Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

విశ్వరూపం.. వైభవోపేతం

0
0

భద్రాచలం టౌన్, జనవరి 2: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి విశ్వరూప సేవ కనుల పండువగా జరిగింది. ముక్కోటి దేవతలు ఒకేసారి వైకుంఠ రాముడి సన్నిధిలో కొలువుదీరిన కమనీయ దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వం చెందారు. భద్రాద్రి రామయ్య రాజాధిరాజుగా వేంచేయగా, వారి సన్నిధిలో 108 దేవతా విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై కొలువుదీర్చారు. సర్వదేవతాలంకార రూపంలో దర్శనమిచ్చిన శ్రీ రామచంద్ర స్వామిని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఉత్సవంలో భాగంగా వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు తదితర ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వార్ల ఉత్సవ విగ్రహాలనూ సర్వదేవతా అలంకారంలో తీర్చిదిద్దారు. గరుడ వాహనంపై రాములవారు ఆశీనులు కాగా సాయం సంధ్యవేళ సాంబ్రాణి పొగలు అలుముకుంటుండగా రామయ్యతో పాటు ఇతర ఉత్సవమూర్తులకు ఆరాధన నిర్వహించి కదంబం (ప్రత్యేక ప్రసాదం) నివేదించారు. దేవస్థానం విద్వాంసుల నాదస్వరాల మధ్య ప్రత్యేక కీర్తనలు ఆలపిస్తూ, వాటికి అనుగుణంగా అభిషేక సేవలు నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన, బంగారు పుష్పాలతో అర్చనలు చేశారు. విశ్వరూప సేవలో భాగంగా ఒకేచోట కొలువైన రామచంద్రుడితో పాటు దేవతామూర్తలందరికీ ఏకారాధన జరిగింది. ఐదు రకాల హారతులు ఇచ్చారు. కర్పూర, మహా, అష్టోత్తర, ద్వాదశ, నక్షత్ర హారతులను వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సమర్పించారు. ఈ సందర్భంగా మహా దర్బారు సేవలో రామచంద్ర మహా ప్రభువుకు ఇచ్చిన దివిటీ సలాం ఉత్సవానికే ప్రత్యేకత తీసుకొచ్చింది.
ముక్కోటి ఉత్సవాలు వెళ్లిన 16వ రోజు, బహుళ ద్వాదశి రోజున రామాలయంలో విశ్వరూప సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని ఆలయ పండితులు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు అత్యంత వైభవోపేతంగా కార్యక్రమం కొనసాగింది. సంవత్సర కాల పూజల్లో దోషాలు దొర్లితే వాటి ప్రాయశ్చిత్తం కోసం రామయ్య, సీత, లక్ష్మణ స్వాములతో పాటు 108 మంది దేవతామూర్తులను ఒకేచోట కొలువుదీర్చి.. ఏకకాలంలో సేవలు నిర్వహించడం విశ్వరూప సేవ విశిష్టత. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కొలువై ఉన్నప్పుడు దర్శనం చేసుకుంటే ఎంత పుణ్య ఫలమో విశ్వరూప సేవనాడు దర్శించుకుంటే అంతటి పుణ్యం వస్తుందని అర్చకులు తెలిపారు. స్వామివారు తన విశ్వరూపాన్ని ధరించి వేంచేసి ఉండటం ద్వారా కూడా దీనికెంతో ప్రత్యేకత ఉందని వివరించారు. మరే ఇతర ఆలయాల్లో జరగని విధంగా స్వామివారి విశ్వరూప సేవను భద్రాచలం దేవాలయంలో నిర్వహించడంతో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.


పంచాయతీ పోరుకు సిద్ధమైన నేతలు

0
0

కల్లూరు, జనవరి 2: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీని దక్కించుకునేందుకు ఎవరికి వారు సమాయత్తమవుతూ కోటి ఖర్చైన వెనుకాడమంటూ కాలు దువ్వుతున్నారు. కల్లూరు పంచాయతీకి ఓసి మహిళ రిజర్వేషన్ ఖరారు కావటంతో బడా వ్యాపార వెత్తలు ఇప్పటికే ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎంత ఖర్చైన పరావాలేదు సర్పంచ్ పదవి తమకే దక్కే విధంగా పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్ తరుపున ఆ పార్టీ నాయకులు పసుమర్తి చందర్‌రావు తన సతీమణి పద్మావతిని ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. పద్మావతి గతంలో కల్లూరు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇదే పార్టీ నుండి ఎంపీ వర్గం నాయకులు లక్కినేని రఘు తమ కుటుంబం నుంచి మహిళను ఎన్నికలబరిలో దింపుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అటు టీడీపీ నుంచి స్థానిక వ్యాపారవెత్త మోటమర్రి వేణు, ఇమ్మడి వీరభద్రరావు, పోలోజు సుధాకరచారి, చారుగుండ్ల, ప్రతాపరెడ్డి కుటుంబాల నుంచి కూడా మహిళలను ఎన్నికల బరిలో దింపేందుకు ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ ఎన్నిక హోరాహోరిగా సాగనున్నట్లు ప్రజల నుండి వాదనలు వినిపిస్తున్నాయి. మండలంలో మొత్తం 31 గ్రామపంచాయతీల్లో బీసీ 2, ఓసీ 15, ఎస్టీ 4, మరో పది ఎస్టీకి కేటాయించగా ఓసీకి కేటాయించిన పంచాయతీల్లో ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి. ఇందులో కొన్ని యునామస్‌ల కోసం ప్రయత్నాలు చేసేందుకు బడా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండలంలో లింగాల, చెన్నూరు, వైఎన్ పురం, నారాయణపురం, కొర్లగూడెం, బత్తులపల్లి గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎంత మంది ఓటర్లు ఉంటే అంతమందికి ఓటుకు రూ. 500 నుండి వెయ్యి వరకు ఇచ్చి గెలుపు దక్కించుకోవాలంటూ ఆయా అభ్యర్థులకు చెందిన నాయకులు లెక్కలేసుకుంటున్నారు. కల్లూరులో సుమారు పదివేల ఓట్లు ఉండటంతో సుమారు కోటి రుపాయల వరకు ఖర్చవుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. కల్లూరు మేజర్ గ్రామపంచాయతీకి పోటీ పడుతున్న మహిళల వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
* జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు
కొత్తగూడెం, జనవరి 2: జిల్లాలోని 479 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గ్రామ పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. తొలి విడతగా అశ్వాపురం, బూర్గంపహాడ్, చర్ల, దమ్మపేట, మణుగూరు, పాల్వంచ, ములకలపల్లి, రెండో విడతగా కరకగూడెం, పినపాక, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, మూడో విడతగా లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, గుండాల మండలాలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. 479 గ్రామ పంచాయతీలను 454 గిరిజనులకు కేటాయించగా, 29 పంచాయతీలను ఇతరులకు కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ఉంటుందన్నారు. సర్పంచ్ ఎన్నికలకు పోటీచేసే సాధారణ అభ్యర్థులు రూ 2 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ వెయ్యి, జనరల్ వార్డు మెంబర్లు రూ 500, ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులు రూ 250 చెల్లించాలన్నారు.

భూసర్వేపై రైతుల ఆగ్రహం

0
0

ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 2: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేకోసం నిర్వహిస్తున్న భూ సర్వే రైతుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. బలవంతపు భూ సర్వే చేయడంపై కనె్నర్ర చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహంతో రగిలిపోయారు. జాతీయ రహదారికోసం బలవంతంగా భూములు లాక్కుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నినదించారు. పచ్చటి పంటపొలాల్లో నిర్వహిస్తున్న భూ సర్వేను వెంటనే నిలుపుదలచేయాలని ముక్తం కంఠంతోనినదించారు. జాతీయ రహదారి నిర్మాణంపై రైతుల భూముల విషయంలో స్పష్టమైన హామి ఇచ్చేంతవరకు వెనక్కు తగ్గేదిలేదని అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు సిద్దమని తేల్చిచెప్పారు. సూర్యాపేట నుండి ఖమ్మం, ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మించనున్న గ్రీన్‌పీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం కోసం జిల్లా అధికారులు భూ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఈ భూ సర్వేను నిలిపివేయాలని బలవంతంగా రైతులనుండి భూములు లాక్కోవద్దని డిమాండ్ చేస్తూ రైతులు అనేక ధపాలుగా ఆందోళనలు చేపట్టి భూ సర్వేను అడ్డుకున్నారు. ఇటీవల టిటిడిసి సమావేశ మందిరంలో జెసితో నిర్వహించిన ఖమ్మం డివిజన్ రైతుల సమావేశంలో సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఈ నేపద్యంలో అధికారులు రైతుల మనోభావాలను పరిగణలోనికి తీసుకోకుండా భూ సర్వేను చేపట్టడంతో ఆ రహదారి నిర్మాణ పరిధిలోగల రైతులు పలు రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో బుధవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయి కలెక్టరేట్‌లో ప్లేకార్డులతో బైటాయించారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ నినదించారు. చేస్తున్న భూ సర్వేను వెంటనే నిలిపివేయాలని రైతులను నిలువునా ముంచే గ్రీన్‌పీల్డ్ జాతీయ రహదారి మార్గాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్‌ఇండియా కాంగ్రెస్ నేషనల్ కో ఆర్డినేటర్ ఐతం కోదండ రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో అన్ని వర్గాల రైతులు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఈ ధర్నానుద్దేశించి ఐతం రామారావు, సిఎల్‌పి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సిపియం, సిపిఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరావు, భాగం హేమంతరావు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతాంగంపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. గతంలో అనేక ధపాలుగా జిల్లా అధికారులకు రైతులు మొరపెట్టుకున్నప్పటికి లెక్కచేయకుండా మొండి వైఖరితో భూ సర్వేలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎన్నికల్లో రైతాంగం ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. అధికార పక్షానికి సంబందించిన ఎమ్మెల్యేలు ఈ సమస్యను లేవనెత్తి రైతులకు అండగా నిలవాలన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకిరువైపుల 50అడుగులు విస్తరించి ఈ రహదారిని అభివృద్ధి పరచవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో జాతీయ రహదారిని నిర్మించడంతోపాటు రైతుకు మేలుచేసిన వారవుతారన్నారు. ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించిన రైతులు కలెక్టరేట్‌లో బైటాయించి అనంతరం జాతీయ రహదారిపై ఉదయం నుండి మద్యాహ్నాం వరకు ఆందోళన చేపట్టారు.

కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తా

0
0

కామేపల్లి, జనవరి 2: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తానెల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని ఇల్లెందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బాణోత్ హరిప్రియనాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని జగన్నాధ తండాలో భూక్యా కిషన్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో సుమారు 50 కుటుంబాలకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లను గెలిపించుకోవాలని, దీనికై కార్యకర్తలు చిత్తశుద్ధితో బేదాభిప్రాయాలు మాని సైనికుల్లాగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామసీమలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ పార్టీని వీడిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆంతోటి అచ్చయ్య, ఉపాధ్యక్షులు మల్లెంపాటి శ్రీనివాస్, నాయకులు వెంకట్రావ్, గోపిరెడ్డి, మోహన్‌రెడ్డి, అనంతరాములు, బాలు, సూర్యం, సిరిపురపు రవి, మీడియా ప్రతినిధి గుండ్ల రవిబాబు, వరికొల్లు సైదులు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
కొణిజర్ల, జనవరి 2: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపికయ్యారు. మండల పరిధిలోని పెద్దగోపతి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తాటికొండ శివ డిసెంబర్ నెలలో సిద్ధిపేటలో జరిగిన అండర్ 17 స్యూల్‌గేమ్ పెడరేషన్‌లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. సదరు విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ రంజాన్, ఉపాధ్యాయులు రవికుమార్, ఎన్ వెంకటేశ్వర్లు, సిహెచ్ వెంకటేశ్వర్లు, జయరాజు, చంద్రశేఖర్ తదితరులు అభినందించారు. శివ జాతీయస్థాయిలో కూడా మంచి నైపుణ్యం ప్రదర్శించి పాఠశాలతో పాటు ఈ రాష్ట్రానికి మంచిపేరు తేవాలని ఆకాక్షించారు.

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

0
0

ఖమ్మం, జనవరి 2: ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు దశల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 20మండలాలు ఉండగా అందులో రెండు పూర్తిగా ఏజన్సీ మండలాలని, 15పూర్తిగా మైదానంలో ఉండగా మరో మూడు మండలాల్లో కొంత మైదాన ప్రాంతం, మరికొంత ఏజన్సీ ప్రాంతం ఉందన్నారు. ఈ మండలాల పరిధిలో 584గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అందులో 99పంచాయతీలు పూర్తిగా ఏజన్సీ ప్రాంతంలోనే ఉండటంతో వాటిని ఎస్టీలకు రిజర్వు చేశామన్నారు. మైదాన ప్రాంతంలో 11పంచాయతీలు పూర్తిగా ఎస్టీలే ఉండటంతో వారికే రిజర్వు చేశామన్నారు. మిగిలిన 474పంచాయతీల్లో రిజర్వేషన్ చట్టం ఆధారంగా ఎస్సీ, బిసి, ఎస్టీ, ఓసిలకు రిజర్వు చేయడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, మొదటి విడతలో కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ, కామేపల్లి మండలాల పరిధిలోని 188 పంచాయతీలకు 1736వార్డులకు, రెండవ దశలో ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కారేపల్లి మండలాల పరిధిలోని 204పంచాయతీలకు 1862వార్డులకు, మూడవ దశలో రఘునాధపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల పరిధిలోని 192గ్రామ పంచాయతీలకు 1740వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు.
మొదటి దశ పోలింగ్‌కు జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుండగా 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13వ తేదీ వరకు ఉప సంహరణ, 21వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అదే రోజున మధ్యాహ్నం రెండుగంటల తరువాత ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని, వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా చేతులెత్తే పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. రెండవ దశ పోలింగ్‌కు జనవరి 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 17వ తేదీ వరకు ఉప సంహరణ, 25వ తేదీన ఎన్నికలు, అదేరోజున ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మూడవదశ పోలింగ్‌కు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుండగా 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 22వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని, 30వ తేదీ ఎన్నిక నిర్వహించి అదేరోజు ఫలితాలను వెల్లడిస్తామన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితానే వినియోగిస్తామన్నారు. మొత్తం 5338వార్డుల పరిధిలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 750ప్రభుత్వ భవనాల్లోను, 17ప్రైవేటు భవనాల్లోను, 56తాత్కాలిక ఏర్పాట్లలోను చేస్తున్నామన్నారు. ఇందులో 1666పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవి గాను, 1227అత్యంత సమస్యాత్మకమైనవిగాను, 432క్లిష్టమైనవిగాను గుర్తించి అందుకు అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలింగ్ కోసం అవసరమైన బ్యాలెట్ పత్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే 12మంది నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా 197మంది స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులను, 40మంది జోనల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రెండవ విడతలో వేంసూరు మండలంలో పంచాయతీ ఎన్నికలు
వేంసూరు, జనవరి 2: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో గ్రామపంచాయతీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. వేంసూరు మండలం రెండవ విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు కావలసిన సామగ్రిని అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎన్నికల హడావుడి స్పష్టంగా కానవచ్చింది. మండలంలోని పలు గ్రామాల నుంచి పలువురు నాయకులు ఓటర్ల జాబితా కొరకై వేచి ఉండటం కనిపించింది. ఒకే ఇంటిలోని ఓట్లు వేరువేరు వార్డుల్లోకి మళ్ళటంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఒక ఇంటికి ముందు వెనుక చుట్టుప్రక్కల నివాసాలు వేరు వేరు వార్డుల్లోకి వెళ్ళటంతో సవరించుకొనే వీలు ఉందా అంటు పలువురు కార్యాలయాల్లోకి రావటం కనిపించింది. నూతన ఓటర్ల జాబితాను తీసుకొనేందుకై ఎంపీడీ ఓ కార్యాలయానికి పలువురు నేతలు వస్తున్నారు. మంలంలోని 26 పంచాయతీలకు కావలసిన నామినేషన్ పత్రాలు ఇతర పత్రాలను వార్డుల వారీగా ఏరుచేసి సిద్దం చేసుకుంటున్నారు. అదేరీతిలో 244 వార్డులకు కావలసిన పత్రాలను సైతం ఏరువేరుగా సిద్దం చేస్తున్నారు. మండలంలో మొత్తం ఓటర్లు 33 వేల 610 మంది. ఇందులో పురుషులు 16 వేల 926 మంది, మహిళలు 16 వేల 680 మంది తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలో బీసీలు 14 వేల 066, ఎస్టీలు 1633 ఓటర్లు, ఎస్సీలు 9 వేల 544 మంది ఓటర్లు, ఇతరులు 8 వేల 365 మంది ఉన్నారు.

కేరళ బంద్ హింసాత్మకం

0
0

తిరువనంతపురం: శబరిమల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేరళలో బంద్ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకోవటం పట్ల రాష్టవ్య్రాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల టైర్లను తగులబెట్టారు. వాణిజ్య సముదాయాలను మూసివేశారు. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా జనజీవనం స్తంభించింది. ఈ ఆందోళనలో గాయపడిన శబరిమల కర్మసమితి సభ్యుడు చంద్రన్ మృతిచెందాడు. పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీలో విమాన రాకపోకలు నిలిపివేత

0
0

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం 7.30 గంటల నుంచే విమానాల టేకాఫ్ నిలిపివేశారు. జెట్ ఎయిరవేస్ కూడా విమానాల రాకపోకలపై ట్వీట్ చేసింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పూజారా ఆఫ్ సెంచరీ

0
0

సిడ్నీ: సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాట్స్‌మ్యాన్ పూజారా 64 పరుగులు పూర్తి చేసి శతకం వైపు పరుగులు పెడుతున్నాడు. ఆయన ఈ మ్యాచ్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.


ఉత్తర భారతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

0
0

న్యూఢిల్లీ: ఈశాన్య ఉత్తర భారతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జమ్మూకాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, వారణాసి తదితర రాష్ట్రాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో నీరు గడ్డకట్టింది. ఢిల్లీ అమృతసర్ తదితర ప్రాంతాల్లో మంచుదుప్పటి కమ్మెయ్యటంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. హిమాచాల్‌ప్రదేశ్‌లోని లోయల్లో, కొండల్లో మైనస్ డిగ్రీలు నమోదుకావటంతో గిరిజనులు అల్లాడిపోతున్నారు.

మహిళలకు రక్షణ ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత:పినరయి

0
0

తిరువనంతపురం: అయ్యప్పస్వామిని దర్శించుకోవటానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించటం ప్రభుత్వ బాధ్యత అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శబరిమలను సంఘపరివార్ యుద్ధ్భూమిగా మార్చివేసిందని విమర్శించారు. అయ్యప్పను దర్శించుకున్న ఆ ఇద్దరు మహిళలను భక్తులు అడ్డుకోలేదని, వారిని అయ్యప్ప భక్తులే లోనికి తీసుకువెళ్లారని పినరయి వివరించారు. ఈ రోజు బంద్ వల్ల ఏడు పోలీసు వాహనాలు, 79 ఆర్టీసీ బస్సులు దగ్ధమయ్యాయని అన్నారు. 39మంది పోలీసులపై దాడి జరిగినట్లు వివరించారు.

కోహ్లీ మరో అరుదైన రికార్డు

0
0

సిడ్నీ: భారత కెప్టన్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 వేల పరుగులు పూర్తిచేసి 12వ క్రికెటర్‌గా భారత్ తరుపున సచిన్, ద్రవిడ్ తరువాత మూడవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

0
0

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖమన్యంలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోయాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల మరో రెండు రోజుల పాటు తెలంగాణలో చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

బులెంద్‌శహర్ కేసు ప్రధాన నిందితుడి అరెస్టు

0
0

లక్నో: బులెంద్‌శహర్ కేసు ప్రధాన నిందితుడు, భజరంగ్ దళ్ కార్యకర్త యోగిశ్ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గోవధ చేశారన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని బులెంద్‌శహర్‌లో గత ఏడాది డిసెంబర్3న అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఓ పోలీసు అధికారి మృతిచెందాడు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన యోగిశ్ రాజ్ గత నెల రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

వివాదం అనే పదం వాడకండి:సుష్మాస్వరాజ్

0
0

న్యూఢిల్లీ: రఫెల్ వ్వవహారంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లోకసభలో సూటిగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ ఆనంద్‌శర్మ లోకసభలో మాట్లాడుతూ రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై వివాదం సమసిపోవటానికి ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రధాని మధ్య జరిగిన చర్చల వివరాలు వెల్లడించాలని కోరారు. దీనిపై సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ ఈ వ్యవహారంలో వివాదం అనేది ఏమీ లేదని, అది మీ మనస్సుల్లో ఉందని అన్నారు. దయచేసి వివాదం అనే పదం వాడవద్దని విజ్ఞప్తి చేశారు.

పోలవరంపై మోదీ మాటలు విడ్డూరం

0
0

విజయవాడ: పోలవరంపై ప్రధాని మోదీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన గురువారంనాడు విలేకర్లతో మాట్లాడుతూ ప్రధాని నిన్న బీజేపీ నేతలతో మాట్లాడుతూ పోలవరానికి ఏడువేల కోట్ల రూపాయలను కేంద్ర విడుదల చేసిందని, ఈ ప్రాజెక్టును ఏపీ సక్రమంగా నిర్వహించటం లేదని కాగ్ సైతం పేర్కొందని అనటం పట్ల ఆయన నిరసన వ్యక్తంచేశారు. ఓవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తుంటే మరో వైపు మోదీ ఈ ప్రాజెక్టును సందర్శించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని ప్రశ్నించారు. ఏపీ పట్ల మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.


బషీర్‌బాగ్‌లో అగ్నిప్రమాదం

0
0

హైదరాబాద్: బషీర్‌బాగ్ స్కైలైన్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెంట్‌హౌస్‌లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పెంట్‌హౌస్‌లో ఉన్న సామాగ్రి కాలిబూడిదైంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకవచ్చారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

విద్యార్థులకు రాహుల్ నాలుగు ప్రశ్నలు

0
0

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈరోజు జలంధర్‌లోని లవ్‌లీ యూనివర్శిటీలో జరిగే జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొంటున్న సందర్భంగా ప్రధానికి నాలుగు ప్రశ్నలు వేయాల్సిందిగా విద్యార్థుల నుద్ధేశించి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ రఫెల్ ఢీల్‌పై సమాధానం చెప్పలేక లవ్‌లీ యూనివర్శిటీకి పారిపోయారని విమర్శించారు.

లోకసభ నుంచి టీడీపీ ఎంపీలు సస్పెన్షన్

0
0

న్యూఢిల్లీ: లోకసభ నుంచి టీడీపీ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ బహిష్కరించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టిముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవటంతో స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మొత్తం 14 మంది సభ్యులను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. అలాగే కావేరీ జలాల అంశంపై ఆందోళన చేస్తున్న అన్నాడిఎంకే సభ్యులను సైతం స్పీకర్ సస్పెండ్ చేశారు.

గురువు అంత్యక్రియల్లో పాల్గొన్న సచిన్

0
0

ముంబయి: ప్రముఖ క్రికెట్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమాకాంత్ అచ్రేకర్ (87) అంత్యక్రియల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పాల్గొన్నారు. తన గురువు పార్థీవ దేహాన్ని స్మశానవాటిక వరకు మోశారు. అశ్రునయనాలతో అంజలి ఘటించారు. ఎంతోమంది కుర్రాళ్లకు క్రికెట్ నేర్పించిన శివాజీ పార్క్‌లో అచ్రేకర్ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం వుంచారు. ఈ అంత్యక్రియల్లో సచిన్‌తోపాటు పలువురు క్రికెట్ క్రీడాకారులు, బీజేపీ, శివసేన నేతలు పాల్గొన్నారు.

స్లీవ్‌లెస్ వేసుకోవాలంటే..

0
0

మహిళల వ్యక్తిత్వాన్ని, వారిలోని ఆధునికతను బయటపెట్టే వస్తధ్రారణల్లో స్లీవ్‌లెస్ ఒకటి. సందర్భాన్ని బట్టి చీర, జీన్స్ మొదటు పలు వస్తధ్రారణలకు టాప్‌గా స్లీవ్‌లెస్ నప్పుతుంది. ముఖ్యంగా సన్నగా, పొడుగ్గా ఉన్న వారి అందాన్ని స్లీవ్‌లెస్ రెట్టింపు చేస్తుంది. సాదా, ప్రింటెడ్ చీరలు ధరించేవారు స్లీవ్‌లెస్ ధరిస్తే మరింత అందంగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. జీన్స్‌పై స్లీవ్‌లెస్ టాప్ వేసుకుంటే అమ్మాయిలూ అంతే.. అయితే స్లీవ్‌లెస్ ఎంపికకు ముందు ఈ కింది అంశాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటంటే..

* చేతులు, భుజాల కింద తప్పనిసరిగా వాక్సింగ్ చేసుకోవాలి.
* ప్రతిరోజూ మంచి బాడీ లోషన్‌తో చేతులకు మసాజ్ చేస్తూ ఉండాలి.
* నెలలో రెండు సార్లు తప్పనిసరిగా మానిక్యూర్ చేయించాలి.
* ఎండ వల్ల చేతులు నల్లబడకుండా సన్‌స్క్రీన్ లోషన్‌ను రాస్తూ ఉండాలి.
* భుజాల కింద పౌడర్ లేదా డియోడ్రెండ్ వాడాలి.
* డీప్‌నెక్ లేదా స్లీవ్‌లెస్ కాటన్ సూట్ ధరించడం వల్ల ఎండవేడిని తప్పించుకోవచ్చు.

Viewing all 69482 articles
Browse latest View live