Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పైశాచిక ‘శిక్ష’ణ..

$
0
0

పాఠశాలలు పిల్లలకు శిక్షణనిచ్చే సంస్కార స్వరూపాలు- అన్నది పాతమాట! పాఠశాలలు పిల్లలను శిక్షించే అమానవీయ వాణిజ్య కేంద్రాలుగా మారి ఉండడం నడచిపోతున్న చరిత్ర. బుద్ధి పెరిగిన అయ్యవార్లకు, పంతులమ్మలకు, పాఠశాలల నిర్వాహకులకు, యజమానులకు హృదయం తరిగిపోవడం చిన్నపిల్లలు అమానుష శిక్షలు అనుభవిస్తుండడానికి ఏకైక కారణం.. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ‘చైతన్య భారతి పాఠశాల’ అన్న వ్యాపార విద్యా కేంద్రం ప్రాంగణంలో చిన్నపిల్లలను బట్టలూడదీసి ఎండలో నిలబెట్టడం ఈ అమానవీయ ప్రహసనంలో వర్తమాన ఘట్టం! ఈ పిల్లలు చేసిన నేరం పాఠశాలకు ఆలస్యంగా రావడం! బడిపిల్లలు ప్రధానంగా ఊహ సరిగా తెలియని ప్రాథమిక విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా వెడుతుండడానికి కారణం వారు కాదు. అందువల్ల ఆలస్యానికి పిల్లలను శిక్షించడం వౌలికమైన వైపరీత్యం. పాఠశాలలో అల్లరి చేసిన వారిని, తోటి పిల్లలను కొట్టిన వారిని, గిచ్చిన వారిని, గిల్లిన వారిని పంతుళ్లు, పంతులమ్మలు దండించవచ్చు. ఇలాంటివారిని సైతం తప్పునకు అనుగుణంగా మాత్రమే దండించాలి. కానీ కొందరు ఉపాధ్యాయులు ప్రధానంగా పంతులమ్మలు ఇలా దండించడంలో ‘కసి’ని ప్రదర్శిస్తుండడం దేశమంతటా ఆవిష్కృతమవుతున్న వికృత దృశ్యం. చిన్న చిన్న తప్పులు చేసిన పిల్లలను వాతలు తేలేలాగ, రక్తం ఉబికేలాగ, కండెలు కట్టేలాగ అయ్యవార్లు కొట్టిన ఘటనలు గతంలో ఎన్నో ప్రచారమయ్యాయి. బల్లఎక్కి దూకిన నేరానికి ‘కాలాంశం’- పీరియడ్- పూర్తయ్యేవరకు ‘నేరస్థుడి’ని, ‘నేరస్థురాలి’ని బల్లపైన నిలబెట్టడం అమానవీయ శిక్ష! ఐదు, పది నిముషాలు నిలబెట్టి కూచోమని చెప్పవచ్చు! ‘బల్లఎక్కి దూకిన’ అభియోగానికి పసిపాపను రోజంతా పాఠశాల ప్రాంగణంలో నిలబెట్టి ప్రదర్శించే పంతుళ్లను, పంతులమ్మలను ఏమని పిలవాలి? పాఠశాల ప్రాంగణంలో తెలుగు భాషను మాట్లాడిన నేరానికి ‘ఐ డోంట్ స్పీక్ తెలుగూ’- నేను తెలుగులో మాట్లాడను- అని వందసార్లు, రెండు వందలసార్లు వ్రాయించడం ఆంగ్ల మాధ్యమ బడిలో అమలు జరిగిన శిక్ష.. సరికొత్తగా ఇలా తెలుగులో మాట్లాడడం మానుకోలేని వారికి చిత్ర విచిత్ర శిక్షలను అమలు జరుపుతున్నారు. ‘ఐ డోంట్ స్పీక్ తెలుగూ’ అన్న ప్రకటన వ్రాసిన ‘బల్ల’ను పట్టుకొని ‘నేరస్థులు’ వ్యాపార విద్యా ప్రాంగణాలలో నిలబడుతున్నారు. సందు దొరికితే చాలు శిక్షించాలన్న ‘పైశాచికానంద’- శాడిస్ట్ శాటిస్‌ఫాక్షన్- ప్రవృత్తి పెరిగిన వారు అయ్యవార్లుగా, అయ్యవారమ్మలుగా చెలామణి అవుతుండడం ఈ ‘శిక్ష’లకు కారణం.. మంచివారు లేరని కాదు, మహనీయులు లేరని కాదు.. వారి సంఖ్య తక్కువైపోయింది...
ఇలా బోధకులు పైశాచిక ఆనంద స్వభావులు- శాడిస్ట్‌లు-గా మారిపోతుండడానికి కారణం కూడ విద్యా విధానమే! సౌశీల్యం నేర్పని, సంస్కారం మప్పని, విజ్ఞానం నిండిన తలవారు- విద్యాధికులుగా ఉద్యోగులుగా అధికారులుగా రాజకీయ వేత్తలుగా న్యాయమూర్తులుగా ప్రముఖులుగా చెలామణి అవుతున్నారు. ఈ ప్రభావం విద్యారంగంలో పనిచేస్తున్నవారి స్వభావాన్ని సైతం వికృత పరుస్తోంది. అయ్యవార్లు, అయ్యవారమ్మలు తమ విద్యార్థులను కన్న కొడుకుల వలె, కన్న కూతుళ్ల వలె సంభావించాలన్నది విద్యా పద్ధతికి సంబంధించిన వౌలికమైన సంస్కారం. ఈ వౌలికమైన సంస్కారం మిగిలిన సంస్కారాలు అంకురించి పల్లవించి పుష్పించి పరిమళించడానికి భూమిక. మాతృ మమకారం మాతృదేశం పట్ల మమకారంగా పరిణతి చెందడం భారతీయ విద్య. మాతృ దేశం పట్ల మమకారానికి విస్తృతి విశ్వహితం- ‘వసుధైవ కుటుంబ’ జీవన వాస్తవం.

పాలుతాగు పసిపాపకు
పలుకు నేర్పె సంస్కారం,
పురుషుని పురుషోత్తమునిగ
తీర్చిదిద్దే సంస్కారం,
తరతరాల భారతీయ
వరమైనది సంస్కారం...
సంస్కార సమాహారం
మన జాతికి అస్తిత్వం!
ఈ సంస్కార సమాహారం విదేశీయుల దురాక్రమణ ఫలితంగా, విదేశీయుల బీభత్స పాలన ఫలితంగా వికృతమైపోయింది. ఈ ‘్భమిక’ బీటలు పారిపోయింది. ఇంటికి ప్రతినిధిగా ‘బడి’, తల్లిదండ్రులకు ప్రతిబింబాలుగా అధ్యాపకులు అలరారక పోవడానికి విద్యా స్వరూప స్వభావాలు ఇలా వికృతం కావడం కారణం! అందువల్ల పుంగనూరులోని ఆ విద్యాలయంలో ఇలా బాలలపై బీభత్సం విరుచుకొని పడింది!
పుంగనూరులోని ‘చైతన్య భారతి’ పాఠశాలలో మూడవ తరగతి, నాలుగవ తరగతి చదువుతున్న పిల్లలు ఆలస్యంగా వచ్చారట! ఇందుకు కారణం తల్లిదండ్రులు వారిని సకాలంలో సంసిద్ధం చేసి బడికి పంపకపోవడం కావచ్చు.. పాఠశాల ప్రధాన అధ్యాపకుడు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉత్తరం వ్రాసి ఉండాలి. పిల్లలను హింసించడం అర్థం లేని చర్య. పిల్లలను బడికి తీసుకొని వచ్చే రిక్షాల వారు, ఆటోరిక్షాల వారు, బస్సుల వారు కూడ ఆలస్యం చేసి ఉండవచ్చు. కానీ ‘చేయని నేరానికి’ ఆరుగురు బుడతలను- బట్టలన్నీ ఒలిచేసి కేవలం లంగోటాల- గోచీల-తో బడి ప్రాంగణంలో నిలబెట్టాలన్న విచిత్ర వికృత మనః ప్రవృత్తి పాఠశాల నిర్వాహకులకు- అధ్యాపకులకు- ఏర్పడడం దశాబ్దుల విద్యా విధాన వైఫల్యం... అంతర్గతంగా నిహితమై ఉన్న సౌశీల్య రాహిత్య బోధన... ఈ సౌశీల్య రాహిత్యం అన్ని ఇతర రంగాలను మాత్రమే కాక విద్యారంగాన్ని ముంచెత్తడం నిరాకరించజాలని నిజం! 1970లో జరిగిన ఒక వి‘చిత్ర’ సంఘటన గురించి 1990వ దశకంలో ఎవరో వెల్లడించారు. ఒక ప్రముఖ నటీమణి తాను నటిస్తున్న చిత్రంలో బాల వేషానికి తమ బంధువుల పాపను సిఫార్సు చేసిందట. కానీ నిర్మాతలు వేరే అమ్మాయిని ఎంచుకున్నారట! అభినయ సమయంలో బాలనటి చెంపపై ప్రౌఢనటి కొట్టాలట! తన బంధువుల అమ్మాయికి అవకాశం రాలేదన్న కసితో రగిలిపోతున్న ఆ ప్రముఖనటి ఆ చిట్టిపాప చెంప కందిపోయేలా ఛెల్లుమనిపించిందట! ఆ బాలనటికి జ్వరం వచ్చేసింది. ‘ఆ బాలనటి నా చెల్లెలు అయి ఉంటే నేను ఊరుకునే వాడిని కాదు..’ అని ఒక సహాయకుడు బహిరంగంగా వ్యాఖ్యానించాడట! భాగ్యనగరంలో ఒక పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ వెళ్లి ఫిర్యాదు చేసింది. అద్దెకున్న తనను ఇల్లుగల గయ్యాళి యజమానురాలు తనను ఒళ్లంతా బరికి గాయపరిచిందన్నది ఆమె ఫిర్యాదు. పోలీసు ఠాణా అధికారులు నిందితురాలి వద్ద, బాధితురాలి వద్ద సమానంగా లంచం దండుకొని ఇద్దరినీ తిట్టి పంపించేశారట! ఇతర రంగాలలోని ఈ పైశాచిక ఆనంద చిత్తవృత్తికి వారు విద్య నేర్చుకొన్న తీరు కారణం. ఓ నాలుగవ తరగతి పాప తనను గిల్లిందని మూడవ తరగతి పాప ఫిర్యాదు చేసింది. పంతులమ్మ ఆ నాలుగవ తరగతి పాప బుగ్గ, చెంప కందిపోయేలా కొట్టింది. ‘నువ్వు దాని జోలికెందుకు పోయావు? అందుకే ఆమె నిన్ను గిల్లింది’ అని మూడవ తరగతి పాపను కూడ పంతులమ్మ చెంపపై కందిపోయేలాగ కొట్టిందట! ఇదేం న్యాయం? ఇదేం విద్యాపాలన?? హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఇది. అసౌకర్యమైన ప్రశ్న వేసిన స్వామినాథన్ అనే ఆరవ తరగతి విద్యార్థికి సమాధానం చెప్పలేని ‘ఆల్బర్ట్ స్కూల్’ ఉపాధ్యాయుడు కోపంతో ‘స్వామి’ చెవులను కందిపోయేలాగ పిండేశాడు! ప్రఖ్యాత రచయిత ఆర్.కె. నారాయణ్ చెప్పిన 1915వ సంవత్సరం నాటి ‘మాల్గుడి కథ’ ఇది!
తల్లిదండ్రులు మాత్రం తక్కువ తినడం లేదు. నాలుగేళ్లు నిండిన తరువాత ఐదవ నెలలో ఐదవ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం తరతరాల విద్యా సంప్రదాయం. ఆ తరువాత కూడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. కానీ ముందుగా చేయించరాదు. ‘కానె్వంటు’ మారీచ మృగ విన్యాసాలకు మురిసిపోతున్న ‘మమీడాడీలు’ ఇపుడు రెండేళ్లు నిండిన పాపలకు, బాబులకు ఆర్భాటంగా అక్షరాభ్యాసం చేసి వాణిజ్య పాఠశాలలకు తోలిస్తున్నారు. మూడేళ్లు కూడా నిండని ఈ బుడతలు ఇలా మానసిక, శారీరక హింసకు గురికావలసిందేనా??


మోసపూరిత ట్రేడింగ్‌పై సెబీ ఆగ్రహం

$
0
0

ముంబయి, డిసెంబర్ 28: మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడడంపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు కంపెనీలతోపాటు ఇద్దరు వ్యక్తులకు మొత్తం 45 లక్షల రూపాయల మేరకు జరిమానా విధించింది. జై జ్యోతి ఇండియా, లిబరల్ ప్రాపర్టీస్, డబుల్‌డాట్ ఫైనాన్స్ కంపెనీలేగాక, లలిత్ గులాటీ, లోకేష్ కుమార్ కూడా స్టాక్ మార్కెట్‌లో మోసపూరితంగా వ్యవహరించినట్టు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. 2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్ మధ్య కాలంలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపినట్టు పేర్కొంది. మోసానికి పాల్పడిన వారికి జరిమానా విధించినట్టు తెలిపింది. ఇలావుంటే, 1,000 కోట్లు లేదా అంతకు మించిన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలకు కూడా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)ను సెబీ నిర్ణయించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మొదటి 200 స్థానాల్లో ఉన్న కంపెనీలకు మాత్రమే ఓఎఫ్‌ఎస్ సదుపాయం ఉండేది. అయితే, దీనిని మరిన్ని కంపెనీలకు విస్తరించాలని సెబీ నిర్ణయించింది. అందులో భాగంగానే క్యాపిటైజేషన్ పరిధిని పెంచింది.

‘షేర్ అమ్మకాల ఆఫర్ల’తో ముందుకురానున్న ఆరు ప్రభుత్వ అనుబంధ కంపెనీలు

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో నడుస్తున్న ఆరు అనుబంధ సంస్ధలు త్వరలో ‘షేర్ల అమ్మకాల ఆఫర్ల’తో ముందుకు రానున్నాయి. టీహెచ్‌డీసీఐఎల్, టీసీఐఎల్, రైల్ టెల్ సహా ఇరు ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలు ఈ ఆఫర్లు చేయనున్నాయని, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ కంపెనీ (కేఐఓసీఐఎల్) మాత్రం ‘్ఫలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎప్‌ఓపీ)తో ముందుకొస్తుందని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. స్టాక్ ఎక్చేంజీల్లోని సీపీఎస్‌ఈలల్లో ఏడు కంపెనీలను ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓలు) జాబితాలోకి చేరుస్తూ ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోద ముద్ర వేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ విలేఖరులకు వెల్లడించారు. కాగా గురువారం సమావేశమైన సీసీఈఏ మొత్తం ఆరు ప్రభుత్వ రంగ అండర్ టేకింగ్ కంపెనీలు (పీఎస్‌యూ)లు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లకు, ఒక కంపెనీ ఎఫ్‌పీఓకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ జాబితాలోకి చేర్చిందన్నారు. ఈ మేరకు టెలీ కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ (ఇండియా) లిమిటెడ్ (టీసీఐఎల్), రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్), వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (డబ్ల్యుఏపీసీఓఎస్), ఎప్‌సీఐ అరవాలి జిప్సమ్ అండ్ మినల్స్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌ఏజీఎంఐఎల్)లు ఐపీఓలతో ముందుకు రానున్నాయి. కేఐఓసీఎల్ మాత్రం ఎప్‌పీఓతో ముందకు వస్తుంది. ఇలా కంపెనీలను ఐపీఓ ఎఫ్‌పీఓ జాబితాలో చేర్చడం వల్ల అవి ఆర్థికంగా బలపడేందుకు వీలవుందని మంత్రి ప్రసాద్ వివరించారు.

పెథాయ్ తుపాను పీడిత ప్రాంతంలో అతిస్వల్ప వ్యవధిలో రిగ్ పునరుద్ధరణ

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తూర్పు సముద్ర తీర ప్రాంతంలో తుపాను పీడిత ఓఎన్‌జీసీ సెమీ సబ్‌మెర్సిబుల్ క్షేత్రం ‘ఒలిండా స్టార్’లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన నిపుణుల బృందం రక్షణ చర్యలు చేపట్టింది. రికార్డు స్థాయిలో రిగ్‌ను పునరుద్ధరించింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో ఈనెలారంభంలో పెథాయ్ తుపాను విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కాగా తుపాను అనంతరం అక్కడి కంపెనీ విభాగం స్థితిగతులపై కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రోలాజికల్ డిపార్టుమెంటు తుపాను హెచ్చరికలు చేసిన వెంటనే అక్కడి ఒలిండా స్టార్ రింగ్‌లో పనిచేసే 111 మంది సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడి నుంచి ఈనెల 14,15 తేదీల్లో ఖాళీచేయించామని, ఇందుకోసం ప్రత్యేకంగా పడవలు, హెలికాప్టర్లు వినియోగించామని కంపెనీ తెలిపింది. తుపాను వచ్చి వెళ్లిపోయిన తర్వాత ఒలిండా స్టార్ ప్రాంతంలో బాగా ప్రభావితమైన విషయాలను గమనించామని, ప్రధానంగా ప్రత్యేక బృందం అక్కడి బల్లాస్టింగ్ సిస్టం ద్వారా పునరుద్ధరణ చర్యలు చేపట్టిందన్నారు. ప్రధానంగా ఉవ్వెత్తున ఎగసిపడిన సముద్ర కెరటాలు అక్కడి రిగ్‌ను దెబ్బతీసే పరిస్థితుల్లో ఇండియన్ నేవీకి చెందిన హెలికాప్టర్లు సహాయంతో నిపుణుల బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిందని కంపెనీ వివరించింది. సాల్వేజ్ టీం సభ్యులతోబాటు మొత్తం 12 మంది ఈనెల 21న రిగ్‌ను పునరుద్ధరించి సాల్వేజ్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని ఆ ప్రకటన పేర్కొంది. ఓఎన్‌జీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశిశంకర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటర్ చేశారని సంస్ధ వివరించింది. తుపాను అనంతరం నిర్వహించిన ఇన్స్‌పెక్షన్ సందర్భంగా రిగ్‌లో ఎలాంటి లోపాలూ కనిపించలేదని, అలాగే పరికరాలకు కూడా ఎలాంటి నష్టం కలగలేదని తేలిందని, వెంటనే పనిని ప్రారంభించేందుకు వీలుగానే ఉన్నాయని తెలిపింది. బాల్లెస్టింగ్ సిస్టం ద్వారా రిగ్‌ను లెవల్‌గా ఏర్పాటుచేసేందుకు నిపుణుల బృందం సమయ స్ఫూర్తితో వ్యవహరించిందని తెలుపుతూ, రిగ్ త్వరలోనే యథావిథిగా డ్రిల్లింగ్‌ను ఆరంభిస్తుందని వివరించింది. ఈయేడాది జనవరి నుంచి ఈ రిగ్ పనిచేస్తోంది. కాగా ఇలా అతి స్వల్ప రికార్డుటైంలో రిగ్ పునరుద్ధరణ జరగడం ఇదే తొలిసారని కంపెనీ ప్రకటన తెలిపింది.

బంగారు ఆభరణాలకు డిమాండ్!

$
0
0

ముంబయి, డిసెంబర్ 28: బంగారు నగలకు డిమాండ్ మరింతగా పెరుగుతున్నదని ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్‌ఏ) సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వే విడుదల చేసిన ప్రకటనను అనుసరించి, వ్యవస్థీకృత రంగంలో బంగారు నగలకు డిమాండ్ 6 నుంచి 7 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది. మారుతున్న జీవన విధానాలు, నష్టం లేని పెట్టుబడిగా సర్వత్రా ఉన్న ప్రచారం బంగారు ఆభరణాలకు డిమాండ్‌ను పెంచుతున్నదని ఐసీఆర్‌ఏ స్పష్టం చేసింది. పట్టణాలు, నగరాల్లోనేగాక, గ్రామీణ ప్రాంతాల్లోనూ నగలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. దీనితోపాటు, కొన్ని మతాచారాలు కూడా నగలకు డిమాండ్‌ను తెచ్చిపెడుతున్నట్టు తెలిపింది. అనాదిగా ఆభరణాలను కొనడం, దాచుకోవడం భారతీయుల్లో ఒక సంప్రదాయంగా వస్తున్నది. ఎన్ని ఎక్కువ ఆభరణాలను ధరిస్తే సమాజంలో అంత ఎక్కువగా గౌరవ మర్యాదలు లభిస్తాయన్న అభిప్రాయం దాదాపుగా ప్రతి ఒక్కరిలోనూ నాటుకుపోయింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగాన్ని ఏదో ఒక రూపంలో, ప్రత్యేకించి ఆభరణాలుగా కొనుగోలు చేయడం అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం. ప్రజల జీవన శైలి గత రెండుమూడు దశాబ్దాల్లో మారిన కారణంగా బంగారంపై మోజు తగ్గింది. కానీ, ఇటీవల కాలంలో బంగారంపై ప్రజల్లో తిరిగి ఆసక్తి పెరుగుతున్నది. అంతేగాక, చాలా మంది పెట్టుబడులకు లేదా పొదుపు చే యడానికి బంగారం కొనుగోలునే మార్గంగా ఎం చుకుంటున్నారు. ప్రజల్లో వచ్చిన ఈ మార్పు కూడా బంగారు ఆభరణాలకు డిమాండ్‌ను పెంచుతున్నది. మొత్తం మీద మారుతున్న జీవన రీతిలు, ఇతరత్రా కారణాలతో బంగారం మెరిసిపోతున్నది. డి మాండ్ కనీసం ఐదారు శాతం వరకూ పెరగవచ్చని మార్కెట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.

36వేల పాయింట్లకు ఎగబాకిన సెనె్సక్స్

$
0
0

ముంబయి, డిసెంబర్ 28: సెనె్సక్స్ బెంచిమార్కును అధిగమించి వరుసగా మూడోరోజూ లాభాల బాటలో నడిచింది. శుక్రవారం 269.44 పాయింట్లు ఎగబాకి 36,076.72 పాయంట్ల వద్ద స్థిరపడింది. విదేశీ ఇనె్వస్టర్లు పెద్దయెత్తున అమ్మకాలకు పాల్పడినప్పటికీ రూపాయి విలువ బలపడడంతో భారతీయ మార్కెట్లు లాభాల బాటలోనే నడిచాయి. ఆరంభ దశలో ఏకంగా 400 పాయిం ట్లు ఎగబాకినప్పటికీ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మదుపర్ల లాభాల స్వీకరణకు పాల్పడటంతో దిగువకు చేరి 269.44 పాయంట్లకు పరిమితమైంది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 80.10 పాయింట్లు దక్కించుకుని 0.74 శాతం లాభాలతో మొత్తం 10,859.90 పాయింట్లకు చేరింది. వారం మొత్తంలో సెనె్సక్స్ 334.65 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 105.9 పాయింట్లు అదనంగా లాభపడింది. కాగా శుక్రవారం సెనె్సక్స్ ప్యాక్‌లోని సన్‌పార్మా, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, యెస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంకు లాభాలను ఆర్జించాయి. ఈ సంస్థలు మొత్తం 2.98 శాతం లాభాలను అందుకున్నాయి. మరోవైపు టీసీఎస్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, భారతి ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ 0.70 శాతం నష్టపోయాయి. ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రీ క్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా ఈనెలలోనే 28,615 కోట్ల రూపాయల నిధులివ్వబోతోందన్న వార్తల నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్‌లు లాభాల బాటలో నడిచాయి. యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్ రెండు శాతం అదనంగా లాభపడ్డాయి. కాగా అమెరికన్ డాలర్‌తో భారత రూపాయి 37 పైసలు బలపడి మొత్తం విలువ 69.98 రూపాయలకు చేరింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సైతం 1.95 పెరిగి బ్యారల్ 53.76 డాలర్లు పలికింది. ఇలావుండగా గురువారం విదేశీ మదుపర్లు 1.731.91 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు 663.00 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మకాలు జరిపారు. ఇక అంతర్జాయ మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే ఆసియా, కొరియాకు చెందిన కాస్పి 0.62 శాతం లాభాలను ఆర్జించాయి. షాంఘాయ్ కాంపోజిట్ సూచీలు 0.44 శాతం లాభాల్లో నడిచాయి. అయితే జపాన్‌కు చెందిన నిక్కీ 0.31 శాతం నష్టాలను మూటగట్టుకుంది. యూరోపియన్ మార్కెట్లో పారిస్ సీఎసీ 1.47 శాతం లాభపడగా, ఫ్రాంక్‌ఫర్ట్ డీఏఎక్స్ 1.56 శాతం నష్టపోయింది. ఇక లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 1.67 శాతం లాభపడింది.

నీకు పిల్లల్ని చూసుకోవడం వచ్చా?

$
0
0

మొదటి ఇన్నింగ్స్‌లో సిక్స్ కొడితే తను ఐపీఎల్‌లో ముంబై తరఫున ఆడతానని రోహిత్ శర్మపై స్లెడ్జింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ ఈసారి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను టార్గెట్ చేశాడు. రిషభ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాగా ‘్ధని జట్టులోకి వచ్చేశాడు. ఇక బోలెడంతా ఖాళీ. నీకు పిల్లల్ని చూసుకోవడం వచ్చా? నేను ఒక రాత్రి నా భార్యను తీసుకొని సినిమాకు వెళ్తాను. నువు మా పిల్లల్ని చూసుకోగలవా?’ అంటూ పైన్ రెచ్చగొట్టాడు. అయతే ఈ వ్యాఖ్యల్ని రిషభ్ పెద్దగా పట్టించుకోకుండా బ్యాటింగ్ కొనసాగించాడు.

స్వేచ్ఛగా జీవించగలగడమే నిజమైన ప్రజాస్వామ్యం

$
0
0

ఖైరతాబాద్, : రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించగలడమే నిజమైన ప్రజాస్వామ్యమని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగం మాత్రమేనని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పేర్కొంది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్లు హరగోపాల్, లక్ష్మణ్, విమల, సజయ హాజరై మాట్లాడారు. ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణలో ప్రజలు తీవ్ర నిర్భందాలు ఎదుర్కొనే దుస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలపై నిర్భందాలు ప్రారంభం అయ్యాయని అన్నారు. తాము అత్యంత భారీ మెజారిటీతో గెలిచామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ప్రజా సంఘాలంటే ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన వారు, ప్రజల పక్షాన పనిచేస్తున్న సంస్థలు అంటే కేసీఆర్ ఎందుకు హడలిపోతున్నారని నిలదీశారు. ఎన్నికలు ఒక్కటే ప్రజాస్వామ్యానికి గీటురాయి కాదని, ప్రజా ఉద్యమాలు, భావ ప్రకటన స్వేచ్ఛ కొనసాగినప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యంగా పిలవబడుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రజల కోసం పనిచేస్తున్న వరవర రావు, హరగోపాల్, విమల తదితరులపై నిర్బందాలు పెరిగాయని వాపోయారు. అర్బన్ నక్సల్స్ పేరుతో ప్రజా సంఘాల ప్రతినిధులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వౌలాలీలో ముగ్గురు యువతులను అరెస్టు చేసిన పోలీసులు ఇతర రాష్ట్రాల పోలీసులకు అప్పగించారని వాపోయారు. మహిళలకు సైతం భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఓ వైపు మావోయిస్టులే లేరని డీజీపీ చెబుతూనే మావోయిస్టుల నెపంతో అక్రమ అరెస్టులు దేనికని నిలదీశారు. నిర్భందాలు సమాజం సహించదని, హింస చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం అణిచివేతలు, నిర్భందాలను మాని అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


మంచుతో రోడ్డు ప్రమాదాలు

$
0
0

రాజేంద్రనగర్, డిసెంబర్ 28: రాజేంద్రనగర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని రోజులుగా తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు దట్టమైన మంచులో ప్రయాణించాలంటే ప్రజలకు కత్తిమీద సాములాగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మంచులో ప్రయాణం చేయడం కష్టంగా మారింది. మంచులో ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలకు కారణాల గురించి ప్రజల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొగ మంచులో వేగంగా ప్రయాణం చేయటం, నైపుణ్యం లేని శోధన ప్రమాదాలకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మంచు కురుస్తున్న సమయంలో రహదారులపై వాహనాలను నిలిపి ఉంచటం దగ్గరకు వచ్చేవరకు నిలిపి ఉన్న వాహనం కనిపించకపోవడం ప్రమాదాలకు మరో కారణంగా చెప్పవచ్చు. రహదారుల వెంట మంచులోను, చీకట్లోను కనపడే విధంగా అధికారులు రేడియం స్టిక్కర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది ఆకతాయిలు వాటిని ధ్వంసం చేయడం ప్రమాదాలకు హేతువులుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని చెప్పవచ్చు.
జాగ్రత్తలు పాటించాలి: ఇన్‌స్పెక్టర్ సురేష్
పొగమంచు కారణంగా ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని రాజేంద్రనగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు. మంచుతెరలు మాయమయ్యే వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఒకవేళ ప్రయాణం చేసినా తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిదన్నారు. రోడ్డుకు ఎడమవైపున సాధ్యమైనంత వరకు మార్జిన్‌లో ప్రయాణించాలన్నారు. వాహనాలను ఎక్కడబడితే అక్కడ నిలిపివేయకపోవడం మంచిదన్నారు. లైట్లు వేసుకొని ప్రయాణించాలన్నారు. అద్దాలను తుడిచే వైబర్లు సక్రమంగా ఉంచుకోవడం, మోటార్ వెహికిల్స్‌లో ప్రయాణించేటప్పుడు వైబర్లు వేసి ఉంచడం కొంత వరకు ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయం తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా స్వెట్టర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించటం మంచిదన్నారు. మంచు రేణువులు శరీరంలోకి పోకుండా ముక్కుకు, నోటికి కర్చీప్‌లు కట్టుకోవడం, మాస్కులు ధరించడం ప్రయాణంలో సురక్షితమైన అంశాలుగా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు మంచుతెరలు తొలగే వరకు ప్రయాణాన్ని ఆపివేయటం, తప్పనిసరి అయితే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించడం మంచి లక్షణంగా చెప్పవచ్చు. బస్సులో ప్రయాణం పెద్ద వాహనం కనుక మంచు ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పారు.

విద్యార్థిని మృతి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28: వంటింట్లో రిఫ్రిజిరేటర్ సిలిండర్ పేలి బీటెక్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరు గ్రామం మైహోమ్స్ కాలనీలో నివాసముండే నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొంపల్లి మనోహర్, లావణ్య దంపతుల కుమార్తె దీపిక(17) బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. పరీక్షల సమయం కావడంతో గురువారం ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రిడ్జ్‌లో ఉన్న పులిహోర తినడానికి ప్రిడ్జ్‌ను తెరిచింది. ఫ్రిడ్జ్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి దీపిక పూర్తిగా కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఇంట్లో పొగలు రావడం ఇరుగుపొరుగు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకునే లోపుగానే దీపిక పూర్తిగా కాలిపోయి విగతజీవిగా కనిపించింది. కూతురి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
ఒకేరోజు 800 ద్విచక్ర వాహనాల తనిఖీ

మెహిదీపట్నం, డిసెంబర్ 28: వరుస చైన్ స్నాచింగ్‌లతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా గత రెండు రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుస్తుగానే రోడ్లపై ద్విచక్రవాహనాల తనిఖీలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న వరుస చైన్ స్నాచింగ్‌లతో పశ్చిమ మండల పరిధిలోని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీలను చేపట్టారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేని విరిగిన నెంబర్ ప్లేట్ వాహనాలను, సరియైన పత్రాలు లేకున్నా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీసులు అన్ని ప్రాంతాలల్లో గల్లీగల్లీల్లో పెట్రోలింగ్ చేపడుతున్నారు. ఇదేమాదిరిగా నిత్యం పోలీసులు పెట్రోలింగ్‌లతో పాటు తనిఖీలు చేపడితే బాగుంటుందని స్థానికులు పోలీస్ ఉన్నతాధికారులను కోరుతున్నారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని పశ్చిమ మండల డీసీపీ ఎఆర్. శ్రీనివాస్ హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపిస్తున్న సమయంలో, రాంగ్ రూట్‌లో వస్తున్న వాహనాలను, రోడ్లపై అక్రమ పార్కింగ్‌చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీస్తున్నారని కొంత మంది వాహనదారులు వారికి చాలాన్లు రాయకుండా వారి ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్‌ను సగం వరకు విరగ్గొట్టడం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.

రోడ్లుపై నీరు వదిలినందుకు జరిమానా

$
0
0

హైదరాబాద్, : జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన నగరంలోన వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శుక్రవారం శ్రీనగర్‌కాలనీ నుంచి తనిఖీలను ప్రారంభించిన కమిషనర్ యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, కృష్ణకాంత్ పార్క్, ఈఎస్‌ఐ ఆసుపత్రి సర్కిల్, అమీర్‌పేట తదితర ప్రాంతాలతో పాటు శేరిలింగంపల్లి వరకు తనిఖీలు నిర్వహించిన కమిషనర్‌కు పలు మెయిన్ రోడ్లలో ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమివ్వటం, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 86లోని ఓ ఇంటి నుంచి రోడ్డపై నీరు ప్రవహిస్తున్నట్లు గుర్తించి, యజమాని సంతోష్‌రెడ్డికి రూ.15 వేలు, ప్రశాసన్‌నగర్ ఫ్లాట్ నెంబరు 95 నుంచి రోడ్లపైకి భారీగా నీరు ప్రవహిస్తుండటాన్ని గమనించిన కమిషనర్ ఈ రకంగా ఎప్పటికపుడు రోడ్లపై నీరు వదిలితే రోడ్డు ధ్వంసమవుతుందని, ఇందుకు బాధ్యులను చేస్తూ ఆ ఇళ్ల యజమానులకు భారీగా జరిమానాలు విధించారు.
ఫ్లాట్ నెంబర్ 95 యజమానికి రూ.25వేల జరిమానా వేశారు. అంతేగాక, సిద్దార్థనగర్‌లో రోడ్డుపైనే ట్రాన్స్‌ఫార్మర్ పెట్టేందుకు, జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పిల్లర్‌ను నిర్మిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ అక్కడకు వెళ్లి అనుమతులున్నాయా? అంటూ ఆరా తీశారు. అనుమతి లేదని అక్కడున్న వారు చెప్పటంతో వెంటనే ఆ పిల్లర్‌ను కూల్చివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తమ కాలనీలో వీది కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఎర్రగడ్డ చౌరస్తాలో ఫుట్‌పాత్‌పై నిర్మాణ వ్యర్థాలు, గ్యార్బెజీ పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన కమిషనర్ దాన్ని తొలగించాల్సిన అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారులపై స్వీపింగ్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటీ కమిషనర్ రమేశ్, మెడికల్ ఆఫీసర్ రవి తదితరులున్నారు.

నుమాయిష్‌కు చురుకుగా ఏర్పాట్లు
1 నుంచి ప్రారంభం 2500 స్టాళ్లు..45 రోజుల ప్రదర్శన
కట్టుదిట్టమైన భద్రతకు ప్రణాళిక ప్రభుత్వ ఆమోదం

హైదరాబాద్, డిసెంబర్ 28: చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మొదలుకుని బహుళ జాతి సంస్థల ఉత్పత్తులను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ సారి కూడా 2500 స్టాళ్లతో ఏర్పాటు కానున్న ఈ ప్రదర్శన వివరాలను ఎగ్జిబిషన్ సొసైటీ నేడు అధికారికంగా వెల్లడించనుంది. జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను 45రోజుల పాటు కొనసాగనుంది. 1వ తేదీన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా ఈ ప్రదర్శనను ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రారంభోత్సవానికి సంబంధించిన ఇప్పటికే 75 శాతం పనులు, స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం సాయంత్రానికల్లా 90 శాతం పనులు పూర్తయినట్లు సొసైటీ కార్యదర్శి జీ.వీ.రంగారెడ్డి వెల్లడించారు. దేశంలో పేరుగాంచిన పారిశ్రామిక సంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో సుప్రసిద్దమైన బహుళ జాతి కంపెనీలను ఈ సారి ప్రదర్శనలో అందుబాటులోకి తేనున్నారు. దేశంలోని వివిధ కంపెనీలతో పాటు ఇండోనేషియా, ఈజిప్టు, మలేషియా దేశాల ఉత్పత్తులను కూడా ఈ ప్రదర్శన అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది. ఈ సారి ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్న 2500 స్టాళ్లల్లో అత్యధిక సంఖ్యలో స్టాళ్ల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి నుమాయిష్‌కు అంతర్గత భద్రతను ప్రైవేటు మార్షల్స్‌ను నియమించి, సొసైటీ చూసుకునేది. కానీ ఈ సారి అంతర్గత భద్రత విషయంలో సొసైటీ ప్రభుత్వం ఆమోదం తీసుకుని పోలీసు, ఇతర గుర్తింపు పొందిన బలగాలకు అప్పగించనున్నట్లు కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. దీంతో పాటు ప్రదర్శనలో ప్రజల భద్రత కోసం ప్రతి సందర్శకుడి కదలికలను గమనించేందుకు 32 హై క్వాలిటీ సిసి కెమెరాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మూడు ప్రధాన గేట్ల వద్ధ ప్రతి సందర్శకుడ్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నారు. సందర్శకుల సౌకర్యార్థం సొసైటీ తరపున తాగునీరు ఇతర వసతులు కల్పించే పనులు కూడా కొనసాగుతున్నాయి. గత సంవత్సరం మొదటి సారిగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, అమర్చనున్నారు.
వాతావరణ మార్పులతోనే గొంతులో ఇనె్ఫక్షన్
ఈఎన్‌టీ సూపరిండెంటెండ్ శంకర్
మెహిదీపట్నం, డిసెంబర్ 28: కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పుల వల్లనే గొంతులో ఇనె్ఫక్షన్ వస్తుందని ఈఎన్‌టీ సూపరిండెంటెండ్ టీ.శంకర్ తెలిపారు. ఇఎన్‌టీ ఆసుపత్రిలో ఓపి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని తెలిపారు. వాతావరణంలో మార్పులతోనే గొంతులో ఇనె్ఫక్షన్ వస్తుందని తెలిపారు. దీంతో ఆసుపత్రిలో గొంతు నొప్పితో ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అవసరం అనుకుంటే రోగులకు అన్ని పరీక్షలు చేస్తున్నామన్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
మేడ్చల్, డిసెంబర్ 28: మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి అనుబంధ గ్రామమైన మైసమ్మగూడలో అధికారులు శుక్రవారం ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. గ్రామంలో వివిధ చోట్ల 10 అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు పంచాయతీ సిబ్బంది ఉదయం 9 గంటల ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శి చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో జేసీబీ, కార్మికుల సహాయంతో కూల్చివేశారు. పలు ఇళ్లకు సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, పిల్లర్లు, బేస్మింట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. జేసీబీ సహాయంతో స్లాబ్‌లను కూల్చివేశారు. పునాదుల కోసం తీసిన గుంతలను పూడ్చివేశారు. కూల్చివేతల సమయంలో స్థానికులు అడ్డు చెప్పడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో కార్యదర్శితో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. ఎవరైనా ఎంతటి వారైనా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించే ప్రసక్తేలేదని కఠిన చర్యలు తప్పవని కార్యదర్శి చంద్రప్రకాశ్ హెచ్చరించారు.

సకాలంలో రైతులకు పంట రుణాలు

కలెక్టర్ లోకేశ్ కుమార్ సూచన

హైదరాబాద్, డిసెంబర్ 28: రైతులకు పంట రుణాలను సకాలంలో అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ బ్యాంకర్‌లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీసీసీ-డీఎల్‌ఆర్‌సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా పంట రుణాల పంపిణీ అనుకున్నంత మేరకు జరగలేదని, ఖరీఫ్‌లో 61%, రబీలో 20% రుణాలు అందించినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో 592 కోట్లు, రబీలో 124 కోట్ల పంట రుణాలను అందించామని చెప్పారు. రైతు బీమాకు సంబంధించి చెల్లింపులలో జాప్యం జరగకుండా చూడాలని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి నిర్థేశించిన యూనిట్లు ఫిబ్రవరి 15లోగా గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని బ్యా ంకర్లకు చెప్పారు. స్వయం సహాయక గ్రూపుల రుణాలకు సంబంధించి 73% సాధించామని, 100 శాతం రుణాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. షాబాద్, కేశంపేట్ మండలాల్లో రుణాల రికవరీ తక్కువగా ఉందని, రికవరీపై దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. టీఎస్-ఐపాస్ కింద 435 గ్రౌండింగ్ చేసామని, మరో 194 యూనిట్లు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిని వెంటనే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా స్టాటఫ్, స్టాండఫ్, ముద్ర రుణాలను విరివిగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలోలీడ్ బ్యాంక్ మేనేజర్, డీఆర్‌డీఓ ప్రశాంత్ కుమార్, జీఎం డీఐసీ రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ గీత, ఆరర్‌డీఐ, నాబార్డ్ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్

$
0
0

విజయవాడ, డిసెంబర్ 28: రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం వీలైనంత త్వరగా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో భారత్ నెట్ స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సాయంతో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పనకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. దీనికి తగ్గట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు అందించాలన్నారు. భారత్ నెట్ రెండో దశ కింద ఎంత కాలంలోగా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించగలరని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండి దినేష్‌కుమార్‌ను ప్రశ్నించారు. రాబోయే 9 నెలల్లో 11,400 పంచాయతీలకు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించగలమని దినేష్‌కుమార్ వివరించారు. నిర్దేశించిన గడువులోగా అన్ని పంచాయతీల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యం త్వరగా కల్పించాలన్నారు. అంతకుముందు ఎండీ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ఇప్పటి వరకూ చిత్తూరు, విశాఖ జిల్లాల్లో 1673 గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని వివరించారు. మరో 11,400 గ్రామాలకు ఈ సౌకర్యం విస్తరించేందుకు 1480 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.కేంద్రం తన వాటాగా 907 కోట్ల రూపాయలను ఇవ్వనుందని, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని తెలిపారు.

క్యాలెండర్ ప్రకారమే సంక్రాంతి సెలవులు
* విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి
విజయవాడ(సిటీ), డిసెంబర్ 28: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇది వరకే విద్యాశాఖ ప్రకటించిన సంక్రాంతి సెలవులు మార్పు చేయడం తగదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి రెడ్డి శేఖర్‌రెడ్డి, కె వెంకటరెడ్డిలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెలగపూడి సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌ను శుక్రవారం కలిసిన వీరు సంక్రాంతి సెలవుల మార్పు చేయవద్దంటూ వినతిపత్రం అందించారు. సంక్రాంతి సెలవులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళికలు ముందస్తుగా నిర్ణయించుకున్నట్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జన్మభూమి జరిగే తేదీలలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని తెలిపారు.

మద్యం తాగి విధులకు హాజరైతే కఠిన చర్యలు
* ప్రయాణీకుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి
* ఆర్టీసీ ఈడీలు కోటేశ్వరరావు, జయరావు
విజయవాడ(సిటీ), డిసెంబర్ 28: మద్యం తాగి డ్యూటీలకు హాజరైతే ఉపేక్షించేంది లేదని ఈ విషయంలో ఉపేక్షించేది లేదని డ్రైవర్లందరూ చెడు అలవాట్లుకు దూరంగా ఉంటే మంచిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి జయరావులు తెలిపారు. ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, విధి నిర్వహణలో మద్యం సేవించి పట్టుబడిన డ్రైవర్లుకు శుక్రవారం కౌనె్సలింగ్ నిర్వహించారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిబ్బందికి తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిదన్నారు. అదేవిధంగా ప్రయాణీకుల ఫిర్యాదుల పట్ల సంస్థ సత్వర చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రయాణీకుల నిత్యం సిబ్బందిని గమనిస్తూనే ఉంటారని, టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ద్వారా సిబ్బంది చేసే తప్పులను వీడియో సందేశాల ద్వారా అధికారులకు పంపిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో సిబ్బంది ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని రీజీయన్ల నుండి సుమారు 75 మంది డ్రైవర్ల, కండక్టర్లు పాల్గొన్నారు. సీటీఎం బ్రహ్మనంద రెడ్డి, డిప్యూటీ సీటీఎం హాజరై సిబ్బందికి తరతులు నిర్వహించారు.

భవానీ దీక్షలు విరమణకు పటిష్ట బందోబస్తు
* విధుల్లో 2000 మంది బలగాలు
* అధికారులు, సిబ్బందికి సీపీ తిరుమలరావు దిశానిర్దేశం
విజయవాడ (క్రైం), డిసెంబర్ 28: ఇంద్రకీల్రాదిపై శనివారం నుంచి ప్రారంభం కానున్న భవానీ దీక్షల విరమణ సందర్భంగా నగర పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు చేపట్టింది. జనవరి 2వ తేదీ వరకు ఐదురోజుల పాటు ఈ విరమణలను జరుగునున్నాయి. దీన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పకడ్బందీ చర్యలు చేపట్టారు. బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు తరలివచ్చాయి. సిబ్బంది,

పుష్పగిరి పీఠం భూ వివాదానికి సానుకూల పరిష్కారం

$
0
0

అమరావతి, డిసెంబర్ 28: గుంటూరు జిల్లాలో పుష్పగిరి పీఠం భూముల వివాదానికి సానుకూల పరిష్కారం లభించనుంది. ఈ విషయమై శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో పీఠం పెద్దలు, రైతులు శుక్రవారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఇరువర్గాల మధ్య సమన్వయానికి రిటైర్డు డీజీపీ అరవిందరావు, సీనియర్ పత్రికా సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావులు నియమితులయ్యారు. ఏ రైతుకూ భూ వేధింపుల సమస్య తలెత్తరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్నిరకాల భూ వివాదాలను పరిష్కరిస్తున్నామని ఆధార్ తరహాలో భూధార్‌ను అమలులోకి తెచ్చామని గుర్తుచేశారు. స్వాతంత్య్రం ముందు నుంచి సతమతం చేస్తున్న భూ వివాదాలను కూడా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. చుక్కల భూముల సమస్యలు కొలిక్కి వస్తున్నాయని తెలిపారు. భూ రికార్డులు ట్యాంపర్ చేసే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. రైతుల ఆశలను మఠం నెరవేర్చాలని స్పష్టం చేశారు. రైతులకు చేసే మేలుకంటే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలేవీ ఉండవన్నారు. ఇది మూడువేల కుటుంబాల రైతుల సమస్య అని చెప్తూ ఆరేడు దశాబ్దాలుగా వివాదం రగులుతోందని దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. రుణాలు అందక రైతులు ఇక్కట్లకు గురవుతున్నారని భూమిపై ఆదాయం లేక పీఠానికి నష్టం వస్తోందని ఇరువర్గాలు అంగీకరించాయి. పుష్పగిరి పీఠం, ప్రభుత్వం, రైతులు ఉమ్మడిగా దీనిపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. స్థానిక ధర ప్రకారం 12 శాతం చెల్లించేందుకు రైతులు ముందుకొచ్చారు. అందుకు పుష్పగిరి పీఠం కూడా అంగీకరించింది. ఉభయతారకంగా ఇరువర్గాలు స్పందించాయి. ప్రభుత్వం తరుపున అన్ని సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతులు, పీఠానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శనివారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ భూ వివాదం తలెత్తరాదని అందుకోసమే రెవెన్యూశాఖలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. తన భూమికి ఏదో జరుగుతుందనే చింత రైతుకు ఉండరాదని అభిలషించారు. రైతుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదని ఉద్ఘాటించారు. విభజన కష్టాల్లో ఉన్నప్పటికీ రూ 16వేల రెవెన్యూలోటు ఏర్పడినా రూ 24వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. దేశం మొత్తంగా రైతులు అశాంతితో రగిలిపోతుంటే ఏపీ రైతులు పూర్తి భరోసాతో సేద్యపు పనులు చేసుకుంటున్నారని వివరించారు. కేంద్రంలో బీజేపీ రైతాంగ వ్యతిరేక విధాలు బాధాకరమన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలన్నింటిలో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఎక్కడ రైతు సంతోషంగా ఉంటాడో అక్కడ సిరిసంపదలు వెల్లివిరుస్తాయన్నారు.

హైకోర్టు తరలింపుపై తొలగని గందరగోళం

$
0
0

అమరావతి, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపుపై నెలకొన్న గందరగోళం వీడటం లేదు. సరైన భవనాలు, వసతి లేకుండా ఏ విధంగా తరలిస్తారంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కొందరు హైకోర్టు న్యాయవాదులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవనాలు సంక్రాతి సెలవుల అనంతరం జనవరి 20వ తేదీకి సిద్ధమవుతాయని, కనీసం అప్పటివరకైనా తరలింపు ఆపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించేందుకు సీనియర్ న్యాయవాదులు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇలాఉంటే రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక భవనాలు జనవరి 20వ తేదీకి కానీ ఓ కొలిక్కి రావు. ఈ పరిస్థితుల్లో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి ఒకటి కల్లా హైకోర్టు ఏర్పాటు కావాలని రాష్టప్రతి ఉత్తర్వులు జారీచేశారు. అయితే పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి రానందున కొంత గడువు ఇవ్వాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు తరలింపునకు సిద్ధమేనని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. దీంతో ఆగమేఘాల మీద కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే జనవరి ఒకటో తేదీ కల్లా హైకోర్టు తరలించాల్సిందిగా రాష్టప్రతి ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఇటు ప్రభుత్వం, అటు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాలంటే ప్రధాన న్యాయమూర్తితో సహా 17 బెంచ్‌లకు తగిన సదుపాయాలు కల్పించాలి. అంతేకాదు న్యాయమూర్తులకు వసతి ఉండాలి. ఇవేమీ లేకుండానే వెనువెంటనే తరలించాలని కేంద్రం నుంచి ఆదేశాలు జారీ కావటం వెనుక కక్షసాధింపు ధోరణి ఉందని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది. అయితే భవనాలు సిద్ధం కాక మునుపే ఏపీ ప్రభుత్వం హైకోర్టు తరలింపునకు ఎందుకు లేఖ రాసిందని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తీరా రాష్టప్రతి ఉత్తర్వులు వచ్చాక తాత్కాలిక భవనాలు కూడా పూర్తి స్థాయిలో లేవని చెప్పి మరోచోట వసతి కల్పించాలని నిర్ణయించడం సమంజసం కాదని ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు న్యాయవాదులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సుప్రీంలో పిటిషన్ వేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. కోర్టు భవనాల తుదిరూపు సంతరించుకునే వరకు న్యాయమూర్తులకు తగ్గట్టుగా కొద్దిరోజులు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో తగిన వసతులు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనిపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో 8 కోర్టు హాళ్లకు తగిన వసతి ఉంది. కార్యాలయానికి సమీపంలోనే ఆర్ అండ్ బి భవనాలు ఉన్నాయి. హైకోర్టుకు జనవరి ఒకటో తేదీ సెలవు కావటంతో పాటు 2,3,4 తేదీల్లో మాత్రమే పనిదినాలు. వచ్చేనెల 5 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మూడురోజులు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే దీనిపై న్యాయమూర్తులు, న్యాయవాద సంఘాలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.

జగ్గయ్యపేట కౌన్సిల్‌లో ‘టీ’ తుఫాన్

$
0
0

జగ్గయ్యపేట, : బడ్డీ కొట్టు తొలగింపుకై తాము కోరుతున్నా కమీషనర్, అధికారులు స్పందించకపోవడంపై అధికార సభ్యుల నిరసనలు, ప్రతిగా తెదేపా సభ్యుల నిరసన, వాకౌట్ మూడుసార్లు కౌన్సిల్ సమావేశం వాయిదాలతో 8గంటల పాటు సాగిన మున్సిపల్ సమావేశం తుదకు రేపటికి వాయిదా పడింది. చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఎజండాలోని 8అంశాలు పూర్తి అయిన తరువాత గత కౌన్సిల్ సమావేశంలో చర్చించిన టీ కొట్టు తొలగింపు వ్యవహారంపై చర్యలు ఏంటని చైర్మన్ రాజగోపాల్ కమీషనర్ రామ్మోహనరావును ప్రశ్నించడంతో వివాదం తిరిగి రాజుకుంది. ఈ విషయంపై మరి కొంత సమయం కావాలని, ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లగా అన్ని ఆక్రమాలతో పాటు దాన్ని చూడాలని సూచించినట్లు కమీషనర్ చెప్పడంతో చైర్మన్ రాజగోపాల్ తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చెప్పినట్లు పని చేస్తారా అంటూ అధికారులను నిలదీసారు. దీనిపై ప్లోర్ లీడర్ రాఘవ, తెదేపా సభ్యులు కొర్రకూటి సైదులు, చారుగుండ్ల కొండలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎజండాలో లేని అంశాన్ని ప్రస్థావించడం తగదని అన్నారు. ఇది మున్సిపల్ ఆస్తులకు సంబంధించిన వ్యవహారమని చైర్మన్ బదులు ఇస్తూ ఎమ్మెల్యే అనుమతితో ఆక్రమిస్తుంటే చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. ఈ దశలో ప్లోర్ లీడర్ రాఘవ, చైర్మన్ రాజగోపాల్ మధ్య వ్యక్తిగత ఆరోపణలతో వాగ్వివాదం జరిగింది. కమీషనర్ చైర్మన్ రాజగోపాల్‌కు ఎంతసేపు ప్రశ్నించినా తమకు సమయం కావాలనే సమాధానం ఇస్తుండటంతో వైకాపా సభ్యులు పోడియం ముందు కింద కూర్చుని నిరసనకు దిగారు. దీనికి పోటీగా తెదేపా సభ్యులు ఎజండాలోని అంశాలు కాకుండా ఇతర విషయాలు చర్చిస్తున్నారంటూ వారు పోడియం ముందు భైటాయించి నిరసనకు దిగారు. తెదేపా, వైకాపా వాదోపవాదాల అనంతరం తెదేపా సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈ దశలో మరో మారు కమీషనర్‌ను ప్రశ్నించిన చైర్మన్ సభను అరగంట పాటు వాయిదా వేస్తున్నామని ఈ లోపు నిర్ణయం తీసుకోవాలన్నారు. మరల ప్రారంభమైనా సరైన సమాధానం రాకపోవడంతో మరో నాలుగు సార్లు వాయిదా పడింది. కమీషనర్ వైఖరిలో మార్పు రాకపోవడంతో బడ్డీ తొలగింపుకు వెళ్లిన అధికారుల విధులకు ఆటంకం కల్గించిన వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అయినా కౌన్సిల్ సమావేశం కొనసాగుతుందని, అప్పటి వరకూ ఇలానే కూర్చుంటామని చైర్మన్‌తో సహా వైకాపా సభ్యులు భైటాయించారు. మరో రెండు వాయిదాల అనంతరం సాయంత్రం 6.30 ప్రాంతంలో కమీషనర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుకు అంగీకరించడంతో సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ రాజగోపాల్ ప్రకటించారు. మధ్యాహ్నం సమయంలో టీ కొట్టు సమీపంలో మరో కొట్టు పెట్టేందుకు మరో పక్షం వారు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌ఐ శ్రీహరిబాబు హుటాహుటిన స్పందించి ఆ బడ్డీని తక్షణం తొలగించారు. నందిగామ డిఎస్‌పీ హరిరాజేంద్రబాబు కౌన్సిల్ సమావేశం జరుగుతున్నంతసేపు ఆ పరిసరాల్లో స్వయంగా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ప్రజల్ని న్యాయ విజ్ఞానవంతుల్ని చేస్తున్నాం

$
0
0

మచిలీపట్నం, 8: ఆపదలో ఉన్న వారికి ఆసరాగా న్యాయపరమైన సహాయం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు పారా లీగల్ వలంటీర్లకు సూచించారు. స్థానిక న్యాయ సేవాసదన్‌లో పారా లీగల్ వలంటీర్లకు శుక్రవారం ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో న్యాయపరిజ్ఞానం పెంపొందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమన్నారు. సంస్థ కార్యకలాపాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలను న్యాయ విజ్ఞానవంతులుగా చేయడానికి న్యాయ వ్యవస్థకు, ప్రజలకు వారధిగా పారా లీగల్ వాంటీర్లు స్వచ్చందంగా పని చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పదవ అదనపు జిల్లా జడ్జి డా. ఎస్ రజని, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పుండరీకాక్షుడు, పలు న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.

ప్రజలకు సముచిత సేవలు

ఆర్డీవో సత్యవాణి

గుడ్లవల్లేరు, డిసెంబర్ 28: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సేవలందించాలని గుడివాడ ఆర్డీఓ జివి సత్యవాణి అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆర్డీఓ సత్యవాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ రికార్డులను పరిశీలించారు. వివిధ అంశాలపై వీఆర్‌ఓలకు సలహాలు, సూచనలు అందించారు. ప్రతి ఒక్క వీఆర్‌ఓ విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ జనవరి 2 నుండి 11వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గ్రామాలను పరిశీలించటం, మధ్యాహ్నం నుంచి గ్రామసభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించటం జరుగుతుందన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించటమే జన్మభూమి గ్రామసభల ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే మండల పరిధిలోని అంగలూరులో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యకమంలో గుడివాడ ఆర్డీఓ జీవి సత్యవాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మోపిదేవి, డిసెంబర్ 28: మండలంలోని పెదప్రోలు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైక్లిస్ట్ మృతి చెందాడు. స్థానిక మోపిదేవి వికలాంగుల కాలనీకి చెందిన గుర్రం సాంబశివరావు(59) తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా అవనిగడ్డ నుండి చల్లపల్లి వైపు వస్తున్న చెరకు లోడ్ ట్రాక్టర్‌ను అవనిగడ్డ వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో రెండు వాహనాలకు మధ్య ఉన్న ఖాళీలో తన ద్విచక్ర వాహనాన్ని పోనివ్వడంతో రెండు వాహనాల మధ్య నలిగి కిందపడిపోయాడు. వెంటనే క్షతగాత్రుడిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

జన్మభూమికి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి

బుద్ధప్రసాద్ ఆదేశం

అవనిగడ్డ, డిసెంబర్ 28: గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనవరి 2 నుండి నిర్వహించనున్న జన్మభూమి గ్రామసభలను విజయవంతం చేయాలని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు. స్థానిక గాంధీ క్షేత్రంలో జన్మభూమిపై సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించగా నియోజకవర్గంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గ్రామ, వార్డు అభివృద్ధి ప్రణాళికలను సంసిద్దం చేసుకోవాలని, అభివృద్ధి, వృద్ధి, దృక్పధంపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించే బాధ్యతను ఎంఇఓలు తీసుకోవాలన్నారు.


తాడోపేడో తేల్చుకుంటాం

$
0
0

మచిలీపట్నం, : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. తూర్పు కృష్ణా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా నలుమూలల నుండి వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు హాజరై తమ సమస్యలపై నినదించారు. తమ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తూర్పారబడుతూ ధర్నాను వేడెక్కించారు. మాయమాటలతో ఎంత కాలం మభ్య పెడతారంటూ ప్రశ్నించారు. 43 శాతం ఫిట్‌నెస్ ఇచ్చామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మధ్యంతర భృతి, సీపీఎస్ రద్దు ఇతర సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే తమతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం విషయంలో మొహం చాటేస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగులంతా సమ్మెకు వెళ్లే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోందన్నారు. అదే జరిగితే రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపుతామని జెఎసీ రాష్ట్ర వైస్ చైర్మన్, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి మణికుమార్ హెచ్చరించారు. తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు వుల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్ మాట్లాడుతూ మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించటంతో పాటు సీపీఎస్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవ పీఆర్‌సీ ప్రకారం పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను మంజూరు చేయాలన్నారు. పబ్లిక్ సెక్టార్ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఎయిడెడ్, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరినీ 11వ పీఆర్‌సీలో చేర్చాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని, నాల్గవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని, వీఆర్‌ఓలకు పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ బాబు, పీఆర్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జివిఎస్ పెరుమాళ్లు, ఎస్‌టీయు జిల్లా అధ్యక్షుడు కొమ్ము ప్రసాద్, ఉమెన్ వింగ్ చైర్‌పర్సన్ కె గౌరి, ఎపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, బీటీఎ జిల్లా అధ్యక్షుడు కైతేపల్లి దాస్, ఏపీటీఎఫ్ 257 జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవి రామారావు, ఎపీవీవీపీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, అగ్రికల్చర్ ఎంప్లాయిస్ సంఘం జిల్లా అధ్యక్షుడు పివి సాయికుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిటివి రమణ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విజయకుమార్, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హుస్సేన్, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి భానుమూర్తి, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాబాప్రసాద్, వెటర్నరీ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రామారావు తదితరులు పాల్గొన్నారు.

డబ్బు సంచులతో ప్రజాభిమానం రాదు

* చింతలపూడితో తీరనున్న రైతుల చింతలు

* పోలవరం గేటు పెడితే డ్రామా అంటారా?

* కేంద్రం సహకరించకపోయినా కడప ఉక్కు ఆగదు

* జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్పష్టీకరణ

మైలవరం, డిసెంబర్ 28: మహిళలు బొట్టు పెట్టారు, దిష్టి తీశారు, ప్రజలు శాలువాలు కప్పారు, అభిమానులు హారతులు పట్టారు, ఇంతటి ప్రజాభిమానాన్ని డబ్బు సంచులతో కొనగలరా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని చండ్రగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమం, ఆదరణ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఉమ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిని ఆస్వాదిస్తూ ప్రజలు చూపుతున్న అభిమానాన్ని డబ్బులతో ఎర వేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాభిమానాన్ని వైకాపా నేతలు డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారని మండి పడ్డారు. 70 ఏళ్ళుగా సాగరు జలాలు వస్తేనే సాగు అని, గోదావరి నీటిని గురించి అనుకోవటం తప్ప వాటిని ఎప్పుడూ దోసిళ్ళలోకి కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. పట్టిసీమ మహా సంకల్పం నెరవేరటంతో గోదావరి నీరు మన చెరువులు, బావుల్లో, బోరుల్లో కూడా లభ్యమవుతున్నాయన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం పూర్తయితే దశాబ్దాల నాటి సాగునీటి చింతలు తీరతాయని స్పష్టం చేశారు. వందేళ్ళనాటి పోలవరం కలను సాకారం చేస్తూ 60 శాతంపైగా పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో 550 టన్నుల బరువును కలిగిన మొదటి గేటును ఏర్పాటు చేస్తే వైకాపా నేతలు గ్రేటర్ డ్రామాగా అభివర్ణించటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గోదావరి నీటికి అడ్డుపడితే ఆ నీటిలోనే కొట్టుకు పోతారని హెచ్చరించారు. పట్టిసీమ, పోలవరం, చింతలపూడి మైలవరం ఓటర్ల పుణ్యమేనని, వాళ్ళు ప్రసాదించిన భాగ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు 63వేల కోట్ల రూపాయలు జలవనరుల శాఖకు ఖర్చు చేసే గురుతరమైన బాధ్యతను తనకు అప్పగించినట్లు మంత్రి ఉమ పేర్కొన్నారు. 43వేల కోట్లతో ప్రజారాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని, దేశ విదేశాలలో కూడా లేని విశ్వనగరి రాజధానిగా నవ్యాంధ్రులకు దక్కబోతున్నదని తెలిపారు. కేంద్రం మొండి చేయి చూపినా కడప ఉక్కు నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. ప్రజలే నా దేవుళ్ళని ప్రకటించిన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను ఆయన కుమారుడు బాలయ్య కధానాయకుడుగా, 26న మహానాయకుడిగా ఎన్టీఆర్ జీవితాన్ని ప్రజల ముందు ఉంచబోతున్నట్లు తెలిపారు. డబ్బు సంచులతో వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలని, అవినీతిపరుల కోసం గొడవలు పడవద్దని మంత్రి ఉమ హితవు పలికారు. 23 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వైకాపా నాయకుడు ప్రజలలోనే ఉన్నాడా, వ్యాపారాలలో మునిగి తేలుతున్నాడా అని ప్రశ్నించారు. రానున్న కాలంలో అక్రమార్కుల భరతం పట్టాలని మంత్రి ఉమ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చండ్రగూడెంలో 16 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆదరణ పధకం కింద మంజూరైన పనిముట్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు పోతురాజు, పద్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

దేశ వ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి

రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్షుడు రవి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 28: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించనున్న దేశ వ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్షుడు చౌటపల్లి రవి కోరారు. సమ్మె విజయవంతం కోరుతూ శుక్రవారం స్థానిక జ్యోతిరావ్ పూలే విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మిక చట్టాలను సవరణ చేయరాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. కార్మికులందరికీ ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు వివి రమణ, ఎఐటీయుసీ, ఐఎన్‌టీయుసి, వైఎస్‌ఆర్‌టీయు, ఎల్‌ఐసీ, పోస్టల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

తగ్గు ముఖం పట్టిన నేరాలు

$
0
0

మచిలీపట్నం, : అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉన్న కృష్ణా జిల్లాలో నేరాలు తగ్గు ముఖం పడుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా చూస్తే ఈ సంవత్సరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫ్రెండ్లీ పోలీస్ నినాదంతో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేరాలను అదుపు చేయడంలో సఫలీకృతులయ్యారు. గత ఏడాది, ఈ ఏడాది గణాంకాలను ఓసారి పరిశీలిస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగారు. అత్యాచారాలను అదుపు చేయడంలో కూడా కొంత ప్రగతి సాధించారనే చెప్పాలి. గత యేడాది వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 3వేల 569 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 2వేల 935 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 35 హత్య కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం అదనంగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఆరుగా నమోదైన బందిపోటు దొంగతనాలు ఈ ఏడాది ఎనిమిదికి చేరాయి. అలాగే కిడ్నాప్ కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది 62 నమోదు కాగా ఈ ఏడాది 68 నమోదయ్యాయి. వివిధ చోరీ కేసులకు సంబంధించి 59.97 శాతం మేర రికవరీ సాధించారు. గత ఏడాది 52.12 శాతం రికవరీ జరిగింది. ఈ సంవత్సరం రూ.కోటి 91లక్షల 96వేల 552లు చోరీ సొత్తును రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గత ఏడాది 1233 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 957 కేసులు నమోదయ్యాయి. ఇందులో 309 మంది మృత్యువాత పడగా 1272 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు ప్రమాదాల మరణాలు అత్యధికంగా జాతీయ రహదారులపై జరగడం విశేషం. గత ఏడాది రోడ్డు ప్రమాదాల మరణాలు 406, క్షతగాత్రులు 1641 ఉండటం విశేషం. మోటారు వెహికల్ యాక్ట్ కింద 2016వ సంవత్సరంలో లక్షా 26వేల 531 కేసులు నమోదు చేయగా రూ.రూ.2.82కోట్లు జరిమానా విధించారు. 2017వ సంవత్సరంలో లక్షా 54వేల 877 కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు జరిమానా విదించారు. ప్రస్తుత సంవత్సరానికి వస్తే 2లక్షల 3వేల 239 కేసులు నమోదు చేయగా రూ.4.28కోట్ల మేర వాహనదారుల నుండి జరిమానా రూపంలో వసూలు చేశారు. జాతీయ రహదార్లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను స్పీడ్ గన్‌ల ద్వారా కళ్లెం వేశారు. ప్రధానంగా నందిగామ, నూజివీడు సబ్ డివిజన్‌లలో ఈ సంవత్సరం ఆగస్టు నుండి స్పీడ్ గన్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చి మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ ఐదు నెలల కాలంలోనే 1658 కేసులను నమోదు చేసి ఆర్టీఎ అధికారులకు పంపారు. 1528 సీసీ కెమెరాలు, 32 పీటీ జడ్ సీసీ కెమెరాలతో జిల్లాను నిఘా నీడలోకి తీసుకువచ్చారు. ఇందు కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతిక్షణం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ సాగిస్తున్నారు. అలాగే దొంగతనాలను అరికట్టేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను తెర మీదకు తీసుకు వచ్చారు. ప్రత్యేకమైన యాప్ అయిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను 11వేల 722 మంది రిజిస్ట్రర్ చేసుకోవడం విశేషం. ఇందులో 999 మంది తమ ఇళ్లకు సీసీ కెమెరాల భద్రత కావాలని పోలీసు శాఖను కోరగా 899 ఇళ్లకు పోలీసులు భద్రత కల్పించారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లాకు వచ్చిన తర్వాత ప్రజలు నిర్భయంగా తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసు శాఖ దృష్టికి తీసుకు వచ్చేందుకు గాను వాట్సప్ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. 9182990135 వాట్సాప్ నెంబర్ ద్వారా వచ్చిన 1602 ఫిర్యాదులను పరిష్కరించారు. ఇకపోతే డయల్ 100 ద్వారా కూడా ప్రజలకు బాసటగా నిలిచారు. గతంలో డయల్ 100కు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుండి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరేది. కానీ గత ఏప్రిల్ నెలలో జిల్లా పోలీసు కార్యాలయం నుండే డయల్ 100 ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. 5లక్షల ఒక వెయ్యి 599 ఫోన్ కాల్స్ డయల్ 100కు రాగా 1448 కాల్స్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
ప్రజాసహకారంతోనే నేరాల నియంత్రణ: ఎస్పీ
ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణలో సత్ఫలితాలు సాధించినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియచేశారు. అవగాహనతోనే నేరాలను నియంత్రించగలమని భావించి ఆ దిశగా తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

వేచి చూడడం (సండేగీత)

$
0
0

మనలో చాలామందిమి వేచి చూస్తాం.
బాధ్యత మీద పడిన తరువాత బాధ్యత తీసుకుందామని అనుకుంటాం.
మనం ఏదైనా కావాలని అనుకున్నప్పుడు ఇంకా సమయం రాలేదని అనుకుంటాం.
ఈ వేచి చూడ్డం కన్నా పని మొదలు పెట్టడం మంచిది.
ఎప్పుడూ రెడీగా వుండటం అవసరం.
మనం అనుకున్న పనిని ముందుగానే ప్రారంభించాలి.
ఈ ప్రపంచాన్ని మార్చాలని అనుకునేముందు మనం మారాలి.
సమయం కోసం వేచి చూస్తే అలాగే వుండాల్సి వస్తుంది.
ఆ సమయం రావచ్చు..
రాకపోవచ్చు..
అందుకని-
అందుకని రెడీ కావడానికన్నా ముందే రెడీ కావాలి.
మనల్ని ఎవరో ఎంపిక చేయడానికన్నా ముందే మనం ఎంపిక చేసుకోవాలి.
మనం ఏదైనా పనిని చేయడానికి వేచి చూడటం మొదలు పెడితే ఆ సమయం రావొచ్చు.. రాకపోవచ్చు..
మన జీవితకాలంలో ఆ సమయం రావొచ్చు.. రాకపోవచ్చు..
వేచి చూడటం కాదు..
పని మొదలు పెట్టడం మీదే-
మన ధ్యాస ఉండాలి.

డబుల్ కాట్

$
0
0

మా చిన్నప్పుడు డబుల్ కాట్స్ అనేవి ఉండేవి కావు. నవారు మంచాలు, నులక మంచాలు ఉండేవి. ఒకటీ అరా పెళ్ళి మంచాలు ఉండేవి. పడుకోవాలని అన్పిస్తే మంచాలు వాల్చుకుని పడుకోవాల్సి వచ్చేది. వాటి మీద బట్టలూ, పరుపు చుట్టలని పెట్టేవాళ్ళు. అందుకని ఎక్కువగా కూర్చొని ఉండేవాళ్ళం.
ఇంటి ముందు ఉన్న బల్ల మీద కూర్చొని చదువుకునేవాళ్ళం ఇప్ప టి పిల్లలకు ఉన్నట్టు స్టడీ టేబుల్ లాంటివి ఉండేవి కాదు.
నెలకో, రెండు నెలలకో నవారు మంచాలకి ఉన్న నవారుని గట్టిగా లాగి బిగించేవాళ్ళు. ఇది మా అమ్మకి, మా ఇంట్లో పనివాళ్ళకి ఓ పనిలాగా ఉండేది. నులక మంచాన్ని మా మల్లయ్య గట్టిగా లాగి కట్టేవాడు.
పడుకోవాలని మాకు ఎక్కువగా అన్పించేది కాదు. ఎప్పుడో రాత్రి తొమ్మిది, పది గంటల ప్రాంతంలో పడుకునేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బెడ్‌రూంలో డబుల్ కాట్స్ వుంటున్నాయి.
ఇప్పుడు పిల్లలు కూర్చోవడం తక్కువ, పడుకోవడం ఎక్కువగా మారిపోయింది.
చదువుకునేటప్పుడు, టీవీ చూసేటప్పుడు తప్ప ఎక్కువ శాతం పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. స్మార్టు ఫోన్లు వచ్చిన తరువాత టీవీ చూడటం కూడా మెల్లిమెల్లిగా తగ్గించి వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా యూ ట్యూబ్‌లకే అలవాటు పడుతున్నారు.
అందుకని ఆ సమయంలో కూడా వాళ్ళు పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. నేడు డబుల్ కాట్ సంస్కృతి పిల్లలని ఎక్కువ పడుకునే విధంగా చేస్తోంది.
పిల్లలకు బయట ఆటలు తగ్గిపోయాయి. పడుకోవడం పెరిగిపోతుంది. ఈ డబుల్ కాట్‌లని మార్చితే ఎంత బాగుండు అనిపిస్తుంది.

లంకకు పోయి రావణుడిని కలిసిన శూర్పణఖ(అరణ్యకాండ)

$
0
0

పధ్నాలుగు వేల మంది క్రూరులైన రాక్షస శ్రేష్టు లు, ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు- ఒంటరిగా యుద్ధం చేసిన శ్రీరాముడి చేతిలో చావడం చూసిన శూర్పణఖ- ఇతరులకు సాధ్యం కాని రాముడి పరాక్రమంగా స్వయంగా చూసి భయపడి, బొబ్బలు పెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ, శీఘ్రంగా రావణుడు పాలించే లంకకు పోయింది. అక్కడ దేవతలతో కూడిన ఇంద్రుడిలాగా, పుష్పక విమానంలో మంత్రులతో, సూర్యుడిని పోలిన బంగారు పీఠం మీద తన ఇష్ట ప్రకారం, బంగారు ఇటుకలతో కట్టబడిన వేదిలో హోమం చేయడం వల్ల మండుతున్న అగ్నిహోత్రుడిలా, సమస్త భూతకోటిని, గంధర్వులను జయించ గలవాడిని, యముడి లాంటి వాడిని- రావణుడిని చూసింది శూర్పణఖ.
దేవాసురులకు మధ్య జరిగిన ఘోర యుద్ధంలో అసమానమైన వజ్రాయుధం దెబ్బ వల్ల గాయం మాత్రం పడ్డ వక్షం కల రావణుడిని; ఐరావతం కొమ్ములతో పొడవగా కాయలు కాచిన రొమ్ముకల రావణుడిని; దీర్ఘమైన ఇరవై చేతులు, పది తలలు, తెల్లని చామరాలు, తెల్ల గొడుగు, విశాలమైన ఎతె్తైన రొమ్ము, రాజచిహ్నాలు కల రావణుడిని; వైడూర్యంలాగా మిసమిస మెరిసే రావణుడిని; నిగనిగలాడే రత్నాలు చెక్కిన బంగారు కుండలాలు కల రావణుడిని; పెద్ద ముఖం కల రావణుడిని; తెల్లని దంతాలు కల రావణుడిని; విష్ణుచక్రం లాంటి అనేక ఆయుధాలతో కొట్టబడి గాయపడ్డ సకలావయవములు కల రావణుడిని; ఇతరుల భార్యలను అపహరించే రావణుడిని; సమస్తమైన దివ్యాయుధాలు కల రావణుడిని; ఋషుల యజ్ఞాలు విఘ్నం చేసే రావణుడిని; భోగవతీపురంలో సర్పరాజైన వాసుకిని యుద్ధంలో ఓడించి, తక్షకుడిని గెలిచి, అతడి భార్యను అపహరించిన రావణుడిని; కైలాసంలో కుబేరుడిని గెలిచి పుష్పక విమానాన్ని తెచ్చిన రావణుడిని; ఇంద్రుడి ఉద్యానవనాన్ని, కుబేరుడి ఉద్యానవనంలో వున్న నలిని అనే సరస్సును కోపంతో నాశనం చేసిన బలిష్టుడైన రావణుడిని; ఉదయించే సూర్యుడిని చేతులతో అడ్డగించగల శక్తిమంతుడైన రావణుడిని; సమస్త ప్రాణులను మొర్రో అని ఏడిపించే రావణుడిని; దేవతలను పారదోలిన రావణుడిని; పెద్దనవ్వుతో దేవతా స్ర్తిలకు గర్భస్రావం అయ్యేట్లు చేసిన రావణుడిని; భుజ శౌర్యంతో విరవబడిన ఐరావతం దంతాలు గల రావణుడిని; జనులను బాధించడంలోనే పరమాసక్తిగల రావణుడిని; కుత్సితపు ఆలోచనలు చేయడంలో తొందరపడే రావణుడిని; ఇంతదాకా రాక్షస వంశాన్ని వృద్ధి చేసిన రావణుడిని; కళ్లకు కనబడడం ప్రళయకాలమని ఆభరణాలతో అలంకరించుకునే రావణుడిని; తన అన్నను చూసిన శూర్పణఖ రాముడి భయంతో ఇలా అంది.
తనకు కలిగిన అవమానం, తన దుఃఖం చూసి కూడా ఆదరించకుండా వూరికే చూస్తున్న రావణుడిని చూసి మంత్రులు వింటుంటే, వాళ్లుండగా అలా మాట్లాడడం మంచిది కాదని కూడా భావించకుండా, దురాగ్రహంతో శూర్పణఖ ఇలా అంది.
‘ఓరీ! కండ కొవ్వుతో మదించి ఒళ్లు మరిచినవాడా! ఎప్పుడూ కామసుఖాలతో ఆసక్తి కలిగి హద్దూ అదుపూ లేకుండా, దండించే వాడు లేకుండా మూర్ఖుడవై, నీ పక్కనే నిన్ను వాత వేసేందుకు కాచుకున్న మృత్యుదేవతను కనుక్కోలేక పోతున్నావు కదా! ఎప్పుడూ స్ర్తిలతో రతిక్రీడల్లో మునిగి, వాట్లోనే ప్రీతికలిగి తన ఇష్టం వచ్చినట్లు సంచరించే రాజును ప్రజలు శ్మశానాగ్నిలాగా గౌరవిస్తారా? నీలో అలంత దోషం ఉంది. కాబట్టి నిన్ను లోకులు గౌరవించరు. స్ర్తిలతో విశేషంగా సంభోగించడం వల్ల బుద్ధి బలం చెడి కార్యాకార్యాలు ఆలోచించే శక్తి లేక రాజకార్యాలు తానై చేయని రాజు చెడిపోతాడు. వాడు తలపెట్టిన పనులు చెడిపోతాయి. వాడి రాజ్యం చెడుతుంది. నువ్వు ఆ గతికి చేరనున్నావు.’
‘వేగులవాళ్లను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలుసుకోకుండా, ఆలోచన చేయకుండా, ప్రజలకు అవసరమైనప్పుడు దర్శనం ఇవ్వకుండా, అంతఃపురంలో కాంతాలోలుడై చాటున వుంటూ, స్వయంగా పనులు చేయాల్సి వచ్చినప్పుడు సంబంధం లేనివాళ్లు, స్వార్థపరులు చెప్పిన మాటలు నమ్ముతూ, భార్యలు, మంత్రులు, తోవనపోయే వారు చెప్పిన మాటలు నమ్మి పరాధీనుడైన రాజును తొలగిపోతారు ప్రజలు. అన్ని పనుల్లోనూ తానే పెద్దగా ఉంటూ, తన ఇష్టప్రకారం స్వతంత్రించి పనులు నెరవేర్చక ఇతరులకు పెత్తనం ఇచ్చి, వారితో పనులు చేయించే రాజులు సముద్రంలో పర్వతాలు మునిగినట్లు వాళ్ల వల్లే చెడిపోతారు. వారి ప్రభుత్వం, అధికారం, సంపద వాళ్లకంటే ముందుగానే నశిస్తుంది. నీకెప్పుడు కీడు చేద్దామా అని ఎదురుచూస్తున్న దేవతలు, దానవులు సమయం కోసం కాచుకున్నారు. అది కనుక్కోలేక కార్యాలోచన పరత్వం లేకుండా, స్థిరబుద్ధి లేకుండా, చపలుడవై వుండే నువ్వు ఎలా ప్రాణాలతో వుండగలవు?’
-సశేషం
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

Viewing all 69482 articles
Browse latest View live