Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

బీసీలు స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలి

0
0

గుంటూరు, డిసెంబర్ 26: బీసీలు స్వతంత్రంగా ఎదిగేందుకు అందరి ఆమోదంతో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. బుధవారం గుంటూరులోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో శంకరరావు మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన విశాఖపట్నం బీచ్‌రోడ్డు ఫిషింగ్ హార్బర్ మెయిన్‌గేటు వద్ద టౌన్‌హాలులో సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో చర్చించి రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 13 జిల్లాల నుండి వివిధ సామాజికవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు, బీసీ నాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర, జిల్లాస్థాయిలో అనుబంధ సంఘాలైన యువజన, మహిళ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలను పటిష్టం చేయనున్నట్లు చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం 2019-మార్చి నాటికి కోటి సభ్యత్వ నమోదు లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి తగ్గిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు తీసుకురావడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మురళీధరరావు కమిషన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయకుండా పెడచెవిన పెట్టాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభా గణాంకాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు హైకోర్టుకు సమర్పించకపోవడం బీసీలను అణగదొక్కే చర్యలో భాగమేనని ధ్వజమెత్తారు.
బీసీల రిజర్వేషన్‌పై రెండు రాష్ట్రాలు చేస్తున్న మోసాన్ని తాము తిప్పికొడతామన్నారు. 72 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హక్కులను కాలరాసే చర్యలకు చరమగీతం పాడనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్, నాయకులు తుపాకుల అప్పారావు, అన్నం శివరామయ్య, ఆవుల వీరశేఖరరావు యాదవ్, ఎం మధుసూధనరావు, ధూళిపాళ్ల ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.


పనికిమాలిన భూమిచ్చి పదేళ్లయ్యింది..!

0
0

రాజమహేంద్రవరం, డిసెంబర్ 26: మన్యం రైతులకు సాగునీటి సదుపాయం కల్పించడానికి తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలో నిర్మించిన భూపతిపాలెం రిజర్వాయరు ప్రాజెక్టు నిర్వాసితులు నిలువ నీడలేక చెట్టుకొకరు పుట్టకొకరుగా అల్లాడుతున్నారు. 15 కుటుంబాల కోసం పదేళ్ల క్రితం నిర్మించిన కాలనీలోని ఇళ్లు శిథిలావస్థకు చేరుకుని, నేడో రేపో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే భూమికి బదులుగా అందించిన భూమి సాగుకు యోగ్యంగా లేకపోవడంతో పొట్టచేత పట్టుకుని వలసపోతున్నారు. సుమారు 25 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో ఒక్కరికీ ఓటు హక్కు లేకపోవడం విచిత్రం.
తూర్పు గోదావరి జిల్లా మన్యంలో 36 వేల ఎకరాలకు నీరందించడానికి 2004లో సుమారు రూ.386 కోట్ల వ్యయంతో నిర్మించిన భూపతిపాలెం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిందించలేకపోతోంది. అప్పట్లో ఈ ప్రాజెక్టు కోసం గాంధీపురం, కొత్తూరు, భూపతిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 110 కుటుంబాలను ఖాళీచేయించారు. ఇందులో భూపతిపాలెం గ్రామ నిర్వాసితులైన 15 గిరిజన కుటుంబాలకు రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట పంచాయతీ పరిధిలోని సుద్దగొమ్ము గ్రామం వద్ద పునరావాస కాలనీ నిర్మించారు. ఇప్పుడు పిల్లలు ఎదిగి సుమారు 25 కుటుంబాలు ఈ కాలనీలో నివసిస్తున్నారు. ఒక్కో ఇంట్లో రెండు కుటుంబాల వంతున వీరు నివసిస్తున్నారు. అయితే కాలనీలో నిర్మించిన ఇళ్లనీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ ఉపద్రవం సంభవిస్తుందోనని గత్యంతరం లేక బిక్కుబిక్కుమంటూ అదే ఇళ్లలో నివసిస్తున్నారు. నిర్వాసిత కాలనీలో రక్షిత మంచినీటి సదుపాయం కూడా లేదు. బోరులో సుద్దనీరు వస్తోంది. కలుషిత నీరు తాగడం వల్ల సుద్దగొమ్ము నిర్వాసిత కాలనీలో 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆరుగురు మృత్యువాత పడ్డారంటే ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో అర్ధం చేసుకోవచ్చు.అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు భూమికి బదులుగా ఇచ్చిన భూమి ఎందుకూ కొరగాని భూమిగా మిగిలింది. వ్యవసాయానికి పనికి మాలిన భూమిచ్చి పదేళ్లు కావస్తోంది. భూపతిపాలెం గ్రామ నిర్వాసితులకు నిర్మించిన కాలనీకి సమీపంలోనే 30 ఎకరాల భూమిని ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రెండెకరాల వంతున పంపిణీచేసిన ఈ భూమి రాళ్ళు, రప్పలతో ఎందుకూ పనికిరావడం లేదని నిర్వాసిత గిరిజన రైతులు తెలిపారు. అలాగే భూమికి నీటి వసతి కూడా లేదని తెలిపారు. ఫలితంగా ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలసపోతున్నారు. నిర్వాసితులైన తమకు పునరావాసానికి సంబంధించి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని నిర్వాసితులు వాపోయారు. విచిత్రమేమిటంటే తమ కాలనీలో ఎవరికీ ప్రస్తుతం ఓటుహక్కు లేదని వారు వాపోయారు. గతంలో తమ గ్రామంలోని సొంత భూముల్లో బొబ్బర్లు, సామలు, జొన్న, కొర్రలు పండించుకుంటూ హాయిగా జీవించేవారమని నిర్వాసితులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన భూమి ఎందుకూ పనికిరాకుండా ఉందని తెలిపారు. ఈ భూమిలో కొనే్నళ్ల క్రితం జీడి మామిడి మొక్కలు నాటినా, అవి కూడా సరిగా పెరగక గిడసబారిపోయాయన్నారు. జీడిమామిడి మొక్కలు ఎలాంటి భూమిలోనైనా పెరుగుతాయని, ప్రభుత్వ భూమిలో అవికూడా పెరగడంలేదంటే ఆ భూమి పరిస్థితి అర్థం చేసుకోవచ్చని నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని భూపతిపాలెం నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిత్రం..భూపతిపాలెం నిర్వాసితులు

సచివాలయ నిర్మాణంలో కీలక ఘట్టం

0
0

విజయవాడ, డిసెంబర్ 26: రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో గురువారం మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. పరిపాలనా నగరంలోని కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఐదు టవర్లుగా నిర్మించనున్న సచివాలయం కోసం భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను నిర్మించనున్నారు. భూమి ఉపరితలం నుంచి 13 అడుగుల లోతులో నాలుగు మీటర్ల మేర ర్యాఫ్ట్‌ను నిర్మించనున్నారు. 12వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో దీనిని నిర్మిస్తున్నారు. మొత్తం 41 ఎకరాల్లో 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే భారీ టవర్ల కోసం ఈ ఫౌండేషన్‌ను నిర్మించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద నిర్మాణంగా ఖ్యాతి సాధించనుంది. ఏకధాటిగా 72 గంటల పాటు కాంక్రీటు పనులు జరుగనున్నాయి. నార్మన్ ఫోస్టర్ సంస్థ సచివాలయం కోసం ఆకృతులను, నిర్మాణ ప్రణాళికలను సీఆర్‌డీఏకు అందచేసింది. ఐదు టవర్లను ఒకే ర్యాఫ్ట్‌పై నిర్మిస్తున్నారు. ఇందుకు వేలమంది కార్మికులను, వందల సంఖ్యలో యంత్రాలను వినియోగించనున్నారు. సచివాలయానికి సంబంధించి ఐదు టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4890 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎతె్తైన సచివాలయంగా రికార్డు నమోదు చేయనుంది. 50 అంతస్తుల టవర్లను నిర్మిస్తారు. ఉదయం 8.50 గంటలకు ఈ పనులను రాయపూడి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సచివాలయ పరిసరాల్లో కాంక్రీట్, స్టీల్ ఇతర సామగ్రి సరఫరాకు వీలుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

చిత్రం..సచివాలయ నిర్మాణానికి ర్యాఫ్ట్ ఫౌండేషన్ పనుల ఏర్పాట్లు

పట్టులాంటి జుట్టు కోసం..

0
0

చలికాలంలో జుట్టు తడవడం, తల జిడ్డుగా, అట్టకట్టినట్లు కనిపించడం మామూలే.. అలాగని రోజూ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకని అప్పుడప్పుడూ జుట్టుకు హెయిర్ ప్యాక్స్ వేస్తూవుండాలి. అప్పుడే జుట్టు అందంగా, ఆరోగ్యంగా, మెత్తగా పట్టుకుచ్చులా కనిపిస్తుంది.
* ఒక గినె్నలో గుడ్డు తెల్లసొనను తీసుకోవాలి. ఇందులో ఒక స్పూను తేనె, రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనెను కానీ వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే పట్టు కుచ్చులాంటి జుట్టు సొంతమవుతుంది.
* ఒక గినె్నలో రెండు పెద్ద చెంచాల ఓట్స్, కప్పు పచ్చిపాలు, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక పదినిముషాల పాటు తలను మృదువుగా మర్దన చేయాలి. తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. జిడ్డుగా మారిన తలకు ఈ ప్యాక్ చక్కని పరిష్కారం.
* బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేయాలి. దీనికి తేనె, కాసిని పచ్చిపాలు, పెద్ద చెంచా కొబ్బరినూనె కలపాలి. దీన్ని తలంతా పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు మెత్తగా మారడమే కాకుండా జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.
* పచ్చి కొబ్బరి నుంచి పాలు తీయాలి. అందులో చెంచా ఆలివ్‌నూనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా, మెత్తగా ఉంటుంది.
*

రంగవల్లి

0
0

ఉన్నవ సుమతి , హైదరాబాద్
-------------------------------------------------------------------------------------------------------
ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.

కండరాల బలహీనతకి ఉపవాస వైద్యం

0
0

మన శరీరంలోనూ పోలీసు తరహా వ్యవహారమే నడుస్తుంటుంది. మన శరీరానికి సరిపడని పదార్థాన్ని తీసుకున్నప్పుడు శరీరంలోని రక్షణ వ్యవస్థ పోలీస్ తరహాలోనే శత్రువుపైన దాడికి సిద్ధపడుతుంది. శరీరానికీ, శత్రువుకూ మధ్య యుద్ధం కారణంగా శరీరంపైన అనేక వ్యాధి లక్షణాలు కలుగుతాయి. అవి ఎలర్జీ లక్షణాలు కలగటానికి కారణం అవుతాయి. ఇది ఒక అంశం. రెండో అంశం ఇంకొకటి ఉంది. పోలీసు దెబ్బలు దారినపోయేవారికి తగిలినట్టు, శరీర రక్షణ యంత్రాంగం దెబ్బలు నరాలకు, ఇతర కణాలకు తగిలే ప్రమాదం ఉంది. అలా దెబ్బతిన్న నరాల వ్యాధినే మల్టిపుల్ స్ల్కీరోసిస్ అనే వ్యాధిగా చెప్తారు. పరోక్షంగా ఇది ఎలర్జీ వ్యాధిలాంటిదేనన్నమాట.
కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన నరాలపైన ఉండే మయలిన్ పొర దీనివలన గాయపడుతుంది. గాయం మానినప్పుడు అక్కడ మచ్చ (స్కార్) పడుతుంది కదా. గాయపడ్డ ఈ మయలిన్ పొరమీద క్రమేణా మచ్చలు ఏర్పడతాయి. సమాచార వ్యవస్థ కొనసాగింపుకు ఈ పొర అవసరం చాలా ఉంది. మచ్చ ఏర్పడినప్పుడు మెదడు నుండి శరీరానికి, శరీరం నుండి మెదడుకు సమాచార మార్పిడి సక్రమంగా జరగదు, దానివలన శరీరంలో కొంతభాగం మొద్దుబారటం నుండి పక్షవాతం వరకూ అనేక లక్షణాలు కలగవచ్చు. నరాల్లో అనేకచోట్ల ఇలా మచ్చలు ఏర్పడతాయి. ‘స్కార్ టిష్యూ ఇన్ మల్టిపుల్ ఏరియాస్’. కాబట్టి దీన్ని ‘మల్టిపుల్ స్ల్కీరోసిస్’ అంటారు. అనేక మచ్చల వ్యాధి అని దీని భావం. కండరాలకు నాడీ సమాచారం అందకపోవటం వల్ల కండరాల బలహీనత ఏర్పడటం దీనిలో ముఖ్య లక్షణం.
మల్టిపుల్ స్ల్కీరోసిస్ వ్యాధిలో ఆహారవైద్యం ప్రయోజనాల గురించి ఇటీవల వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వైద్య విభాగం సెయింట్ లూరుూస్ మరియు జాక్సన్ లేబొరేటరీ వారు పరిశోధన చేసి ఒక నివేదికనందించారు. ఆహార నియమాల ద్వారా మల్టిపుల్ స్ల్కీరోసిస్ వ్యాధిపైన ప్రభావం ఉంటుందని ఈ నివేదికను రూపొందించిన డా. పిస్సియో, డా. యాంజియోజోహ్ అనే శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఆహార జాగ్రత్తలంటే పెద్ద విషయాలేమీ కావని, మధ్యమధ్య ఉపావాసాలు ఉండటం వలన కండరాల బలహీనత వ్యాధిలో మెరుగుదల గమనించామని వీరు ప్రకటిస్తున్నారు. ఆహార విధానం(డైట్ స్టైల్)లో మార్పు కావాలని వారు చెప్తున్నారు. పరిమిత ఉపవాస విధానం (లిమిటెడ్ ఫాస్టింగ్ రెజిమెన్) అవసరం అంటున్నారు. శరీరానికి సరిపడని ఆహారంతో మొదలైన ఈ కథని ఆహారంలో శరీరానికి సరిపడేవాటిని మాత్రమే తీసుకోవటం ద్వారా ముగించాలన్నమాట.
ప్రతీరోజూ కూర, పప్పు, పులుసు, పచ్చడి ఇంకా అనేక రకాల ఆహార పదార్థాలను మనం తీసుకుంటూ ఉంటాం. వీటిలో శరీరానికి సరిపడేవి, సరిపడనివీ గుర్తించటం తేలికైన విషయం ఏమీ కాదు. షెర్లాక్ హోమ్స్ తరహాలో పరిశోధించి ఆ దొంగని పట్టుకోగలగాలి. అయినా సరిపడనివి ఏవో తేలకపోవచ్చు.
నరాలలో ఏర్పడిన ఈ లోపాన్ని, దానివల్ల కలిగిన కండరాల బలహీనత, పక్షవాతం, కదలలేని స్థితిలాంటి లక్షణాలని అదుపు చేయటానికి తరచూ కనీసం ఒకపూట ఏమీ తినకుండా ఉపవాసం చేయటం మంచిది. ఆ మేరకు పడని పదార్థాలను ఆపటం సాధ్యమవుతుంది కదా! గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వరస్వామి.. ఇలా దేవుడు పేరు చెప్పి రాత్రిపూట ఉపవాసాలుంటే మంచిదే! ఇతర ఎలర్జీ వ్యాధులున్న వారికి కూడా మంచిది. కానీ ఆ పూట అన్నానికి బదులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీల్లాంటివి తినటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సరిపడని పదార్థాలు మన టిఫిన్లలోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే పండ్లు కూడా కొన్ని సరిపడకపోవచ్చు. అందుకని వారంలో ఒకటి లేదా రెండుసార్లు రాత్రిపూట పూర్తి నిరాహారంగా ఉండగలిగితే మంచిదని చెబుతున్నారు పరిశోధకులు

అదిరేటి స్కర్టు మేమేస్తే..

0
0

రంగురంగుల సీతాకోకచిలుకల్లా అమ్మాయిలు ఇంట్లో హడావుడిగా తిరుగుతుంటే ఆ సందడే వేరు.. చిన్నారులు బుట్టబొమ్మల్లా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అదీ వారు ఫ్యాషన్-్ఫ్యషన్ డ్రెస్సుల్లో ముద్దుముద్దుగా ఉంటే ఆ ముచ్చటే వేరు. అలాంటి ఫ్యాషన్స్‌లో చెప్పుకోవాల్సింది స్కర్టుల గురించే.. తరాలు మారినా తరగని ట్రెండ్ దీని సొంతం. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో కనికట్టు చేస్తుంది. మరి కొత్త సంవత్సర శుభవేళ.. కొత్త కొత్త ఫ్యాషన్ స్కర్టులపై ఓ లుక్కేద్దామా..
స్కర్టు మనది కాదు.. కానీ మనదైపోయింది. మారుతున్న ఫ్యాషన్‌లతో పాటు అటు పాశ్చాత్య, ఇటు సంప్రదాయ శైలినీ కలిపి నయా డిజైన్లలో మెప్పిస్తోంది స్కర్టు.. మెత్తటి సిల్క్, లేదంటే పువ్వులా ఆకర్షించే షిఫాన్, అదీ కాదంటే మృదువుగా మనసును తట్టే లేస్.. ఫ్యాబ్రిక్ ఏదైనా సరే.. అది అమ్మాయి మేనిపై కొత్తగా హొయలు పోతుంది.. ట్రెండీగా, సొగసుగా ఉంటూ సందర్భాన్ని అనుసరించి సౌకర్యంగా సర్దుకుపోతుంది స్కర్టు. దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్లీటెడ్, బయాస్, తులిప్, గేదర్డ్, టియర్డ్, లేయర్డ్, డబుల్ లేయర్డ్, హ్యాండ్ ఖర్చ్ఫీ, ఎసెమెట్రికల్, హై అండ్ లో, డబుల్ ప్యానల్, మినీ, మాక్సీ.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి.
* చిన్నారులకు మోకాలి వరకూ ఉండే నీలెంగ్త్.., ఇంకాస్త కిందకు అంటే కాఫ్ లెంగ్త్‌లో ఉండే మాక్సీలు, ప్లీటెడ్, గేదర్డ్ స్కర్ట్‌లు బాగుంటాయి.
* చేనేత రకాల్లో వీటిని కుట్టించుకుని జేబులు, టాజిల్స్ వంటి అదనపు హంగులు చేరిస్తే ట్రెండీగా కనిపించవచ్చు.
* పార్టీలు, ఇతర వేడుకలకు మాక్సీ, ఎసెమెట్రికల్ స్కర్ట్‌లు బాగుంటాయి.
*తులిప్, పెన్సిల్, బాక్స్ ప్లీటెడ్ స్కర్ట్‌లు కాలేజీ విద్యార్థినులకే కాదు అప్పుడప్పుడే ఆఫీసులకు వెళ్లేవాళ్లకీ బాగుంటాయి.
*ట్రెండీగా కనిపించాలనుకునే అమ్మాయిలకు ఎసెమెట్రికల్ స్కర్టు చక్కని ఎంపిక. దీనికి కలీలు ఉండవు.
జాలువారే ఫ్యాబ్రిక్‌తో కూడా అంచుల్లో ఎగుడుదిగుడు ఉండేలా డిజైన్ చేస్తారు. వీటిల్లో లేయర్డ్ డిజైన్స్ సన్నగా ఉన్న అమ్మాయిలకు బాగుంటుంది. ఈ స్కర్టుపైకి కాఫ్తాన్, టీషర్ట్ ఏదైనా ఎంచుకోవచ్చు. ప్లెయిన్ ప్రింటెడ్ మేళవింపులో ఎంచుకుంటే మరింత సౌకర్యంగా అనిపిస్తుంది.
* ఒకే ఫ్యాబ్రిక్ కాకుండా కాటన్, నెట్, జార్జెట్ వంటివాటిని కూడా ప్రయత్నించొచ్చు.
* ఏ-లైన్ డిజైనర్ స్కర్టు శరీరాకృతి సరిగా లేదనుకునేవారికి చక్కని ఎంపిక. వీటికి ప్యాచెస్, ప్యానెల్స్ ఉండవు కాబట్టి కాళ్లు సన్నగా ఉన్నవారు, పొట్ట కనిపిస్తుంది అనుకునేవారు వీటిని ఎంచుకోవచ్చు.
* టీనేజీ పార్టీలు, వేడుకల్లో మ్యాక్సీ స్కర్టులు, హై అండ్ లో, జేబులతో మోకాలివరకూ ఉండే నీలెంగ్త్ బాక్సీ స్కర్టులు అదిరిపోతాయి.
* స్కూల్లో ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్, సెమినార్‌ల వంటి వాటికి పెన్సిల్ స్ట్రిప్ స్కర్ట్స్, షార్ట్ లేయర్డ్ తరహావి నప్పుతాయి. అయితే ఫార్మల్ వేర్ ఏదైనా మోకాళ్లకు రెండు ఇంచులు పైకి కానీ మూడు ఇంచుల కిందకు కానీ ఉండేలా చూసుకోవాలి.
* ఎంబ్రాయిడరీ, మోటిఫ్‌లు, బుటీల వంటి అదనపు హంగులు ఉండే రిచ్ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించినప్పుడు ప్యానల్ స్కర్టులా కుట్టించుకోవచ్చు. దీనే్న కలీ డిజైన్ స్కర్ట్ అంటారు. ఇవి స్వాగతోత్సవ వేడుకల్లో వేసుకోవచ్చు. జతగా క్రాప్ టాప్ మెప్పిస్తుంది. వీటిపైకి వీలైనంతవరకూ కనీసం రెండు అంగుళాల ఎత్తున్న చెప్పుల్ని ఎంచుకుంటే ఇక తిరుగుండదు.

అనంతం-21

0
0

రాగ్యా, గరుడాచలం దగ్గరికొచ్చాడు!
వాళ్ళని చూసి భయంతో గుండె ఝల్లుమని- అంతలోనే భయం బైటపడకుండా కుదుటపడింది చాంద్‌నీ!
అలాంటివాళ్ళు పౌరుషమున్న త్రాచుపాముల్లాంటి వాళ్ళుకాదు! ఎదురు తిరిగితే పారిపోయే పిరికి జెర్రిపోతులు!
అందుకే భయాన్ని బలవంతంగా అణచుకొని ధైర్యం ప్రదర్శించింది చాంద్‌నీ!
ఆడదానిలో యింత అందం ఉంటుందా’ అన్నంతగా ఆశ్చర్యపోతూ చాంద్‌నీనే చూస్తూ, అనిమిష నేత్రుడే అయ్యాడు గరుడాచలం!
‘‘యల్దాఁవు పదరా వాల్యా’’అన్నది చాంద్‌నీ.
‘‘సార్ని పరిశయఁవ్ జాస్తానుండు’’అన్నాడు రాగ్యా.
‘‘నా పేరు గరుడాచలం... పక్షుల మీద పరిశోధలు చేస్తున్నాను. బాగా ఆస్తిపరుడ్ని. వంద కోట్లకి తక్కువుండదు. ఒక భార్య, ఇద్దరు పిల్లలు మాత్రమే! తినేవాళ్ళు అంతకన్నా లేరు’’ అని తన్నుతానే పరిచయం చేసికొన్నాడు సారు!
‘‘గరుడాశలఁవ్ సారు శానా మంచోడు’’ అన్నాడు రాగ్యా.
‘‘నీకాడికా?’’ అన్నది చాంద్‌నీ, వాల్యా చెయ్యపట్టుకొని నడిపించబోతూ.
‘‘ఒక్కమాట’’ అన్నాడు గరుడాచలం.
చాంద్‌నీ ఆగింది. ‘ఏమిటి’ అన్నట్టు చూసింది.
‘్భలే అందంగా ఉన్నావు’’
గుర్రుగా చూసింది.
‘‘రాగ్యా కూడా అందగాడే’’
‘‘పదరా వాల్యా పోదాం’’
‘‘శాందినీ’’ అని రాగ్యా పిల్చాడు.
‘‘ఏవి రోగవ్’’ అడిగింది.
‘‘సారు శానా గొప్పోడు’’
‘‘ఐతే నాకేంటిదంట’’
‘‘ఏం గావాల్నో అడుగు! మనిద్దరి లగ్గవ్ సారే శాత్తాడు’’
‘‘సెంబు దెబ్బసాల్లేదంటరా’’
‘‘తండాదానివని సెంబున గొట్టినా ఒగ్గీశాను.. సార్తోన పరాశకాల్ గాదు’’
‘‘బెదిరిస్తుండావా’’
‘‘ఆలోచిచ్చంతే’’
‘‘ఏటంట’’
‘‘లగ్గవాడు నన్ను’’
‘జల్మలో గాదు’’
‘‘పట్నంలో డాబా ఇంట్లో బెడతా. కోరినబువ్వ, కోరిన సీరే రెయికా! వాసన సబ్బులూ.. పొగడరీలూ..’
‘‘సి.. సి.. యదవ జల్మ’’
‘‘నాది కాదే శాందినీ. నీది! అడవి ఏటిత్తుండాదే నీకు? సీవల్లో దోవల్లో సింపిరి తల గోక్కుంటా, అడవి సిదుగు లేరుకుంటా పొయ్యూదుకుంటా, వంట కుండ లెక్కిత్తా.. దింపుతా..
అసువంటి జల్మ నీకేంటికే శాందినీ? లగ్గవాడావంటే సొరగవ్ సూపిత్తా! పట్నంలో వుండే సుకాలన్నీ నీ కాడికి తెప్పిత్తా! మంచి శాన్సు. సెడనూక్కోగాకు’’ అన్నాడు రాగ్యా.
సహించీ.. సహించీ అప్పుడు శివమెత్తింది! ఇంతింతకళ్ళు చేసికొని రుద్రకాళిలా రాగ్యాని భస్మం చేసేట్టు చూస్తూ-
‘‘అడవి నాకేటిచ్చిందో తెలవదంటరా, సచ్చినోడ! అడవి నాకు జల్మనిచ్చింది. బతకటవ్ నేరిపిచ్చింది. సావటం నేరిపిచ్చింది. బతకటవ్ కోసరవ్ సంపటవ్ నేరిపిచ్చింది.
సవట నాయాల! అడవి నాకు పొండుకాయలిచ్చింది. కోనేటి నీలిచ్చింది. తేనె పట్లిచ్చింది. మాటేసి దుమికే యాట నేరిపిచ్చింది. పులుల్నీ ఎదిరిచ్చటవ్ నేరిపిచ్చింది. నెమిళ్లనీ జింకల్నీ సేరదియ్యటవ్ నేరిపిచ్చింది. ‘ఏవిచ్చింది’ అంటావంటరా బోకరు నంజాకొడక’’ అని ఆగ్రహవేశాలతో రుద్రమూర్తి అయి, అమాంతం రాగ్యా మొహంమీద కాండ్రించి ఉమ్మేసింది చాంద్‌నీ.
రాగ్యా ఆమెను పట్టుకోబోతే మెరపు వేగంతో కదిలి కోసురాయి అందుకొని బలంగా వాడి తలమీద మోదింది.
‘్ఠ’ప్పున శబ్దం!
రాగ్యాకి ఆ దెబ్బతో చుక్కలు కనిపించాయి! మెదడు మొద్దుబారి ఒక్క క్షణం ఆలోచనలు స్తంభించిపోయాయి.
చేష్టలుడిగి పోయాడు రాగ్యా.
గరుడాచలం చాందినీ మీదికి దూకబోయాడు!
విసురుగా గాల్లోంచి లేచి వచ్చి మరో రాయి గరుడాచలం తలను బలంగా తాకింది.
గావుకేక పెట్టాడు.
అదే అవకాశంగా భావించింది చాందీనీ. రాగ్యా మొహంమీద మళ్లీ కాండ్రించి ఉమ్మేసి గరుడాచలం వైపు కోపంగా చూసింది.
వాల్యాని వెంట బెట్టుకొని వడివడిగా అరుస్తూ, అక్కడ్నించి వెళ్లిపోయింది చాంద్‌నీ.
గరుడాచలం మీదికి రాయి విసిరింది వాల్యా!
చిన్నవయసులోనే వాడికి ప్రతిఘటనాతత్వం ఎలా అబ్బినట్టు? ధైర్యంగా రాయి ఎలా వెయ్యగలిగాడు? ఇదే స్వభావం కొనసాగితే పెద్దయ్యాక వాడెలా తయారౌతాడు? వాడినలా తయారుచేసిందెవ్వరు?
ఇవ్వాళ గురి చూసి రాయి విసిరినవాడు తర్వాత గురి చూసి తుపాకులు పేల్చడనీ, బాంబులు విసరడనీ ఏమిటి నమ్మకం?
తమ శత్రువుల్ని తామే తయారుచేసుకోవటం ‘పెద్దవాళ్ల’కు శాపం అనటం తప్ప మరో సమాధానం లేదు!
చాంద్‌నీ ప్రేమాభిమానాలతో ఉప్పొంగి పోతూ వాల్యా తలమీద చేత్తో నిమిరింది.
తండాకి చేరారు.
వాల్యాని ఇంటి దగ్గర దిగవిడిచింది చాంద్‌నీ.
***
‘తండా బాట’ కార్యక్రమం రెడ్డియానాయక్ తండాలో అంత అభాసుపాలైనా కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డికి కించిత్తు కోపం కూడా రాలేదు.
‘‘నా ప్రజలు చైతన్యవంతులౌతున్నారు’’ అన్నాడు.
పోలీసు సిబ్బందికి వింతగావుంది.
ఓ అధికారి కోపం పట్టలేక
‘‘సార్! ఆర్డరిస్తే చాంద్‌నీని, లక్ష్మీబాయినీ మక్కెలిరగతనే్నవాళ్లం. ఉపేక్షించారెందుకు? ముందు మనం ఖాళీ చేయించాల్సిందే ఆ తండా. ‘ఊ’ అంటే ఫైరైనా ఓపెన్ చేసేవాళ్లం’’ అన్నాడు.
ఎమ్మెల్యే మాట్లాడలేదు. చిరు మందహాసం చేశాడు!
‘‘ఎన్‌కౌంటర్ చెయ్యాల్సింది’’ పోలీసు ఉద్యోగి మళ్లీ అన్నాడు.
వాళ్ళంతా గుడారాల వైపుకు సాగిపోతూ అడివి దారిలో అలా మాట్లాడుకొంటున్నారు.
(ఇంకా ఉంది)


స్వామిని మెప్పించిన ఆండాళ్

0
0

మార్గశిరమాసంలో తనకు తానుగా తన భక్తులను కాపాడాలను కొన్న అమ్మవారు అండాల్‌గా విష్ణ్భుక్తుడైన విష్ణుచిత్తునకు పసిపాపగా లభించింది. ఆ పాపను తన సొంత కూతురుగా భావించి అల్లారు ముద్దుగా విష్ణుచిత్తుడు పెంచుకున్నాడు. అచంచలమైన భక్తి ఉన్న విష్ణుచిత్తునితో పాటుగా అందరి భక్తులను తరింప చేయాలనుకొని వచ్చినా ఆండాల్ తల్లి తండ్రి దగ్గర నుంచి భక్తిమార్గాన్ని వారసత్వంగా గ్రహించినట్లుగా చిన్నప్పటినుంచి దేవ దేవుడైన శ్రీపాండురంగని పూజించేది. సేవించేది. తన తోడి పిల్లలతో కలసి శ్రీకృష్ణుని కథలను చెప్పుకుంటూ చెప్పించు కుంటూ ఆనందంతో ఆటలా డుకునేది. అలా పెరుగుతూ యుక్తవయస్సుకు అమ్మ వచ్చింది. ఆమె వయస్సుతో పాటుగా భక్తి పెరిగింది. అందుకే విష్ణుచిత్తుడు పెంచుకుంటున్న పూదోటలోని పూలను, తులసిని సేకరించి తానే మాలలుగా అల్లి తాను ధరించి వాటి అందాన్ని తరిచి చూసుకొని స్వామి ఈ మాలలు ధరిస్తే ఇంకెంత అందంగా ఉంటాడో అన్న భావన చేస్తూ తన తండ్రిచేత ఈ మాలలను స్వామి కైంకర్యం కోసం అండాల్ పంపేది. ద్వారకలో గోపికలందరూ కాత్యాయనీ వ్రతం చేశారని విని, తాను కూడా మార్గళి వ్రతాన్ని చేసి స్వామిని వివాహం చేసుకోవాల ని తలచింది. ఈ మార్గళివ్రతం తోనే మానవులందరికీ మార్గోపదేశం చేయాలని కూడా భావించింది. అందుకే తల్లి తిరుప్పావై పాశురాలను అనుసంధానిస్తూ స్వామిని మనసార ప్రతిరోజు ప్రార్థించేది. ఆ పాశురాలనే నేడు అన్ని వైష్ణవాలయాల్లో భక్తులంతా అనుసంధానిస్తున్నారు.
స్వామి వీరిద్దరి భక్తిని లోకానికి చాటాలనుకొన్నాడు. తల్లి మార్గోపదేశాన్ని అందరూ ఆచరించేలా చేయాలనుకొన్నాడు. ఓరోజు పూమాలలో వెంట్రుకను కనిపించేలా చేశాడు. మాలలను ధరింపచేస్తున్న పూజా రులు ఆ వెంట్రుకలను చూసి రామా రామా ఇవి వాడిన మాలలుగా ఉన్నాయ. స్వామికి అపచారం కదా. ఎవరైనా తాము వాడిన మాలలు ధరింపచేస్తారా? ఎంతటి అప చారం అనుకుని విష్ణుచిత్తునికి విషయం చెప్పారు. ఆ విష్ణుచిత్తుడు అమితంగా గాబరా పడి అయ్యో అయ్యో అపచారం జరిగిపోయంది. స్వామి ఎంతగా బాధపడ్డాడో అనుకొని చెంపలు వాయంచు కుంటూ తన్ను తాను నిందించుకుంటూ అన్యమన్యస్కంగా ఇల్లు చేరుకున్నాడు. అక్కడ ఆండాల్ తల్లి మాలలు ధరించి పూబావిలో ప్రతిఫలించిన తన అందాన్ని చూసుకొంటోంది. ఆ విషయం గమనించిన విష్ణుచిత్తుడు కాసేపు ఆగగానే ఆమె ధరించిన మాలలనే భద్రంగా తీసి పూలసజ్జలో అమరుస్తోంది. దీన్ని చూసిన విష్ణుచిత్తుడు చింతాకాంతుడయ్యాడు. స్వా మికి పదేపదే క్షమాపణలు చెప్పుకుంటూ వెళ్లి తన తల్లిని దబబాయంచాడు. నిందారోపణ చేశాడు. ఎంతటి అపచారం చేశావు అని బాధపడ్డాడు.
ఆ తరువాత స్వామిని మన్నించమని వేడుకుంటూ పడుకుండిపోయాడు. స్వామి చిరునవ్వుతో జరుగుతున్నది చూసి తన భక్తుడైన విష్ణుచిత్తునకు కలలో కనిపించి నీ కూతురిని నేను మెచ్చాను. ఆమె ధరించి నాకు పంపిన మాలలనే నేను ఇష్టపడు తాను.అంతేకాదు నీ కూతురిని నేనే వివాహం చేసుకొంటాను అని చెప్పాడు. అంతే ఆ మాటలను విని విష్ణుచిత్తుడు పరమానందం చెంది స్వామి చెప్పినట్లే తన ఆండాల్ తల్లిని విష్ణుదేవునికిచ్చి పెండ్లి చేశాడు.

జానకి విముక్తి - ముప్పాళ్ళరంగనాయకమ్మ

0
0

రంగనాయకమ్మగారి జానకి విముక్తి నవల తెలుగు నవలా చరిత్రలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న నవల. ఈ నవలని రంగనాయకమ్మగారు మూడు భాగాలుగా రాశారు. మొదటి భాగాన్ని 1977లో, 2వ భాగాన్ని 1980లో, మూడవ భాగాన్ని 1981 జనవరి నుండి 1982 జూన్ వరకూ రాశారు.
రెండో భాగం ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వస్తూ అర్థాంతరంగా ఆపివేయబడింది. నవలలో సిద్ధాంత చర్చలు ఎక్కువగా వున్నాయనీ, పాఠకులు డ్రాగింగ్‌గా ఫీలవుతున్నారనీ, అందువలన ఆపివేస్తున్నట్లు ఎడిటర్ చెప్పాడు. 3వ భాగం డైరెక్టుగా వచ్చింది.
ఇది 1150 పేజీలుపై చిలుకువున్న పెద్ద నవల. ఒక సుదీర్ఘ జీవితాన్ని గూర్చి వివరిస్తూ, ఆ జీవితం చుట్టూ వున్న కనపడీ, కనపడని అంశాలను పాఠకుడి దృష్టికి స్పష్టంగా తెచ్చి, సమస్యలకు పరిష్కారాన్ని చూపుతూ ముగింపునిచ్చిన నవల యిది. ఇంత ఇతివృత్తాన్ని చెప్పటానికి అంత కాన్వాసు కావాల్సిందే మరి.
ఈ నవల చదివాక పాఠకుడికర్థమయ్యే ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రజా రచయితల్లో కూడా రెండు రకాలుగా రచనలు చేసేవారు వున్నారనీ, ఒక తరహా రచయితలు జీవితాల్లోని, వ్యవస్థల్లోని లోపాల్నీ, లొసుగుల్నీ ఎత్తిచూపి అంతటితో ముగిస్తారనీ; రెండవ తరహా రచయితలు సమస్యలకు పరిష్కారం ప్రతిపాదిస్తూ ఆ దిశగా పాఠకుణ్ణి తీసికెళ్తారనీ అర్థమవుతుంది. జానకి విముక్తి అలాంటి రెండవ తరహా రచన.
అట్టమీది బొమ్మ దగ్గరనుండి ఆలోచిస్తే ఈ నవల గురించి ఎన్నో విషయాలు పాఠకుడికి అర్థమవుతాయి. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్. మూడు భాగాలకూ వేరువేరుగా వేసిన అర్థవంతమైన ముఖ చిత్రాలు. నవలా నేపథ్యాన్ని వివరించే మూడు ముందు మాటలు. తెలుగు పాఠకులకు ఎప్పటినుండో పరిచయమైన రంగనాయకమ్మగారి చక్కటి రచనాశైలి. కథకు తగిన శిల్పం, అన్నిటికన్నా ముఖ్యంగా వినూత్నమైన కథావస్తువు.
ఇక కథలోకి వెళ్లేకొద్దీ జీవితాన్ని గురించీ, జీవన విధానాన్ని గురించీ, ఈ సమాజం గురించీ, సంస్కృతి గురించీ, వ్యవస్థ గురించీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. నవల చదవటం పూర్తయ్యేసరికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ తరహా నవల తెలుగులో ఇంకొకటి లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కదా.జానకి విముక్తి అభివృద్ధికరమైన, ఆరోగ్యకరమైన రచన.
ఇక నవలలోని పాత్రల దగ్గరకొస్తే, ప్రధాన పాత్రలు జానకీ, ఆమె అన్నయ్య సత్యం. అతని జీవితభాగస్వామి శాంత, జానకి మొదటి భర్త వెంకట్రావు. అతనితో విడిపోయాక ఆమె జీవితంలో ప్రవేశించే సహచరుడు ప్రభాకర్. జానకి తల్లి సుందరమ్మ, జానకి స్నేహితురాలు విశాలాక్షి, డాక్టర్ మూర్తి, ఇంకొన్ని చిన్నా చితాకా పాత్రలు. ఈ నవలలో ఏ పాత్ర వ్యక్తిత్వం దానిదే. ఒకదానికీ ఇంకొకదానికీ ఎక్కడా పోలిక వుండదు. ఏ పాత్రనీ పాఠకులు మరిచిపోరు.
మనమిక కథలోకి వెళితే 16 ఏళ్ల జానకి, పెళ్లయి భర్త వెంకట్రావుతో కాపురం చెయ్యటానికి, కాపురానికి వెళ్లిన దగ్గరనుండి మనకు పరిచయమవుతుంది.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

0
0

సీ. పసరంబు బందైనఁ బసుల కాపరితప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైన ఁ బ్రాణనాథుని తప్పు
తనయుఁడు దుష్టైన ఁ దండ్రితప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు
కూతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు
ఇభమది చెడ మావటీని తప్పు
తే॥ ఇట్టి తప్పులెఱుంగక యిచ్చ వచ్చి
నటుల మెలగుడు రిప్పుడీ, యవని జనులు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహస్వామీ! గొడ్డు చెడితే పసులకాపరి తప్పు, ప్రజలకు చెడుబుద్ధిపుడితే ప్రభువు, ఇల్లాలికి గయ్యాళితనం ఉంటే ఆ ఇంటి యజమాని, సేనలో దుర్భుద్ధి పుడితే ఆ సేనాధ్యక్షుడు, కొడుకుకి చెడు తలంపు వస్తే తండ్రి, కూతురు, కొడుకు, వీరే కాక ఏనుగు అదుపులోకి రాకపోతే మావటీడు ఇలా వీరందరి తప్పుచేసిన వారు అవుతారు. వీరి వల్లనే వారు చెడుగై నిలుస్తారు. తప్పులు ఎవరు చేస్తున్నారో తెలీక లోకులు నడుచుకుంటున్నారు.

maatata

0
0
Cross Image: 
Date: 
Friday, December 28, 2018

మహాభారతంలో ఉపాఖ్యానాలు-85

0
0

‘నా కుమారుడు పురుషుడే. కావాలంటే పరీక్షించుకోండి. ఎవరో అసత్యం చెప్పారు’’. అది విని అందరూ రాజుకు వివరించి చెప్పారు. శిఖండి పురుషుడని చెప్పారు. రాజు కూడా అల్లుడిని పరీక్షించి సంతృప్తి చెందాడు. ఆనందంలో అక్కడే ఉండిపోయాడు. తప్పుడు మాటలు చెప్పినందుకు కూతురును తిట్టి తన నగరానికి వెళ్ళిపోయాడు. శిఖండి కూడా అంతా సవ్యంగా జరిగినందుకు సంతోషించింది.
ఇలా జరిగిన కొంతకాలానికి కుబేరుడు స్థూణాకర్ణుని ఇంటికి వచ్చాడు. అతను యక్షుని భవనంలోకి ప్రవేశిస్తూ ఆ భవన అలంకరణ చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నేను వచ్చానని తెలిసి కూడా ఇతను ఎందుకు బయటకు రావడం లేదు?’’ అని అనుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న యక్షులు అతనితో ఇలా వివరించారు. ‘‘రాజా! ద్రుపదరాజుకు శిఖండి అనే కూతురు ఉంది. ఒక కారణంచేత ఇతను తన పుంసత్వాన్ని ఆమెకు ఇచ్చి ఆమె స్ర్తీత్వాన్ని తాను గ్రహించాడు. అందుకని ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు ఏది న్యాయమో అది చేయండి’’.
అప్పుడు స్థూణుని పిలిపించి శిక్షిస్తానని అన్నాడు. స్థూణుడు అతని దగ్గరకు వచ్చి నిలబడగా కుబేరుడు అతనితో ఇలా అన్నాడు. ‘‘నీకు స్ర్తీత్వం శాశ్వతంగా ఉండుగాక’’. ఇంకా ఇలా అన్నాడు ‘‘శిఖండికి పురుషత్వం ఇచ్చి తప్పు చేశావు. ఈ కారణంగా ఇది మొదలు నీవు స్ర్తీగా ఉంటావు.’’
అప్పుడు యక్షులందరూ అతని పక్షాన కుబేరుని ప్రార్థించారు. కుబేరుడు స్థూణునికి శిఖండి చనిపోయిన తర్వాత తన పూర్వరూపం వస్తుందని చెప్పాడు. స్థూణుడు స్ర్తిరూపంలో అక్కడ నివసించాడు. గడువు సమాప్తమయ్యేసరికి శిఖండి యక్షుని దగ్గరకు వచ్చాడు. రాజపుత్రుడు నిజాయితీతో రావడం చూసి యక్షుడు సంతోషించాడు. అతను శిఖండితో ఇలా అన్నాడు. ‘‘రాకుమారా! నీ గురించి నేను కుబేరుని చేత శాపాన్ని పొందాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళు. ఇది నా పురాకృత ప్రారబ్ధం అనుకుంటాను. నీవు ఇక్కడి నుంచి వెళ్ళగానే కుబేరుడు ఇక్కడికి రావడం విధి విలాసం’’.
స్ణూణయక్షుడు ఇలా చెప్పగానే శిఖండి ఆనందంతో రాజభవనానికి తిరిగి వచ్చాడు.
శిఖండి విషయం తెలిసిన ద్రుపదుడు దేవతలను, వృక్షాలను పూజించాడు. ఉత్సవాలు జరిపించాడు. శిఖండిని ధనుర్విద్య కోసం ద్రోణుని దగ్గరకు పంపాడు. అతను దృష్టద్యుమ్నుడితో పాటు ద్రోణుడి దగ్గర విద్యనభ్యసించాడు.ఈ విధంగా శిఖండి స్ర్తీగా పుట్టి పురుషుడయ్యాడు. అతను యుద్ధంలో భీష్ముని వధించాలని ఎదురుచూస్తున్నాడు. కౌరవ పాండవ యుద్ధం ఆరంభమయింది. భీష్ముడు విజృంభించి పాండవసేనను నాశనం చేస్తున్నాడు. పాండవులకు అతన్ని ఎలా వధించాలో తెలియటం లేదు. చివరకు కృష్ణుని సలహాతో పాండవులు రాత్రి సమయంలో భీష్ముని దర్శించి భీష్మునితో ధర్మరాజు ఇలా అడి గాడు. ‘‘తాతా! యుద్ధం లో కోపిం చిన దండధారి వంటి నిన్ను జయించడం ఎలా? తగిన ఉపాయం చెప్పు. నిన్ను దేవతలు కూడా జయించలేరు’’.
అప్పుడు భీష్ముడు వారితో ఇలా అన్నాడు. ‘‘నాయనా యుధిష్ఠిరా! నీవు చెప్పింది నిజం. నన్ను దేవదానవులు జయించలేరు.
కాని నేను ఆయుధాలు క్రిందపడవేసిన వానిని, క్రిందపడిన వానిని, కవచరహితుని, భయపడి యుద్ధ్భూమి నుండి పారిపోయేవాడిని, ఏకపుత్రుడయినవానిని, స్ర్తిని, విధవలయిన వారిని, అమంగళచిహ్నం గల పురుషుని చూసి కూడా యుద్ధం చేయను. ఇది నేను తీసుకున్న నిర్ణయం. మీ సైన్యంలో ద్రుపదపుత్రుడు శిఖండి మహారథుడు. కాని అతను మొదట బాలికగా ఉండి తర్వాత పురుషత్వం పొందాడు. ప్రత్యేకించి అలాంటివారిపై బాణాలు వేయను. ఇది అవకాశంగా తీసుకొని ధనుంజయుడు నన్ను పడగొట్టాలి. కృష్ణుడు, అర్జునుడు తప్ప నన్ను ఎవరూ పడగొట్టలేరు’’.
పాండవులు అతని వద్ద శలవు తీసుకొని తమ శిబిరాలకు వచ్చి మర్నాడు అర్జునుని రథంలో శిఖండిని పెట్టుకొని యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నారు.
ఆ మరునాడు భీష్ముడు యుద్ధ్భూమికి రాగా అక్కడ శిఖండిని ముందుంచుకొని అనేక రకాలైన బాణాలను ప్రయోగిస్తున్న అర్జునుని చూచాడు. భీష్ముడు వారితో కాక తక్కినవారితో భీకర సమరం చేశాడు. శిఖండి అతని పై బాణవర్షం కురిపించాడు. కాని భీష్ముడు అతనిపై ఏ బాణం వేయలేదు. అప్పుడు శిఖండి ఇలా అన్నాడు - ‘‘్భష్మా! నీవు నాకు బాగా తెలుసు. నీవు పరశు రామునితో యుద్ధం చేశావని తెలుసు. నేను నిన్ను సంహరిస్తాను’’ ఇలా అంటూ అతను భీష్ముణిపై బాణవర్షం కురిపించాడు. ఇదే తగినసమయమని అర్జునుడు అతనితోపాటు భీష్మునితో యుద్ధం చేయసాగాడు. భీష్ముడు కోపంతో లక్షమంది సైనికులను వధించాడు. అప్పుడు అర్జునుడు శిఖండిని భీష్మునిపైకి పొమ్మన్నాడు. శిఖండి అతను చెప్పినట్లుగా గాంగేయునిపైకి పోయాడు.
అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముని మీదకు వెళ్ళాడు. భీష్ముడు అశుభ ధ్వజం గల శిఖండిపై బాణం వెయ్యలేదు. అర్జునుడు విజృంభించి భీష్ముని తీవ్రంగా గాయపరిచాడు. కానీ భీష్ముడు శిఖండివైపు చూడనుకూడా లేదు. భీష్ముడు చేతపట్టిన ప్రతీ ధనుస్సును అర్జునుడు విరిచాడు. అర్జునుడు వేసిన బాణాలకి భీష్ముడు రథం మీద నించి నేలకూలాడు. అది చూసిన దేవతలు తత్తరపాటు చెందారు. శిఖండి పదునైన బాణాలతో భీష్ముని వక్షఃస్థలంపై కొట్టాడు. తర్వాత అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్మునికి ఎదురుగా వెళ్ళి అతన్ని మళ్ళీ గాయపరిచాడు. భీష్ముడు శరీరమంతా బాణాలు దిగబడి నేలకూలాడు. కాని బాణాల కారణంగా అతను నేలను తాకలేదు. అతను శరశయ్య మీద పడి, ఆ సమయం దక్షిణాయనం కనుక పవిత్రమైన ఉత్తరాయణం కోసం నిరీక్షించాడు.
ఈ విధంగా అంబ తీవ్ర తపస్సుతో రెండు జన్మలెత్తి భీష్ముని మరణానికి కారణమై తన పగ సాధించుకుంది!
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-180

0
0

సూర్యునినుండియే వర్ధిస్తూంది. సూర్యుడొక అగ్నిగోళమే కదా అని అనుకోనేరు. అలా కానేకాదు. సమస్త జీవులను పరిపోషించే జీవన రసాలన్నీ భూమినుండి ఉద్భవించే సమస్త పదార్థాలలోనికి సూర్యుని కిరణజాలం వర్షించే రసవృష్టి ద్వారా వచ్చి చేరుతూంది. అందువలననే భూమిపై వృక్ష, లతా, గుల్మాదులు పుష్పించి, ఫలించినట్లుగా వివిధ జీవులు ఉద్భవించి విరాజిల్లుతూ ఉన్నాయి. అట్టి శక్తి సూర్యునిలో బహుధా నిక్షిప్తమైయుంది. ఆ విధమైన శక్తిని సూర్యునిలో నింపినవాడు కూడ పరమాత్మయే. అందుకే వేదం ‘స శేవధిం ని దధిషే వివస్వతి సః’- ‘అతడే = ఆ భగవానుడే సూర్యునిలో అనేక కల్యాణ భాండాగారాలను నింపియున్నాడు’’ అని ఆ దైవ జీవకారుణ్యాన్ని ప్రశంసించి ఈ సృష్టిలో ‘సాస్యుక్థ్యః’ ‘‘కీర్తనీయుడవు’’ నీ వొక్కడవేనని భగవంతుని అద్వితీయతకు వేదం నమస్కరించింది.
**
భగవంతుడు సర్వోన్నతుడు
ప్రాక్త్భ్యు ఇంద్రః ప్ర వృధో అహభ్యః ప్రాంరిక్షాత్ప్ర సముద్రస్య ధాసేః
ప్ర వాతస్య ప్రథసః ప్ర జ్మో అంతాత్ప్ర సింధుభ్యో రిరిచే ప్ర క్షితభ్య.॥
॥ ఋ.10-89-11.
భావం:- పరమేశ్వరుడు రాత్రుల కంటె, పగళ్ల కంటె, అంతరిక్షం కంటె, ఆధిక్యమూ మరియు విశాలత కలవాడు. సముద్రము కంటె విశాలుడు. ధారణశక్తిలో మిన్న. వాయువు కంటె అధిక వ్యాపన శీలుడు. పృథివికి గల ధృవస్థానాల కావలివాడు. నదీ- నద- సముద్రాలకావల తీరంవాడు. భూమిపైగల నివాస స్థానాలకంటె చాల అధికుడు.
వివరణ:- తల్లి బిడ్డకు వలె వేదమాత జ్ఞానోపదేశం చేస్తుంది. కాలం చాల సుదీర్ఘమైనది. విశాలమైనది. కాలాన్ని గణించడం ఎవరివలన సాధ్యంకాదు. రాత్రింబవళ్లుగా కాలం విభజింపబడియున్నా దాన్ని ఎవరు గణించలేరు. ‘కాలోహ భూతం భవ్యం చ’ (అథర్వ వే.19-54-3) ‘‘్భతమూ భవిష్యత్తూ కూడ కాలమే’’నని అథర్వణవేదం వచిస్తూంది. భూతకాలం భవిష్యత్వాలమే అయితే భూతకాలమెంత సుదీర్ఘమైనదో ఎవడు చెప్పగలడు? అట్లే భవిష్యత్కాల దీర్ఘత్వమెంతో కూడ చెప్పేందుకు ఎవడు సాహసించగలడు? అందుకే వేదం ‘ప్రాక్త్భ్యు ఇంద్రఃప్ర వృధో అహభ్య.’ ‘దైవం (ఇంద్రుడు) తన వైశాల్యం చేత రాత్రింబవళ్లకంటె అత్యధికుడు’’ అని నిర్వచించింది. కాలగణనను కల్పంచడంలోనే వైకల్యమేర్పడితే కాలస్వరూపుడైన ఆ పరదైవాన్ని పరిగణించడం సాధ్యమా? కాబట్టి కాలం కంటె సుదీర్ఘవైశాల్యం గలవాడు, గణించుటకు అందనివాడు అయిన ఆ దైవం అంతరిక్షం కంటె విశాలమైనవాడు అని ఋగ్వేదం వేరే సందర్భంలో ‘త్వమస్య పారే రజసో వ్యోమనః’ (ఋ.1-52-12) ‘‘ఆకాశం కంటె కూడ నీవు పరమునందున్న వాడవు’’ అని దైవాన్ని శ్లాఘించింది. అంటే ఆకాశంలోని ఆకాశత్వం కూడ నీ ముందు సూక్ష్మమైనదే అని అర్థం. ఎందుకంటే-
‘న యస్య ద్యావాపృథివీ అను వ్యచో న సింధవో రజసో అంతమానసుః’॥ ఋ.1-52-14).
దివి, పృథివి, అంతరిక్షాలు ఎవని వ్యాపకత్వ- విశాలతలను, ఆద్యంతాలను అందుకోలేవో, వ్యాపనశీలమైన వాయువు పృథివీ- అంతరిక్షాలలో కేవలం పరిమిత ప్రదేశాలలో మాత్రమే వ్యాపించి యుండగలవో అట్టివాని వ్యాపకత ఆ దైవంముందెంత? అని ఋగ్వేదం వ్యాఖ్యానించింది.
ఈ మంత్రంలో మరో ముఖ్య విషయముంది. పరమాత్మ సర్వచరాచరాలలో అంతర్యామిగా ఉన్నా అన్నింటికంటె అతిరిక్తంగా అంటే వేరుగానే ఉన్నాడు. ఉద్దాలక అరుణ సంప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానమిస్తూ ఇదే విషయాన్ని వివరంగా ఇలా చెప్పాడు.
యః పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అంతరో, యం పృథివీ న వేద, యస్య పృథివీ
శరీరం యః పృథివీమంతరో యమయతి, ఏషత ఆత్మాంతర్యామ్యమృత.॥
బృహదారణ్యకోపనిషత్తు 3-7-3.
భావం:- ‘‘పృథివిలోనే ఉంటూ పృథివికంటే వేరుగా ఉంటున్నవానికి పృథివియే శరీరమయినా ఆతడిని పృథివి ఎరుంగదు.
ఇంకావుంది...

సుందరకాండ

0
0

అహంకారం పెరిగి పెరిగి
చతుర్ణామేవ గతి ర్వానరాణాం మహాత్మనాం
వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః
ఈ సముద్రాన్ని దాటి ఇక్కడ చేరగలగడం అనేది మహాత్ములైన నలుగురు వానరులకు మాత్రమే సాధ్యము. ఎవరువారు?
వాలిపుత్రుడు అంగదుడు-తండ్రిని చంపినవాని యందు చంపించిన వాని యందు ప్రతీకారాన్ని తీర్చుకొనే సామర్థ్యం లేక ప్రతి చిన్న సంఘర్షణకు ప్రాయోపవేశం చేసేవాడు. వాడీవేళ స్వామి దృష్టిలో మహాత్ముడు.
నీలుడు- సుగ్రీవ సేనాపతి. ఒకరి క్రింద బ్రతికేవాడు. ఇక తాను ఎవరి ఆజ్ఞ చేతను బయలుదేరడో, ఎవడు విడిచిన బాణంగా తనను తాను నమ్ముకొన్నాడో అటువంటి నిరహంకారి ఈవేళ అహంకారి అవుతున్నాడు. చివరివాడు-
బుద్ధిమంతుడైన తన రాజు సుగ్రీవుడు. తన భార్యనపహరించిన వాని నుండి భార్యను విడిపించుకొనటం చేతకాక, ఎవని సహాయాన్ని పొంది కార్యసాధన చేసికొన్నాడో ఆ సుగ్రీవుడు ఈవేళ రాముని కంటె సమర్థుడని స్వామి ఊహ.
ఇదీ త్రికూట మహాత్మ్యం.
ఒక్కసారి వచ్చి వాలినంత మాత్రాన బుద్ధిమతాం వరిష్టుడైన స్వామికే ఇంత అజ్ఞానరూప పతనం వచ్చిందే. సతతమూ ఆ కూట ము నందే ఉండే రావణుడెంత అహంకార మమకారాల్ని పొందాలి. అంతా పొది అలా సంచరించటంలో ఆశ్చర్యమేముంది! అయితే-
స్వామికి రావణునికి వున్న భౌదమే స్వామికి స్మృతిని కలిగించింది. తన ఆలోచనకు తానే పశ్చాత్తాపాన్ని పొందేటట్లు చేసింది. ఏమిటా భేదం-
స్వామి పరాశక్తి స్వరూపమైన సీతానే్వషణలో ఉన్నాడు. శ్రీమాతా స్వరూప సీతా ధ్యానంలో వున్నాడు. ఆ తల్లికి కూడా కూటస్థ అని నామముంది. ఇక్కడ కూటమంటే విశ్వ సమూహాల స్థితి. ఆమె దానియందు అధ్యక్ష్యం వహించి సాక్షిగా ఉంటుంది. అట్టి తల్లి అజ్ఞాన కారణ కూటస్థుడైన స్వామికి స్మృతిని కలిగించింది. తానెవరి గురించి ఆలోచింపవలెనో తానెవరి సామర్థ్యాన్ని నమ్మి ప్రవర్తించాలో తానెవరి కార్యార్థమూ వచ్చేనని అనుకొనాలో-అజ్ఞానాన్ని కలిగించింది. వెంటనే రామాభ్యుదయం జ్ఞాపకానికివచ్చింది. సరే-ఈ రాత్రివేళ పట్టణంలో ఎలా ప్రవేశించాలి? అని ఆలోచించేడు.
సూర్యే చాస్తౌం గతే రాత్రౌ దేహం సంక్షిప్త మారుతిః
పృషదంశక మాత్రస్సన్ బభూవాద్భుత దర్శనః
శరీరాన్ని సంక్షేపించి పిల్లి పరిమాణ మాత్రంగా సంచరిస్తానని అనుకొన్నాడు. ఇక్కడ మహర్షి ‘పృషదం శకమాత్రః’ అని ఊరుకోలేదు, ‘బభూవాద్భుత దర్శనః’ అన్నారు. పృషదంశకః అంటే రుద్రః అని అర్థం. స్వామి ఇపుడు రుద్రాంశతో శత్రుకర్శనుడవుతాడు. అలాగే అహంకార రూప అజ్ఞానం నశిస్తే కనిపించేదంతా అద్భుతమే అవుతుంది. విశ్వ రహస్యం తెలుస్తుంది. అనంత విశ్వంలో తన స్థానం తెలుస్తుంది. కూట జ్ఞానం నశించిన స్వామి అద్భుత దర్శనుడైనాడు. లంకా పట్టణంలో ప్రవేశిస్తాడు.
ఇక్కడవాల్మీకి మహర్షి లంకా పట్టణాన్ని వర్ణించే తీరు దాని బాహ్య ప్రకృతిని చెబుతుంది.
బంగారు పూత పూసిన గోడలు, బలమైన కోటలు, అత్యున్నతమైన ప్రాసాదలు, నవరత్నాలలు పొదిగిన హర్మ్యాలు, తీర్చిదిద్దిన రాజవీధులు-ఇవి మాత్రమే తరచూ కనిపిస్తాయి.
ఇంకావుంది...


శ్రీ పరమహంస బోధామృతము

0
0

ఎలుకలను బట్టుటకై పెద్దపెద్ద ధాన్యపుగొట్ల ద్వారములకడ పేలాలతో గూడిన బోనులను బెట్టుదురు. ఎలుకలు పేలాల వాసనచే ఆకర్షింపబడి అంతకంటె తృప్తికరమగు లోపలనున్న ధాన్యమును దినమఱచును. అంతనవి పట్టుపడి వచ్చును. జీవుని విషయము కూడ నిట్టిదే. మహాలౌకిక సుఖములన్నిటికంటెను కోటిరెట్లు ఘనతరమగు బ్రహ్మానందము జీవునకు మిక్కిలి దాపుననే యున్నది. అట్టి బ్రహ్మానందమును బొంద యత్నించుటకు బదులు తుచ్ఛ విషయ సుఖములచే మోహితుడై జీవుడు మాయాజాలమున జిక్కుకొని నశించుచున్నాడు.
10. ఒక పండితుడు: దివ్యజ్ఞాన సమాజమువారు మహాత్ములున్నారందురు. మఱియు సూర్యలోకము, చంద్ర లోకము, నక్షత్ర లోకము మొదలగు నేవేవో లోకములు గలవనియు నరుని సూక్ష్మశరీరము వీనియన్నిటియందును సంచారము చేయగలదనియు చెప్పెదరు. ఇట్టి విషయములనేకములు వారు చెప్పుచుందురు. అయ్యా! దివ్యజ్ఞాన సమాజమునుగూర్చి మీ అభిప్రాయమేమి?
శ్రీ గురుదేవుడు: భక్తి,- భగవద్భక్తి- యొక్కటియే సర్వోత్తమము. వారు భక్తిని లక్షింతురా? లక్షింతురేని మంచిదే. బ్రహ్మసాక్షాత్కారమే వారి ముఖ్యోద్దేశమైనచో మంచిదే. కాని సూర్యలోకము, చంద్ర లోకము మొదలగు నల్పవిషయములను గూర్చిన చింతలో నిమగ్నులై యుండుట నిజమైన తత్త్వానే్వషణ కాదని మాత్రము జ్ఞప్తినుంచుకొనుము. భగవత్పాధారవిందములయందు భక్తికలుగుటకై, తీవ్ర సాధన చేయవలయును; అఖండావేదనతో భగవద్దర్శనమునకై విలపింపవలయును. విషయ సుఖములనుండి మనస్సును మఱల్చి భగవంతునియందే లగ్నము చేయవలయును. భగవంతుడు వేదములలో లేడు, వేదాంతమునందు లేడు, ఏ శాస్తమ్రునందును గానరాడు. హృదయమున భగవత్పరితాపము కలుగవలయును. గాఢమగు భక్తితో దేవుని ప్రార్థించుచు సాధన చేయుచుండవలయును. దైవ సాక్షాత్కారము సులభసాధ్యమగుకొనబోకుము. సాధనలు చేసి తీరవలయును.
11. నరులందఱును నారాయణుని జూడగల్గుదురా! ఎవ్వడును దినమంతయు పస్తుపడియుండనక్కఱలేదు. కొందఱకు ఉదయము తొమ్మిది గంటలకే భోజనము లభించును. కొందఱకు మధ్యాహ్నమైన వెనుక రెండు గంటలకును, కొందఱకు సాయంకాలముననో సూర్యాస్తమయ సమయముననో దొరకును. ఆ విధముగనే ఎప్పుడో యొకప్పుడు- ఈ జన్మముననో అనేక జన్మముల యనంతరమో- అందఱకు దైవసాక్షాత్కారము పొందియే తీరుదురు.
12. చిన్నపిల్లలు పంచపాళిలో విచారము, భయము, ఆటంకము అనునవి లేకుండ, బొమ్మలు పెట్టుకొని స్వేచ్ఛగా ఆటలాడుకొనుచుందురు; కాని తల్లి కనబడగానే బొమ్మలనన్నిటిని త్రోసి పాఱవేసి, ‘‘అమ్మ! అమ్మ! అనుచు ఆమె కడకు పరుగిడుదురు. ఓ నరుడా! నీవును ఈ లోకమున ధనకీర్తి గౌరవములను బొమ్మలతో వ్యామోహమున జిక్కి ఆటలాడు కొనుచున్నావు. నీకేమియు భయముగాని, విచారముగాని లేకున్నది. కాని నీకొక్కసారి ఆ దివ్యమాతృ దర్శనము లభించెనా, వీనిలో దేనియందును మక్కువయుండదు. వీనినన్నిటిని తృణీకరించి ఆ దివ్య జనని సన్నిధికి పరుగిడుదువు సుమీ!
13. సముద్రగర్భమున ముత్యములున్నవి, కాని వానిని బడయగోరుదువేని ప్రాణాపాయమునకు వెఱవక నీటమునిగి చాలపాట్లు పడవలయును. ఒక్కసారి మునిగినంతనే ముత్యములుచే చిక్కనియెడల సముద్రమున ముత్యములులేవని నిర్ధారణ చేయరాదు.

ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

ధ్యానం.. లక్ష్యసాధనకు మూలం ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం)

0
0

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు
H.No. 7-8-51,Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
===============================================================
సాధకుడిలో అహంభావం (నేను అనే భావం) కొద్దిగా మిగిలే ఉంటుంది. అందువల్ల అనిర్వచనీయమైన దివ్యదర్శనం లభిస్తున్నప్పటికీ, ఆ దివ్యాత్మతో తాదాప్యత పొందలేడు.
ఇక అన్నిటికంటే పైనున్న, 7వ దైన సహస్రార చక్రం, బ్రహ్మరంధ్రంపైన మనసు తదేకంగా ధ్యాననిమగ్నమైనపుడు, అంటే కుండలిని శక్తి సహస్రారానికి చేరినపుడు, సమాధి స్థితి కలుగుతుంది. అపుడు బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమును పొందగలుగుతాడు సాధకుడు.
ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక వ్యక్తికి, విశేషమైన ప్రజ్ఞ లేక జ్ఞానం కలిగిందంటే, తత్సంబంధమైన చక్రాలలోనికి సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి కొద్దిగా ప్రవేశించిందని తెలుసుకోవచ్చు. కుండలిని యోగానికి చెందిన శ్రీవిద్య ఉపాసన చాలా నియనిష్ఠలతో, శుచి శుభ్రతలతో, రహస్యంగా అభ్యసించవలసి వుంటుంది. అందుచే దీనిని గుప్తవిద్య అని కూడా అంటారు. ఇది మిగతా ప్రాపంచిక విద్యలవంటిది కాదు. ఈ విద్యను గురించి కులార్ణవ తంత్రము అను గ్రంథమునందు ఈ క్రింది విధంగా చెప్పబడింది.
‘‘అన్యాస్తు సకలా విద్యః ప్రకటాగణికా ఇవ
ఇయంతు శాంభవీ విద్యా,గుప్తా కుల వధూరివ’’
అనగా లౌకిక విద్యలు, వేశ్యలవలె, బాహ్య (అంగసౌష్టవ) ప్రకటనరీతిలో ఉంటాయి. శాంభవి విద్య ఆవిధంగా కాక పవిత్రమైన గృహిణివలె ఉంటుందని అర్థము. తెలిసినా తెలియకపోయినా మనం చేసే పూజలు, దానధర్మాలు, సత్ప్రవర్తన మొదలైన సత్కర్మల ఫలితాలు, ఈకుండలినీ శక్తి వద్దకే తీసుకెళతాయి. మనిషి తనకు కలిగిన సత్ఫలితాలన్నీ తను చేసిన పూజాదికాలవల్లనే కలిగాయని భావిస్తాడు కానీ, అతడు తన ప్రార్థనవల్ల సత్కర్మలవల్ల తన మూలాధారమందు నిద్రావస్థలోనున్న రుూ మహాశక్తిని కొద్దిగా మేల్కొల్పగలిగానని అనుకోడు. కాని యోగి అయినవాడు ఆ విషయాన్ని గుర్తిస్తాడు. మహాఋషులు, యోగులు సిద్ధపురుషులు ఆ మహాశక్తిని ఏ విధంగా మేల్కొల్పి ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకొని, సాధన చేసి, శాశ్వతమైన, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందగలిగారు. ఈ విధానమొక గొప్ప విజ్ఞాన శాస్త్రంగా భావించాలి. ప్రాణాయామాది యోగక్రియల యొక్క పరమ లక్ష్యం కూడాఇదే. ఇది భగవదానుగ్రహం, సద్గురు కృపలేనిదే సాధ్యపడదు.
యోగ ప్రక్రియలో ధ్యానమత్యంత ముఖ్యాంశమని మనకు తెలుసు. ఇటీవలి కాలంలో పాశ్చాత్య పరిశోధకులు భారతీయమైన ‘యోగా’కు ఆకర్షితులై ‘్ధ్యనం’ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని పరిశీలిద్దాం. ఇతఃపూర్వం యవ్వన దశ తరువాత బుద్ధి స్థిరపడిపోతుందని ఇక మారదని వారి నమ్మకం.
కాని ఇటీవలి అమెరికాలోని విస్కాన్సిస్ విశ్వవిద్యాలయంలో నరాల చికిత్సకు సంబంధించిన శాస్తవ్రేత్త రిచర్డ్ డేవిడ్‌సన్ తన పరిశోధనల ద్వారా నిర్థారించినదేమంటే ధ్యానంవల్ల బుద్ధిని ప్రచోదనం చేసి క్రియాశీలత్వాన్ని ప్రభావితం చేయవలచ్చని తేల్చి చెప్పాడు. అంతేకాదు ధ్యానంవల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, బుద్ధి మాంద్యాన్ని నియంత్రించవచ్చునని తేలింది.
2000 సంవత్సరంలో అమెరికాలో జరిపిన ఒక పరిశోధన ద్వారా నాలుగు గంటల సుఖ నిద్ర కంటే ఒక్క గంటసేపు చేసే ధ్యానంవల్ల ఎక్కువ విశ్రాంతి మానసిక ప్రశాంతత తలపిస్తుందని తేలింది. ధ్యానం చేసే వారిలో లక్ష్య సాధన ఎక్కువగా ఉంటుందని తేల్చారు. 2008 సంవత్సరంలో డాక్టర్ రాండీఝస్మన్ తన పరిశోధనల ద్వారా ధ్యానంవల్ల రక్తపోటు నియంత్రించవచ్చన్నాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వారు ధ్యానం ద్వారా వృద్ధాప్యంలో వార్థక్య ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని తేల్చారు. ‘వేక్ ఫారెస్టు బాప్టిస్టు’ విశ్వవిద్యాలయంవారు ధ్యానంవల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిర్థారించారు.
యోగములేని జ్ఞానము జ్ఞానము లేని యోగము సిద్ధింపజాలవు. కావున సాధకుడు శరీరావయముల బాధింపని సుఖాసనమున కూర్చుండి మనసును కేంద్రీకరించి వౌనముగా ప్రణవధ్యానము చేయుచు మూలాధారమునందు ప్రాణమును బంధించిన యెడల కుండిలిని మేల్కొనును. అట్లు మేల్కనిన కుండలిని శక్తి త్రైలోక్య మోహన చక్రము నుండి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథిని పిదప రుద్రగ్రంథిని భేదించి ప్రాణశక్తిని కుంభించుటచే సూర్యభేదనము, ఉజ్జాయిని, భస్త్ర, శీతలిని క్రియలచే కైవల్య ప్రాప్తికి కారణమగును. ఇడాపింగళనాడుల ద్వారా, మార్చి మార్చి పూరక, కుంభక, రేచక, ప్రాణాయామము చేయుటే, ఉదరమునందలి క్రిమి దోషములు, కంఠగత కఫ దోషములు ధాతు సంబంధ దోషములను హరించును.
ఇంకావుంది...

మనసు పలికే మౌనప్రేమ

0
0

ఏఎస్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై బాబి వేంపల్లి దర్శకత్వంలో నిర్మాత బొట్రేపల్లి ఆవులకుంటల సూర్యప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం ‘మనసు పలికే మౌనప్రేమ’. ఈ చిత్ర పూజా కార్యక్రమం గురువారం ఫిలింనగర్‌లో ఘనంగా జరుపుకుంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, కె.ఎస్.నాగేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత మరియు స్క్రిప్ట్ రైటర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ- రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్ కాదు ప్రేమ కూడా వుంటుందని తెలిపే ఫ్రెష్ లవ్‌స్టోరీ. 1980లో రాయలసీమ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ తెరకెక్కనుంది. ఈ కథ చెప్పినపుడు నా స్నేహితుడు బాబీ ఎగ్జైట్ అయ్యి తాను దర్శకత్వ బాధ్యతను తీసుకున్నారు. ఈ చిత్రానికి ఇంకా ఆడిషన్స్ జరుగుతున్నాయని, జనవరి 18 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించి మూడు నెలల్లో పూర్తిచేస్తామని తెలిపారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ - కథ బాగా రాసుకున్నారు సూర్య. అతను నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని చెప్పుకొచ్చారు. హీరో నందు మాట్లాడుతూ టైటిల్ ఎంత బాగుందో స్టోరీ కూడా అంతే బాగుంటుంది అన్నారు. కేవలం లవ్‌స్టోరీనే కాదు ఫ్యామిలీ మొత్తం కలసి చూసేలా సినిమా వుంటుంది అని హీరోయిన్ ప్రియా తెలిపారు.

29న మైడియర్ మార్తాండం

0
0

పృథ్వీ, రాకేందు వౌళి, కల్పి, కళ్యాణ్ విటపు, కృష్ణ్భగవాన్, తా.రమేష్‌లతో హరీష్ కెవి తెరకెక్కించిన చిత్రం ‘మైడియర్ మార్తాండం’. 29న సినిమా విడుదల సందర్భణగా చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. ముఖ్య అతిథి వెనె్నలకంటి సినిమా యూనిట్‌కి శుభకాంక్షలు తెలుపుతూ, సినిమాలో తన కుమారుడు రాకేందు వౌళి హీరోగా పరిచయం అవుతుండటం హ్యాపీగా ఉందన్నారు. దర్శకుడు హరీష్ తపన వున్న వ్యక్తి అని, ఆ తపనతోనే వినోదాత్మంకంగా చిత్రాన్ని తీర్చిదిద్దాడని అన్నారు. పృధ్వీ మాట్లాడుతూ దర్శకుడు హరీష్ ఒక్కడే ఒక సైన్యంలా సినిమా కోసం పనిచేశాడని, అతని కృషిని చూసి నటీనటులంతా పూర్తి సహకారం అందించారన్నారు. హీరో రాకేందు వౌళి మాట్లాడుతూ హీరోగా ఇది నా తొలి సినిమా అంటూ, మంచి నటులతో చేయడం హ్యాపీగా ఉందన్నాడు. దర్శకుడు హరీష్ మాట్లాడుతూ మాకు పెద్దదిక్కు పృథ్వీ. ఆయన లేకపోతే సినిమా లేదు. సినిమా కోర్టు డ్రామాతోపాటు మంచి కామెడీ వుంటుంది. చిన్న సినిమాగా మొదలుపెడితే అది ఇప్పుడు పెద్ద సినిమా అయిందన్నారు. హీరోయిన్ కల్పిక మాట్లాడుతూ సినిమాలో తనకు మంచి పాత్ర లభించిందని, పృధ్వీ మేనకోడలుగా అందరినీ అలరిస్తానని చెప్పుకొచ్చింది.

కార్తికేయ కొత్త సినిమా

0
0

ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది. అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందజేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వంతోపాటు హీరోపై క్లాప్‌నిచ్చారు. ఎస్‌పి బాలు మాట్లాడుతూ అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల జంట టీవీరంగం ద్వారా ఎప్పటినుండో సుపరిచితులు. అందుకే సినిమా ఓపెనింగ్‌కు వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించడం బాధ్యత అనిపించింది అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ఆర్‌ఎక్స్ 100 తర్వాత నేను చాలా కథలు విన్నాను. నేను విన్న అన్ని కథల్లోకి బెస్ట్ కథ ఇది. అందుకే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానన్నారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ నా గురువు, సోదరుడు ఆల్ ఇన్ వన్ అంతా బోయపాటే. ఆయన పేరు ఎక్కడా తగ్గకుండా సినిమా తీస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమా ఇంత తొందరగా మొదలైందంటే దానికి కారణం హీరో కార్తికేయనే. నేను కథ చెప్పగానే, కథమీద వున్న నమ్మకంతో ఎంతో ఎంకరేజ్ చేసి సినిమా చేద్దామన్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు. నిర్మాత అనిల్ కడియాల మాట్లాడుతూ మొదటగా మమ్మల్ని టీవీ మీడియాలో ఆదరించిన బాపినీడుకి, మా షోలను వీక్షిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఈ కథపై వున్న నమ్మకంతో నిర్మాణ రంగంలోకి కాలుపెట్టాము. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. హీరో కార్తికేయకు ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live