Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వండి

$
0
0

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అదేశాలు జారీ చేసింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా, కాదా.. అన్నదానిపై వివరణ ఇవ్వాలని ఎన్‌జీటీ కోరింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకుని నివేదికను సమర్పించాలని కేంద్ర పర్యావరణ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంటూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానం పేరుతో ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్, త్రినాథ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఎన్‌జీటీ విచారణ చేపట్టింది.


అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

$
0
0

సిరిసిల్ల, జనవరి 8: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్‌రావుపల్లె గ్రామంలో అప్పుల బాధతో పంకరి మల్లయ్య (62) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శ్మశానవాటికలోని షెడ్డులో మల్లయ్య ఉరి వేసుకుని మృతి చెందగా, మంగళవారం ఉదయం ఆయన మృతదేహంను కనుగొన్నారు. సోమవారం రాత్రి ఇంటిలో అందరు నిద్రించాక, మల్లయ్య ఇంటి బయట ప్రధాన ద్వారంకు గడియ పెట్టి వెళ్ళిపోయాడు. రాత్రి రెండు గంటల తర్వాత ఆయన భార్యకు మెలుకవ రావడంతో పక్కన మల్లయ్య కనిపించలేదు. మంగళవారం వేకువజామున శ్మశానవాటిక వద్ద ఉరి వేసుకుని కనిపించాడు. తంగళ్ళపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సర్వే సస్పెన్షన్ సరికాదు

$
0
0

కల్వకుర్తి, జనవరి 8: గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరికాదని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ కాంగ్రెస్ సమావేశాలకు రాష్ట్రంలోని సీనియర్ నాయకులను అందరినీ పిలవాలని, అందరి సలహాలు, సూచనలు తీసుకొని పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులకే తిరిగి ఇన్‌చార్జిలుగా కొనసాగించడం దారుణమని, ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించక పోవడం దారుణమని మాజీ మంత్రి అరోపించారు. ఎన్నికలకు అభ్యర్థులను అలస్యంగా ప్రకటించారనడం అసత్య అరోపణ అని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మినహా ఇతర అభ్యర్థులను బస్సుయాత్రంలోనే ప్రకటించారని గాంధీ భవన్ చుట్టు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు మాత్రమే తిరిగారని ఆయన గుర్తు చేశారు. గతంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై పలు మార్లు విరుచుపడ్డిన సంఘటనలు ఉన్నాయని, పార్టీ సమీక్ష సమావేశంలో వాస్తవాలు చెప్పితే సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు. కేవలం దళితుడు అనే కారణం చేతనే మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు.

రైలు ఢీకొని తల్లీ కొడుకుల దుర్మరణం

$
0
0

నవీపేట, జనవరి 8: తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా, మానసిక వికలాంగుడైన కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని ఓ తల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పదేళ్ల కుమారుడితో పాటు ఆ తల్లి కూడా రైలు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన వడ్డె గంగామణి (50), మానసిక వికలాంగుడైన ఆమె కుమారుడు గంగాప్రసాద్ (10)లు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామ సమీపంలోని రైల్వే గేటు ప్రాంతం వద్దకు వచ్చారు. మహారాష్ట్ర నుండి సికిందరాబాద్‌కు వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండడంతో గేటు వేశారు. దీంతో గంగామణి, ఆమె కుమారుడు అక్కడే కొద్దిసేపు ఆగారు. అంతలోనే మానసిక వికలాంగుడైన గంగాప్రసాద్ గేటు కింద నుండి దూరి పట్టాల పైకి వెళ్లగా, అదే సమయంలో రైలు చేరువగా వచ్చేసింది. ప్రమాదాన్ని గమనించిన గంగామణి తన కుమారుడిని వెనక్కి లాగేందుకు ఆమె కూడా పరుగుపరుగున పట్టాల వద్దకు వెళ్లగా, వీరిరువురిని అతివేగంగా దూసుకొచ్చిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగామణి శరీర భాగం రెండుగా విడిపోగా, గంగాప్రసాద్ పేగులు బయటకు వచ్చి సంఘటనా స్థలం భీతావహ దృశ్యంగా మారింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని రైల్వే ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్ తెలిపారు.

రబీ పండాలంటే కర్నాటక కరుణించాల్సిందే

$
0
0

మహబూబ్‌నగర్: తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ పరిధిలోని ఆయకట్టు రైతులు రబీ పంటలు పండించుకోవాలంటే కన్నడ రాష్ట్రం కరుణించాల్సిందే. రాష్ట్రంలోని కృష్ణానదిపై గల సాగునీటి ప్రాజెక్టులలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుంది. దీంతో సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి రాబోతుంది. ఇప్పటికే రబీ పంటల సాగుపై ప్రశ్నార్థకంగా మారింది. అయా ప్రాజెక్టుల కింద ఆయకట్టును సాగు చేసుకోవాలంటే ప్రాజెక్టులలో నీటి నిల్వ ఉండాల్సిందే. కానీ రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ పరిధిలో గల ప్రాజెక్టులలో నీటిమట్టం తగ్గిపోతుంది. వేసవి కాలం రాకముందే జూరాల ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి రావడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారానే పలు తాగునీటి పథకాలు ఉన్నాయి. మంగళవారం నాటికి అయా ప్రాజెక్టుల అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. 9.66 టీఎంసీల కెపాసిటీకి గల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్‌స్టోరేజీలోకి వస్తుంది. ప్రస్తుతం 4 టీఎంసీలు అని చెప్పుకుంటున్న జూరాలలో పుడిక ఉండడంతో అది మూడు టీఎంసీలే ఉండొచ్చని రైతులు, అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఇకపోతే శ్రీశైలం జలాశయంలో సైతం రోజురోజుకు నీటిమట్టం తగ్గుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు కెపాసీటి 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 59 టీఎంసీల నీరు మాత్రమై ప్రాజెక్టులో ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల మోటార్లు ఆన్‌లో ఉండడంతో రోజురోజుకు నీటి మట్టం పడిపోతోంది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఇక్కడి రెండు ప్రభుత్వాలు నీటిని వాడుకుంటుండంతో వేసవి నాటికి తాగునీటి అవసరాలకు సైతం ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు మాత్రం దాపురించి ఉన్నాయి. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే కర్నాటక కరుణించాల్సి ఉంది. అయితే కర్ణాటకలోని కృష్ణానదిపై గల అల్మట్టి ప్రాజెక్టులో 129 టీఎంసీలకు గాను ప్రస్తుతం 58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా కర్నాటకలోని మరో ప్రాజెక్టు నారాయణపూర్‌లో 37 టీఎంసీలకు గాను దాదాపు 19 టీఎంసీల నీటిమట్టం ఆ ప్రాజెక్టులో ఉంది. కర్నాటక నుండి జూరాల ప్రాజెక్టుకు రెండు టీఎంసీల నీటి వదిలితే ప్రస్తుతం జూరాల ఆయకట్టు రైతులు సాగు చేసుకుంటున్న ఆరుతడి పంటలు బయటపడే అవకాశం ఉంటుంది. మార్చి నెలలో మరో ఒకటి రెండు టీఎంసీల నీటిని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి విడుదల చేస్తే తాగునీటి అవసరాలు సైతం గట్టెక్కే పరిస్థితులు ఉంటాయి.
కాగా జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో కలవరం మొదలైంది. ప్రాజెక్టు మొదటి ఆయకట్టు రైతులు ప్రతి రోజు ప్రాజెక్టు దగ్గర కాపలా కాస్తూ నీటిని ఎక్కువగా చివరి ఆయకట్టుకు వదలకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో రైతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రభుత్వం తక్షణమే కేంద్ర జలవనరుల శాఖను సంప్రదించాలి. లేకపోతే కృష్ణా ట్రిబ్యునల్‌నైనా ఆశ్రయించాల్సిందే.
చిత్రం..జూరాల ప్రాజెక్టులో తగ్గిన నీటిమట్టం

రైతుల్లో ఆత్మస్థైర్యం నింపిన రైతుబంధు

$
0
0

దేవరకొండ, జనవరి 8: వ్యవసాయం కలిసి రాక అప్పుల పాలై ఆత్మహత్యలే శరణ్యంగా భావించిన రైతుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు చెక్కులు ఆత్మస్థైర్యం నింపాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబీమా, రైతుబంధు పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల వల్లే రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వలేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని ఆయన చెప్పారు.
రైతు కళ్ళలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్‌నాయక్, జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, గోపి, కృష్ణ పాల్గొన్నారు.

కేంద్రం మోసానికి జేపీ రిపోర్టే నిదర్శనం

$
0
0

అమరావతి, జనవరి 8: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- హామీల అమలుపై ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రాలు వాస్తవమేనని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక రుజువు చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టం చేశారు. దీంతో ప్రధాని మోదీ చెబుతున్నదంతా అవాస్తవమేనని, కేంద్ర మోసానికి ఇది తార్కాణంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు తక్షణమే చెల్లించాలని నీతిఆయోగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. ఏపీకి అన్నీ చేశామని చెప్తున్న మోదీ నీతిఆయోగ్ సభ్యుల్ని డిస్మిస్ చేస్తారా అని ప్రశ్నించారు. జేపీ ప్రధానకార్యదర్శిగా ఏర్పాటైన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదికలో పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రూ 85 వేల కోట్లు రావాలని తేల్చినట్టు చెప్పారు. శే్వతపత్రాల్లో ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని రూ. 90 వేల కోట్లు చెల్లించాలని వివరించిందన్నారు.
దీన్ని కూడా కేంద్రం తప్పుపడుతుందా అని నిలదీశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు రూ. 24వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1050 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసిందన్నారు. నీతి ఆయోగ్‌కు చైర్మన్‌గా ఉన్న మోదీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
యూసీలు ఇచ్చినట్లు కూడా నీతి ఆయోగ్ వివరించిందన్నారు. ఏపీ సర్కార్‌పై కక్షకట్టిన మోదీ బీజేపీ నేతలతో విషప్రచారానికి పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఆర్టీసీ బస్సు బోల్తా: 20మందికి గాయాలు

$
0
0

బిట్రగుంట, జనవరి 8: నెల్లూరు జిల్లా బోగోలు మండలం ముంగమూరు క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 21 మంది గాయపడ్డారు. బిట్రగుంట ఎస్సై అందించిన వివరాల మేరకు నెల్లూరు నుంచి కావలికి జ్యూస్ లోడుతో వెళ్లుతున్న కంటైనర్ లారీ ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద వచ్చే సమయంలో తూర్పు వైపునుంచి ద్విచక్ర వాహనదారుడు ఆకస్మాత్తుగా రావడం వల్ల దాన్ని తప్పించబోయి ఎదురు మార్గంలో విశాఖ పట్టణం నుంచి నెల్లూరుకు వస్తున్న అర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు బోల్తాపడ్డాయి. బస్‌లో సుమారు 30మంది ప్రయాణికులు ఉన్నరని వారిలో 21మంది గాయపడ్డారని చెప్పారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యచికిత్స కోసం నెల్లూరు ప్రధాన ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.


లొంగిపోయిన మావోయిస్టు శబరి దళ సభ్యులు

$
0
0

కాకినాడ సిటీ, జనవరి 8: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న శబరి దళానికి చెందిన కీలక మావోయిస్టు నేతలు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఎదుట మంగళవారం లొంగిపోయారు. వీరితో ఇద్దరు దళ సభ్యులు, ఒక మిలీషియా దళ కమాండర్, ఆరుగురు మిలీషియా సభ్యులున్నారు.
దళ సభ్యుల్లో ఒకరైన దిర్ది జోగయ్య అలియాస్ పెరమయ్య అనే ముఖేష్ చింతూరు మండలం పుంగుట్ట గ్రామానికి చెందినవాడు. 2015 నుంచి స్థానిక శబరి దళం సభ్యునిగా పనిచేస్తు మావోయిస్టు కీలకనేత హరిభూషణ్ అలియాస్ లక్కాదాదాకు గార్డుగా పనిచేశాడు. 2106లో జరిగిన బోటెమ్ ఎన్‌కౌంటర్‌లో, పుజారి కాంకేర్ గ్రామంలో దువ్వల రఘు అనే వ్యక్తిని చంపడం, 2018లో చినుట్లమ్ గ్రామంలో ఇరపా లక్ష్మణరావు అలియాస్ భరత్‌ను చంపిన ఘటనల్లో కీలకపాత్ర పోషించాడు. శబరి దళ సభ్యులతో కలసి చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లి నుండి పేగ వెళ్ళే రహదారిలో ఎల్‌ఈడీలు అమర్చి పోలీసులను చంపడానికి ప్రయత్నించిన సంఘటనల్లో పాల్గొన్నాడు. అతని సహచరుడు మడకం జోగయ్య అలియాస్ రఘు 2015 నుంచి 2017వరకు శబరి దళం సభ్యునిగా పనిచేశాడు. సహచర దళ సభ్యులతో కలసి ఏడుగుర్రాలపల్లి-పేగ రహదారిపై 12సార్లు ఎల్‌ఈడీలను రోడ్డుపై పాతిపెట్టి పోలీసులను మట్టుబెట్టడానికి పథకం వేశాడు. ఇతను పేగ గ్రామం వద్ద సోడే ముత్తయ్యను హత్య, లచ్చిగూడెం గ్రామం వద్ద ఊకే మారయ్య అలియాస్ యోహన్ అనే ఫాస్టరు హత్య, 2017లో సరివెల గ్రామంలో మడకం బుచ్చయ్య హత్య ఘటనలో పాల్గొన్నాడు. శబరి ఏరియా మిలీషియా దళం కమాండర్‌గా పనిచేస్తున్న దిర్ది సోమయ్య చింతూరు మండలం పుంగుట్ల గ్రామానికి చెందిన వాడు. 2015లో శబరి ఏరియా దళంలో మిలీషియా సభ్యుడుగా పనిచేసి అనంతరం కమాండర్‌గా పదోన్నతిని పొందాడు.

కచ్చితంగా అవి రాజకీయ రిజర్వేషనే్ల : గంటా

$
0
0

విశాఖపట్నం, జనవరి 8: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ల కల్పించేలా ఉభయ సభల్లో బీజేపీ బిల్లు ప్రవేశపెట్టడం ఖచ్చితంగా ఎన్నికల స్టంటేనని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే సాధ్యాసాధ్యాలు, విధివిధానాలు చర్చించకుండా హడావుడిగా బిల్లు పెట్టడం రాజకీయ లబ్దికోసమేనన్నారు. రఫేల్ కుంభకోణంపై దేశం చర్చిస్తున్న తరుణంలో రిజర్వేషన్ల బిల్లుతో దృష్టి మరల్చే ప్రయత్నంగా అభిప్రాయపడ్డారు. నాలుగున్నరేళ్ల పాటు అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించి, ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాను టీడీపీ ఎప్పుడూ విస్మరించలేదని, హోదా కంటే అదనపు ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ ఇస్తామంటేనే ఒప్పుకున్నామని, దానికీ చట్టబద్దత కల్పించకపోవడంతో విభేదించాల్సి వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తువల్ల టీడీపీ 15 సీట్ల వరకూ నష్టపోయిందన్నారు.
ఆస్తుల పెరుగుదల మర్మమేంటో
విపక్ష వైసీపీ అధినేత జగన్ వ్యక్తిగత ఆస్తులు ఐదేళ్ల కాలంలో 770 రెట్లు పెరగడుం వెనుక మర్మమేమిటో చెప్పాలని మంత్రి గంటా డిమాండ్ చేశారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆస్తులు కూడా ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వందల రెట్లు పెరగలేదంటూ ఎద్దేవా చేశారు. జగన్ ఆస్తుల పెరుగుదలను రెండు అంకాలుగా చూస్తే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావడానికి ముందు కేవలం రూ.19.19 లక్షల మేర పన్నులు చెల్లిస్తే 2010-11 మధ్యకాలంలో రూ.88 కోట్లకు పెరిగిందన్నారు. ఆస్తుల విలువ 770 రెట్లకు చేరుకోవడం సామాన్య వ్యాపార వేత్తకు సాధ్యమయ్యేది కాదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు పెంచుకోవడం ద్వారా ‘క్విడ్ ప్రో కో’ అనే పదాన్ని ప్రపంచానికి తెలియచెప్పారన్నారు. చిన్న కుటుంబంతో ఉన్న జగన్‌కు బెంగళూరులో రూ.300 కోట్లు విలువైన భవంతి, లోటస్ పాండ్‌లో రూ.100కోట్ల ఇల్లు, తాజాగా అమరావతిలో రూ.50 కోట్ల భవంతి ఎందుకని ప్రశ్నించారు. ఎంతగా అవినీతికి పాల్పడకపోతే ఇన్ని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టగలిగారని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చే అఫిడవిట్‌లే జగన్ అవినీతికి తార్కాణాలన్నారు. తామంతా రెండు, మూడు పేజీల అఫిడవిట్‌లు సమర్పిస్తే, జగన్ 78 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారన్నారు.

సిద్ధాంత బలం లేని పార్టీలకు మనుగడ ఉండదు

$
0
0

విజయవాడ(సిటీ), జనవరి 8: సిద్ధాంత బలం లేకుండా నాయకుల బలం మీద అధారపడి నడిచే పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బలమైన సిద్ధాంతాలతో జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పారు. జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల్లో భాగంగా కర్నూలు జిల్లాకి చెందిన నాయకులు, కార్యకర్తలతో మంగళవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ విడివిడిగా భేటీ అయి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికలు జనసేనకు మొదటి పోరాటమే కానీ ఆఖరి పోరాటం కాదన్నారు. రాజకీయాల్లో ఓ స్థాయికి రావాలంటే కనీసం ఓ దశాబ్దం ఓపిక ఉండాలన్నారు. కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. అయితే కొత్తవారు ఎంత వరకు నిలబడతారు అన్నదే అసలు సమస్యగా తెలిపారు. దెబ్బ తగిలితే అంతకు మించి బలమైన పోరాటం చేసే శక్తి ఉన్నవారు కావాలన్నారు. అటువంటి వారిని గుర్తించాలంటే, తయారు చేయాలంటే సమయం కావాలన్నారు. కర్నూలు జిల్లాతో తనకు ఎనలేని సంబంధం ఉందని చెప్పారు. అయితే హత్తిబెళగళ్ పేలుళ్ల సమయంలో బాధితుల్ని పరామర్శించేందుకు బయటలుదేరినప్పుడు అందరూ మీరు కర్నూలు వస్తున్నారు కానీ జనం రారని చెప్పారన్నారు. కానీ రోడ్లు పట్టనంత జనం వచ్చినప్పుడు సగటు కుటుంబాలు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నాయో అర్థమయిందన్నారు. 2009లో ఎక్కువ శాతం సీనియర్ లీడర్లే వచ్చారని, కొత్త వారిలో కసి ఉంటుంది కానీ సరైన వ్యూహం ఉండదన్నారు. ప్రవహించే నదిలోనూ పవర్ ఉంటుందన్నారు. దాన్ని వెలికి తీయాలంటే టర్బైన్లకి అనుసంధానం చేయాలన్నారు. ఇది ఒక ప్రక్రియ ప్రకారం జరగాలన్నారు. ఓ క్రమ పద్ధతిలో వెలికి తీయాలన్నారు. వ్యవస్థని మార్చేయాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చిన వారిని కూడా ఓ క్రమ పద్ధతిలో అనుసంధానం చేసి వారిలో ఉన్న కసిని వెలికితీయాలన్నారు. ఇది సమాజానికి ఉపయోగపడేలా తయారు చేయాలన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద విసుగుతో జనం మన వైపు చూస్తున్నారని చెప్పారు. మనం ఎదో చేస్తామన్న ఆశతో మన కోసం వస్తున్నారన్నారు. వచ్చే జనాన్ని శక్తిగా మలచుకోవాలని సూచించారు. పాలకులు అందుబాటలో ఉన్న వనరుల్ని అందరికీ ఆమోదయోగ్యమయ్యే రీతిలో పంచితే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావన్నారు. అందరికీ సమానమైన రీతిలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. నాయకులకి కోట్ల రూపాయలు దోచేయడంలో ఉన్న తెలివితేటలు, శ్రద్ధ యువతకు ఉపాధి కల్పించడంలో ఉండవన్నారు. స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోకుండా రాజకీయాలు చేయడం కష్టమన్నారు. కులాలపై ఆధారపడి రాజకీయాలు నడపడం కష్టతరమన్నారు. తన బలం, బలహీనత రెండు తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదన్నారు. అందుకే తాను ఎలాంటి పరిస్థితులనయినా తట్టుకుని చాలా బలంగా నిలబడగలనన్నారు.
మెజారిటీ శాతం కొత్తవారే ఉండాలన్న లక్ష్యంతోనే 60 శాతం సీట్లు కొత్తవారికి ఇవ్వనున్నట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ లోపు స్వల్పకాలిక కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. అవసరం అనుకుంటే మధ్యలో మార్పుచేర్పులు చేద్దామన్నారు. యువతకి రాజకీయంగా ఎదగాలన్న కసి ఉన్నా రాజకీయ శక్తులు ఎదగనివ్వడం లేదన్నారు. కర్నూలు వంటి జిల్లాలో అయితే కొన్ని కుటుంబాల మధ్య ప్రజలు నలిగిపోతున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో రెండే శక్తులు ఉంటాయన్నారు. మొదటిది పాలసీ మేకింగ్.. రెండోది మాస్ ఫాలోయింగ్‌గా తెలిపారు. జనసేనకి ఈ రెండు రకాల బలం ఉన్న వారు కావాలన్నారు. కొత్త పార్టీ అంటే అంతా కొత్త నాయకులే ఉన్నా నిలబడలేమన్నారు. అనుభవం, మన సిద్ధాంతాలకి దగ్గరకా ఉన్న సీనియర్ల అవసరం కూడా ఎంతో అవసరమన్నారు. 175 స్థానాల్లో పోటీపై తనకు పూర్తి స్పష్టత ఉన్నట్లు చెప్పారు. ఎన్ని స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్న అంశం మీద కూడా స్పష్టత ఉన్నట్లు చెప్పారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమయినట్లు తెలిపారు. అన్ని స్థానాల్లో గొప్ప వారిని నిలబెట్టాలన్న ఆకాంక్ష తనకు ఉన్నట్లు వెల్లడించారు. గొప్ప అంటే ఆస్తిలో మాత్రం కాదన్నారు. ఆశయాలు ఉన్న వారిని, స్థానికంగా కూడా తనలా ఆలోచించే నాయకుల్ని తయారు చేయాలన్నారు. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. దీర్ఘకాలిక దృష్టి ఉంటేనే రాజకీయాల్లో రాణింపు సాధ్యమన్నారు. ప్రతి సమస్య మీదా తాను బలంగా మాట్లాడుతున్నట్లు, పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. దాన్ని జనంలోనికి తీసుకుళ్లేందకు తనకు మీడియా కూడా లేదన్నారు. అన్ని వ్యతిరేక శక్తుల మధ్య పోరాటం చేస్తున్నానన్నారు. భావజాలం ఉన్నవాడికి బలం ఉంటుందన్నారు. బాంబులు వేసినా చలించనంత బలం తనకు ఉందన్నారు. మన లక్ష్యం కోసం ఇప్పుడు పోరాటం చేద్దామన్నారు. నిజమైన పోరాటం చేయాల్సినప్పుడు మీ అందరికంటే తాను ముందే నిలబడతానని పవన్ కళ్యాణ్ వివరించారు.
పవన్ కళ్యాణ్‌తో పొత్తులపై చర్చ
వామపక్షాల నాయకులు మంగళవారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పీ మధు, కే రామకృష్ణ విజయవాడలోని పవన్ కల్యాణ్ నివాసంలో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పోటీ చేయాల్సిన స్థానాలకు సంబంధించిన అంశాలను చర్చించారు. ప్రాథమికంగా చర్చించిన నేతలు సంక్రాంతి తరువాత మరోసారి సమావేశమై పోటీ చేయనున్న నియోజకవర్గాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై పవన్ కల్యాణ్‌తో చర్చించినట్టు తెలిపారు. ఏయే నియోజకవర్గాలలో ఎవరెవరు పోటీ చేయాలో తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. సంక్రాంతి తరువాత మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని పవన్‌కల్యాణ్ తెలిపిననట్టు రామకృష్ణ పేర్కొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్

రెండోరోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

$
0
0

న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన కార్మికుల సమ్మె రెండోరోజు కొనసాగుతుంది. కేరళ, పశ్చిమబెంగాల్‌లో సమ్మె ప్రభావం అధికంగా ఉంది. కేరళలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ముంబయిలో పౌర రవాణా స్తంభించిపోయింది. కర్ణాటకలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. ఓ స్కూలు బస్సుపై రాళ్లు రువ్వారు. ఇదిలావుండగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి బస్సులు నడపాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు పది కార్మిక సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి.

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మ బాధ్యతలు స్వీకరణ

$
0
0

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ బుధవారంనాడు బాధ్యతలు స్వీకరించారు. తనను దీర్ఘకాల సెలవుపై పంపటాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం తీర్పునిస్తూ కేంద్ర చర్యను తప్పుపట్టంది. అలోక్ వర్మను తిరిగి నియమించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు అలోక్ వర్మ సీబీఐ కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

రాజ్యసభలో విపక్షాల ఆందోళన

$
0
0

న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలను రెండు రోజులు పొడిగించటంపై విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఏకగ్రీవ నిర్ణయం తీసుకోకుండా సభను ఎలా పొడిగిస్తారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అన్నారు. సభను పొడిగించటాన్ని దేశం మొత్తం కోరుకుంటుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బిఏసీ సమావేశంలో పొడిగింపు నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందని, సమావేశానికి చాలా మంది సభ్యులు హాజరయ్యారని వైస్ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ తెలిపారు.

ఆ పోలీసు నేషనల్ హీరో!

$
0
0

న్యూయర్క్: అమెరికాలో వలసదారుని చేతిలో హత్యకు గురైన భారత సంతతి యువ పోలీసు అధికారి రొనిల్ సింగ్ (33)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ యువ పోలీసు అధికారిని ‘నేషనల్ హీరో’గా అభివర్ణించారు. న్యూమన్ పోలీసు విభాగానికి చెందిన రొనిల్ సింగ్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా అక్రమ వలసదారుడు తుపాకీతో కాల్చి చంపి పారిపోయాడు. కాలిఫోర్నియా పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. ట్రంప్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ అక్రమ వలసదారుల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు.


శంషాబాద్‌లో పట్టుబడిన విదేశీ కరెన్సీ

$
0
0

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. ప్రయాణీకుల తనిఖీల్లో భాగంగా సీఐఎస్‌ఎఫ్ అధికారులు రూ.1.03 కోట్ల విలువైన నగదును పట్టుకున్నారు. దుబాయ్‌కు ఈ నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గవర్నర్

$
0
0

విశాఖపట్నం: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని గవర్నర్ దంపతులు బుధవారంనాడు దర్శించుకున్నారు. వరహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన గవర్నర్ దంపతులకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ఈఓ స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు

$
0
0

ముంబయి: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీసీసీఐ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో క్షమాపణ కూడా చెప్పాడు. రాహుల్ మాత్రం ఇంకా ఏమీ స్పందించలేదు. చిక్కుల్లో పడ్డారు. కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అలోక్ వర్మ కేసు కమిటీ నుంచి తప్పుకున్న సీజేఐ

$
0
0

న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మ కేసు కమిటీ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ తప్పుకున్నారు. ఈ కేసులో తాను తీర్పునిచ్చినందున తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. గొగొయ్ తన స్థానంలో జస్టిస్ ఏకే సిక్రేను ప్రతిపాదించారు.

కోటా బిల్లుకు ఆమోదం తెలపండి:మోదీ

$
0
0

న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన బిల్లుకు నిన్న లోకసభలో ఆమోదం లభించగా రాజ్యసభలో కూడా దీనికి ఆమోదం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తిచేశారు. మహారాష్టల్రోని సోలాపూర్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఆమోదం తెలపాలని కోరారు. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live