Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

విద్యుత్ స్తంబాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

$
0
0

పెద్దవడుగూరు, డిసెంబర్ 26 : మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామం వద్ద బుధవారం నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంబాన్ని ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జిల్లాకేంద్రంలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షకు చిత్తూరు గ్రామస్థులను తరలిస్తున్న ఆర్టీసీ బస్సు దిమ్మగుడి గ్రామం వద్ద మలుపులో విద్యుత్ స్తంబాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చిత్తూరు గ్రామానికి చెందిన నారాయణ, బాలరాజు, భూచెమ్మ, లక్ష్మీదేవితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే పెద్దవడుగూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పామిడికి తీసుకెళ్లారు. స్థానికుల వివరాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


వ్యక్తి అనుమానాస్పద మృతి

$
0
0

మడకశిర, డిసెంబర్ 26 : పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో శ్రీనివాసులు (38) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం పట్టణంలోని వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు రెండు రోజుల క్రితం బేల్దార్ పని నిమిత్తం మడకశిరకు వచ్చినట్లు ఎస్సై గోపీ తెలిపారు. అయితే బుధవారం తెల్లవారుఝామున రహదారి దాటేందుకు ప్రయత్నించగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అయితే మృతుడు మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బీట్ కానిస్టేబుళ్లు గమనించి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అతని వద్ద సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బొలేరో బోల్తా..ఒకని మృతి

$
0
0

చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 26 : బొలెరో వాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయిన సంఘటన మండల పరిధిలోని గొల్లవాండ్లపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నామాల గ్రామానికి చెందిన గాండ్ల మల్లికార్జున (34)కు బోరుబావుల మోటార్ల మరమ్మతు వాహనం వుంది. అయితే పని ముగించుకుని వెళుతుండగా గొల్లవాండ్లపల్లి గ్రామ బస్టాండ్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాండ్ల మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా అందులో వున్న ముగ్గురు రేణుకమ్మ, ముత్యాలు, భాస్కర్‌లకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెనే్నకొత్తపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మల్లికార్జున శవాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కేజీబీవీలో మిద్దెపై నుంచి జారిపట్ట విద్యార్థిని
* ప్రమాదంపై తల్లిదండ్రులు అనుమానం...
కంబదూరు, డిసెంబర్ 26 : మండల కేంద్రంలోని కేజీబీవీలో ఎనిమిదవ తరగతి మేఘన ప్రమాదవశాత్తు మిద్దెపై ఉతికిన దుస్తులు తీసుకొచ్చేందుకు వెళ్లి కాలుజారి కింద పడి తీవ్రగాయాలైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు ఉదయం 8 గంటల సమయంలో పాఠశాల మిద్దెపై ఉతికిన దుస్తులు తీసుకొచ్చేందుకు వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు కిందికి పడి గాయాలపాలైంది. వెంటనే గమనించిన సిబ్బంది 108 ద్వారా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. విద్యార్థిని మొహం, కుడికాలుకు బలమైన గాయాలయ్యాయి. కాగా ఘటన పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు సైతం ఆందోళన చేపట్టి అనుమానం వ్యక్తం చేశారు. విషయాన్ని డీఈఓ దృష్టికి వెళ్లడంతో వివరాలు అందించాలని ఎంఈఓ సాయికృష్ణను ఆదేశించారు.

బద్దలైన విష వ్యూహం..

$
0
0

మన దేశానికి వ్యతిరేకంగా ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’- ఐసిస్- జిహాదీ ముఠా పన్నిన మరో బీభత్స పన్నాగం బుధవారం భగ్నం కావడం హర్షణీయ పరిణామం. సిరియా నుంచి తన సైనిక దళాలను ఉపసంహరించుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం బుధవారం మన ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’- ఎన్‌ఐఏ- సాధించిన విజయానికి విచిత్రమైన నేపథ్యం. ఢిల్లీలోను, ఉత్తర ప్రదేశ్‌లోను ఎన్‌ఐఏ జరిపిన దాడుల ఫలితంగా ఈ ‘ఐసిస్’ ముఠా ‘గుట్టు’ మరోసారి రట్టయింది. మొత్తం పదహారు చోట్ల జరిగిన దాడులలో ఇప్పటి వరకూ పదహారుగురు అనుమానితులను గుర్తించినట్టు ఎన్‌ఐఏ ఉన్నత అధికారులు ప్రకటించడం మన దేశంలో ‘ఐసిస్’ విస్తరిస్తున్న తీరుకు నిదర్శనం. గుర్తించిన అనుమానితుల్లో పదిమందిని నిర్బంధించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ముఠాలో ఒక యువతి కూడ ఉండడం ‘ఐసిస్’ విష విస్తృతికి మరో నిదర్శనం. ‘ముఠా’ ప్రయత్నం భగ్నం కావడం శుభ పరిణామం అయినప్పటికీ ఈ ‘ఐసిస్’ ముఠా ‘విస్తృతి’ పరిమాణం, పరిధి ఎంతెంత ఉన్నాయన్నది ఆందోళన కలిగించ వలసిన అంశం. ఐదేళ్ల క్రితం మన దేశంలో ఒకరిద్దరు ‘ఐసిస్’ బీభత్సకారులు పట్టుబడిన నాటి నుంచి ఈ జిహాదీ ముఠా బీభత్సకారుల సంఖ్య, బీభత్స కలాపాలు నిరంతరం విస్తరించిపోతుండడం చరిత్ర. ఈ విస్తరణ ఇరాక్, సిరియా దేశాలలో సంభవించిన విపరిణామాలతో ముడివడి ఉంది. ఇరాక్‌లోను, సిరియాలోను ఈ దేశాలనంటి ఉన్న విస్తృత పశ్చిమ ఆసియాలోను ‘ఇస్లాం మత రాజ్య వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి ఈ ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’- ఐఎస్‌ఐఎస్- ఐసిస్- పనిచేస్తోందన్నది జరిగిన ప్రచారం. కానీ ఈ ‘ముఠా’ మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స అనుసంధాన సంస్థ- ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’-ఐఎస్‌ఐ- కొనసాగిస్తున్న జిహాదీ ఘాతుక కృత్యాలలో భాగమన్నది ధ్రువపడిన వాస్తవం. అందువల్ల ఈ ‘ఐసిస్’ ఇరాక్‌లోను, సిరియాలోను ఉద్ధృతంగా కలాపాలు సాగించిన సమయంలోనే మన దేశంలో కూడ ‘జిహాదీ’ హంతకులను చేర్చుకోవడం మొదలు పెట్టింది. ఇరాక్‌లో ప్రభుత్వ దళాలతో తలపడి పరాజయం పాలైన ‘ఐసిస్’ ఆ తరువాత సిరియాలో తన కలాపాలను ఉద్ధృతం చేసింది. ఇరాక్‌లోను, సిరియాలోను ‘ఐసిస్’ బీభత్స దళాలలో భారతీయులు చేరి ఉన్నట్టు దశలవారీగా సమాచారం మొదలైంది. మన దేశానికి చెందిన యువకులను, విద్యావంతులను ప్రధానంగా ‘అంతర్జాల’- ఇంటర్నెట్- వ్యవస్థలో ఉద్యోగిస్తున్న వారిని ఈ ‘ఐసిస్’ జిహాదీ ముఠాలో చేర్పించడానికి పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ కృషి చేస్తోంది. వివిధ దేశాలలో జిహాదీ ముఠాలను ఏకీకృతం చేస్తున్న అనుసంధాన వ్యవస్థ పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’..
‘ఐసిస్’ను ఇలా మన దేశంలో రంగంలోకి దింపగలిగిన ‘ఐఎస్‌ఐ’ తన విస్తృత విషవ్యూహాన్ని అమలు జరుపుతూనే ఉందన్నది బుధవారం ఢిల్లీలోను, ఉత్తర ప్రదేశ్‌లోను పట్టుబడిన ముష్కరుల వల్ల మరోమారు ధ్రువపడింది. ముఠాల పేర్లు మారుతున్నప్పటికీ ఈ ముఠాల స్వభావం, లక్ష్యం, కార్య పద్ధతి, వ్యూహం మాత్రం సమానం. మన దేశాన్ని నిరంతరం బలహీన పరచడం ఈ సమానత్వం. ప్రపంచంలోని ఇస్లామేతర మతాలను సమూలంగా మట్టుపెట్టి ‘ఇస్లాంను ఏకైక మతం’గా ప్రపంచమంతటా ప్రతిష్ఠించడం జిహాదీల శతాబ్దుల లక్ష్యం. 1947 నుంచి ఈ లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం వాస్తవానికి బీభత్స రాజ్యాంగ వ్యవస్థ- టెర్రరిస్ట్ రిజీమ్-! అయితే అంతర్జాతీయ సమాజ అభిశంసనకు భయపడుతున్న పాకిస్తాన్ నిర్వాహకులు భారత వ్యతిరేక బీభత్సకాండతో తమకు సంబంధం లేదని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించ యత్నిస్తున్నారు.. ఈ అభినయంలో భాగంగానే పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ బంగ్లాదేశ్‌కు చెందిన ‘హుజీ’ని, అఫ్ఘానిస్తానీ తాలిబన్‌లను, ఇరాక్‌లో పుట్ట పగిలిన ‘ఐసిస్’ను, బర్మా- మ్యాన్‌మార్-కు చెందిన రోహింగియా జిహాదీలను మన దేశానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతోంది. మన దేశంలో సైతం ‘హిజిబుల్’, ‘సిమి’, ‘ముజాహిదీన్’ వంటి ముఠాలను తయారు చేసింది.
‘భారత్‌లో జరుగుతున్న జిహాదీ బీభత్సకాండతో మాకు సంబంధం లేదు.. ఫలానా బీభత్స ఘటనకు ‘హుజీ’ కారణం, జాకిర్ నాయక్ అనేవాడు కారణం, ‘హిజ్‌బుల్’ కారణం, ‘సిమి’ కారణం.. మరో ఘటనకు ఇండియన్ ముజాహిదీన్ కారణం, బుద్ధగయపై దాడికి రోహింగియాలు కారణం..’ అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోంది. ఈ వంచన క్రీడలో ‘తాలిబన్’లను, ‘ఐసిస్’ ముష్కరులను పాకిస్తాన్ ‘ఐఎస్‌ఐ’ ఉసిగొల్పుతుండడం వర్తమాన ఘట్టం. ఈ ఘట్టం అఫ్ఘానిస్తాన్‌లోని భారతీయులపైన, భారతీయ వాణిజ్య సంస్థలపైన, భారతీయ దౌత్య కార్యాలయంపైన దాడులతో ఆరంభమైంది. ఇరాక్‌లోను, సిరియాలోను,లిబియాలోను తదితర ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలు’న్న దేశాలలోను భారతీయుల అపహరణలతోను, హత్యలతోను ఊపందుకొంది.. గత ఏప్రిల్ రెండవ తేదీన ముప్పయి ఎనిమిది మంది భారతీయుల మృతదేహాలను ఇరాక్ నుంచి మన దేశానికి విమానంలో తరలించుకొని వచ్చిన భయంకర విషాద దృశ్యం ఆవిష్కృతమైంది. వీరందరినీ ‘ఐసిస్’ బీభత్సకారులు హత్య చేశారు. 2014 జూన్ పద్దెనిమిదవ తేదీన ఇరాక్‌లోని ‘మోసుల్’ ప్రాంతంలో గృహ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న నలబయి మంది భారతీయులను ‘ఐసిస్’ హంతకులు అపహరించుకొనిపోయారు. వీరిలో ఒక భారతీయుడు అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డాడు. మిగిలిన ముప్పయి తొమ్మిది మందిని ‘ఐసిస్’ జిహాదీలు పైశాచికంగా హత్య చేయగలిగారు. 2014 జూలైలో ‘ఐసిస్’ అపహరించిన నలబయి ఆరుమంది వైద్య సహాయకులు సురక్షితంగా బయటపడి ఇరాక్ నుంచి స్వదేశానికి తిరిగి రావడం మరో దైవ ఘటన! కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ మన దేశానికి వ్యతిరేకంగా ‘ఐసిస్’ బీభత్స కలాపాలు నిరంతరం విస్తరించడం నడుస్తున్న వైపరీత్యం. ఢిల్లీలోను, ఉత్తర ప్రదేశ్‌లోను ‘ఐసిస్’ ముష్కరులు పదహారు చోట్ల స్థావరాలను ఏర్పరచుకున్నట్టు బుధవారం బయటపడింది. ఈ స్థావరాల్లో మారణాయుధాలు, బాంబులు, విస్పోటన వికిరణ వాహకాలు- రాకెట్ లాంచర్స్- కూడ బయటపడడం ‘ఐసిస్’ భయంకర విస్తృతికి నిదర్శనం. మన దేశంలో ఎన్నిచోట్ల ఇలాంటి స్థావరాలున్నాయో మరి!!
అఫ్ఘానిస్తాన్‌లో 2002లో పలాయనం చిత్తగించిన ‘తాలిబన్- అల్ ఖాయిదా’ జిహాదీలు అటు యెమెన్ వరకూ, సోమాలియా వరకూ విస్తరించారు. ఇటు మన జమ్మూ కశ్మీర్‌లోకి, బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డారు. ఇప్పుడు సిరియాలో ‘ఐసిస్’ మట్టికరచినట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. అందువల్లనే తమ సైనికులను సిరియా నుంచి ఉపసంహరించినట్లు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. అయితే ‘తాలిబన్ల’ వ్యూహాన్ని ఇప్పుడు ‘ఐసిస్’ కూడ అమలు జరుపుతోంది. ఇరాక్ నుంచి, సిరియా నుంచి నిష్క్రమిస్తున్న ‘ఐసిస్’ మన దేశంలోను ఇతర దేశాలలోను చొరబడిపోయింది.. చొరబడి పోతోంది.. అప్రమత్తత అనివార్యం..

‘ఫ్రంటు’లోయమ్మ.. ‘ఫ్రంటులూ’..

$
0
0

మళ్లీ మనం ఈ ‘కాలమ్’లో కలుసుకునేది 2019లోనే. 2018కి ‘గుడ్ బై’ చెప్పేముందు- దేశంలో రాజకీయ చిత్రాన్ని ‘హోల్ మొత్తం’గా మార్చిపారేసి వెళ్లిపోతున్నందుకు ‘శభాష్ శెభాష్’లు చెప్పాలి కూడా. కొంతమంది మెటికలు విరిచి మరీ తిడతారనుకోండి- అది వేరే సంగతి.
రానున్న కాలం- 2019 అంతా ‘ఫ్రంట్’ల మయం. ‘‘ఫ్రంటులోయమ్మ .. ఫ్రంటులూ’’ అంటూ భళ్లున తెల్లారినట్లు కొత్త సూర్యోదయం కాబోతోంది. 2014లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీ- ‘పీనిక్స్’లాగా లేచిందన్నాడొక ఇందిరాగాంధీ వీరాభిమాని. ఎప్పటిలాగే స్తబ్దుగా ప్రారంభమైన 2018వ సంవత్సరం మోదీ పర్జన్య గర్జనలతోనే కొంతకాలం సాగింది. కానీ, ‘కమలం పార్టీ’కి అపశ్రుతులు, అపశకునాలు ఎదురైనట్లుగానే సాగింది. కాంగ్రెస్, దానితోపాటు ఇతర ప్రతిపక్షాలూ, చాలావరకూ ప్రాంతీయ పార్టీలు మాత్రమే అయినా-గొంతు కలిపాయి. భాజపా ఖాతా నుంచి ఏడాది చివరకొచ్చేసరికి ఐదు రాష్ట్రాలు జారిపోయాయి.
దక్షిణాదిన కాలూని, జెండా పాతడానికి జాగా కోసం అఖిల భారతీయ జనతా పార్టీ వెతుక్కుంటోంది. తెలుగు రాష్ట్రాల దగ్గర కొచ్చేసరికి, కొత్త రాష్ట్రం తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ కూడా తెనుగువాడు మోదీ పార్టీకి- అక్కడోరకంగా, యిక్కడో రకంగా ‘దేవిడీమన్నా’ విధించేశాడు. మహర్జాతకుడు- తెరాస అధినేత కేసీఆర్ అశ్వమేథ యాగం తర్వాత గుఱ్ఱాన్ని వదలిపెట్టినంత వీరోచితంగా జైత్రయాత్ర లాంటి ‘ఫ్రంట్ యాత్ర’ తీరం వెంబడే సాగించసాగాడు.
‘‘ఫ్రంట్.. ఫ్రంట్’’ అంటూ తెలుగు ముఖ్యమంత్రులు- విడివిడిగా దేశం మీద పడ్డారు. ‘‘తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన- దేశంలో గాంధీ కుటుంబ పాలన’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా వినబడే అరుపులు- చివరికి పిల్లికూతలైపోయాయి.
అంతేనండీ బాబూ! వోటర్‌లని ‘జనం’ అంటాం కదా మనం. వాళ్లు యిలాగే ‘ప్రభంజన’మై కేసీఆర్ కుటుంబ పాలనకి లైన్ క్లియర్ యివ్వడమే గాదు, ఎఱ్ఱ తివాచీలు పరిచారు. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి, యిరవై సంవత్సరాల తర్వాత సారథ్యం మారింది. సోనియా మాత తనయుడు రాహుల్‌కి పగ్గాలందించింది. జాగ్రత్తగా చూస్తే-మోదీజీ ఒకరకమైన బ్రహ్మచారైతే రాహుల్ గాంధీ మరొకరకమైన బ్రహ్మచారి. వాళ్లకి వాళ్లే వారసులుగా వాగ్యుద్ధం సాగించారు. మోదీజీకి ‘‘సబ్ కే సాథ్ సబ్‌కా వికాస్’’ అనడానికి వీలు లేకుండా సంఘ్ పరివార్‌లోనే ఎదురుగాలి వీచింది. తను చేసిన ఘనకార్యాలను ఏకరువు పెట్టకుండా-కేవలం రాహుల్ గాంధీ-రఫ్ఫేల్’ (రఫ్) ఆడించేసరికి-అసలు సంగతి మర్చిపోయి-‘‘అటాక్ రాహుల్- అటాక్ కాంగ్రెస్ వైఫల్యాలు’’ అంటూ, శ్రీమాన్ నరేంద్ర మోదీ తన పోరాటాన్ని ‘పప్పు’లో కాలు వేసిన రీతి ‘డైవర్ట్’ చేసుకుంటూ (పో)రావడంతో- ప్రాంతీయ పార్టల వత్తాసుతో -‘‘అయోధ్య రామా! కావరావా?’’ అన్నట్లు దిగాలు పడిపోయింది భాజపా.
2018 అర్ధరాత్రి ‘రింగ్ అవుట్’ అంటే ‘రింగ్ యిన్’ అన్నది కొత్త ఫ్రంట్‌లకో జేగంటలాగా మ్రోగింది. ‘‘ఫ్రంట్ లోయమ్మా! ఫ్రంట్‌లూ’’- అంటూ తెలుగువీరులు యిద్దరూ ‘‘నేను కింగ్‌మేకర్ని నేనంటే నేనే.. కింగ్ మేకర్ని’’ అంటూ దక్షిణాది తడాఖా చూపిస్తూ- ఉత్తరాది ‘చలి’ విరిగే లాగా చర్చలు, వ్యూహాలూ అంటూ రంగంలో దూకి బిజీ అయిపోయారు.
‘‘ఏ రాయి అయితేనేం పళ్లూడగొట్టడానికి’’ అన్నట్లు దక్షిణాది నుంచి ప్రాంతీయ పార్టీల దెబ్బ చెలరేగగా భాజపా ‘ఛత్రం’ నీడకు ఎవ్వడూ దూరనంటున్నాడు. పైగా, సంఘ్ పరివార్ ఒకటి, ‘ఆగమాగం’ చేసేస్తుందేమోనన్న భయం వొకటి పట్టుకుంది. అటు చూస్తే యూపీలో ఆదిత్యనాథ్ యోగి కాని యోగి -ఆంజనేయస్వామి ‘కులం’మీద, భాగ్యనగర్ పేరుమీద లెక్చర్‌లు కొడుతూ ‘జనరంజనం’ చేస్తూంటే-అమిత్ షానేమో ‘మోదీజీదే వచ్చేసారి ప్రధానమంత్రి పదవి’ అంటూ వాగ్ధాటి ప్రదర్శిస్తూ వుండగా-కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, 2019లో సంచలనం కాగల ఎన్నికల గాలులు వీస్తాయని పొలిటికల్ వాతావరణ పండిట్స్ జోస్యం చెబుతున్నారు-అస్తు-
దక్షిణాదిన కాంగ్రెస్, డి.ఎమ్.కె, టి.డి.పి వగైరాల కలయికతో ‘ఫ్రంటు’ లేదా ‘కూటమి’ తథ్యం అంటున్నారు. అలాగే యూపీలో ‘స.సా’, ‘బసపా’లు రాష్ట్రీయ లోక్‌దళ్‌ని కూడా పిలిచి జట్టు కడుతున్నాయి. బిహార్‌లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, రాష్ట్రీయ లోక్ సమతా లాంటి చిల్లర మల్లర పార్టీలూ చేతులు కలుపుతున్నాయి. యు.పిలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ- మాయావతీజీని ‘దువ్వడం’ యింకా మానలేదు. ఆంధ్రాలోనూ, తెలంగాణలోనూ కూడా రెండు రకాల ఫ్రంట్‌లూ -మొత్తం మీద భాజపా మీదనే యుద్ధం చేస్తాయిట!
ఐతే, ‘‘ఏ రాష్ట్రాలలోని పార్లమెంటు సీట్లు, ఆయా ఫ్రంట్‌లు రేపు భాజపా నుంచి లాక్కుంటే? లాక్కోగలిగితే’’- ఇవీ.. ఈ చలికాలంలో వేడి పుట్టించే చర్చలు.
తెలంగాణ ఏర్పడిన నాలుగున్నర ఏండ్లకే దేశ రాజకీయ పార్టీల్లో గొప్ప సంచలనం తీసుకురాగలిగింది. ‘‘కొడుకుకి రాష్ట్రంలో ‘పట్టం’గట్టి, తాను దేశ రాజకీయాలలో ‘చక్రం’ త్రిప్పుతానని కేసీఆర్ అంటే- ఇంకేమైనా అప్పీలుంటుందా?’’ అనడిగాడో సీనియర్ సిటిజిన్. ‘‘ఏది సవాలో, అదే జనాలు’’ అన్నాడు ఓ ‘గో.పి’ (గోడమీద పిల్లి).
క్రీడారంగంలో ‘సింధు’ బంగారు విజయం ఎంత సంచలనమో సినిమా రంగంలో దీపికా, ప్రియాంకా, సైనా వగైరా గ్లామర్ బొమ్మల వివాహాలు కూడా అంత సంచలనాత్మకం.
ఆస్ట్రేలియాలో ఏడు సంవత్సరాల బుడతడు క్రికెట్ జట్టుకి వైస్ క్యాప్టెన్ కాగా, ఏమీ ‘కొంప మునగదు’ గానీ- కోహ్లీ జట్టుకి కేవలం కోహ్లీ రికార్డులకు మించి మరింకేమీ సాధించలేదు అన్న అపవాదు పోవాల్సి వుంది.
మళ్లీ ‘ధోనీ.. ధోనీ’ అన్న పేరుతో క్రికెట్ ప్రేక్షకుల కేకలు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ల క్రికెట్ మైదానంలో ప్రతిధ్వనించడం చూస్తాం. అదే రుూ ఏడాది చివరి ‘కొసమెరుపు’ అనుకోండి.
అయ్యవారి లింగం గారేం చేస్తున్నారయ్యా? అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు- అని కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి పన్నులను రోజుకో ‘యిన్ని’ అంటూ లెక్కపెట్టుకుంటూ తగ్గిస్తోంది. అట్టి తరి, ఏడాది చివర ఓ మంచి పని చేశారంటూ-
రింగ్ ఇన్ లవ్ అండ్ పీస్..! ఆమెన్..!
*

లౌకికవాదం ముసుగులో విద్రోహం!

$
0
0

‘మహాభారతం’లో విదుర నీతి చదివితే సమకాలీన భారతదేశంలో రాజకీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థతో పాటు జీవితంలో ప్రతి వ్యక్తీ ఏ సమయంలో ఎలా మసులుకోవాలనే విషయాలు చక్కగా తెలుస్తాయి. భారత్ సహా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ప్రజల ఆలోచనా విధానాలను తెలుసుకోవాలంటే మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రామాయణం, మహాభారతం చదవాల్సిందే. దీనికి తోడు ఆధునిక కాలంలో దేశ చరిత్రను అధ్యయనం చేయాలంటే మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ రాసిన పుస్తకాలను చదివితే మన పరిస్థితి, మనం ఎక్కడ నిలబడి ఉన్నామో తెలుస్తుంది. దక్షిణాసియా దేశాలు ఉమ్మడి చరిత్ర, సంస్కృతిని కలిగి ఉన్నాయి. ఈ రోజు భూటాన్, మయన్మార్, శ్రీలంకలో బౌద్ధం, భారత్, నేపాల్‌లో హైందవం, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌లో ఇస్లాం మతాలను పాటించే ప్రజలు అధిక సంఖ్యాకులు ఉన్నా, వీరి జీవన శైలి, బుద్ధి, ఆలోచనల్లో ఎక్కడా తేడా కనపడదు. ఒక్క ఆహార విధానంలో మాత్రం తేడా కొట్టొచ్చినట్లు కనపడుతుంది.
మహాభారతంలో విదురుడు చెప్పినట్లు- ఒక వివాదాస్పద అంశంపై మాట్లాడే కంటే వౌనంగా ఉండడం ఉత్తమం. ఒక వేళ మాట్లాడాల్సి వస్తే సత్యం మాట్లాడాలి. మనం మాట్లాడే సత్యం కూడా అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి. పైగా అందులో నీతి ఉండాలి. ఇంత కష్టపడడం ఎందుకనుకుంటే వౌనం వహించడం మంచిది. ఎడాపెడా నోరుపారేసుకుంటే భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.
బాలీవుడ్‌కు చెందిన గొప్ప నటుడు నసీరుద్దీన్ షా. సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తి. యూపీలో బులంద్‌షహర్‌లో హిందువుల పవిత్రమైన గోవు విషయంలో తలెత్తిన వివాదంలో కొంత మంది మతోన్మాదులు ఒక పోలీసు అధికారిని కాల్చి చంపారు. ఇది దుర్మార్గమైన చర్య. నసీరుద్దీన్ షాకు ఈ ఘటనపై తన పిల్లలకు ఏమి చెప్పాలో తెలియదట! ఈ దేశంలో ఉండాలంటే భయం వేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా ఈ చర్చలో తాను పాల్గొనకపోతే వెనకబడతానేమోనని భావించి తలదూర్చారు. బులంద్‌షహర్ అంశం అటకెక్కింది. ఈ రోజు పాకిస్తాన్‌లో మైనార్టీలు ఎదుర్కొంటున్న దుస్థితి ఏమిటి ? భారత్‌లో నిజంగా ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారా? అనే అంశంపై చర్చకు దారి తీసింది.
లాహోర్‌లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ భారత్‌లో మైనార్టీలకు భద్రత లేదని, తమ దేశంలో జిన్నా కలలను సాకారం చేసే విధంగా మైనార్టీ హిందువుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుని అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తామన్నారు. నసిరుద్దీన్ షా అతిగా స్పందించి చేసిన వ్యాఖ్యలకు పాక్ స్పందించడంతో మన దేశంలో ముస్లింలు ఆత్మరక్షణలో పడ్డారు. తాము ఏకాకులం అనే భావం వారిలో కనిపించింది. అందుకే సంబంధం లేని అంశాల్లో వేలు పెట్టి మీడియాలో పేరుతెచ్చుకునేందుకు అవాకులు, చవాకులు వాగితే నసిరుద్దీన్ షాకు పట్టిన గతే పడుతుంది. చివరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రంగంలోకి దిగి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను-‘నీ దేశం సంగతి చూసుకో... నీ దేశంలో మైనార్టీల పరిస్థితి అధ్వానం.. మా భారత్‌లో హిందువులు, ముస్లింలు హాయిగా జీవిస్తున్నార’నే సత్యాన్ని చెప్పారు. క్రికెటర్ కైఫ్ పాక్‌కు దీటుగా బదులిచ్చారు. నసిరుద్దీన్ షా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కేంద్ర మంత్రి గిరిరాజ్, ఇంకా కొంత మంది ఉత్తరాదికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ మంత్రులు అనేక సందర్భాల్లో చేసే వ్యాఖ్యల వల్ల మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతోంది.
భారత ఉపఖండంలోని దేశాల్లో మైనార్టీల పరిస్థితిని విశే్లషిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్- ‘మనం గతం, ప్రస్తుతంలో జరుగుతున్న ఘటనలపై ఘర్షణ పడితే, అందమైన భవిష్యత్తును కోల్పోతాం ’ అన్నారు. నరం లేని నాలుక, అర్థం పర్థం లేని అంశాలను మాట్లాడే పెదవుల వల్ల ఓడలు మునుగుతాయి అని రెండవ ప్రపంచ యుద్ధంలో పాపులర్ అయిన సామెతలను గుర్తుకు తెచ్చుకోవాలి. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు సున్నితమైనవి. యూదులు తరచుగా ఒక మంచి మాట చెబుతుంటారు. అతి వాగుడు అనేది దుర్మార్గమైన పనులు చేసే చేతుల కంటే ప్రమాదం.
ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో సున్నితమైన అంశాలపై ఇష్టం వచ్చినట్లు కొందరు ‘లౌకికవాదం’ ముసుగులో మాట్లాడుతున్నారు. వీరికి చరిత్ర తెలియదు. 1980లో యూపీలోని మొరాదాబాద్‌లో మతపరమైన అల్లర్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ ఘటనలు భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయం. అప్పుడు యూపీ సీఎం విపి సింగ్. ప్రధాని ఇందిరా గాంధీ. ఆ పట్టణంలో ముస్లింలు, హిందువులు సమాన సంఖ్యలో ఉంటారు. అక్కడ ఇత్తడి పరిశ్రమలు ఎక్కువ. 1980 ఆగస్టు 13వ తేదీన ముస్లింలు నమాజ్ చేసేందుకు ఈద్గా వద్దకు వచ్చారు. అక్కడ ఒక పంది కనపడింది. అక్కడ అప్పటికే పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సహజంగానే ప్రార్థనలు చేసే చోట పంది కనపడితే ముస్లింలు బాధపడతారు. పందిని అక్కడి నుంచి పంపేయాలని వారు పోలీసులను అడిగితే అది తమ పని కాదని వారన్నారు. దీంతో వారు ఆగ్రహావేశాలతో రాళ్లు విసిరితే, ఓ అదనపు ఎస్పీ మరణించాడు. దీంతో శాంతి భద్రతల నియంత్రణకు పోలీసులు రంగంలో దిగారు. ఈ అల్లర్లలో 400 మంది మరణించినట్లు అధికారిక లెక్కలున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం 2500 మంది మరణించారు. పోలీసు కాల్పుల్లో వందమంది ఈద్గా వద్ద మరణించారు. 1980 తర్వాత ఇంతవరకు మొరాదాబాద్‌లో అల్లర్లు జరగలేదు.
1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు కారణాల్లో గోవు, పంది మాంసం కొవ్వు ఒక కారణమని ఈ నాటి యువతకు తెలియకపోవచ్చు. తుపాకుల్లో పెట్టే మందుగుండు సామాగ్రిని కాట్రిడ్జ్‌లలో ఉంచుతారు. ఇవి అయిపోయినప్పుడల్లా నోటితో పీకి తుపాకీలోకి గుళ్లు వేసుకోవాలి. ఆవు, పంది కొవ్వుతో వీటిని తయారు చేశారనే వదంతుల వల్ల సిపాయిల తిరుగుబాటు వచ్చిందని చరిత్రలో ఉంది. మొదటి నుంచి పోరాటాల్లో, యుద్ధాల్లో, తిరుగుబాట్లలో, స్వాతంత్య్ర పోరాటాల్లో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది వారి పాత్ర తక్కువే. పైగా ఇతర ప్రాంతాల వారికి అల్పమైన విషయాలుగా కనపడే సామాజిక అంశాలు ఉత్తరాదిన పెద్ద ఎత్తున ఘర్షణలకు దారితీస్తుంటాయి.
భారత ఉపఖండంలో ఉన్న మతపరమైన విశ్వాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు, జాతులు, ఆ వర్గాల ప్రజల ఆలోచన విధానాలను నియంత్రించలేం. ఈ రోజు బులంద్‌షహర్ లేదా 1980లో మొరాదాబాద్ ఘటనలైనా- బాధితులు ఎవరు ? ఈ రెండు ఘటనల్లో తొలి బాధితులు పోలీసులే. 1947లో దేశ విభజన జరిగిందనే వాస్తవాన్ని తెలుసుకుని, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా ఉంటే మేలు. కుహనా లౌకికవాదులు, మతతత్వ రోగంతో బాధపడే కొంత మంది హిందుత్వ వాదుల నోటి దురుసుతనం మన గ్రామాలు, పట్టణాల్లో హాయిగా జీవించే హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య చిచ్చుపెడుతోంది.
కేంద్ర మంత్రి అబ్బాస్ నక్వీ చెప్పినట్లు పాకిస్తాన్‌కు భారత్‌లో మైనార్టీల గురించి మాట్లాడే హక్కు లేదు. 1941లో అఖండ భారత్‌లో ప్రస్తుత పాకిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు 60 లక్షల మంది ఉన్నట్లు గణాంక వివరాలు చెబుతాయి. విభజన సమయంలో దాదాపు 50 లక్షల మంది పాక్ నుంచి భారత్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి అంతే సంఖ్యలో ముస్లింలు మన శత్రుదేశం పాకిస్తాన్‌కు వెళ్లారు. పాకిస్తాన్‌లోని సింధ్ నుంచి వలసలు ఎక్కువగా జరగలేదు. సింధ్ రాజధాని కరాచీ నగరంలో సగం మంది హిందువులు ఉండేవారు. పంజాబ్ రాజధాని లాహోర్‌లో అంతే. సింధ్‌లోని సుక్కూర్, శిక్రాపూర్, లార్కానాలో ఇప్పటికీ హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున రక్తపాతం, హింసాకాండ జరిగింది. దాదాపు 40 లక్షల మంది హిందువులు, సిక్కులు పంజాబ్ నుంచి భారత్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత కరాచీతో పాటు బలూచిస్తాన్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిన్స్ పెషావర్ నుంచి హిందువులు, సిక్కులు భారత్‌కు వలస వచ్చారు. 1941 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లో 23 శాతం మైనార్టీలు ఉండే, ఈ రోజు 3 శాతం లోపు ఉన్నారు. భారత్‌లో మైనార్టీల సంఖ్య పెరిగింది. దీనికి కుహనా లౌకికవాదులు ఏం సమాధానం చెబుతారు?.
పాక్ సృష్టికర్త మహమ్మదాలీ జిన్నా ‘సెక్యులర్ పాకిస్తాన్’ కలలు కన్నారు. వంద ఎలుకలను చంపిన పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు చందంగా పాక్ పాలకుల తీరు తయారైంది. ఆ తర్వాత పాక్‌లో అధికారంలోకి వచ్చిన మిలిటరీ, పౌర పాలకులు భారత్‌పై విద్వేషం పునాదిగా పాలన సాగించారు. జిన్నా కలలను భగ్నం చేసి జియా ఉల్ హక్ 1980 దశకంలో పాకిస్తాన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించి రాజ్యాంగంలో చేర్చారు. దేశ విభజనలో సరిహద్దుల్లోని అన్ని రాష్ట్రాలను విభజించారు. సింధ్ ప్రాంతం మాత్రం పాక్‌కు వెళ్లింది. భారత్ వైపు ఎడారి ఎక్కువగా ఉండడం వల్ల సింధ్ విభజనకు నోచుకోలేదు. విభజన చేయాలన్న డిమాండ్ సింధ్ నుంచి రాలేదు. భారత్-పాకిస్తాన్‌ల ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, నాగరికతలకు నిదర్శనం సింధ్ ప్రాంతం. ఈ ప్రాంతం 1947 విభజన జరిగే వరకు ముంబయి రాష్ట్రంలో భాగంగా ఉండేది.
పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ కూడా నోరుపారేసుకోవడంలో ముందంజలో ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి ఆర్మీ చీఫ్ బాజ్వాను ఆలింగనం చేసుకున్నాడు. పైగా తనకు దక్షిణ భారతదేశానికి వెళ్లడం కంటే పాకిస్తాన్ పంజాబ్‌కు వెళ్లడం ఎంతోహాయిగా ఉంటుందని చెప్పాడు. దక్షిణ భారత్‌లోని భాషలు తెలియవని, అదే లాహోర్‌కు వెళితే నచ్చిన తిండి, ఒకటే భాష, సంస్కృతి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సిద్ధూ లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం.
నసీరుద్దీన్ షా సినిమాల్లో బాగా నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పాపులారిటీ సినిమాల వల్ల వచ్చింది. లేదంటే నసిరుద్దీన్ షాను ఎవరు పట్టించుకుంటారు? సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాలలో రెచ్చి పోయి భారతీయ సంస్కృతికి సంబంధించిన అంశాలపై తమ భావాలను వెలిబుచ్చడం వల్ల మతసామరస్యాన్ని భగ్నం చేసినట్లవుతుంది. ఈ రోజు మైనార్టీల హక్కులను కాలరాస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న రోగగ్రస్త దేశం పాకిస్తాన్‌కు ప్రధాని అయిన ఇమ్రాన్ కూడా నాగరికతలకు తల్లి లాంటి భారత్‌కు సలహా ఇచ్చేంతటి వాడయ్యాడు. ఇంటిదొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడనట్లు, దేశంలో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకునో లేక పనిలేని మీడియా సంస్థలు ఏదో మాట్లాడమని కోరితే సంబంధం లేని అంశాలపై చిల్లర రాజకీయాలు చేస్తూ కుహనా లౌకికవాదులు నోటికి వచ్చినట్టు వాగడం వల్ల దేశ భద్రతకు చేటు.
సాంకేతికంగా భారత ఉపఖండంలోని దేశాలు ఉమ్మడి సంస్కృతిని కలిగి ఉన్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి. మనం ఏది మాట్లాడినా, దాని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత కుష్వంత్ సింగ్ ‘ట్రైన్ టు పాకిస్తాన్’ అనే పుస్తకంలో- ‘నీతి అనేది డబ్బుకు సంబంధించింది. డబ్బు సంపాదించే వాడు నీతి గురించి మాట్లాడితే అందరూ వింటారు. ఐశ్వర్యవంతుడు చెప్పే నీతులను వినే ఓపిక పేదలకు ఉండదు. అందుకే మత విశ్వాసాలను నమ్ముకుంటారు..’ అని చెప్పిన మాటలు అక్షరసత్యాలు. కష్టపడి పనిచేసి, కుటుంబాన్ని పోషించుకుని, మంచి జీవితం కోసం మనిషి మత విశ్వాసాలను కలిగి ఉంటాడు. మతంలో సంస్కృతి ఇమిడి ఉన్న సమాజంలో మేధావులు, రాజకీయ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి. మాతృభూమికి చేటు కలగించే కుహనా లౌకికవాదుల పట్ల, మతతత్వ శక్తుల పట్ల జనం అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి.

పర్యాటక రంగానికి కొత్త ఊపు

$
0
0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కుతూ సందర్శకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘విజన్’కు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగం విస్తరిస్తోంది. సహజ సిద్ధంగా ఉన్న అన్ని అవకాశాలను పర్యాటక శాఖ సద్వినియోగం చేసుకుంటోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటకం, గ్రామీణ పర్యాటకం, సముద్రతీర పర్యాటకం, వినోద పర్యాటకం.. ఇలా అన్ని వైపులా ఈ శాఖ విస్తరిస్తోంది.
పుణ్యక్షేత్రాలు, పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, నదులు, కాలువలు, సెలయేర్లు, సుందర ప్రదేశాలు, సముద్ర తీరాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా రూపుదిద్దుకుంటున్నాయి. నదులలో భద్రతతో కూడిన బోటు షికారుకు ఏర్పాట్లు చేశారు. పర్యాటకులకు కావలసిన హోటళ్లు, వినోద కేంద్రాలు, రోడ్లు, అతిధి గృహాలు.. వంటి వౌలిక సదుపాయాలు ఏపీ ప్రభుత్వం సమకూరుస్తోంది. దేశ, విదేశీ పర్యాటకులకు ఆంధ్ర వంటకాల రుచి చూపిస్తున్నారు. గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నూతనంగా చేపట్టిన ‘సంస్కృతి’ ప్రాజెక్టుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. భారతీయ జీవనం, రాష్ట్రంలో పలు ప్రాంతాల సంస్కృతి, కళల అభివృద్ధికి పర్యాటక శాఖ అనేక చర్యలు చేపట్టింది. తెలుగు సంస్కృతి, తెలుగు నృత్య రీతులు, తెలుగు వంటలు, తెలుగు పండుగలే గాక హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, కోలాటం, థింసా నృత్యం వంటి కళలతోపాటు వారసత్వంగా వచ్చే కళల పునరుజ్జీవానికి స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. కళల పరిరక్షణ దిశగా పర్యాటక శాఖ మంచి ఫలితాలను సాధిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఈ రంగం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర బడ్జెట్‌లో తగినంతగా నిధులు కేటాయిస్తున్నందున పర్యాటక రంగం విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.
పర్యాటక శాఖ చేపట్టే అంతర్జాతీయ ఈవెంట్లు, సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్1హెచ్2ఓ బోట్ రేసింగ్, ఎయిర్ షో, బెలూన్ ఫెస్టివల్, బీచ్ ఫెస్టివల్ వంటివి ప్రజలలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతోంది. ఏపీ రాజధాని అమరావతిని కూడా పర్యాటకులను ఆకర్షించే రీతిలో రూపొందిస్తున్నారు.
దేశంలో 13 శాతం మేరకు అంటే రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంట భూగర్భంలో నిక్షిప్తమై వున్న అపారమైన ఖనిజ సంపద పరిశ్రమల నిర్మాణానికి, పోర్టులు ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగపడటంతోపాటు బీచ్ టూరిజానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అనేక కార్యక్రమాలు రూపొందించింది. ఈ రంగంలో ఆర్థిక వృద్ధి రేటుకూడా గణనీయంగా పెరుగుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6.96 శాతం వున్న అభివృద్ధి సూచీ రాష్ట్రం చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి చర్యలతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి 11.22 శాతం అభివృద్ధి సూచికను చేరుకుంది. ఆధ్యాత్మిక పరంగా ప్రాధాన్యత కలిగిన కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతాన్ని సందర్శకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కృష్ణానదికి మహర్దశ కలిగింది. విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భవానీ ద్వీపాన్ని అన్ని సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించే విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పర్యాటక ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారం భద్రపరిచే ఏర్పాటు చేస్తున్నారు. గండికోటలో ఏర్పాటు చేయదలచిన ఎడ్వెంచర్స్ అకాడమీ పనులను డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించారు. ఏపీ పర్యాటక శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో పర్యాటక పండుగలకు సంబంధించిన సమాచారం డిజిటల్ క్యాలెండర్ రూపంలో అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఆధునికమైన ఓల్వో బస్సులను ప్రవేశపెట్టింది. పూణె, కోల్‌కతా, ముంబయి, న్యూఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, మైసూర్‌లలో మాదిరి పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పర్యాటక శాఖ భాగస్వామ్యంతో మహీంద్ర జూమ్ కార్లను ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఎవరికివారు డ్రైవింగ్ చేసుకునేలా ఏర్పాటుచేసిన ఈ బ్యాటరీ అద్దె కార్లు గన్నవరం విమానాశ్రయం, విజయవాడ బెంజ్ సర్కిల్, సచివాలయం వద్ద అందుబాటులో ఉంచుతారు. తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా వున్న ఆహారం గురించి నేటి తరంతోపాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఆ శాఖ ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ పేరుతో ఆహార పండుగలు నిర్వహిస్తోంది.
తపాలా శాఖ అందిస్తున్న ‘మై స్టాంప్’ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని పనె్నండు పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేసింది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పర్యాటక ప్రాంతాలు మరింతగా జన బాహుళ్యంలోకి వెళ్ళేలా చేస్తోంది. పర్యాటక రంగ పరంగా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులవల్ల వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయిసంస్థలు పర్యాటక శాఖకు అవార్డులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటక రంగంలో సమగ్ర అభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా వరుసగా రెండేళ్లు రాష్ట్ర పర్యాటక శాఖకు అరుదైన గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ‘ఇండియా టుడే’ పత్రిక ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఏపి టూరిజం దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందని కొనియాడుతూ పర్యాటక రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అవార్డును పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియకు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అందజేశారు. పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయడం కోసం ఏక గవాక్ష విధానాన్ని మరింత సరళీకరించి, పటిష్టపరిచారు. పర్యాటక పెట్టుబడిదారులు తమ అనుమతుల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదురుకాకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలవల్ల ఈ రంగంలో పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. పలు ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడుతున్నాయి.

బొగ్గు కొరత నివారణపై దృష్టి

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: విద్యుత్ ఉత్పాదనకు బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకుని వచ్చే యేడాది కోల్ ఇండియా లిమిటెడ్స్ (సీఐఎల్)కి అదనంగా గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఐసీకి కేటాయించిన బొగ్గుగనులతోబాటు అదనంగా 10 గనులు కేటాయించడం జరుగుతుందని, తద్వారా ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత అధికార వర్గాలు బుధవారం నాడిక్కడ వెల్లడించాయి. థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు దేశ వ్యాప్తంగా పలుచోట్ల బొగ్గు కొరతను ఈ యేడాది ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికే సీఐఎల్‌కి 85 బొగ్గు గనులను కేటాయించడం జరిగింది. వచ్చే యేడాది అదనంగా విద్యుత్ ఉద్పాదన కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా జరిగేలా మరో 10 గనులను సీఐఎల్‌కి కేటాయించడం జరుగుతుందని కోల్ ఇండియా సంయక్త కార్యదర్శి ఆశిష్ ఉపాధ్యాయ వెల్లడించారు. మొత్తం వంద మిలియన్ టన్నులకు బొగ్గు సరఫరాను పెంచాలన్న లక్ష్యం ఉందని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తుల్లో 80 శాతం కోల్ ఇండియా పరిధిలోనే జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత యేడాది బొగ్గు కొరతకు ఉత్పత్తికన్నా డిమాండ్ పెరగడమే కారణమని తెలిపారు. ఐతే ఆ సవాళ్లను అధిగమించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ దిశగా లక్ష్యాన్ని సాధించిందన్నారు. అయితే విద్యుత్ ఉత్పాదన కేంద్రాల్లో బొగ్గు స్టాకులు తక్కువగా పెట్టుకోవడంవల్ల కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గడచిన మే నెలలో బొగ్గు నిల్వలకు సంబంధించి 33 విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ క్రమంగా ఈ సంఖ్య తగ్గుతూ వస్తోందని, ప్రస్తుతం దాదాపు 10 కేంద్రాలు మాత్రమే సమస్యను ఎదుర్కొంటున్నాయని ఉపాధ్యాయ వివరించారు. ప్రతి ఉత్పాదక కేంద్రంలో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకోవాల్సి ఉంటుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వచ్చే యేడాది మూడో త్రైమాసికం నుంచే దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తులు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో వచ్చే సంవత్సరం కనీసం పది శాతం అభివృద్ధి రేటును సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ యేడాది ఇప్పటికే 8 శాతం అదనపు బొగ్గు ఉత్పత్తి జరిగిందని, గత యేడాదితో పోలిస్తే ఇది చాలా అధికమని తెలిపారు. డాలర్ విలువ పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు దిగుమతికి ఇబ్బందులున్నాయని, అందుకే వీలైనంత అధికంగా దేశీయంగానే బొగ్గు సేకరణకు కృషి జరుగుతోందని ఆవిష్ ఉపాధ్యాయ చెప్పారు.


మళ్లీ పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

$
0
0

ముంబయి, డిసెంబర్ 26: ఆరంభంలో కొంత ఊగిసలాటకు గురైనప్పటికీ బుధవారం స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికన్ మార్కెట్లలో తలెత్తిన సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఈక్విటీలు ఆరంభంలో బెంచ్ మార్కుకన్నా దిగువన ట్రేడై నష్టాల బాటపట్టినా తర్వాత బాగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ మూడు రోజుల నష్టాల పరంపరను దాటి బుధవారం 179.79 పాయింట్లు ఎగబాకి 0.51 శాతం లాభాలతో 35,649.94 వద్ద ముగిసింది. ఆరంభంలో ఇండెక్స్ 35,010.82కన్నా దిగువకు చేరుకుని తిరిగి క్రమంగా బలపడటం జరిగింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 66.35 పాయింట్లు లాభపడి 10.700 పాయింట్ల మార్కును దాటి 0.62 శాతం లాభాలతో 10.729.85 వద్ద ముగిసింది. తొలుత ఊగిసలాటలో ఉన్న సూచీలు మధ్యాహ్నం తర్వాత గణనీయంగా బలపడ్డాయి. ప్రధానంగా నిఫ్టీ లాభాల బాటలోపడి ఈ సంవత్సరాంతం వరకు ఈ ట్రెండును కొనసాగించే అవకాశాలున్నాయని, భారీ మార్కెట్లలో నిఫీ మాత్రమే ఈ క్యాలండర్ సంవత్సరానికి సానుకూల సంకేతాలతో ఉందని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐవో విరాల్ బెరావాలా విశే్లషించారు. గత సెషన్‌ను 271.92 పాయింట్ల తక్కువగా 35,470.15 వద్ద ముగించిన సెనె్సక్స్, 90.50 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ క్రిస్మస్ సెలవుదినం తర్వాత పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా అమెరికాలో రాజకీయ స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్న ఇనె్వస్టర్లు కొత్త పెట్టుబడుల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఈక్రమంలో స్వల్పకాలికంగా ద్రవ్యలభ్యత, సెంటిమెంటుపై మార్కెట్ల స్థితిగతులు ప్రభావం చూపే అవకాశం ఉందని బీఎన్‌బీ ప్రభాస్ నేతృత్వంలోని షరేఖన్ సంస్థ సలహా విభాగం అధిపతి సేమాంగ్ జానీ తెలిపారు. ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక స్టాక్‌లతోడ్పాటుతోనే నిఫ్టీ 10,700 మార్కును దాటగలిగిందని ఆయన వివరించారు. కాగా బుధవారం అధిక లాభాలను ఆర్జించిన సంస్థల్లో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎప్‌సీ డుయో, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్‌లు ఉన్నాయి. ఈ కంపెనీలు సుమారు 4 శాతం లాభాలను ఆర్జించడం విశేషం. మరోవైపు సన్‌పార్మా, యెస్ బ్యాంక్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టాటామోటార్స్, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ స్వల్పంగా నష్టపోయి 2 శాతం నష్టాలతో రోజును ముగించాయి. అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ బలపడి 70.08 రూపాయల వద్ద నిలిచింది. అలాగే ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 0.73 పెరిగి బ్యారెల్ 51.14 డాలర్లు పలికింది. ఇలావుండగా విదేశీ మదుపర్లు సోమవారం 577.10 కోట్ల విలువైన షేర్లు అమ్మకాలకు పెట్టిన సంగతి తెలిసిందే. అదే రోజున దేశీయ ఇనె్వస్టర్లు 186.14 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

కామెంటేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

$
0
0

మెల్‌బోర్న్, డిసెంబర్ 26: ‘మయాంక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చేసిన ట్రిపుల్ సెంచరీ (304) పెద్ద విషయ మేమీ కాదు. ఏ క్యాంటీన్ జట్టుపైనో, వెయటర్స్ టీమ్‌పైనో అతను ఈ పరుగులు చేసి ఉండొచ్చు’. అంటూ ఆసీస్ కామెంటేటర్ ఓ.కీఫ్ ఆసీస్- భారత్ నడుమ జరుగుతున్న బాక్సిం గ్ డే టెస్టులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ట్విట్టర్ వేదికగా కీఫ్ ను క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ‘మీ వెటకారపు, వెకిలి నవ్వుల కోసం మరో దేశాన్ని కించప రుస్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జాతి వివక్ష వ్యాఖ్యలు మానుకోండని హిత వు పలుకుతున్నారు. 2013లో జార్ఖం డ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి మయాంక్ 2017-18లో మహారాష్టత్రో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

ఇదో గొప్ప అనుభవం : మయాంక్

$
0
0

మెల్‌బోర్న్, డిసెంబర్ 26: టెస్టుల్లో చోటు దక్కాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న తనకు ఆసిస్‌తో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బుధవారం నుంచి ప్రారంభమైన మూడో టెస్టు (బాక్సింగ్ డే)లో చోటు దక్కడం గొప్ప అనుభవంగా టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, కర్నాటకకు చెందిన యువ సంచలనం మయాంక్ అగర్వాల్ అన్నాడు. టెస్టుల్లో ఆరంగేట్రం కోసం అర్రులు చాచడం, అది ఇపుడు కార్యరూపం దాల్చడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. టెస్టుల్లో తొలిసారిగా క్యాప్ (295) అందుకోవడం తన జీవితంలో చిరస్మరణీయ ఘట్టంగా నిలుస్తుందని అన్నాడు. విశ్వవిఖ్యాత మెల్బోర్న్ మైదానంలో 76 పరుగులు సాధించడం గర్వకారణంగా ఫీలవుతున్నానని తొలిరోజు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడు.
భావోద్వేగాన్ని తట్టుకుని ఆటపై తధేక దృష్టి సారించడం అనుకున్న సులువు కాదని అభిప్రాయపడిన మయాంక్, టెస్టుల్లో ఇది ఎంతో అవసరమన్నాడు. ‘నేను అనుకున్నట్లే నా ప్రణాళిక ప్రకారం క్రీజులో చాలాసేపు కుదురుకుని ఆడాను. ఫలితంగా ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని మెరుగైన శుభారంభంతో పరుగులు సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు సాధించినా ఆట ముగిసేవరకు బరిలో ఉండి ఉంటే మరిన్ని పరుగులు జోడించి ఉండేవాడినని అభిప్రాయపడ్డాడు.

చిత్రం..మయాంక్ (76)

స్టెయిన్ @ 422

$
0
0

సెంచూరియన్, డిసెంబర్ 26: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అత్యధిక వికెట్లు (422) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్‌తో సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఫఖర్ జమాన్ వికెట్‌ను పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఇంతవరకు స్వదేశానికి చెందిన బౌ లర్ షాన్ పొలాక్ (421) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డేల్ స్టెయిన్ 11వ స్థానంలో నిలిచాడు.

అదరగొట్టిన్రు!

$
0
0

మెల్‌బోర్న్, డిసెంబర్ 26: ఆతిధ్య ఆస్ట్రేలియాతో బుధవారం ఇక్కడి మెల్‌బోర్న్ టెస్టు గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ తొలిరోజు నిలిచారు. టెస్టుల్లో తొలిసారిగా ఆరంగేట్రం చేసిన యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ సరికొత్త చరిత్రను లిఖించాడు. 76 పరుగులతో అర్ధ శతకం నమోదు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ఒక సిక్సర్‌తోపాటు బౌండరీల వరద పారించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో సీనియర్ ఆటగాళ్ల సరసన చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన వెంటనే 50కి పైగా పరుగులు చేసిన ఏడో భారత క్రికెటర్‌గా, రెండో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. (1947 డిసెంబర్‌లో ఆసిస్‌లోని ఎస్‌సీజీలో జరిగిన టెస్టులో భారత్‌కు చెందిన దత్తు ఫాద్కర్ తొలిసారిగా 51 పరుగులు చేశాడు). అయితే, ఓపెనర్‌గా దిగిన హనుమ విహారి నిరాశపరిచాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన అడెలైడ్ టెస్టు హీరో చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఫలితంగా తొలిరోజు తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి టీమిండియా 89 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన కోహ్లీ సేన బ్యాటింగ్‌ను ఎంచుకుంది. గత రెండు టెస్టుల్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ జట్టు ఆశించిన స్కోరు చేయడంలో విఫలమైన నేపథ్యంలో మూడో టెస్టులో హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించారు. 66 బంతులు ఎదుర్కొన్న ఓపెనర్ హనుమ విహారి 8 పరుగులు చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. టెస్టుల్లో తొలిసారి చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా తగిన పాత్రను పోషించాడు. 161 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 1 సిక్సర్, 8 బౌండరీలతో 76 పరుగులు చేసి శతకాన్ని చేజార్చుకున్నాడు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి మయాంక్ వెనుతిరిగాడు. ఆట ముగిసేసరికి అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టు శతక వీరుడు చటేశ్వర్ పుజారా 200 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలతో 68, కెప్టెన్ విరాట్ కోహ్లీ 107 బంతుల్లో 6 బౌండరీలతో 47 పరుగులతో క్రీజు లో ఉన్నారు. ఆసిస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ కు 2 వికెట్లు తీసుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు ఆతిధ్య బౌలర్లు వీలు చిక్కినప్పుడల్లా తమ పదునైన బౌన్సర్లతో దాడిని కొనసాగిస్తోంది.
కోహ్లీ వికెట్‌ను మిస్సయ్యాం
కెప్టెన్ విరాట్ కోహ్లీని త్వరితగతిన పెవిలియన్ దారిపట్టించ లేకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యామని ఆసిస్ ఆల్‌రౌండర్ ట్రావిస్ మైఖేల్ హెడ్ అన్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీని ఔట్ చేయలేకపోయినా రెండోరోజు పెవిలియన్ దారిపట్టిస్తామనే దీమాను వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆట ముగిసేసరికి కోహ్లీ 47 పరుగులతో, చటేశ్వర్ పుజారా 68 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చిత్రం..మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన కోహ్లీ పుజారా

సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల

$
0
0

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం నుండి రబీ సాగు నిమిత్తం ఎడమకాల్వకు బుధవారం డ్యాం అధికారులు నీటిని విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సాగర్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జి చీఫ్ ఇంజనీర్ నర్సింహ పొట్టిచల్మ వద్ద ఎడమకాల్వ ప్రధాన ద్వారంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం నీటివిడుదలను ప్రారంభించారు. మొదటగా 500 క్యూసెక్‌లను విడుదల చేస్తూ వెయ్యి క్యూసెక్‌ల వరకు నీటి విడుదల చేస్తున్నారు. సగటున రోజుకు 3,500 క్యూసెక్‌లను 15 రోజుల పాటు విడుదల చేసిన అనంతరం 7రోజులు నీటిని నిలిపివేస్తారు. ఆ తరువాత మార్చి 31వరకు 9రోజులు నీటివిడుదల చేసి ఏడు రోజుల పాటు నీటిని నిలిపివేస్తారు. మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాధరావు పాల్గొన్నారు.
చిత్రం..రబీసాగు కోసం సాగర్ ఎడమ కాల్వకు విడుదలౌతున్న నీరు

అంచనాలు అధికం.. ఖజానాకు సున్నం!

$
0
0

జాల రాధాకృష్ణ
హైదరాబాద్, డిసెంబర్ 24: తెరాస అధినేత కేసీఆర్ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టడంలో విద్యుత్ పాత్ర కీలకం. ఉచిత, నిరంతర విద్యుత్ సరఫరాతో కోతలకు కాలం చెల్లి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం నెలకొనేందుకు ఇదొక ముఖ్యమైన కారణం. అయతే ఇదంతా పైకి కనిపిస్తున్న వాస్తవం. కానీ తెరవెనుక మాత్రం ఈ శాఖ అధికారుల పనితీరు, వారి వ్యవహార శైలి ఖజానాకు గండికొట్టే విధంగా ఉండటం విమర్శల కు దారితీస్తోంది. బిల్లుల వసూలు, సబ్సిడీల వల్లే విద్యుశాఖకు భారీ నష్టం వాటిల్లుతోందన్న అపోహలు అవాస్తవమనే అనుమానాలు ప్రబలుతు న్నాయ. ఖజానాకు గండికొట్టే విధంగా వ్యవహరి స్తున్న అధికారులు సబ్సిడీల వల్లే నష్టం వాటిల్లు తోందనే వాదనను బలపరిచేందుకు యత్నించడం విడ్డూరం.
ప్రైవేట్ వ్యక్తుల నుంచి అడ్డగోలు అంచనాలు తయారుచేసి పనులను మంజూరు చేయడంతో పాటు వారి నుండి డబ్బులు కట్టించుకుని పనులు చేస్తున్నారంటూ విద్యుత్ శాఖపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. వాటిని నిజం చేసే విధంగా అధికారులు ప్రభుత్వ రంగ సంస్థల నుండి కూడా భారీ సంఖ్యలో కోట్లాది రూపాయలను తమ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. విద్యుత్ శాఖకు కేవలం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా మేలైన విద్యుత్‌ను అందించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు తదితర అంశాలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. ఎవరైనా తమ అవసరాల కోసం వాణిజ్యపరంగా కావాలంటే అంచనా ప్రతిపాదనలు రూపొందించి దానికి అనుగుణంగా డబ్బులు చెల్లిస్తే తప్ప విద్యుత్ శాఖ పనిచేయదు. లేదా 10 శాతం పర్యవేక్షణ చేసేందుకు నిధులు చెల్లించి మిగిలిన పనులను ప్రైవేటు వ్యక్తులకే ఇతర సంస్థల ద్వారా పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు. కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించే పనులకు మాత్రం విద్యుత్ శాఖనే ప్రాజెక్టు ద్వారా పనులను నిర్వహిస్తుంది. ఇందులోనే మతలబు ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయ. దీనిపై ఆరా తీయగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిశ్రమల అభివృద్ధి కోసం భూములను సేకరించి టీఎస్‌ఐఐసీ ద్వారా వివిధ కంపెనీలకు స్థలాలను కేటాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతోపాటు ఆదాయ వనరులు కల్పించడం, కల్పించుకోవడం కోసం చేపట్టిన భారీ కార్యక్రమానికి ఆర్థికంగా విద్యుత్ శాఖే దెబ్బకొడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణ గత ప్రభుత్వంలో టీఎస్‌ఐఐసీ ద్వారా సుల్తాన్‌పూర్ పార్క్‌కి విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ లైన్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదేశించింది. నిబంధనల ప్రకారం టీఎస్‌ఐఐసీ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విద్యుత్ శాఖ దానికి సంబంధించి సుమారు 30 కోట్ల మేర అంచనా ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీనిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆరే స్వయంగా అధికారులను మందలించడంతో దానిని సుమారు 17 కోట్లకు (డి.నెం.2769/17-18, తేది: 24.03.2018) కుదిస్తూ ప్రతిపాదనలు చేశారు. అందులో సైతం కొన్ని అవసరం లేని, అవసరానికి మించిన వస్తువులతో అంచనాలు వేసారని, అంత డబ్బు చెల్లించే పరిస్థితి లేదంటూ ప్రతిపాదనలలో కొన్ని మార్పులు చేయాలని టీఎస్‌ఐఐసీ ఎండి సూచించారు. ఈ మేరకు చీఫ్ జనరల్ మేనేజర్ ఆపరేషన్, రూరల్ జోన్, మింట్‌కాంపౌండ్ (సీజీఎం/ఓపి/ఆర్-ఎస్ /హెచ్‌వైడీ/డీఇ(టీ) /ఎడీఇ-టి/ ఎఇ-1/ ఎఫ్.నెం./ డి.నెం.1228/ 18-19, తేది: 12.07.2018) ద్వారా 13,54,26,515 రూపాయల అంచనా ప్రతిపాదనలతో పనులు మంజూరు చేసింది.
మంత్రి మందలింపుతో సుమారు సగానికి సగం అంచనా ప్రతిపాదనలు మంజూరు చేసి పనులు ప్రారంభించిన అధికారులు ఇటీవల మరో ఘనకార్యం చేశారు. ఇదే శాఖ ద్వారా రెట్టింపు అంచనాల ప్రతిపాదనలతో పనులు మంజూరు చేసి అగ్రిమెంట్ కాకుండానే ప్రభుత్వం మారితే బిల్లుల చెల్లింపులు కావంటూ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒకే లైనును తీసుకెళ్లాల్సి ఉండగా రెండు లైనుల ప్రతిపాదనలు చేసి సుమారు 18 కోట్లకు టెండరు వేసినట్లు తెలుస్తోంది. చెందన్‌వెల్లిలోని టీఎస్‌ఐఐసీ పార్క్‌కి విద్యుత్ సరఫరా కోసం కనకమామిడి నుండి విద్యుత్ లైనును వేసేందుకు సుమారు 19 కోట్ల అంచనా ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై ఇప్పటికే టీఎస్‌ఐఐసీ సుమారు తొమ్మిది కోట్లు చెల్లించగా మిగిలిన నిధులను వెంటనే చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ అంచనాల్లో కూడా సుల్తాన్‌పూర్ తరహాలోనే మార్పులు చేయాలని కోరినప్పటికి విద్యుత్ శాఖ అధికారులు మాత్రం దానిని పట్టించుకోకుండానే ప్రభుత్వం మారితే అంచనాలు మారుతాయంటూ కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్ ఇవ్వకుండానే పనులు ప్రారంభింప చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి మంత్రిఆదేశాలతో మూడుసార్లు మార్చిన అంచనాలను ఉదాహరణగా తీసుకుని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ సంస్థల ద్వారా చేపట్టిన పనులపై సమగ్ర విచారణ జరిపి తక్కువ వ్యయంతో ఎక్కువ నైపుణ్యం గల పనులు చేసుకునే అవకాశం ఉన్నప్పటికి విద్యుత్ శాఖ ఎండీ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా అధికారులు తమ ఇష్టానుసారంగా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో పాటు, మినిట్స్‌లో కూడా సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అధికారులు పొందుపరచలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


అమెరికా సైనికులకు రక్షణ కోసం భారతీయులకు ‘ఏకే-47’తో శిక్షణ

$
0
0

కరీంనగర్: ఉన్న ఊళ్లో ఉపాధి కరువై బతుకు జీవనం కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధవౌతున్న భారతీయులకు సెక్యూరిటీ ఉద్యోగాల పేరుతో భారీగా రిక్రూట్‌మెంట్ చేసి అమెరికా సైనికులకు రక్షణ కోసం ‘ఏకె-47’ఆయుధాలతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఉపాధి వేట, బతుకు బాటలో భాగంగా భారతీయ యువకులకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను ఎరగా చూపుతూ అఫ్ఘనిస్థాన్‌పై పెత్తనం చెలాయిస్తున్న అమెరికా సైనికులు భారతీయులకు ఆయుధ శిక్షణ ఇచ్చి రక్షణ కోసం వినియోగించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. సైనిక క్యాంపులపై ఎవరైనా తెగబడితే సెక్యూరిటీగా ఉన్న భారతీయులు బలికావాల్సిందే. అంతర్జాతీయ స్థాయి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే ఇమిగ్రేషన్ చట్టాలు ధిక్కరిస్తూ నేరాల నియంత్రణకు క్రైం కంట్రోల్ స్టేషన్లు ఏర్పాటు చేసినా వారి కళ్లుగప్పి ప్రైవేటు ఏజెన్సీలు చేసే ఇమిగ్రేషన్ సేవలపై సీసీఎస్ పోలీసుల అజమాయిషీ కొరవడినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో కూడా వెలుగు చూసినట్లు సమాచారం.
అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య విభేదాలు పెరగకుండా ఆయా దేశాల్లో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తూ అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. ఈ కోవలో భారత్‌లో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం 1983లో ఇమిగ్రేషన్ యాక్ట్ రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రొబేటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారి నిర్వహణలో చట్టాల ఉల్లంఘన నిరోధించడానికి జిల్లా స్థాయిల్లో క్రైం కంట్రోల్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా స్టేషన్లకు పూర్తి స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించినా ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఇమిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఎన్‌ఐఎ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 100ట్రావెల్ ఏజెన్సీలకే ప్రభుత్వాలు అవకాశం కల్పించింది. పలువురు కిందిస్థాయి అధికారులకు అవగాహన లేకపోవడంతో ట్రావెలింగ్ ఏజెన్సీలు పుట్టగొడులుగా పుట్టుకొచ్చాయి. పలు స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలో నిర్వహించిన సర్వేలలో 10వేల ట్రావెల్ ఏజెన్సీలు వెలిసినట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు గల్ఫ్ రిటర్నింగ్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా వెల్లడించారు. ఒక్కో ఇమిగ్రేషన్‌కు ఐదు నుంచి రూ. 15వేల వరకు వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలకు తోడు మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థల్లో ఇమిగ్రేషన్ సౌకర్యంతో బోర్డులు వెలిశాయి. నిరుద్యోగ యువత అవసరాలను ఆసరాగా చేసుకొని ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మించి సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల పేర రిక్రూట్‌మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగాకొందరు ధ్రువపత్రాలతో ఇమిగ్రేషన్‌సౌకర్యాలు కల్పిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కష్టపడి ఎంత చదివినా స్థాయికి తగ్గ ఉద్యోగాలు దొరకక ఉపాధి కరువై అప్పోసప్పో చేసి జీవన్మరణ పోరాటాల సెక్యూరిటీ ఉద్యోగాల కోసం యువత పలు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నట్లు చాంద్ పాషా తెలిపారు. అమెరికాలో ఎక్కువ స్థాయిలో తాలిబన్లు సైనిక స్థావరాలపై తెగబడితే రక్షణ కోసం సెక్యూరిటీ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలు పొందిన భారతీయుల వినియోగించుకునేలా శిక్షణ అందిస్తూ అమెరికా సైన్యం రక్షణ పొందుతున్నట్లు తెలిసింది.
మిలటరీ క్యాంపువిధులు నిర్వహిస్తున్న చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో మరణించగా ఈ వ్యవహారం వెలుగు చూసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా(విజిట్ వీసా) కలిగిన అనేకమంది భారతీయులను గుర్తించి వెనక్కి పంపించినప్పటికీ మరికొందరు మిగిలిపోయినట్లు చాంద్‌పాషా తెలిపారు. ఇటీవల అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సైన్యం క్యాంపులో విధులు నిర్వహిస్తున్న వారు కొందరు ఆయుధాలతో గస్తీ తిరుగుతున్న భారతీయ యువకుల ఫోటోలను సంపాదించి ఎన్‌ఐఎకు అందించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిసింది. ఎన్‌ఐఎ దర్యాప్తు ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు నిరుద్యోగ విద్యావంతులకు ఉద్యోగావకాశాల సెక్యూరిటీ గార్డుల పేరుతో రిక్రూట్‌మెంట్ ఆగకుండా కొనసాగిస్తున్నట్లు ఎన్‌ఐఎ దృష్టికి తీసుకెళ్లానన్నారు. సెక్యూరిటీ ఉద్యోగాల పేరుతో జరిగే భారతీయుల రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టకపోతే ‘ఎకె-47’ఆయుధ శిక్షణ పొందిన భారతీయ యువత స్వదేశానికి తిరిగొచ్చాక ఎటువైపునకు పయనించినా శాంతిభద్రతలు విఘాతకం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
చిత్రాలు.. అమెరికా సైనికుల క్యాంపులకు ఎకె-47 ఆయుధాలతో రక్షణగా ఉన్న భారతీయులు

ఎస్సారెస్పీకి ‘పునరుజ్జీవం’

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 26: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా భాసిల్లుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేయాలనే మహత్తర ఆశయంతో చేపడుతున్న పునరుజ్జీవ పథకం పనులు వేగవంతం చేస్తేనే ఆశించిన ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈ పథకం పనులు ముందస్తు ఎన్నికల హడావుడి, ఇతరాత్ర కారణాల దృష్ట్యా మందకొడిగా కొనసాగాయనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి తెరాస ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన దరిమిలా, పనుల్లో వేగం పెంచితేనే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికైనా ఎస్సారెస్పీకి జలకళను సంతరింపజేయాలనే లక్ష్యం నెరవేరుతుంది. ఎస్సారెస్పీకి క్యాచ్‌మెంట్ ఏరియా మహారాష్టల్రో ఉండగా, అక్కడి ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ సహా పదుల సంఖ్యలో ప్రాజెక్టులు, లిఫ్టులను నిర్మించి వరద జలాలను అడ్డుకుంటోంది. ఈ కారణంగా ఎస్సారెస్పీలోకి ఆశించిన స్థాయిలో వరద నీరు వచ్చి చేరడం లేదు. ఈ ఏడాది మొత్తంగా చూసినా 70టీఎంసీల వరకే నీటి నిల్వలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం అరకొరగా మిగిలి ఉన్న 33టీఎంసీల నీటిని దిగువ ప్రాంతాల అవసరాలతో పాటు ఆయకట్టు పంటలకు, ఇటు తాగునీటి అవసరాలకు సర్దుబాటు చేసేందుకు అధికారులు నానాతంటాలు పడాల్సి వస్తోంది.
ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా కాళేశ్వరం జలాలను రివర్సబుల్ పంపింగ్ సిస్టంలో వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీలోకి మళ్లించేందుకు పునరుజ్జీవ పథకాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 ఆగస్టు 10వ తేదీన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద అట్టహాసంగా ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాది కాలంలోనే ఈ పనులను పూర్తి చేయాలని గడువు విధించగా, సీఎం వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి సంబంధిత భారీ నీటి పారుదల శాఖా మంత్రి హోదాలో హరీశ్‌రావు కూడా ఏడాదిలోపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయిస్తానని ప్రమాణం చేశారు. దీనిని అనుసరిస్తూ ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికే పునరుజ్జీవ పథకం పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఇంకా తుది దశకు కూడా చేరుకోలేకపోయాయి. ఈ పథకం పూర్తయితే దాదాపు 12లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేసిన వెంటనే, 2017 ఆగస్టు చివరి వారంలోనే నవయుగ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకుని పనులకు శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆశించిన విధంగానే పనులు శరవేగంగా జరిగాయనే చెప్పాలి. సుమారు వంద కిలోమీటర్ల దిగువ నుండి నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లించేందుకు మొత్తం మూడు పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. జీరో కిలోమీటరు వద్ద మొదటిది, 34వ కిలోమీటరు వద్ద రెండవది, 73వ కిలోమీటరు వద్ద మూడవ పంప్‌హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కో పంప్‌హౌస్‌లో ఎనిమిది చొప్పున మొత్తం 24మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పంప్‌హౌస్ 1450క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగి ఉండగా, రోజుకు 1టీఎంసీ చొప్పున నీటిని శ్రీరాంసాగర్‌లోకి మళ్లించేలా ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఎస్సారెస్పీ కింద మొత్తం 12లక్షల ఎకరాలకు సాగునీటిని సమకూర్చాలంటే సుమారు 120టీఎంసీల వరకు నీటి నిల్వలు అవసరం ఉండగా, ప్రస్తుతం సగటున 55టీఎంసీల వరకే నీటి లభ్యత ఉన్నట్టు గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో పునరుజ్జీవ పథకం ద్వారా మిగతా నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లించి, ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించాలనే ఉద్దేశ్యంతో చేపడుతున్న పునరుజ్జీవ పథకం పనులు రైతుల ఆశలకు రెక్కలు తొడుగుతున్నప్పటికీ, పనుల్లో ఇప్పటికే ఎనలేని జాప్యం జరిగినందున ఇకనైనా వేగం పుంజుకుని వచ్చే ఖరీఫ్ నాటికి కాళేశ్వరం నీటిని మళ్లించేలా చూడాలని వారు కోరుతున్నారు.

మనది అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ

$
0
0

గోదావరిఖని, డిసెంబర్ 26: దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా తెలంగాణలో అత్యుత్తమ పోలీసు వ్యవస్థను సీఎం కేసీఆర్ తయారు చేస్తున్నారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణాన్ని, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం ఆయన సందర్శించారు. అదేవిధంగా అంతర్గాం పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నాటికి కొత్త జిల్లాలోని ఎస్పీ, కమిషనరేట్ కార్యాలయాలను ప్రారంభిస్తామని, రెండో దఫాలో పోలీస్ సిబ్బంది క్వార్టర్‌ల నిర్మాణానికి, బెటాలియన్‌లకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ అధునాతన సౌకర్యాలతో నిర్మించడం జరుగుతోందని చెప్పారు. ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ గెస్ట్‌హౌస్ నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరుగుతుందని, ఎన్నికల కోడ్ వలన ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు. టెండర్లు పిలిచి త్వరత్వరగా పనులు పూర్తి చేస్తామని, గెస్ట్‌హౌస్ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్న ఎన్టీపీసీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు పోలీసు సేవలు మరింత అందుబాటులో ఉంచేందుకు గాను అంతర్గాం మండలంలో 2 కోట్ల రూపాయలతో అన్ని సౌకర్యాలతో నూతన మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని, పనుల్లో అలసత్వం వహించవద్దని కోలేటి దామోదర్ ఆదేశించారు. అదేవిధంగా ఉద్యోగులు, వారి పిల్లల కోసం, ఇతర శుభాకార్యాల కోసం కల్యాణ మండపం కమిషనరేట్‌లో నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం సిపి వి.సత్యనారాయణ, డీసీపీ సుదర్శన్ గౌడ్, అడిషనల్ డీసీపీలు అశోక్ కుమార్, రవి కుమార్, ఏసీపీ రక్షిత కె. మూర్తి తదితరులున్నారు.
చిత్రం..పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను సందర్శిస్తున్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్

పోలీసు ఉద్యోగాల రాతపరీక్ష: 51,926 మంది ఉత్తీర్ణత

$
0
0

విజయవాడ (క్రైం), డిసెంబర్ 26: పోలీసుశాఖలోని వివిధ పోస్టులకు ఈనెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రాతపరీక్షలో 51,926 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్ధులకు వచ్చే ఏడాది జనవరి 18వ తేదీన శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రాష్ట్రంలోని విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో ఏర్పాటు చేసినట్లు స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. పోలీసుశాఖలో పురుషులు, మహిళలకు సివిల్, రిజర్వు, ఏపిఎస్‌పి, ఎస్‌ఐ పోస్టుల భర్తీతోపాటు, డిప్యూటీ జైలర్, అగ్నిమాపక శాఖలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మీదట స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గత నెల నవంబర్ 1వ తేదీన నోటిపికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్టవ్య్రాప్తంగా ఏడు ప్రాంతాల్లోని 240 కేంద్రాల్లో ఈ నెల 16వ తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా 1,22,160 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 51,926 మంది అర్హత సాధించగలిగారు. పరీక్షకు హాజరైన వారిలో 1,06,385 మంది పురుషులు ఉండగా వీరిలో 46,915 మంది ఉత్తీర్ణులయ్యారు. 15,775 మహిళ అభ్యర్ధులు హాజరుకాగా 5,011 మంది అర్హత సాధించారు.

ఆయన ఆదాయ వనరు పోలవరం ప్రాజెక్టు

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 26: ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును టీడీపీకి, చంద్రబాబుకు ఆదాయ వనరుగా మార్చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఊసెత్తలేదన్నారు. అదే పార్టీకి చెందిన వడ్డి వీరభద్రరావు, యర్రా నారాయణ స్వామి తదితరులు పోలవరం కోసం పాదయాత్రలు చేస్తే వారిని అణచివేసిన చరిత్ర చంద్రబాబుది కాదాఅని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేయగా, 2004లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పనులు ప్రారంభించారన్నారు. రూ.10వేల కోట్ల ప్రాజెక్టును వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రూ.16 వేల కోట్లకు పెంచారని, అప్పటి వరకూ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థను కాదని, ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు కట్టబెట్టారన్నారు. దీనిలో కూడా చంద్రబాబు పాత్ర కీలకమని ఆరోపించారు. కిరణ్‌కుమార్ రెడ్డి పదవిని కాపాడుకునేందుకు అప్పట్లో చంద్రబాబుకు మేలు చేశారన్నారు. మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం గళమెత్తుతున్నది బీజేపీ ఒక్కటేనన్నారు. విభజన సందర్భంగా పోలవరం కోసం రాజ్యసభలో చర్చజరుగుతుండగా అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యులు (ఒకరు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర సభ్యులు) ఏం చేశారో గుర్తు లేదాఅని ప్రశ్నించారు. అసలు పోలవరం వద్దని తెలంగాణా ప్రాంత సభ్యురాలు డిమాండ్ చేస్తే ఆంధ్ర ప్రాంత సభ్యులు వౌనంగా ఉండిపోయారన్నారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచి పోలవరం మంజూరు చేస్తే, వాటిని ఆంధ్రలో కలిపేందుకు కృషి చేసిందెవరో గుర్తు చేసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందే కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్డినెన్స్ ద్వారా ముంపు మండలాలను ఏపీకి బదలాయించారని గుర్తు చేశారు.
ఇది జరిగి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటైన తరువాత కూడా రెండేళ్ల పాటు పోలవరం ఊసెత్తని చంద్రబాబు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసమే 2017లో బాధ్యతలు నెత్తిన వేసుకున్నారన్నారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.6,700 కోట్లు ఇస్తే ఇప్పటికీ పూర్తిగా ఖర్చు చేయని చేతగాని ముఖ్యమంత్రిగా విమర్శలు గుప్పించారు. ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తూ కేంద్రం సహకరించట్లేదంటూ అభాండాలు వేస్తున్న చంద్రబాబు ప్రధాన ప్రాజెక్టును పక్కనపెట్టి పుష్కర, పట్టిసీమ ఎత్తిలపోతల పథకాలను పూర్తి చేసుకుని కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఆర్‌ఆర్ ప్యాకేజీలను అమాంతం పెంచేసి, ఇచ్చిన వారికే మళ్లీమళ్లీ పరిహారం చెల్లిస్తూ వందల కోట్లు దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రక్తంలోనే అవినీతి ఉందని, పోలవరం, ఉపాధిహామీ, మెడ్‌టెక్ పార్కు ఇలా అన్ని ప్రాజెక్టుల్లోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రానికి రూ.40వేల కోట్లు కేంద్రం మంజూరు చేస్తే చెరువు పనుల పేరిట రూ.16వేల కోట్లు దిగమింగారని, ఇది చాలక చెరువుల్లో మట్టి కూడా అమ్ముకుని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన వైఖరితో రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్న చేశారన్నారు. మోదీ రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకు వస్తారంటూ ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు గ్రామాల్లో సిమ్మెంట్ రోడ్లు, ఎల్‌ఈడీ వెలుగులు ఎవరి ఘనతో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ఇచ్చిన 9.65 లక్షల ఇళ్లల్లో కూడా చంద్రబాబు కమిషన్లు మింగుతున్నారని ఆరోపించారు. పోవలరం పట్టాదా అంటూ నిలదీస్తున్న చంద్రబాబు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు సార్లు క్షేత్ర పర్యటనకు వచ్చారని, ప్రధాని మోదీ శ్రద్ధ తీసుకోకుండా ఇది జరిగేదా అని ప్రశ్నించారు. పత్రికా సంపాదకుల సమక్షంలో పోలవరంపై చర్చకు తాను సిద్ధమేనని, అందుకు చంద్రబాబు సమ్మతించాలని డిమాండ్ చేశారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

Viewing all 69482 articles
Browse latest View live