Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సమస్యలను తీర్చగలిగే నాయకులను ఎన్నుకోవాలి

0
0

రామచంద్రపురం, జనవరి 7: పేదలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను తీర్చగలిగే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కె గంగవరం మండలం కోటిపల్లిలో సోమవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గానికి తాను పర్యటనకు రావాలంటే వెన్నులో వణుకు పుడుతుందని, ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు వివిధ అభివృద్ధి పనులకు వేలల్లో కాకుండా కోట్లల్లో నిధులు అడుగుతారంటూ పనిచేసే నాయకుడ్ని ఎన్నుకుంటే అభివృద్ధి సుసాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట చర్యల ద్వారా స్పష్టమవుతుందన్నారు. సత్సంబంధాలు, ప్రజా నాయకుడు ప్రజలకు అవసరమని, ప్రజాస్వామ్యంలో దొంగలను, దోపిడీదారులను ఎన్నుకుంటే ఆ ప్రాంతాలు సర్వనాశనమవుతుందన్నారు. ఎన్నికల్లో కుల రాజకీయాలు అవసరం లేదన్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదీ ఉండదని, సమస్యల పరిష్కారానికి నాయకుని చిత్తశుద్ధి కావాలని, సంకల్పం కలిగిన నాయకుడు రామచంద్రపురం నియోజకవర్గానికి దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. జొన్నాడ-యానాం రహదారికి 30 కోట్ల రూపాయలు గతంలో అడగ్గా తాను మంజూరు చేశానని, ప్రాముఖ్యత కలిగిన పనిగా ఆ పని నిర్వహించారని మంత్రి యనమల పేర్కొన్నారు. ప్రస్తుతం జొన్నాడ నుండి యానాం వరకు రహదారి వెడల్పు చేసి ఆధునికీకరించాలన్న ఎమ్మెల్యే తోట ఆకాంక్ష సరైందే అన్నారు. 175 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరైందని, పథకం ఆరంభించేందుకు ఆర్థిక శాఖ నుండి మంజూరు ఉత్తర్వులు అందించామని, ఈ విషయం తెలియగానే ఆలస్యం చేయకుండా సత్వరం పనులు ప్రారంభించాలని, త్వరలోనే ఏటిగట్టు విస్తరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే కోటిపల్లి వద్ద ముక్తేశ్వరానికి గౌతమీ నదీ పాయలపై వంతెన అవసరం ఉందని, కోనసీమ నుండి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడకు వెళ్లేందుకు ఈ మార్గం దగ్గర అవుతుందనే విషయం తనకూ తెలుసునన్నారు. ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రితో ఎమ్మెల్యే తోట చేసిన వినతిని ప్రస్తావిస్తూ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. టూరిజం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుకు వెడుతుందన్నారు. ఆరో విడత జన్మభూమి సమాజ మార్పునకు నాంది పలుకుతుందని పేర్కొంటూ విద్యను ప్రధానంగా గుర్తించాలని తెలిపారు. నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు మంత్రి యనమల స్పష్టం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ 1994లో తన రాజకీయ అరంగేట్రం జరిగినప్పటి నుండి అభివృద్ధే ధ్యేయంగా పనులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు రామచంద్రపురం నియోజకవర్గంలో కులాల కొట్లాట ఉండేదని, దాని ద్వారా రాజకీయ ప్రయోజనం ఆశించే నాయకులుండేవారని, తన ఎన్నిక అనంతరం ఆ విధానానికి స్వస్తి పలికినట్టు చెప్పారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని విద్య, వైద్య, సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెడుతున్నట్టు స్పష్టం చేశారు. పుష్కరాల సమయంలో 135 కోట్ల రూపాయల నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, ఈ ప్రాంతంలో పలు గ్రామాల రూపురేఖలు మారిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఏటిగట్టును రెండు కోట్ల రూపాయలతో ఆధునికీకరణ చేయించి జొన్నాడ నుండి యానాం వరకు బస్సు సర్వీసులు నిర్వహించామని, 2004 తరువాత ఆధునికీకరణ పేరుతో కడప కాంట్రాక్టర్లు ఈ ప్రాంతానికి వచ్చి మట్టిని అమ్ముకుని రహదారిని ధ్వంసం చేశారని, సైకిల్ కూడ నడిచే పరిస్థితి చేసిన విషయాన్ని సభికుల హర్షద్వానాల మధ్య తెలిపారు. 46 కిమీ దూరం కలిగిన జొన్నాడ-యానాం నాలుగు నియోజకవర్గాలు, రెండు జాతీయ రహదారులు, రెండు రాష్ట్రాలను కలుపుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అంశంలో తాను మొదటి నుండి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఎటువంటి కాలుష్యం లేకుండా ప్రయాణం సాగించడమే కాకుండా సమయం ఆదా అయ్యేలా ఈ రహదారి నిర్మాణానికి కృషిచేస్తున్న విషయాన్ని గుర్తించి మంత్రి యనమల తన విన్నపాన్ని వినాలని ఆయన కోరారు. దీంతో మంత్రి ఈ రెండు ప్రాజెక్టులకు సూచన ప్రాయంగా అంగీకరించడంతో పనుల నిర్వహణే ఇక పరమావధిగా భావించవచ్చని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, తహసీల్దారు మహమ్మద్ యార్ఖాన్, ఎంపీడీవో డీవీఎల్‌ఎన్ శాస్ర్తీ, ఈవోపీఆర్డీ గిడ్ల భీమారావు, స్పెషలాఫీసర్ కెవిఆర్‌ఎన్ కిశోర్, ట్రాన్స్‌కో డీఈ పీ కొండాల్, ఆర్‌అండ్‌బి డీఈ మధుసూదనరావు, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, అల్లూరి దొరబాబు, డీసీసీబీ డైరెక్టర్ సలాది అప్పారావు, జడ్పీటీసీ మేడిశెట్టి రవికుమార్, రేవు శ్రీను, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంటి నాగమణి, ఎంపీటీసీ కశే రాకడలిల్లీ, మాజీ సర్పంచ్ కర్రి నాగవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతాలు, రుణాలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు అందించారు.


నైపుణ్యంతోనే ఉద్యోగాలు

0
0

రాజమహేంద్రవరం, జనవరి 7: విద్యార్థులు డిగ్రీ పట్టాలతోపాటు నైపుణ్యాలను సంపాదించుకుంటనే ఉద్యోగావకాశాలు లభిస్తాయని, నేటి పోటీ ప్రపంచానికి తగినట్టుగా విద్యాదశలోనే నైపుణ్యాలను సంపాదించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కోన రామ్‌జీ అన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో భాగంగా నన్నయ విశ్వవిద్యాలయం భవనాలు, రోడ్డు, వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగార్హత నైపుణ్య శిక్షణా కేంద్రంలో విద్యార్ధులనుద్ధేశించి వీసీ రామ్‌జీ మాట్లాడారు. భారతదేశంలో ప్రతీ ఏడాది వేలాది మంది పీజీ పట్టాలను తీసుకుంటున్నారని, కానీ అందరికీ అర్హతకు తగిన ఉద్యోగం లభించడం లేదన్నారు. దానికి ప్రధానకారణం విద్యతోపాటు నైపుణ్యాలు లేకపోవడమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థి దశలోనే నైపుణ్య శిక్షణ ఇస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతోందన్నారు. ఈ శిక్షణను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ టేకి, రెక్టార్ ఆచార్య పి సురేష్ వర్మ మాట్లాడుతూ నన్నయ విశ్వవిద్యాలయంలో వారంరోజులపాటు స్కిల్ డవలప్‌మెంట్ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులంతా విశ్వవిద్యాలయంలో ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు జరుగుతున్న శిక్షణను వినియోగించుకుంటున్నారన్నారు. మహీం6దాఫ్రైడ్ సహకారంతో లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాల్లో శిక్షణ కల్పిస్తున్నట్టు చెప్పారు. శిక్షణ అనంతరం విద్యార్ధులకు సర్ట్ఫికేట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం తరపున వీసీ రామ్‌జీని సన్మానించి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి హైమావతి, డీన్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ మట్టారెడ్డి, అధ్యాపకులు డాక్టర్ రమణేశ్వరి, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ ఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు.

హత్యకేసులో నిందితునికి జీవిత ఖైదు

0
0

డి గన్నవరం, జనవరి 7: బావమరిదిని హత్యచేసిన బావకు జీవిత ఖైదును విధిస్తూ అమలాపురం అదనపు జిల్లాకోర్టు జడ్జి డి సత్యవెంటక హిమబిందు సోమవారం తీర్పును వెల్లడించారు. దీనికి సంబంధించి పి గన్నవరం ఎఎస్సై కెఎస్‌వియస్ ప్రసాద్ తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి. పి గన్నవరం మండల పరిధిలోని ముంగండ గ్రామం మాతావారి పేటకు చెందిన రొక్కాలు ముత్యాలు (61) 2015 ఫిబ్రవరి 7వ తేదీన ముంగడలో సైకిల్‌పై వెళుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన అతని చెల్లెలు భర్త కొనుకు నాగేశ్వరావు అడ్డగించి ఘర్షణకు దిగాడు. తన వద్ద నున్న చాకుతో ముత్యాలను పొట్టలోను, కంఠం దగ్గర పొడవటంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ముత్యాలను అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై అప్పటి పి గన్నవరం ఎస్సై వి హారీష్ కుమార్ కేసు నమోదు చేయగా రావులపాలెం సీఐ పి విరమణ విచారణ నిర్వహించారు. అమలాపురం జిల్లా కోర్టు జడ్జి హిమబిందు ముద్దాయి కొనుకు నాగేశ్వరావుకు జీవిత ఖైదీతోపాటు రెండువేల జరిమానా విధించినట్టు తీర్పు చెట్పినట్లు తెలిపారు. ఈ కేసుకు ఏపిపిగా చింతపల్లి అజయ్ కుమార్ వాధనలు చేసినట్లు ఎఏస్సై తెలిపారు.

మృతదేహాల కోసం కన్నీటి చూపులు

0
0

మెదక్ రూరల్, జనవరి 7: అయ్యప్పస్వామి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి పార్థివదేహాల కోసం మెతుకుసీమ కన్నీటితో ఎదురుచూస్తోంది. సోమవారం సాయంత్రం శవపరీక్ష అనంతరం 10 మృతదేహాలను ప్రత్యేకంగా అక్కడి ప్రభుత్వం సమకూర్చిన పది అంబులెన్స్‌లలో తీసుకుని తమిళనాడు రాష్ట్రం నుండి బయలుదేరాయి. మరో రెండు రోజుల్లో తిరిగిరావాల్సిన అయ్యప్పస్వాములు ప్రమాదంలో మరణించడంతో నర్సాపూర్ మండలం ఖాజిపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ నెల 6న తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టెం వద్ద తంజావూరు నుండి కరైకుడి బైపాస్ రోడ్డులో టెంపో ట్రావెలరన్‌ను కంటైనర్ ఢీకొట్టిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో ట్రావెలర్ డ్రైవర్‌తోపాటు తొమ్మిది మంది అయ్యప్ప స్వాములు మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వారిలో నర్సాపూర్ మండలం ఖాజిపేటకు చెందిన కర్రె నాగరాజుగౌడ్, జుర్రు మహేశ్, బోయిని కుమార్, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబర్‌పేట క్రిష్ణ, నక్క ఆంజనేయులు, చిన్నచింతకుంటకు చెందిన ప్రవీణ్‌గౌడ్, సురేశ్, మంతూరుకు చెందిన అయ్యన్నగారి శ్యాం, శివప్రసాద్, బోయిన్‌పల్లికి చెందిన ట్రావెలర్ డ్రైవర్ సురేశ్‌లున్నారు. గాయపడిన వారిలో ఖాజిపేటకు చెందిన కర్రె నరేష్‌గౌడ్, దొంతి భూమయ్య, మచ్కూరి రాజు, మంతూరుకు చెందిన శ్రీశైలం, మంగాపూర్‌కు చెందిన వెంకటేశ్వర్లున్నారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎంపి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిలు స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తు సహాయ చర్యలు ప్రారంభించారు. మృతదేహాలకు శవపరీక్ష, క్షతగాత్రులకు చికిత్సపై తమిళనాడు అధికారులతో మాట్లాడారు. ఇక్కడి నుండి నర్సాపూర్ తహశీల్దార్ బిక్షపతి, సిఐ సైదులు, టిఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మురళీయాదవ్‌లు వెంటనే విమానంలో ప్రమాద సంఘటనకు బయలుదేరి వెళ్లారు.
సోమవారం మృతదేహాల శవపరీక్ష అనంతరం పది మృతదేహాలను 3 గంటల తర్వాత ప్రత్యేక అంబులెన్స్‌లో అక్కడి నుండి తరలించారు. అధనంగా మరో రెండు అంబులెన్స్‌లు సైతం ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు మృతదేహాలు స్వగ్రామాలకు రానున్నాయి. కాగా ఇక్కడి నుండి వెళ్లిన బృందంతో గాయపడిన నరేష్‌ను వెంట తీసుకువస్తున్నారు. మరో ముగ్గురు క్షతగాత్రులు మెడికల్ ఆసుపత్రిలో, మరో క్షతగాత్రుడు తంజావూరిలో గల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దు:ఖ సాగరంలో కుటుంబాలు
అయ్యప్ప స్వామి మాలధారణ చేసి స్వామివారిని దర్శించి తమ ఇరుముడులు సమర్పించి తిరిగి వస్తుండగా కానరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాలు దు:ఖ సాగరంలో మునిగాయి. ఆదివారం సాయంత్రం ప్రమాద సమాచారం తెలిసిన నుండి బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. అందరూ యువకులే..బంగారు భవిష్యత్తు ఉన్నవారే కావడం మరింత దిగ్బ్రాంతికి గురిచేసింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసేందుకు కూడా ఒక యువకుడు సిద్దమయ్యాడు...ప్రమాద రూపంలో తన ప్రాణాలు గాల్లో కలిశాయి. ఖాజిపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామాల్లో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మృతదేహాలు ఎప్పుడెప్పుడు వస్తాయంటు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. మంగళవారం మృతదేహాలతో నర్సాపూర్ కేంద్రంలో కొద్దిసేపు ఉంచిన అనంతరం స్వగ్రామాలకు తరలించనున్నారు. ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, హరీష్‌రావులు పాల్గొంటారని తెలిపారు.
చిత్రాలు.. తమిళనాడు నుండి మృతదేహాలతో బయలుదేరిన అంబులెన్స్‌లు
*ఇంటిముందు ఎదురుచూస్తున్న కుటుంబీకులు, బంధువులు

రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

0
0

సికిందరాబాద్, జనవరి 7: కేంద్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు. సోమవారం సికిందరాబాద్ రైల్ నిలయం వద్ద ఎంప్లారుూస్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొత్త పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, రైల్వే కార్మికుల విషయంలో సడలింపు ఇవ్వాలని అన్నారు. కనీస వేతనాలు కల్పించాలని, రైల్వేలో ఎంతోకాలంగా సేఫ్టీ విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి రైల్వే కార్మికుల సమస్యలను తీసుకెళ్లినా పెడచెవిన పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ రైల్వేలోని కార్మికులు నిరంతరం అధిక పని ఒత్తిడితో పని చేస్తున్నప్పటికీ న్యాయంగా దక్కాల్సిన హక్కులు అందడం లేదని అన్నారు. 2016లో రైల్వే కార్మికుల డిమాండ్‌ల సాధనకు సమ్మెకు వెళ్తామని హెచ్చరించిన నేపథ్యంలో మంత్రిమండలి ఉప సంఘం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికీ పరిష్కరించలేదని చెప్పారు. సేఫ్టీ కాటగిరిలోని కార్మికులు పదవీవిరమణ పొందితే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చిత్రాలు.. రైల్వే ఎంప్లారుూస్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న రాఘవయ్య

తాత ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి లోకేష్: చంద్రబాబు

0
0

రాజమహేంద్రవరం, జనవరి 7: ప్రధాని మోదీ చౌకబారు రాజకీయాలు చేస్తూ తన కుటుంబాన్ని రోడ్డుకు లాగుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం జరిగిన జన్మభూమి మా ఊరు సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తన కుమారుడు లోకేష్‌ను తానేమీ రాజకీయాల్లోకి రావాలని కోరలేదని స్పష్టం చేశారు. తనకు రాష్టమ్రంటేనే ప్రేమని, కుటుంబమంటే వ్యామోహం లేదన్నారు. లోకేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, తాతగారి స్ఫూర్తితో తనంతట తానుగానే రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. 28 సంవత్సరాల క్రితం హెరిటేజ్ అనే సంస్థను స్థాపించి తన భార్యకు అప్పగించానని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏమి చేస్తావో ఆలోచించుకోవాలని లోకేష్‌కు సూచించానన్నారు. రాజకీయాలైతే రాత్రింబవళ్లు కష్టపడాలని, సుఖవంతమైన వ్యాపారం చేసుకోవాలని కోరానన్నారు. అయితే తన సతీమణి బ్రాహ్మణి వ్యాపారం చూస్తుందని, తాను మాత్రం తాత ఎన్టీఆర్ తరహాలో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తానని చెప్పాడన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినందున ఐటీ శాఖ అప్పగించానని, లోకేష్ కృషి కారణంగానే రాష్ట్రానికి పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ప్రధాని మాత్రం తన కుటుంబంపై చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాం

0
0

అమరావతి, జనవరి 7: పోలవరం కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించాం.. ఇదో చారిత్రక ఘట్టం.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. జన్మభూమి- మావూరు కార్యక్రమంపై సోమవారం జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నోడల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ రికార్డు సాధించేందుకు ఆదివారం అర్ధరాత్రికి 21వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశాం.. 24 గంటల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల లక్ష్యంగా నిర్దేశించామన్నారు. లక్ష్యానికి మించి 35వేల క్యూబిక్ మీటర్లు వరకు పనులు జరిగాయన్నారు. ఈ రికార్డు సాధించటంలో చెమటోడ్చి పనిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు. వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది కష్టానికి ఇది గుర్తింపు అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. శరవేగంగా ప్రాజెక్ట్ పనులు చేస్తున్నందుకు సీబీఐపీ అవార్డు సాధించామని గుర్తుచేశారు. ఈ అవార్డు అందుకున్న 4 రోజులకే మరో రికార్డు సృష్టించామన్నారు. ఇది ప్రతి తెలుగు వారికి గర్వ కారణమన్నారు. మూడేళ్లలో ప్రధాన డ్యామ్ పనులు 63.27 శాతం పూర్తిచేశాం.. జెట్ గ్రౌటింగ్ పనులు పూర్యయ్యాయి..డయాఫ్రం వాల్ నూరు శాతం పూర్తిచేశాం.. కుడికాలువ పనులు 90 శాతం..ఎడమ కాలువ పనులు 67 శాతం జరిగాయని వివరించారు. అన్ని రంగాల్లో ఏపీ ముందంజలో ఉందన్నారు. వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయని అందుకే ఏపీపై అసూయ పెంచుకున్నారని విమర్శించారు. అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. ఏపీ పేరు వినబడితే చాలు అక్కసు పెరిగిపోతోందని, రాష్ట్ర పురోగతిని చూసి భరించలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆక్షేపించారు. హుందాతనం వదిలేసి మాట్లాడుతున్నారు.. నా కుటుంబం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇది అంతా ఊహించిందే అన్నారు. చివరకు రిపబ్లిక్‌డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఇది కేంద్రంలోని బీజేపీ కక్షసాధింపునకు పరాకాష్ట అన్నారు. జన్మభూమి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటివరకు 1,75,557 ఫిర్యాదులు అందా యని, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవను రూ. 5లక్షలకు పెంచామని 12 లక్షల మందికి రూ 5330 కోట్ల వైద్యసేవలు అందాయని వివరించారు. 7లక్షల మందికి ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చామన్నారు. రూ. 4848 కోట్లతో పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించామని 33415 అదనపు తరగతి గదులను నిర్మించామని వివరించారు. డిజిటల్ వర్చ్యువల్ క్లాస్ రూములను అందుబాటులోకి తెచ్చామన్నారు. 35 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందుతోందని, విదేశీ ఉన్నత విద్యకు ఇస్తున్న రూ. 15 లక్షలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 4 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందుతోందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పశుగ్రాస భద్రత కల్పించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయటంతో పాటు రైతులకు సకాలంలో చెల్లింపులు జరపాలని సూచించారు. మన రియల్‌టైమ్ గవర్నెన్స్ ప్రపంచానికే ఓ నమూనాగా రూపుదిద్దుకుందని తెలిపారు. పరిష్కార వేదికకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, సకాలంలో ఎప్పటికప్పుడు ఫిర్యాదుల పరిష్కారంతో పాటు జనాభిప్రాయ సేకరణ, నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యపడిందన్నారు. ఆర్టీజీఎస్ వ్యవస్థను ఆధ్యయనం చేసేందుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్ రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు.

ఏపీకి మోదీ వెన్నుపోటు

0
0

అమరావతి, జనవరి 7: రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ వెన్నుపోటు పొడిచారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్నిరంగాల్లో అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న ఏపీని తన కుట్రలు, కుతంత్రాలు ఏమీ చేయలేకపోవటంతో వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని ఆక్షేపించారు. సోమవారం కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం ముష్టికుంట్ల జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న లోకేష్ తనపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. కృష్ణాజిల్లా మనవడిని, అల్లుడ్ని.. అంటూ ప్రసంగం ప్రారంభించి ‘ఊహ తెలిసే సరికి మా తాత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మహానాయకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారని, తాను నిక్కర్లు వేసుకునే సమయంలోనే తన తండ్రి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఏపీని ప్రపంచ చిత్రపటంలో నిలిపారని గుర్తుచేశారు. తాత ఆశయం, తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించి గ్రామాలను అభివృద్ధి చేయటం తప్పా అని ప్రశ్నించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా ప్రగతి మార్గంలో పయనింపచేయటం తాను చేసిన నేరమా అని నిలదీశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చే సమయంలో అవినీతిపరుల భరతం పడతానని ప్రగల్భాలు పలికారని, అయితే నేడు అలాంటివారినే చంకనెత్తుకుని అభివృద్ధి కారకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ అవినీతి పరుల్ని అరెస్టు చేయాలంటే జగన్‌ను ముందుగా అరెస్టు చేయాల్సి ఉందని, అయితే ఆయన తన పక్కనే ఉన్నా మోదీ ఎందుకు స్పందించటంలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కుటుంబంపై నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే పని మానుకుని జగన్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కోడి కత్తి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంతో మోదీ, షాలతో కలసి నడుపుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇక ఆవు, అంబులెన్స్ డ్రామాతో జగన్ అభాసుపాలయ్యారని విమర్శించారు. కుల, మత, ప్రాంతాల పేరుతో ఏపీలో చిచ్చు రగిలించేందుకు ఢిల్లీ పెద్దలతో కలసి పన్నుతున్న కుతంత్రాలు తెలుగువారి ఐక్యత ముందు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే కేసులు, ఐటీ, ఈడీ దాడులతో బెదిరిస్తున్నారని, ఇలాంటి దాడులకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారైన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌పై సీబీఐ కేసులు బనాయించారని ఆరోపించారు. సోము వీర్రాజుతో ముఖ్యమంత్రి చంద్రబాబును తెలుగులో తిట్టించి హిందీలో అనువదించుకుని మోదీ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. మోదీ కుట్రలు తెలుగువారి ఎదుట సాగవన్నారు. వచ్చే ఎన్నికల్లోబీజేపీ, వైసీపీ నేతలు ఓట్లడిగేందుకు వస్తే వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారని నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకునేలా కృషి చేస్తే దేశ ప్రధానిని సీఎం చంద్రబాబు నిర్దేశిస్తారని ఏపీకి హోదాతో పాటు హామీలన్నీ సాధిస్తారని స్పష్టం చేశారు.
చిత్రం..జన్మభూమి సభలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్


అన్ని రాష్ట్రాలు అనుసరించే స్థాయికి ఏపీ

0
0

పోలవరం, జనవరి 7: గతంలో పశ్చిమ బంగ రాష్ట్రం ఈ రోజు ఒక ఆలోచన చేస్తే, రేపు దేశం అదే ఆలోచన చేస్తుందనే నానుడి ఉండేదని, అయితే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏం చేస్తే రేపు దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరించే స్థాయికి రాష్ట్రం చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం పోలవరంలో సాధించిన గిన్నిస్ రికార్డును తిరగరాసి మార్చిలో 65వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసే విధంగా కృషిచేయాలని కాంట్రాక్టు సంస్థకు సూచించారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టు సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తక్షణం కేంద్రం ఆమోదించి, నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు డిమాండుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. అందరి సహకారం, సమిష్టి కృషితోనే ఈ రికార్డు సాధ్యమయ్యిందన్నారు. రెండు ప్రపంచ రికార్డులు సాధించిన అరుదైన మహాక్రతువులో భాగస్వాములయ్యే అవకాశం లభించడం చాలా అరుదుగా లభిస్తుందన్నారు. వారందరినీ అభినందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 670 అవార్డులు వచ్చాయని, అయినా పోలవరం అవార్డు ఇచ్చినంత ఆనందం మరేదీ ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టి ఈ ప్రాజెక్టుపై తనకు ఎంత ప్రేమ ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు. ఇది రైతుల ప్రాజెక్టని, రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదన్నారు. 2015 నుండి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని, 84సార్లు వర్చువల్ ఇన్‌స్ట్రక్షన్స్ చేశానని, 30వ సారి ప్రత్యక్షంగా పోలవరంలో పర్యటించినట్టు చెప్పారు. ప్రాజెక్టు పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో కోపం వచ్చిందని, ఆ కోపాన్ని కసిగా మార్చుకుని అన్ని చర్యలు తీసుకోవడంతో పనుల వేగం పెరిగిందన్నారు.పట్టిసీమ ఎత్తిపోతల పథకం కారణంగా కృష్ణాజిల్లాలో రూ.44 వేల కోట్ల విలువైన పంటలు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిందన్నారు. అలాగే కృష్ణాలో మిగులు జలాలను రాయలసీమకు అందించడంవల్ల అనంతపురం జిల్లాలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, అలాగే ఆ జిల్లాకు కియో మోటార్స్ ఫ్యాక్టరీ కూడ వచ్చిందన్నారు. ఈ ఏడాదిలోనే కియో తొలి కారు రోడ్డుపైకి రానుందన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం 62 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని, 17 ఇప్పటికే ప్రారంభించామని, ఏడు ప్రాజెక్టులు ప్రారంభోత్సవానిక సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా నీరందిస్తామని, ఈ ఏడాది ఆఖరుకు ప్రాజెక్టులో అన్ని విభాగాలు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదించి నిధులు ఇవ్వాలని డిమాండుచేస్తున్నామని, కేంద్రం సహకరించకపోయినా నిర్మాణంలో ముందుకు వెళతామన్నారు. భవిష్యత్తులో వడ్డీతో సహా ఈ నిధులు వసూలుచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
చిత్రం..గిన్నిస్ రికార్డు స్థాపన పైలాన్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

నేటి నుంచి ‘జలధార’!

0
0

విజయవాడ, జనవరి 7: గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటిని సరఫరా చేసే జలధార ప్రాజెక్టు మంగళవారం ప్రారంభం కానుంది. దీంతో గ్రామాల్లో మంచినీటి సమస్య ఉండదు. వేసవిలోనూ ఇకపై నీటి ఎద్దడి సమస్య లేకుండా ఇళ్లకే నీరు సరఫరా కానుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును రూ.22,300 కోట్ల రూపాయలతో చేపట్టారు. దీనిని కర్నూల్ జిల్లా కోస్గి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నా రు. రాష్ట్రంలోని 48,363 నివాస ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు వాటర్ గ్రిడ్‌ను ఈ జలధార ప్రాజెక్టు కింద చేపడుతున్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికీ నీరు అందించేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, పనులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి తరువాత మొదటి దశలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు అందించే పనులు యుద్ధప్రాతిపదికన అధికార యంత్రాంగం చేపడుతోంది. 10 జిల్లాలకు టెండర్లును ఇప్పటికే పిలిచారు. చిత్తూరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్లు పూర్తయిన జిల్లాల్లో వచ్చే వేసవి నాటికి నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీలో దాదాపు 70శాతం గ్రామీణ ప్రాంతాలే. కొన్ని జిల్లా ల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. దీనికి శాశ్వత పరిష్కారమే జలధార ప్రాజెక్టు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని భావించి ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, మొదటి దశ పనులను రూ.15 వేల కోట్లతో చేపట్టారు. 2040 నాటి జనాభా అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టును రూపకల్ప న చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల గ్రామాల్లోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
‘మా ఊరి బాట’ను ప్రారంభించనున్న సీఎం
250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యాన్ని మా ఊరి బాట కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. నాణ్యమైన రహదారులు, వంతెనల నిర్మాణం ద్వారా రహదారుల కోసం ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టారు. 4324 కోట్ల రూపాయలతో ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్టుమెంట్ బ్యాంక్ రుణంతో అంతర్జాతీయ ప్రమాణాలతో మా ఊరి బాట కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టింది. ఇప్పటి వరకూ 3711 కోట్ల రూపాయలతో 3278 గ్రామాలకు పక్కా రహదారులు నిర్మించారు. 2360 కిలోమీటర్ల మేర తారు రోడ్లు, 21 వంతెనలు నిర్మించారు. కర్నూలు జిల్లా కోస్గిలో గ్రామంలోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన మోదీ

0
0

గుంటూరు, జనవరి 7: కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రజా వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయుసి) జాతీయ అధ్యక్షుడు జీ సంజీవరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సంజీవరెడ్డి మాట్లాడుతూ మోదీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 8,9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. సార్వత్రిక సమ్మెలో 12 కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. కనీస వేతనాలను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ, కార్మిక వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక, ఉద్యోగవర్గాలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని సంజీవరెడ్డి విజ్ఞప్తిచేశారు. విలేఖర్ల సమావేశంలో ఐఎన్‌టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్సా క్రాంతికుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ జయరాంబాబు, ఏఐటీయుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి రాధాకృష్ణ, సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విన్యాసాలను ప్రారంభిస్తున్న ఈఎన్‌సీ చీఫ్ ఆఫ్ నేవల్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ పవార్
చిత్రం..విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి

రక్షణ దళాల సంయుక్త నావికా విన్యాసాలు

0
0

విశాఖపట్నం, జనవరి 7: రక్షణ శాఖకు చెందిన ఎయిర్ డిఫెన్స్, తూర్పు నౌకాదళం సంయుక్తంగా నావికా విన్యాసాలను తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ నేవల్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ ఆదివారం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ నావికా విన్యాసాల్లో ఒక అధికారితో పాటు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కళాశాలకు చెందిన 28వ ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ నుంచి ముగ్గురు, తూర్పునౌకాదళం నుంచి ఇద్దరు పాల్గొంటున్నారు. రక్షణ శాఖలో సిబ్బంది ఉద్యోగుల శరీర దారుఢ్యం పెంపు, వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దేందుకు ఈ విన్యాసాలు దోహదం చేయనున్నాయి. ఈ విన్యాసాల్లో భాగంగా ఆరుగురు సభ్యుల బృందం ఏడు రోజుల పాటు జే-24 పడవలో విశాఖలో బయలుదేరి 484 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తారు. ఈ నెల 9న ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్ తీరానికి చేరుకుంటారు. ఒక రోజు విశ్రాంతి అనంతరం తిరిగి 10వ తేదీన బయలుదేరుతారు. తిరుగు ప్రయాణంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ లెఫ్టినెంట్ జనరల్ శైలేంద్ర సింగ్ ప్రారంభిస్తారు.

చిత్రం..విన్యాసాలను ప్రారంభిస్తున్న తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ నేవల్ స్ట్ఫా వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్

డిస్కంల ప్రతిపాదనలు పరిశీలిస్తాం

0
0

విశాఖపట్నం: విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఆర్‌ఈసీ) చైర్మన్ జస్టిస్ జీ.్భవానీప్రసాద్ అన్నారు. విద్యుత్ చార్జీలు, 2019-20 సంవత్సరానికి సంబంధించి రీటైల్ సరఫరా వ్యాపారానికి సంబంధించి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, చార్జీల ప్రతిపాదనలపై ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు ఎటువంటి భారం లేకుండా చూస్తామని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల సమస్యలకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీనిచ్చారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోనే విశాఖలోనే తొలి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
తరువాత విజయవాడ, హైదరాబాద్‌లో నిర్వహిస్తామన్నారు. వ్యక్తిగత సంబంధాలు చాలా తక్కువుగా ఉండే న్యాయ వ్యవస్థ నుంచి నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి గత నాలుగున్నరేళ్ళలో తనపట్ల చూపిన ఆదరాభిమానులకు ముగ్దుడినవుతున్నానన్నారు. తాను చేసిన పనిని తప్పుబట్టారని, నిజాయితీ, నిబద్ధత గురించి ప్రశ్నించలేదన్నారు. ప్రకృతి ఎదురుతిరిగి ఆర్థిక వనరులు తక్కువై వ్యవస్థ సతమతమైనపుడు స్థైర్యాన్ని కోల్పోకుండా విద్యుత్ ఉద్యోగులు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. హూదూద్, తిత్లీ, పెథాయ్ తుపాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఉద్యోగుల సేవలు ఎంత ప్రశంసించినా తక్కువేనన్నారు. తన పదవీ కాలం ఈ ప్రజాభిప్రాయసేకరణే చివరది అవుతుందన్నారు.
విద్యుత్ వ్యవస్థకు సంబంధించి తనకు ఎటువంటి అనుభవం లేదని, అయినా ఇంధన ముఖ్యకారదర్శి చేసిన సిఫారసులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు ఈ అవకాశం కల్పించారన్నారు. ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర మాట్లాడుతూ తమ సంస్థ పరిధిలో 75 లక్షల ఎల్‌ఇడీ బల్బులను పంపిణీ చేయగా, ఇందులో ఐదు నుంచి ఆరు శాతం మేర బల్బులు మాత్రమే దెబ్బతిన్నాయన్నారు. వీటిని కూడా మార్పు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో పది లక్షల మేర ఎల్‌ఇడీ బల్బుల పంపిణీ చేశామన్నారు. సింగిల్ బల్బు కనెక్షన్ల విధానమనేది లేదని వినియోగదారులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మండలాల వారీగా బల్బుల మార్పు జరుగుతుందన్నారు. విద్యుత్ చౌర్యం తక్కువుగానే ఉందని, దీని నష్టాలు సైతం 5.13 శాతానికి తగ్గాయన్నారు. ఏపీ విద్యుత్ నియంత్రణమండలి సభ్యులు పీ రామ్మోహన్, పి.రఘు పలు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులను స్వీకరించారు.
* బెల్లం రైతుల నిరసనలతో ఆరంభం
బెల్లం తయారీ, విక్రయ కేంద్రం అనకాపల్లి బెల్లం రైతుల నిరసనలతో ప్రజాభిప్రాయసేకరణ మొదలైంది. అయితే నియంత్రణమండలి వీరందర్ని లోపలకు అనుమతించడం, వారి నుంచి వినతులు స్వీకరించడంతో సమస్య సద్దుమణిగింది. బెల్లం క్రషర్లకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
చిత్రం..ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్

లోక్‌స‌భ‌లో అగ్రవర్ణాల కోటా బిల్లు

0
0

న్యూఢిల్లీ : అగ్రకులాల పేద‌ల‌కు ప‌ది శాతం కోటా ఇవ్వాల‌ని .. కేంద్ర ప్రభుత్వం లోక్‌స‌భ‌లో బిల్లును ప్రవేశ‌పెట్టింది. కేంద్ర మంత్రి తేవ‌ర్ చంద్ గెహ్లాట్ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కేంద్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ‌లో ఆ బిల్లును ప్రవేశ‌పెట్టారు. రిజ‌ర్వేష‌న్ల ప్రక్రియ‌లో రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోరుతూ ఈ బిల్లును రూపొందించారు.

ఇదో ఎన్నికల స్టంట్:మాయావతి

0
0

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇది ఎన్నికల ముందు తీసుకోవటం వల్ల ఎన్నికల స్టంట్‌గా మారిందని ఆమె అన్నారు. ముందుగానే మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటే బాగుండేదని పేర్కొంది.


పోన్లో మాట్లాడుకున్న మోదీ, ట్రంప్

0
0

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరువురు తొలుత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న దైపాక్షిక అంశాలు చర్చించుకున్నారు. అలాగే గత ఏడాది ఇరు దేశాల మధ్య వ్యహాత్మక భాగస్వామ్యంపై సంతృప్తి వ్యక్తంచేశారు.

పాక్ కవ్వింపు చర్యలు

0
0

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగపడింది. పూంచ్ జిల్లాలోని సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపారు. ఎల్వోసీని ఆనుకుని వున్న సైనిక పోస్టులు, సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

మేం బంద్‌ను ప్రోత్సహించటం లేదు:మమత

0
0

కోల్‌కతా: తమ రాష్ట్రంలో కార్మికుల బంద్‌ను ప్రోత్సహించటం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ 34 ఏళ్లు బంద్‌ల పేరుతో వామపక్ష కూటమి రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఇకపై అలాంటి బంద్‌లు ఉండవని ఆమె అన్నారు. కార్మికుల సమ్మె కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పలుచోట్ల సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేశారు.

ఆహారం ప్యాకెట్లలో లిక్కర్ బాటిళ్లు

0
0

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌కు చెందిన బీజేపీ ప్రతినిధి నితిన్ అగర్వాల్ ఆలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆహార పొట్లాలతో పాటు మద్యం బాటిళ్లను కూడా పంపిణీ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. శ్రావణిదేవి ఆలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అనుచరులు వచ్చారు. వీరికి ఆహార పొట్లాలతో పాటు మద్యం బాటిళ్లు కూడా ఇచ్చారు.

బీజేపీ మాజీ ఎమ్మెల్యే హత్య

0
0

న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎమ్మెల్యే జయంతిలాల్ భానుషాలాలి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన సోమవారం రాత్రి భుజ్ నుంచి అహ్మదాబాద్ నగరానికి రైలులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. భద్రతావైఫల్యం వల్లే హత్యకు గురయ్యారని, ఆయన మృతిపై దర్యాప్తునకు ఆదేశించారు.

Viewing all 69482 articles
Browse latest View live