Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నారాయణపేటలో మిన్నంటిన సంబురాలు

$
0
0

మహబూబ్‌నగర్, జనవరి 3: రాష్ట్రంలో మరోరెండు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఈమేరకు గురువారం నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ నారాయణపేటలో సంబురాలు మిన్నంటాయి. నారాయణపేట పట్టణంలో తెరాస శ్రేణులు, జిల్లా సాధన సమితి సభ్యులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూనే ఈ జిల్లాలో ఏ ఏ మండలాలు ఉండాలో ఇదివరకే అందించిన నివేదిక ప్రకారంగా ఆయా మండలాల జాబితాలతో కూడిన నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నూతనంగా ఏర్పడబోయే నారాయణపేట జిల్లాలో మద్దూర్, దౌల్తాబాద్, దామరగిద్ద, కోయిలకొండ, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలం పేట మున్సిపాలిటీ ఊట్కూర్, కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వమండలాలతో కూడిన నారాయణపేట జిల్లా ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే వికరాబాద్ జిల్లాలో ఉన్న దౌల్తాబాద్ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న మద్దూర్ మండలాలను నారాయణపేట జిల్లాలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే నారాయణపేటలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మాజీమంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నారాయణపేట జిల్లా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నేరవేర్చారని జిల్లా ఏర్పాటుకు నోటీఫికేషన్ కూడా విడుదల చేశారని ఆయన వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా గత రెండేళ్ల క్రితమే కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని అయితే మరో రెండుజిల్లాల డిమాండ్ ఉండడంతో నారాయణపేట జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కర్ణాటక సరిహద్దులో గల నారాయణపేటను జిల్లాగా ఏర్పాటు చేయడం అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసమేనని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తానన్న హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. చిన్న జిల్లాలతో మరింత అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ భావిస్తునానరని ఆయన వెల్లడించారు.
చిత్రం..నారాయణపేటలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి


శాసనసభలోనూ బీసీల వెనుకబాటు

$
0
0

ధర్మపురి: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే వెనక బడిన కులాల డిమాండ్ వాస్తవానికి అరణ్య రోదనే అవుతున్నది. తెలంగాణ నూతన రాష్ట్రంలో 2014 సంవత్సరపు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మొత్తం జనాభా 3,68,76,544 కాగా, అందు బీసీలు 1,88,41,009 అంటే 51.09శాతంగా నమోదైంది. రాష్ట్ర జనాభాలో ఇది సగంపైనే అన్నమాట. రాష్ట్రంలో 2.20కోట్లమంది అంటే 56శాతం బీసీలు ఉన్నారని, ముస్లింలలోని 14విభాగాలలో కొన్ని వర్గాల వారు బీసీ వర్గాలలో చేర్చిన వారితో కలిపి 70శాతం ఉంటారని బీసీల సంఘాల గణన ప్రాతిపదికన వాదన ఉన్నది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలు కలిపి రాష్ట్ర జనాభాలో 89శాతం ఉంటారని చెపుతుండగా, ప్రభుత్వం 85శాతం ఉంటారని భావిస్తున్నది. 64,44,584 (17.48%) షెడ్యూల్డు కులాల, 36,44,453 (9.88%) షెడ్యూల్డు తెగల వారున్నట్లు వివరాలలో పేర్కొనబడింది. ప్రస్తుతం నిర్వహించనున్న గ్రామ పంచాయతి ఎన్నికలలోనూ 50శాతానికి రిజర్వేషన్లు మించరాదని సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా బీసీలకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాటించిన 34శాతం కోటాను, 23శాతానికి తగ్గించారు. రాష్ట్ర వ్యాప్త గణాంకాల ఆధారంగా 5.73% షెడ్యూల్డు తెగలకు, 20.46% షెడ్యూల్డు కులాలకు, 23.81% బీసీలకు స్థానాలను కెటాయించడంలో ప్రాతిపదిక పాటించారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నదంటూ, బీసీ సంఘాల, కులాల ప్రతినిధులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మలి శాసనసభ ఎన్నికలలో 65మంది ఓసిలు, 23మంది బీసీలు, 19మంది ఎస్సీలు, 12మంది ఎస్టీలు విజేయులై నిలిచారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలలో తెరాస - 88, జాతీయ కాంగ్రెస్ - 19, ఎంఐఎం - 7, స్వతంత్రులు - 2, టీడీపీ - 2, బీజేపీ - 1ఉన్నారు. వీరిలో ఓసీలు...బ్రాహ్మణులు - 2, కమ్మ - 6, ముస్లిం - 8, రెడ్డి - 39, వెలమ - 9, వైశ్య -1 మొత్తం 65మంది ఉన్నారు. బీసీల ప్రతినిధులు ...గంగపుత్ర - 1, గౌడ -4, లోధ్ - 1, ముదిరాజ్ - 1, మున్నూరుకాపు - 9, పెరిక - 1, వంజరి - 1; యాదవ - 5 మంది మొత్తం 23మంది ఎన్నికైనారు. షెడ్యూల్డు కులాల విషయాని కొస్తే...మాదిగ - 11, మాల - 6, మోచి - 1, నేతకాని - 1మంది మొత్తం 19మంది; షెడ్యూల్డు తెగలకు సంబంధించి...గోండు - 1, కోయ - 4, లంబాడి - 7మంది మొత్తం 12మంది శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1999 శాసనసభలో 26మంది, 2004లో 17మంది, 2009లో 25మంది, 2014లో 19మంది ఉండగా ప్రస్తుతం 2018 నుండి 23మంది బీసీల ప్రతినిధులు తెలంగాణ మలి శాసనసభకు ప్రాతినిథ్యం వహించనున్నారు. చట్టసభకు ఎన్నిక కావడంలోనూ ధనవంతులకే సాధ్యమవుతున్నదనే వాస్తవం ఎవరూ కాదనలేని చేదునిజం.

సార్వత్రిక సమ్మెకు వ్యకాసం మద్దతు

$
0
0

హైదరాబాద్, జనవరి 3: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 8, 9 తేదీతల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు ప్రకటించింది. సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు గురువారం నాడొక ప్రకటన చేస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరపతలపెట్టిన సమ్మెకు కార్మిక లోకం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, కనీస పెన్షన్ నెలకు 6వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించడం ఆపాలని, నిత్యావసర వస్తువులు ధరలు నియంత్రించాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్స్‌న్ రద్దు చేయాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి కార్మికులు సమాయత్తం కావాలని కాంతయ్య, వెంకట్రాములు పిలుపుఇచ్చారు.

21 ఏళ్లు నిండితేనే అర్హులు

$
0
0

హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో చాలా మందికి వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ముఖ్యమైన విషయాలను ప్రస్తావిస్తూ మార్గదర్శకాలను గురువారం విడుదల చేశారు. కమిషన్ విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి.
నామినేషన్ పరిశీలన తేదీ నాటికి అభ్యర్థి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉన్నవారే సదరు గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా వార్డు సభ్యత్వ స్థానానికి పోటీ చేసేందుకు వీలుంటుంది.
ఒక వార్డులో ఉండే ఓటరు అదే వార్డుకు పోటీ చేసే అభ్యర్థికి ప్రతిపాదన చేసేందుకు వీలుంటుంది తప్ప ఇతర వార్డు సభ్యత్వానికి ప్రతిపాదించేందుకు వీలులేదు.
1995 మే 31 తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే సర్పంచ్, వార్డు సభ్యత్వానికి పోటీ చేసేందుకు అర్హత లేదు. 1995 మే 31 కి ముందే ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉంటే అర్హులే. రెండు కాన్పులలో కవలలు పుడితే వారు అర్హులే. పిల్లలను దత్తత ఇచ్చి, ఇద్దరే పిల్లలని క్లెయిమ్ చేసేందుకు వీలులేదు.
ఒక వ్యక్తి ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురి పిల్లలకు తండ్రి అయితే అనర్హుడు. నామినేషన్ పత్రాల పరిశీలనరోజు వరకు వారి పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలలో ఉద్యోగం చేసే వారు పోటీకి అనర్హులు. అలాంటి ఉద్యోగులు నామినేషన్ పరిశీలన రోజు వరకు రాజీనామా చేసి ఉంటే అర్హులవుతారు.
రేషన్ డీలర్లు పోటీ చేసేందుకు అర్హులు
అంగన్‌వాడీ వర్కర్లు పోటీకి అనర్హులు.
నీటి వినియోగదారుల సంఘం సభ్యులు సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు వీలులేదు.
సహకార సంఘాల సభ్యులు పంచాయతీల్లో పోటీ చేయవచ్చు.
మతసంబంధమైన పాలక వర్గాల చైర్‌పర్సన్లు, సభ్యులు పంచాయతీల్లో పోటీ చేసేందుకు వీలులేదు.
ఆర్‌టీసీ, సింగరేణి కార్మికులు అనర్హులు.
ప్రభుత్వ పెట్టుబడి 25 శాతం కంటే తక్కువ ఉండే సంస్థలు, కంపెనీల ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.
అభ్యర్థి తన దరఖాస్తుతో పాటు ఇచ్చే డిక్లరేషన్‌లో తప్పుడు సమాచారం ఇస్తే పోటీ చేసేందుకు అనుమతిస్తారు. వారు తప్పు చేశారా లేదా అన్న విషయం కోర్టు చెప్పాల్సి ఉంటుంది.
మతిస్థిమితం లేని వారు పోటీ చేసేందుకు వీలులేదు.
ఫోర్జరీ సంతకంతో అభ్యర్థులు పోటీ చేసేందుకు అనర్హులు.
ఒక వ్యక్తి ఒక పదవికి గరిష్టంగా నాలుగు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. బ్యాలెట్ పేపర్‌లో మాత్రం ఒక పేరే ఉంటుంది.
నామినేషన్ వేసేందుకు ఒక అభ్యర్థి వెంట ఇద్దరు మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు.
అభ్యర్థి స్వయంగా నామినేషన్ పత్రం దాఖలు చేయలేని పరిస్థితిలో ఇతరుల చేత నామినేషన్ పత్రాన్ని పంపించవచ్చు.
వార్డు మెంబర్ స్థానానికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు 250 రూపాయలు ధరావతు (డిపాజిట్) గా చెల్లించాలి.
సర్పంచ్ స్థానానికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులు 2000 రూపాయలు, రిజర్వ్‌డ్ అభ్యర్థులు 1000 రూపాయలు డిపాజిట్‌గా చెల్లించాలి.
రిటర్నింగ్ అధికారి ఎవరి నామినేషన్లయినా తిరస్కరిస్తే, మరుసటి రోజే ఆర్‌డీఓ/సబ్‌కలెక్టర్‌కు అప్పీల్ చేయవచ్చు.
ఒక వ్యక్తి ఒకే వార్డుకు పోటీ చేయాల్సి ఉంటుంది.
ఒక వ్యక్తి నేరం చేసినట్టు రుజువైతే అయిదు సంవత్సరాలపాటు పోటీ చేసేందుకు వీలులేదు.

మాలల సాంఘిక బహిష్కరణపై సీపీఎం నిరసన

$
0
0

హైదరాబాద్, జనవరి 3: నిజామాబాద్ జిల్లా మారంపల్లి గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన మాల సామాజిక వర్గాన్ని కులం పేరుతో దూషించి సాంఘిక బహిష్కరణ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 డిసెంబర్ 24న నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో మారంపల్లి గ్రామంలో బహిష్కరణ చేసింది.

ఇంటర్ బోర్డు వినూత్న కార్యక్రమం

$
0
0

హైదరాబాద్, జనవరి 3: ఇంటర్ పరీక్షలకు విద్యార్థులకు డబ్బు వెచ్చించి ఎలాంటి కోచింగ్‌లు తీసుకోకుండానే స్వయంగా ఆన్‌లైన్‌లో అన్ని కానె్సప్ట్‌ను నేర్చుకునేందుకు, అలాగే జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశపరీక్షలు జేఈఈ, నీట్‌లకు ఉచిత శిక్షణ అందించే వెబ్ పోర్టల్‌తో ఇంటర్ బోర్డు ఒప్పందం కుదర్చుకుంది. ర్యాంకర్స్ లెర్నింగ్ , క్లౌడ్ ఎడ్జ్ సంస్థలు రెండూ తమ వద్ద ఉన్న ఆన్‌లైన్ మెటీరియల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తాయి. ఈ ప్రక్రియకు డిస్క్- డిజిటల్ స్టూడెంట్ కిట్ అనే పేరు పెట్టారు. ఈ డిస్క్ ప్లాట్‌ఫామ్ ఆన్‌లైన్ యూజర్ నేమ్ పాస్ వర్టులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు పంపిస్తారు. వారు తమ పేరుతో లాగిన్ అయి విద్యార్థులకు ఆన్‌లైన్, డిజిటల్ శిక్షణ అందించడం జరుగుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ చెప్పారు. ఆన్‌లైన్ డిజిటల్ నిర్ణయంపై జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

కులాల మధ్య సయోధ్యని మరింత పెంచాలి : పవన్

$
0
0

విజయవాడ(సిటీ), జనవరి 3: అభివృద్ది చెందుతున్న కులాలకు ఒక వైపు అండగా ఉంటూనే...మరోవైపు వెనుకబడిన కులాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం పార్టీ శ్రేణులపై ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
కులాల మధ్య అంతరం తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో కులాల మధ్య సయోధ్యను మరింత పెంచాల్సిన అవసరం జనసేన పైనే ఉందన్నారు. వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి పార్టీ అజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాలన్నారు. జనసేన పార్టీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలను గురువారం నుండి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తొలిరోజు శ్రీకాకుళం జిల్లా నేతలు, శ్రేణులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతకు సాధికారత కల్పించడమే జనసేన ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జనసేనపార్టీకి విశేష అండగా ఉన్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని నేతలకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని కులాల వారు జనసేన పార్టీని అభిమానిస్తున్నారని, కులాల మధ్య సయోధ్యని మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో అభివృద్ధి చెందుతున్న కులాల వారికి అండగా ఉంటునే వెనుకబడిన కులాల వారిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులపైనే ఉందన్నారు.
పార్టీ వర్కింగ్ క్యాలెండర్‌కి రూపకల్పన చేస్తున్నామని, దాన్ని జిల్లా కమిటీలు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. వ్యక్తిగత అజెండాలకు తావివ్వకుండా పార్టీ అజెండాతో జనంలోనికి వెళ్లాలని సూచించారు. పార్టీ ప్రతినిధిగా బహరంగంగా మాట్లాడేటప్పుడు సంస్కారవంతమైన భాష మాట్లాడాలన్నారు. పార్టీ నియమావళికి అనుగుణంగా అభిప్రాయాలు ఉండాలన్నారు. జనవరి మాసాంతంలోగా ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి పార్టీ ప్రాంతీయ సమావేశం నిర్వహిస్తామన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకుంటూ పార్టీ సిద్ధాంతాలపైనా, మ్యానిఫెస్టోపైనా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అంతకు ముందు జనసేన పార్టీ ముఖ్యనేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశాన్ని ప్రారంభించి, పార్టీ నాయకులకు పలు సూచనలు, సలహాలను అందించారు.
చిత్రం..శ్రీకాకుళం జిల్లా నేతలతో సమీక్షిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

చుక్కల భూముల సమస్యకు ఇక ముగింపు

$
0
0

గుంటూరు, జనవరి 3: రాష్టవ్య్రాప్తంగా చుక్కల భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే ముగింపు పలికి, శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చుక్కల భూములపై అవసరమైతే చట్టంలో మార్పులు చేసైనా రైతుల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
గుంటూరు జిల్లా అచ్చంపేటలో గురువారం జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామ సభకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఊరంతా భూమి ఎవరిదని చెబితే వారికే చెందేలా చూస్తామని, దీనిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రైతుల రుణమాఫీకి కేంద్రం ఏ మాత్రం సహకరించకపోగా రాష్ట్భ్రావృద్ధికి ఇవ్వాల్సిన నిధులను సైతం తొక్కిపట్టి మరీ ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు బీజేపీ నేతలు సిద్ధమేనా అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు పన్నుతోందన్నారు.
ఆంధ్రులకు చేయూతనిస్తే గుజరాత్‌ను మించిపోతామన్న దురుద్దేశంతో అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీపై నిప్పులు చెరిగారు. ఓ పక్క ఆదాయం లేదు, రాజధాని లేమి, మరోపక్క లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజల శ్రమతో రాష్ట్రాన్ని నిలదొక్కుకునేలా చేసుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుకు 58 వేల కోట్లు అంచనా వ్యయం ఉండగా కేవలం 7 వేల కోట్ల రూపాయలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 3,500 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. రాష్ట్రానికి సహకారం అందించకపోగా కేంద్రం ఎదురుదాడి చేస్తోందని ఆరోపించారు. అదేమని ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర పరాభవం ఎదురైందని, ఇంత జరిగినా మోదీ సమర్ధించుకోవడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరికీ దాసోహం కాదని చంద్రబాబు స్పష్టంచేశారు.
మోదీ, కేసీఆర్, జగన్ త్రయం కలిసి ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా చివరకు విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం మనదేనని, రాఫెల్ డీల్‌లో అవినీతికి పాల్పడిన వారు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులపై ఇప్పటికే 10 శే్వతపత్రాలను విడుదల చేశామన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తామని, 2029 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్ వన్‌గా నిలుపుతామని పేర్కొన్నారు. జగన్ మెడపై సీబీఐ కత్తి ఉండటం వలనే వారికి దాసోహమయ్యాడని ఎద్దేవాచేశారు. జగన్‌కు రాజకీయ అనుభవమే లేదని, తప్పుడు లెక్కల్లో అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని, చివరి బాధితుడి వరకు పరిహారం అందిస్తామని, ఇప్పటికే తప్పుచేసిన వారిని జైలులో పెట్టామని గుర్తుచేశారు. కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. కాగా రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గొనడంతో పాటు, గాలిపటాలను ఎగురవేశారు. సభలో పాల్గొన్న గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి మంటలు వెలిగిస్తున్న ముఖ్యమంత్రి


ఆర్టీసీ ఈడీగా రామారావు బాధ్యతల స్వీకరణ

$
0
0

విజయనగరం, జనవరి 3: ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పిన్నమనేని వెంకట రామారావుగురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌గా మూడేళ్లు పనిచేసి ఇటీవల పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత, ప్రయాణికులకు కనీస సదుపాయాల కల్పన, ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన తరువాత 1986లో ఆర్టీసీలో చేరారు. ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పనిచేశారు.
ఆ తరువాత గుంటూరు, విశాఖపట్నం, ఖమ్మం ప్రాంతాల్లో రీజనల్ మేనేజర్‌గా సేవలందించారు. విజయవాడలో రీజనల్ మేనేజర్‌గా మూడేళ్లు సేవలందించారు. విజయవాడ బస్ డిపోను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సేవలందించారు. ఇందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆయన మూడుసార్లు స్వచ్ఛ భారత్ అవార్డులను అందుకున్నారు.

కళ్లున్న కబోదిలా ప్రధాని మోదీ

$
0
0

విజయవాడ, జనవరి 3: దేశ ప్రజలను కన్న బిడ్డల్లాగా చూడాల్సిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలపట్ల మాత్రం కళ్లుండి చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారంటూ శాసన మండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. గురువారం నాడిక్కడ ఆయన కళ్లకు గంతలు కట్టుకుని మీడియాతో మాట్లాడుతూ మోదీ ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాకుండా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. లోఫర్లు, గజదొంగలు, అవినీతిపరులతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి బాబును తిట్టిస్తూ మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. రాత్రి, పగలు లేకుండా రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడుతుంటే ఏ మాత్రం సహకరించకుండా, సిగ్గులేకుండా తన పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలను దోచుకున్న గజదొంగ కన్నా, కౌన్సిలర్‌గా కూడా గెలువలేని సోము వీర్రాజు నేడు మోదీకి సూచనలిచ్చే పెద్ద వారయ్యారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అండతో బాబును అడ్డం పెట్టుకుని పదవులు పొందిన వీరంతా నేడు చంద్రబాబును విమర్శించే స్థాయికి దిగజారటం సిగ్గుచేటన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు బాబు ఓ వైపు కృషి చేస్తుంటే మోదీ నిధులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తెలంగాణలో మహాకూటమి ఓటమి చెందినదని చంకలు గుద్దుకుంటున్న మోదీ బీజేపీ గతేమిటో ఆలోచించుకోవాలన్నారు. మహాకూటమి ప్రతిపక్షంలో అయినా ఉంది.. అసలు బీజేపీ ఎక్కడుందని వెంకన్న సూటిగా ప్రశ్నించారు. కన్నా, జగన్, విజయసాయిరెడ్డిలు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ బాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ప్రపంచంలో ఉన్న ఫోర్‌ట్వంటీ లిస్ట్‌లో కన్నా ఉన్నారని, ఇక సోము వీర్రాజు రూ. 50 లక్షలకు ఎమ్మెల్యే సీటును అమ్ముకున్నాడని అన్నారు. ఇలాంటి నేతలతో సమావేశం పెట్టి బాబును తిట్టిస్తూ మోదీ పైశాచికత్వాన్ని పొందుతున్నారని అన్నారు. మోదీ, జగన్, కేసీఆర్‌లు ఎంతమంది కలిసినా బాబును ఏమీ చేయలేరని ఆయనకు ప్రజాబలం ఉందని అన్నారు. ఈ రాష్ట్రాన్ని అణగదొక్కుతున్న మోదీని, అలాగే రాష్ట్రంపై విషం కక్కుతున్న కేసీఆర్‌ను నమ్మాలాఅని వెంకన్న ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌తో పొత్తు ఉంటుందని తాము ఎక్కడా ప్రకటించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక వేళ పొత్తు ఉంటే తప్పు ఏమిటని చంద్రబాబు నేరుగా ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో అది ఆయన ఇష్టం అంటూ, వైకాపా ఉద్దేశ్యపూర్వకంగా దీనిపై రాద్ధాంతం చేస్తున్నదన్నారు.

చిత్రం..కళ్లకు గంతలతో విలేఖరులతో మాట్లాడుతున్న బుద్దా వెంకన్న

బీజేపీ నేతలవి సంస్కారహీన వ్యాఖ్యలు

$
0
0

కడప, జనవరి 3: రాష్ట్ర బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధాని మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అన్నట్లు మోదీ ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నందున అదే దారిలో పార్టీ రాష్ట్ర నేతలు తయారయ్యారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అంతటివాడిని పట్టుకుని లూటర్, ఛీటర్ అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. సోము వీర్రాజు తానేమాత్రం తక్కువ కాదన్నట్టు లూటీలు, లుచ్చాలంటూ వ్యాఖ్యానించడం వారి సంస్కారహీనతను తెలుపుతోందన్నారు. గుంటూరు సభకు వచ్చే ధైర్యం లేకే ప్రధాని తోక ముడిచారన్నారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మోదీ బాటలో ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రూ.20వేల కోట్లకు పైగా ఇచ్చామని ప్రధాని చెబుతున్నారని, అయినా పోలవరానికి ఇంకా రూ.3,400 కోట్లు బాకీ ఉన్నారన్నారు. రూ.3,500 కోట్లతో ఢిల్లీని తలదనే్న రాజధానిని నిర్మిస్తామని గొప్పలు చెప్పిన ప్రధాని, రాజధాని కోసం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 33 వేల ఎకరాల స్థలాన్ని పూలింగ్ ద్వారా సేకరించామన్నారు. అమరావతిని చూసి హైకోర్టు జడ్జిలు సైతం అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారన్నారు. అయితే ప్రతిపక్ష నేత మాత్రం కనీసం అక్కడికి చూసేందుకు కూడా రాలేదన్నారు. గ్రామీణ ఉపాధి కూలీలకు కూడా కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి మోదీ ఇంత అన్యాయం చేస్తున్నా జగన్ ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. 63 లక్షల రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేస్తే ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. తెలుగు ప్రజల చిరకాల వాంఛ అయిన పోలవరం ప్రాజెక్టును ఆఘమేఘాల మీద పూర్తిచేస్తున్నామన్నారు. పట్టిసీమను ఆరునెలల్లో పూర్తిచేసి రూ.30 వేల కోట్ల పంటను కాపాడినందుకు చంద్రబాబును నిలదీయాలా అని ప్రశ్నించారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెడతామని ఆశ చూపిన కేంద్రం మొండిచేయి చూపడంతో ముఖ్యమంత్రే చొరవ చూపి ఉక్కుకు పునాది వేసినందుకు ఆయన్ను నిలదీయాలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో 25 లక్షల ఇండ్లు కడితే ఇక్కడ 70 లక్షల ఇండ్లు పూర్తిచేశామన్నారు. అలాంటి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు అన్ని సీట్లు వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఇంత అభివృద్ధి చేసిన మనకు ఎన్ని సీట్లు రావాలి అని అన్నారు. కడప జిల్లాలో విద్య కోసం రూ.330 కోట్లు వ్యయం చేశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి కార్యక్రమంలో 13 జిల్లాల్లో కడప అన్నింటికన్నా ముందుందన్నారు. జగన్, మోదీ అంతా డూప్ అంటూ ఎద్దేవా చేశారు. యాస్ప్రిరేషన్ జిల్లాగా కడపను గుర్తించి ఒక్కపైసా కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రికి ఇస్తామన్న రిటర్న్‌గిప్ట్ తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కొత్త కొత్త ప్రణాళికలతో ఉన్నామని, ఎన్నికల గ్యాప్‌లో వీటిని పూర్తిచేస్తామన్నారు. ఆర్టీసీలో వాటా, విద్యుత్ బకాయిలు ముందుగా చెల్లించి కేసీఆర్ మాట్లాడాలన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ల్యాండ్ పూలింగ్ అమలుచేయాలని అనుకున్నామని అయితే సమయం లేనందున రైతుల నుంచి భూమిని నేరుగా కొనుగోలు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన బోర్డు మీటింగ్ త్వరలోనే జరుగుతుందన్నారు.

మన జన్మభూమి... మన గొంతుక

$
0
0

విజయవాడ, జనవరి 3: జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ప్రజలను ఆన్‌లైన్‌లో భాగస్వాములను చేసేందుకు, వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను వీడియోల ద్వారా పంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి, ప్రజలు తమ అభిప్రాయాలను వీడియో ద్వారా పంచుకునేందుకు వేదికను ఆర్టీజీఎస్ రూపొందించింది. జన్మభూమి కార్యక్రమంలోని వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్ర విభజన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రణాళిక, సామాజికాభివృద్ధి, సంక్షేమం, శే్వతపత్రాలు, తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను, అనుభవాలను వీడియో రూపంలో ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
నోడల్ అధికారుల కోసం జన్మభూమి సందర్భంగా ప్రత్యేక యాప్‌ను ఆర్టీజీఎస్ రూపొందించింది. క్షేత్ర స్థాయిలో ఉన్న 18,239 మంది నోడల్ అధికారులు తమకు అందిన ఫిర్యాదులు, ఆర్జీలను ఆన్‌లైన్ ద్వారా పరిష్కరిస్తారు. నిర్వహించిన గ్రామ సభలు, అందిన ఫిర్యాదులు తదితర అంశాలన్నీ పొందుపరిచేలా దీనిని రూపొందించారు.

రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య

$
0
0

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 3: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రైల్వే పోలీసు సీఐ రత్నరాజు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి చెందిన గోపాలకృష్ణన్ (60), కూతురు జయంతి (30), మనుమరాలు శ్రీ లక్ష్మీ (2) ముగ్గురు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు మార్గంలో నగరానికి అతి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాల వద్ద లభ్యమైన సమాచారం ప్రకారం చెన్నై ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాల వద్ద దొరికిన సెల్‌ఫోన్‌లోని నెంబర్ల ఆధారంగా వివరాలు సేకరించారు. చెన్నైకు చెందిన వీరు బుధవారం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం పాల ఫ్యాక్టరీ సమీపంలోని హైదరాబాద్ లైన్‌లో వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల వద్ద దొరికిన ఫోన్ ఆధారంగా జయంతి భర్తకు ఫోన్ చేయగా గురువారం పోలీసు స్టేషన్‌కు వచ్చి మృతులను గుర్తించి, వివరాలు తెలియజేశారు. తమ కుటుంబంలో ఎటువంటి సమస్యల్లేవని, ఆత్మహత్యలకు కారణాలు తెలియటం లేదన్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సీఐ రత్నరాజు కేసు విచారిస్తున్నారు.

రాజధాని నిర్మాణ ఒప్పందాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టగలరా?

$
0
0

శ్రీకాకుళం, జనవరి 3: రాజధాని నిర్మాణ ఒప్పందాన్ని పబ్లిక్ డొమైన్‌లో ప్రభుత్వం పెట్టగలదా అని వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణానికి జరిగిన ఒప్పందంలో ఫలానా పద్ధతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని ప్రజలకు చెప్పే ధైర్యం చేయగలరా అని ధర్మాన ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిన సింగపూర్ అగ్రిమెంట్ కాన్ఫిడెన్షియల్ అనడం వెనుక దోచుకోవడమన్న సంగతి ప్రజలకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు బదులివ్వలేని బాబు పాలనలో పారదర్శకత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశంలో నెంబర్ వన్ అవినీతి పాలన అంటూ సాక్షాత్తు ప్రధానే ఆరోపిస్తే బదులుగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ బాబు అనడం విడ్డూరమన్నారు. సిట్ నివేదికల్లో తమ అధికారులతో ధర్మాన పేరుపెడితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాలాంటివారు మైలపడతారా?? అంటూ బాబును నిలదీసారు. చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు వ్యతిరేకించిన జీవోలను కేబినేట్‌లో పెట్టి విడుదల చేయడంతో నాలుగున్నర ఏళ్ళలో 1900 జీవోలు పాపాలపుట్టలా వెలువడ్డాయన్నారు. ధర్మపోరాటం అంటూ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీపై దాడి చేస్తే ప్రయోజనం ఏముందన్నారు. 13 జిల్లాల్లో ఒక్కో ధర్మపోరాట సభకు కనీసం ఏడు కోట్ల రూపాయలు చొప్పున దుబారా చేసారన్నారు. రాజ్యాంగ సంస్థలు పని చేయనప్పుడు, ప్రభుత్వానికి ఉన్న పరిధి దాటిపోతే వాటిని ప్రశ్నించేందుకు అవకాశం లేకపోతే, శాసనసభలో ప్రతిపక్ష గళాన్ని నొక్కేసి, స్పీకర్, గవర్నర్‌ను వారి విధులు చేయకుండా అడ్డుపడుతూ, కోర్టులు ప్రజలకు అనుకూలంగా ఇచ్చే తీర్పులను సైతం అడ్డుకున్న నేపథ్యంలో ప్రజాచైతన్యం ద్వారానే అటువంటి పనులను నిలదీసేందుకు వీలుకలుగుతుందని, దానికోసమే జగన్ ప్రజాసంకల్పయాత్ర అన్నారు. ఈనెల 9న ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. అక్కడ ఒక చిహ్నం నిర్మించామని, దానిని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడతారన్నారు. 2003లో వైఎస్ పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వమే అద్భుతాలు సృష్టించిందన్నారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు

ఏటా విద్యకు రూ.25 వేల కోట్లు

$
0
0

విశాఖపట్నం, జనవరి 3: ప్రతి ఏడాది విద్యకు రూ.25 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సావిత్రిబాయి పూలే మహిళా ఉపాధ్యాయ దినోత్సవం రాష్టస్థ్రాయి పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం ఏయూ కాన్వొకేషన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత పెద్దఎత్తున నిధులు విద్యకు కేటాయించలేదన్నారు. నాణ్యమైన విద్యను అందివ్వడంలో భాగంగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఎడ్యుకేషన్ హబ్, నాలెడ్జ్ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు నిత్యం కృషి చేస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కొరత తీవ్రంగా ఉండేదని, అటువంటిది ఇపుడు ఎక్కడ చూసినా కొత్త భవనాలతో కూడిన పాఠశాలలు కనిపిస్తున్నాయన్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో రూ.4800 కోట్ల మేర నిధులు వెచ్చింది వౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా పది వేల టీచర్ పోస్టులు భర్తీ చేసామని, అలాగే మరో డీఎస్సీని ఇప్పుడు తీస్తున్నామన్నారు. ఉత్తమ ఫ్యాకల్టీ, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాలుగున్నరేళ్ళుగా చక్కని విద్యా ఫలితాలు సాధిస్తున్నామన్నారు. విద్యాపరంగా గతంలో 17వ స్థానంలో ఉన్న ఏపీని ఇప్పుడు మూడో స్థానానికి తీసుకొచ్చామన్నారు. అయితే మూడవ స్థానం సరిపోదని, దీనికి సంతృప్తి చెందవద్దని దేశంలో ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కోరుతున్నారన్నారు. విద్యాభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, జీవోలు, మోనటరింగ్‌కు సంబంధించి అన్నివిధాలా సహకరిస్తామని సీఎం చెప్పారన్నారు.
72మందికి రాష్టస్థ్రాయి పురస్కారాలు
రాష్టవ్య్రాప్తంగా 75 మంది ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా మంత్రి రాష్టస్థ్రాయి పురస్కారాలు ప్రదానం చేశారు. సావిత్రిబాయి పూలే నమూనాతో కూడిన సిల్వర్ మెడల్, రూ.25వేల నగదు, శాలువా, సర్ట్ఫికెట్‌తో కూడిన పురస్కారాన్ని వీరందరికీ అందజేశారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం జిల్లాప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)కు చెందిన ప్రధాన ఉపాధ్యాయురాలు కె.వసంతకుమారికి తొలుత మంత్రి ఈ పురస్కారాన్ని అందించారు. కర్నూలు, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, కృష్ణా, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ప్రధానోపాధ్యాయుల క్యాటగిరీకి సంబంధించి ఈ పురస్కారాలు అందజేశారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు


‘పోలవరం’లో మహా కాంక్రీటు ఫీటు!

$
0
0

పోలవరం, జనవరి 3: ఇప్పటికే జాతీయ అవార్డు సహా పలు ఘనతలను సాధించిన పోలవరం జాతీయ ప్రాజెక్టు తాజాగా గిన్నీస్ బుక్‌లో చోటు కోసం సిద్ధమవుతోంది. 24 గంటల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయడం ద్వారా రికార్డు సాధనకు కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 6వ తేదీ ఉదయం 9గంటల నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఈ మహాక్రతువు సాగనుంది. 24 గంటల్లో మొత్తం 28వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును స్పిల్ వే, స్పిల్ ఛానల్‌లో వేయనున్నారు. ఇప్పటివరకు ఈస్థాయిలో కాంక్రీటు పని ఏ ప్రాజెక్టులో జరగని కారణంగా కాంట్రాక్టు సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సంస్థ ప్రతినిధులను ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఆహ్వానించింది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు రెండు రోజుల ముందుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటారు. కాగా 7వ తేదీ ఉదయం ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, గిన్నీస్ బుక్‌లో నమోదు పత్రాన్ని ప్రతినిధుల నుండి అందుకోనున్నారు. ఈ సందర్భంగా 10వేల మంది రైతులతో సభ నిర్వహిస్తారు. అలాగే కాంక్రీటు రికార్డుకు సంబంధించి పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.

జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకి అప్పగింత

$
0
0

విజయవాడ: వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్ అనే వ్యక్తి గత ఏడాది అక్టోబర్ 25న కోడికత్తితో దాడి చేసిన విషయం విదితమే. ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును బదిలీ చేయాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీలంక మహిళను అడ్డుకున్న ఆందోళనకారులు

$
0
0

తిరువనంతపురం: అయ్యప్ప ఆలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన శ్రీలంక మహిళను ఆందోళనకారులు అడ్డుకున్నారు. మోనోపాజ్ వల్ల తనకు రుతుస్రావం లేదని ఆమె ధృవీకరణ పత్రాలు చూపించినా ఆందోళనకారులు ఆమెను లోనికి అనుమతించలేదు. తాను పవిత్రమైన 18 మెట్ల వరకు వెళ్లగలిగానని శ్రీలంక మహిళ వెల్లడించింది.

బీజేపీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు:చంద్రబాబు

$
0
0

అమరావతి: బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, రెండు రోజుల్లోనే పార్లమెంటు నుంచి 45మంది ఎంపీలను సస్పెండ్ చేయటం ఏమిటని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం 14మంది టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. హోదా సాధన సమితి ప్రతినిధులపై ఢిల్లీ పోలీసుల దాడి గర్హనీయమని అన్నారు.

అయోధ్య కేసు విచారణ వాయిదా

$
0
0

న్యూఢిల్లీ: అయోధ్య కేసు విచారణ జనవరి 10వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. నేడు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్‌కే కౌలాల్‌తో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణ వచ్చింది. కేసు విచారణ సెకన్లలోనే ముగించిన ధర్మాసనం జనవరి 10వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి వాదనలు వినకుండానే వాయిదా వేసింది.

Viewing all 69482 articles
Browse latest View live