Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఎన్నికలకు సర్వం సన్నద్ధం

0
0

హైదరాబాద్, జనవరి 5: గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు, పంచాయతీ అధికారులు తదితరులతో శనివారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాల నుండి అందిన సమాచారం ప్రకారం పంచాయతీ ఎన్నికలకు సర్వం సన్నద్దం అయినట్టేనని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, పోలింగ్ మెటీరియల్, సెక్యూరిటీ, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ హాళ్లు, స్టోరేజీ కేంద్రాలు తదితర అంశాలపై కలెక్టర్లకు సూచనలు చేశారు. రెండురోజుల్లో ఎన్నికల నోటీస్ జారీ అవుతుండటం, 25 రోజుల్లో ఎన్నికలు పూర్తి కావలసి ఉండటంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ సందర్భంగా పోలింగ్‌స్టేషన్లు ఉండే ప్రాంతాలను సూచించే సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. మొదటి, రెండోవిడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు రిటర్నింగ్ అధికారుల నియామకం, ప్రిసైడింగ్ అధికారుల నియామకం, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల నియామకం పూర్తయి, శిక్షణ కూడా పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల పరిశీలకులు జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. పోలింగ్‌కు సంబంధించిన మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ హాళ్లు, ఉపసర్పంచ్ ఎన్నికకోసం హాళ్ల ఎంపికలను వెంటనే మరొక సారి పర్యవేక్షించాలని సూచించారు. వెబ్‌క్యాస్టింగ్, వీడియో రికార్డింగ్‌లకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద లైటింగ్ ఏర్పాట్లు సమర్థతగా ఉండేలా చూడాలన్నారు.
ఏ గ్రామంలో కూడా బలవంతంగా ఏకగ్రీవ ఎన్నిక జరగకుండా చూడాలని, ప్రజలంతా కలిసి ఏకగ్రీవం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల నోటీస్ జారీ అయిన తర్వాతనే ఏకగ్రీవం అనేది మొదలవుతుందన్నారు.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి సూచించారు. పోలింగ్ సమయంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించేలా ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని, సదరు అధికారి వివరాలను పోలింగ్ సిబ్బందికి తెలియచేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్‌పీలకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండటంతో పోలీస్ సిబ్బందిని రొటేషన్ విధానంలో వినియోగించుకోవచ్చన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, హోంశాఖ ముఖ్యకార్యదర్వి రాజీవ్ త్రివేది,పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూప్రసాద్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..జిల్లా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న నాగిరెడ్డి, జోషి తదితరులు


మత విశ్వాసాలను కాపాడే బాధ్యత పాలకులదే

0
0

గుంటూరు, జనవరి 5: దేశంలో పలు మతాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్నారని, వారి మతవిశ్వాసాలు దెబ్బతీసేలా కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, అయితే మత విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత పాలకులదేనని అయ్యప్ప సేవా సమాఖ్య అధ్యక్షుడు సిరిపురపు శ్రీ్ధర్ పేర్కొన్నారు. శనివారం సమాఖ్య ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులు గుంటూరు అరండల్‌పేటలోని శివాలయం నుండి శంకర్‌విలాస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిపురపు శ్రీ్ధర్ మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో అశాంతిని నెలకొల్పేలా కొందరు వ్యూహరచన చేస్తున్నారని, ఇందులో భాగంగా కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ఆచార వ్యవహారాలను మంటగలిపి, భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం అయ్యప్ప దేవాలయంలో 18 మెట్లను ఎక్కి 50 సంవత్సరాలలోపు ఉన్న ఇరువురు మహిళలు ఆలయ ఆచార సాంప్రదాయాలను కించపరిచేలా స్వామివారి దర్శనం చేసుకున్నారు. పురాణ కాలం నుంచి ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి నైష్ఠిక బ్రహ్మచర్యంతో దశాబ్దాల కాలం పాటు ఉండేలా దేవాలయంలో పలు నియమ నిబంధనలు ఉన్నాయని, వాటికి విరుద్ధంగా అక్కడి ప్రభుత్వం చేస్తున్న చర్యలు సరికాదన్నారు. దీక్ష తీసుకున్న అయ్యప్పలు మండలంపాటు నైష్ఠిక బ్రహ్మచర్యం పాటించి అయ్యప్పను దర్శించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు కుందుర్తి భాస్కర్, యు మధుస్వామి, మర్రిపాటి ప్రసాద్, భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీకి కాక పుట్టిస్తున్న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

0
0

భీమవరం, జనవరి 5: కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో మేరా బూత్ - సబ్ సే మజ్‌బూత్ పేరుతో నిర్వహించిన బీజేపీ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కాక పుట్టిస్తోంది. ఐదు పార్లమెంటు పరిధుల్లోని బూత్ కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యకర్తలు సత్యమే మాట్లాడాలి.. ఎవరైనా తప్పుచేస్తే ప్రశ్నించండి.. అంటూ పిలుపునిచ్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మభూమి మన ఊరు కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ని ఆ నగర కార్పొరేటర్, భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీప్రసన్న నిలిపివేసి ప్రశ్నించిన సంఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది. దీన్ని ఓర్వలేక తెలుగు తమ్ముళ్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని ముట్టడించిన సంగతి తెలిసిందే. దీంతో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు భారతీయ జనతాపార్టీని, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ చాలా ఘాటుగా విమర్శలు చేయడం తెలిసిందే. అదే విధంగా ధర్మపోరాట దీక్షలు పెట్టి పదేపదే మోదీని, బీజేపీని విమర్శించడం అదే పనిగా చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు ఐదు ప్రశ్నలను సంధించడం ప్రారంభించారు. వీటికి చంద్రబాబు సమాధానం కూడా ఇవ్వడం లేదు. పైగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తన పుణ్యమేనంటూ చంద్రబాబు నాయుడు చెబుతుండగా వాటికి నిధులు ఇచ్చింది తామేనంటూ మరోపక్క బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ మాధవ్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా కాకినాడలో లక్ష్మీప్రసన్నను ఉద్దేశించి మాట్లాడిన బాబు మిమ్మల్ని తిరగనివ్వం అంటూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతాపార్టీ సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా తిరుమల వచ్చిన బీజేపీ ఆలిండియా అధ్యక్షుడు అమిత్ షాను, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటనలను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాబూ.. ఏది మా జాబు.. అనే నినాదంతో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడు నాగోతు రమేష్‌నాయుడు రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల వేడి ఇప్పటికే రాజకీయ పార్టీల్లో రాజుకుంది. ఇదిలా ఉండగా ఈ నెల 7వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటనను అడ్డుకునేందుకు బీజేవైఎం వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.

హత్యా రాజకీయాల చరిత్ర కన్నాదే

0
0

గుంటూరు, జనవరి 5: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆయన రహస్య స్నేహితులదే హత్యా రాజకీయాల చరిత్ర అని, తెలుగుదేశం పార్టీకి ఆ చరిత్ర లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్టప్రతి పాలన తీసుకు వచ్చేందుకే కన్నా లక్ష్మీనారాయణ యత్నిస్తున్నారని ఆరోపించారు. రక్తపుటేరులు పారిన చోటే నీటి సెలయేర్లు పారించి, ఆ భూములను పచ్చటి పంటపొలాలతో నింపిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందని, ఈ విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. అకారణంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి అభాండాలు వేయడం సరికాదన్నారు. తిరుమల పర్యటనకు వచ్చిన అమిత్‌షా నుంచి ప్రత్యేక హోదాపై సమాధానం రాబట్టడం కోసం ప్రయత్నించిన నిరసనకారులపై దాడి చేయించిన నీచ సంస్కృతి బీజేపీ నేతలదన్నారు. అమిత్‌షా కారు కూడా దిగకుండా పలాయనం చిత్తగించారని, ఇది నాయకులకు ఉండాల్సిన లక్షణమా అని ప్రశ్నించారు. కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధైర్యంగా బస్సు నుండి కిందకు దిగి వచ్చి అందరికీ సమాధానం ఇచ్చారని, అదే నాయకుడి లక్షణమన్నారు. ముఖ్యమంతితో మాట్లాడిన బీజేపీ మహిళా కార్పొరేటర్ టీడీపీ మద్దతుతో గెలిచారన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు మరచినట్లున్నారన్నారు. స్మార్ట్ సిటీల విషయంలో ప్రశ్నించే ముందు బీజేపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. 2017-18లో జాతీయ స్థాయిలో స్మార్ట్ సిటీలకు రూ. 9,943 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం రూ. 182 కోట్లు మాత్రమేనన్నారు. దీనిని బట్టి నరేంద్రమోదీ గొప్పగా చెప్పుకునే స్మార్ట్ సిటీస్ మిషన్ ఏ విధంగా విఫలమైందో అవగతమవుతుందన్నారు. అర్బన్ డెవలప్‌మెంట్‌పై లెక్కలు కావాలంటే 22వ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ రిపోర్టు పరిశీలిస్తే బీజేపీ నేతలకు తెలుస్తుందన్నారు. సానుభూమి కోసం బీజేపీ నాయకులు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, త్వరలో బీజేపీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని మంత్రి ఆనందబాబు జోస్యం చెప్పారు.

‘కేంద్రంపై పోరాటానికి జగన్, పవన్ కలిసి రావాలి’

0
0

నెల్లూరు, జనవరి 5 : రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల సాధనలో భాగంగా ఎన్నో ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయింపులపై కేంద్రంపై టీడీపీ చేస్తున్న పోరాటానికి వైసీపీ, జనసేనతో పాటు ఇతర పార్టీలు కలిసి రావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా శనివారం ఆయన కొండలపూడిలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష వైకాపా నేత జగన్ ఇప్పటికే కేంద్రంతో లాలూచీ రాజకీయం నడుపుతున్నాడని ఆరోపించారు. జగన్ తన కేసుల మాఫీ కోసం కేంద్రం నోరెత్తి మాట్లాడడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ తను సొంతంగా ఫ్యాక్ట్ పెండింగ్ కమిటీ ద్వారా ఈ రాష్ట్రానికి రూ.75వేల కోట్లు అవసరం వుందని ప్రకటించిన ఆయన కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదన్నారు. రాష్ట్రంలో లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి రాజీ పడడం లేదన్నారు. దేశవ్యాప్తంగా గృహనిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన ర్యాంకుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన 18 అంశాలను, అప్పటి ప్రధాని ఇచ్చిన మరో ఆరు మొత్తం 24 అంశాలను అమలుచేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని మంత్రి కోరారు.

నేడు, రేపు ఆంధ్ర రచయిత్రుల ప్రథమ మహాసభలు

0
0

విజయవాడ, జనవరి 5: కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారిగా ఈ నెల 6, 7 తేదీల్లో స్థానిక పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు భారీ ఎత్తున జరగబోతున్నాయి. సభా ప్రాంగణానికి యద్దనపూడి సులోచనారాణి పేరును, సాహితీ వేదికకు కళా ప్రపూర్ణ తెనే్నటి హేమలత పేరును నామకరణం చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచందుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ సభలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఓల్గా ప్రారంభించనున్నారు. మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనెని రాజకుమారి, జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. మహిళా పరిశోధక వ్యాస సంపుటిని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, ఆంధ్ర రచయిత్రుల గ్రంథాన్ని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరిస్తారు. ఆంధ్ర సంస్కృతి సమితి సీఈఓ డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్, అక్టోపస్ ఎస్‌పీ గుళ్లపల్లి రామమూర్తి రాధిక, తెలుగు భాషా ప్రాథకార సంస్థ సీఈఓ ఎ లక్ష్మీకుమారి అతిథులుగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రులు అధరాపురపు తేజోవతి, అలూరు విజయలక్ష్మీ, చలసాని వసుమతి, తమిరిశ జానికి, దివాకర్ల రాజేశ్వరి, పీ సత్యవతి, పుట్టపర్తి నాగపద్మిని, పెళ్లకూరు జయప్రదలను సత్కరిస్తారు. 11.30 గంటలకు జరిగే రెండో సభలో ఆచార్య కోలవెన్ను మలయవాసిని, మండలి వెంకట కృష్ణారావు విశిష్ట సాహితీ పురస్కారంతోను ఓల్గాను ఆలూరి బైరాగి సాహిత్య ప్రతిభా పురస్కారంతోనూ, ఇంద్రగంటి జానకీబాలను సాహితీతపస్వి పోలవరపు కోటేశ్వరరావు కథా పురస్కారంతోనూ, డాక్టర్ కేబీ లక్ష్మీని ముక్కామల నాగభూషణం పాత్రికేయ ప్రతిభా పురస్కారంతోనూ, డాక్టర్ టీసీ వసంతకు వేముల కేశవరావు అనువాద ప్రతిభా పురస్కారంతోనూ సత్కరిస్తారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు, భమిడిపాటి బాలా త్రిపుర సుందరి సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి జరిగే మొదటి సదస్సులో పాటిబండ్ల రజని అధ్యక్షతన డాక్టర్ వి శారద, మందరపు హైమవతి, శీలా సుభద్రాదేవి, వారణాసి సూర్యకుమారి, బండారు జ్యోతి స్వరూపరాణి, కోనేరు కల్పనలను సత్కరిస్తారు. ఆచార్య ఎస్ శరజ్జ్యోత్స్నారాణి అధ్యక్షతన జరిగే రెండో సదస్సులో ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, అత్తలూరి విజయలక్ష్మీ, లక్కరాజు దేవి, దివాకర్ల రాజేశ్వరి, జీ రెజీనా, పెబ్బిలి హైమవతిలను సత్కరిస్తారు. డాక్టర్ చామర్తి అన్నపూర్ణ అధ్యక్షతన మూడో సదస్సులో డీ సుజాతాదేవి, ఝాన్సీ కేవీ కుమారి, కోనేరు లక్ష్మీప్రమీల, కోకా విమలకుమారి, విజయలక్ష్మీ పండిట్, బులుసు సరోజినీదేవిలను సత్కరిస్తారు. సాయంత్రం కవి సమ్మేళనం జరుగుతుంది. రెండోరోజైన సోమవారం ఉదయం డాక్టర్ చిల్లర భవానీదేవి అధ్యక్షతన జరిగే నాలుగో సదస్సులో ప్రముఖ రచయిత్రులు సూరెడ్డి శాంతాదేవి, మంజులూరి కృష్ణకుమారి, ఎఎల్‌ఎమ్ ప్రకాశ్ కుమారి, బళ్లూరు ఉమాదనవి, సింహాద్రి పద్మ, పీ అమరజ్యోతి, డా తుర్లపాటి రాజేశ్వరి అధ్యక్షతన జరిగే ఐదవ సదస్సులో యర్రమిల్లి విజయలక్ష్మీ, తమ్మిన పరమాత్మ, చివుకుల శ్రీలక్ష్మీ, మధ్యాహ్నం తేళ్ల అరుణ అధ్యక్షతన జరిగే ఆరవ సదస్సులో ఆచార్య జీ యోగప్రభావతీదేవి, డాక్టర్ చిన్నలక్ష్మీ కళావతి, కోపూరు పుష్పాదేవి, కే శాంతకుమారి సత్కరిస్తారు. వనితా వైభవం సాహిత్యరూపం సాయంత్రం కవి సమ్మేళనం జరుగుతుంది.

ఎదురు తిరిగితే అణచివేస్తారా?

0
0

విజయవాడ(సిటీ), జనవరి 5: ప్రత్యేక హోదా...రాష్ట్ర హక్కుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిలదీయడం తప్పా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఎదురు తిరిగితే అణచి వేస్తాం అనే మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదని శనివారం ట్విట్టర్‌లో లోకేష్ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీస్తే దానిపై బీజీపీ నాయకులు ప్రతివిమర్శలు చేయడం దారుణమన్నారు.

ప్రాచీన కాలంలోనే విద్యకు భారతదేశం నిలయం

0
0

విజయవాడ, జనవరి 5: భారతదేశం ప్రాచీన కాలంలోనే విద్యకు నిలయంగా విలసిల్లిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ కాలంలో నలంద, తక్షశిల, పుష్పగిరి మంచి విద్యాలయాలుగా వెలుగొందాయన్నారు. వాటిలో విద్యను అభ్యసించడానికి చైనా లాంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారన్నారు. యువతలో నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలుగుతామనే విషయాన్ని మన తెలుగువారు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నిరూపిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. సమాజంలోని యువతకు దిశానిర్దేశం చేయడంలో లయోలా లాంటి ప్రముఖ విద్యా సంస్థల కృషి ప్రశంసనీయమన్నారు. శనివారం విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ 65వ వార్షికోత్సవం, కాలేజీ ప్రథమ ప్రిన్సిపల్ రెవ ఫాదర్ తియో మత్తయాస్ ఎస్‌జే శత జయంతి కార్యక్రమానికి ముఖ్యఅథిగా వెంకయ్య నాయుడు హాజరయ్యారు. తొలుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కాలేజీ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రెవ ఫా తియో మత్తయాస్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన దేశం గర్వించదగిన ముద్దుబిడ్డ రెవ ఫా తియో మత్తయాస్ అని అన్నారు. చెన్నైలో ఉన్న లయోలా కాలేజీని తెలుగుగడ్డకు తీసుకువచ్చి లయోలాకు ముందు ఆంధ్రా పదాన్ని చేర్చిన వ్యక్తి రెవ ఫా తియో అని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా సిద్ధాంతం పెరిగి రాద్ధాంతం పెరిగిపోతుందన్నారు. భారతదేశం సహనశీలత గల దేశమని, ఏ దేశంపైనా ముందుగా ఎప్పుడూ దాడి చేయలేదన్నారు. మానవ సేవే మాధవ సేవ అనేది భారతదేశ విధానమన్నారు. కాలేజీ ప్రదానం చేసిన వివిధ అవార్డుల్లో 75 శాతం మంది బాలికలే ఉండడం మంచి పరిణామమన్నారు. ప్రస్తుతం కాలేజీలో బోధించే మోరల్ సైన్స్ సబ్జెక్ట్‌లో మోరల్ విలువలు పోయి సైన్స్ మాత్రమే మిగిలిందని అలా కాకుండా ప్రస్తుత విద్యా విధానం మోరల్ సైన్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లౌకిక విధానం అనేది మన భారతదేశ ప్రజల డీఎన్‌ఏలోనే ఉందన్నారు. మాజీ రాష్టప్రతి ఏపీజే కలాం చెప్పినట్లు ఉన్నత కలలు కనండి వాటిని సాకారం చేసుకోండని యువతకు మార్గదర్శకం చేసారన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మూడీ రేటింగ్స్ ప్రకారం రాబోయే కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడవ స్థానానికి చేరుకుంటుందన్నారు. యువత ముఖ్యంగా అమ్మ, జన్మభూమి, మాతృభాష, గురువును మర్చిపోవద్దన్నారు. ముందుగా ఉప రాష్టప్రతి చేతుల మీదుగా రెవ ఫాదర్ తియో మత్తయాస్ పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించి రెవ ఫాదర్ తియో మత్తయాస్‌పై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎఎలెసి సొసైటీ ప్రెసిడెంట్ అమల్‌రాజ్, ప్రిన్సిపల్ జీఏపీ కిషోర్, రెక్టార్ బాలశౌరి, కరస్పాండెంట్ సహాయరాజ్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
చిత్రం..వార్షికోత్సవంలో మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు


కృష్ణా తీరాన మార్మోగిన హనుమాన్ చాలీసా పారాయణం

0
0

విజయవాడ, జనవరి 5: అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యాన కృష్ణానది తీరంలో విజయవాడ పద్మావతి ఘాట్‌లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం మార్మోగిం ది. సుమారు 2లక్షల మంది పైగా భక్తులు హాజరయ్యారు. ఒకవైపు కనకదుర్గమ్మ ఆశీస్సులు, మరోవైపు స్వామీజీ స్వయంగా నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం మార్మోగుతుండగా రాష్ట్రం నలుమూలల నుం చి తరలివచ్చిన ప్రజలు భక్తితత్వంతో ఓలలాడారు. ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ స్వామీజీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం జరగడం అభినందనీయమంటూ స్వామీజీ స్వయంగా సత్కరించారు. ముందుగా వీర హనుమాన్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీ జీ చంద్రబాబుకు ప్రసాదాన్ని అందించి ఙ్ఞపికను అందచేశారు. నదీ తీరం పొడవునా వీర హనుమాన్ ఫ్లెక్సీలు భక్తుల్లో మరింత అధ్యాత్మికతను పెంపొందింపచేశాయి.

చిత్రాలు.. పఠన వేదికపై చంద్రబాబునాయుడు, గణపతి సచ్చిదానంద స్వామి
* చంద్రబాబుకు జ్ఞాపికను బహూకరిస్తున్న గణపతి సచ్చిదానందస్వామి

దళారులకే కాంగ్రెస్ వత్తాసు

0
0

బరిపడ (ఒడిశా), జనవరి 5: కాంగ్రెస్ పార్టీ దళారుల కోసమే పనిచేసిందని, ఆ పార్టీ సారధ్యంలోని యూపీఏ హయాం లో ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనేలేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. శనివారంనాడు ఇక్కడ బీజేపీ ర్యాలీని ఉద్దేశించిన మాట్లాడిన ఆయన ‘2004-2014 మధ్యకాలంలో దేశ రక్షణ దళాలను బలహీనపరిచేందుకు పెద్ద కుట్రే జరిగింది’ అని ఆరోపించారు. ఇపుడు ఆ పాలనలోని వాస్తవాలు ఒకటొక్కటిగా వెలుగు చూడడంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నిద్రపట్టడంలేదని అన్నారు. గత నాలుగున్నరేళ్లుగా దేశానికి చౌకీదారుగా పనిచేస్తున్న తనను తొలగించాలన్న డిమాండ్‌తోనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మోదీ అన్నారు. ‘దొంగలే చౌకీదారును తొలగించాలని అనుకుంటారు’ అంటూ వ్యంగ్యోక్తి విసిరారు. దేశ రక్షణ, ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న చౌకీదారును ఎలాగైనా తొలగించాలన్నదే కాంగ్రెస్ ధ్యేయం గా పనిచేస్తోందని మోదీ అన్నారు. సమాజంలోగానీ, ఫ్యాక్టరీల్లోగానీ దొంగల ఏకైక ధ్యేయం ఎలాగైనా చౌకీదారును తొలగించి చొరబడి దోచుకోవాలన్నదని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ‘ఈ చౌకీదారు ఉన్నంతవరకు ఆ దొంగల ఆటలు సాగవు. వారి కుట్రలు నెరవేరవు’ అని ఉద్ఘాటించారు. అలాగే యూపీఏ హయాంలో సాగిన కుంభకోణాలు క్రమంగా వెలుగులోకి రావడం వల్ల కాంగ్రెస్ నాయకులు ఎక్కడలేని ఆవేదన చెందుతున్నారని పేర్కొన్న మోదీ అగస్టా వెస్ట్‌లాండ్ స్కామ్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రులతోను, నాయకులతోను తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఈ కుంభకోణంలో పాత్రధారి క్రిస్టియన్ మిషెల్ ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఇటీవలే ఇతనిని దుబాయ్ నుంచి భారత్ తీసుకువచ్చారని, ఇంటరాగేషన్‌లో విషయాలు బట్టబయలు అవుతున్నాయని తెలిపారు. యూపీఏ హయాంలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఫైళ్ల కదిలికల గురించి, రక్షణ రంగంపై ఏర్పాటు చేసిన కమిటీలో చర్చల గురించి ఈ దళారీకి పూర్తి సమాచారం ఉందని మోదీ అన్నారు. అంతేకాదు, ప్రతి కీలక ఫైలు సమాచారం ఇతని వద్ద ఉందని ప్రస్తుతం జరుపుతున్న దర్యాప్తులో ఆ వివరాలన్నీ బయటపడుతున్నాయని మోదీ అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అప్పటి ప్రధానమంత్రి కంటే కూడా కాంగ్రెస్ హయాంలో దళారులకే ఎక్కువ కీలక సమాచారం తెలుసునన్న విషయం స్పష్టమవుతుందని చెప్పారు. రక్షణ, భద్రత, ఆయుధ సేకరణకు సంబంధించిన వివరాలను ఈ దళారులు విదేశాలకు అందజేసిన సంకేతాలు కూడా ఉన్నాయని మోదీ తెలిపారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపిందా లేదా ఒక దర్బారుగానే దాన్ని నిర్వహించిదన్న అనుమానం కలుగుతోందని అన్నారు. ఈ అంశాలన్నింటిపైన తమ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరుపుతుందని స్పష్టం చేసిన ఆయన ‘మధ్యవర్తులను రక్షించడంలో అప్పటి పాలకుల పాత్ర ఏమిటి అన్నది నిగ్గు తేలుస్తాం’ అని ఉద్ఘాటించారు. దేశ భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ వెనకాడలేదని పేర్కొన్న మోదీ దేశ ప్రజలకు, సాయుధ దళాలకు, చివరికి రక్షణకే రక్షణ లేకుండా చేసిన కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశం ఇవ్వాలా అంటూ జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, కుంభకోణాలకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా వెల్లడించారు.
చిత్రం..ఒడిశాలో శనివారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

కేసముద్రంను కమ్మేసిన మంచు దుప్పటి

0
0

కేసముద్రం, జనవరి 5: దట్టమైన పొగమంచుతో శనివారం కాజీపేట- విజయవాడ సెక్షన్‌లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను వేగం తగ్గించి నడిపారు. ఉ. 7 గం. నుండి 9 గం. వరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో దట్టమైన పొగమంచు కప్పేసింది. దీనితో కనీసం పది మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్ధితి ఏర్పడింది. ఫలితంగా డ్రైవర్లకు సిగ్నల్ సరిగా కనిపించకపోవడంతో ఆ సమయంలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో నడవాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను 60 కిలోమీటర్లకు తగ్గించి నడిపించినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీనితో ఉదయం పూట విజయవాడ నుండి కాజీపేట వైపు, కాజీపేట నుండి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు నిర్ణీత సమయానికి అరగంట నుండి గంట పాటు ఆలస్యంగా నడిచాయి.

చిత్రం..శనివారం ఉ. 9 గంటల సమయంలో కేసముద్రం రైల్వేస్టేషన్లో పొగమంచు

రోదిస్తున్న మాతృత్వం.. కనికరించని సంతానం

0
0

కరీంనగర్, జనవరి 5: నవ మాసాలు మోసి, కని పెంచిన కనుపాపలు వారి పట్ల కాఠిన్యం ప్రదర్శిస్తున్నాయి. వృద్ధాప్యంలోకంటి పాపలా కాపాడుకోవాల్సిన వారిని కనికరం లేకుండా తమ పుత్రులే వీధుల్లోకి నెట్టేస్తుండగా, పాలిచ్చి, లాలించి, జోల పాడిన వారి నోట భిక్షాందేహీ అనే మాట వస్తోంది. సుపుత్రుల ఛీత్కారానికి గురై, బుక్కెడు బువ్వకోసం అల్లాడిపోతున్నారు. గడ్డకట్టే చలిలో, ఒంటినిండా దుస్తులు లేక ఆ ముసలి తల్లులు బిగుసుకుపోతున్నారు. తమ భర్తల ఉద్యోగాలిప్పించి, ఉన్న ఇంటితోపాటు ఆస్తులన్నీ అప్పగిస్తే, తుదకు వారినే వీధుల్లోకి నెట్టేసిన పాపపు పుత్రుల తీరుతో, పున్నామ నరకం అనుభవిస్తున్నారు. నిలువనీడ లేక కాలం గడుపుతున్నారు. చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, తెల్సినవారింత కలో, గంజో వేస్తే కడుపునింపుకుంటూ, అందరు ఉన్నా అనాధలుగా బతుకు జీవనం సాగిస్తున్నారు. బంధుగణం గమనించి కుమారులను ప్రశ్నిస్తే, ముసలి తల్లులపై తమ ప్రతాపాన్ని చూపుతూ, చావే దిక్కనేలా చేస్తుండగా, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ముఖ్యమంత్రి సార్ మమ్మల్ని రక్షించాలంటూ వేడుకుంటున్న తీరు మనసున్న హృదయాలను కన్నీటి పర్యంతం చేస్తోంది. ఎందరు ఉన్నా ఎవరూ పట్టించుకోని ఈ మాతృమూర్తులు ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, గోదావరిఖని పట్టణాల్లో కడు దయనీయంగా భిక్షాటన చేయటాన్ని చూస్తూ, మానవత్వమున్న ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల పట్టణంలోని లచ్చమ్మకు నలుగురు పుత్ర సంతానం ఉండగా, వారిలో ఒకరు మరణించారు. మిగతా ముగ్గురికి కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించి, అప్పగించింది. సుఖ సంతోషాలతో ఉండాలని తమ కుమారుల పెళ్ళిళ్లు చేసి, వారికి బతుకు దెరువు దారి చూపింది. తల్లి ఇచ్చిన నగదుతో ఆ ముగ్గురు కొడుకులు వ్యాపారాలు చేస్తూ, కోటీశ్వరులుగా మారారు. తల్లికి వృద్ధాప్యం రాగా సాదటం కష్టమై, తమకు భారంగా భావిస్తూ, తమకెందుకు బాధ అంటూ వీధుల్లోకి నెట్టారు. తెల్సినవారి సాయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో, చేసేదేమీ లేక బస్టాండ్‌లో భిక్షాటన చేస్తుంది.
అదేవిధంగా గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంట పల్లెకు చెందిన జీల సాయవ్వ పరిస్థితి ఇంతకంటే కడు హీనంగా మారింది. పేగు తెంచుకుని పుట్టిన ముగ్గురు కుమారులను అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసింది. యుక్తవయసులోకి వచ్చినా ఉపాధి లేక పోవటంతో తన భర్త చేసే సింగరేణి ఉద్యోగాన్ని కూడా పెద్దకొడుకుకు ఇప్పించింది. మిగతా ఇద్దరికి చెరో రూ.50లక్షల ఆస్తి పంచి ఇచ్చింది. అయినా, తల్లి అనే కనికరం లేకుండా ముగ్గురు కలిసి విషమిచ్చి చంపేయత్నం చేసినట్లు ఆరోపిస్తోంది ఆ తల్లి. విచక్షణ రహితంగా భౌతిక దాడికి దిగి, ఊరి బయట వదిలి వెళ్ళగా, నాలుగు రోజులుగా చెట్టుకింద తలదాచుకుంటున్న ఆమెను బాటసారులు చూసి అనాథాశ్రమంలో చేర్చగా, ప్రస్తుతం కోలుకుంటుంది. కన్నతల్లులపై కనికరం లేని ఆ కుమారుల తీరు సభ్యసమాజం అసహ్యించుకుంటుండగా, తగిన గుణపాఠం చెప్పాలంటూ ఆ తల్లులు వేడుకుంటున్నారు.
చిత్రాలు.. లస్మవ్వ (72) సాయవ్వ (66)

పోలవరం ప్రగతికి గుర్తింపు ఈ అవార్డు

0
0

అమరావతి, జనవరి 5: ఆర్థికలోటు ఉన్నప్పటికీ సమర్థతతో పనిచేసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా అవార్డు సాధించ గలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. జలవనరుల నిర్వహణలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో అందుకున్న సీబీఐపీ అవార్డును నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం సాయంత్రం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ ప్రభుత్వ పనితనానికి ఓ వైపు అవార్డులు ఇస్తూనే మరోవైపు కేంద్రప్రభుత్వం నిధుల విడుదలకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆక్షేపించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి సోమవారం పురోగతిపై సమీక్షల ఫలితం మూలంగానే అవార్డుల ఎంపికకు ఆస్కారం లభించిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర జలవనరులశాఖ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మరింత సహకరించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 29 సార్లు ప్రాజెక్ట్‌ను సందర్శించి 84 సార్లు సమీక్షించానని గుర్తుచేశారు. పట్టుదల, రైతుల సంక్షేమం, కరవు రహిత రాష్ట్రంగా ఏపీని నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తుండటంతో 2019 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ 15వేల 381 కోట్లు ఖర్చుచేసిందని చెప్పారు. అయితే పెంచిన అంచనా వ్యయాలను కేంద్రం ఆమోదించేలా ప్రయత్నాలు చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు లభించిన ప్రతిష్టాత్మక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ (సీబీఐపీ) అవార్డు-2019ను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా అందుకున్న కార్యక్రమం గురించి మంత్రి ముఖ్యమంత్రికి మంత్రి ఉమా వివరించారు. ఇంజనీర్- ఇన్- చీఫ్ వెంకటేశ్వరరావు, ఓఎస్డీ వరప్రసాద్ తదితరులను సీఎం అభినందించారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై స్వీకరించిన సీబీఐపీ అవార్డును ముఖ్యమంత్రికి అందజేస్తున్న మంత్రి దేవినేని, ఇరిగేషన్ అధికారులు

రొబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

0
0

విజయవాడ, జనవరి 5: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు రొబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగంలో ఈ నెల రెండో వారి నుంచి తొలి విడత శిక్షణను ప్రారంభిస్తున్నట్లు ఎపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ కృతిక శుక్ల తెలిపారు. మొత్తం 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ (ఈసీఎం) మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో మెకట్రానిక్స్, రొబోటిక్స్ విభాగంలో అడ్వాన్స్‌డ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 1.0, అడ్వాన్స్‌డ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 2.0, అడ్వాన్స్‌డ్ అప్లైడ్ రొబోటిక్ కంట్రోల్ 3.0 కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. జర్మనీకి చెందిన రెండు ఐగూస్ రొబోలను ఒక్కొ ల్యాబ్‌లో అందుబాటులో ఉంచి విద్యార్థులకు మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని కృతిక శుక్ల తెలిపారు. తొలి విడతగా యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ సంస్థ రాష్ట్రంలోని 11 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన 24 మంది ఫ్యాకల్టీలను జర్మనీకి తీసుకెళ్లి 10 రోజులపాటు రొబోటిక్స్, మెకట్రానిక్స్ విభాగాల్లో జర్మనీకి చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారని కృతిక శుక్ల తెలిపారు. శిక్షణలో భాగంగా ఆడీ కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. మరో వైపు తొలి విడత శిక్షణ కోసం 5 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2419 మందికి ప్రాథమిక పరీక్ష నిర్వహించి 900 మందిని శిక్షణ కోసం ఎంపిక చేసుకున్నారు. వీరందరికీ 11 ఇంజనీరింగ్ కాలేజీల్లో జనవరి రెండో వారంలో శిక్షణను ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ కృతిక శుక్ల తెలిపారు. మరోవైపు జనవరి నెలాఖరుకల్లా జర్మనీ నుంచి శిక్షణకు అవసరమైన రోబోలను తెప్పించి అందుబాటులో ఉంచుతామని యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ప్రెసిడెంట్ వంగపండు వెంకట నాగరాజు తెలిపారు.

‘సుస్థిర సుపరిపాలన-అభివృద్ధి ప్రజాస్వామ్యం’ పుస్తకావిష్కరణ

0
0

అమరావతి, జనవరి 5: ఢిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఎన్ భాస్కరరావు రచించిన ‘సుస్థిర సుపరిపాలన..అభివృద్ధి..ప్రజాస్వామ్యం’ అనే పుస్తకాన్ని శనివారం రాత్రి ఉండవల్లి ప్రజావేదిక సమావేశమందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. సుస్థిర సుపరిపాలనలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సర్కారియా కమిషన్ సిఫార్సులను ఈ పుస్తకంలో విశదీకరించారు.
దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తొలిసారిగా ‘కేంద్రం మిథ్య’ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని నినదించిన నాటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను ఇందులో ఉటంకించారు. ప్రస్తుతం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు వికటించి తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ పుస్తకం ద్వారా ప్రజలకు తగిన సందేశాన్ని అందించే వీలు కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. దేశం మొత్తంగా రాష్ట్రాలే శక్తివంతమైనవని దేశ సుస్థిర సుపరిపాలనకు మార్గదర్శకాలుగా పేర్కొంటూ రాష్ట్రాల స్వయం సమృద్ధికి కేంద్రం చేయూత నందించాల్సిన అవసరాన్ని రచయిత తేల్చిచెప్పారు.

చిత్రం..సుస్థిర సుపరిపాలన, అభివృద్ధి, ప్రజాస్వామ్యం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి


రాజకీయం వ్యాపారంగా మారింది

0
0

విజయవాడ(సిటీ), జనవరి 5: కళాశాల నుండి పట్టాలు తీసుకోకపోయినా, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీలు, దేశంలో కులాల ప్రభావం వంటి అంశాలపై సంపూర్ణమైన అవగాహనతో పాటు, పూర్తిగా అర్థం చేసుకున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ప్రకారం, చిత్తూరు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, శ్రేణులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేడు రాజకీయాలు వ్యాపారంగా మారిన తరుణంలో వచ్చే ఎన్నికలకు 2 వేల కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసేందుకు కొన్ని రాజకీయ పక్షాలు సన్నద్ధంగా ఉన్నాయని, అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా వాటిని ఎదుర్కొనేందుకు జనసేన సిద్ధపడుతోందన్నారు. నాడు డబ్బులేక పోయినా 2014 ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిందన్నారు. నాటి ప్రజారాజ్యం పార్టీతో సామాజిక న్యాయం తప్పకుండా జరిగేదని, కాని ఓపిక లేని, నీతి లేని నాయకుల కారణంగానే నాడు చిరంజీవి నష్టపోయారన్నారు. తనకు, పార్టీకి యువతే వెనె్నముక అన్నారు. నూతన తరంతోనే వచ్చే ఎన్నికల్లో రిస్క్ తీసుకుని బరిలోనికి దిగనున్నట్లు ప్రకటించారు. నిర్దిష్ట భావజాలం లేని పార్టీలు రాజ్యాలు ఏలుతున్న తరుణంలో కొత్త పార్టీ పెట్టడానికి సమయం ఆసన్నమయిందని భావించి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలోనే జనసేన ఆవిర్భవించిందన్నారు. తనకు సినిమాల్లో నటన ఎప్పుడూ పూర్తి సంత్పప్తి ఇవ్వలేదని, ప్రజాసమస్యలు పరిష్కరించిన నాడే సంపూర్ణమైన ఆనందం కలుగుతుందన్నారు. సినిమాల్లోకి రాకముందునుంచే సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లు తెలిపారు. పీఆర్పీ ఆవిర్భావానికి బలమైన పాత్రను పోషించిన వారిలో తాను ఒకడినన్నారు. పార్టీ ఏర్పాటు కోసం చిరంజీవికి ఎంతో ప్రేరణ కలిగించానని చెప్పారు. చిరంజీవితో నాడు సామాజిక న్యాయం జరిగి ఉండేదని, కాని ఓపిక లేని నాయకులు పార్టీలో చేరినందున ఆ అవకాశం చేజారిందన్నారు. జనసేన ఆవిర్భావంలో తనతో పెద్ద నాయకులు ఎవరూ లేరని, యువతను నమ్మి తాను పార్టీని స్థాపించానని, తనకు, తన పార్టీకి యువతే వెనె్నముక అన్నారు. జనసేన మాతో కలిసి వస్తుందని ఇతరులు ప్రచారం చేసుకునే స్థాయికి నేడు జనసేన వెళ్లిందంటే ఇదే మన విజయానికి తొలి మెట్టుగా అభివర్ణించారు. పీఆర్పీ అనుభవంతో దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు సంపూర్ణంగా వ్యాపారంగా మారాయని, ప్రజల పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలు పరిష్కరించే ఓపిక కూడా నేటి తరం నేతల్లో లేదన్నారు. కులాలు, మతాల్ని చూసి ప్రకృతి వైపరీత్యాలు నష్టాన్ని కలిగించవన్నారు. అన్ని కులాల వారు ప్రకృతి దృష్టిలో సమానమేనన్నారు. అన్ని కులాలు ఐక్యంగా పని చేసిన సందర్భాలు ఉంటాయని, ఇప్పడు జనసేనలో అది కనిపిస్తోందన్నారు. తన ముందున్న లక్ష్యం నూతన రాజకీయ ఒరవడి సృష్టించడమేనన్నారు. దివంగత కాన్షీరాం స్ఫూర్తితో రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదని రుజువు చేసిన ఆ మహానేత అడుగుజాడల్లో వెళ్తానన్నారు. కారు టైర్లను చెప్పులుగా మలచుకుని రాజకీయాల్లో తెరిగిన నేతను ఆదర్శంగా తీసుకుని ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. నాటి పీఆర్పీ అనుభవాలను దృష్టిలో ఉంచుకునే పార్టీ కమిటీలను తొందరపడి నియమించడం లేదన్నారు. పదవీ వ్యామోహంతో చిరంజీవి వంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు నిజమైన బూత్ కమిటీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీపీఎం, సీపీఐ, బీజేపీలకు కొంత వరకు ఉన్నప్పటికీ వారు ఎన్నికల్లో ఎందుకు గెలవడం లేదన్నారు. ప్రారంభ దశలోనే ఉన్న జనసేన సంస్థాగతంగా గట్టిపడటానికి మరింత సమయం పడుతుందన్నారు. ప్రజలందరినీ కలిపే విధంగా ఒక ఉమ్మడి సిద్ధాంతం అవసరమన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశ రాజకీయాలలో మధ్యే మార్గం (మిడిల్ పాత్) అవసరమని, అటువంటి మిడిల్ పాత్ జనసేన పార్టీ భర్తీ చేస్తుందన్నారు. పాలకులు చేసిన తప్పదాల వల్లనే తెలంగాణా ఉద్యమం ఉద్భవించి రెండు రాష్ట్రాలుగా విడిపోవాల్సి వచ్చిందన్నారు. ఎవరెవరో చేసిన తప్పులకి అమాయకులైన ప్రజలు శిక్ష అనుభవించాల్సి వస్తోందన్నారు. సొంత రాష్ట్రంలోనే పరాయివాళ్లుగా మిగిలిపోయే పరిస్థితులు వచ్చాయన్నారు. రాజకీయంగా అనేక దెబ్బలు తిన్న తాను మరింత రాటు తేలినట్లు చెప్పారు. రిటైర్మెంట్ తరువాత తాను రాజకీయాల్లోనికి రాలేదని, నటుడిగా మంచి డిమాండ్ ఉన్న ఉచ్ఛస్థితిలోనే రాజకీయాలోనికి వచ్చినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా ప్రజాబలం ఉన్న వ్యక్తులు జనసేనలోకి వస్తే, వారికి పార్టీ బలం తోడై విజయానికి చేరువవుతామాన్నారు. సామాన్యులు వాడే గాజుగ్లాసు ఎన్నికల గుర్తుగా రావడం మనకు ఎంతో కలిసి వచ్చిన అంశమన్నారు. రానున్న ఎన్నికలు మనకు మొదటివో, చివరివో కాదని, ఇది ప్రారంభం మాత్రమేన్నారు. భవిష్యత్తు మొత్తం జనసేన వైపే ఉందన్నారు. రాజకీయలను ఎంతో ఇష్టంతో చేస్తున్నానన్నారు. ఇష్టం ఉన్నప్పుడే సహనం, ఓర్పు పుష్కలంగా ఉంటాయన్నారు. జనసేనను సంస్థాగతంగా క్రమక్రమంగా విస్తరిద్దామని, మొదటగా పార్లమెంట్ సెగ్మెంటు స్థాయిలో కమిటీలను తానే స్వయంగా నియమిస్తానన్నారు. మన అండతో అధికారంలోనికి వచ్చిన టీడీపీ గానీ, ప్రతిపక్ష వైసీపీ కానీ మనల్ని రాజకీయ పార్టీగా గుర్తించడానికి కూడా ఇష్టపడటం లేదన్నారు. వారికి మన అవసరం ఉందేమోగాని మనకు మాత్రం వాళ్ల అవసరం లేదని పవన్ కళ్యాణ్ వివరించారు.

చరిత్ర భవిష్యత్‌కు పునాది

0
0

రాజమహేంద్రవరం, జనవరి 5: చరిత్ర భవిష్యత్‌కు పునాది అని పలువురు చరిత్రకారులు పేర్కొన్నారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ హిస్టరీ కాంగ్రెస్, తెలంగాణా స్టేట్ హిస్టరీ కాంగ్రెస్‌గా రెండూ అవినాభావంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రాజమహేంద్రవరంలోని శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల సమావేశహాలులో రెండురోజులపాటు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 43వ వార్షిక సదస్సు శనివారం ప్రారంభమైంది. సదస్సును ప్రొఫెసర్ కె తిమ్మారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి త్రినాధ్, కాలేజియేట్ విద్య ఆర్జేసీ డాక్టర్ ప్రమీల, హితకారిణి సమాజం మాజీ ఛైర్మన్లు బుడ్డిగ శ్రీనివాసరావు, దాసి వెంకటరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఇకపై హిస్టరీ కాంగ్రెస్ సంస్థలు రెండుగా అభివృద్ధి చెందుతాయని చరిత్రకారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుడు ప్రొఫెసర్ రామకృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాలకు పుట్టినిల్లు వంటి చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఈ సంస్థ ఒక ల్యాండ్ మార్కు వంటిందన్నారు. రాజమహేంద్రవరంలో రెండవ సారి కందుకూరి విద్యా సంస్థల ప్రాంగణంలో సదస్సు నిర్వహించడం ప్రత్యేకత సంతరించుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థ ఇంత వరకు 42 సంపుటాలను ప్రచురించడం జరిగిందన్నారు. అందరి సహకారంతో ఈ సంస్థ సజీవంగా ఉంటుందన్నారు. తెలుగువారికి సమగ్ర చరిత్ర లేదని 1965లో ఒక కమిటీని వేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థ 9 సంపుటాలను క్రీ.పూ. 500 సంవత్సరాల నుంచి చరిత్రను లిఖించడం జరిగిందన్నారు. ఈ గ్రంథాలను డిజిటలైజేషన్ చేసి అతి త్వరలో ఆన్‌లైన్‌లో పెట్టనున్నామని ప్రొఫెసర్ రామకృష్ణ చెప్పారు. ఈ తొమ్మిది సంపుటాల్లో 6, 7, 8 సంపుటాలను మహాత్మాగాంధీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీ రాసిన గ్రంథంలో ఊటంకించడం ఈ సంస్థకు గర్వకారణమన్నారు. అందుబాటులో లేని ఎన్నో గ్రంథాల పునర్‌ముద్రణకు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణా హిస్టరీ కాంగ్రెస్ ఏర్పడిందన్నారు. ఇటు ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సంస్థ, అటు తెలంగాణా హిస్టరీ కాంగ్రెస్ సంస్థలు సమన్వయంతో అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సంస్థను కాపాడుకోవడంలో యువ చరిత్ర కారులు ముందుకు రావాలన్నారు. హితకారిణీ సంస్థ మాజీ ఛైర్మన్ బుడ్డిగ శ్రీనివాసరావు మాట్లాడుతూ చరిత్ర సృష్టించిన కందుకూరి దంపతులు చరితార్ధులయ్యారన్నారు. ఎన్నో చరిత్రలపై అధ్యయన పత్రాలు సమర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. భవిష్యత్‌కు చరిత్రను అందిస్తారని, భవిష్యత్ తరాలకు మార్గదర్శకం కావాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథులు వార్షిక సావనీర్, పలు గ్రంథాలను ఆవిష్కరించారు.
ప్రారంభ సదస్సుకు ప్రొఫెసర్ కె తిమ్మారెడ్డి అధ్యక్షత వహించగా కాలేజియేట్ విద్య ఆర్జేసీ డాక్టర్ కె ప్రమీల తదితరులు మాట్లాడారు. ప్రొఫెసర్ బిఆర్ ప్రసాద్ నివేదిక సమర్పించారు. ప్రొఫెసర్ కిరణ్ కాంత్ చౌదరి, ఏసీ పల్లంరాజు, పీఏ రాజబాబు, కేశవ్, కనకరత్నం, సలీమ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మహ్మద్ సిలార్ రచించిన దివిసీమ సర్వస్వం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
చిత్రం..సదస్సులో మాట్లాడుతున్న కాలేజీ ఎట్ ఎడ్యుకేషన్ ఆర్‌జేసీ ప్రమీల

కమ్యూనిస్టుల కలహం.. తెరాసకు వరం!

0
0

‘అర్జునా.. వినుము.. యుద్ధంలో చంపెడివాడు ఒకడు, చచ్చెడివాడు మరొకడును కాడు..’-అని శ్రీకృష్ణుడు తన గీతోపదేశంలో చె ప్పాడు. ఎన్నికల సమరంలోనూ ఓడే వాడొకడు, ఓడించేవాడు మరొకడు లేడు. ఎవరికివారే తమనుతాము ఓడించుకుంటున్నారు. ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు తమను తామే ఓడించుకున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టులు ఖాయంగా గెలిచే సీట్లు సైతం తెరాసకు దక్కాయి. కమ్యూనిస్టులకు అనాదిగా స్పష్టమైన ఒక ఆర్థిక సిద్ధాంత ప్రాతిపదిక ఉంది. తెరాస మాత్రం ప్రాంతీయ అభిమానం, సెంటిమెంట్‌పై ఆధారపడి గెలిచింది.
కాంగ్రెస్ అత్యాశకు పోయి అవలీలగా గెలువగలిగిన దాదాపు పాతిక సీట్లను చేజేతులా పోగొట్టుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ హైదరాబాద్ వచ్చి మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీని కలసుకొని- ‘ముస్లింలంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి’ అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. తెలంగాణ ఎన్నికల్లో ముస్లింలు మూకుమ్మడిగా తెరాసకు ఓట్లు వేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో బిజెపి అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కొన్నిచోట్ల టిఆర్‌ఎస్ వందల ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలిచింది. హైదరాబాద్‌లో శివసేనకు అడ్రస్ లేకున్నా, బిజెపికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి పరిమితంగా ఓట్లు చీల్చింది. రాజాసింగ్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని బిజెపి స్క్రీనింగ్ కమిటీ వారించింది. చివరకు ఆయన గోషామహల్‌లో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను తన స్వీయప్రతిభతో చిత్తుచేశాడు. ‘నేను కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానన్నా నన్ను ఆ పార్టీ ఉపయోగించుకోలేదు’ అని ప్రజాగాయకుడు గద్దర్ చెప్పాడు. ఎన్నికలలో తాము గెలిస్తే కెసిఆర్ ‘గడీ’ని బద్దలు చేస్తామని ‘తెజస’ అధినేత ప్రొఫెసర్ కోదండరాం చేసిన వ్యాఖ్య విపరీత ఫలితాలకు దారితీసింది.
***
బయోపిక్‌లను తీసి, సంచలనాలు సృష్టించటంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు. లోగడ ఆయన నిర్మించిన బయోపిక్‌లు ఆర్థికంగా విజయం సాధించకపోయినా వివాదాలను రేకెత్తించాయి. ఆయన ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’ పేరిట బయోపిక్ తీసేందుకు కసరత్తు ప్రారంభించాడు. ఇందులో ఎన్‌టిఆర్ హీరో, లక్ష్మీపార్వతి హీరోయిన్, చంద్రబాబు విలన్. ఈ సినిమాకు సంబంధించి ‘దగా-కుట్ర- కుట్ర’ అనే ఒక పాట కూడా విడుదలైంది. ఈ ట్రయిలర్ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. వర్మ దిష్టిబొమ్మలను తెలుగు తమ్ముళ్లు తగలబెట్టారు. అంటే వర్మ సినిమాకు అవసరమైన ప్రీ (ఫ్రీ) పబ్లిసిటీ లభించిందని అర్థం.
రాజకీయ నాయకులపై సినిమాలు రావటం లోగడ చాలాసార్లు చూశాం. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆత్మకథకు సంబంధించి ‘ఆంధీ’ అనే హిందీ వ్యంగ్య చిత్రం వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్, మండలాధీశుడు, ఇద్దరు (తమిళం) వంటి చిత్రాలు లోగడ వచ్చాయి. వీటిలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలు. ఇవాల్టి సంఘటన రేపటికి చరిత్ర అవుతుంది. ఎన్‌టిఆర్ అప్పుడే ఒక చారిత్రక పురుషుడు అయినాడు. ఆయన మీద 2019 జనవరిలో రెండు మూడు సినిమాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని విడుదల కాబోతున్నాయి. వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో త్వరలోనే తేలుతుంది. ఒకటి మాత్రం నిజం! ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్‌టిఆర్‌పై ఇందిరా గాంధీ, రాంలాల్, నాందెడ్ల భాస్కర్‌రావులు కుట్ర చేసిన మాట వాస్తవం కాదా? హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఎంఎల్‌ఎలను బంధించి క్యాంప్ రాజకీయాలు నిర్వహించిన మాట నిజం కాదా?? ఎన్టీఆర్‌కు అన్యాయం జరిగినప్పుడు చంద్రబాబును ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు బహిరంగంగా బలపరిచారు. ఈ చరిత్రను ఈనాటికీ ఎవరూ మార్చలేరు. ఈ వాస్తవాలన్నీ ఎన్టీఆర్ బయోపిక్‌లలో చూపిస్తారా?
***
గత నెలలో సుమారు రెండు లక్షల మంది రామభక్తులు న్యూ ఢిల్లీ రామలీల మైదానంలో విరాట్ ప్రదర్శనను నిర్వహించారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మించండి’ అని వారు కోరారు. అయోధ్య శ్రీరాముని రాజధాని, అక్కడ రామాలయం నిర్మించాలా? వద్దా?? అనేది దాదాపు 200 సంవత్సరాలుగా పెను సమస్యగా మారింది. క్రీ.శ.10వ శతాబ్దంలో గజినీ మహమ్మద్ గుజరాత్‌లోని సోమనాథ్ దేవాలయాన్ని, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో సమర్‌ఖండ్ నుండి వచ్చిన బాబర్ అయోధ్య రామాలయాన్ని ధ్వంసం చేశారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు కాశీలోని విశే్వశ్వర దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. 1775లో తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని దోచుకున్నారు. 1309లో మాలిక్ కాఫిర్ ఓరుగల్లులోని స్వయం భూ దేవాలయాన్ని, తమిళనాడులోని శ్రీరంగం, కర్నాటకలోని హళిబీడు, బేలూరు దేవాలయాలను ధ్వంసం చేశాడు. నాదిర్షా ఢిల్లీ వీధుల్లో ఓ సాయంత్రం ముప్పదివేల మంది హిందువులను సంహరించాడు. గజనీ మహమ్మద్ సుమారు 50వేల మంది బ్రాహ్మణులను సోమనాథ్ దేవాలయం పరిసరాల్లో హత్యచేసి సోమనాథ శివలింగాన్ని ముక్కలుగా చేసి, వాటిని మసీదుకు మెట్లుగా వాడుకున్నాడన్నది చరిత్ర. ఈ దారుణాలను ఎవరూ కాదనలేరు. అంతా సెక్యులరిస్టులే- అంటే హిందూ ద్వేషులే. ఇండియా ఉప్పు తింటూ పాకిస్తాన్, చైనాలకు కొందరు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ‘సైన్యాన్ని ఐదు నిమిషాలు పక్కన పెట్టండి- మా తడాఖా ఏమిటో చూపిస్తాము’- అని మజ్లిస్ నేత హెచ్చరించడం ఇటీవలి సంఘటనయే. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న అమాయక భారతీయ జాలర్ల మాటేమిటి? కులదీప్ యాదవ్ ఏమయ్యాడు? పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రపంచం చేత గుర్తింపజేయటంలో ఐక్యరాజ్యసమితి దారుణంగా విఫలమైంది.
***
తెలంగాణలోని మిర్యాలగూడలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. వైశ్యకులానికి చెందిన అమ్మాయిని క్రైస్తవ మతస్థుడు వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం చేసుకుందని ఆగ్రహించి ఆ అమ్మాయి తండ్రి వరుణ్ణి హత్యచేయించాడు. నాగరికత పెరిగిన 21వ శతాబ్దంలో ఇలాంటి పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కులాంతర, మతాంతర దేశాంతర వివాహాలు జరుగుతున్న కాలంలో ఈ కల్లోలం ఏమిటి? ఎవరైనా లోతుగా పరిశీలించారా? కళాశాలలోనో, ఉద్యోగం చేసే చోటో ఇరువురు పరస్పరం ప్రేమించుకుంటారు. అసలు సమస్య వివాహం తర్వాత మొదలవుతుంది. ఎవరి ఆహారపు అలవాట్లు, ఎవరి మత విశ్వాసాలు వారివి. అంటే క్షణికమైన ఆవేశాలు తగ్గిన తర్వాత వాస్తవం కళ్లముందు కఠోరంగా కన్పడుతున్నది. ఇదే కులాంతర మతాంతర వివాహాల వైఫల్యానికి కారణం. దీనిపై సామాజిక శాస్తవ్రేత్తలు లోతైన అధ్యయనం చేయాలి.
***
సెక్యులర్ మేధావిగా చలామణి అవుతున్న కంచె ఐలయ్య ఒక వ్యాసంలో- ‘2019లో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశంలో ఇక ఎన్నికలు అనేవి లేకుండా చేస్తాడు’ అని రాశాడు. ఐలయ్య భాజపాపై ఎందుకింత విషం చిమ్ముతున్నాడు? మోదీ ఓటమిని ఎందుకింతగా కోరుకుంటున్నాడు? ఇతనికి కొలరాడో (అమెరికా) నుండి మతం మార్పిడులకు నిధులు వస్తున్నాయి. అంటే ఆయన అమెరికా ఏజెంట్. నరేంద్ర మోదీ అధికారంలో ఉండటం అమెరికా, పాకిస్తాన్, చైనాలకు ఇష్టం లేదు. మతం మార్పిడుల కోసం విదేశాల నుండి భారత్‌లోని క్రైస్తవ సంస్థలకు వస్తున్న నిధులపై మోదీ ప్రభుత్వం ఆంక్షలు విధించడమే ఐలయ్య ఆగ్రహానికి అసలు కారణం.
***
కర్నాటకలోని మాండ్యా జిల్లాలో జెడిఎస్ పార్టీకి చెందిన ప్రకాశ్ అనే కార్యకర్తను ఎవరో హత్య చేయటం గొడవలకు దారితీసింది. కర్నాటకలో రైతుబంధు దేవగౌడ సుపుత్రుడు హెచ్.డి.కుమారస్వామి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 225 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో ముప్పది స్థానాలు కూడా లేని జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా కుమారస్వామి పాలనాపగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఇతనితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. కుమారస్వామి అధికారంలోకి వచ్చిన కొద్దినెలల్లోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇటీవల కుమారస్వామి ఇలా అన్నారు..‘పోలీసు అధికారులారా? వెళ్లి అక్కడ నిరసన తెలుపుతున్న వారిని నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ చేయండి. ఎటువంటి ‘లా అండ్ ఆర్డర్’ సమస్య వచ్చినా నేను చూచుకుంటాను. సాక్షాత్తూ కర్నాటక ముఖ్యమంత్రి ఇలా పోలీసులను ఉసిగొల్పుతుంటే- మానవ హక్కుల సంఘాలు, దేశభక్తులైన మన మహానేతలు ఏం చేస్తున్నారు? అయినదానికీ కానిదానికీ కొవ్వుత్తులతో ఊరేగింపులు జరిపి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఆందోళనలను చేసే ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ కార్యకర్తలు కుమారస్వామి వ్యాఖ్యలను మాటవరసకైనా ఎందుకు ఖండించలేదు? అఫ్జల్‌గురు అనే నరహంతకుణ్ణి పాతికేళ్ల విచారణ తరువాత ఉరితీస్తే- ‘అది దుర్మార్గం’ అంటూ ఊరేగింపులు జరిపిన ఏచూరి సీతారాంలు, కన్హయకుమార్‌లు ఇపుడు ఎందుకు నోరుమూసుకొని ఊరుకున్నారు? ఎందుకంటే కుమారస్వామి కాంగ్రెసు అండదండలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి!
***
ఇంతకూ హనుమంతుడు ఎవరు? ఆయన కులం ఏమిటి? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడు ఆదివాసీ దళితుడు అని అన్నారు. ఆయన మంత్రివర్గంలోని క్రీడాశాఖామాత్యుడు లక్ష్మీనారాయణ చౌదరి హనుమంతుణ్ణి జాట్ కులస్థుడని పేర్కొన్నారు. బిజెపి ఎంఎల్‌సి భుక్కల్ నవాబ్ మాత్రం హనుమంతుడు ముస్లిం అని తేల్చేశారు. ఇలా ఇష్టానుసారం నేతలు వ్యాఖ్యానించడాన్ని మధురకు చెందిన శంకరాచార్య ఖండించారు. ఇంతకూ హనుమంతుడు ఎవరు? ఇతడు దక్షిణాది బ్రాహ్మణుడు. నవవ్యాకరణ పండితుడు. ఇంకా చెప్పాలంటే తెలుగువాడు. రామాయణంలో ఇందుకు ఆధారాలున్నాయి. హనుమంతుడు త్రేతాయుగానికి చెందినవాడు. ఇస్లాం పుట్టి 1400 సంవత్సరాలు అయింది. అలాంటప్పుడు హనుమంతుడు ముస్లిం ఎట్లా అవుతాడు? ఆకాశంలో స్వాతి నక్షత్రం ఎర్రగా ఉంటుంది. ‘స్వాతి ప్రవాళం ఏకం’ అన్నారు పెద్దలు. ఇది వాయుదైవత్వం కలది. అంటే హనుమంతుడిని వాయుపుత్రుడు అనడం ప్రతీకాత్మకం. త్రేతాయుగంలో వేదాధ్యయనం చేసినవాడు బ్రాహ్మణుడే కానీ ముస్లిం ఎట్లా అవుతాడు?

కొత్త తరాలొచ్చాయ్.. తిలకించండి కామ్రేడ్స్!

0
0

పాతికేళ్లకో కొత్తతరం తమ సత్తా చాటుతుంది. నూతన ఆలోచనలతో ప్రపంచాన్ని తమతో తీసుకెళుతోంది. తరాల మధ్య అనేక అంశాలలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వందేళ్ల క్రితపు ‘డైనమిక్స్’ అంతే శక్తిమంతంగా పనిచేస్తాయని అనుకోవడం అమాయకత్వం. ఈ ప్రాథమిక సత్యం జీవితంలోని అన్ని పార్శ్వాలకు అన్వయమవుతుంది. దీన్ని విస్మరించి పాత పద్ధతులను అనుసరిస్తే ప్రాసంగికతను కోల్పోవడం తప్ప ఇంకేమీ జరగదు. ఇంత స్పష్టంగా పరిస్థితి కళ్లకు కడుతున్నా- మొదటి పారిశ్రామిక విప్లవ కాలం నాటి డైనమిక్స్, వైరుధ్యాలు నాల్గవ పారిశ్రామిక విప్లవ కాలంలోనూ కొనసాగుతాయని ఊహించడం, కాలానుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం విషాదం గాక ఏమవుతుంది? దురదృష్టవశాత్తూ దేశంలో మార్క్సిజం ఇప్పటికీ అంతే ప్రాసంగికమని విశ్వసించే పార్టీలున్నాయి. అందులో ప్రమాదకరమైన పార్టీ మావోయిస్టు పార్టీ.
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించకుండా జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని అంచనా వేయకుండా, మారిన డైనమిక్స్‌ను పసిగట్టకుండా వందేళ్ల పూర్వపు ఆలోచనలకు, భావజాలానికి జీవన విధానానికి పట్టం కడదాం రండి.. రారండోయ్.. అని తుపాకులు, మందుపాతరలు పేలిస్తే ఏమైన అర్థం ఉందా..? రెండు వందల ఏళ్ల క్రితపు వ్యవసాయం, వాణిజ్యం-వ్యాపారం, పారిశ్రామిక పరిస్థితులకు ప్రభావితమై ‘సమతుల్యత’ సాధించేందుకు కారల్ మార్క్స్ చేసిన సూత్రీకరణలు వర్తమానంలోనూ ఉపకరిస్తాయనుకోవడం, వాటిని అన్వయించుకోవడం, యథాతథంగా ఆచరణలో పెడతామనడం అత్యంత దారుణమైన సంగతి తప్ప మరొకటి కాదు. ఈ రెండువందల ఏళ్ళలో వ్యవసాయం, వాణిజ్యం-వ్యాపారం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచాన్ని తిలకించే విధానం సంపూర్ణంగా మారిపోయిందన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆయుధాలతో, మందుగుండు సామగ్రితో సమాజంలో సమతుల్యత సాధిస్తామనుకోవడంలోని సహేతుకత ఏపాటిదో ఎవరికివారే ఆలోచించవచ్చు. వైరుధ్యాలు మారాయి, డైనమిక్స్ మారాయి. ఉత్పత్తి విధానం, పంపిణీ విధానం పూర్తిగా మారింది. సంపద సృష్టి విధానం మారింది. ఇంత మారినా పట్టించుకోకుండా, సుత్తి-కొడవలి పనిముట్ల దగ్గరే ఆలోచనలను స్తంభింపజేసి అడుగు ముందుకేయాలనుకోవడం అభాసుపాలు కావడం తప్ప మరొకటి కాదు.
ఏ కాలంలోనైనా సంపద సృష్టి- పంపిణీ అనేది కీలకం. సంపద సృష్టి రెండువందల ఏళ్ల క్రితం ఓ రీతిన ఉంది. ప్రస్తుతం పూర్తిగా కొత్త రూపంలో కనిపిస్తోంది. నేడు కృత్రిమ మేధ ప్రాబల్యం అధికంగా కనిపిస్తోంది. రెండువందల ఏళ్ల క్రితం అంటే మార్క్సిస్టు మూల సూత్రాల ప్రతిపాదన సమయంలో మానవుని ‘చెమట’కు అధిక ప్రాధాన్యమున్నది. సంపద ఆ చెమట-నెత్తురు ఆధారంగా ఎక్కువ సృష్టింపబడింది. ప్రస్తుతం ఆ సన్నివేశం తారుమారైంది, ఆ ‘దృశ్యం’ మారింది. సంపద సృష్టి మేధ- కృత్రిమ మేధ ఆధారంగా జరుగుతోంది. అతి కీలకమైన ఈ ‘మార్పు’ను గుర్తించకుండా అంతే సాంద్రతతో మార్క్స్ సూత్రీకరణలను అమలులోకి, ఆచరణలోకి తీసుకొస్తామని ఉబలాటపడితే బొక్కబోర్లా పడటం తప్ప మరొకటి ఉండదు. వాస్తవానికి ప్రపంచమంతటా మార్క్సిజం విఫలమైన సన్నివేశం స్పష్టంగా కనిపిస్తున్నా భేషజాలకు పోయి ఆ దృశ్యాన్ని చూసేందుకు నిరాకరిస్తూ అంతా తమ విశే్లషణ- వింగడింపు ప్రకారమే కొనసాగుతోందని, తమ ‘నడక’ను మార్చుకోవలసిన అవసరం లేదని వారు వాదించడం విడ్డూరం గాక ఏమవుతుంది?
మావోయిస్టులైతే మరింత మొరటుగా దండకారణ్యంలో దండు నిర్మించి రక్తం కళ్ల జూసుకుంటూ రెండువందల ఏళ్ళ క్రితం డైనమిక్స్ ఆధారంగా రూపొందిన సూత్రాలకు వాస్తవ రూపం ఇస్తామని కంకణం కట్టుకోవడం ఎంతటి అజ్ఞానమో ఇట్టే అర్థమవుతోంది. ప్రజల సంక్షేమం- అభివృద్ధికి అంకితమై పనిచేయలసిన విప్లవ పార్టీ ఇలా రెండువందల ఏళ్ళ క్రితపు ఆలోచనల ఆధారంగా ఏర్పడిన సిద్ధాంతాలను, సూత్రాలను సజీవంగా నిలిపేందుకు పాటుపడతామని, రక్తం చిందిస్తామని సమాజాన్ని సమూలంగా మారుస్తామని ప్రతిజ్ఞచేస్తే ఏమిటి ప్రయోజనం?
వాస్తవానికి సమాజం సమూలంగా మారిపోయింది. దాన్ని చూడకుండా, పట్టించుకోకుండా, తమ హింస- విధ్వంస చర్యల ఆధారంగా మాత్రమే సమాజం మారాలి.. అదే నిజమైన మార్పు అనుకోవడం సంకుచితత్వం తప్ప మరొకటి కాదు. అది ప్రపంచాన్ని, ప్రజల్ని అర్థం చేసుకోలేనితనం. ఆ వితండవాదం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సమాజగతిని, చలన గతిని సరైన రీతిలో అర్ధం చేసుకోలేని మార్క్సిస్టులు, మావోయిస్టులు ఈ సమాజాన్ని ఎలా మారుస్తారు? ఆ పరికరాలు వారిదగ్గర లేవని ఎప్పుడో చేతులెత్తేశారు. తమ ఊహకు, అంచనాకు మించి సమాజం ఎదిగి అందనంత ఎత్తులను తాకింది. ఈ నేపథ్యంలో ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప దాన్ని సమూలంగా మార్చే నైపుణ్యం- శక్తి- యుక్తి సృజనాత్మకత ఏవీ వారిలో లేవని కాలమే నిరూపించింది. జర్మనీలో ‘బెర్లిన్ గోడ’ కూలిన దృశ్యాన్ని- వైనాన్ని చూసేందుకు ఇష్టపడక ఇంకా ఆ శిథిలాలలో మార్క్సిజాన్ని వెతికి దానికి ఆక్సిజన్ అందించి నిలబెట్టాలని చూడడం హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. రష్యాలో లెనిన్ విగ్రహాలను క్రేన్ల సాయంతో తొలగించడాన్ని, చైనాలో తియాన్మన్ స్క్వేర్ వద్ద విద్యార్థులు, యువకులు సైనిక ట్యాంకులకు ఎదురొడ్డి ప్రజాస్వామ్యం కోసం నినదించిన ఉక్కు సంకల్పాన్ని, సంస్కరణల భావాన్ని చూసేందుకు తిరస్కరిస్తే ఏమిటి ప్రయోజనం? భారతదేశంలో ఎక్కడైతే నక్సల్‌బరి ఉద్యమం ప్రారంభమైందో అక్కడ ఇప్పుడు ప్రజలు సహజీవనం సాగిస్తున్నారు. అక్కడి పొలాలు సస్యశ్యామలంగా తులతూగుతున్నాయి. ప్రజల చేతికి ఓటు అనే పాశుపతాస్త్రం లభించింది. తాజాగా ‘సెల్‌ఫోన్’ దొరికింది. సాధికారతతో జీవించేందుకు ఆసరా అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఏ కాలంలోనైనా కోరుకునేది ఇదే కదా? ఆ సాధికారిత తమ ముంగిళ్లలో కనిపిస్తుండగా మావోయిస్టులు మాత్రం ఇది బూటకపు ప్రజాస్వామ్యం, బూటకపు ఎన్నికలు కాబట్టి వీటిని త్యజించి సాయుధ పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రాత్రి-పగలు ఆ పలవరింపుతోనే కాలం గడిపితే అదెలా ప్రాజ్ఞత అవుతుంది? నక్సల్‌బరి ఉద్యమం ప్రారంభించిన తరం అస్తమించింది. ఈ యాభై ఏళ్ళలో రెండు కొత్త తరాలొచ్చాయి. వారి ఆకాంక్షలు-ఆశలు, జ్ఞానం, చొరవ, ముందుచూపు అంతకుముందు తరాలకు సరిపోలవు. మరలాంటప్పుడు నక్సల్‌బరి ఉద్యమం సజీవంగా ఎలా ఉంటుంది? ఆ అవసరమే ఇప్పుడు లేదుకదా? ఆ విషయం అటు జర్మనీలో, ఇటు రష్యాలో, చైనాలో, నక్సల్‌బరిలో తేటతెల్లమయ్యాక ఇంకా మావోలు దండకారణ్యంలో ‘రెడ్ కారిడార్’ కలగనడం అన్యాయం.
మానవులను ప్రత్యర్థులుగా లేదా పక్కకునెట్టేసే సామర్థ్యం గల ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) ఇప్పటికే తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. స్వయం చోదక వాహనాలు వచ్చేశాయి. చదరంగంలో మానవుడినే ఓడించిన కృత్రిమమేధ మనముందున్నది. మనిషిలా ప్రసంగించే హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’ సంచలనం సృష్టిస్తోంది. అలాంటివి మరెన్నో రంగంలోకి రానున్నాయి. మిషన్ లెర్నింగ్ విధానం మరింత విస్తృతమైంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో జరిగే పరిణామాలు మార్క్సిస్టుల- మావోయిస్టుల ఊహలకు అందకుండా ఉన్నాయి. మానవుల ప్రయాణ వేగం పెరుగుతోంది. హైపర్ లూప్ ద్వారా ఇప్పటికే ఎంతో వేగంగా ప్రయాణించే సౌకర్యం ఏర్పడింది. ఇలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ప్రజలను మరో గ్రహం మీదకు తీసుకెళ్ళి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంటే మరో గ్రహం ముఖ్యంగా అంగారక గ్రహంపై మానవ కాలనీలు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో, నూతన ఆవిష్కరణలతో, స్టార్టప్ సంస్థల ఆవిష్కరణలతో ఉత్పత్తిపెరిగి అశేష ప్రజానీకానికి ఆహారం అందించే కృషి విస్తృతంగా జరుగుతోంది. ఈ నూతన సంవత్సరంలో పుట్టిన పిల్లలు పాతికేళ్ళ తరువాత ఇప్పుడున్న పద్ధతులన్నీ కాలం చెల్లినవిగా భావిస్తారని నిపుణుల అంచనా. మరి 175 ఏళ్ల క్రితపు మార్క్స్ అధ్యయనాలు, సూత్రీకరణలు ఇప్పుడు కాలం చెల్లకుండా ఎలా ఉంటాయి కామ్రేడ్స్?

విలువల్ని పెంచేదే అసలైన విద్య

0
0

‘నీలోని అత్యున్నత సామర్ధ్యాన్ని వెలికి తీసేదే నిజమైన విద్య. మానవత్వమనే పుస్తకాన్ని
మించిన పుస్తకం ఏముంటుంది?’
- మహాత్మా గాంధీ
మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, మూర్తిమత్వాన్ని పెంపొందించేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, విలువలను పెంచేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును సంపూర్ణంగా వికసించేటట్లు చేసేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది విద్య అని తరచుగా మనం చెప్పు కుంట న్నాం. విద్యాసంస్థల్లో ఏడాది పొడవునా బోధించిన విద్య ద్వారా ఎంతో కొంత విద్యా లక్ష్యాలు సాధిం చగలమని ఆశిస్తుంటే, పరీక్షల సమయంలో కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటికి పిల్లల్ని సంసిద్ధులుగా చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి నిర్మాణం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. మరి అలాంటపుడు వేలకోట్ల రూపాయలతో నడుస్తున్న పాఠశాలలు ఏం సాధి స్తున్నట్లు? నేటి సమాజంలో టీవీ, సినిమాల వల్లనైతేనేమి, యాంత్రిక జీవితం వల్లనైతేనేమి అనేక సామాజిక రుగ్మలతో సమాజం నిండి ఉంది. విద్యార్థులు క్షణి కావేశానికి గురై తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనం చూస్తున్నాము. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువత అనర్థాలకు బలికావలసిందేనా? విద్యా విధా నంలో మార్పులు, ప్రయోగాలు చేసి విద్యార్థులను మనం బలి తీసుకుంటున్నామా? ఆంగ్లమాధ్యమం, కార్పొరేట్ చదువుల వల్ల నేటి విద్యార్థి నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురౌతున్నాడు. మానసిక బలహీనత, న్యూనతాభావం కూడా మరికొన్ని కారణాలు. స్థాయికి మించి తల్లితండ్రుల ఆకాంక్షలు, అవి తీర్చలేక పిల్లల వ్యధలు దాదాపు ప్రతి ఇంట్లో మనం చూస్తున్నదే.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో పిల్లలు తప్పు చేయడానికి అవకాశం తక్కువ. ఒక వేళ తప్పు జరిగినా పెద్దలు సరిదిద్దే వాళ్లు. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు బలంగా ఉన్న కాలంలో సామాజిక రుగ్మతలు తక్కువగా ఉండేవి. కానీ, నేటి యాంత్రిక జీవనంలో ప్రక్కవారితో కూడా కనీస సంబంధాలు లేని స్థితిలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలను హాస్టళ్లలో ఉంచడం, మార్కుల టార్గెట్ పెట్టడం వంటి పరిస్థితులు విద్యార్థుల కారణాలుగా భావించాలి. పిల్లలు హాస్టల్‌లో, వృద్ధులు ఆశ్రమాల్లో ఉంటే- ఇక అనుబంధాల గురించి చెప్పేదెవరు?
యాంత్రిక జీవనంతో పిల్లలు సహజత్వాన్ని కోల్పోయి మానసిక బలహీనులవుతారు. సోషల్ మీడియా బాగా పెరిగి పోయి పక్క వారితో సైతం ఆత్మీయంగా మాట్లాడలేక పోతున్నారు. సినిమాలలో,సోషల్ మీడి యాలో వచ్చే హింస, అశ్లీలత పిల్లల మనసులపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. టీవీలలో వచ్చే అర్థం పర్థం లేని సీరియల్స్, బూతు కార్యక్రమాలు పిల్లల లేత మనసుల ఎదుగుదలపై ఎంతో అనర్థాన్ని కలిగిస్తున్నాయి . పెరిగిపోతున్న ఫ్యాషన్ వికృత పోకడల వల్ల చినిగిన డ్రెస్సులు, పొట్టి నిక్కర్లు, బిగుతైన బట్టల వల్ల మనిషి వ్యక్తిత్వం కొరవడుతుంది. మనకు అవసరం ఉన్నా, లేకపొయినా ఆధునికత పేరుతో అనవసర హంగామా చేయడం, చింపిరి జుట్టు, సగం కొట్టించుకున్న గుండు.. ఇవే ఈనాటి యువతరం పాటించే సూత్రాలు. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక పోవడం, తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, సగం సగం తెలిసిన వారితో ముచ్చటించడం... ఇలాంటి పరిస్థితిలో ఉన్నత విద్యలు చదివి పట్టాలు ఎన్ని పొందినా, వారిలో విలువలు నశించి వికృతంగా ప్రవర్తించడం. సహనం కోల్పోయ రకరకాల అఘాయిత్యాలకు పాల్పడడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.
సమాజానికి, తల్లితండ్రులకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. ఈ మధ్య కాలంలో విద్య విలువని మనం భూమి విలువ తోనో, స్టాక్ ఎక్స్ఛేంజ్ షేర్ల తో వ్యాపారం చేసే విధంగానో బేరీజు వేస్తున్నాం. మంచి ఉద్యోగం తెచ్చిపెట్టే విద్యనే మనం ప్రోత్సహిస్తున్నాము. విలువలు అభివృద్ధి చెందే విధానం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇరుకు గదుల్లో, ఐదారు అంతస్తుల బిల్దింగులలో విద్యార్థుల పుస్తకాలతో కుస్తీలు పడుతుంటే, ఆటలంటే కంప్యూటర్ ముందు కూర్చొని కాలక్షేపం చేయడం అనుకుంటే విద్య విలువ తెలుస్తుందని ఆశించలేం.
మనిషిలోని నైపుణ్యాన్ని వెలికి తీయడమే విద్య పని. చరిత్ర ఆరంభం నుంచి విద్య వికసిస్తూ, ఎన్నో విభాగాలు గా విస్తరిస్తోంది. సమాజం అభివృద్ధి ప్రజల విద్యా వివేకాలపై ఆధారపడి ఉంటుంది. విద్య వెలుగునిస్తుంది. విద్య వివేకాన్నిస్తుంది. దీనిని భారతీయ సమాజం ఆదినుండి గుర్తించినది, తొలినాళ్ళనుండి విద్యకు చక్కని ప్రాముఖ్యత ఉన్నది. పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొంది, సమాజానికి తమ వంతు సహాయం చేయడం. విద్య జీవితానికి వెలుగునిస్తుందని, అది లేనివాడు గుడ్డివాళ్లతో సమానమని భావించేవాళళు. విద్యను వారు చాలా గౌరవంగా భావించారు. విద్య అనేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తల్లిలాగా పోషిస్తుంది, తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది, ఫ్రాణ స్నేహితునిలా ఆదరిస్తుంది. కీర్తిని సంపాదిస్తుంది, కష్టాలు తొలగి స్తుంది, స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది, నాగరి కునిగా మారుస్తుంది. కనుకనే విద్యను కల్పవృక్షంగా మనం భావిస్తాం.
బ్రిటీషు వారి కాలంలో భారత దేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ముఖ్యముగా రెండు మార్పులు మనం చెప్పుకోవాలి ఒకటి అప్ప టివరకూ ఎన్ని మార్పులు జరిగినా భారతదేశంలో విద్యావ్యవస్థ మతప్రధానమైనదిగానే ఉండేది. అయితే హిందూ మతం, బౌద్ధ మతం లేదా ముస్లిం మతం. కానీ బ్రిటీషు వారు వచ్చిన తరువాత భౌతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినది, వేదాలు చదవడం మానేసి ప్రజలు సైన్సు మొదలగున్నవి చదవడం మొదలుపెట్టినారు. ఇక రెండవ ముఖ్యమైన మార్పు ఇంగ్లీషు భాషలో విద్యా బోధన, అప్పటివరకు వివిధ భారతీయ భాషలలో ముఖ్యంగా సంస్కృతంలో లేదా అరబిక్ లేదా ఉర్దూలలో జరిగే విద్యా బోధన ఇంగ్లీషుభాషలోనికి మారింది. పాలకుల ఆర్థిక సహాయం కేవలం ఇంగ్లీషు బోధించే పాఠశాలలకే లభించేది. దాంతో ఇంగ్లీషుకు ప్రాముఖ్యత పెరిగింది. బ్రిటీషు వారు విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేసినారు, ఎన్నో సంస్కరణలకు ప్రయ త్నించారు. కానీ వారు భారత దేశాన్ని వదిలే సమయానికి దేశంలో అక్షరాస్యత పది శాతం కూడాలేదు. దీనికి కారణం పరిశీలిస్తే మొదటిది వారికి తర్జుమా చేయడానికి , సంధానకర్తలుగా ఉండడానికి, వారికి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే చదువుకునే అవకాశం ఇవ్వగా, రెండవది వారు పాటించిన జల్లెడ పద్ధతి, దీని ద్వారా కేవలం పై తరగతి వారికి చదువు చెబితే వారు క్రింది తరగతి వారికి నేర్పుతారని భావించడం జరిగినది. కానీ అది ఆచరణలో వైఫల్యంగా మిగిలింది. ఈ పరిస్థితుల నుండి మన విధ్యా విదానాన్ని మనమే తయారు చేసుకునే దశకు వచ్చినా, వారు వదిలి వెళ్ళిన వాసనలను మనం కడిగి పారేయ్యలేక పోతున్నాము. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా మనం ఇంకా ఆ జాఢ్యం నుంచి బయటకు రాలేక పోతున్నాము.
పిల్లలకు చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాస విద్యను బోధించాలి. తద్వారా విద్యార్థులు ఊహాలోకంలో కాకుండా నిజ జీవితంలో జీవిస్తారు. భ్రమలకు లోను కారు. విపరీత పరిణామాలు చోటుచేసుకోవు. ప్రతిదానికి ఆలోచించి పరిష్కరించే నేర్పు, సమయస్ఫూర్తి, సంద ర్భోచిత నిర్ణయాలు అలవడతాయి. శ్రమను ఆయుధంగా చేసుకోవాలని, నిరంతరసాధన, పట్టుదల, కార్యదీక్షతో ముందుకెళ్లాలని చెపుతూనే ఈ స్పృహ లేకపోతే అపజయం పాలవుతామని తెలియజేయాల్సి ఉంటుంది. పిల్లల్లో బలహీనతలను తగ్గించకపోతే పెద్దవారైన తర్వాత జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోలేక బలహీనులయ్యే ప్రమాదముంది. అంచెలంచెలుగా చేయవలసిన కృషి, అనుభవాలు, జ్ఞాపకాలు, మహానుభావుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో జోడించడం ద్వారా వి ద్యార్థులకు మరింత ప్రయోజనముంటుంది. కోపాన్ని జయించడం, వివిధ మానసిక సంఘర్షణలు, భావావేశాల నుండి బయటపడడాన్ని నేర్పాలి. పరస్పర సహకారం, ప్రేమ, ఆత్మీయత, త్యాగం, జాలి, కరుణ మొదలగు మానవతా విలువలను పెంచే విధంగా కృషి చేయాలి.
భావోద్వేగాలకు బదులు మానవత్వంతో ఆలోచించే ప్రశాంత పరిస్థితులు పాఠశాలల్లోను, సమాజంలోను నెలకొనాలి. తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే , ఇరుగు పొరుగువారితో కష్టసుఖాలలో పాలుపంచుకునే మహోన్నత సంస్కారం చిన్ననాటి నుండే ప్రతివ్యక్తిలో అలవడాలి. ఇందుకు సామాజిక చైతన్య కార్యక్రమాలు, మానసిక విశే్లషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా విద్యార్థులకనుగుణంగా వ్యక్తిత్వ వికాస విద్య ప్రణాళికను రూపకల్పన చేయించి ప్రతి పాఠశాలలో తప్పకుండా అమలు పరచవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దారి తప్పుతున్న యువతను సక్రమ మార్గంలో పెట్టె భాద్యత కేవలం ప్రభుత్వానిదే కాదు. ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు సమాజం, కుటుంబాలు తమ వంతు బాధ్య తతో యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించాలి. ఇవి సాధ్యమైనపుడే విద్యకు సార్థకత ఉంటుంది.

Viewing all 69482 articles
Browse latest View live