం, శాంతి కుమ్మరించాలని బిషప్ మైపన్‌పాల్ ప్రభవైన క్రీస్తును వేడుకున్నారు. ఈసందర్భంగా ఆయన ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

$
0
0

భద్రాచలం టౌన్, డిసెంబర్ 24: భద్రాచలం నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలు పరిష్కరించాలని, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, చర్ల మండలంలోని వద్దిపేట చెక్‌డ్యాం నిర్మించాలని, గిరిజన గ్రామాల్లో విద్యా, వైద్యం, ఉపాధి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ ఏజెన్సీలో రోజురోజుకూ గిరిజనుల జీవితాల్లో చీకట్టు నిండుతున్నాయని, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వానికి సమయం లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో వలస ఆదివాసీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాల డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికి తాగునీటి అందించాలన్నారు. ఇంటి పన్నులు కట్టించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ గిరిజన ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిందని, మళ్లీ అధికారంలోకి వచ్చిందని, ఈసారైనా గిరిజన ప్రాంతాలపై వివక్ష చూపకుండా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో గిరిజనులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. సీపీఐ తలపెట్టిన భారీ ధర్నాకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మద్దతు ప్రకటించి మాట్లాడారు. ప్రభుత్వానికి గిరిజనులపై చిత్తశుద్ధి లేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు గిరిజనుల పోరాటానికి మద్దతు ఇస్తానన్నారు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాల్లో సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వంతో పోరాడతానన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీవో సత్పతికి అందజేశారు. ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, నాయకులు తమ్మళ్ళ వెంకటేశ్వరరావు, పవన్, తిరుపతి, నానిపల్లి భద్రం, సతీష్, రాఘవ, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, సునీల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

$
0
0

మణుగూరు, డిసెంబర్ 24: మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదానికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జర్పుల నాగేశ్వరరావు(36) భద్రాచలం నుంచి ఏడూళ్ళబయ్యారం వెళ్తూ మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామం వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగేశ్వరరావును గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లడంతో అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏడూళ్ళబయ్యారం పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవలే భద్రాచలం బదిలీ అయ్యాడు. విధి నిర్వహణ ముగించుకొని ఏడూళ్ళబయ్యారం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలికి చేరుకున్న మణుగూరు సీఐ వై.రమేష్‌బాబు, ఎస్సై శ్రీకాంత్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఒక కర్ర లోడుతో ఉన్న ట్రాక్టర్ వెళ్లినట్లు కొందరు స్థానికులు తెలిపారని, ఆ దిశగా విచారణ చేపట్టామని సీఐ తెలిపారు.
ముగ్గురు మిలీషియా
సభ్యుల అరెస్టు
చర్ల, డిసెంబర్ 24: చర్లలో సోమవారం ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. చర్ల సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మడకం ఇడమా, కల్మా దేవా, మడివి రాము అనే ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మిలీషియా సభ్యులను తేలింది. ఈ ముగ్గురు బోదనెల్లి రహదారిలో పోలీసులే లక్ష్యంగా పేల్చిన మందుపాతర ఘటనలో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై రాజువర్మ తెలిపారు.

వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాన కల్పించాలి

$
0
0

కర్నూలు, డిసెంబర్ 24:వినియోగదారుల హక్కులు, చట్టాల ఆవశ్యకతపై మారుమూల గ్రామాల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వినియోగదారుల ఫోరం సభ్యులకు జాయింట్ కలెక్టర్ రవిసుభాష్ సూచించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, చట్టాలపై ఎంత అవగాహన కల్పిస్తే అంత నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి కావడమే కాకుండా వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం అలవాటు అవుతోందని, ఈ మేరకు మండల కేంద్రాలు, మారుమూల గ్రామాల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వస్తువుల క్రయ, విక్రయాల విషయంలో రోజురోజుకూ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో ఫోరం సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వినియోగదారుల చట్టాలు, హక్కులపై సంపూర్ణ అవగాహన కల్పంచాలన్నారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు నసీరున్నిసా మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను కాపాడటానికి జిల్లాలో ఫోరం ఏర్పాటు చేస్తామన్నారు. వినియోగదారుల కేసులను సకాలంతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సెక్షన్ 13 ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను 3 నుంచి 5 నెలల కాలంలో పరిష్కరిస్తామన్నారు. వస్తువు లోపం ఉన్నా, నాణ్యత లోపం ఉన్నా, సర్సీసు అందించడంలో లోపం వున్నా చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా భద్రత కోల్పోయినా ఫోరంను సంప్రదించవచ్చన్నారు. అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేత విద్యార్థులకు జ్ఞాపికలు, సర్ట్ఫికెట్లు ప్రదానం చేశారు.
జాతీయ స్థాయి ఫ్లోర్‌బాల్ పోటీలకు నెహ్రూ విద్యార్థుల ఎంపిక
బనగానపల్లె, డిసెంబర్ 24:పట్టణంలోని నెహ్రూ ఇంగ్లీషు మీడియం పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి అండర్-17 ఫ్లోర్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ కోడూరు హరినాథరెడ్డి సోమవారం తెలిపారు. కర్నూలు నగరంలోని కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సాయినాథరెడ్డి, సుప్రియ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈ నెల 27 నుంచి 4 రోజుల పాటు ఛత్తీస్‌ఘడ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరఫున పాల్గొంటారని తెలిపారు. అలాగే తమ పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు రాష్ట్ర జట్టుకు కోచ్‌గా ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయుడు, విద్యార్థులను కరస్పాండెంట్‌తో పాటు హెచ్‌ఎం కోడూరు కమల్‌తేజారెడ్డి, ఎండీ కోడూరు రవితేజారెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
ఏపీఎస్పీ బెటాలియన్ డీఐజీ విజయకుమార్‌కు ఘన వీడ్కోలు
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 24:నగరంలోని 2వ బెటాలియన్ డీఐజీ జి.విజయకుమార్ బదిలీపై కాకినాడకు వెళ్తున్న సందర్భంగా సోమవారం స్థానిక ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్పీ బెటాలియన్స్ రేంజ్-3 డీఐజీ వెంకటేశ్వర్లు బదిలీపై వెళ్తున్న డీఐజీ విజయకుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యం
* ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి
ఎమ్మిగనూరు, డిసెంబర్ 24: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 12వ వార్డలో క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. ప్రతి పేదవాడు క్రిస్మస్ పండగ రోజు సంతోషంగా ఉండేందుకు రాష్ట్రప్రభుత్వం చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

$
0
0

క్రిష్ణగిరి, డిసెంబర్ 24:అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రూ. 10 లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా తెలిపారు. అందుకు సంబంధించి డీఎస్పీ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కోడుమూరు మండల పరిధిలోని అనుగొండ గ్రామానికి చెందిన నీలిసికారి రాజు(30), కోసిగి మండలం సాతనూరు గ్రామానికి చెందిన బోస్లే లస్సి అలియాస్ పాండు(40), కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ ప్రాంతానికి చెందిన నీలిసికారి శాలు అలియాస్ షారుక్‌ఖాన్(20), నీలిసికారి లలీ(26), నీలిసికారి జెమిని అలియాస్ నాయుడు(23), నీలిసికారి రాయిరెడ్డి(20) ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారన్నారు. వారందరూ ఎవరికీ అనుమానం రాకుండా సంగాల గ్రామ శివారులో షెడ్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటూ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. కాగా నల్గొండ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ పవన్ అమకతాడు టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నాడు. అతడి ద్విచక్ర వాహనం గత అక్టోబర్ 18వ తేదీ చోరీకి గురైంది. దీంతో ఆయన సమీప ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో నవంబర్ 2వ తేదీ క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ విజయభాస్కర్ సిబ్బందితో మండల పరిధిలోని గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఎరుకలచెరువు క్రాస్ రోడ్డు వద్ద 3 ద్విచక్ర వాహనాలపై ఆరుగురు యువకులు అనుమానాస్పందంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో కాంట్రాక్టర్ పవన్‌కు చెందిన ద్విచక్ర వాహనం వారి వద్ద దొరికింది. దీంతో పోలీసులు మరింత లోతుగా వారి శైలిలో విచారించగా అసలు విషయాలు వెలుగుచూశాయి. ఈ ముఠా సభ్యులంతా బంధువులు, దాయాదులు కావడంతో గత కొంత కాలంగా గ్రూపుగా ఏర్పడి కర్నూలు, ఓర్వకల్లు, డోన్, గుత్తి, క్రిష్ణగిరి, అమకతాడు టోల్ ప్లాజా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్లు దొంగలిస్తూ ఉండేవారన్నారు. అంతేకాకుండా జాతీయ రహదారి పక్కన వాహనాలను నిలిపి నిద్రపోతున్న డ్రైవర్లు, క్లీనర్ల వద్ద సెల్‌ఫోన్లతో పాటు నగదు కూడా దొంగలించే వారని తెలిపారు. వారి నుంచి మొత్తం 22 ద్విచక్ర వాహనాలు, 60 సెల్‌ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై సుమారు 25 కేసులు ఉన్నాయని, గతంలో జరిగిన 2 మర్డర్ కేసుల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. డోన్ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్వర్యంలో క్రిష్ణగిరి ఎస్‌ఐ విజయభాస్కర్, దేవనకొండ ఎస్‌ఐ పీరయ్య, ప్యాపిలి ఎస్‌ఐ మారుతీశంకర్, డోన్ రూరల్ ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసును ఛేదించారు. అత్యంత చాకచక్యంగా కేసును ఛేదించిన బృందంతో పాటు సిబ్బందికి డీఎస్పీ ఖాదర్‌బాషా రివార్డులు ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. కాగా గ్రామ శివారుల్లో కొత్త వ్యక్తులు నివాసం ఉంటూ అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.

Viewing all 69482 articles
Browse latest View live