Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

వ్యవసాయరంగ సుస్థిరతే లక్ష్యం

0
0

అమరావతి, జనవరి 4: వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం తీసుకున్న చర్యలు గత నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు దోహదపడ్డాయి.
రైతులకు సిరులు కురిపించే ప్రభుత్వ దార్శనికతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. విభజన తరువాత అనేక సవాళ్లను అధిగమించి అతివృష్టి, అనావృష్టితో కునారిల్లుతున్న వ్యవసాయ రంగాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం కార్యాచరణను నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయానికి ప్రధాన వనరుగా ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లను పూర్తిచేయటంతో పాటు నదుల అనుసంధానం ద్వారా సకాలంలో నీటిని విడుదల చేయటంతో పాటు కరవు ప్రాంతాలకు సైతం సాగునీటిని అందించటంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి ఒకింత ఉపశమనం కలిగించేందుకు రుణమాఫీని ప్రణాళికాబద్ధంగా అమలు చేసింది. కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా, విభజన తరువాత 16వేల కోట్ల రెవెన్యూలోటు ఉన్నా లెక్కచేయక నేరుగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 15వేల 147 కోట్లు జమ చేసింది. ఫలితంగా 60లక్షల మంది రైతు కుటుంబాలు ప్రయోజనం పొందాయి. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక శ్రద్ద వహించింది. ఇప్పటి వరకు రూ. 3098 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. రైతులు నష్టపోకుండా భూసార పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రత్యామ్నాయ పంటల దిశగా మొగ్గు చూపేందుకు జాగృతం చేసింది.
రైతు రథం కింద ఇప్పటి వరకు 12వేల ట్రాక్టర్లను సబ్సిడీపై పంపిణీ చేసింది. కరవు ప్రాంతాల్లో పంటలు కాపాడేందుకు రెయిన్‌గన్‌లు, పంటకుంటలు, డ్రోన్లు, వ్యవసాయ అంచనా మిషన్లు అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాంధ్రలో పంటల సాగుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఫలితంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 1.78 లక్షల ఎకరాల మేర అదనపు విస్తీర్ణాన్ని సాగులోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 నీటిపారుదల ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో ఉన్నాయి. గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణాకు మళ్లించి 13 లక్షల ఎకరాలకు జీవం పోసింది.
ఫలితంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు మార్గం సుగమమైంది. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ద్వారా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సాగు, తాగునీరు సరఫరాకు వీలు కలిగింది. హంద్రీనీవా ద్వారా అనంతపురం కరవు జిల్లాకు 60 టీఎంసీల నీటి విడుదల సాధ్యపడింది. హంద్రీ-నీవా రెండో దశలో అనంతపురం జిల్లాలో మడకశిర, కియా పరిశ్రమకు నీటి సరఫరా సాధ్యపడింది. గండికోట నీటిని పులివెందులకు తరలించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుంది.
ఉద్యానవనం..్భళా
ఉద్యానవన పంటలకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకెళుతున్నారు. అత్యధిక ఉత్పాదన ద్వారా అధిక ఆదాయం సాధించటంతో పాటు పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యంతో ఉద్యానవన రంగంలో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఉద్యానవన సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 35.87 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఉద్యానవన సాగులో 259.85 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఏపీఎంఐసీ కింద తుంపర, బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతర సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీతో పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. చీడపీడల నివారణ పథకం కింద 30 శాతం రాయితీతో హెక్టార్‌కు రూ. 5వేలు అందుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ వంటి నూతన పంటల సాగు పెంచటానికి 40 శాతం రాయితీతో హెక్టార్‌కు రూ. 5.52 లక్షల రాయితీ అందుతోంది. పూల తోటల సాగు పెంచేందుకు 40 శాతం రాయితీతో హెక్టార్‌కు రూ 16వేల చొప్పున రెండెకరాలకు అందిస్తోంది.
పండ్ల తోటల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ టాప్
పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. ఒకప్పుడు ముందంజలో ఉన్న మహారాష్టక్రు దీటుగా ఏపీ ముందుకు దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే 100 టన్నుల పండ్లలో 15 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అరటి, మామిడి పండ్ల వాటాయే ఎక్కువగా ఉంది. ఉద్యానవన సాగును కోటి ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు సూక్ష్మ సేద్య సాగు పెరుగుతుందనటం కూడా ఉత్పత్తి పెంపుదలకు దోహదపడుతోంది. అన్ని జిల్లాల్లోనూ పండ్ల తోటల సాగును ప్రభుత్వం విస్తృతం చేస్తోంది.
ఉద్యానవన సాగుకు ఉపాధి నిధులు
పండ్ల మొక్కల సాగుకు నిధులిస్తున్నా సరైన పర్యవేక్షణ లేకపోవటంతో అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో పండ్ల తోటల పెంపకాన్ని ఉద్యానవనశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు బదలాయించారు. ఉపాధి నిధులు వినియోగించుకుని ఉద్యాన, డీఆర్‌డీఏ శాఖలు పండ్ల తోటల పెంపకాన్ని విస్తరిస్తున్నాయి.
పండ్ల మొక్కల కోసం గోతులు తవ్వే దశ నుంచి వాటికి మూడేళ్ల వయసు వచ్చే వరకు అన్ని పనులకు ఉపాధి హామీ పథకం కింద నిధులను ఉద్యాన రైతులకు అందిస్తున్నారు. పండ్ల తోటల్లో అంతరపంటల సాగుకు విత్తనాలు, దుక్కు చేసుకోవటానికి ఆర్థిక సాయం అందిస్తోంది.
సూక్ష్మసేద్యం ఉద్యానవన రైతుకు వరం
ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉద్యానవన రైతులకు వరంగా మారింది. బోరు లేదా బావి ఉంటే డ్రిప్ పద్దతిలో నీరందించేందుకు ప్రభుత్వం ఈ పథకం కింద రాయితీపై పరికరాలు సమకూరుస్తోంది. ఇందులో డ్రిప్, స్ప్రింక్లర్, రెయిన్‌గన్‌లలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.5 లక్షల హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేశారు. 2018-19 సంవత్సరానికి రూ. 1170 కోట్లతో 5.16 లక్షల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరందించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది.


జన్మభూమి దరఖాస్తులకు రెండు రోజుల్లో పరిష్కారం

0
0

రాజమహేంద్రవరం, జనవరి 4: ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను రెండు రోజుల్లోనే పరిష్కరించాలని, మొత్తం దరఖాస్తులు జన్మభూమి కార్యక్రమం ముగిసేలోగానే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. కాకినాడలోని జేఎన్టీయూకే గ్రౌండ్స్‌లో కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘జన్మభూమి మా ఊరు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ముందుగా మా తెలుగుతల్లి ప్రార్ధన గీతం అనంతరం, జ్యోతి ప్రజ్వలన చేసి జన్మభూమి కార్యక్రమాలను ప్రారంభించారు. రోజుకో అంశంపై శే్వతపత్రం విడుదల చేస్తున్న క్రమంలో కాకినాడ జన్మభూమి సభలో ముఖ్యమంత్రి సంక్షేమంపై శే్వతపత్రాన్ని విడుదలచేశారు. బ్రోచర్ ద్వారా వివరాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నామన్నారు. అసలు సంక్షేమానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని, అదే స్ఫూర్తిని ప్రస్తుతం కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం అమలవుతోందన్నారు. పేదలకు రేషన్ ద్వారా ఇచ్చే పంచదారను కూడా దయలేకుండా కేంద్రం రద్దుచేసిందని, రూ.400 కోట్ల వ్యయంతో పంచదారను రాష్టమ్రే సరఫరా చేస్తోందన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రజలకు చేయూతనిచ్చేలా అనేక సంక్షేమ పథకాలను అందిస్తన్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవల మొత్తాన్ని రూ. 2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు.
ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా సంక్షేమాన్ని ఎప్పటికపుడు ఆరా తీస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. రవాణా ఖర్చుల ఖారం లేకుండా ఆదరణ పనిముట్లను లబ్ధిదారు ఇంటికే నేరుగా అందించే ఏర్పాటు చేశామన్నారు. డైరీ యూనిట్లకు గేదెలను పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అందరికీ పని కల్పించాలని నియోజకవర్గానికొక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తనకు అండగా వుంటే తిరిగి అభివృద్ధి సాధిస్తామన్నారు. ఏవైనా లోపాలుంటే నిర్మొహమాటంగా చెప్పాలని, మార్చుకుంటానని, మేలైన సంక్షేమాన్ని అందిస్తానని చంద్రబాబునాయుడు అన్నారు. ఐదు సార్లు జరిగిన జన్మభూమి కంటే ఆరో జన్మభూమిలో ఎక్కువ స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. కాగా రాజధాని నిర్మాణానికి రూ.50 వేలు విరాళమిచ్చిన విశ్రాంత విద్యాశాఖాధికారి అసుదున్నీసా బేగంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాదాభివందనంచేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శాసన మండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు వరుపుల రాజా, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, వివిధ శాఖల సెక్రటరీలు, జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖాతాదారులకు మరింత చేరువవుతున్న ఎస్‌బీఐ

0
0

హైదరాబాద్, జనవరి 4: ఖాతాదారులకు విభిన్న మార్గాల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చేరువ అవుతోందని ఈ క్రమంలో రోజురోజుకూ బ్యాంకింగ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వేసన్ చెప్పారు. ఎస్‌బీఐ అమరావతి స్థానిక హెడ్ ఆఫీసు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన వార్షిక పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకు కార్యకలాపాలను వివరించారు. ఎస్‌బీఐ ‘యోనో’ పేరుతో యాప్ రూపొందించిందని, దీని ద్వారా తమ ఖాతాలను పరిశీలించుకోవడమేగాక, టాక్సీ, రైల్వే, విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌లో షాపింగ్‌కు ఎంతో తేలికగా ఉంటుందని పేర్కొన్నారు. యోనో యాప్ విడుదల చేసి ఏడాది అవుతోందని చెప్పారు. యోనో ప్లాట్‌ఫారం ద్వారా 60 కంపెనీలు ఇ- కామర్స్ సేవలు అందిస్తున్నాయని తెలిపారు. సంప్రదాయ మొబైల్ సేవలను కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చని, ఖాతాదారులు బ్యాంకులకు రాకుండానే ఆన్‌లైన్‌లో తమ సెల్‌ఫోన్ నుండి అన్ని సేవలు పొందే అవకాశం దక్కిందని అన్నారు. ఎస్‌బీఐ 35 దేశాల్లో తన ఉనికి ప్రదర్శిస్తోందని, 207 ముఖ్య కార్యాలయాలున్నాయని, 3.05 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు, 4.79 కోట్ల ఇంటర్ నెట్ బ్యాంకింగ్ వినియోగదారులున్నారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎస్‌బీఐ ఖాతాదారులకు చేరువగా ఉందని, ఫేస్‌బుక్, యూట్యూబ్ , లింకిడిన్, పింట్‌రెస్టు తదితర మాద్యమాల్లో ఎస్‌బీఐ వినియోగదారులకు సేవలు అందిస్తోందని చెప్పారు. సామాజిక మాద్యమాల్లో అనుసరిస్తున్న వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఎస్‌బీఐకే ఉన్నారని అన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో పొగాకు రైతుకు మేలు

0
0

గుంటూరు, జనవరి 4: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పొగాకు పంట సాగు చేసినట్లయితే ఎగుమతులకు మార్గం సుగమమై పొగాకు రైతులకు మేలు జరుగుతుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) డైరెక్టర్ జనరల్ జి జయలక్ష్మి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో పొగాకు బోర్డుతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుని రైతులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం భారత పొగాకు బోర్డు 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నాలుగేళ్ల విరామ అనంతరం ఘనంగా నిర్వహించారు. బోర్డు వ్యవస్థాపకులు కొత్తా రఘురామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి బోర్డు చైర్‌పర్సన్ కె సునీత అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జి జయలక్ష్మి మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడవ స్థానంలో ఉండటం ఆనందించదగ్గ విషయమే అయినప్పటికీ పురుగుమందుల వాడకంలో మాత్రం ప్రథమస్థానంలో ఉండటం గమనార్హమన్నారు. పురుగుమందుల వాడకం వలన ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు ఎగుమతులు తగ్గి పంటకు సరైన గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ దృష్ట్యా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పొగాకు పంటను సాగు చేసినట్లయితే ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు ఎగుమతులు పెరిగి రైతుకు సరైన గిట్టుబాటు ధర లభించి, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందని సూచించారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో తమ సంస్థ ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంపై పొగాకు రైతులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందని చెప్పారు. బోర్డు చైర్‌పర్సన్ సునీత మాట్లాడుతూ పొగాకు రైతుల సంక్షేమానికి బోర్డు చిత్తశుద్దితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం 2009లో పొగాకు రైతుల సంక్షేమ నిధిని ప్రారంభించిందని, అప్పట్లో 25 కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్‌గా కేటాయించారన్నారు. ఇప్పటివరకు 30.08 కోట్ల రూపాయలను ఈ నిధి నుండి పొగాకు రైతుల సంక్షేమానికి ఖర్చు చేశామని, మరో 6.40 కోట్ల రూపాయలను రుణాలుగా అందించామని వివరించారు. గతేడాది డిసెంబర్ మాసాంతానికి సంక్షేమ నిధి కింద 56.12 కోట్ల రూపాయలు నిల్వ ఉందన్నారు. మనదేశంలో పండే పొగాకు, ఉత్పత్తులు 69 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ప్రధానంగా పశ్చిమ యూరప్, దక్షిణా ఆసియా, ఉత్తమ, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వివరించారు. పుడమితల్లిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, రైతులు తక్కువ పెట్టుబడికి వీలున్న ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టిసారించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ రైతులకు, వ్యాపారులకు అవార్డులను అందజేశారు. భారతదేశం నుంచి ఉత్తమ మ్యానిఫ్యాక్చర్స్, ఎక్స్‌పోర్టర్స్ కేటగిరి కింద ఐటిసి గడిచిన ఏడాది 1682 కోట్ల రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులను ఎగుమతి చేసింది. బోర్డు వైస్ చైర్మన్ గడ్డమడుపు సత్యనారాయణ, సభ్యులు బాలినేని సీతయ్య, కర్ణాటక సభ్యులు పీవీ బసవరాజప్ప, సి కిరణ్‌కుమార్, వర్జీనియా పొగొకు ఉత్పత్తిదారుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ యలమంచలి శివాజీ, బోర్డు కార్యదర్శి శ్రీ్ధర్‌బాబు పాల్గొన్నారు.

అక్రమ సంబంధం వల్లే ఐటీఐ విద్యార్థి హత్య

0
0

చల్లపల్లి, : ఐటీఐ విద్యార్థి హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం సాయంత్రం చల్లపల్లి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు కేసులోని నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. అక్రమ సంబంధం నేపథ్యంలో జరిగిన వివాదాలే హత్యకు కారణమని డీఎస్పీ తెలియచేశారు. డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం వక్కలగడ్డ గ్రామానికి చెందిన అల్లూరి గంగా దుర్గారావు (18) ఘంటసాలలోని ఐటీఐ కళాశాల నుండి తన సైకిల్‌పై దేవరకోట డొంక రోడ్డులో ఇంటికి వస్తున్నాడు. హనుమానుల రాజేంద్రప్రసాద్‌కు చెందిన చెరకు తోట వద్దకు వచ్చిన దుర్గారావును అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న సాల ఆంజనేయులు తన ద్విచక్ర వాహనాన్ని సైకిల్‌కు అడ్డుపెట్టి దుర్గారావును కిరాతకంగా హత్య చేశాడు. తాటి ఆకులు నరికే కత్తితో అతి కిరాతకంగా తల, మెడ, భుజాలపై పలు చోట్ల నరికి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరకు తోటలో పడేశాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో దుర్గారావు హత్య జరిగినట్లు తెలిపారు. వక్కలగడ్డ గ్రామానికే చెందిన చిట్టూరి సౌందర్య అలియాస్ సంతోషి భర్తకు దూరంగా జీవిస్తోంది. ఆమెతో మృతుడు దుర్గారావుకు, ఆంజనేయులుకు ఉన్న శారీరక సంబంధాల నేపథ్యంలో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో దుర్గారావును అడ్డు తొలగిస్తానని ఆంజనేయులు సౌందర్యకు తెలిపాడు. హత్య చేసిన అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండాలని నిందితుడు ఆంజనేయులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించాడు. పోలీసు జాగిలాలకు దొరకకుండా ఉండేందుకు ఘటనా ప్రదేశంలో, మృతదేహం మీద కారం చల్లాడని, ముఖానికి బురద రాశాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దూర ప్రాంతానికి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆంజనేయులును చల్లపల్లి సీఐ ఎన్ వెంకట రమణ, ఘంటసాల ఎస్‌ఐ షణ్ముక సాయి తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం మరో నిందితురాలు అయిన సౌందర్యను అరెస్టు చేశారన్నారు. ఈ సమావేశంలో సీఐ వెంకట నారాయణ, ఘంటసాల, చల్లపల్లి ఎస్‌ఐలు షణ్ముక సాయి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, మోటారు సైకిల్, సెల్‌ఫోన్‌ను సీజ్ చేసినట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు.

వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 4: పట్టణంలో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక 2వ వార్డు మాచవరం, ఆనందపేటలో రూ.24.21లక్షల వ్యయంతో నిర్మించనున్న నాలుగు సీసీ రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం అంతర్గత రహదార్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో నూరు శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

యువతదే దేశ భవిష్యత్తు

కృష్ణా బాలోత్సవ్ ప్రారంభ సభలో ఎల్‌ఐసీ సీడీఎం జయసింహన్

మచిలీపట్నం (కల్చరల్), : భారతదేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ఎల్‌ఐసీ సీనియర్ డివిజినల్ మేనేజర్ జయసింహన్ అన్నారు. స్థానిక హిందూ కళావాల ఆడిటోరియంలో కృష్ణా బాలోత్సవం వేడుకలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జయసింహన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచి ఆలోచనలతో విద్యనభ్యసించాలన్నారు. మచిలీపట్నంలో ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో పాల్గొంటేనే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను బయట పడతాయన్నారు. బాలోత్సవ్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొల్లూరి నరేష్ కుమార్, డి వాసు మాట్లాడుతూ మచిలీపట్నంలో బాలోత్సవ్ నిర్వహించడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం దేశ భక్తి గీతాలాపన (బృందగానం), విచిత్ర వేషధారణ, జానపద గీతాలాపన, రఘనాటికల ప్రదర్శన, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ప్రజా సంక్షేమానికే ‘జన్మభూమి’

0
0

మచిలీపట్నం, : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే జన్మభూమి - మా ఊరు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక 9, 10 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రవీంద్ర మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో అత్యంత పారదర్శకత పాటిస్తూ అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డులు, పెన్షన్‌లు పంపిణీ చేస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. జన్మభూమి ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంతో పాటు వారి సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 101 సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. 1.40కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ప్రతి నెలా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ అందచేస్తున్నామన్నారు. అలాగే 55 లక్షల మందికి సామాజిక పెన్షన్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో కొత్తగా 10వేల మందికి పెన్షన్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో నివేశన స్థలాలు లేని నిరుపేదలకు జీ ప్లస్ త్రీ కింద 6వేల 400 గృహాలు నిర్మించామన్నారు. ఇప్పటికే 3వేల మంది లబ్దిదారులకు ఫ్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. జనవరి మాసాంతానికి 10వేల గృహాలు నిర్మించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. అటువంటి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బందరు డివిజన్ జన్మభూమి ప్రత్యేక అధికారి, ఏపీ చేతి వృత్తుల అభివృద్ధి సంస్థ యండీ ఎం వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రేపు పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు రాత పరీక్ష

మచిలీపట్నం, జనవరి 4: పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రత్యేక పర్యవేక్షణలో పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆ శాఖాధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 24 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 17వేల 423 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మచిలీపట్నం పరిధిలో ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేగా నందిగామ, కంచికచర్ల పరిధుల్లో మరో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ముందస్తు భద్రతా చర్యలతో పాటు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ ద్వారా తీసుకోనున్నారు. ఇందుకు గాను అభ్యర్థులంతా విధిగా గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎస్పీ త్రిపాఠి కోరారు. నిర్ణీత పరీక్షా సమయం 10గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. ఒకసారి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన అభ్యర్థులు పరీక్ష ముగిసే వరకు కేంద్రంలోనే ఉండాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా తమ వెంట హాల్ టికెట్స్ తెచ్చుకోవాలన్నారు. అలాగే అభ్యర్థులు తమ గుర్తింపుకు సంబంధించి పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగి అయితే గుర్తింపు కార్డు వీటిలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, పెన్సిల్ ఎరైజర్లను అభ్యర్థులే తెచ్చుకోవల్సి ఉంటుందన్నారు. ఏ విదమైన ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించేది లేదన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలన్నారు.

గుణపాఠం తప్పదు

0
0

మైలవరం, జనవరి 4: మోసపూరిత హామలతో వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలవాలని చూస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలనుండి గుణపాఠం తప్పదని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (కేపీ) స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడి గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. గడచిన తొమ్మిదిన్నరేళ్ళుగా గుర్తుకు రాని అభివృద్ధి తాను నియోజకవర్గంలోకి రాగానే నేతలకు గుర్తుకు రావటం శోచనీయమని ఎద్దేవా చేశారు. ఇప్పటికిప్పుడు సిసి రోడ్లు, వీధి లైట్లు, ఇళ్ళ స్థలాలు, పక్కా ఇళ్ళ విషయం గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. నిన్నటి వరకూ హడావిడి చేసిన సిసి రోడ్లు ఎందుకు ఆగాయని ప్రశ్నించారు. మంత్రి ఉమకు ప్రజల నుండి ఆదరణ లేకపోవటంతో అధికారులను, పోలీసులను వెంటేసుకుని గ్రామాల్లోకి వస్తున్న విషయం వాస్తవం కాదా అన్నారు. ఓటమి భయం పట్టుకుని అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు దూరంగా ఉంటున్న తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగిస్తూ గ్రామాల్లో అశాంతికి ఆజ్యం పోస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల కొండపల్లిలో బ్రదర్ అనిల్ కుమార్‌తో భారీ యొత్తున పాస్టర్ల సదస్సు తలపెడితే దానిని జరగనీయకుండా అడ్డుకుని పైశాచిక ఆనందాన్ని పొందారని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదల ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని నేటికీ ఇవ్వక పోవటం శోచనీయమన్నారు. పూరగుట్ట ఇళ్ళ స్థలాల పంపిణీకి ప్రామాణికత ఏమిటని ప్రశ్నించారు. అందులో పేదలకు ఇళ్ళ స్థలాలు ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో వారికే తెలియాలన్నారు. ఆ విషయాన్ని ప్రశ్నిస్తే పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే తాము అడ్డుకుంటున్నామని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి తాము వ్యతిరేకం కాదని, అర్హత కలిగిన వారికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే దానికి తాము సహకరిస్తామన్నారు. మైలవరం నియోజకవర్గంలో ఐదు మండలాలలో తనకు అపూర్వమైన ఆదరణ ఆయా గ్రామాలలోకి తాను వెళ్ళినప్పుడు అర్థం అవుతోందని, రాబోయే ఎన్నికలలో వైసీపీ విజయం నల్లేరుపై నడకే అవుతోందని జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం తమ పార్టీ పట్ల లభిస్తున్న ఆదరణ, టీడీపీ నుండి వైసీపీలోకి వస్తున్న వలసలతో తేటతెల్లమవుతోందన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

0
0

ఉప్పల్, జనవరి 4: బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని న్యూ హేమానగర్‌లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పురపాలక సంఘం కమిషనర్ ఆర్.ఉపేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. పలు సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు, తాగు నీటి పైపులైన్లు వేయాలని పేర్కొన్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కే.చంద్రవౌళి ఆధ్వర్యంలో ప్రతినిధులు సమ్మిరెడ్డి, ఓంప్రకాష్, పుప్పాల వెంకటేశ్, మల్లయ్య, ప్రభాకర్ రెడ్డి, సురేష్, సత్తిరెడ్డి, నర్సయ్య పాల్గొని పై సమస్యలను పరిష్కరించాలని కోరారు.
వాతావరణ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు ప్రారంభం
కీసర, జనవరి 4: వాతావరణ డిజిటల్ డిస్‌ప్లే బోర్డును మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో వాతావరణ డిజిటల్ డిస్‌ప్లే బోర్డులను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం, ప్రణాళిక శాఖ అన్ని జిల్లాల్లో ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసామని అన్నారు. విపత్తు కాలాన్ని ముందుగానే గుర్తించటం వల్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. సీపీఒ సౌమ్య, డీఆర్‌డీఒ కౌటిల్య పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తే సహించేది లేదు
షాద్‌నగర్ రూరల్, జనవరి 4: కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తే సహించేది లేదని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.రాజు అన్నారు. శుక్రవారం షాద్‌నగర్‌లో కార్మికుల సమావేశాన్ని నిర్వహించి వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.రాజు మాట్లాడుతూ నాలుగున్న ఏళ్ల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలకు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. కార్మిక చట్టాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేకమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని వంటి డిమాండ్లతో జనవరి 8,9వ తేదిల్లో దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ఇ.బాల్‌రాజ్, కె.సాయిలు, కె.రాజు, శ్రీనునాయక్, శేఖర్, మల్లేష్, వెంకటేష్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన జడ్పీటీసీ ఎంఎస్‌ఆర్
ఉప్పల్, జనవరి 4: తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావును టీఆర్‌ఎస్ బోడుప్పల్ సీనియర్ నాయకుడు, జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, దర్గ దయాకర్ రెడ్డి, ఇతర నాయకులు కలిసి మేడిపల్లి మండలంలో నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వివరించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నుంచి నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంటు, మున్సిపల్ ఎన్నికల్లో బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలక సంఘాలు కైవసం చేసుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.
యాదవుల అభివృద్ధికి కృషి
* మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఘట్‌కేసర్, జనవరి 4: యాదవ కులస్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండల పరిధి మక్త గ్రామానికి చెందిన శ్రీ గోకులకృష్ణ యాదవ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఆవిష్కరించారు. సంఘం అధ్యక్షుడు చింతపట్టి లింగం యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి ఘనంగా సన్మానించారు. యాదవ కులాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెలను పంపీణీ చేసినట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చాక యాదవుల ఉపాధికి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తామని చెప్పారు. బాల్‌రాజు, విద్యాసాగర్, రమేశ్, యాదగిరి, శ్రీశైలం ఉన్నారు.

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
* కార్పొరేటర్ రమణారెడ్డి
హయత్‌నగర్, జనవరి 4: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చంపాపేట్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని దుర్గ్భావానినగర్ కాలనీలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్-2019 అవగాహన ర్యాలీని కార్పొరేటర్ ప్రారంభించారు. రమణారెడ్డి మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరుగా చేసి స్వచ్ఛ హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గణేష్, జవాన్ ఎల్లయ్య, సూపర్‌వైజర్లు శరత్, సురేష్, రాంరెడ్డి, సభ్యులు ఇందిరమ్మ, సరోజ, అంబికా, పుష్ప, ఇందిరా, విజిత, సిబ్బంది పాల్గొన్నారు.


పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

0
0

రాజేంద్రనగర్, జనవరి 4: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే గడువు దగ్గర పడుతుండటంతో పంచాయతీశాఖ అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన శంషాబాద్, సాతంరాయ్, కొత్వాల్‌గూడ, తొండుపల్లి, ఊటుపల్లి, గొల్లపల్లి గ్రామాలు మినహా 18 పాత పంచాయతీలు, కొత్తగా ఏర్పడిన 9 పంచాయతీలు మొత్తం 27 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 27 గ్రామ పంచాయతీల పరిధిలో ఎస్సీలు 9971, ఎస్టీలు 5285, ఇతరులు 27380, మొత్తం 43186 జనాభా ఉన్నట్లు తేల్చారు.
సిద్ధమైన మార్గదర్శకాలు
మండల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్న 27 గ్రామ పంచాయతీల్లో మొత్తం 246 వార్డులు ఉన్నాయి. అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వార్డుల రిజర్వేషన్లను ఎలా కేటాయించాలన్న అంశంపై ఉన్నతాధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో 248 వార్డుల రిజర్వేషన్ల కేటాయించే ప్రక్రియను పంచాయతీ అధికారులు ప్రారంభించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వ్లెడించారు.
ఖరారైన రిజర్వేషన్లు
శంషాబాద్ మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల రిజర్వేషన్లను ప్రకటించారు. ఎస్సీ 6, ఎస్టీ 1, బీసీ 4, జనరల్ 11 వందశాతం గిరిజనులు ఉన్న ఐదు తండాలను ఎస్టీలకే కేటాయించారు.
మొత్తం గ్రామ పంచాయితీల్లో 50శాతం మహిళలకు కేటాయించారు. మరో రెండు రోజుల్లో గ్రామాల్లో సామాజికవర్గం అభ్యర్థులు గ్రామ సర్పంచ్‌లుగా ప్రాతినిథ్యం వహించాలో అధికారులు ఖరారు చేసే పనిలో నిమగ్నమైయ్యారు.
మొదలైన సందడి
పంచాయతీ ఎన్నికల ప్రకటన జారీ కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. శాసనసభ ఎన్నికలు ముగియగానే పల్లెపోరు ఆరంభవడంతో గ్రామాల్లో జోష్ పెరిగింది. రిజర్వేషన్ల ప్రకటనతో పోటీకి దిగేందుకు అవకాశం కలిగిన ఆశావాహులు తమకు అనుకూలంగా లేని వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
అవసరాలపై దృష్టి
అనేక పంచాయతీల్లో తక్కువ సంఖ్యలో ఉన్న కులాల వారికి శుభకార్యాలకు, ఇతర కార్యాలకు ఉపయోగపడే వంటపాత్రలు ఇప్పిస్తామని కొంతమంది హామీలు ఇస్తున్నారు. ఇలా ఎవరికి ఏది అవసరమో తెలుసుకొని వారి అవసరాలను తీర్చేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మేజర్ పంచాయతీల్లో అప్పుడే ప్రచార సాధనలు సిద్ధం చేసుకోవడంతో పాటు తమ వెంట జనాన్ని తిప్పుకుంటూ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నెల రోజుల్లోనే మళ్లీ ఎన్నికలు రావడంతో కొంత మంది ఆనందపడుతున్నారు. కొన్ని రోజుల వరకు తమ ఆలన పాలన అభ్యర్థులే చూసుకుంటారని విందులతో గడపవచ్చని భావిస్తున్నారు.
అభ్యర్థుల వేటలో
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పార్టీలను బలోపేతం చేసుకునేందుకు పంచాయతీ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. దీంతో రాజకీయ నాయకులు గెలిచే అభ్యర్థులను పోటీకి దించేందుకు అనే్వషిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు శాసనసభ ఫలితాలను సాధించాలని కృషి చేస్తుండగా మిగతా పార్టీల నేతలు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
విందుల జోష్
పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ పోటీ చేసే అభ్యర్థులకు పరోక్షంగా రాజకీయ పార్టీల అండదండలు ఉంటున్నాయి. తక్కువ ఓట్ల సంఖ్యతో గెలుపోటములు సాధించే అవకాశం ఉన్న ఈ ఎన్నికల్లో ఇప్పటి నుంచే ఓటర్లకు కొంత మంది విందులు ఇస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారిని విందులకు పిలిచి తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు.

565 గ్రామ పంచాయతీలు, 4850 వార్డులు
వికారాబాద్, జనవరి 4: వికారాబాద్ జిల్లాలో 565 గ్రామ పంచాయతీలుండగా వాటిలో 4850 వార్డులున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో నివసించే జనాభా మొత్తం 7 లక్షల 66165. వికారాబాద్ మండలంలో 20 గ్రామ పంచాయతీలలో 174 వార్డులుండగా, 26209 జనాభా ఉంది. పూడూర్ మండలంలో 31 గ్రామ పంచాయతీలలో 274 వార్డులు, 44884 జనాభా కలదు. పరిగి మండలంలో 37 గ్రామ పంచాయతీలలో 314 వార్డులు, 44743 జనాభా, బషీరాబాద్ మండలంలో 36 గ్రామాల్లో 296 వార్డులు, 43562 జనాభా ఉంది. బొంరాస్‌పేట్ మండలంలోని 47 గ్రామ పంచాయతీలలో 388 వార్డులుండగా 51211 జనాభా, దౌల్తాబాద్ మండలంలో 33 గ్రామాలు, 292 వార్డులు, 51411 జనాభా, కొడంగల్ మండలంలో 26 గ్రామాల్లో 230 వార్డులు, 39379 జనాభా, పెద్దెముల్ మండలంలో 37 గ్రామాల్లో 302 వార్డులు, 44819 జనాభా, తాండూర్ మండలంలో 33 గ్రామాలు, 290 వార్డులు 53661 జనాభా, యాలాల్ మండలంలో 37 గ్రామ పంచాయతీలు, 308 వార్డులు, 45295 జనాభా, బంట్వారం మండలంలో 11 గ్రామ పంచాయతీలు, 100 వార్డులు, 18229 జనాభా, ధారూర్ మండలంలో 32 గ్రామ పంచాయతీలు, 274 వార్డులు, 40814 జనాభా, దోమ మండలంలో 36 గ్రామ పంచాయతీలు, 308 వార్డులు, 48272 జనాభా, కోట్‌పల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీలలో 150 వార్డులు, 22004 జనాభ, కులకచర్ల మండలంలో 44 గ్రామ పంచాయతీలలో 374 వార్డులు, 56038 జనాభా, మర్పల్లి మండలంలో 27 గ్రామ పంచాయతీలలో 252 వార్డులు, 51090 జనాభా, మోమిన్‌పేట మండలంలో 28 గ్రామ పంచాయతీలు 248 వార్డులు 43261 జనాభా, నవాబ్‌పేట మండలంలో 32 గ్రామ పంచాయతీలలో 276 వార్డులు, 41283 జనాభా ఉంది.

మున్సిపాలిటీలో ఓటర్ల గణన పూర్తి .. ముసాయిదా జాబితా విడుదల

0
0

షాద్‌నగర్, జనవరి 4: స్థానిక పురపాలక సంఘంలోని 23వార్డుల్లో కులాల వారిగా ఓటర్ల గణన కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. 2019 జూలై నెలతో పురపాలక సంఘం పాలక వర్గం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో 2018 డిసెంబర్ 23నుంచి 29వరకు వివిధ వార్డుల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఓటర్ల గణన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమకు దరఖాస్తులు చేసుకుంటే పరిశీలించి ఓటర్ల జాబితాను సరిచేయనున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 23 వార్డుల్లో 31,609 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఇందులో 16,023 మంది పురుషులు, 15,585 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను పరిశీలించేందుకు ఈనెల 4వ తేది గురువారం వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలపవచ్చని, శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలను పరిశీలించనున్నట్లు మున్సిపల్ కమీషనర్ శరత్‌చంద్ర తెలిపారు. ముసాయిదా జాబితాను పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో పెట్టనున్నట్లు వివరించారు. ఓటర్ల జాబితాను పరిశీలించుకునేందుకు పురపాలక కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ల గణన ప్రకారం మున్సిపాలిటీలో బీసీ ఓటర్లు 22,491మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 11,368, మహిళలు 11,123 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు మొత్తం 6,426 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 3,338, మహిళలు 3,088 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు మొత్తం 988 మంది ఉన్నారు. ఇందులో 478 మంది పురుషులు, 510 మంది మహిళలు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు మొత్తం 1,703 మంది ఉన్నారు. ఇందులో 839 మంది పురుషులు, 864 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు ఒకరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వార్డుల వారీగా ఓటర్లు ఇలా..
షాద్‌నగర్ పురపాలిక సంఘంలోని 23వార్డుల్లో ఓటర్లు ఇలా ఉన్నారు. మొదటి వార్డులో మొత్తం 1745 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 876 మంది పురుషులు, 869 మంది మహిళలు ఉన్నారు. రెండవ వార్డులో మొత్తం 1484 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 727 మంది పురుషులు, 757 మంది మహిళలు ఉన్నారు. మూడవ వార్డులో మొత్తం 1703 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 916 మంది పురుషులు, 787 మంది మహిళలు ఉన్నారు. నాల్గవ వార్డులో మొత్తం 1684 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 859 మంది పురుషులు, 825 మంది మహిళలు ఉన్నారు. ఐదవ వార్డులో మొత్తం 1367 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 668 మంది పురుషులు, 699 మంది మహిళలు ఉన్నారు. ఆరవ వార్డులో 1181మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 610మంది పురుషులు, 571 మంది మహిళలు ఉన్నారు. ఏడవ వార్డులో మొత్తం 1047 మంది ఓటర్లు ఉండగా అందులో 535 మంది పురుషులు, 539 మంది మహిళలు ఉన్నారు. ఎనిమిదవ వార్డులో మొత్తం 1496మంది ఓటర్లు ఉండగా అందులో 758మంది పురుషులు, 738మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తొమ్మిదవ వార్డులో మొత్తం 1957 మంది ఓటర్లు ఉండగా అందులో 990మంది పురుషులు, 967మంది మహిళలు ఉన్నారు. పదవ వార్డులో మొత్తం 1183మంది ఓటర్లు ఉన్నారు. అందులో 592మంది పురుషులు, 591మంది మహిళలు ఉన్నారు. 11వ వార్డులో మొత్తం 1127మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 563మంది పురుషులు, 564మంది మహిళలు ఉన్నారు. 12వ వార్డులో మొత్తం 1239మంది ఓటర్లు ఉండగా అందులో 657మంది పురుషులు, 582మంది మహిళలు ఉన్నారు. 13వ వార్డులో మొత్తం 1085మంది ఓటర్లు ఉండగా అందులో 527మంది పురుషులు, 558మంది మహిళలు ఉన్నారు. 14వ వార్డులో మొత్తం 1230 మంది ఓటర్లు ఉండగా అందులో 606మంది పురుషులు, 624మంది మహిళలు ఉన్నారు. 15వ వార్డులో మొత్తం 985 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 525మంది పురుషులు, 460మంది మహిళలు ఉన్నారు. 16వ వార్డులో మొత్తం 1180మంది ఓటర్లు ఉండగా అందులో 590మంది పురుషులు, 590మంది మహిళలు ఉన్నారు. 17వ వార్డులో మొత్తం 528మంది ఓటర్లు ఉన్నారు. అందులో 262మంది పురుషులు, 266మంది మహిళలు ఉన్నారు. 18వ వార్డులో మొత్తం 2459మంది ఓటర్లు ఉండగా అందులో 1286మంది పురుషులు, 1173మంది మహిళలు ఉన్నారు. 19వ వార్డులో మొత్తం 1712 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 875మంది పురుషులు, 837మంది మహిళలు ఉన్నారు. 20వ వార్డులో మొత్తం 1548మంది ఓటర్లు ఉండగా అందులో 759మంది పురుషులు, 789 మంది మహిళలు ఉన్నారు. 21వ వార్డులో మొత్తం 1343మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 685మంది పురుషులు, 658మంది మహిళలు ఉన్నారు. 22వ వార్డులో మొత్తం 1370మంది ఓటర్లు ఉన్నారు. అందులో 691మంది పురుషులు, 679మంది మహిళలు ఉన్నారు. 23వ వార్డులో మొత్తం 928మంది ఓటర్లు ఉండగా అందులో 466మంది పురుషులు, 462మంది మహిళలు ఉన్నారు.
ఓటర్ల గణన పూర్తి చేశాం
షాద్‌నగర్ పురపాలక సంఘంలోని 23వార్డుల్లో ఓటర్ల గణన కార్యక్రమాన్ని పూర్తి చేశామని మున్సిపల్ కమీషనర్ శరత్‌చంద్ర వివరించారు. సర్వే చేసి వార్డు వారిగా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు.

సర్పంచ్ అభ్యర్థుల పేర్లు సక్రమంగా పరిశీలించాలి
రంగారెడ్డి కలెక్టర్ లోకేష్‌కుమార్

కొత్తూరు, జనవరి 4: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల పేర్లను అధికారులు సక్రమంగా పరిశీలించి నామినేషన్లు స్వీకరించాలని రంగారెడ్డి కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు ఎన్నికల సరళిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పోరపాట్లు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సామాగ్రిని పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరించేందుకు కృషి చేయాలని సూచించారు. బ్యాలెట్ ప్లాస్టిక్ కర్రతో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లాస్టిక్‌తో బ్యాలెట్ స్టిక్ ఏర్పాటుచేస్తే ఓటర్లకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని, ప్రతి ఎన్నికల కేంద్రంలో కర్రతో ఏర్పాటు చేసిన బ్యాలెట్ స్టిక్ ఉండే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఎంపీడీఓ జ్యోతి, ఇఓఆర్‌డీ సాధన, నందిగామ తహశీల్దార్ దేవ్‌జా, సీనియర్ అసిస్టెంట్ మాధవిలు పాల్గొన్నారు.

కృష్ణ పూజారికి ఘన సన్మానం
మేడ్చల్, జనవరి 4: మేడ్చల్ మండలంలోని గౌడవెల్లిలో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే 2018 జాతీయ అవార్డు గ్రహీత కృష్ణ పూజారిని మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గాంధీ ఆసుపత్రిలో రోగులకు చేసిన సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీలో గర్‌వాల్ భవన్‌లో మెమెంటోను అందించి శాలువాతో సన్మానించినట్లు పేర్కొన్నారు. ప్రతీ మనిషి మానవసేవే మాధవ సేవ పరమావధి అని భావించాలని కోరారు. కార్యక్రమంలో మహేందర్, ఆంజనేయులు, వెంకట్‌రామ్, లక్ష్మీనారాయణ, వెంకట్, శ్రీనివాస్, దేవేందర్, ఆకుల పద్మ, స్ఫూర్తి, శే్వత, వేణుగోపాల్, రాజు, అశోక్ పాల్గొన్నారు.
ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా దిలీప్
కేపీహెచ్‌బీకాలనీ, జనవరి 4: ఏబివిపి తెలంగాణ రాష్ట్ర కార్య సమితి సభ్యుడిగా జవ్వాజీ దిలీప్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డా. ప్రసాద్ అందజేశారు. ఎబివిపి నాయకులు చల్లా రామకృష్ణ, పితాని సందీప్, చింతకుంట సాయికుమార్, కమలాకర్, సాయికృష్ణ, శ్రీకాంత్ దిలీప్‌ను అభినందించారు.
డిజిటల్ హబ్ ప్రారంభం
నాచారం, జనవరి 4: ఉస్మానియా యూనివర్స్‌టీ కేంద్రంగా అర్బన్ సెంటర్‌లో 10 రాష్ట్రాలకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ప్రసంశనీయమని వైస్ ఛాన్స్‌లర్ రామచంద్రం అన్నారు. ఓయూలో పట్టణ పర్యావరణ ప్రాంతం అధ్యయన కేంద్రంలో నూతన సాంకేతిక హబ్‌తో ఆధునీకరించి అభివృద్ధి పరిచి డిజిటల్ హబ్‌ను సంస్ధ డైరెక్టర్ పార్ధసారధితో ప్రారంభించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ పథకానికి జియో టాగింగ్ విధానం ఆమలు చేసిన ఘనత ఓయూకు దక్కుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ఓఎస్‌డీ కృష్ణారెడ్డి, అమరేందర్ రెడ్డి, రాజా పాల్గొన్నారు.

పెరిగిన చెత్త భారం

0
0

హైదరాబాద్, మహానగరంలోని 30 సర్కిళ్లు..625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి ప్రతిరోజు 5వేల 280 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. కానీ కొద్దిరోజుల క్రితం వరకు 4500 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని, ఇక పండుగలు, పబ్బాలు వస్తే అదనంగా సుమారు వెయ్యి నుంచి 2వేల మెట్రిక్ టన్నుల చెత్త అదనంగా వస్తుందని ప్రకటించిన అధికారులు ఇపుడు ఏకంగా 5280 మెట్రిక్ టన్నుల చెత్తవస్తున్నట్లు ప్రకటించటంలో వాస్తవమెంత అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ప్రతి సంవత్సరం 500 నుంచి వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్తను కాగితాలపై లెక్కల్లో చూపుతున్నారే తప్పా, ఏ ఒక్క ఉన్నతాధికారి దీన్ని శాస్ర్తియంగా పరిశీలించటం లేదన్న విమర్శలున్నాయి. నగరంలో రోజురోజుకి పెరుగుతున్న జనాభా, నివాసాలకు తగినట్టుగా అక్షరాస్యత, చెత్తపై అవగాహన పెరుగుతుండటంతో అధికారులు ప్రకటించిన పెద్ద మొత్తంలో చెత్త పెరగకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహానగర పాలక సంస్థ ఏర్పటైన నాటి నుంచి కూడా చెత్త సేకరణ, రవాణా అనేది అనేక రకాల ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. చెత్త సేకరణ మాట అలా ఉంచితే, చెత్త రవాణాలో దీర్ఘకాలంగా తిష్టవేసిన కొందరు కాంట్రాక్టర్లకు, అధికారుల బినామీలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకే అధికారులు పెద్ద మొత్తంలో వేలాది టన్నుల్లో చెత్త వస్తోందని లెక్కలు చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. చెత్త రవాణాలో ఇప్పటి వరకు అనేక రకాల కుంభకోణాలు వెలుగుచూసినా, నేటికీ అక్రమాలకు అడ్డుకట పడటం లేదు. పూర్వ కమిషనర్ డా.బీ.జనార్దన్ రెడ్డి చెత్త రవాణాకు సంబంధించి అనేక రకాల సంస్కరణలు ప్రవేశపెట్టినా, అవి రవాణాలో అక్రమాలను పెంచాయే తప్పా, అదుపు చేయలేదన్న వాదనలు సైతం బలంగా ఉన్నాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి చెత్త రవాణాలో 99 శాతం కాంట్రాక్టులు అప్పగించటం ఈ వాదనలకు బలాన్ని సమకూరుస్తోంది. ముఖ్యంగా వాహానాల ఏంగేజ్, వాహానాల మరమ్మతులు, ఇంధనం వంటి అంశాల్లోనే ఎక్కువగా అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. పార్కింగ్ యార్డులు, ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో వాహానాల రాకపోకలు, అద్దె వాహానాల వినియోగం, మరమ్మతులు, ఇంధనం వంటి అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు ఎలాంటి ముందస్తు సమాచారమివ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే చెత్త తరలింపునకు సంబంధించి అనేక అక్రమాలు వెలుగుచూస్తాయన్న వాదన ఉంది. జీహెచ్‌ఎంసీ కింది స్థాయి అధికారులు ప్రకటించిన ‘చెత్త’లెక్కలను విశ్వసిస్తారా? లేక ఏ ఏ సర్కిల్‌లో ఎంత వరకు చెత్త ఉత్పత్తి అవుతుందన్న విషయాన్ని రహస్యంగా అంఛనా వేస్తే అసలు చెత్త భారమెంత అన్నది బయటపడే అవకాశాలున్నట్లు వాదనలున్నాయి.

ఆంజనేయ స్వామి ఆలయంలో శంభీపూర్ పూజలు
జీడిమెట్ల, జనవరి 4: రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జన్మదిన వేడుకలను తెరాస నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ముందుగా నర్సాపూర్‌లోని శాకర్‌మెట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ రాజు టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును ఎమ్మెల్యేలు కేపీ వివేక్, కృష్ణారావులతో పాటు కలిసి ఆశీస్సులను పొందారు. జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్‌ఎస్ యూత్ నాయకుడు జైహింద్ ఆధ్వర్యంలో రాజును కలిసి కేక్‌ను కట్‌చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
తిరుపతి కొండపై సేవలు
వికారాబాద్, జనవరి 4: నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి మేరకు వికారాబాద్‌కు చెందిన 50 మంది భక్తులు నాలుగు రోజులపాటు తిరుపతి కొండపై ఉచితంగా నాలుగు రోజుల పాటు సేవలందించారు. సేవలందించేందుకు వెళ్ళిన బృందానికి నాయకత్వం వహించిన మ్యాడం లక్ష్మి మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా భావించి, ఏడు కొండల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తులకు సేవకులుగా మారడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

ఉద్యమంలా హరిత యజ్ఞం

చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీకి సత్వర చర్యలు
స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సహకారం
హెచ్‌ఎండీఏ కమిషనర్ డాక్టర్ జనార్ధన్ రెడ్డి

ఉప్పల్, జనవరి 4: ఔటర్ రింగ్‌రోడ్డుకు సంబంధించిన ప్రాంతంలో ఉన్న రైల్వే లైను కారిడార్ చుట్టుప్రక్కల సేంద్రీయ ఎరువులు తయారు చేసేందుకు కావలిసిన చర్యలు (గుంతలు తవ్వి చెత్తను వేయడం) తీసుకోవాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ డాక్టర్ బీ.జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుస్సేన్ సాగర్ వద్ద బీపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలలో సేకరించే చెత్తను సేంద్రీయ ఎరువుగా తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని నిర్ధేశిస్తూ ఇందులో స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల అధికారులతో సమన్వయం చేసుకుని ఆయా ప్రాంతాల చెత్తను తరలించి సేంద్రీయ ఎరువుల తయారీకి వినియోగించాలని అన్నారు. తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తయారైన ఎరువులను మొక్కల పెంపకంలో వాడాలని, ఓఆర్‌ఆర్‌కు చెందిన రైల్వే కారిడార్‌లో చెత్తను వేసే వారిని గుర్తించి వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. గ్రీన్ ఇయర్‌గా ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో హరిత క్రాంతిని మరింత పెంపొందించేందుకు వినూత్న ఆలోచనలను స్వాగతించాలని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించి ప్రభుత్వ పాఠశాలల పిల్లల సందర్శన కోసం ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పార్కులలో కార్యక్రమాల కోసం
ఆన్‌లైన్ బుకింగ్
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పీపుల్స్ , పార్టీ జోన్, నక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కు తదితర ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇకపై పౌరులు ఆన్‌లైన్ ద్వారా తమకు కావలసిన రోజు బుక్ చేసుకోవచ్చని సంస్థ కమిషనర్ డాక్టర్ బీ.జనార్ధన్ రెడ్డి తెలిపారు. తార్నాక కేంద్ర కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలు కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఏ రోజుల్లో బుక్ చేసుకునే వీలుందో వివరాలు కన్పిస్తాయని చెప్పారు. చెల్లింపులు కూడా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారానే కాకుండా నెట్ బ్యాంకు ద్వారా చేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్‌లో లింక్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. త్వరలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల ప్రవేశ టిక్కెట్లు కూడా ఆన్‌లైన్‌లో విక్రయించే సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఠాణాల్లో ఆటో నమోదు డ్రైవర్ల ఐడీ తప్పని సరి

0
0

హైదరాబాద్, జనవరి 4: జంటనగరాల్లో ప్రయాణీకులను చేరవేస్తున్న ఆటోడ్రైవర్లు ఇక నుంచి తప్పని సరిగా ఆటోల వివరాలతో పాటు డ్రైవర్ల ఐడీ కార్డులను ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదు చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17వతేదీ నుంచి ఆటో డ్రైవర్లు తమ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆటో డ్రైవర్లపై జంటనగరాల్లో భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రయాణీకులతో చార్జీల రేట్లపై డ్రైవర్లు వాదోపవాదాలు చేయడంతో పాటు దౌర్జన్యం సంఘటనలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆటో డ్రైవర్లపై దృష్టి పెట్టారు. ప్రయాణీకులు భయాందోళన చెందే విధంగా డ్రైవ్ చేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. బస్టాప్‌ల వద్ద అడ్డంగా ఆటోలు పార్క్ చేయడంతో ప్రయాణీకులు బస్సు ఎక్కడానికి ఇబ్బందులు కల్గుతున్న సంఘటనలు గుర్తు చేస్తున్నారు.

ఇక..మూసీ నదీ పరివాహక ఆక్రమణలపై సర్వే పారిశుద్ధ్య పనుల తనిఖీ

0
0

హైదరాబాద్, : మూసీ నదిలో, పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయని, వీటిపై ఓ సర్వేకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఆదేశించారు. అత్తాపూర్, కార్వాన్ ప్రాంతాల మీదుగా పలువురు హైకోర్టు న్యాయమూర్తులు రాకపోకల సాగిస్తున్నందున ఈ రూట్‌లో రోడ్డుకిరువైపులా ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారిశుద్ద్య పనులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ పలు చోట్ల రోడ్డుకిరువైపులా వ్యర్థాలు, చెత్త కుప్పలు దర్శనమివ్వటంతో సంమంధిత అధికారులపై కమిషనర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రూట్‌లో పెండింగ్‌లో ఉన్న ఫుట్‌పాత్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రూట్‌లో రాత్రిపూట కొందరు వ్యక్తులు భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తున్నట్లు గుర్తించిన ఆయన వారిని గుర్తించి, భారీగా జరిమానాలను వసూలు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైతే సీసీ టీవీలను ఏర్పాటు చేసి, వ్యర్థాలను వేస్తున్న వారిని గుర్తించాలని సూచించారు. మెహిదీపట్నం జంక్షన్‌లోని బస్టాపు, రైతుబజార్‌లో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ మెహిదీపట్నం రైతుబజార్ నుంచి మురుగునీరు సమీపంలోని బస్టాండు, ఎదురుగా ఉన్న రోడ్డుపైకి పారుతుండటంతో వందలాది మందికి అసౌకర్యంగా ఉండటాన్ని గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరవై నాలుగు గంటల్లో ఈ మురుగునీటి లీకేజీకి అరికట్ట, శాశ్వత పరిష్కారాన్ని సమకూర్చాలని జలమండలి అధికారులను ఆదేశించారు. రైతుబజార్‌లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తతో సేంధ్రీయ ఎరువులను తయారు చేసేందుకు వీలుగా కంపోస్టు పిట్‌లను ఏర్పాటు చేయాలని రైతుబజార్ మేనేజర్‌కు సూచించారు. రైతుబజార్ పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్సు నుంచి దుకాణందార్లు పెద్ద ఎత్తున చెత్తను రోడ్లపై వేయటాన్ని గమనించిన ఆయన ప్రతి షాప్ వద్ద ప్రత్యేకంగా డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని, రైతుబజార్ పక్కనే ఉన్న గ్యార్బెజీ పాయింట్‌ను వెంటనే ఎత్తివేయాలని, లేని పక్షంలో ఎప్పటికపుడు అక్కడి నుంచి చెత్తను తరలించి, శుభ్రపర్చాలని ఆదేశించారు. టోలీచౌకీకి చేరుకున్న కమిషనర్ అక్కడ ఓ బహుళ అంతస్తు భవనం నుంచి రోడ్డుపైకి భారీగా నీరు ప్రవహిస్తున్నట్లు గుర్తించి, ఆ భవన యజమాని నుంచి జరిమానా వసూలు చేయాలని, దానికి తోడు నల్లా కనెక్షన్ కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత జియాగూడ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను పరిశీలించి, అందులో ఔషధ మొక్కలను నాటాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో కమిషనర్‌తో పాటు జోనల్ కమిషనర్ ముషారఫ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులున్నారు.

సంక్రాంతికి అదనపు బస్సులు

0
0

చాదర్‌ఘాట్ : సంక్రాంతి సందర్భంగా రద్దీని దృష్టిలో వుంచుకుని టీఎస్‌ఆర్టీసి పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపడానికి చర్యలు చేపట్టింది. సమీప జిల్లాలకు రోజూ అదనంగా బస్సులను నడుపుతున్నారు. ఏపీకి అవసరానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎంజీబీఎస్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది సంఖ్యను పెంచి బస్సులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడు పండుగకు వెయ్యి బస్సులు అదనంగా నడిపే అవకాశం వున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పండుగకు రవాణా నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టనున్నట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రాఘవేందర్‌రెడ్డి వివరించారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తెలంగాణలోని జిల్లాలకు జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, ఎల్‌బి.నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లలో సంక్రాంతి రద్దీకి వీలుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో వుండేలా ఉన్నతాధికారుల అనుమతి అనంతరం చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత

0
0

తిరువనంతపురం: అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలకు ప్రవేశం కల్పించటంపై కేరళలో శనివారంనాడు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తలస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి. మురళీధర్ నివాసంపై బాంబు దాడులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. శనివారం తెల్లవారు జామున ఆరెస్సెస్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. కోజికోడ్ జిల్లాలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఎఎన్ షంషీర్ ఇంటిపై దాటి జరిగింది. మరొకచోట సీపీఎం కార్యకర్త కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ప్రధాని మోదీ కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు.


కేరళ పునర్నిర్మాణంపై దృష్టి సారించండి

0
0

హైదరాబాద్: అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇస్రో మాజీ ఛైర్మన్, బీజేపీ నాయకులు మాధవన్ మండిపడ్డారు. ప్రభుత్వం తీరు పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కాకుండా వరదలు, తుపానుల కారణంగా నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు.

భారత్‌ను పాలించినవారిలో మహారాష్ట్రీయులే అధికం

0
0

ముంబయి: రాజలు కాలంలో భారత్‌ను పాలించినవారిలో మహారాష్ట్రీయులే ఎక్కువని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అన్నారు. ఆయన నాగపూర్‌లో జరిగిన ప్రపంచ మరాఠా సమ్మేళనానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ 2050నాటికి ఖచ్చితంగా మరాఠావాసులే ప్రధాని పదవిని అధిష్టిస్తారని వ్యాఖ్యానించారు. అలాగే నిరుద్యోగ నిర్మూళనకు రిజర్వేషనే్ల పరిష్కారం కాదని అన్నారు.

కన్నా ఇంటిపై దాడి గర్హనీయం

0
0

విజయవాడ: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి జరగటం గర్హనీయమని బీజేపీ నేత విజయ్‌బాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాకినాడ పర్యటన సందర్భంగా ఆయనను ప్రశ్నించిన మహిళను ఫినిష్ చేస్తామనటం సిగ్గుచేటు అని అన్నారు. ఇలా ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడటం టీడీపీకి అలవాటేనని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం:చంద్రబాబు

0
0

అమరావతి: హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఆయన కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్లు లేని ప్రతి ఉద్యోగికి ఇల్లు నిర్మించి ఇస్తామని, అపార్ట్‌మెంట్‌లు నిర్మించి అందులో ఫ్లాట్స్‌లో ఉద్యోగులకు కేటాయించాలని సూచించారు. చుక్కల భూమికి సత్వరమే పరిష్కారం చూపించాలని సూచించారు.

పోలీసుల కాల్పుల్లో గోహంతకుల హతం

0
0

ముజఫర్ నగర్: పోలీసుల కాల్పుల్లో ఇద్దరు గోహంతకులు మృతిచెందారు. శికర్ఫూర్ గ్రామంలో గో మాంసాన్ని అమ్మి విక్రయిస్తున్నారనే సమాచారం రావటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గో హంతకులు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గో హంతకులు మృతిచెందారని, మరో ఇద్దరు పారిపోయారని పోలీసులు వెల్లడించారు.

Viewing all 69482 articles
Browse latest View live