Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ప్రచారం భళా.. ‘గుర్తు’పట్టడం ఎలా?

$
0
0

ఆదిలాబాద్, జనవరి 9: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను తారుమారు చేసిన ‘ట్రక్కు’ గుర్తును అభ్యర్థులు ఇంకా మర్చిపోకముందే.. పంచాయతీ ఎన్నికల్లో కేటాయించిన గుర్తులు ప్రస్తుతం గుబులు పుట్టిస్తున్నాయి. పల్లెపోరులో స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలుపొందే సర్పంచ్, వార్డు అభ్యర్థులకు బ్యాలెట్‌లో ఊరూ పేరు, ఫోటో లేకుండానే బ్యాలెట్‌లో దర్శనమిచ్చే గుర్తులు ఓటర్లను మరోసారి తికమక పెట్టే అవకాశం ఉన్నాయి. నూతన పంచయాతీరాజ్ చట్టంలో భాగంగా 500 జనాభా ఉన్న తాండాలు, గూడేలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయగా పలుపల్లెల్లో నిరక్షరాస్యత అధికంగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఒకేలా ఉన్న గుర్తులతో ఇబ్బందులు పడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడ్డానికి దగ్గర పోలికలు ఉన్న గుర్తులు కొన్ని అభ్యర్థులకు తంటాలు తెచ్చిపెట్టే విధంగా ఉండగా మరికొన్ని ఫలాన అభ్యర్థి గుర్తు అని ప్రచారం చేయడానికి అభ్యర్థులు సైతం తికమకపడాల్సి వస్తోంది. సర్పంచ్ ఎన్నికల బ్యాలెట్‌లో మూడోస్థానంలో ఉన్న క్రికెట్ బ్యాట్, అయిదవ స్థానంలో ఉన్న ఏరోప్లేన్ గుర్తులు రెండుకాస్త దగ్గరి పోలికలతో బ్యాలెట్‌లో ముద్రించి ఉండడంతో అవగాహన లేని వృద్ధులు, నిరక్షరాస్యులైన ఓటర్లు, అంతంతమాత్రంగానే కంటిచూపు కలిగి ఉన్న వృద్ధులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. తికమక గుర్తులతో ఎవరి కొంపలు మునుగుతాయోనన్న భయం అభ్యర్థులను పట్టిపీడిస్తోంది.
షటిల్ కాక్ గుర్తుతో ప్రచారం ఇబ్బందే..
గ్రామీణులు సులువుగా అర్థం చేసుకునే గుర్తులు ఈ ఎన్నికల్లో బాగానే ఉన్నా.. షటిల్‌కాక్ గుర్తుపై పల్లెజనం, తాండాలు, గూడేల్లో ఇప్పటికీ చూసిన ఓటర్లు బహుతక్కువే. సర్పంచ్ బ్యాలెట్‌పై ఏడో స్థానంలో ఉన్న షటిల్‌కాక్ గుర్తును ప్రచారం చేయడం అభ్యర్థులకు క్లిష్టంగా మారుతుండగా వృద్ధులకు, నిరక్షరాస్యులకు ఏవిధంగా అర్థమయ్యేలా చెప్పాలో అభ్యర్థులకు అంతుపట్టడం లేదు. ఓటువేసేందుకు వెళ్ళేవారు షటిల్‌కాక్‌ను ఏలా గుర్తు పడతారన్నది సందేహస్పదంగా మారింది. దీంతో ఒకరికి పడాల్సిన ఓట్లు మరొకరికి పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక వార్డు సభ్యుల ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్‌లో గుర్తులు అయోమయానికి గురిచేసేలా ఉన్నాయి. మూడో స్థానంలో గ్యాస్ స్టవ్ ఉండగా అయిదవ స్థానంలో సిలిండర్ ఉంది. సాధారణంగా గ్రామాల్లో రెండింటిని కలిపి సిలిండర్‌గా పిలువడం సహజమే. పాత తరం వారికి, పెద్దగా అవగాహన లేనివారికి, కట్టెలపొయ్యిని వినియోగించే ఓటర్లు సైతం గ్యాస్ స్టవ్, సిలిండర్లను సరిగ్గా గుర్తుపట్టి ఓటువేయడం క్లిష్టమైన సమస్యగా భావిస్తున్నారు. నా గుర్తు సిలిండర్ అని ప్రచారం చేస్తే కొందరు ఓటర్లు తికమక పడి స్టవ్‌కు ఓటువేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో అభ్యర్థుల తలరాతలే మారే అవకాశం ఉంది. ఇందుకు కారణం పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌లో అభ్యర్థి పేరు, ఊరు ఉండకపోగా కేవలం గుర్తులు మాత్రమే ఉండడంతో వీటిని ఫలాన అభ్యర్థి గుర్తు అని గుర్తుంచుకొని ఓటువేయాల్సి ఉంటుంది.
ప్రభావితం చేయనున్న నోటా..
పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ గుర్తు బ్యాలెట్ చివరణ ముద్రించి ఉండడంతో ఓటర్లు ఇక్కడ కూడా తికమకపడాల్సి వస్తోంది. పల్లెల్లో పోటీచేసే అభ్యర్థులు తక్కువ మందే ఉండడంతో వారికి కేటాయించిన గుర్తుల కిందనే నోటా గుర్తు ముద్రించి ఉండడంతో ఆ గుర్తుపైన పడే ఓటు తెలువకుండానే ఓటు ముద్ర నోటాపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చిత్రం..సర్పంచ్, వార్డు స్థానాలకు కేటాయించిన గుర్తులు ఇవే


ఒకే వీధి.. రెండు పంచాయతీలు

$
0
0

నేరేడుచర్ల, జనవరి 9: మండలంలో ఒకే వీధిలో రెండు పంచాయతీలు ఉన్నాయి. మండలంలో బోడల్‌దిన్న పంచాయతీ రహదారికి ఒకవైపు, మరొకవైపు చిల్లెపల్లి పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన చింతకుంట్ల గ్రామం ఉంది. తెలియనివారికి ఈ వీది మొత్తం ఒకే గ్రామంగా కనిపిస్తుంది. కాని వీధికి ఒకవైపు ఒక గ్రామం, మరొకవైపు ఇంకొక గ్రామం. ఇది అరుదైన విషయం. రెండు పంచాయతీలకు ఒకే వీధి ఉండడం వల్ల పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీటి తదితర వౌలిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు గ్రామాలకు ఒకే వీధి అనుసంధానంగా ఉన్నప్పటికీ ప్రజలందరు కలిసి జీవిస్తున్నప్పటికీ పథకాల ఎంపికలో ఆయా పంచాయతీల ద్వారానే ఎంపిక చేస్తారు. బోడల్‌దిన్న పంచాయతీ సుమారు 20 ఏళ్ల కింద ఏర్పాటుచేశారు. గతంలో చిల్లెపల్లి పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ఎనిమిది వార్డులతో ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటుచేశారు. ఈ పంచాయతీలో 434 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో జనరల్ కేటగిరి కింద ఎన్నిక నిర్వహిస్తున్నారు. చిల్లెపల్లి పంచాయతీలో పది వార్డులకు 1428 మంది ఓటర్లు ఉన్నారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికల్లో బీసీ జనరల్‌గా కేటాయించారు. చిల్లెపల్లికి అనుబంధంగా ఉన్న చింతకుంట్లను భవిష్యత్తులో బోడల్‌దిన్న పంచాయతీలో విలీనం చేయాలని కోరుతున్నారు.
చిత్రం..ఒకే వీధిలో రెండు గ్రామపంచాయతీలు ఉన్న దృశ్యం

అయోధ్య కేసు విచారణ వాయిదా

$
0
0

న్యూఢిల్లీ: అయోధ్య కేసు విచారణఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. అయోధ్య కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ యూయూ లలత్ కోర్టు తీర్పుకు ముందే ప్రకటించటంతో మళ్లీ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జస్టిస్ లలత్ ఇదే కేసులో కల్యాణ్ సింగ్ తరపున వాదించినట్లు అడ్వకేటు ధావన్ పేర్కొనటంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మరొకర్ని నియమించాల్సి ఉంది.

రాహుల్ గాంధీకి మహిళా కమిషన్ నోటీసులు

$
0
0

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మహిళాకమిషన్ నోటీసులు జారీ చేసింది. రఫెల్ చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వలేక రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ వెనుక దాక్కొని పారిపోయినట్లు టీవీ ఛానెల్స్‌లోనూ, వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఓ మహిళా గౌరవ సభ్యురాలిని అవమానపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నట్లు ఆ నోటీసులో పేర్కొంది.

నవాజ్ షరీఫ్‌కు అస్వస్థత

$
0
0

ఇస్లామాబాద్: పనామా పత్రాల కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులతో బాధపడుతుండటంతో బుధవారం వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. నవాజ్ షరీఫ్‌ను ఆయన కుమార్తె మరియం నవాజ్ తండ్రిని కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ

$
0
0

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహాన్ బుధవారంనాడు భేటీ అయ్యారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రధానితో భేటీ అయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులను వివరించారు. తన పర్యటనలో భాగంగా ఆయన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలో చలి తీవ్రత

$
0
0

హైదరబాద్:తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. గత రెండు రోజుల నుంచి రాత్రవేళల్లో చలి అధికంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 10.9 డిగ్రీలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి తోడు ఉత్తర ఈశాన్య భారతం నుంచి వీస్తున్న శీతల గాలులు తోడవ్వటంతో చలి తీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రోడ్డుప్రమాదంలో ఇరువురు మృతి

$
0
0

నల్లగొండ: జిల్లాలోని కట్టంగూరు మండల కేంద్రంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతిచెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


శాశ్వత బెయిల్ కోసం రాజీవ్ హంతకులు

$
0
0

చెన్నై: వేలేరు జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజీవ్ హంతకులు శాశ్వత బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మురుగన్, శంకరన్, పేరిరివాలన్, నళిన సహా మరో ఏడుగురు శిక్ష అనుభవిస్తున్నారు. రాజీవ్ హంతకులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా గవర్నర్ అందుకు చర్యలు తీసుకోకపోవటంతో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయనున్నారు.

10శాతం రిజర్వేషన్ల బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్

$
0
0

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ బిల్లు రాజ్యాంగ వౌలిక విధానాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరుతో కొంతమంది ఉద్యమకారులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

కడప నేతలతో పవన్ భేటీ

$
0
0

విజయవాడ: స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తరువాత జనసేన సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని అన్నారు. యువశక్తి రాజకీయ శక్తిగా మారటానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

జీఎస్‌టీ పరిధిలోకి చిరు వ్యాపారులు

$
0
0

న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు ఊరట లభించింది. గురువారం వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ పన్ను మినహాయింపును రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.20 లక్షలు, మిగిలిన రాష్ట్రాలకు రూ.40 లక్షలు చేసినట్లు వెల్లడించారు.

నడక మార్గంలో తిరుమలకు జగన్

$
0
0

తిరుపతి: వైకాపా అధినేత జగన్ తన సంకల్పయాత్ర ముగించుకుని గురువారం తిరుపతికి చేరుకున్నారు. మధ్యాహ్నాం ఒంటగంట నుంచి కాలినడకన ఆయన తిరుమల కొండకు బయలుదేరారు. ఈ రోజు సాయంత్రానికి తిరుమల చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత స్వామివారి దర్శనం చేసుకుంటారు. రాత్రికి తిరుమలలో బస చేసి ఉదయం కడప బయలుదేరి వెళతారు.

ఉయ్యూరు జన్మభూమిలో గందరగోళం

$
0
0

విజయవాడ: ఉయ్యూరు జన్నభూమి సభలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ, వైకాపా కార్యకర్తల మధ్య గొడవ చెలరేగింది. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను వైకాపా నాయకుడు రాజులపాటి దూషించటంతో గొడవ జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరుపార్టీల కార్యకర్తలను అదుపులోనికి తీసుకున్నారు.

ఆర్టీసీ ఎండీ సమీక్ష

$
0
0

హైదరాబాద్: ఆర్టీసీ లాభాల బాటపట్టేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎండీ సునీల్ శర్మ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగుల బస్ పాస్‌ల సంఖ్య పెంచాలని సూచించారు. ఆర్టీసీ స్థలాల్లో దుకాణాలపై 10శాతం అద్దె పెంచాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఖాలీ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించారు.


ఆర్మీలో గేలకు ప్రవేశం లేదు:రావత్

$
0
0

న్యూఢిల్లీ: భారత సైనికదళంలోకి స్వలింగ సంపర్కులకు ప్రవేశం లేదని ఆర్మీ చీఫ్ రావత్ పేర్కొన్నారు. ఆర్మీకి కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయని అన్నారు. ఆర్మీ యాక్టు ప్రకారం సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

నవరూపిణి - దుర్గామాత

$
0
0

బాలచంద్రార్ధ సంకాశ ఫాలభాగ!
వృషభ వాహనారూఢ! విశ్వమాత!
సృష్టిపాలన లయకార్య చిహ్నశూలి!
త్రిజగవంద్య! శ్రీ శైలపుత్రీ నమోస్తు!

ఒక్కచేతను జపమాల లెక్కచేయ
మరొక చేత కమండల మంత్రజలం
జనగుణాలకు గుణముల సరిగ ఇచ్చు
బ్రహ్మచారిణి! రుద్రాణి ప్రణుతులివిగొ!

గరుడ పక్షీంద్ర వాహన! గగనవర్తి!
ఆగ్రహానల కీలామహోగ్రమూర్తి!
సుప్రసన్న దృక్కుల మమ్ము జూడుమమ్మ!
చాలు చంద్రఘంటాదేవి ! శరణమందు!

కరసురాపూర్ణ కలశ ప్రకాశదేవి!
రక్త్భర పూరణ ఘటావిరాజమాన!
నరుల గుణ పరీక్షకు నిల్పి పరమునిచ్చు
అండపిండాది కర్త్రి! కూష్మాండ రూప!

కమలములు రెండు కరదోయి కాంతులీన
నిత్యసింహాసనారూఢ నేత్ర పర్వ!
దేవ సేనాని సుకుమారు దివ్యమాత!
స్కందమాతరో! శుభధాత్రి! వందనాలు!

వ్యాఘ్ర రాడ్వాహనారూఢ! ఆద్యమాత!
చంద్రహాస ఖడ్గమును హస్తమున దాల్చి
విక్రమంబున దానవ వక్రమణచు
ధీర కాత్యాయనీ నమస్కారమమ్మ!

నల్లకలువల గెల్చెడి నయనదోయి
భీకరాకారమున భయపెట్టు గళము
తో - వికటముగ నవ్వెడి దుర్నిరీక్ష్య
కాళరాత్రి! ప్రసన్నవై కరుణనేలు

స్వచ్ఛ్ధవళాంబరవికాస! సద్విలాస!
శే్వత జగవాహనారూఢై పూత చరిత
శంకరునకు నిత్యము సంతసమ్ము నిచ్చు
సతి మహాగౌరి! శుభకరీ! సంస్తుతింతు

యక్ష సుర సిద్ధ, గంధర్వ రాక్షసులను
జీవకోటి సర్వము చేత సేవలంది
ఇష్టవరముల నందించు దృష్టి జూచు
సిద్ధిదాయిని ! శీఘ్రప్రసీద మాత!

దేవీ నవదుర్గరూపాలు దినముదినము
భక్తి భావన చేసిన వారి ఇంట
శక్తి యుక్తులు విభవాలు సలుపు సేవ
శాంతి గృహమేలు చుండును శాశ్వతముగ

అనుక్షణికం -వడ్డెర చండీదాస్

$
0
0

ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన రెండు సంవత్సరాల సుదీర్ఘకాలంలో గొప్ప సాహితీవేత్తల నుంచి సామాన్య పాఠకుల వరకు ఎందరినో మెప్పించిన నవలగానూ, మరెందరినో నొప్పించిన నవలగాను, అన్నిరకాల దూషణ భూషణలకు గురైన ఎంతో శక్తివంతమైన 20వ శతాబ్దపు అత్యంత వివాదాస్పద నవలగా అనుక్షణికంను వర్ణిస్తారు ప్రచురణకర్త అట్ట వెనుక పేజీలో.
1971-80 దశాబ్దంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సాంఘిక, మనోగత జీవితాలకు అద్దంపట్టిన నవలగా ప్రత్యేకించి ఈ అనుక్షణికంను తీసుకొనవచ్చు. విద్యార్థుల జీవితాన్ని చిత్రీకరించటమంటే పూర్తి సమాజాన్ని చిత్రించటమే అవుతుంది. ఎందుకంటే సమాజంలో అన్నిరంగాలు ఒకదానికొకటి ఇంటర్‌లింకుగా పెనవేసుకుంటాయి కాబట్టి ఆ పరంగా ఈ అనుక్షణికం ఒక దశాబ్దపు సాంఘిక జీవితాన్ని చక్కగా చూపెట్టిందని చెప్పవచ్చు.
అప్పటి కొన్ని ప్రత్యేక రాజకీయ సంఘటనలనూ, వ్యక్తుల పేర్లనూ తీసివేస్తే ఈ నవల ఇప్పటి సమకాలీన యువతరపు వైవిధ్య అంతరంగిక చిత్రణగానూ మిగిలిపోతుంది. ఆ యూనివర్సాలిటీని అంటే విశ్వజనీనతని ఈ నవలలో చూడవచ్చు.
ఎందుకింత శక్తివంతమైన మరెంతో వివాదాస్పద నవలగా అనుక్షణికం నిలిచిపోయిందని ప్రశ్నిస్తే - ఒక గొప్ప రచయిత తన సమకాలీన దృశ్యాన్ని నూరుశాతం నిజాయితీతో చిత్రించటమే కారణమని తేలిగ్గా అర్థవౌతుంది.
నిజాయితీగా రచనను వ్రాయతలచినపుడు, నవలలోని పాత్రలు రచయిత పూర్తి యిష్టానుసారం నడుచుకోవు. ఆ పాత్రలు వాటి వాటి వ్యక్తిత్వాల ననుసరించి ఆయా సన్నివేశాలల్లో నడుచుకుంటాయి. అందునా ఆ పాత్రల మనోచైతన్యాన్ని చూపెట్టినప్పుడు, ఆ ఆలోచనలు వున్నవి వున్నట్లుగా బయటకు వస్తాయి. ‘పాత్రలకు పూర్తి స్వేచ్ఛనిచ్చే మనస్తత్వం నాది’ అని వడ్డెర చండీదాస్ గారు చెప్పినా, అది పూర్తి సాధ్యం కాదు కాబట్టి, పాత్రలకు మాగ్జిమమ్ స్వేచ్ఛనిచ్చే మనస్తత్వం వారిదని చెప్పవచ్చు. పాత్రల ఆలోచనలనూ, ప్రవర్తననూ రికార్డు చేసే పనికే మిగిలిపోతారు రచయిత అనుక్షణికం నవలలో.
యూనివర్సిటీ విద్యార్థుల జీవితాన్ని అన్ని కోణాల నుంచీ వ్రాయతలచినపుడు, ముఖ్యంగా వాళ్ల మనసులలో మెదిలే ప్రధాన అంశంను స్పష్టంగా ప్రెజెంట్ చెయ్యక తప్పదు. ఆ వయస్సులో, ఆ వాతావరణంలో యువత మనస్సులలో సెక్స్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఏ కొద్దిమందినో మినహాయిస్తే మిగతా అందరిలో అనుక్షణం కదిలేదీ, మెదిలేది సెక్స్ ఆలచనలే. సహజంగా అవి వికృతపు ఆలోచనలే అవుతాయి.
కొంతమందిలో ఆ ఆలోచనలు పైశాచిక స్థాయిలో వుంటాయి. ఆ ‘సెక్స్’ ఆలోచనల స్థాయిలను చాలా స్పష్టంగా సహజంగా చిత్రీకరించడం అనుక్షణికం నవలలో ప్రధానంగా చూస్తాము. ఈ స్పష్టతే దూషణ భూషణలకు మూలమైందని చెప్పవచ్చు.
ఆంగ్ల సాహిత్యంలో డి.హెచ్.లారెన్స్, అల్‌డస్ హక్సలీ, సోమర్‌సెట్ మామ్, జేమ్స్ జేమ్స్ మొదలగు రచయితలు కూడా ‘సెక్స్’నే ప్రధానాంశంగా తమ రచనలను వ్రాయటం జరిగి, అవి కూడా చాలా విదాస్పద నవలలుగా ప్రసిద్ధి కెక్కినవి. సెక్స్ ఆలోచనలనూ, అక్కడకక్కడ ఆ క్రియను అంత పచ్చిగా అంటే నేక్‌డ్‌గా చూపాలా అన్నదే ప్రశ్న. అలా అయితే అది చవకబారు బూతు పుస్తకం అవదా? ఇపుడు సాహితీ ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు కచ్చితంగా చెప్పలేము. మచ్ కెన్‌బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. పాఠకుడు స్వీయ నిర్ణయానికి రావాల్సిందే.
అనుక్షణికం నవలను వందకుపైగా విద్యార్థినీ విద్యార్థుల జీవితాలను చిత్రిస్తాడు రచయిత. వీరిలో చాలామంది మనో అంతరంగ చిత్రణ చూస్తాము. ఆ అంతరంగ చిత్రణకు చైతన్య స్రవంతి అంటే స్ట్రీమ్ ఆన్ కాన్సిసియస్‌నెస్ టెక్నిక్‌ను ఉపయోగిస్తాడు. అదీ ఎలా అంటే రిలే పరుగు పందెంలా. ఒకని చైతన్య స్రవంతి మరొకన్ని కలసిందాకా నడుస్తుంది. అక్కడ నుంచి ఆ మరొకతని చైతన్య స్రవంతి మొదలవుతుంది.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ॥ అతిశయంగబుగ కల్లలాడ నేర్చితి గాని
సాటిగా సత్యముల్ పలికి యెఱుగ
సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితి గాని
ఇష్టమొందగ నిర్వహింప నేర
ఒకరి సొమ్ము కు దొసిలొగ్గ నేర్చితి గాని
చెలువుగా ధర్మంబు సేయ నేర
ధనము లియ్యంగ వ-ద్దనగ నేర్చితి గాని
శీఘ్రమిచ్చెడు నట్లు చెప్పనేర
తే॥ పంకజాతాక్ష ! నేనెంత పాతకుఁడను
దప్పులన్నియు క్షమియింప ఁ దండ్రి నీవె
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహస్వామి! చక్కగా అబద్దాలాడటమే గాని నిజం చెప్పి ఎరుగను. మంచి పనుల్ని చెడపటం, ఒకరి సొమ్ముకు చేయి చాచటం, దానం చేసేవారిని చేయవద్దని చెప్పటం లాంటి చెడు పనులు బాగా చేయడం నేర్చానుగానీ మంచి పనులు చేయడానికి మాత్రం నేను ముందుకురాలేదు. కనుక నేనెంత పాపినో ఇపుడు తెలుసుకొన్నాను. నన్ను నీవే రక్షించు స్వామీ!

maatata

$
0
0
Cross Image: 
Date: 
Friday, January 11, 2019
Viewing all 69482 articles
Browse latest View live