Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

చెన్నైనుంచే మొదలు..

$
0
0

కమల్‌హాసన్- శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘్భరతీయుడు’కి సీక్వెల్‌గా భారతీయుడు-2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరిలో చెన్నైలో జరగనుంది. తరువాత పొల్లాచ్చిలో షూట్‌జరిపి మిగిలిన చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఉక్రెయిన్‌కు వెళ్లనుంది. చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్‌ను అక్కడే తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం కోసం యంగ్ లుక్‌లో మారడానికి కమల్ ప్రస్తుతం జిమ్‌లో కష్టపడుతున్నాడు. అనిరుధ్ సంగీతం అందించనున్న చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. చిత్రంలో కమల్ సరసన కాజల్ కథానాయికగా నటించనుండగా 2020లో ప్రాజెక్టు సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత కమల్ నటనకు స్వస్తిచెప్పి రాజకీయాల్లో బిజీ కావచ్చని టాక్.


ఆశ... నిరాశ -( రివ్యూ-2018)

$
0
0

ఇండస్ట్రీ డైరీలో పేజీ మారుతోంది. కొత్త ఏడాదిలోకి పరిశ్రమ ఆలోచనలు పరిగెత్తుతున్నాయి. ప్రతి ప్రాజెక్టూ విజయకాంక్షతోనే మొదలైనా, కొన్నింటిని ఎదురు దెబ్బలు తప్పవన్నది ఏటా రుజవవుతున్న నిజం. అయితే, గడచిన ఏడాది సారమే ఈసారీ రిపీట్ చేసింది 2018. కొత్త కథలు, సరికొత్త ్ర
పయోగాలతో పరిశ్రమలో కనిపిస్తున్న వెలుగంతా చిన్న సినిమాలదే కావడం గమనార్హం. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాలు సాధించి -పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు తేవడంలో చాలా సినిమాలు సఫలమయ్యాయి.
పరిశ్రమకు ఇమేజ్ తేవడంలో విఫలమైన స్టార్ల చిత్రాలు -ఈసారీ ప్రేక్షకుకలు నిరాశనే మిగిల్చాయి.

నిజానికి -కాంబినేషన్ సెట్ అయినప్పుడే కొన్ని సినిమాలు విపరీతమైన ఆసక్తిని పెంచేస్తాయి. సినిమా థియేటర్లకు
వచ్చేవరకూ ప్రతి అంశమూ సంచలనమే అవుతుంది. కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ వరకూ, మోషన్ పోస్టర్ నుంచి ప్రీ రిలీజ్ వరకూ అన్నీ -ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇంత జరిగిన తరువాత కూడా -్థయేటర్‌లో ఢమాల్‌మన్న చిత్రాలూ ఉంటాయి. ఈ ఏడాది ప్రేక్షకులను ఊరించి, ఉసూరుమనిపించిన సినిమాలపై ఓ రివ్యూ.

ఏటా మాదిరిగానే ఈసారీ కొన్ని భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి. స్టార్ హీరోల సినిమాలైతే ప్రేక్షకులను మరీ నిరాశకు గురిచేశాయి. స్టార్ల చిత్రాల్లో బ్లాక్‌బస్టర్ల కంటే డిజాస్టర్లే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు ‘అజ్ఞాతవాసి’ పరాజయాల బాటకు తొలిమెట్టైంది. పెద్ద అంచనాల మధ్య భారీ చిత్రంగా సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి -రెండు రోజులకే అడ్రస్ గల్లంతైంది. జల్సా, అత్తారింటికి దారేదీ వంటి సూపర్ హిట్ల తరువాత పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా -ప్రేక్షకుడిని రంజింపచేయలేదు. బాలయ్య హీరోగా తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ తెరకెక్కించిన ‘జై సింహా’ సంక్రాంతి సినిమాగా గర్జించలేకపోయాడు. ఇక రిపబ్లిక్ డే చిత్రంగా వచ్చిన అనుష్క భాగమతి సత్తా చాటలేదు. హారర్, లేడీ ఓరియంటెండ్ చిత్రాలతో తనదైన సత్తాచాటిన అనుష్క, భాగమతిగా ఆడియన్స్‌కి భారమైంది. ఫిబ్రవరిలో వచ్చిన రవితేజ ‘టచ్ చేసి చూడు’ ప్రేక్షకుడిని ఏమాత్రం టచ్ చేయలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. పెద్ద అంచనాల మధ్య రూపొందిన వివి వినాయక్, సాయిధరమ్ తేజ్ చిత్రం ‘ఇంటిలిజెంట్’ జనానికి అర్థంకాలేదు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు ఏకంగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్‌ని మూగగట్టిన పెద్ద చిత్రమిది. మార్చి పరీక్షల సీజన్ నుంచి మిడ్ సమ్మర్ వరకూ చిన్న చితకా సినిమాలే థియేటర్లను ఆక్రమించాయి. ఫలితం చూపించిన చిత్రం ఒక్కటీ లేదు. సమ్మర్ హాలిడేస్ సీజన్ కోసం ఎదురు చూసిన ప్రేక్షకుల ముందుకు మేకర్స్ భారీ సినిమాలే తెచ్చారు. ఆ జాబితాలో మొదటిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ‘నా పేరు సూర్య..’ను చెప్పుకోవాలి. స్టార్ రైటర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా తీవ్ర నిరాశ మిగిల్చింది. ఓపెనింగ్స్ రాబట్టినా, ఫినిషింగ్ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ ఎఫెక్ట్‌తో అల్లు అర్జున్ మరో సినిమాకు రెడీ అవ్వలేకపోతున్నాడంటే -పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో వచ్చిన రవితేజ ‘నేల టికెట్’ తన స్థాయినే చూపించింది. మాస్ రాజా స్టామినాను మరోసారి చూడండంటూ ప్రచారం ఊదరగొట్టినా -బాక్సాఫీస్ వద్ద టికెట్లు మాత్రం తెగలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన నాగ్, సంచలన దర్శకుడు వర్మ ప్రాజెక్టు -ఆఫీసర్, అల్లరి నరేష్, సనీల్ -సిల్లీ ఫెలోస్, నాగచైతన్య, మారుతిల -శైలజారెడ్డి అల్లుడు, ప్రేమకథల స్పెషలిస్టుగా పేరుబడిన కరుణాకరన్, సాయిధరమ్ తేజ్ కాంబో ప్రాజక్టు -తేజ్.. ఐ లవ్ యూ, నందమూరి కళ్యాణ్‌రామ్ -ఎమ్మెల్యే’, కళ్యాణ్‌రామ్, తమన్నాల రొమాంటిక్ ఎంటర్‌టైనర్ -నా నువ్వే, ఛలోతో హిట్ జోరందుకుని హోం బ్యానర్‌లో నాగశౌర్య చేసిన -నర్తనశాల, కుటుంబ కథా చిత్రాల నిర్మాత దిల్ రాజు భారీ ఆశలతో తెచ్చిన -శ్రీనివాస కళ్యాణం, విజయ్ దేవరకొండ పొలిటికల్ డ్రామా -నోటా, శ్రీనువైట్ల, రవితేజల ప్రాజెక్టు -అమర్ అక్బర్ ఆంటోనీ, బెల్లంకొండ శ్రీనివాస్ -కవచం.. ఇలాంటి నచ్చని చిత్రాలను ప్రేక్షకుడు తిప్పికొట్టేశాడు. మరిన్ని సినిమాలు దర్శక, నిర్మాతల ఆశల్నే కాదు ఆడియన్స్‌నీ నిరాశపర్చాయి. మొత్తంగా ఈ ఏడాది ఆశించిన సినిమాలన్నీ దాదాపుగా పరాజయాలనే చవిచూడటం ఇండస్ట్రీకి పెద్ద కుదుపు. వ్యాపారంలో లాభనష్టాలు సహజం కనుక, దర్శక, నిర్మాతలు కొత్త ఏడాదిలో కొత్త కసితోనైనా మంచి సినిమాలు తెస్తారని ఆశిద్దాం.

ఢిల్లీ గర్జనకు ఎమ్మెల్యే శ్రీనివాసులు

$
0
0

రైల్వేకోడూరు, డిసెంబర్ 27: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమానికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుండి ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు గత ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హమీని అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ గర్జనకు ఊహించని రీతిలో రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున పార్టీ నాయకులు, మేధావులు, విద్యార్థులు, రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం మోసం చేయడమే కాకుండా, టీడీపీ హమీలను అమలు చేయక పోవడంపై గర్జిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

మోదీ పర్యటనను జయప్రదం చేయాలి

$
0
0

రాజంపేట, డిసెంబర్ 27: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పుష్పాల శ్రీనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రాజంపేట అసెంబ్లీ సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరవ తేదీన గుంటూరులో జరిగే ప్రధాని సభకు నియోజకవర్గం నుండి యువకులు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధి కోసం ఇస్తున్న నిధులు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టి అవి తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలతో అర్హులైన పేదలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ప్రత్యేకదృష్టి

$
0
0

వేంపల్లె, డిసెంబర్ 27: గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ట్రిపుల్ ఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల అభివృద్ధి కోసం సమష్టి కృషితో ప్రత్యేక దృష్టి సారిద్దామని నూతనంగా నియమితులైన ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ హెచ్.సుదర్శన్‌రావు అన్నారు. గురువారం వేంపల్లె మండలంలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ట్రిపుల్ ఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు విద్యాభ్యాసం అనంతరం ప్లేస్‌మెంట్లు ఏర్పాటు చేసే దిశగా సమష్టి కృషితో పనిచేద్దామన్నారు. ఇక్కడ ఆరేళ్లు చదివినందుకు ప్రతి విద్యార్థి ఉద్యోగంతో వెళ్లేలా అధ్యాపకులు తీర్చిదిద్దాలన్నారు. సాధారణంగా ప్రతి విద్యార్థికి ఫిజికల్‌గాను, మెంటల్‌గాను, సైకలాజికల్‌గాను సమస్యలు ఉంటాయన్నారు. ఆ సమస్యలను విద్యార్థులే అధిగమించేటట్లు వారంలో ఒక రోజున 2 గంటల సమయాన్ని ప్రతి బోధకుడు విద్యార్థుల కోసం ఉపయోగించాలన్నారు. విద్యార్థుల గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వారు కనుక వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను అభివృద్ధి పరచడానికి 2-5 లాంగ్వేజ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి విద్యార్థికి ఇంగ్లీష్ పట్ల అవగాహన ఉండాలన్నారు. ట్రిపుల్ ఐటీ పుట్టుక ప్రిస్టేజ్‌తో కూడుకున్న విశ్వవిద్యాలయమని ఆ పేరును సార్థకం చేయడానికి అందరం కలిసికట్టుగా శ్రమిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలు అనేది బోధన అనేవి విద్యార్థిని కేంద్ర బిందువగా చేసుకొని అధ్యాపకులు, పరిశీలకులు ప్రాజెక్టు గైడ్స్ పనిచేయాలన్నారు. తన స్వగ్రామం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తన తల్లిదండ్రులు వేణుగోపాల్‌రావు, సుబ్బమ్మలు వ్యవసాయం చేసి తనను ఇంతటివాణ్ణి చేశారని ఆయన అన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఏవో, డీన్స్, చీఫ్ వార్డన్, వార్డన్లు, హెచ్‌వోడీ, ఇంజనీరింగ్, కో ఆర్డినేటర్లు తదితర అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సివిల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ అమరేంద్రకుమార్‌సండ్ర, ఒంగోల్ డైరెక్టర్ నరసింహరాజు, ఏవో సీహెచ్ రత్నకుమారి, అకడమిక్ డీన్ చంద్రశేఖర్, ఆర్థిక శాఖాధికారి సుధాకర్, విద్యార్థుల సంరక్షణాధికారి మీనాక్షి, అసోసియేట్ పీ ఆర్‌వో డాక్టర్ ఎం ఎస్ బ్రహ్మానందయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూపత్‌కుమార్, కొండారెడ్డి, మెంటార్స్ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, సంచాలకులు పాల్గొని డైరెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘ఉక్కు’ సంకల్పానికి పునాది

$
0
0

జమ్మలమడుగు/ మైలవరం, డిసెంబర్ 27: వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పునాది వేసి సర్వతోముఖాభివృద్ధికి నాంది పలికామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదినె్న గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఉక్కు పరిశ్రమ) పనులకు గురువారం ఉదయం 11.12 గంటలకు ఆయన శంఖుస్ధాపన, భూమిపూజ, పైలాన్ ఆవిష్కరణలను నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి దోహదపడే ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేశామన్నారు. పరిశ్రమ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, ఈ పరిశ్రమ నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వమే నడుం బిగించిందని తెలిపారు. పరిశ్రమకు అవసరమైన భూసేకరణ నెలరోజుల్లో పూర్తిచేస్తే మూడునెలలో పరిశ్రమ పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర గనులు, భూగర్భశాఖ శాఖ మంత్రి సుజయ కృష్ణరంగారావు మాట్లాడుతూ మూడు ఎంటీయస్ ఖనిజ వినియోగంతో పరిశ్రమ నడిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చినా, ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుందని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి సాహోసోపేతమైన నిర్ణయమని మంత్రి అన్నారు. ఉక్కు పరిశ్రమపై జరుగుతున్న దుష్ప్రచారాలకు నేటి కార్యక్రమమే సమాధానమన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబునాయుడు నిదర్శనం అయితే, అందుకు జగన్ అడ్డుపుల్లలు వేస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట మేరకు రూ.18వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. తోడుగా రావాల్సిన బీజేపీ తోడేలు పాత్ర పోషించడంతో రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లానుండి అత్యధిక స్ధానాలు గిఫ్ట్‌గా ఇచ్చి తిరిగి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పీ.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా చరిత్రలో ఇది ఒక సువర్ణ్ధ్యాయమని అన్నారు. బ్రహ్మణి స్టీల్ పరిశ్రమ ఏర్పాటు పేరుతో ఖనిజాన్ని తరలించుకుపోయి, నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఈ పరిశ్రమతోపాటు ఏసీసీ సిమెంట్ పరిశ్రమ, ఎస్సార్బీసీ కాలువ పనుల పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.

కడప అమరావతితో పోటీపడాలి

$
0
0

కడప, డిసెంబర్ 27: కడప జిల్లా కూడా అభివృద్ధిలో తిరుపతి, అమరావతితో పోటీపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అందుకోసం కావాల్సిన వౌళికసదుపాయాలు జిల్లాలో ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తెస్తామని ముఖ్యమంత్రి అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదినె్న గ్రామ పరిధిలోని గుట్టలపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు పునాదిరాయి వేశారు. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ స్టీల్‌ప్లాంట్‌కు పక్కనే చారిత్రాత్మక గండికోట ఉందని, అమెరికాలోని గ్రాండ్ క్యానియన్‌ను తలపిస్తుందని, ఈగండికోటను పర్యాటక సుందరప్రదేశం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంతో ఇవన్నీ సాకారం అవుతాయన్నారు. రాజోలు రిజర్వాయర్ కావాలంటున్నారని, రాజోలుతోపాటు అవసరమైన రిజర్వాయర్‌లన్నీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాన్ని వాటర్ గ్రిడ్‌గా మార్చేందుకు 10లక్షల ఫారంపాండ్స్ తవ్వామని, ప్రాజెక్టుల వద్ద రాత్రి వేళ నిద్రచేసి ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు. దేశంలో అత్యల్ప వర్షపాతం ఉన్న జిల్లాల్లో రెండవదిగా ఉన్న అనంతపురంను, రాష్ట్రంలోనే ఉద్యానవన పంటల్లో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దామన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణా-డెల్టాకు ఇచ్చి, శ్రీశైలం నుండి కృష్ణనీరు రాయలసీమకు తెచ్చామన్నారు. కడప జిల్లాలోని గండికోటలో 12టిఎంసీలు నీరు నిల్వవుంచేందుకు, ముంపువాసులకు పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించామన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యంగా రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరి పంట వేయవద్దని, ఉద్యానవన పంటలు వేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కుప్పం కన్నా ముందు పులివెందులకు నీరు ఇచ్చామని, తాను రాజకీయాలు ఆలోచించేవాడినైతే ఇలా చేస్తానా అంటూ సభికులను ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాలమండలం రాష్ట్రంలోని అన్ని మండలాలకన్నా, ఉద్యానవన పంటలతో అధిక ఆదాయం పొందుతోందని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలోని విమానాశ్రయం పక్కన పరిశ్రమలకు సదుపాయాలు ఉన్నాయని, అక్కడ పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. గోదావరి నీటిని సోమశిల బ్యాక్‌వాటర్‌కు తీసుకువస్తామని, అక్కడి నుండి లిఫ్టు ద్వారా జిల్లాలోని పై తట్టుప్రాంతాలకు నీటిని అందిస్తామన్నారు. అవినీతిలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని, అన్నింటినీ ఆన్‌లైన్ చేయడం ద్వారా అవినీతి తగ్గిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గండికోట ప్రాజెక్టునుండి మరో రెండు లిఫ్టులు ఏర్పాటుచేయాలని ఇక్కడి నాయకులు కోరుతున్నారని వాటిని పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఆర్‌బీసీ కాలువల నిర్మాణానికి వెనక్కుపోయిన టెండర్లను తిరిగి తెరిపించి పరిష్కారం చేస్తామన్నారు. పంచాయతీల్లో ఎల్‌ఈడీ బల్బులు ఇవ్వడం ద్వారా 30శాతం విద్యుత్ ఆదా చేశామన్నారు. ఇకముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులందరికీ విద్యుత్ ఆదా చేసే మోటార్ పంపుసెట్లు, సోలార్ సిస్టమ్ ఇస్తామన్నారు. సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అవసరమైనంత వాడుకుని, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మడం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టి కొత్తపుంతలు తొక్కిస్తామని, సాఫ్ట్‌వేర్ నిపుణులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని సీఎం అన్నారు.

రోళ్లమడుగులో అటవీ సిబ్బందిపై ఎర్ర స్మగ్లర్ల దాడి

$
0
0

రాజంపేట, డిసెంబర్ 27: కడపజిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగు అటవ ప్రాంతంలో అందిన సమాచారంతో గురువారం అటవీ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్‌లో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురై అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడగా అటవీ శాఖకు చెందిన ప్రొటెక్షన్ వాచర్స్ ఇరువురు గాయపడ్డారు. వీరిలో ఒకరిని పట్టుకుని, అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 94 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ శ్రీనివాసులు తెలిపారు. రేంజర్ కథనం మేరకు అందిన సమాచారంతో అటవీ సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తుండగా అడవి లోపలి భాగంలో అప్పటికే నరికిన ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటి ఆధారంగా ఇంకొంచెం లోపలి ప్రాంతంలోకి వెళ్లగా సుమారు 45 మంది స్మగ్లర్లు తారసపడగా వారిని చుట్టుముట్టగా వారు తమపై ఎదురుదాడి చేసి 44 మంది తప్పించుకోగా తమిళనాడుకు చెందిన కుప్పస్వామి దేవరాజ్‌ను అరెస్టు చేశామన్నారు. రవాణాకు సిద్ధంగా ఉన్న ఏ గ్రేడ్‌కు చెందిన 94 దుంగలను స్వాధీనం చేసుకుని రాజంపేట అటవీ కార్యాలయానికి తరలించామని రేంజర్ తెలిపారు. పట్టుబడిన 2905 కిలోల బరువు ఉన్న ఈ దుంగల విలువ మార్కెట్‌లో సుమారు కోటిన్నర ధర పలుకుతుంది. పరారైన స్మగ్లర్లను త్వరలో పట్టుకునేందుకు అడవిలో గాలింపుచర్యలు తీవ్రం చేశామని ఆయన చెప్పారు.


వాడివేడిగా మున్సిపల్ సమావేశం

$
0
0

అమలాపురం, డిసెంబర్ 27: అమలాపురం పట్టణ పరిధిలోని పురపాలక సంఘానికి సంబంధించిన ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్థలాన్ని ఒక వస్తద్రుకాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా మాట సహాయంతో లీజుకు ఇచ్చారని పురపాలక సభ్యులు కొందరు సమావేశంలో ధ్వజమెత్తారు. గురువారం అమలాపురం పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం నూతన చైర్మన్ యాళ్ల నాగసతీష్ అధ్యక్షతన మొట్టమొదటి సమావేశం జరిగింది. ముందుగా నూతన చైర్మన్ నాగసతీష్ కౌన్సిల్ సభ్యులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పురపాలక సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ అనుమతులు లేకుండా పురపాలక సంఘానికి సంబంధించిన స్థలాన్ని ఏవిధంగా లీజుకు ఇస్తారని అధికారులపై ధ్వజమెత్తారు. మున్సిపల్ స్థలంలో ప్రధాన రహదారి మధ్యలో ఒక వస్త్ర దుకాణానికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టుకోడానికి ఇచ్చిన అనుమతులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని అధికారులను సభ్యులు నిలదీశారు. దీంతో అధికారులు సమాధానం ఇస్తూ అధికారికంగా అనుమతులు లేవని చెప్పడంతో కౌన్సిల్ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత భవనాలను కూలగొట్టడంతో అక్కడ ఖాళీగా స్థలం ఏర్పడింది.. ఈ స్థలాన్ని పక్కనే ఉన్న ఒక వస్తద్రుకాణానికి పార్కింగ్ స్థలంగా లీజుకు ఇచ్చారు.. ఇది గత చైర్మన్ పదవీ కాలంలో ఇచ్చామని అధికారులు చెప్పడంతో దానికి సంబంధించిన పత్రాలను సభ్యులు అడిగితే వారి వద్ద సమాధానం రాకపోయేసరికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో చైర్మన్ యాళ్ల నాగసతీష్ మాట్లాడుతూ గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, ప్రస్తుతం కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తపరిచిన అంశాలన్నీంటిపైనా పూర్తిగా దర్యాప్తుచేయించి వాటిపై చర్యలు తీసుకుంటామని సభ్యులకు ఛైర్మన్ హామీ ఇచ్చారు. దీంతో పురపాలక సభ్యులు శాంతించగా సమావేశం సజావుగా సాగింది. అనంతరం ఏజెండాలో పొందుపరిచిన 95 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

మన్యాన్ని కప్పిన మంచు దుప్పటి

$
0
0

రాజవొమ్మంగి, డిసెంబర్ 27: ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో గురువారం విపరీతమైన చలితోపాటు మంచుదుప్పటి మన్యాన్ని కప్పివేసింది. తెల్లవారుజామునుండి ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడకపోడంతో వాహనచోదకులు దారి కనిపించక ఇబ్బందులు పడ్డారు. ఒంటి నిండా దుస్తులు ధరించి, స్వెటర్లు వేసుకుని తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం కొనసాగించారు. మైదాన ప్రాంతాల నుండి వచ్చే వారు మంచుతెరలను చీల్చుతూ భూమిపై పడుతున్న సూర్యకిరణాలను చూస్తూ ఆస్వాదించసాగారు. మంచుతోపాటు చలి కూడా విపరీతంగా పెరిగిపోడంతో మారుమూల గిరిజన పల్లెల్లో చలి మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మండలంలో లోతట్టున దట్టమైన అటవీ ప్రాంతం మధ్య ఉన్న వాతంగి, లోదొడ్డి, పూదూడు, పాకవెల్తి, గొబ్బిలమడుగు, చీడిపాలెం తదితర గ్రామాల్లో గిరిజనులు గణనీయంగా పడిపోయిన ఉష్టోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం అని చెప్పవచ్చు.

పర్యాటక రంగంగా తూర్పు తీరం
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల
మండపేట, డిసెంబర్ 27: పర్యాటక రంగంగా తూర్పు తీరాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. స్థానిక ధర్మగుండం చెరువు వద్ద అధునాతనంగా నిర్మించిన చంద్రబాబు ఉద్యాన వనానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. రూ.1.63 కోట్ల మున్సిపల్ సాధారణ, 14వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రణాళికాభివృద్ధి సంయుక్త నిధులతో ఈ పార్కును అభివృద్ధి చేశారు. కార్యక్రమానికి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాను కేరళ రాష్ట్రం మాదిరిగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కోరంగి మడ అడవులు, కోనసీమలో దిండి రిసార్ట్స్ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయన్నారు. వీటి తరహాలోనే గోదావరి తీర ప్రాంతాలతోపాటు కాకినాడ సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ పట్టణ ఆధునికీకరణతోపాటు డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం స్థానికంగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి యనమల పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు వి సాయికుమార్ బాబు, కమిషనర్ కెటి సుధాకర్, వైస్ ఛైర్మన్ గడి సత్యవతి, తహసీల్దార్ కెవివి సత్యనారాయణ, ఎంపీడీవో ఎ రాజు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ప్రాధాన్యతా రంగాలకు 19వేల 918కోట్ల రుణాలు

$
0
0

కాకినాడ సిటీ, డిసెంబర్ 27: 2019-20 నూతన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వివిధ ప్రాధాన్యతా రంగాలకు 19వేల 918కోట్ల రుణాల కల్పనకు వార్షిక ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో ఆధునికీకరించిన కోర్టు హాలులో గురువారం బ్యాంకర్లు, జిల్లా అధికారులతో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం కలెక్టర్ మిశ్రా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముందుగా నాబార్డు ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో వివిధ ప్రాధాన్యతా రంగాల అభివృద్ధి సామర్ధ్యాలకు అనుగుణంగా రూపొందించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్పీ) డాక్యుమెంట్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2019-20 పీఎల్‌పీలో వ్యవసాయ రంగానికి 13వేల 238కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాలకు 3వేల 698కోట్లు, ఎగుమతి రంగానికి 722కోట్లు రుణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు. అదేవిధంగా విద్యా రంగానికి 291కోట్లు, గృహనిర్మాణ రంగానికి 150కోట్లు రుణాలు బ్యాంకుల ద్వారా కల్పించేందుకు ప్రణాళికను రూపొందించామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 19వేల 918కోట్ల రుణాలను ప్రాధాన్యత రంగాలకు అందించాలని ప్రతిపాదించామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక అమలు ప్రగతిని కలెక్టర్ మిశ్రా సమీక్షిస్తూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 4వేల 230కోట్లు పంట రుణాలు కల్పించడం ద్వారా 105శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. రబీ సీజన్‌కు ఇప్పటి వరకు 902కోట్లు మేరకు రుణాలు అందించామని, ఇందులో జాయింట్ లయబులిటీ, రైతు మిత్రా గ్రూపులు, రుణ అర్హత కార్డులు, సాగు ధ్రువపత్రాల ద్వారా 2లక్షల 43వేల 192 మంది కౌలు రైతులకు 836 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. అలాగే 1786 కోట్లు టర్న్ లోన్లు, 1039కోట్లు వ్యవసాయ అనుబంధ రంగ రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ సంవత్సరం 2వేల 652కోట్లు రుణాలు కల్పించే లక్ష్యానికిగాను ఇప్పటి వరకు 1909కోట్లు రుణాలు కల్పించి 72శాతం లక్ష్యం పూర్తయిందని, ఇతర ప్రాధాన్యతా రంగాలకు 822కోట్లు రుణాలు అందించామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల మహిళలకు డీఆర్‌డీఏ, వెలుగు ద్వారా ఈసంవత్సరం ఇప్పటి వరకు 47వేల సంఘాలకు 1435కోట్లు, మెప్మా ద్వారా 10వేల 300 సంఘాలకు 198కోట్లు రుణాలు అందించామన్నారు. సంక్షేమ కార్పొరేషన్ల లబ్ధిదారులకు 2016-17 సంవత్సరానికి 220కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరానికి 275కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 22కోట్లు రుణాల పంపిణీ పూర్తయినట్లు ప్రకటించారు. మూడవ విడత పేదరికంపై గెలుపు కార్యక్రమాల ద్వారా లక్ష్యసాధనను మరింత పెంచాలని బ్యాంకర్లను ఆయన కోరారు. స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమం ద్వారా జిల్లాలో 434యూనిట్లకు 95.93కోట్లు రుణాలు, ముద్రా యోజన ద్వారా లక్షా 87వేల 600 మందికి 22కోట్ల 98లక్షల రుణాలు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు తదితర వర్గాల ఆర్థిక అభ్యున్నతికి రుణాల కల్పనలో బ్యాంకులు చూపిన చొరవ పట్ల కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మార్చి నాటికి అన్ని రంగాల్లో నిర్దేశించుకున్న వార్షిక రుణ లక్ష్యాలను పూర్తిచేసేందుకు బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ మిశ్రా కోరారు. సమావేశంలో జేసీ ఎ మల్లికార్జున, జేసీ-2 సీహెచ్ సత్తిబాబు, డీసీసీ కన్వీనర్, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం కెఎస్‌వి రామ్మోహన్, ఆర్‌బీఐ ఏజీఎం ఉషారాణి, నాబార్డు ఏజీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎల్‌డీఎం బీవీ సుబ్రహ్మణ్యం, ఎస్‌బీఐ ఆర్‌ఎం రజా రామ్మోహనరావు, సంక్షేమ కార్పొరేషన్ల ఈడీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సాంకేతిక రంగంలో వినూత్న ప్రయోగాలు రావాలి
*జేఎన్‌టీయూకే టెక్నోఫెయిర్‌ను ప్రారంభించిన కలెక్టర్ మిశ్రా
కాకినాడ సిటీ, డిసెంబర్ 27: సాంకేతక రంగంలో వినూత్నమైన ఆలోచనల ద్వారా కొత్త ప్రాజెక్టులకు నాంది పలకాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూకే ఏర్పాటై 10 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వర్సిటీలో రెండు రోజులపాటు టెక్నోఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ, కాకినాడ జేఎన్‌టీయూకే సంయుక్త ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నేషనల్ ఇనీషియేటీవ్ ఫర్ డిజైన్ ఇన్నోవేషన్ (టెక్నోఫెయిర్) కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ కార్తికేయ మిశ్రా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జేఎన్‌టీయూకే ఉత్తమమైన విశ్వవిద్యాలయంగా పేరుపొందిందని కొనియాడారు. ఇటువంటి విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు కొత్త ప్రాజెక్టుల ద్వారా నూతన ఒరవడిని సృష్టించాలని పిలుపునిచ్చారు. వర్సిటీలో విద్యార్థులకు అవసరమైన వౌలిక సదుపాయాలు, ఉత్తమ అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ వనరులను విద్యార్థులు వినియోగించుకుని పరిశోధనలవైపు తమ దృష్టిని కేంద్రీకరించాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టులను కేవలం విద్యాపరమైన అర్హత పొందడానికి కాకుండా తమ ప్రాజెక్టుల ద్వారా సమాజానికి మేలు జరిగే విధంగా కొత్తదనం ఉండాలని చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న టెక్నాలజీ ల్యాబ్‌లలో కూడా మార్పులు తీసుకురావాల్సి ఉందని, కొనే్నళ్ల క్రితం ఏర్పాటైన ఈ ల్యాబ్‌లలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరమైన సదుపాయాలను కల్పించాలని యూనివర్సిటీ అధికారులను కోరారు. కాకినాడలో ఫెబ్‌ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మిశ్రా ఉపకులపతి రామలింగరాజుకు సూచించారు. దీని ద్వారా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనలు జరపడానికి వీలవుతుందన్నారు. ఈసందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ రామలింగరాజు మాట్లాడుతూ 1947వ సంవత్సరంలో కాకినాడలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటుచేశారని, అనంతరం 1972లో జేఎన్‌టీయూ యూనివర్శిటీకి అనుబంధ కళాశాలగా ఏర్పాటై 2018లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో యూనివర్సిటీగా ఏర్పాటైందని తెలియజేశారు. గత పదేళ్ల కాలంలో వర్సిటీ ఎంతగానో అభివృద్ధిని సాధించిందని, ఇదే కళాశాలలో చదువుకున్న తాను అధ్యాపకునిగా, ప్రొఫెసర్‌గా, డైరెక్టర్‌గా, ఉపకులపతిగా పనిచేసి తన హయాంలోనే పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలో విస్తరించిన జేఎన్‌టీయూకే నేడు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తోందని, వర్సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నట్లు ఉపకులపతి రామలింగరాజు వివరించారు. ఈసందర్భంగా విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు, ప్రొఫెసర్లు ఎ గోపాలకృష్ణ, ఐ శాంతిప్రభ, వి రవీంద్రనాథ్, పలువురు అధ్యాపకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రత్యేక అభివృద్ధి నిధులపై పోరాటం

$
0
0

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 27: ప్రత్యేక అభివృద్ధి నిధులను ఓడిన ఎమ్మెల్యే పేరిట కేటాయించడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేయకపోవడంపై న్యాయపోరాటం చేయనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ధ్వజమెత్తారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఓడిన అభ్యర్థులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏ విధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికోసం తనకు మూడేళ్లపాటు నిధులు ఇచ్చారన్నారు. అయితే తదుపరి నిధులు రాకపోవడంపై సీఎం కార్యాలయాన్ని సంప్రదించగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వొద్దని సీఎం చెప్పారని తెలిపారన్నారు. కొద్ది రోజులుగా కొన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేదని, అక్కడ ఓడిపోయిన దేశం అభ్యర్థుల పేరిట అభివృద్ధి నిధులు కేటాయిస్తున్న విషయాలు ఆధారాలతో తెలిశాయన్నారు. ఈ విషయంలో కొన్ని ఆధారాలు సేకరించామని, మరిన్ని జీవోలు ఆధారాలను సేకరించి వెంటనే న్యాయపోరాటం చేసేందుకు చర్యలు తీసుకుంటానని మాణిక్యాలరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంపీలు అందరికీ ఏటా రూ. 5 కోట్ల వంతున నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తోందన్నారు. ఈ విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేదన్నారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.
380 మందికి పట్టాలు ఇస్తామనడం ఖండనీయం
ఇటీవల కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు విమానాశ్రయ భూముల్లో అర్హులైన 380 మందికి పట్టాలు ఇస్తానని చెప్పడం ఖండనీయమని ఎమ్మెల్యే మాణిక్యాలరావు ఆక్షేపించారు. తాడేపల్లిగూడెం అభివృద్ధి నిమిత్తం ఇచ్చిన హామీల్లో 56 హామీలను ముఖ్యమంత్రి, సంబంధిత శాఖలు అమలు చేయకపోవడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ, గల్ఫ్ సేవాసమితి అధ్యక్షులు గట్టిం మాణిక్యారలావ, కర్రి బాలాజీ, కర్రి సీతారామయ్య, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వ్యవస్థాపకుడు చింతబొల్లి వెంకటాచారి, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సాయిశ్రీ, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పౌర సరఫరాల గోదాములో విజిలెన్స్ తనిఖీలు
గోపాలపురం, డిసెంబర్ 27: విజిలెన్స్ జిల్లా ఎస్పీ బి అచ్యుతరావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం స్థానిక పౌర సరఫరాల సంస్థ గోదాములో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. బియ్యం, పంచదార, కందిపప్పు నిల్వలపై ఆరా తీశారు. 96 కిలోలు బియ్యం వ్యత్యాసమున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అలాగే 26 బస్తాల బియ్యం వసతిగృహాలకు వెళ్లకుండా చౌక దుకాణాలకు వెళ్లడంపట్ల గోడౌన్ ఇన్‌ఛార్జి కనకదుర్గను వివరణ అడిగారు. అలాగే చంద్రన్న కానుకల్లో కొలతలు సరిగా లేవని ప్రశ్నించారు. ఇక్కడ సేకరించిన సమాచారంపై నివేదికను ఉన్నతాధికార్లకు పంపిస్తామని విజిలెన్స్ సీఐ నాగేశ్వరావు తెలిపారు.

బడిలో పిల్లల వివరాలు తెలియజేయండి

$
0
0

ఏలూరు, డిసెంబర్ 27: జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి, తిరిగి పాఠశాలల్లో చేర్పించిన 2,642 మంది పిల్లలను ఏయే పాఠశాలల్లో చేర్పించారో వారి వివరాలను అందించాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం విద్యారంగ ప్రగతి తీరును విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 11,132 మంది బడి ఈడు పిల్లలు బడి బయట ఉన్నట్టు గుర్తించి, వారిలో 8,490 మందిని రిజిస్టర్ చేశారన్నారు. మరో 2,642 మంది పిల్లలకు అవసరమైన బోధన అందించి ఏయే పాఠశాలల్లో, ఏయే తేదీల్లో చేరిన వివరాలను వచ్చే వారంలోగా అందజేయాలన్నారు. అదేవిధంగా 8,490 మంది పిల్లల్లో వాస్తవంగా 8,213 మంది మాత్రమే రిజిస్టర్ అయినట్టు కనపడుతోందని, మిగిలిన 277 మంది ఎక్కడ ఉన్నట్టు అని ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం నవౌదైన పిల్లల రోజువారి హాజరు వారం నివేదికను వచ్చే వారం సమర్పించాలన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాథమిక పాఠశాలకు వంట ఖర్చులు కింద నవంబరు నెలకు రూ.52 లక్షలు, అప్పర్ ప్రైమీ స్కూలుకు అక్టోబర్, నవంబరు నెలకు రూ.97 లక్షలు, వంట చేసే కార్మికులకు, సహాయకులకు నవంబరు నెలలో రూ.62 లక్షలు చెల్లింపులు వెంటనే అయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఈవోని కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకానికి తప్పనిసరిగా వంట గ్యాస్‌నే వినియోగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేసే కోడిగుడ్లు వివరాలను సంబంధిత యాప్‌లో సరిపోల్చి చూసుకోవాలన్నారు. జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా ఉపాధి హామీ అనుసంధానం చేసి, ఆటస్థలాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నప్పటికీ ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఉపాధి హామీతో జిల్లాలోని అన్ని శాఖలు అనుసంధానం చేసుకుని పనులు పూర్తి చేసుకుంటుంటే విద్యాశాఖకు ఏమైందన్నారు. జిల్లాలో 430 పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధికి మంజూరు ఇవ్వగా ఇంకా 87 పనులు ప్రారంభించకపోవడంతోపాటు ఇంతవరకూ కేవలం 49 పూర్తిచేసి, మరో 294 ప్రగతిలో ఉన్నాయనడం భావ్యం కాదన్నారు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి చొరవ పాలన్నారు. పాఠశాలల్లో పిల్లలకు ఉపయోగపడేలా వేదిక, ఆటస్థలాలు ఏర్పాటు చేసుకోమంటే జాప్యం ఎందుకని ప్రశ్నించారు. జిల్లాలో డిజిటల్ క్లాస్ రూమ్‌లు సంబంధించి వచ్చే వారం నాటికి 56 పాఠశాలల్లో ప్రారంభం కావాలన్నారు. 698 పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో 326 పాఠశాలల్లో డిసెంబర్ నెలాఖరు నాటికి వర్చువల్ క్లాస్ రూమ్‌లు ప్రారంభం కావాల్సిందేనని, ఇందులో ఇంకా 190 పాఠశాలలకు రావాల్సిన పరికరాలను నెలాఖరు నాటికి రప్పించాలని, లేనిపక్షంలో డీఈవో బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వేదికలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ సబ్జక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహించగా ఇంకా 56 మంది పిల్లలు బిసి గ్రేడ్‌లో ఉన్నారని, వారికి తిరిగి శుక్రవారం నుండి మరోమారు రెమిడియల్ తరగతులు మూడు నెలలపాటు నిర్వహించాలన్నారు. సంకల్పం కింద పాఠశాలల్లో వివిధ వౌలిక సదుపాయాల కోసం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉందని, వెంటనే వాటి చెల్లింపులు జరిగిలే చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నెలసరి జీతాలను నిలుపుదల చేసి వాటిని మళ్లించడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో కేవలం పాఠ్యాంశానికే ప్రాధాన్యతను ఇవ్వడం కాకుండా పిల్లల ప్రవర్తన కూడా గమనించాలన్నారు. ఉపాధ్యాయుల ప్రవర్తన తీరుపైనే పిల్లల క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలు ఆధారపడి ఉంటాయన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో వౌలిక వసతులు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ ఏమైనా లోపాలుంహటే గుర్తించి తెలియజేసేందుకు పలువురు అధికారులను పాఠశాలల తనిఖీకి పంపడం జరిగిందన్నారు. అయితే ఆయా పాఠశాలల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 443 పాఠశాలల్లో రూ.39,40 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాల్లో ఇంతవరకు నాలుగు మాత్రమే పూర్తి చేశారని, వచ్చే వారం నాటికి 50 పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఈవో సివి రేణుక, సర్వశిక్షా అభియాన్ పీవో బ్రహ్మానందరెడ్డి, డిఎఫ్‌వో శ్రీనివాసరావు, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

పామాయిల్ రైతులకు న్యాయం జరగాలి

$
0
0

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 27: జిల్లాలోని ఏజన్సీ, మెట్ట ప్రాంతాల్లో విరివిగా పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు న్యాయం జరగాలని, అందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు భారత పామాయిల్ పరిశోధన సంస్థ కృషిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల పెదవేగిలోని భారత పామాయిల్ పరిశోధనా సంస్థ యాజమాన్య కమిటీ మెంబర్‌గా నియమితులైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్జుల మురళీకృష్ణ అభినందన సభ గురువారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తుల్లిమిల్లి కుటుంబరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అర్జుల మురళీకృష్ణ తన చిరకాల మిత్రుడని, పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందనడానికి నిదర్శనం మురళి అని అన్నారు. గత 30 సంవత్సరాలుగా పార్టీకోసం కృషిచేస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో పామాయిల్ అధికంగా పండిస్తున్నారని, ఈ ప్రాంతానికి చెందిన అర్జుల మురళీకృష్ణకు పరిశోధనా సంస్థలో బాధ్యతలు అప్పగించడం వల్ల రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులకు ఉత్పత్తి వ్యయాన్ని బట్టి గిట్టుబాటు ధరలు లభించాలని, అంతేగాకుండా పరిశోధనా సంస్థ నుండి అధిక దిగుబడులనిచ్చే నూతన వంగడాల ఆవిష్కరణలు జరగాలని, అందుకోసం మురళీకృష్ణ కృషిచేయాలన్నారు. కేంద్ర పొగాకు బోర్డు వైస్ ఛైర్మన్ గెడ్డమణుగు సత్యనారాయణ మాట్లాడుతూ పామాయిల్ రైతుల కోసం పెదవేగిలో ఏర్పడిన కేంద్ర పామాయిల్ పరిశోధనా సంస్థ నుండి ఇప్పటి వరకు ఒక్క నూతన వంగడం రాలేదని, రైతులకు పరిశోధనా సంస్థ ద్వారా మేలు జరిగేందుకు యాజమాన్య కమిటీ మెంబర్లు కృషి చేయాలని కోరారు. అనంతరం అర్జుల మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మల్లాది సీతారామారావు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొప్పాక శ్రీనివాసరావు, రూరల్ మండల అధ్యక్షుడు పారేపల్లి వీరవెంకట సత్యనారాయణ, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ మొడియం శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కురెళ్ళ సుధాకర్ కృష్ణ, నార్ని తాతాజీ, రాష్ట్ర ఒబిసి మోర్చా ఉపాధ్యక్షుడు మోడేపల్లి నాగు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, కంచుమర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జనవరి 2 నుండి జన్మభూమి - మావూరు

$
0
0

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 27: జనవరి 2 నుండి 11వ తేదీ వరకు జరిగే జన్మభూమి - మావూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత అధికారులకు సూచించారు. గురువారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, రూరల్ మండల స్థాయి అధికారులు, పార్టీ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశంలో జన్మభూమి - మావూరు విజయవంతం చేసేందుకు దిశానిర్దేశన చేసినట్టు సుజాత ఇక్కడ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మండలాల షెడ్టూల్స్, మున్సిపల్ పరిధిలో వేసిన షెడ్యూళ్లను అధికారులు ఎమ్మెల్యేకు అందజేశారు. ఇప్పటికి జరిగిన నాలుగు విడతల జన్మభూమిలో 90 శాతం వరకు ప్రజల సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు. అర్హత కలిగిన ప్రజలు రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహనిర్మాణం, అర్బన్ హౌసింగ్‌లో అపార్ట్‌మెంట్ల కోసం, వృద్ధాప్య, వితంతు, విభిన్న ప్రతిభావంతుల పింఛన్ల కోసం ఈ జన్మభూమిలో దరఖాస్తు చేసుకోవాలని, వీటిలో కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.


అర్బన్ హౌసింగ్ గృహాల అవకతవకలపై కౌన్సిల్‌లో వాడి వేడి చర్చ

$
0
0

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 27: అర్బన్ హౌసింగ్ గృహాల ఎంపికలో జరిగిన సమస్యలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాడి వేడిగా చర్చ జరిగింది. గురువారం ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. అర్బన్ హౌసింగ్‌లో ఎంపికైన కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక అభ్యంతరాలు, ప్రజాసాధికారిక సర్వే పేరుతో అర్హులను అనర్హులుగా ప్రకటించడంపై మున్సిపల్ కౌన్సిలర్లు గొర్రెల శ్రీ్ధర్, ఎన్.వి.సత్యనారాయణ, పల్లి విక్రమ్, కొల్లి రమావతి, పడాల సత్యవాణి తదితరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ హౌసింగ్ మొదటి ఫేజ్‌లో గృహాలు మంజూరైన వారు డీడీలు చెల్లించగా సాంకేతిక లోపాల పేరుతో ఇళ్లు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఎన్టీఆర్ గృహాలు, అర్బన్ హౌసింగ్‌లో ఫ్లాట్లు రాకపోవడంతో రెండింటికి చెడ్డ రేవడిగా పేదల పరిస్థితి ఉందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించే దిశగా మున్సిపాల్టీ కృషిచేస్తుందన్నారు. జన్మభూమి నాటికి సమస్య పరిష్కరించాలని కమిషనర్‌ను ఆదేశించారు. సాంకేతిక లోపం కారణంగా ఇళ్లు మంజూరు కాని 74 మందికి ఇల్లు ఇప్పించాలన్నారు. కౌన్సిలర్లు పట్నాల రాంపండు, ఎన్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వయసు ఎక్కువగా ఉన్నవారికి బ్యాంకు రుణాలు అందించడం లేదని పేర్కొన్నారు. 16వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపాల్టీలో 16వ వార్డులో వౌలిక సమస్యలు పరిష్కరించడంపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో నాన్ లే అవుట్లు అధికారుల అసమర్థతతోనే జరుగుతున్నాయని వైస్ ఛైర్మన్ కిల్లాడి ప్రసాద్ పేర్కొన్నారు. దీనిపై ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అనధికార లే అవుట్లపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి.బాలస్వామి, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్.సంగీతరావు, ఎంఈ వెంకట్రావు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

పొగాకుకు పూర్వ వైభవం తేవాలి

$
0
0

దేవరపల్లి, డిసెంబర్ 27: పురుగు మందులు, రసాయనికి ఎరువుల అవశేషాల్లేని నాణ్యమైన పొగాకును ఉత్పత్తిచేసి పొగాకు పంటకు పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రైతులపైనే ఉందని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి ఎం హనుమంతురావు రైతులకు పిలుపునిచ్చారు. మండలంలోని బందపురంలో గురువారం పొగాకు బోర్డు ఆధ్వర్యంలో పొగాకు పంట రెలుపు, క్యూరింగ్, గ్రేడింగ్ తదితర అంశాలపై ఉత్తమ యాజమాన్య పద్ధతులను గూర్చి రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన హనుమంతురావు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేస్తేనే ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు విదేశీ పొగాకుకు ధీటుగా ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులు పొగాకులో జిడ్డు మందును సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వినియోగించాలని సూచించారు. రైతుల కోరిక మేరకు జిడ్డు మందును 10 లీటర్ల నుంచి 15 లీటర్లకు పెంచి ఇచ్చేందుకు తాము నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జిడ్డు మందును రెండు దఫాలుగా వాడాలని, ఈ మందును వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండి సుథాలి (సాప్) అనే మందును కలపవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. నవంబర్ నెలలో వేసిన పొగాకు తోటల్లో అక్కడక్కడా పచ్చ పురుగు ఆశించినట్టు తాము గమనించామని, దానిని నివారించేందుకు వేప గింజల కషాయాన్ని చల్లి నివారించుకోవచ్చునన్నారు. ప్రస్తుతం పొగాకు బోర్డు కార్యాలయంలో పసుపు రంగు జిగురు కార్డులు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులు తీసుకు వెళ్లవచ్చునన్నారు. అవసరం మేరకే తడులు పెట్టుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఐపీసీ ఏరియా మేనేజర్ ప్రశాంత్ కుమార్ జోషీ మాట్లాడుతూ పొగాకులో తెగులు మందుల అవశేషాలు నిర్మూలించాలని ఆయన రైతులను కోరారు. పొగాకు తోటలపై బావిష్టన్, స్సాప్ కలుపు మందులు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని కోరారు. పొగాకు తోటలపై పొటాషియం సల్ఫేట్ ఎరువును ఎకరాకు ఒక కేజీ పిచికారీ చేయాల్సిందిగా సూచించారు. కొన్ని పొగాకు తోటల్లో ఆకులపై చుక్కలు ఏర్పడుతున్నాయని, ఈ చుక్కలను చూసి రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదని, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ చుక్కలు ఉండవన్నారు. భూమిలో మొక్క మొదళ్లలో 25 కేజీల నుంచి 30 కేజీల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వేయాలని ఆయన రైతులను కోరారు. తొలుత బందపురంలో పొగాకు తోటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. సమావేశంలో పిఎస్‌ఎస్ కంపెనీ ప్రతినిధి సీతారామరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రాఘవేంద్రరావు, రైతు నేతలు కె రాంబాబు, కె గాంధీ, కంపెనీ ప్రతినిధులు గౌరీ శంకర్, దుర్గాసాయి తదితరులు పాల్గొన్నారు.

భీమవరం ఏఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది

$
0
0

భీమవరం, డిసెంబర్ 27: మరోసారి పదవీకాలం పొడిగింపు చేస్తోందని భావించిన భీమవరం ఏఎంసీ పాలక వర్గానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఇక మరోసారి ఈ బోర్డును కొనసాగింపు చేసేందుకు వీలు లేదంటూనే పర్సన్ ఇన్‌చార్జిని నియమించేసింది. ప్రస్తుతం పర్సన్ ఇన్‌చార్జిగా అంటే ఛైర్మన్‌గా రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సి.రామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. 2016 డిసెంబర్ 12వ తేదీన ఏడాది పాటు ఈ ఏఎంసీకి ఛైర్మన్‌గా కోళ్ల నాగేశ్వరరావుతో పాటు 19 మంది సభ్యులతో కూడిన పాలకమండలి బాధ్యతలు చేపట్టింది. అనంతరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తన స్నేహితుడు ఎఎస్ రాజుకు ఇచ్చిన ప్రాధాన్యత మాదిరిగా మరో ఆరు మాసాలు పాలక మండలిని పొడిగించారు. ఆ తర్వాత మరో ఆరు మాసాలు పొడిగించారు. మొత్తం రెండేళ్లలో మూడుసార్లు ఈ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఈ నెల 12వ తేదీతో పదవీ విరమణ చేసింది. మరోసారి పాలక మండలికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్‌జెడీ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి కూడా ఖాళీగానే ఉంది.

మున్సిపల్ బడ్జెట్ అదరహో
*కొత్త పాలకవర్గానికి మిగులు నిధులు *కమిషనర్ నాగనరసింహరావుకు అభినందనలు
భీమవరం, డిసెంబర్ 27: భీమవరం మున్సిపల్ బడ్జెట్ అదరహో అంటూ అధికార పక్ష కౌన్సిలర్లను మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగనరసింహరావు కొనియాడారు. ఈ బడ్జెట్ వల్ల రానున్న కాలంలో అధికారం చేపట్టే వారు మంచి పనులు చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. గురువారం భీమవరం మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను-జనరల్ ఫండ్స్ అంచనాలను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను పరిశీలించిన ప్రతిపక్షం నుంచి మిశ్రమ స్పందనే లభించింది. బడ్జెట్‌పై అవగాహన కలిగిన సీనియర్ కౌన్సిలర్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, మెంటే గోపి, నౌషాద్ తదితర కౌన్సిలర్లు కమిషనర్ సిహెచ్.నాగనరసింహరావును, అకౌంట్ అధికారి జి.తిరుపతి నాయుడులను అభినందించారు. అలాగే బడ్జెట్‌లో అవగాహన కోసం అకౌంట్ అధికారి తిరుపతి నాయుడు స్వయంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణతో పాటు అవగాహన కల్పించారు. 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ను సాధారణ, కాపిటల్ జమలు కలిపి ప్రారంభ నిల్వగా రూ.58,68,92,300లుగా తీసుకుని సాధారణ మూలధనాలను ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని రూ.86,93,57,100లను జమ అంచనాలుగా తీసుకుని రూ.140,06,58,800 ఖర్చులను అంచనా వేయగా రూ.3,05,90,600లను నిల్వతో ముగించారు. ఇక 14వ ఆర్థిక సంఘం నిధులను రివైజ్డ్ బడ్జెట్ రూ.655 లక్షలు, 2019-20 బడ్జెట్‌లో రూ.885 లక్షలు విడుదల కాగలవని చూపించారు. సిఫ్ గ్రాంట్ 2018-19లో రూ.700 లక్షలు కాగా 2019-20లో రూ.1400 లక్షలు విడుదలకు అంచనాలు సిద్ధం చేసుకున్నారు. మోడరన్ ఫిష్ మార్కెట్‌కు రూ.100 లక్షలు ప్రావిజన్‌గా చూపించారు. అమృత్ గ్రాంట్ 2019-20కి రూ.44.72 లక్షల ప్రావిజన్‌ను చూపించారు. పట్టణంలోని స్లమ్ ఏరియాల అభివృద్ధికి 40 శాతంగాను అంటే రూ.220.45 లక్షలు, షెడ్యూలు కులాలు నివశించే ప్రాంతాల అభివృద్ధికి 15 శాతం రూ.310.65 లక్షలు షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధికి 7.5 శాతం రూ.155.32 లక్షలు, స్ర్తి శిశు సంక్షేమ కార్యక్రమాలకు రూ.103.55 లక్షలు కేటాయించారు. రానున్న రోజుల్లో నిల్వ బడ్జెట్ వల్ల మరింత అభివృద్ధి జరుగుతుందని చైర్మన్ గోవిందరావు చెప్పారు.

ముందు స్లాట్ బుక్ చేసుకుంటేనే థీమ్ పార్కు సందర్శన

$
0
0

హైదరాబాద్: మహానగరంలో నీటి పొదుపు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 51లో జలమండలి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థీమ్ పార్కును తిలకించాలంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవల్సిందేనని జలమండలి అధికారులు తెలిపారు. పార్కును చూసేందుకు ఆసక్తి గల విద్యార్థులు, ఇతరులు 10 మందికి తగ్గకుండా, 50 మందికి పెరగకుండా ఒక బ్యాచ్‌గా జలం జీవం తెలంగాణ వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. స్లాట్ బుక్ చేసుకునే వారికి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం పనె్నండు గంటల వలరకు, అలాగే మధ్యాహ్నాం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ధీమ్ పార్కును సందర్శించే అవకాశం ఉంటుందని తెలిపారు. సోమవారం, అన్ని సెలవు రోజుల్లో ప్రతిరోజు ఈ పార్కు తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. ముందుగా స్లాట్ బుక్ చేసుకున్నవారు ఎలాంటి రుసుము లేకుండానే ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313, జలమండలి, ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి సత్యనారాయణను సెల్ నెంబర్ 9989985102లో సంప్రదించవచ్చునని తెలిపారు. పార్కులో నీటి పొదుపు గురించి చాటిచెప్పే ఎన్నో రకాల నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన
కాచిగూడ, డిసెంబర్ 27: బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘రంగ్‌మేళ’ కార్యక్రమం గురువార రవీంద్ర భారతిలోని ఘంటసాల ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సంస్థ అధ్యక్షుడు విక్కి మాస్టర్ పాల్గొని కళాకారులను అభినందించి సత్కారించారు. కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అక్రమ నిర్మాణాల కూల్చివేత

$
0
0

కీసర, డిసెంబర్ 27: నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను గురువారం పంచాయతీ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చి వేసారు. పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గుర్తించిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. రాంపల్లి వెళ్లే ప్రధాన రోడ్డుకు నిబంధలనకు విరుద్ధంగా నిర్మించిన ఆరు నిర్మాణాలను పాక్షికంగా తొలగించారు. సర్వే నెంబర్ 184, సర్వే 153 లలో వెలిసిన నిర్మాణాలను పాక్షికంగా కూల్చి వేసారు. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని, ఎల్‌ఆర్‌ఎస్ అనుమతులు ఉన్న వారు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. త్వరలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న సెల్లార్, బహుళ అంతస్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సహించేది లేదని, అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో రాంరెడ్డి, బాల మల్లేశ్, భిక్షపతి పాల్గొన్నారు.

ఫుడ్ డెలివరీ బాయ్‌పై ఆకతాయిల దాడి
ఉప్పల్, డిసెంబర్ 27: బోడుప్పల్ సాయినగర్ బృందావన్ కాలనీలో నివసిస్తున్న జీ.కృష్ణారెడ్డి (28) జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఆర్డర్ ప్రకారం ఫుడ్ తీసుకొని వెళ్తుండగా బాలాజీనగర్‌లో ఆకతాయిళ్లు అడ్డుకుని బలవంతంగా ఫుడ్ లాక్కున్నారు. డబ్బులు అడిగితే తిట్టి దాడి చేశారని అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మేడిపల్లి పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించారు. వీరిలో చంటి, రాకేష్, సాయి, ప్రశాంత్, రాజశేఖర్‌లు ఉన్నారని, పరారీలో ఉన్న వీరిపై కేసు నమోదు చేసి పట్టుకోవడానికి గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అంజి రెడ్డి తెలిపారు.

Viewing all 69482 articles
Browse latest View live