Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


  0 0

  వెల్దుర్తి, జనవరి 22: వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట జాతీయరహదారి పక్కన గల కెనరా బ్యాంక్ దొపిడీకి యత్నించిన దుండగులు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసు వ్యాన్ సైరన్‌ను విన్న దుండగులు పారిపోయిన సంఘటన మంగళవారం అర్థరాత్రి 2గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాలు చేగుంట ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం ఈవిదంగా ఉన్నాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో దొపిడి దొంగలు గ్యాస్ కటర్‌తో కిటికీలకు ఉన్న గ్రీల్స్‌ను కట్‌ చేస్తున్న సమయంలో బ్యాంకుకు అమర్చిన సైరన్ మొగటంతో నైట్‌వాచ్‌మెన్ గణెశ్ అలార్ట్ అయ్యి అప్పడె పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గ్యాస్ కటర్‌ను వదిలి దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు. దుండగుల కోసం గాలించిన వారి ఆచూకి దొరకలేదన్నారు. బ్యాంకు అధికారులకు సమాచారం తెలియడంతో ఉదయం 9 గంటలకు వచ్చిన మెనెజర్ వినీత్ కృష్ణ మాట్లాడుతూ బ్యాంకులో వీక్షణంగా పరిశీలించిన అధికారులు ఏలాంటి నష్టం జరుగలేదని మా వాచ్‌మెన్ ఆలార్ట్‌ కావడం అంతలోనే పోలీసు పెట్రోలింగ్ వ్యాన్ రావడంతో దుండగులు పారిపోయారని అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాదారులు అందోళన చెందవద్దని బ్యాంకుకు ఏలాంటి నష్టం జరుగలేదని తెలిపారు.

  చిత్రం..దోపిడీకి వినియోగించిన గ్యాస్ సిలిండర్ , కటర్‌ను వదిలివెళ్లిన దుండగులు


  0 0

  సంగారెడ్డి, జనవరి 22: పంపిణీ కానీ పట్టాదారు పాసు పుస్తకాలను వెంటనే పంపిణీ చేయాలని కలెక్టర్ హన్మంతరావు తహశీల్దార్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియలం సంగారెడ్డి డివిజన్ తహశీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు, వీఆర్‌ఓలతో ఎల్‌ఆర్‌యుపీలో పెండింగ్ కేసులు, మొదటి, రెండవ విడతలో వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో జాప్యానికి కారణాలు, తదితర అంశాలపై మండలం, గ్రామాల వారీగా కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలోగా అన్ని పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. తహశీల్దార్లు ఇట్టి విషయంలో పూర్తి శ్రద్దతో బాధ్యత తీసుకోవాలన్నారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని పనులు ఎప్పటికప్పుడు జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. మండలం వారీగా చేసిన పనులను ర్యాండమ్‌గా పరిశీలిస్తామన్నారు. తహశీల్దార్ల స్థాయిలో అయ్యే పనులు వేగవంతంగా చేయాలని, చేయలేనివి ఖాతావారిగా ఆర్డీఓకు పంపాలని సూచించారు. ఫేజ్-1, ఫేజ్-2లలో పంపిణీకాని పట్టాదారు పాసు పుస్తకాలను రెండు రోజుల వ్యవధిలో పూర్తిగా పంపిణీ చేయాలని వీఆర్‌ఓలను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని సస్పెన్షన్ చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
  ఎట్టి పరిస్థితుల్లో తమ వద్ద పాసు పుస్తకాలను పెట్టుకోవద్దని, మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కార్యాలయాల చుట్టూ, తమ చుట్టూ తిప్పించుకోవద్దని హితవు చెప్పారు. సవరణలు పూర్తయినా డిజిటల్ సంతకాలు చేయకపోవడంతో ఆగిన పాసు పుస్తకాల విషయమై హత్నూర తహశీల్దార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసారు.


  0 0

  సిద్దిపేట, జనవరి 22 : సిద్దిపేట జిల్లాలో 25న గజ్వేల్ డివిజన్‌లో జరిగే రెండో విడుత పంచాయతీ ఎన్నికల విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ అన్నారు. మొదటి విడుత పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని, ఇదే స్ఫూర్తితో రెండో విడుత పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో రెండో విడుత పంచాయితీ ఎన్నికలపై జేసీ పద్మాకర్, డీఆర్‌ఓ చంద్రశేఖర్, డీపీఓ సురేష్‌బాబు, ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, విజయచంద్రారెడ్డిలతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండో విడుత గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ 8 మండలాల్లో 191 గ్రామాల్లో , 1592 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమగు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు కావాల్సిన ఎన్నికల సామాగ్రీ, పోలింగ్ పర్సన్స్, మైక్రో అబ్జర్వర్స్, వెబ్ కాస్టింగ్ నిర్వహించే వాళ్లు, పోలింగ్ పర్సన్స్, జోనల్ ఆఫీసర్లు, రిటర్నింగ్ అధికారులు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్‌లు ఎన్నికల సరఫరాపై సమీక్షించారు.
  కిష్టసాగర్ గ్రామ సందర్శన
  స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ సిద్దిపేట మండలం కిష్టసాగర్ గ్రామాన్ని సందర్శించారు. స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ కార్యాక్రమంలో భాగంగా నిర్మించుకున్న మరుగుదొడ్డిని అందమైన రంగులతో పెయింటింగ్స్ అలంకరించుకొని వాడుకోలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ కృష్ణ్భాస్కర్ వివరించారు. మరుగుదోడ్లను రంగులు వేసి, అందంగా అలకంకరించటం పట్ల గ్రామస్తులను కలెక్టర్ అభినందించారు. గ్రామాభివృద్ధి కొరకు గ్రామంలోని 103 కుటుంబాలు ఐక్యంగా ముందుకు రావటం అభినందనీయమన్నారు. గ్రామాంలో రెండు రోజుల్లో మరుగుదొడ్లు పూర్తిగా నిర్మించారని, కిష్టసాగర్ గ్రామం పిలుపుతో అన్ని గ్రామాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కిష్టాసాగర్ వలే మిగత గ్రామాల్లోని మరుగుదోడ్లకు పెయింటింగ్‌లు వేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, విజేందర్‌రెడ్డి, డీఆర్‌డీఎ పీడీ నవీన్, ఎంఆర్‌ఓ, ఎపీఎంబీ చంద్రం, సీసీ రేఖశ్రీ, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  సంగారెడ్డి, జనవరి 22: గ్రామ పంచాయతీ ఎన్నికలతో పల్లెసీమల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఈ వేడి మరింతగా పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో సోమవారం 500 పైచీలుకు పంచాయతీలకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. మెజార్టీ స్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోగా రెండవ స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డబ్బులు, మద్యం, ఇతర వస్తు, దుస్తు రూపేణా ఓటర్ల ప్రాపకం కోసం అభ్యర్థులు కష్టాలు పడుతున్నారు. 500 ఓటర్లు ఉన్న చిన్న పంచాయతీలు మొదలుకుని వేలల్లో ఓటర్లు ఉన్న పంచాయతీల్లో సైతం డబ్బుల పంపకం జోరుమీదుండగా, మద్యం ఏరులై పారుతోంది. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలన్న తాపత్రాయానికన్నా తమ వ్యక్తిగత పరువు, ప్రతిష్టలే ముఖ్యంగా బావిస్తున్న గ్రామ స్థాయి నాయకులు పరస్పరం పోటీకి దిగారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ జోరుమీదుండగా రెండవ విడతలో కూడా అదే జోరు కనబర్చాలని తమ మద్దతుదారులను ప్రోత్సహించే పనిలో నిమగ్నమయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు ప్రచార జోరును కనబరుస్తున్నారు. ఈ నెల 25వ తేదీన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగనుండగా 30వ తేదీన మూడవ విడతతో పంచాయతీ ఎన్నికల పర్వం ముగియనుంది. వారం రోజుల పాటు గ్రామాల్లో ఇంకా పంచాయతీ ఎన్నికల వేడి వాతావరణం ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు శాఖ కూడా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడు జిల్లాల పరిధిలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా పార్టీల నాయకులకు తగిన సూచనలు, హెచ్చరికలు చేసారు.


  0 0

  హైదరాబాద్: అక్రమాలను అరికట్టి తిరుమల వేంకటేశ్వరస్వామిని కాపాడాలని ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం నాడు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యయుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే జీ కిషన్‌రెడ్డి, మాజీ డీజీపీ వీ దినేష్‌రెడ్డి, మాజీ ఐఎఎస్ దాసరి శ్రీనివాస్, మాజీ ఆర్‌టీఐ కమిషనర్ విజయబాబు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు చల్లపల్లి నర్సింహారెడ్డి, జాతీయ యువకేంద్రం వైస్ ఛైర్మన్ ఎస్ విష్ణువర్థన్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీ భాను ప్రకాష్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అత్యంత అరుదైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లో పెద్ద ఎత్తున హిందువులు వచ్చి వేంకటేశ్వరస్వామిని కొలుస్తున్నారని ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చి బ్రహ్మాండనాయకుడ్ని పూజిస్తారని, దీంతో మధ్య దళారీలు ఎక్కువయ్యారని, బ్రోకర్లు పెరుగుతున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు.
  జేఈఓ కార్యాలయంలోని సిబ్బంది సీఎం కార్యాలయ సిబ్బందితో లలాచీపడుతున్నారని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోందని అన్నారు. అవినీతి, అక్రమాలకు జేఈఈ సిబ్బంది పాల్పడుతున్నారని, దర్శన టిక్కెట్లు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని , అలాంటి సంఘటన ఒకటి గత ఏడాది సెప్టెంబర్ 27న ఉదయం 7.30కి జరిగిందని, ఎల్-1,ఎల్-2, ఎల్-3 వీఐపీ బ్రేక్ దర్శన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నపుడు చాలా మంది సీఎం కార్యాలయం నుండి రికమెంటేషన్ లేఖలు తెచ్చుకున్నారని చెప్పారు. అవి ఒకొక్కటీ 10వేల నుండి 20వేల రూపాయిల వరకూ అమ్ముకున్నట్టు తేలిందని తెలిపారు.
  అభిషేకం టిక్కెట్లను కూడా రెండు లక్షల రూపాయిల మొత్తానికి అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒక నివేదిక రూపొందించారని, అయితే ఈ నివేదిక నేటికీ వెలుగుచూడలేదని చెప్పారు. దళారీ వ్యవస్థను ఇటు జేఈఓ కార్యాలయం , ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితిలో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుని అక్రమాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు కోరారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతను కాపాడాలని అన్నారు.
  చిత్రం..గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తరువాత మంగళవారం రాజ్‌భవన్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న
  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పార్టీ నేతలు దత్తాత్రేయ, దినేష్ రెడ్డి, కిషన్‌రెడ్డి ఉన్నారు


  0 0

  విజయవాడ, జనవరి 22: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అధికారం కోసం అగ్రకులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. భారతీయ యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నాగోతి రమేష్‌నాయుడు అధ్యక్షతన నగర శాఖ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రధాని మోదీ అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారన్నారు. కానీ చంద్రబాబు తన స్వార్థం కోసం మళ్లీ అగ్ర కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇందులో ఐదు శాతం కోత విధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో మాల, మాదిగల మధ్య, కాపు, బీసీల మధ్య గొడవ పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. కాపులకు రిజర్వేషన్‌లు అన్న బాబు కమిటీ పేరుతో కాలయాపన చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసుల అండతో ప్రతిపక్షాలపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తమ ఇంటి మీదకు వచ్చిన వారంతా రౌడీ షీటర్లే అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, మరోసారి బాబుకు అవకాశం ఇస్తే ఏపీని, ప్రజలను ఎవరూ కాపాడలేరన్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌నాయుడు మాట్లాడుతూ భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, సదస్సులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామన్నారు. మార్చి 2వ తేదీ వరకు ఏపీలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

  చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ


  0 0

  విశాఖపట్నం, జనవరి 22: ఆసుపత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల సమర్థ నిర్వహణ కీలకమని, నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ అన్నారు. పీసీబీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో బయో మెడికల్ వేస్ట్ సురక్షిత నిర్వీర్యంలో ఎదురయ్యే అంశాలు-సవాళ్లపై విశాఖలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాల వారీగా ఆసుపత్రుల నుంచి ఆసుపత్రుల వ్యర్థాలను సేకరిస్తున్న సంస్థలు వాటిని సక్రమంగా నిర్వీర్యం చేస్తున్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు సమర్ధ నిర్వహణకు గాను ప్రత్యేక యాప్ రూపొందించనున్నట్టు వెల్లడించారు. వ్యర్ధాలు సేకరించే సంస్థలు వీటిని ఎక్కడకు తరలిస్తున్నాయి, ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నదీ పరిశీలించి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కడప, విజయనగరం మినహా అన్ని జిల్లాలోనూ ఆసుపత్రి వ్యర్థాలను సేకరించి నిర్వహించే ఫెసిలిటేటర్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే 10వేల పడకలు దాటిన జిల్లాల్లో రెండో ఫెసిలిటేటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రి వ్యర్థాలను సేకరించే సంస్థలు ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నాయని, వసూలు చేస్తున్న ధరలు చిన్న, మధ్యతరగతి ఆసుపత్రులు, క్లినిక్‌లకు భారంగా మారుతోందన్న అంశంపై స్పందిస్తూ ధరలను స్థిరీకరించేందుకు కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏకమొత్తంగా రోజుకు, పడక ఒక్కంటికీ రూ.6 వసూలు చేస్తున్నారన్నారు. అయితే దీనిపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో శ్లాబుల వారీగా రేట్లు నిర్ణయించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ధరల అంశాన్ని సాంకేతిక కమిటీ పరిశీలించి నిర్ణయిస్తుందన్నారు. ఆసుపత్రి వ్యర్థాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. చిన్న, మధ్యతరహా ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొంతమందికి శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా వీటిని వర్గీకరించి ఫెసిలిటేటర్‌కు ఇచ్చేలా చేస్తామన్నారు. ఆసుపత్రి వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయకుండా నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ, అమరావతి ప్రాంతాలు మెడికల్ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ సమక్రమంగా ఉండాలన్నారు.
  చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న పీసీబీ సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్


  0 0

  నల్లగొండ, జనవరి 22: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 22మండలాల్లో ముగిసిన తొలి విడత పంచాయతీల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సింహభాగం సర్పంచ్ స్థానాలు గెలుచుకుని పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడం టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను సంబరాల్లో ముంచెత్తింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సర్పంచ్‌ల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయి నాయకులను సమన్వయం చేసి మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి విడత పోలింగ్ జరిగిన 590గ్రామ పంచాయతీల్లో 352గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచ్‌లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 166స్థానాలకు పరిమితంకాగా ఇతరులు 72స్థానాల్లో గెలుపొందారు. ఇతర పార్టీలు, స్వతంత్రుల్లో సైతం ఎక్కువ మంది టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం కనిపిస్తుంది. కాగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దేవరకొండ, సూర్యాపేట, ఆలేరు, కోదాడ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో టీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించడం విశేషం. మునుగోడు ఎమ్మెల్యే మాదిరిగా నాగార్జున సాగర్, దేవరకొండ, కోదాడ, ఆలేరు నియోజకవర్గాల కాంగ్రెస్ ఓడిన అభ్యర్థులు సైతం పట్టుదలగా ఉంటే కనీసం 200సర్పంచ్ స్థానాలైన కాంగ్రెస్ గెలిచి ఉండేదన్న వాదన వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముందెన్నడు లేని రీతిలో ఎదురైన ఓటమితో ఢీలా పడిన కాంగ్రెస్ అభ్యర్థులు నిరాశతో సర్పంచ్ ఎన్నికలపై ఉదాసీనత ప్రదర్శించినప్పటికి గ్రామాల్లో కాంగ్రెస్ నుండి నిలబడిన అభ్యర్థులు తమ గెలుపు కోసం శ్రమటోడ్చిన నేపధ్యంలో టీఆర్‌ఎస్ సాధించిన సర్పంచ్ స్థానాల్లో సగం వరకైనా దక్కాయని కాంగ్రెస్ కేడర్ భావిస్తుంది. టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లాలో 175, సూర్యాపేట జిల్లాలో 108, యాదాద్రి భువనగిరిజిల్లాలో 69స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నల్లగొండలో 102, సూర్యాపేటలో 45, యాదాద్రిలో 19స్థానాలు దక్కించుకుంది.
  మరోవైపు తొలి విడత పంచాయతీ పోరులో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలతో జోరుమీదుండటంతో దీని ప్రభావం రెండు, మూడో విడతల్లో ఎన్నికల పోలింగ్‌పై పడుతుందన్న ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతుంది. అధికార పార్టీకి చెందిన వారిని గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధికి నిధులు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు దక్కే అవకాశముందన్న ప్రచారాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృతంగా సాగిస్తున్నారు. దీనికి తోడు తొలి విడత ఫలితాల ఆధిపత్యం తదుపరి పంచాయతీల పోలింగ్‌పై ప్రభావం చూపినట్లయితే కారు జోరు ఈ నెల 25, 30న జరిగే రెండు, మూడో విడత పంచాయతీల పోలింగ్‌లోనూ అదే స్పీడ్‌లో కొనసాగక తప్పదన్న ధీమా గులాబీ వర్గాల్లో కనిపిస్తుంది.


  0 0

  మిర్యాలగూడ, జనవరి 22: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఉట్లపల్లికి చెందిన చిలక యాదగిరి, రెడ్డిమల్ల నాగరాజు, చీమలపాటి నాగేష్, దోరేపల్లి వెంకన్న, షేక్‌జావిద్, పగడాల వెంకన్న, శ్రీనివాస్, సైదులు, నకిరేకంటి నగేష్, శ్రీకాంత్‌లతో పాటు వందమంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుఖేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాడానికి కేసీఆర్ చేస్తున్న కృషికి అందరు తోడ్పాటును అందించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని ఆయన కోరారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి గ్రామపంచాయతీల్లో గులాబీజెండాను ఎగురవేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనవత్ చిట్టిబాబునాయక్, ఎంపీపీ నూకల సరళా రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

  చిత్రం.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి


  0 0

  సంగారెడ్డి టౌన్, జనవరి 22: అతి చిన్న వయస్సులోనే గ్రామ సర్పంచ్‌గా మహ్మద్ షపీ గెలుపొంది సీనియర్ నాయకులకు దీటుగా నిలిచాడు. ఈ నెల 21న సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోటీలో కంది మండలం కవలంపేట గ్రామానికి చెందిన 22యేళ్ల వయస్సు గల మహ్మద్ షఫీ 102ఓట్ల మేజార్టీతో విజయం సాధించి అందరిని ఆర్చర్యపర్చాడు.ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న షఫీ గ్రామ పెద్దగా గ్రామాభివృద్ధికి కృషి చేయనున్నాడు. బీసీ జనరల్ రిజర్వేషన్ కింద నామినేషన్ వేసి చదువుకున్న వ్యక్తిగా గ్రామ సమస్యలపై గ్రామస్తులతో చర్చించి,జరగాల్సిన అభివృద్ధిపై అవగాహాన కల్పించాడు. పెద్దగా ప్రచారం సైతం నిర్వహించలేదు.
  గ్రామంలో మొత్తం 1149ఓటర్లు ఉండగా 1059ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహ్మద్ షఫీకి 437 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి పురం గోవర్ధన్‌కు 337ఓట్లు, ఇతర పోటి అభ్యర్థులకు మిగిలిన ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటిలో నిలిచిన షఫీని ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నం జరిగినప్పటికి సానుభూతితో గ్రామస్తులు ఓట్లు వేసి గెలిపించారు. చదువుకున్న జ్ఞానంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, తనకు మద్దతుగా నిలిచి గెలిపించిన గ్రామస్తులకు షఫీ కృతజ్ఞతలు తెలిపాడు. గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.

  చిత్రం.. మహ్మద్ షపీ