Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఎన్నికల నిర్వహణకు రూ.50 కోట్లు

0
0

హైదరాబాద్, డిసెంబర్ 31: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా 50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ఎన్నికలకోసం మొత్తం 120 కోట్ల రూపాయలను ప్రభుత్వం 2018-19 వార్షిక బడ్జెట్‌లో పొందుపరిచింది. ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. రెండో విడతలో తాజాగా 50 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. ఇవి కాకుండా మరో 33 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విడుదల చేసిన 50 కోట్ల రూపాయలను డ్రా చేసి, జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం పంచాయతీరాజ్ కమిషనర్‌ను అదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ పేరుతో సోమవారం జీఓ జారీ అయింది.


ప్రకాశ్‌రాజ్ రాజకీయ ప్రకటన

0
0

హైదరాబాద్: నటుడు ప్రకాశ్‌రాజ్ నూతన సంవత్సరం రోజున రాజకీయ ప్రకటన చేశారు. రానున్న లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు

0
0

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. అర్థరాత్రి వరకు శివారు ప్రాంతాలకు యువత తరలివెళ్లి ఆటపాటలతో గడిపారు. పబ్‌లు, క్లబ్బులలో ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. ఆత్మీయ ఆలింగనాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
0

తిరుమల: తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉంది. నేడు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏడు కంపార్టమెంట్‌లలో భక్తులు వేచి వున్నారు. సర్వ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది.

పాకిస్తాన్‌లో భారత రాయబారికి చేదు అనుభవం

0
0

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో భారత రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ కొత్తగా నిర్మించిన భారత రాయబారి భవనానికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వటానికి నిరాకరించిన తరువాత మరో ఘటన చోటు చేసుకుంది. ఆ భవనంలో డిసెంబర్ 25న ఉద్దేశ్యపూర్వకంగా కరెంటు సరఫరాను కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

0
0

ముంబయి: కొత్త సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకుల వల్ల ప్రస్తుతం సెనె్సక్స్ 64 పాయింట్ల నష్టంతో 36,000 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 10,846 వద్ద ట్రేడ్ అవుతుంది.

దుర్గగుడికి పోటెత్తిన భక్తులు

0
0

విజయవాడ: నేడు భవానీ దీక్షల విరమణ కావటంతో భక్తులు దుర్గగుడికి పోటెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అర్థరాత్రి నుంచే భక్తులు అమ్మ దర్శనం కోసం వేచి వున్నారు. భవానీ దీక్షల నేపథ్యంలో అర్థరాత్రి 2 గంటల నుంచే భక్తులను వదిలారు. జనవరి 1వ తేదీ అర్థరాత్రి వరకు భక్తులను దర్శనం కోసం అనుమతినిస్తామని ఈఓ కోటీశ్వరమ్మ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

0
0

హైదరాబాద్: ఉత్తర ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల చలి తీవ్రత బాగా పెరిగింది. పలు ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు పొడి వాతావరణం, రాత్రి చలి పెరుగుతుందని వాతావరణ శాఖ సైతం పేర్కొంది. తిరుమలలో సైతం చలి తీవ్రత అధికంగా ఉంది. కొండపై 11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయింది.


తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

0
0

హైదరాబాద: తెలంగాణ తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం గవర్నర్ నరసింహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు హాజరయ్యారు.

ఏపీ హైకోర్టు సీఐజేగా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం

0
0

అమరావతి: ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ మంగళవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహాన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

బాలీవుడ్ కమెడియన్ కాదర్‌ఖాన్ కన్నుమూత

0
0

టొరంటో: ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కాదర్‌ఖాన్ టొరంటోలో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. 1990లో వచ్చిన అనేక హిట్ సినిమాల్లో కాదర్‌ఖాన్ నటించారు. కాదర్‌ఖాన్ అంత్యక్రియలు టొరంటోలో జరుగుతాయని ఆయన కుమారుడు సర్పరాజ్ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా కాదర్‌ఖాన్ అరుదైన వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సీఐసీగా సుధీర్ భార్గవ్ ప్రమాణ స్వీకారం

0
0

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార శాఖ కమిషన్ ప్రధాన కమీషనర్‌గా సుధీర్ భార్గవ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీ హాజరయ్యారు.

సెక్రటేరియట్‌కు వచ్చిన గోవా సీఎం పారికర్

0
0

గోవా: కొన్ని నెలల తరువాత గోవా సీఎం పారికర్ ఈరోజు సెక్రటేరియట్‌కు వచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన సెక్రటేరియట్‌కు వచ్చి విధుల్లో పాల్గొన్నారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆమెరికాలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ, ముంబయిలలో సైతం చికత్స చేయించుకున్నారు.

రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్ ప్రమాణ స్వీకారం

0
0

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే బోర్డు చైర్మన్‌గా వినోద్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, ప్రయాణీకుల భద్రత, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సిక్కింలో సైనికుల సేవాభావం

0
0

సిక్కిం: మంచులో చిక్కుకుపోయిన ప్రయాణీకులను కాపాడటం కోసం సైనికులు పాటు పడటమే కాదు వారిని తమ శిబిరాలకు తరలించి వారు మాత్రం మంచులో నిద్రించిన సంఘటన ఇది. నాథులాం నుంచి సుమోంగో ప్రాంతానికి వెళుతున్న దాదాపు 2800 మంది ప్రయాణీకులు విపరీతంగా మంచు కురవటంతో చిక్కుకుపోయారు. వారిని సైనికులు రక్షించి శిబిరాలకు తరలించారు. అక్కడ వారికి తమ మంచాలను ఇచ్చి సైనికులు మంచులో నిద్రించారు. సైనికుల సేవానిరతికి ప్రయాణీకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పర్యాటకులను అసోం రాజధాని గ్యాంగ్‌టాక్‌కు తరలించారు.


బ్యాంకుల్లో మోసాలపై రాహుల్ విమర్శ

0
0

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. చౌకీదార్ దొంగల కోసం బ్యాంకులను దోచిపెట్టారని ట్వీట్ చేశారు. దాదాపు రూ.41,167 కోట్లు తన స్నేహితుల కోసం దోచిపెట్టారని అన్నారు.

మేడిగడ్డ పనులను పరిశీలించిన కేసీఆర్

0
0

కరీంనగర్: ప్రాజెక్టు పనుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారంనాడు మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పనులు ఎంత వరకు వచ్చాయే ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. సీఎం వెంట సీఎస్ జోషీ, సీఎం కార్యదర్శి స్మితా అగర్వాల్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

తెలంగాణ ఫలితాలతో మహాకూటమికి బీటలు: జైట్లీ

0
0

న్యూఢిల్లీ: మహాకూటమికి తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే బీటలు పడుతున్నాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ విమర్శలు కురిపించారు. ప్రతి పక్ష నేతలది విఫలమైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ కలిసి తెరాసను ఓడించాలనుకుని విఫలమయ్యాయి’ అని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఫలితమే లోక్‌సభ ఎన్నికల్లోనూ వస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని అన్నారు.

ఆరోగ్యమైన కళ్ల కోసం..

0
0

* బేబీ ఆయిల్‌ని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
* కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ల చుట్టూ వలయాకారంలో రాసి నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుముఖం పడుతుంది.
* కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పలకి ఆముదం రాయాలి.
* టొమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కళ్లచుట్టూ పూయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పూస్తే మంచి ఫలితం ఉంటుంది.
* కీరాను చక్రాల్లా కోసం ఐదు నిముషాలు కళ్లమీద ఉంచినా కళ్లు తాజాగా ఉంటాయి.
* ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

రంగవల్లి

0
0

సరిచుక్కలు
22 చుక్కలు
2 వరుసలు
2 నిలువు

ఎం.శేషమ్మ, ఇందుకూరుపేట (నెల్లూరు జిల్లా)
=============================================================
ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.

Viewing all 69482 articles
Browse latest View live