Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ప్రశంస (సండేగీత)

$
0
0

పొగడ్త అనేది అందరూ ఇష్టపడుతారు.
దేవుడిని కూడా మనం పొగుడుతాం. చెవులు విన్పించని వ్యక్తికి కూడా పొగడ్త విన్పిస్తుందని చాలామంది అంటూ వుంటారు. అంటే పొగడ్తకి అంత శక్తి వుందని అర్థం.
మనం అతిగా పొగిడితే ఎవరూ ఇష్టపడరు. పొగడ్తకి, ప్రశంసకి భేదం ఉంది. ప్రశంసని అందరూ కోరుకుంటారు. కానీ ఈ పనిని చాలామంది చేయరు.
అంతేకాకుండా - ఏదైనా నచ్చని పనిని ఎవరైనా చేస్తే లేదా చేయాల్సిన విధంగా చేయనప్పుడు విమర్శించడంలో చాలా మంది ముందుంటారు.
ప్రశంస అనేది పొగడ్త కన్నా శక్తివంతమైనది. ప్రశంసతో ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఎంతో సంతోషాన్నీ, తృప్తినీ ఎదుటి వ్యక్తుల్లో చూడవచ్చు.
మనకు ఏదైనా నచ్చినప్పుడు ప్రశంసిస్తే దాని ప్రభావం చాలాకాలం వుంటుంది. అదే విధంగా విమర్శకి కూడా.
విమర్శ, ప్రశంసలతో పాటూ ప్రేమ అనేది కూడా చాలా బలమైన విషయం.
మనం చాలా వాటిని ప్రేమిస్తాం. చాలా వ్యక్తులని ప్రేమిస్తాం.
పిల్లలు కావొచ్చు.
తల్లిదండ్రులు కావొచ్చు.
అన్నదమ్ములు కావొచ్చు.
స్నేహితులు కావొచ్చు.
ప్రేమిస్తాం. కానీ ఆ విషయాన్ని బహిర్గత పరచం. మాటల ద్వారానే బహిర్గత పరచాల్సిన పనిలేదు. మన చేతల ద్వారా కూడా తెలియజేయవచ్చు.
ఆలోచిస్తే ఎన్నో లభిస్తాయి.
టిఫిన్ బాక్స్‌లో చిన్న కార్డు పెట్టవచ్చు.
ఎప్పుడో రాసుకున్న ఉత్తరాల్లోని రెండు వాక్యాలను గుర్తు చేయవచ్చు.
ఇష్టమైన రంగులు
ఇష్టమైన పాటలు
ఇలా ఏమైనా చేయవచ్చు.
ప్రేమతో దగ్గరి వాళ్లని ముగ్దులని చేయవచ్చు.
ప్రశంసతో అందరినీ మైమరపించవచ్చు.
ఆయుధం మన చేతిలోనే ఉంది.


పలాయనం

$
0
0

జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తాయి.
పెళ్లి, విడాకులు, నిరుద్యోగం, పిల్లలు లేకపోవడం, వైఫల్యాలు, ఎడబాటు, ఆర్థిక అవసరాలు, మోసాలు ఇట్లా ఎన్నో చెప్పవచ్చు.
ఎన్ని వున్నా ఆశ వదులుకోకూడదు.
మన ఆరోగ్యం బాగులేకపోవచ్చు. అది కొద్ది రోజులకి బాగుపడుతుంది.
భుజం విరిగిపోవచ్చు. కొద్ది రోజులకి అది అతుకుతుంది.
ఎవరైనా కుంటుతూ వుండవచ్చు. కొద్ది రోజులకి అది కుదుటపడవచ్చు.
ప్రేమలో వైఫల్యం చెంది హృదయం ముక్కలు ముక్కలై పోవచ్చు. ఎవరో వచ్చి సేద తీర్చవచ్చు.
మన కలలు చెల్లాచెదురై పోయి నిరాశకు లోను కావొచ్చు. అవి మళ్లీ మనం సాఫల్యం చేసుకోవచ్చు.
మనల్ని ఎవరైనా గాయపరచవచ్చు. ఆ గాయాల నుంచి మళ్లీ మనం కోలుకోవచ్చు.
కాలక్రమంలో ఏదైనా తిరిగి పొందవచ్చు.
అందుకని-
ఎప్పుడూ తల ఎత్తుకునే వుండాలి.
ఆశామయ దృక్పథంతోనే అడుగు ముందుకు వేయాలి.
మన మీద మనం విశ్వాసం పెంచుకోవాలి.
నిరాశపరిచే వ్యక్తులకి దూరంగా వుండాలి.
ప్రోత్సాహ పరిచే వ్యక్తుల సాహచర్యం కోరుకోండి.
ఆశావహ దృక్పథం వున్న పుస్తకాలు చదవండి.
ఉల్లాసపరిచే పాటలు వినండి.
ఇవన్నీ చేయాలంటే-
మనం జీవితం నుంచి పారిపోకూడదు.
విరిగినా సరే!
పారిపోకూడదు. పలాయనం చేయకూడదు.
అంతే!

మారీచుడిని తోడు రమ్మని బలవంతంగా ఒప్పించిన రావణుడు (అరణ్యకాండ)

$
0
0

రావణుడు మారీచుడితో నిష్ఠూరాలు పలుకుతూ ఇలా అన్నాడు. ‘ఓరీ! మారీచుడా! నినె్నవడురా ఈ కథలు చెప్పమని అడిగాడు? చవిటి నేలలో విత్తనాలు చల్లినట్లు నోరెండగా ఎందుకురా ఇలా వాగావు? రాముడు మనుష్యుడు. మూర్ఖుడు. పాపాత్ముడు. అలాంటి వాడిని నాతో సమానం అనుకొని యుద్ధానికి పోతానా? ఆ విషయంలో నేను అనుకున్నట్లు చేయడాన్ని నివారించగల శక్తి నీకున్నదా? నీతో అది అవుతుందని అనుకుంటున్నావా? ఒక ఆడదాని వ్యర్థ ప్రలాపాలను విని, రాజ్యాన్ని, తల్లిని, తండ్రిని, హిత సమూహాన్ని వదిలి అడవులకు వచ్చిన వాడెంత బుద్ధిహీనుడో? ఇలాంటి వాడిని నువ్వు గొప్పవాడంటున్నావే? నువ్వెంత బుద్ధిహీనుడివి? నువ్వు చూస్తుండగానే, నీ కళ్లెదుటే ఖరుడిని చంపినా రాముడి ప్రియ భార్య సీతను పట్టి తెస్తాను. నేను నిశ్చయించిన దాన్ని మార్చడం నీకు సాధ్యమా?’
‘ఇంద్రుడు, ఆయన దేవతా సమూహం అన్నీ కలిసినా, నా ప్రయత్నాలను కొంచెం కూడా అడ్డుకోలేరు. అలాంటిది నువ్వా నన్ను దిద్దేవాడివి? ఏమీ నీ అహంకారం? ఏది మంచో, ఏది చెడో అనే విషయం రాజు అడిగినప్పుడు మాత్రమే బతుకు మీద ఆశ గల మంత్రి చేతులు జోడించుకుని, వినయంగా తన మనస్సులో వున్నా సంగతి ఉపాయంగా చెప్పాలి. అది కూడా ఎలా చెప్పాలి? చెప్పే మాట ప్రభువుకు మేలు చేసేదిగా ఉండాలి. మెత్తటి మాటలు చెప్పాలి. పరుష పదజాలం వాడొద్దు, ప్రతికూలంగా చెప్పకూడదు. అనుకూలంగా చెప్పాలి. శుభకరమైన మాటలతో విషయాన్ని అలంకారంగా, రాజుకు ఇష్టం కలిగించేలా చెప్పాలి. గౌరవ యోగ్యుడైన రాజు మానం విడిచిన మాటలు అవెంత శుభకరమైనవైనా, ఎంత పెద్దవాడు చెప్పినా, పట్టించుకోడు. మారీచుడా! నీ తమ్ములందరూ చచ్చినా చావనీ! నీ చెల్లెలి ముక్కు చెవులు కోసినా కోయనీ! నాకేంటి? అని వూరికే ఇంట్లో కూర్చోమంటే ఆ అవమానాన్ని సహించి, మానం కోల్పోయి, నువ్వు చెప్పావని ఎలా ఊరుకుంటాను?’
‘రాజైన వాడికి వాసవుడి లాగా విక్రమం, అగ్నిలాగా దీక్షత, చంద్రుడి లాగా సంతోషకరత్వం, యముడిలాగా దండం, వరుణుడిలాగా ప్రసన్నత్వం ఉంది, ఆయా సమయాల్లో అవసరమైన విధంగా ఉపయోగిస్తే పూజ్యుడవుతాడు. బుద్ధిహీనుడా! నేనొక పని చేద్దామని నీ సహాయం కోరితే, అది రాచధర్మం అని తెలుసుకోకుండా, తెలివిలేక, ఏవేవో పనికిరాని మాటలు ఇంతసేపు చెప్పావు. ఈ విషయంలో కీడు - మేలు గురించి నినె్నవడురా అడిగింది? ఈ పనిలో నీ సహాయం కావాలిరా అంటే ఏదేదో వాగావెందుకు? నువ్వు నాకు చేయాల్సిన సహాయం గురించి చెప్తా విను. వెండి చుక్కలు కల బంగారు జింకగా మారు. రామాశ్రమం దగ్గర సీత ఎదురుగా సంచరించు. నీ వ్యవహారం చూసి నువ్వు నిజమైన జింక అని నమ్మి, ఆశ్చర్యపడి, సీతాదేవి నిన్ను పట్టుకొని రమ్మని మగాడిని పంపుతుంది. నువ్వు ఆ రాముడిని దూరంగా తీసుకుపోయి అక్కడ జానకీ! లక్ష్మణా! అని చనిపోయేవాడి గొంతుతో రాముడు గొంతులా అనిపించేట్లు బిగ్గరగా అరువు. అది రాముడి గొంతని నమ్మి సీత భయంతో రాముడిని చూసి రమ్మని లక్ష్మణుడిని పంపుతుంది.’
‘అన్న మీద ప్రేమతో లక్ష్మణుడు రాముడిని వెతకడానికి పోతాడు. ఆ రాజకుమారులు ఇరువురూ లేనప్పుడు రాముడి భార్యను అపహరించి భార్యగా చేసుకొని సుఖపడతాను. ఈ మాత్రం సహాయం నువ్వు చేసి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లు. నీకు నా రాజ్యంలో సగమిస్తాను. పని పూర్తి కావడానికి నువ్వు ముందు పో. నీ వెనకాలే నేను రథం మీద వస్తాను. రాముడిని మోసం చేసి సీతను అపహరించి, యుద్ధమనేది లేకుండా సుఖంగా కొంచెం సేపట్లోనే ఇంటికి పోతాను. నువ్వు దీనిని చేయకపోతే నిన్ను ఇప్పుడే చంపుతాను. అలా కాకుండా నేను చెప్పింది నీకు అంగీకారమైతే నేను చెప్పినట్లే చేయి. అలా కాదని, నీకిష్టం లేదంటావా.. నీ చేత బలవంతంగానైనా చేయిస్తాను. తప్పదు కాబట్టి తెలివి తెచ్చుకో. రాజులను విరోధించి మాట్లాడేవారు సుఖపడతారా? నేను చెప్పినట్లు అక్కడికిపోతే చావడం సందేహం... తప్పించుకోవచ్చు కూడా. ఇక్కడ ఇలానే వాగుతుంటే నా చేతిలో నీవు చావు తథ్యం. అక్కడికి పోవడం మేలో, లేదా ఇక్కడ చావడం మేలో, ఆలోచించి తగిన విధంగా చేయి.’
రావణుడిలా రాజులాగా ఆజ్ఞాపించడం విన్న మారీచుడు, నిష్ఠూరంగా, ఆయన మాటలకు విరుద్ధంగా, ప్రతికూలమైన మాటలతో ఇలా జవాబిచ్చాడు. ‘కొడుకులతో, సేవకులతో, మంత్రులతో, స్నేహితులతో సహా అందరికీ కీడు కలిగించే ఈ దుష్ట కార్యాన్ని చేయమని నీకు చెప్పిన నీచుడెవడు? వాడు నీచుడు కాబట్టి తానూ చెడక నువ్వు చెడిపోయేట్లు చెప్పాడు నీకు. ఉత్తముడైతే ప్రత్యక్షంగానే నీతో విరోధించి వుండేవాడు. నువ్వు సుఖంగా ఉండడం చూడలేక పాడుపని చేయమని ఉపాయంగా చెప్పి, నీకు మృత్యుదేవత నోరు చూపించాడు. నిన్ను యుద్ధంలో జయించలేని నీ శత్రువులు, ఈ విధంగా నిన్ను బలవంతుడితో యుద్ధానికి దింపి, నీ చెడు కోరుకుంటున్నారు. అది నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. నీకు మేలు చేసేవాడిలాగా నటిస్తూ, ఎవడో దుష్టుడు, నువ్వు చేయబోయే పాప కార్యంతో నువ్వే నశించాలని కోరుకుంటున్నాడు.’
‘నీకు వేగులెలాగూ లేరు. మంత్రులు కూడా లేరా? వాళ్లైనా నువ్వు చేసే పని తప్పని చెప్పలేదా? అలా నీ మేలుకోరి చెప్పని మంత్రులున్నా లాభం ఏమిటి? లేకున్నా ఏం లాభం? వారింకా బతికే వున్నారా? వక్రమార్గంలో పోయే రాజును సరిదిద్దని మంత్రులున్నా చచ్చినా ఒకటే. వాళ్లు బతికుంటే చివరికి కీడే కలుగుతుంది. రాజు సుగుణ సంపత్తి, నిర్మలమైన మనసు కలవాడైతే మంత్రులు ధర్మార్థకామాలు కలిగి ధర్మం చేస్తారు. ధనం సంపాదిస్తారు. కామాన్ని అనుభవిస్తారు. రాజలాంటి వాడు కాకపోతే, మంత్రులకు ధర్మార్థ కామాలుండవు. ప్రజలు దుఃఖపడతారు. రాజు బాగుంటే విజయం, ధర్మం, ప్రజలకు కలుగుతుంది. ఆ కారణానే, రాజు సర్వవేళల రక్షింపబడటానికి అర్హుడు. అలా కాకుండా రాజు క్రూర దండనం, ఇంద్రియ లోలత్వం, జన విరుద్ధత కలవాడైతే ప్రజలను ఎలా పాలిస్తాడు? ఇక మంత్రులు క్రూరమైన ఉపాయాలు చెప్తే రాజుతో వారు కూడా నశిస్తారు. భూజనులకు విరుద్ధమైన మనస్సు కలవాడై రాజు రాజ్యం ఏలుతే, లోకులు రాజువల్లే చెడిపోతారు. కాబట్టి రాజును సరైన మార్గంలో పెట్టాల్సిన విధి మంత్రులది, ప్రజలది. రాజలా వుండకపోతే వాడిని తొలగించి మరొకడిని రాజుగా చేయాలి. ప్రజల కొరకు రాజు కాని, రాజు కొరకు ప్రజలు కాదు.’
‘ఆకస్మికంగా, నిర్నిమిత్తంగా నాకు ఈ చెడ్డ కీడు కలిగిందని నేను దుఃఖపడటం లేదు. చెప్పినా తెలుసుకోలేక, సర్వసైన్యంతో సహా నువ్వు చెడిపోతున్నావే అని నీ కోసం బాధపడ్తున్నాను. నాకు కలగబోయే మరణానికి నేను శోకించడం లేదు. నన్ను చంపి రామచంద్రుడు వెంటనే నిన్నూ చంపుతాడు. ఇది నిజం. పరమ పాపాత్ముడవైన నీ చేతిలో చావడం కంటే, నీ శత్రువైన పరమ పుణ్యాత్ముడు రాముడి చేతిలో చస్తే ధన్యుడనవుతాను. నువ్వు చెప్పినట్లు నేను చేస్తే నాకెందుకు రాముడి వల్ల భయమంటావేమో? నువ్వు చెప్పిన వేషం వేసుకుని నేనెప్పుడైతే పోతానో, అప్పుడే రాముడు ఇది నా వంచన అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే వంచన అనీ, దుష్ట భావం వుందనీ భావిస్తాడో, అప్పుడే చంపక మానడు. నేను పోవడమంటే చావడమే! ఆయన కళ్లకు కనబడ్డ దాకే నా జీవితం. ఇక్కడ నేనొక్కడినే చస్తాను. నువ్వేమో సీతను అపహరించుకుని పోయి బంధువులతో సహా చస్తావు. ఇది నమ్ము. నన్ను చంపించి నువ్వు బతకడం కల్ల. సీతాదేవిని ఎత్తుకుపోతే అందరూ నాశనమే! నీ మేలు కోరి రావణా, నీకు హితమైన దాన్ని బోధిస్తుంటే నా మాటలు అలక్ష్యం చేస్తున్నావు. అయ్యో! నినే్నమి అనగలను? మృత్యువుకు వశపడి చావాల్సిన వాడు స్నేహితులు చెప్పే మంచి మాటలు వింటాడా?’
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

‘వెండితెర వెలుగుల’ జాడ!

$
0
0

‘జీవితం ఒక ఫుట్‌బాల్ లాంటిది’ అనిపిస్తుంది. నీ ప్రత్యర్థి జట్టు - ‘సంఘం’ నువ్వు గోల్ కొట్టకుండా అది ఎదురు తంతూ ఉంటుంది. నువ్వు గానీ గోల్‌లోకి బంతి తన్నావా? నిన్నీ లోకం అప్పుడు గుర్తిస్తుంది. లేదా బంతికి తగిలిన కాళ్ల తన్నుల్లాంటి తాపులూ, తన్నులూ మిగుల్తాయి.
ముందే మనవి చేసినట్లు హిందీ సినిమా పాటలు మా మేనమామగారి పెద్ద గ్రామఫోన్‌లో వింటూ పెరగడం చేత - హిందీ సినిమాల మీద కూడా మోజు కలిగింది. స్కూల్లో చదువుతూన్నప్పుడే - ‘మిత్ర’ రాతపత్రికని నేనూ, నా క్లాస్‌మేట్సూ టీమ్‌గా మొదలెట్టాముగా - అందులో - చిత్రం ఏమిటీ? అంటే ఒక సచిత్ర వారపత్రికలో వున్న హంగులన్నీ వున్నాయి. నేను ఆ రోజుల్లో - వీక్లీ ఫ్యాన్‌ని కాను గానీ - ఈ ‘మిత్ర’లో, రెండో యిన్నర్ ‘రేపర్’లో ఒక కార్టూన్ ఫీచర్ - థర్డ్ రేపర్‌లో ఒక సినిమా తార బొమ్మ వేసేవాణ్ని. అవి ఎలా దొరికేవా? ఇవాళ మీరు ఇంటర్‌నెట్‌లోకి పోయి - లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం లేదా? అలాగా, నేనూ మా టీమూ.. పత్రికల నుంచి కత్తిరించేసి, ఆ ‘క్లిప్పింగ్స్’తో మేం సేకరించిన ‘సీసా’లో పొడి చేసి, వేసి, నీళ్లు పోసి నానబెట్టి తయారుచేసుకున్న ‘తుమ్మ బంక’తోనే ఫీచర్స్ చేసేవాళ్లం.
ఒకసారి, ఓ యిన్నర్ రేపర్ మీద (్థంక్స్ టు ‘సినీ అడ్వాన్స్’) నూతన్ బొమ్మ వేశాను. సన్నంగా రివటలా వుండి సోగ కనులతో ఉండే ఈ (తార) అమ్మారుూ, (నాకన్నా మూడు నాలుగేళ్లు వయసులో పెద్దది) అలాగే ‘బర్సాత్’లోని నర్గీస్ - మాకు ఫేరెట్లు. ‘బర్సాత్’ విడుదలై, వెళ్లిపోతోంది, అప్పుడు చూశాను. కానీ ‘రివ్యూ’ రాశాను.
నూతన్ తొలి చిత్రం ‘నగీనా’ (నాగమణి) సినిమాకి - అర్ధరూపాయిచ్చి, సరస్వతీ టాకీసులో, నేల తరగతికి రెండు టిక్కెట్లు తీసుకుని - నేనూ, ‘కాకర్లా’ చూశాము. నూతన్ హీరోయిన్‌గా తొలి చిత్రం అయిన ఈ ‘్భతగృహం’ సినిమాకి ‘ఎ’ సర్ట్ఫికెట్ ఇచ్చారుట. పైగా, అందులో నటించిన - ‘1950 మిస్సోరీ బ్యూటీ’గా ఎంపికైన రుూమె (‘మైనర్’ బాలిక (15 సంవత్సరాలే వయసు) కాబట్టి - ‘నగీనా’ ప్రీమియర్ షోని చూడనివ్వలేదుట. పాపం! మరి మేము నూతన్ కంటే చాలా చిన్నవాళ్లం ఐనా మమ్మల్ని ఎవడూ ఆపలేదు, అడ్డలేదు! దర్జాగా పోయి చూసొచ్చాం. ఈ సంగతి నేను నా ‘రివ్యూ’లో విమర్శిస్తూ ‘రాశాను’ చాలా కోపంగా...
అట్లాగా, అమ్మ దగ్గర నుంచి డబ్బులు దొరికితే, చూసి, వాటి రివ్యూలు రాయడం చేత - 1960-61 లలో నాకు మళ్లీ, చెప్పానే - ‘్ఫట్‌బాల్’ ‘విధి’ తంతుందీ అని, అట్లాగా సినిమా రివ్యూల బేరం తగిలింది. బెజవాడలో ‘ప్రజాసేవ’ అనే పత్రిక వుండేది. దాని బాస్ మునిసిపల్ చైర్మన్‌గా కూడా చేసిన, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా.టి.వి.ఎస్. చలపతిరావుగారు. ఐతే, ఆ ‘బ్రాహ్మడికి’ ఈ గోల ఏమీ తెలియదు. తుర్లపాటి కుటుంబరావుగారే చూసేవారు అంతా (ఈయనకి నాటి నుంచీ నేనంటే అమిత స్నేహ వాత్సల్యాలుండేవి) వూళ్లో సినిమా రిలీజయిన రోజే టిక్కెట్ తెప్పించి - పంపేవారు ఈ పత్రిక నుంచి. మా వాడు ‘సిక్’ అయ్యాడుగా - అందుకు నేనే ఆ సినిమాని చూసి - దాని మీద రివ్యూ రాసేవాణ్ని. అలా తొలి రోజు, తొలి ఆట - ‘మేజర్’ సినిమాలు రిలీజ్ కాగానే చూసే అవసరం అవకాశం కలిగింది.
మా ఫ్రెండు కాట్రగడ్డ నరసయ్యగారు నవయుగ ఫిలిమ్స్ మేనేజర్ - సైకిలూ, దాని హ్యాండిల్ బార్‌కి ‘ఎర్రరంగు’ చిన్న సంచీ - ఇవీ ఆయన టిపికల్ పెర్సనాలిటీలో భాగాల. వించిపేట మా ఇంటికి ఆయనొచ్చారంటే- ఏదో సినిమా చర్చకి నాందీ ప్రస్తావన జరిగిందన్న మాటే...
‘నవయుగ’ ‘పూర్ణా’లు - గాంధీనగర్‌లో ప్రక్కప్రక్కనే నివసిస్తున్న సూపర్ స్టార్స్‌లాగా వెలిగేవి. 1961 మొదట్లోనే ‘వెలుగు నీడలు’ సినిమా ‘అక్కినేని, రంగారావు, సావిత్రి’ - విడుదల అయింది - అట్టహాసంగా సంక్రాంతికి ముందు రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి ఆట అలంకార్ థియేటర్‌లో కోలాహలం మధ్య చూశాం. నాటి ప్రేక్షక జనం ఎంత సెన్సిటివ్ అంటే అందులో, ఓ పాటలో హీరో హీరోయిన్లు - పార్కులో కాబోలు - పాడుతూ ఒకళ్ల మీద ఒకళ్లు పడి దొర్లుకుంటూ పోతారు. ఆ సీను ఉదాత్తంగా లేదు అనీ, కత్తిరించమనీ ‘టాపు’ లేపేశారు. ఆ టేస్టే వేరు.
వెలుగు నీడలు సినిమా ఆదుర్తి సుబ్బారావుగారి సూపర్ హిట్ అయిన పిక్చర్. దీనికి ఆంధ్రా ఏరియాలో జనామోదం, ఆకర్షణలను స్టడీ చేసి, పబ్లిసిటీ ఇవ్వాలనుకున్నారు నవయుగ కాట్రగడ్డ నరసయ్యగారు అనగా కాట్రగడ్డ శ్రీనివాసరావుగారు. నాటికే నరసయ్యగారు జగమెరిగిన ‘బ్రాహ్మడు’. ‘నేను, నర్సయ్యనీ’ అనేవాడు ఫోన్ ఎత్తి, అంతే! అందరూ పోల్చేసేవాళ్లు.
ఆయనా, నేనూ, ఒక చిన్న కారు ఎక్కి - బెజవాడ నుంచి వైజాగ్ సైడు సినీ టూర్‌కి బయలుదేరాం. కృష్ణాజిల్లాలో ‘పెద్ద కారు’ అంటే బస్సు. ‘చిన్నకారు’ అంటే టాక్సీ. మొదట ఏలూరులో మార్నింగ్ షో, ఇంటర్‌వెల్ వేళకి అందుకున్నాం. శరత్ టాకీస్ కాబోలు అది. అక్కడ హోటల్‌లో ‘పెసరట్ స్పెషల్’గా కీర్తి గడించింది. అది తిన్నాం. ‘జనాలు వెలుగు నీడల జలతారు వానలో ఓలలాడుతున్నారు. ఏ సీను ప్రేలిందీ? ఎక్కడ జనం మురిసి ముచ్చటై నవ్వుల చప్పట్ల ముక్కలై పోతున్నారు?’ అని, బాల్కనీలో నుంచో, ఆపరేటర్ ప్రక్క ‘కంత’లో నుంచో గమనించడం - మా ‘దీక్ష’ - మా పని.
అదో స్టడీ టూరుగా ఏలూరు, రాజమండ్రీ, తాడేపల్లిగూడెం, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం మొదలైన ఊళ్లలో, ఇట్లా జనాల మధ్య చూస్తూ - ప్రతీ చోటా ‘నోట్సు’ తీసుకుని - చర్చ చేసి - ఆపరేటర్, థియేటర్ మ్యానేజర్ల ఇంటర్‌వ్యూలు చేసి జనాలతో ముచ్చట్లు చేసేవాళ్లం. పండుగ కదా ఐదు షోలు కూడా లాగించేశారు.
తెలుగు సినిమా రంగానికి పెట్టుబడినీ, అటు తర్వాత పంపిణీ బాధ్యతనీ కూడా - కృష్ణా జిల్లానే, నిభాయించే ఆ రోజుల్లో - పంపిణీదారుకి కూడా సినిమా నిర్మాణంలో కూడా కొంత పలుకుబడి ఉండేది. ఈ సినిమాకి - సినిమా సన్నివేశాల ‘్ఫటోలు’ (స్టిల్స్) తీసుకుని వాటి మీద ‘కార్టూన్లు’, వ్యంగ్య వ్యాఖ్యానాలూ రాస్తే- శాస్ర్తీ (తమ్ముడి పేరు అదే అప్పుడు) కార్టూన్ల లాంటి బొమ్మలు వేసేవాడు. పత్రికలలో వారం మధ్యలో (కార్టూన్ సైజులోనే) సినిమాల ప్రకటనలొచ్చేవి. నటుల ‘క్యారికేచరింగ్’ చాలా కష్టం. కనుక ‘స్టిల్స్’ నుంచి తలకాయలు కత్తిరించి తీసి - కార్టూన్ బొమ్మలు గీసేవాడు మా ఆర్టిస్ట్.
ఇట్లా సినిమా రివ్యూలు - సినిమా పబ్లిసిటీలలో తనమున్కలై పోతూనే - ‘పగా ప్రేమా’ నవల పూర్తి చేశాను. వాస్తవానికి ఇది ‘తొలిమలుపు’కి ‘ఎక్స్‌టెన్షన్’ లాంటిది. ఇందులో ‘పెద్దాళ్లయిన’ విద్యార్థి ప్రేమికులుంటారు’. నిర్మాత కె.జయదేవ్‌గారికి కథ కావాలన్నారని - నర్సయ్యగారూ మొదలయిన వాళ్లడిగారు - సరే అదీ చూద్దాం...
నాకేమో ఈ మధ్య శ్రీపాద వారి మీద మోజు ఎక్కువైంది. అందుకని గోదావరి జిల్లా భాష అనగా ‘యాస’లో ఇది రాశాను. అక్కడికోసారి పోయి ఆ కొబ్బరి తోటలూ, నదీ తీరాలూ అవీ తనివి తీరా చూశాను. నవల పూర్తయింది. సినిమా ఆఫర్ రూపు కట్టలేదు. నేను కూడా అంత ‘బాదర్’ అవలేదు. ఈ ‘పగా-ప్రేమ’ ని కూడా విశాలాంధ్రలో వేస్తామని తీసుకున్నారు ఆనక. ఏడాది తిరగకుండా సెకండ్ ఎడిషన్‌కి వచ్చిన ‘తొలి మలుపు’ మలి ఎడిషన్‌తోపాటు ‘పగా-ప్రేమా’ నవల కూడా రిలీజ్ అయింది. మహీధర రామ్మోహనరావు గారు అద్భుతమయిన రివ్యూ రాశారు - దాని మీద.
‘ప్రేమ అనేది నవీనయుగపు సాధ్య భావోద్రేకం ఒక స్ర్తి యొక్క అందమో, ధనమో, సాహచర్యమో, ఆమె యెడ విశేషమైన ఆసక్తిని కలిగించడం- మిగిలిన స్ర్తిల కన్నా ఆమె యెడ ప్రత్యేకత చూపడం ఎప్పుడూ ఉంది. ఆధునిక యుగపు ప్రేమకూ దానికీ సంబంధం లేదు’ అని, ఈ నవల ‘్థము’ మీద ఉపోద్ఘాతం ఇచ్చారాయన. రివ్యూ కొనసాగిస్తూ - నవల ననుసరించి ఇలా వున్నది ప్రేమ అని చెప్పారు.
‘ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల స్వతంత్రత, సమానత్వ సూత్రానికి ముడిపడి వున్న భావన. స్ర్తి పురుషులిద్దరూ వివాహ విషయంలో స్వతంత్రులు కావడం, సమాన హోదా వివాహ సందర్భంలో ఆమోదించబడటమూ, ఆధునిక యుగ సన్నివేశం.
సాహచర్యం, సాన్నిహిత్యం ఏకత్రవాసం దానికి సరిపోతాయి. అందుకే నేటి విద్యాలయాలు ‘ప్రేమ’కు జన్మస్థలాలవుతున్నాయి’ అంటూ విశే్లషించారు, ఈ ‘్థము’ని, ఆయన. పై చదువులు చదువుతున్న రాధాకృష్ణ, మాలతీల ప్రణయ ఘట్టాలలో నేను ‘కవిత’లు కూడా అల్లేను. అది నవలలో కొత్తదనం అన్నారంతా. ‘్భవ తీవ్రతకు చారణగీతిక లనదగ్గ గేయాలవి’ అన్నారు పెద్దలు.
కమ్మనైన కంఠమాధుర్య/ మేమో కాంక్షించిన
గున్నమామిడి కొమ్మ కొసకు ప్రాకి/ కోకిలమ్మ కోరుకొననేమి?
నీ కొంటె మాటల నాలకింతుగాని..!/ ధవళ కాంతుల వలతునేని
మల్లెమొగ్గల కోసుకొనక/ నీదు పలువరస పగుల/ మైమరచిపోదునేమి..?
అంటూ రాయప్రోలు సుబ్బారావుగారి ‘స్కూలు’ అమలిన శృంగార కవిత్వం బాణీ రాశాను. నేను ‘ప్లాటోనిక్ లవ్’ రాయప్రోలు వారి మార్కు- అమలిన శృంగారాన్ని గౌరవించే నాటి ఉన్నత విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోవకు చెందినవాఢ్ని. ‘కనుకనే - నీకు పెద్దల మధ్య గుర్తింపు, గౌరవం’ అనేవాళ్లు విజయ సాహితీ పెద్దలందరూ. మహీధర చెప్పారు ఇంకా ఇలాగ ‘వీరాజీది ఒక విశిష్టమైన ఫక్కీ. కథ చెప్పే తీరులోనూ నడిపించే తీరులోనూ సౌకుమార్యం ఉంది. యూనివర్సిటీ విద్యార్థుల ఆశలు ఆశయాలు, మమతలు, ద్వేషాలు, విలాసాలు, విభ్రమలు, పగలు, ప్రేమలు, బాధ్యతలు - నిర్వికల్పతలు - ఆయన కలంలోంచి, సజీవమూర్తులుగా అవతరించుతున్నాయి’ అదీ రివ్యూలోని భాగాలు - అలా అన్న కితాబు సంపాదించుకున్నాను.
కాని, ఆచంట జానకీరామ్‌గారు ఈ నవల మీద సుదీర్ఘమైన రివ్యూ ఓ పేజీ రాశారు. ‘విద్యార్థులు కాలేజీలకు పోయి చదువుకోవాలి గానీ ఇలా ప్రేమకలాపాలు కొనసాగించటాలు తప్పుకాదా? వీరాజీ శ్రీపాద వారి శైలిని అనుసరించడంలో తప్పు లేదు గానీ ఇలా కాలేజీ ప్రేమలకు ఆకర్షణ పెంచి యువతీ యువకుల మీద మత్తుమందు చల్లడం ఏమిటి? అంటూ ఆయన టిపికల్ స్టైల్లో కోప్పడ్డారు. ఓ చెంప పొగుడుతూనే చీవాట్లు పెట్టేశారు. జానకీరామ్‌గారు తెల్లని షరాయి - దాని మీద తెల్ల ఫుల్‌హాండ్స్ (లాల్చీ) చొక్కా - బటన్స్‌లాగా ‘కఫ్స్’ పెట్టుకొని - టిపికల్ వేషంలో - భావకవి అంటే ఇలా ఉంటాడేమో? అన్నట్లు వుండి - గాంధీనగరం అలంకార్ ప్రక్క రోడ్డు మీద తరచు కనపడేవారు. విజయ సాహితీ మీటింగ్‌లకి వచ్చేవారు అరుదుగా. ఇంచుమించు ఇలాగే ‘నయాగరా’ కవులలో ఒకడైన రెంటాల గోపాలకృష్ణగారు కూడా తెల్లని దుస్తులు - జుబ్బా చేతులు పూర్తిగా వేసుకుని, గుండీలు పెట్టేసుకుని దాని మీద రిస్టువాచీ పెట్టుకునేవారు. ఐతే, రుూయనకీ, ఆయనకీ పోలిక అంతవరకే. ఈయన గొప్ప జర్నలిస్టు.
రెంటాలగారు 1966 నుంచీ నాకు చాలా సన్నిహితులుగా ఉండేవారు. చక్కని సూచనలు ఇస్తూ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మా ‘దోస్తీ’ నాటి కబుర్లు మున్ముందు చాలా చూస్తారుగా...
ఇంతకీ, పగా-ప్రేమా నవలని కొంత సినిమాటిక్‌గా రాశాను. కారణం కానూరి జయదేవ్‌గారు, ‘సినిమా కోసం రాస్తే బాగుంటుంది’ అని నవయుగ ద్వారానే అడిగారు. కానీ, నేను అంతలో మద్రాసుకి ఉద్యోగం కోసం పెట్టే బేడా సర్దుకోవలసి వచ్చింది. దీని మీద పట్టించుకోలేదు.

నవ్వేధెలా...

$
0
0

నవ్వేదెలా
నవ్వు... నవ్వితే నవ్వు...
నవరత్నాలు రాలేలా నవ్వు..
నువ్వు నవ్వే నవ్వు
రివ్వున నా గుండె దూసేలా
నాకు తెలిసేలా
పక్కుమని పగలబడి నవ్వు
లేదా విరగబడి నవ్వు
అంతేకాని
నా వెనుక చేరి నవ్వి
నాకు వెలితిని కలతని కల్గించేలా
నా బ్రతుకు నవ్వులపాల్జేసేలా
నవ్వకు-
ఆ నవ్వు జాగృతమూ కాదు...
సంస్కారమూ కాదు...
నీకది తాత్కాలిక ప్రమోదమేమో
కాని ప్రమాదము సుమీ!!
నీ మనుగడకు...

ఈ ఉదయం... నా హృదయం

$
0
0

ఆమనిలో కోయిల... ....
ఊగుతూ కొమ్మ ఊయల...
లేలేత చివురులు మేయుచునిల
కూయసాగె కుహూ కుహూ గీతికల
రస హృదయాలకు వీనుల విందుగ
భల్ పసందుగ
చతురాంగనల పద నర్తనల
మువ్వల సవ్వడుల గాజుల గలగల గలల
విరజాజుల సంపెంగల పరిమళాల
సెలయేరుల గలగల గల జలజల జల
చిరుగాలులు ముంగురుల సవరింతల
తన్మయ కన్నుల మిలమిల మిలల
రసికత పారే ఎద ఏరుల
రవికాంచిన అరుణారుణ కిరణాల
విరిసె సరోజం మురిసె వసంతం
ఉదయించే ఉషోదయం...
నవోదయం... .... సకల నిఖిల జీవాళికి
శుభోదయం...

పల్లె - పాట

$
0
0

పల్లె బతుకులో పాటకు ప్రధానమైన స్థానం ఉంది. అక్కడ అడుగడుగునా పాట వినిపిస్తుంది. వ్యవసాయ కార్యక్రమంలో పాట లేనిదే ఏ పనీ జరగదు. నాట్లకు పాట, కలుపులకు పాట, పంట కోతలకు పాట, బంతి కట్టేందుకు పాట, బాయి నుంచి నీరు తోడేందుకు పాట! పశువులను కాస్తూ పని లేకుండా ఉండే కాపరి నోట పాట వినిపిస్తుంది. ఇక సాయంత్రం గూటికి చేరిన తరువాత గుక్కెడు గంజి తాగి బయటపడితే నడి రాత్రి వరకు నానా రకాల పాటలతో, కథలతో కాలక్షేపం జరగవలసిందే.
మా ఊళ్లో భోగమాట అనే బైలాట అనే వీధి నాటకం చాలా బలంగా కొనసాగింది. ఊర్లోనే ఉన్న కేశవయ్యగారు కొత్త వీధి నాటకాలు రాయడం నుంచి మొదలు, నగలు, దుస్తులు తయారుచేయడం, పాట నేర్పించడం మొదలైనవి అన్నీ చేసేవాడు. ఇక ఊర్లో బైలాట బాగుంటుంది అంటే ఎందుకు ఉండదు? పక్క ఊరి నుంచి వాయులీనం తెప్పించి బ్రహ్మాండమైన ప్రదర్శన కొనసాగించేవారు.
భజనలకు కొదువ లేదు. శాంతయ్యకు కళ్లు లేకున్నా కడుపు నిండా భజన పాటలు ఉండేవి. అతను వచ్చి కూర్చున్నాడు అంటే తెల్లవారులు భజన సాగేది. అష్టగ్రహ కూటమి అంటూ 60 దశకంలో మా ఊరిలో జరిగిన పండుగలు అప్పటి భజనలు నాకు ఇంకా గుర్తున్నాయి.
జముకుల కథ అన్నది ఎక్కువగా వినలేదు గానీ మా ఊరిలో బైండ్ల కథ ప్రదర్శనలు చాలా చూశాను. అవన్నీ ఎవరో బయటి నుంచి వచ్చిన వారు చేసినవి. ఊళ్లో జానపద సంగీతానికి కొదువ లేదు. తెల్లవారుజామున మెలకువ వస్తే వ్యవసాయం బావుల నుండి మోట పాటలు వినిపించేవి. అవి ఓటు పాటలు కావు. మోటు పాటలు అంతకన్నా కావు. బ్రహ్మాండమైన శృంగార రసం తొణికిసలాడుతూ ఆ పాటలు అందరినీ నిద్ర లేపేవి. మోట అంటే గిలక మీద నుండి తాడు, దాని చివరన బొక్కెన వేసి కాడి కట్టిన ఎద్దులు వెనుకకు నడవాలి. ఆ నడక నెమ్మదిగా సాగుతుంది. అక్కడ కాస్త తెరపి తీసుకుని మోట కొడుతున్న మనిషి ఇనుముతో చేసిన నిర్మాణంలోకి నీళ్లు నింపుతాడు. అప్పుడు ఎద్దులు ఒక్కుమ్మడిగా ముందుకు వాలులోకి నడుస్తాయి. బొక్కెన పైకి వస్తుంది. అప్పుడు ఒడుపుగా అందులోని నీళ్లు కాలువలోకి పడేట్లు చేయాలి. ఇదంతా ఒక రకమైన లయ చక్రంతో తిరిగే కార్యక్రమం, చూస్తే తప్ప అర్థం కాదేమో అనిపిస్తుంది. కరెంటు మోటార్ల పుణ్యమా అని మోటలు మోటు అంటే మొరటు పద్ధతి కింద లెక్క అయ్యింది. ఆశ్చర్యం కాదు గాని మోట కొట్టే మనిషి పాడే పాటలు కూడా తాను, ఎద్దులు కదులుతున్న లయకు అనుగుణంగా అదే రకమైన లయ కలిగి చిత్రంగా ఉండేవి. వెనక్కు వస్తున్నప్పుడు దీర్ఘంగా రాగం తీస్తాడు. వడివడిగా ముందుకు వెళుతున్నప్పుడు మాటలు త్వరత్వరగా పలుకుతాడు. అది విని తీరవలసిందే. ఇప్పుడు ఆ మోటలు లేవు పాటలు అంతకన్నా లేవు.
ఇక నాకు అంతకన్నా బాగా గుర్తున్న పాటలు పీర్ల పండుగకు సంబంధించినవి. మా ఊరి మసీదులో మూడు పెద్ద పీర్లు ఉండేవి. ఒకదాని పేరు మొగులాలి. అంటే వౌలా అలీ. రెండవది కాసిమన్న. అంటే ఖాసిం సాహెబ్. మూడవది ఉస్సేన్ పచ్చ. అంటే హుస్సేన్ బాద్షా. నాకు అప్పటికి హసన్, హుస్సేన్ వృత్తాంతం గాని, వారి తల్లి ఫాతిమా గురించి గానీ, కర్బలా గురించి గానీ ముక్క తెలియదు. కానీ కోయిలకొండ ఖిలా మీద కూత పెట్టిరా కాసిమా, అంటూ పాడే పాటలు అర్థం తెలియకున్నా, ఆ లయ మాత్రం చాలా బాగుండేది. కథ జరిగింది మన దేశంలో కానే కాదు. కానీ దాన్ని స్వంతం చేసుకుని మన వాళ్లు అది కోయిలకొండలో జరిగిందేమో అన్న భావం కలిగించేవారు. ఫాతిమా గురించి కూడా పాడేవారు. ముహర్రం వెనుకగల కథ తెలియని వారికి ఈ నాలుగు మాటలు కూడా తికమకగానే ఉంటాయేమో. మా పల్లెలో హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా ఈనాటికీ ఈ పండుగను అందరూ కలిసి జరుపుకుంటారు. అది నిజానికి పండుగ కాదు. వీరులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించే సందర్భం. అందుకు తగినట్టే మసీదుకు ముందు అలావా అనే పేరున చాలా వెడల్పు గుంట తోడేవారు. అందులో కర్రలు వేసి మంటలు వేసేవారు. ఆ నిప్పులో నుంచి మనుషులు ఉరికేవారు అని జ్ఞాపకం. అదేమో గానీ భూమి దద్దరిల్లేలా ఆ గుంట చుట్టూ ఎగురుతూ పాటలు పాడుతూ గుండ్రంగా తిరగడం మాత్రం గుర్తుంది. ఆ పాటల్లో కొంతపాటి బూతు కూడా ఉండేది. అది ఎవరికీ అసహ్యంగా తోచేది కాదు. నా గురించి కూడా అక్కడ పాట పాడే వారా లేక నాకు అట్లా గుర్తు ఉందా? చెప్పలేను. కానీ ఒక అమ్మాయిని మాటలతో మోసపుచ్చిన యువకుని గురించి ఆ పాటల్లో వినడం మాత్రం గట్టిగా గుర్తుంది. ఇస్తానన్న జంపులజోడు ఇచ్చేనేమో జంబీలీ, అంటూ సాగే ఆ పాటలలోని లయ, ఆంతర్యం, హంగులు జానపద సంగీతం సేకరించేవారు ఎవరికీ చేతికి అందినట్టు లేదు. ఆ పాట ఏమైందో తెలియదు. జంబులమ్మ లేదా జంబిలి అని ఒక పేటకు ఉంటుందని ఎంతమందికి తెలుసు?
మాకు కూడా కొంతపాటి వ్యవసాయం ఉండేది. కనుక పొలంలో చాలాకాలం గడిచింది. అక్కడ పని పేరున చేరిన ఆడవారు రకరకాల పాటలు పాడేవారు. ఇప్పటి వలె ఆసక్తి ఉంటే, లేక ముందు ముందు ఉంటుందని తెలిస్తే ఆ పాటలన్నీ సేకరించే వాడినేమో? ప్రకృతి గురించి, మనుషుల మధ్య ప్రేమ గురించి, రకరకాల పాటలు వారు పాడుతూ ఉండేవారు. వాళ్ల అందరికన్నా ఎక్కువగా మా జీతగాడు బుడ్డన్న చాలా బాగా పాడేవాడు. వాడు ‘ఇంకా ఉన్నాడు కానీ పెద్దవాడు అయిపోయాడు. వెళ్లి పాడమంటే బహుశా కొన్ని పాటలు పాడుతాడేమో? చూడాలి!
రేడియోలో ఉద్యోగం చేస్తానని నేను అప్పట్లో కలలో కూడా అనుకోలేదు. అంతకు ముందు రోజు వరకు కూడా నేను అనుకోలేదు. అదేదో అనుకోకుండా జరిగింది. కానీ అప్పటి వరకు నేను రేడియోకు చాలా విధేయుడుగా వినే శ్రోతను. ఉదయం భక్తిరంజని మొదలు రాత్రి కర్ణాటక సంగీతము, హరికథ ఇలాంటివి ముగిసేదాకా రేడియో పాడుతూనే ఉండేది. మధ్యమధ్యలో వచ్చే జానపద సంగీతం మమ్మల్ని బాగా ఆకర్షించింది. అయితే విజయవాడ వారి జానపద సంగీతం ఎక్కువగా ఆకర్షించింది అని నొక్కి చెప్పగలను. మల్లిక్ గారు, ఓగిరాల నరసింహమూర్తి ఇలాంటి వారి పేర్లు గొంతులు బాగా గుర్తున్నాయి. అప్పట్లో ఒక పదిహేను నిమిషాల కథ ఒకదాన్ని పాట రూపంలో మళ్లీ మళ్లీ వినిపించేవారు. ఒక సవతి తల్లి కిరాయి గూండాలని పెట్టి, కొడుకును చంపించడానికి ప్రయత్నం చేసుకుంది. అందులో మల్లిక్ గారు కూడా పాడినట్టు నాకు బాగా గుర్తుంది. నా పెండ్లం, కమలమ్మా, నీళ్లాడి, ఆర్నెల్లు, తన మొగమూ నేనెరుగా, నా మొగమూ తానెరుగా, అంటూ పాడిన గొంతుక బహుశా ఆయనదేనేమో? కాకపోవచ్చు కూడా. ఎందుకో ఈ రికార్డింగ్‌ను మళ్లీమళ్లీ వేసేవారు. అది మొదలైతే చాలు, అమ్మ చాలా బాధగా ఎందుకురా ఆ పాట వింటావు అంటూ నన్ను అడిగేది! ఆమె గుండెను ఆ కథ అంతగా కదిలించింది.
విజయవాడ, జానపద సంగీతం అనగానే నాకు ఒక పాట చటుక్కున గుర్తుకు వస్తుంది. చేపలన్ని రెక్కలొచ్చి చెట్లెక్కినై... అంటూ ఆ పాట సాగేది. అది ఆ తరువాత వివిధ భారతిలో కూడా మధ్యాహ్నం పూట వినిపించేది. అలాగే పొలిగాని పాట, ఏటికి ఏతం బెట్టి అంటూ సాగే మరొక పాట నాకు ఇవాళటి వరకు జ్ఞాపకం వున్నాయి. అవన్నీ ఇంకా ఎవరి దగ్గరయినా ఉంటే మళ్లీ వినాలని.
ఇంత చెప్పి నేను ఆకాశవాణి హైదరాబాదులోని లలిత సంగీతం గురించి చెప్పకుంటే ఒక రకంగా అన్యాయం అవుతుంది. ఇక్కడ ఆ విభాగానికి స్థానికేతరులు ఆఫీసర్లుగా ఉన్నారు. ఇందులో మోమాటం లేదు. వింజమూరి సీత గారు నాకు అత్యంత సన్నిహితులు. ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తల్లి ఆమె. కానీ ఉద్యోగపరంగా ఆమె చేసిన అన్యాయాన్ని మాత్రం నేను తరువాత అర్థం చేసుకున్నాను. తెలంగాణ జానపదం పాటలను సేకరించి వాటిని అసలు గొంతుకలో వినిపించకుండా, లలిత సంగీత కళాకారుల చేత ఆమె మళ్లీ పాడించేది. మొరటుగా ఉండవలసిన జానపద సంగీతాన్ని ఒక లలిత సంగీత స్థాయికి ఆమె మార్చింది. ఆ సంగతి నాకు అప్పట్లో అర్థం కాలేదు. ఎవరో ఒకరిద్దరు తప్ప అసలు కళాకారులు వచ్చి పాడిన గుర్తులేదు. స్థానిక కళారూపాలకు అవకాశాలు తక్కువ. పైగా వాటిని సాయంత్రం వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా వినిపించేవారు. ఎందుకిలా జరిగింది? నా మనసులో ఇంకా ప్రశ్న మిగిలి ఉంది.
నేను హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాను. ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. ఆ తరువాత జానపద సంగీతం విషయంలో హైదరాబాద్ రేడియోలో మంచి కృషి జరిగింది అని తెలుసు. ఒక్క సంగతి నేను చెప్పగలను. నేను ఉన్నప్పుడే చుక్క సత్తయ్య అనే పెద్ద మనిషి ఒగ్గు కథ చెప్పేవాడు. అతను బాగా చెబుతాడు అన్న సంగతి అతనికి గానీ మరి ఎవరికి గానీ అర్థం కాలేదు అని నాకు తరువాత అర్థమయింది. జానపద సంగీతంలో కూడా కళాకారుల స్థాయిలో తేడాలు ఉంటాయి అన్న సంగతి ఎవరూ పట్టించుకోలేదు. అతను అన్నింటికన్నా తక్కువ అయినా ‘బి’ క్లాస్ గాయకుడుగా పాడుతూనే ఉండేవాడు. స్థాయి పెంచుకోవడం గురిచి అతనికి ఎవరూ చెప్పినట్టు కూడా లేదు. అసలు ఎవరికి తోచినట్టు లేదు. ఎందుకు వచ్చిందో కాని ఆ ఆలోచన నాకు వచ్చింది. నా కారణంగా అతనికి స్థాయి పెరిగి కొంత డబ్బు ఎక్కువ ముట్టింది అని నేను ఇవ్వాళ చెబితే ఎవరైనా ఒప్పుకుంటారా? వదిలేద్దాం!
వింజమూరి సీతగారు పోయారు. వాళ్ల అక్కయ్య అనసూయ గారి పుస్తకానికి నేను సమీక్ష రాశాను. అందులో చెల్లెలు గురించి ఒకటి రెండు ముక్కలు తప్ప ఎక్కువ లేదు. రిటైర్ అయిన తరువాత చెన్నైలో ఉంటున్న సీతమ్మ ఇంటికి వెళ్లి భోజనం చేశాను. ఆ తల్లి మంచి మనసు గలది. ఆమెకు సినిమా రంగంలో కూడా అన్యాయం జరిగింది. అయితే అవన్నీ అప్రస్తుతాలు! ఆ అక్క, చెల్లెళ్లు ఒకప్పుడు జానపద సంగీతాన్ని ప్రజలందరికీ నచ్చే విధంగా పాడేవారు అన్నది మాత్రం నిజం.
జానపద సంగీతం వేరు. జానపద శైలి సంగీతం వేరు. మరి మా పల్లెలో వారు తమ పాటల్లో నెహ్రూ గురించి, ఆయన భార్య కమలా నెహ్రూ గురించి పాడినట్టు గట్టిగా గుర్తుంది. అది మరి జానపదమేనా చెప్పలేను.

బెస్ట్ ఇనె్వస్ట్‌మెంట్

$
0
0

బెస్ట్ ఇనె్వస్ట్‌మెంట్ ఏది అని అడిగితే మీరేం చెబుతారు? ఆలోచించండి.
ఒక్కోక్కరు ఒక్కో రకంగా చెబుతారు. రియల్ ఎస్టేస్, స్టాక్ మార్కెట్, బంగారం, బ్యాంకులో డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా తమ అనుభవం మేరకు సమాధానం చెప్పవచ్చు. ఇవన్నీ నిజమే.కానీ వీటన్నిటి కన్నా విలువైన ఇనె్వస్ట్‌మెంట్ ఉంది? అంతే కాదు ఇవన్నీ విలువైనవే అని మనకు తెలిపేది ఏమిటి? అదే బెస్ట్ ఇనె్వస్ట్‌మెంట్.
వారెన్ బఫెట్ పెట్టుబడి ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచంలో టాప్ టెన్ సంపన్నుల జాబితాలో ఎప్పుడో స్థిరనివాసం ఏర్పరచుకున్న పేరది.
అలాంటి వారెన్ బఫెట్‌ను ఒక సమావేశంలో బెస్ట్ ఇనె్వస్ట్‌మెంట్ ఏది? అని ప్రశ్నించారు. చిన్నప్పటి నుంచి ఇనె్వస్ట్‌మెంట్‌ను ఒక అలవాటుగా మార్చుకున్న ఆయన ఏ స్టాక్ గురించి చెబుతారో అని అంతా ఎదురు చూశారు. ఆయన కొన్ని క్షణాలు ఆగి ... మన మీద మనం చేసే ఇనె్వస్ట్‌మెంట్ బెస్ట్ ఇనె్వస్ట్‌మెంట్ అని బదులిచ్చారు.
మన మీద మనం ఇనె్వస్ట్ చేసుకోవడం అంటే విచ్చలవిడిగా మన కోసం మన ఖర్చు చేసుకోవడం కాదు. మన వ్యక్తిగత ఖర్చులు కాదు.
మన మీద మనం ఇనె్వస్ట్ చేసుకోవడం గురించి ఆయన తన జీవితంలో చేసిన ఇలాంటి ఇనె్వస్ట్‌మెంట్ గురించి వివరించారు.
డెల్‌కార్నిగ్ గురించి మనకు తెలుసు కదా? వ్యక్తిత్వ వికాసం గురించి ఇప్పుడు తెలుగులో ఎవరు ఏం రాసినా, రాస్తున్నా ఇదంతా డెల్‌కార్నిగ్ చూపిన దారినే. ఆరేడు దశాబ్దాల క్రితం డెల్‌కార్నిగ్ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి క్లాస్‌లు తీసుకునేవారు. దానికి కొంత ఫీజు వసూలు చేస్తారు. అలా ఫీజు చెల్లించి ఆ కాలంలో వారెన్‌బఫెట్ ఒకసారి ఇలాంటి తరగతులకు హాజరయ్యారు. మనుషులతో ఎలా వ్యవహరించాలి, మంచి చెడు ఏదో చెప్పడమే కాకుండా మనల్ని మనం తీర్చి దిద్దుకోవడానికి పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎందుకో అక్కడ డెల్ కార్నిగ్ అద్భుతంగా వివరించారట! ఆ తరగతులకు హాజరు కావడానికి తాను చెల్లించిన డబ్బు తన జీవితంలో అత్యుత్తమమైన ఇనె్వస్ట్‌మెంట్ అని వారెన్‌బఫెట్ ప్రకటించారు.
ఆనాటి నుంచి తనకు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారిందని చెప్పుకొచ్చారు. విజేతలు తమ జీవితానుభవాలతో రాసిన పుస్తకాలను చదవడం వల్ల జీవితం గురించి ఎంతో అవగాహన కలిగిందని, తాను చేసే ప్రతి పనిలో ఈ అనుభవం ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.
ప్లాట్లపైనో, బంగారంపైనో ఇనె్వస్ట్ చేయడం అంటే ఉత్సాహం చూపిస్తాం కానీ మనపై మనం ఇనె్వస్ట్ చేసుకోవడం అంటే మనకు పెద్దగా ఆసక్తి అనిపించదు. కానీ జీవితంలో ఎదిగిన వారు, ఎదగాలనే ఆలోచన ఉన్న వారు ముందు తమపై తాము ఇనె్వస్ట్ చేసుకోవాలి.
ఉదాహరణకు స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేయాలి అని మనకు ఆసక్తి ఉండవచ్చు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అక్కడ ఎలా ఇనె్వస్ట్ చేస్తారు. ఏ కంపెనీ భవిష్యత్తు ఏ విధంగా ఉండవచ్చు. దేశంలో మార్పులు ఎలా వస్తున్నాయి, ఈ మార్పుల్లో ఏ కంపెనీ ఎదిగే అవకాశం ఉంది? ఎప్పుడు ఇనె్వస్ట్ చేయాలి, ఎప్పుడు లాభాలు స్వీకరించాలి అనే నాలెడ్జ్ మనకు ఎలా సాధ్యం అవుతుంది. స్టాక్ మార్కెట్ గురించి నిపుణులు రాసిన పుస్తకాలు చదవడం వల్ల. అంటే ఆ బుక్స్ కొని, కొంత సమయం వెచ్చించి వాటిని చదవడం అంటే మనపై మనం ఇనె్వస్ట్ చేయడమే.
తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పాతాళంలోకి పడిపోతుందని ప్రచారం చేశారు. చివరకు తెలంగాణ సాకారం అయిన తరువాత కూడా కొందరు ఇదే విధంగా ప్రచారం చేశారు. అలా భయపడి ప్లాట్లు అమ్ముకున్న వారు దెబ్బతిన్నారు. కానీ విభజన తరువాత చిత్రంగా దేశంలో ఎక్కడా లేనంతగా రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్‌లో పుంజుకుంది. విభజన తరువాత ఏమవుతుంది అనే నాలెడ్జ్ ఉన్నవారు స్థిమితంగా ఉండగా, తెలియని వారు అనవసర భయాందోళనలో దెబ్బతిన్నారు.
91 ఆర్థిక సంస్కరణల తరువాత దేశంలో ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరిగాయి. అధికారంలో ఎవరు ఉన్నా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ జ్ఞానం ఉన్నవారు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలపై దృష్టిసారిస్తారు. ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది కానీ దెబ్బతినదు. ఈ నాలెడ్జ్ మనకు ఉండాలంటే పరిణామాల గురించి కొంత జ్ఞానం ఉండాలి. అది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. కొంత కాలం పాటు మనపై మనం ఇనె్వస్ట్ చేసుకుంటే వచ్చేది. వంద రూపాయలు పెట్టి బుక్ కొనగానే నాలెడ్జ్ రాదు. అది చదివి, ఆచరించడం ద్వారా, అనుభవం ద్వారా వస్తుంది. అలాంటి నాలెడ్జ్ పొందడానికి మనపై మనం నిరంతరం పెట్టుబడి పెట్టుకోవాలనేదే వారెన్‌బఫెట్ సలహా.
చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఇప్పుడే ఉద్యోగంలో చేరిన వారు కావచ్చు. రిటైర్ అయిన వారు కావచ్చు, ఎవరైనా, ఏ వయసులోనైనా, ఏ దశలోనైనా మనపై మనం ఇనె్వస్ట్ చేసుకోవచ్చు, అలా ఇనె్వస్ట్ చేసుకునే వారే విజయపథంలో పయనిస్తారు. ఏ రంగంలో ఉన్నా మనం నిరంతరం మన నాలెడ్జ్ పెంచుకోవడమే మనపై మనం చేసుకునే ఇనె్వస్ట్‌మెంట్.
జ్ఞానం లేకపోతే సంపద కూడా నిలువదు.
ఒక ప్రాజెక్టు వస్తుందని తెలియగానే ఏం జరుగుతుందో తెలిసిన వారు ఆ ప్రాంతంలో చౌకగా భూములు కొంటే, తెలియని వారు అమ్ముకుంటారు. మన కళ్లముందే యాదగిరిగుట్ట వద్ద కావచ్చు, అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కావచ్చు, హైటెక్ సిటీ వద్ద కావచ్చు కారు చౌకగా భూములు అమ్ముకున్నవారున్నారు. భూములు కొని కోట్ల రూపాయలు సంపాదించిన వారు ఉన్నారు.
స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడి ఏ రూపంలో ఐనా కావచ్చు. ముందు మనపై మనం ఇనె్వస్ట్ చేసుకోవడం ద్వారా ఆయా రంగాల గురించి అవగాహన వస్తుంది. మన పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది. స్టాక్ మార్కెట్‌లో నిండా మునిగిపోయిన వారు ఉన్నారు, బాగా సంపాదించిన వారు ఉన్నారు. ఇద్దరి మధ్య తేడా నాలెడ్డ్. అలాంటి నాలెడ్జ్ కోసం కొంత ఇనె్వస్ట్ చేద్దాం. మార్కెట్‌లో కూలి పోవచర్చ, భూములు అన్యాక్రాంతం కావచ్చు. కానీ మనపై మనం చేసే ఇనె్వస్ట్‌మెంట్ మనతోనే ఉంటుంది. ఒకసారి దెబ్బతిన్నా మనపై మనం చేసే ఇనె్వస్ట్‌మెంట్ మనం మళ్లీ తలెత్తుకుని నిలుచోవడానికి చేయూత నిస్తుంది. ఏ వృత్తిలో ఉన్నా నిరంతరం మన సామర్థ్యాన్ని పెంచుకుం టూ ఉంటేనే పోటీ ప్రపంచంలో నిలబడతాం.


ఆత్మశుద్ధి లేని ఆలాపనలు

$
0
0

లోకంలో దైవదత్తంగా లభించిన సంగీత విద్య నభ్యసించిన కొందరు సంగీత విద్వాంసులు తమకు తాము చాలా గొప్పవారమనే స్వోత్కర్షతో బ్రతుకుతూ పటాటోపాన్ని ప్రదర్శిస్తూంటారు. అవతలి వారిలో వున్న కాస్త గొప్పతనాన్ని కొండంతలుగా చేసి, ఆ మహా విద్వాంసుల ముందు ‘మేమెంత’ అనే అణకువ భావంతో తమ గొప్పతనాన్ని కాసె్తైనా బయటకు ప్రదర్శించని మహా విద్వాంసులు బహు అరుదు.
ఈ కోవకు చెందిన వారికి సన్మానాల మీద గానీ, సత్కారాల మీద గానీ, మమకారం వుండదు. పైపెచ్చు వారికంటే తక్కువ స్థాయిలోని వారికి గండపెండేరాలు తొడిగి, ఏనుగు అంబారీ మీద ఊరేగించినా ఏ మాత్రం చలించరు. పైగా మనస్ఫూర్తిగా అభినందించటం కూడా కద్దు.
ఇంకొందరుంటారు. ఎంత గొప్ప వాడైనా ఇంకొందరుంటారు. ఎంత గొప్పవాడైనా తమ గోటికి తగనట్లుగా అపహాస్యం చేస్తూ అవహేళనగా మాట్లాడుతూంటారు.
మనలో ఈ ‘నేను’ అనే పొర తొలిగితే గానీ ‘యథార్థం’ బోధపడదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే గదా? మహా యోగులంతా చేసిన తపస్సు ‘ఈ ఇగోను జయించటానికే.’ ఈ మాయ ఒక్క సంగీతమే కాదు. ప్రతి రంగంలోనూ ఆవరించి ఉంది. సంగీతం ఒక ప్రవహించే నది. గంగా ప్రవాహం. అందులో ఎవరు మునిగినా పునీతులౌతూనే వుంటారు.
సంగీత మూర్తిత్రయం వారి కీర్తనలు ఎన్నో దశాబ్దాలుగా వింటూనే వున్నాం. ఆనందిస్తూనే ఉన్నా ఎప్పుడైనా విసుగనిపించిందా?
ఒక్కో రాగం ఒక్కొక్కరి గొంతులో ఒక్కోలా వినిపిస్తుంది. ఒక్కో రూపంలో కనిపిస్తుంది. అందరికీ ఆ ఏడు స్వరాలే దిక్కు. అయినా నిన్న విన్న సినిమా పాట మరుసటి రోజుకు పాతబడిపోతుంది. నేడు విన్న పాట రేపటికి మరుగున పడిపోతుంది. కానీ ఎన్నిసార్లు విన్నా ఎందరు పాడినా త్యాగరాజ కీర్తనలలోని నవ్యత్వం చెడదు. చెదరకుండటానికి ఏమిటి కారణం? ఆ కీర్తనను వెన్నంటి వున్న ఎప్పటికీ మాయని రాగం. నిత్య చైతన్యవంతమైన, శుద్ధమైన, పవిత్రమైన, జీవనది కాబట్టే. రాగాలు అనంతం, అరిగిపోవు. తరిగిపోవు. నిండుకోవు. సంప్రదాయ సంగీతంలోని మజా అదే మరి.
సంప్రదాయాన్ని ఆశ్రయించిన సంగీతం శాశ్వతం -కానిది ఎప్పుడూ అశాశ్వతమే. సినిమా సంగీతానికి బద్ధ శత్రువులు ‘బాగా సంగీత జ్ఞానం కలిగిన విద్వాంసులే.’
భావం ఎలా వుంటే ఫలితం అలా ఉంటుంది. స్వరాల సారం రాగం. అన్ని రాగాలకూ శ్రుతి మూలం. ఆ నారాయణుడు శ్రుతి సాగరుడు. శ్రుతిలో నుంచి రాగాలు, స్వరాలు ఏర్పడ్డాయి. భాష వికసించింది. కాల తత్త్వం నుండి ‘లయ’ పుట్టింది. ఈ దృష్టిలో గాయకులు పాడాలని త్యాగరాజు వాంఛించాడు. ఇప్పుడు అలా సంగీతం మనకు వినబడుతోందా? లయ ప్రధానమైనదే సంగీతమని వాదిస్తూ సునాదాన్ని సుదూరం చేసే మహానుభావులు గొంతులో గమకాలన్ని పలికించలేక, వారి తెలిసిన జ్ఞానంతోనే పాడుతూ అదే సంప్రదాయమని వితర్కించే విద్వాంసులున్నారు.
సంప్రదాయ సంగీతానికి గౌరవం తెస్తూ వారు పాడిన సంగీతం మనస్సులో కుదురుకుని స్థిరంగా వుండిపోయేలా గానం చేసే మహాజ్ఞాన సంపన్నులు వీరికి బద్ధ శత్రువులు.
ఎవరి దోవ వారిది. ఎవరి బాణీ వారిది. ఎవరికి వారే గొప్పగా పరిగణించుకుని దివ్యమైన సంగీతాన్ని విమర్శించి బ్రతికే అల్ప జ్ఞానులున్నారు. సంగీత లోకంలో ఇది సహజమేనేమో? ప్రతి యేడూ త్యాగరాజారాధనోత్సవాలు ఆయన పుట్టి పెరిగిన తిరువయ్యారులో ఎంతో ఘనంగా చేస్తారు. ఆడమగా మహా విద్వాంసులంతా ఎంతో డాబు దర్పాలొలికిస్తూ కూర్చుని చేతులతో తాళాలు వేస్తూ టీవీలో బాగా కనిపించాలని ఉవ్విళ్లూరుతూ పాడుతూంటారు. గమనించే వుంటారు. సంగీత జ్ఞానం బొత్తిగా లేని సామాన్య శ్రోతలకు తెలియదు. నిజానికి త్యాగరాజ కీర్తనలే కాదు ఏ కీర్తన పేరు చెప్పినా గమకాలన్నీ ఒక గాయకుడికీ, మరో గాయకుడికీ ఒకేలా ఒదగవు. కంఠాల్లో ఒకేలా పలకవు. అందులోని సంగతులన్నీ కలవకుండానే కలిసినట్లుగా భ్రమించి పాడటమే విశేషం. ఎంతో సాధన చేస్తే గానీ ఇద్దరు గాయకులు కలిసి పాడటం చాలా కష్టం. అలాంటిది మూకుమ్మడిగా కలిసి బృందగానంలా కలబడి పాడేసేవి కావని తెలిసినా ఈ త్యాగరాజ పంచరత్న కీర్తనలు - అలాగే పాడేయటం విశేషం.
పంచరత్నాలు చాలా ఉన్నాయి. కానీ ఈ పంచరత్నాలకు ప్రాముఖ్యత ఎక్కువ. ఈ ఐదు పంచరత్నాల్లో ఓ కీర్తనలో మానవ స్వభావాన్ని చక్కగా చిత్రీకరిస్తూ అవివేకులు, మందభాగ్యులు, కడుపే కైలాసంగా బ్రతికేవారు, రాజస తామస గుణాలతో వెర్రివేషాలేసే పది రకాల వారిని చల్లగా ఎండగట్టేశాడు త్యాగయ్య. దీనికి దుడుకు అనే మాటను తగిలించాడు. ఇతరులను విమర్శిస్తే వీధికెక్కుతారు. తట్టుకోగలరా? తెలివిగా ఆ దుడుకులన్నీ తనలోనే వున్నాయని అవన్నీ తనకే ఆపాదించుకుని పాడుకున్నాడు. అజ్ఞానం, భక్తి లేకుండా పాడటం, పర ధనకాంక్ష, సుఖ లాలసత్వం, కాంతాసక్తి, ఈ షణత్రయం, మొదలైనవన్నీ దుడుకులుగా పేర్కొన్నాడు. అంతేకాదు. లోకంలో కొందరు గాయకులు చేసే అవకతవక పనుల్ని బాహాటంగా ముఖం బద్దలు కొట్టి మరీ చెప్పాడు.
మాటల్లోనే వైరాగ్యం కనిపిస్తుంది. కానీ చేతల్లో వుండదన్నాడు.
క్షుద్రులన్నాడు. అంతేనా? తమ నాద విద్యచేత ఆకర్షింపబడే స్ర్తిలను వశం చేసుకోవడానికి తహతహలాడే మహా గాయకుల్ని ఉతికి ఆరేశాడు.
ఉత్తమ గాయకుల్ని చేస్తామని భ్రమపెట్టి సర్వం దోచుకునే సన్నాసుల్ని వదల్లేదు. సంగీతం పేరు చెప్పి ఆత్మవికాసం లేని అటువంటి వాళ్లను శిలాత్ములన్నాడు. ఎందరో మహానుభావుల్ని కీర్తించాడు. శుద్ధమైన మనసుచే సుస్వరంతో పద్దు తప్పక భజించే భక్తులను పాలించే త్యాగరాజ నుతుడిని నెత్తిన పెట్టుకుని పూజించాడు. గాయకులు తన కీర్తనల్లో మనకు చీవాట్లు పెట్తున్న సంగతి పెద్దగా పట్టించుకోకుండా దృష్టి సంగీతం మీద పెట్టి, అసలు విషయాన్ని దాటవేసి, గానం చేస్తారనిపించటం సహజం. నిజం కూడా.
ఒక నాణానికి బొమ్మా బొరుసూ రెండూ వుంటాయి.
సంసారం అనే మాటకు తమిళంలో ‘్భర్య’ అనే అర్థం ఉంది. కొడుకులుండి, కూతుళ్లు లేకపోతే అదో విచారం. కేవలం కూతుళ్లే వున్నా కొరతే. అలా అలా సంసారం పెరుగుతూ పోతుంది. సంసారానికి డబ్బు కావాలి. ఎంత కావాలంటే దీనికి జవాబు ఎవరి దగ్గరా వుండదు.
‘చాలు’ అనే వాడీ లోకంలో ఎవరూ ఉండరు. ఏదో కూడబెట్టామనుకుంటే దాన్ని కాపాడటం మరో సమస్య. మిగిలేది ఏతావతా దుఃఖం ఒక్కటే. రోజులు గడవాలి. దారీతెన్నూ కనిపించదు. త్యాగరాజు మాత్రం నిరాశావాది కాదు. సంసారంలో వుంటూనే సాధించాడు. అన్ని దుడుకుల నివారణకూ మార్గం భక్తి ఒక్కటే. అదే చక్కని రాజమార్గం’ అన్నాడు.

పజిల్-713

$
0
0

అడ్డం

ఆధారాలు

1.శత్రురాజులు దండెత్తి బద్దలు కొట్టేది దీనినే! దుర్గద్వారము (5)
4.మారుతో వున్న గాలి (4)
6.లేడి (3)
8.మక్కా తర్వాత రెండో స్థానంలోని ముస్లిం పుణ్యక్షేత్రం (3)
9.వినాయకుడు, అనుకూలుడు (4)
11.డబ్బు, సంపద (2)
12.దోసెలు కాల్చేది దీని మీదే (3)
14.ఎలా అయినా సంతోషమే! (3)
17.గుండీ దూరు రంధ్రము 92)
18.పెద్ద చీమ (4)
20.యుద్ధం! ఇక ముందూ
వెనకా కనం (3)
21.మోసము (3)
23.ఈ బాలాజీ ‘వీసా’ల దేవుడని ప్రసిద్ధి చెందాడు (4)
24.విరామము, సెలవు (5)

నిలువు

ఆధారాలు

2.‘టక్కు’ ...‘విద్య’ లంటారు. ఆ రెండో విద్య (4)
3.బోయవాడు, పిసినారి (4)
4.పరిణామం (2)
5.మాతృ ఆశీర్వాదం (5)
7.వాసన (3)
9.పూవు (3)
10.గిట్ట (3)
12.దొడ్డి (3)
13.ఎదురుతిరిగిన మనస్సు (3)
15.మెరుపులు (5)
16.ఈ రాష్ట్రంలో జాబు ఇట్టే దొరికిపోతుందా! (3)
18.జంట నగరాలకి మంచి నీరు అందించే జలాశయాల్లో ఒకటి (4)
19.కొన్ని ప్రాంతాల్లో నారింజ, బత్తాయి పండును ఇలా అంటారు (4)
22.ఇది నష్టం లాభం ‘పొందు’ (2)

నేను.. ఆత్మ ప్రబోధాన్ని...

$
0
0

నేను అమాత్రను
ఏ కాలమానాలు లేనివాడ్ని
నేను విరాగిని
ఏ కొలమానాలు లేనివాడ్ని.
నేను గికాన్ని
ఖగోళ చైతన్యాన్ని
నేన యోగిని
పురుష ప్రకృతుల ప్రజ్ఞను.
* * *
నేను-
దేహంలో ఒక వాహనాన్ని మనసులో ఒక వాహనాన్ని. ఈ దేహాన్ని, మనసును ఉపయోగించి నడిపేదీ వాహనమే. రెండు చక్రాలదయినా, మూడు చక్రాలదయినా, నాలుగు చక్రాలదయినా ఆ వాహన వేగాన్ని కొలిచేది గంటకు కిలోమీటర్లు లేదా మైళ్ల లెక్కన. అలాగే మన మనస్సుగా చెప్పుకునే బ్రెయిన్‌వేవ్స్ స్పీడ్‌ను హెర్జ్ సైకిల్స్‌గా క్షణాలలో కొలుస్తాం.
మన మైండ్ గామా - బీటా - అల్ఫా - తేటా - డెల్టా అంటూ అయిదు రకాల స్థితులలో పని చేస్తుంటుంది. బ్రెయిన్ వేవ్స్ స్పీడ్‌ను బట్టి ఈ స్టేట్స్‌ను నిర్ధారించటం జరిగింది. గరిష్ఠంగా ఆలోచనా తరంగాలు ఉండేది గామా స్టేట్‌లో అయితే కనిష్ఠంగా డెల్టా స్టేట్‌లో.
గామా బ్రెయిన్ వేవ్స్ వేగం - 40 అంతకంటే అధిక హెర్జ్‌లు
బీటా బ్రెయిన్ వేవ్స్ వేగం - 40 నుండి 14 హెర్జ్‌ల వరకు
అల్ఫా బ్రెయిన్ వేవ్స్ వేగం - 14 నుండి 7.5 హెర్జ్‌ల వరకు
తేటా బ్రెయిన్ వేవ్స్ వేగం - 7.5 నుండి 4 హెర్జ్‌ల వరకు
డెల్టా బ్రెయిన్ వేవ్స్ వేగం - 4 నుండి 0.5 హెర్జ్‌ల వరకు
హయ్యర్ బ్రెయిన్ వేవ్స్ వేగం - 0.5 హెర్జ్ అంతకంటే తక్కువ
ఇఇజి సెన్సార్స్ యంత్రం గామా నుండి డెల్టా వరకు బ్రెయిన్ వేవ్స్ స్పీడ్‌ను చూపగలుగుతుందే కానీ, 0.5 కంటే తక్కువ బ్రెయిన్ వేవ్స్ స్పీడ్‌ను చూడలేదు.. అంటే మానవ మేథతో తయారైన యంత్రం చూపలేనిదంతా హయ్యర్ బ్రెయిన్ అవుతోంది. విజ్ఞానశాస్త్ర పరిధిలో ఈ హయ్యర్ బ్రెయిన్‌కు కొలమానం సాధ్యం కావడం లేదు.
హయ్యర్ బ్రెయిన్ ప్రజ్ఞానాన్ని అధిక శాతం యోగి పుంగవులలోనే చూడగలం. కొందరు శాస్తజ్ఞ్రుల పరిశోధనా ఫలితాలు కూడా ఆ శాస్తజ్ఞ్రుల హయ్యర్ బ్రెయిన్ విజ్ఞానకోశమే! గికంగా ‘ప్రాణం పోకడ - ప్రాణం రాకడ’లన పర్యవేక్షించగల సమర్థత ఈ ‘ఇన్‌ఫ్రా -లో ‘స్టేట్’లోనే సాధ్యవౌతుంది. గికంగా ప్రాణా ట్రీట్ సాధ్యవయ్యేది ఈ స్థితిలో నిలకడైన బ్రెయిన్ వేవ్స్ వల్లనే. సంకల్ప సంపూర్ణ సాఫల్య స్థితి ఇది.
* * *
డెల్టా బ్రెయిన్ వేవ్స్ ఫోర్స్ నిద్రాస్థితిలోని ఆలోచనా తరంగాల వేగం వంటిదే! దాదాపుగా ఆలోచనలు లేని స్థితి... ఒకటి రెండు ఉన్నా ఆలోచన సాంద్రత తక్కువ. అర నుండి నాలుగు హెర్జ్‌ల ఆలోచనా తరంగాలను డెల్టా వేవ్స్ అవుతుంటాయి. గామా బ్రెయిన్ వేవ్స్‌లో పోల్చితే డెల్టా వేవ్స్ శాతం మూడు నాలుగు మాత్రమే. ఈ తరంగాల ఫోర్స్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ తరంగాలు పెద్దవిగా ఉంటాయి. అంటే నిడివి ఆలోచనలన్నమాట. సులభంగా చెప్పుకోవాలంటే, సంగీతంలో డ్రమ్ బీట్ ఎంత బలంగా శబ్దిస్తుందో అంతే బలంగా ఈ డెల్టా బ్రెయిన్ వేవ్ తాకిడీ ఉంటుంది. ఇంతటి తాకిడి తీవ్ర యోగ సాధనలో, ధ్యానమగ్నతలోనే సాధ్యం.
నిద్రిస్తున్నట్లు, స్పృహ లేనట్లు అనిపించే సమాధి స్థితి ఇది. ఈ స్థితిలో బాహ్య స్పృహ దాదాపుగా ఉండదు. దేహం ఇక్కడే ఉన్నప్పటికీ ఆ దైహిక మనస్సు శూన్యమవుతుంది. యోగి పుంగవులు విశ్వ ప్రేమికులు, ప్రేమస్వరూపులు కావటానికి నేపథ్యం ఇదే! యోగ చికిత్సలు సాధ్యమయ్యేది ప్రేమ స్వభావంతో ఉత్పన్నమయ్యే సంకల్ప బలం వల్లనే. గికంగా అయోనిజ (రిజనరేషన్) ప్రయోగాలు సిద్ధించేది ఈ స్థితిలోనే.
యాస్ట్రల్ స్టేట్ చేరుకున్న వారిలో ఈ డెల్టా వేవ్స్ ఫోర్స్‌ను చూడగలం. యోగా ట్రీట్‌మెంట్స్‌కు కావలసిన యాస్ట్రల్ స్టేట్ లభ్యమయ్యేది ఈ డెల్టా వేవ్స్ స్థిరపడటం వల్లనే. ఆయుర్దాయం పెరిగేది డెల్టా వేవ్స్ ఫోర్స్ వల్లనే.
మొత్తానికి, డెల్టా బ్రెయిన్‌వేవ్ స్టేట్ యోగ పరిభాషలో ‘సమాధి’ స్థితికి చెందింది గాను, శాస్ర్తియంగా ఈ స్థితిని ‘స్లోవేవ్ స్లీప్ స్టేట్’గాను, ఎన్‌ఆర్‌ఇఎం స్లీప్ స్టేట్ మూడవ దశగాను చెప్పుకుంటున్నాం. ఈ డెల్టా బ్రెయిన్ వేవ్‌నే ‘హై ఆంప్లిట్యూడ్ బ్రెయిన్‌వేవ్’ అనీ అంటుంటాం.
* * *
సామాన్యంగా, పురుషులలో కంటే స్ర్తిలలో డెల్టా వేవ్ ఫోర్స్ తీవ్రంగా ఉంటుంది. అంటే, ఆలోచనలు లిమిట్‌గా ఉంటాయి. ఈ లిమిటెడ్ థాట్స్ వల్ల వారు సులభంగా యోగ సిద్ధిని పొందగలరు. వచ్చిన చిక్కు, త్వరగా యోగపరంగా మహిళలు ఆకర్షితులు కారు. అయితే మహిళలు యోగ మార్గంలోకి ప్రవేశించగలిగితే, అతి శీఘ్ర కాలంలోనే నిలదొక్కుకోగలరు. యోగ సిద్ధిని పొందనూగలరు. అందుకే మాస్టర్ సి.వి.వి. యోగ స్థానంలో స్ర్తిలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు.
భార్యాభర్తలిద్దరూ కలిసి యోగం చేసుకోగలిగితే సంపూర్ణ సిద్ధత్వం అన్నది ఇందుకొరకే! సంసారంలో సంయోగం అంటే భార్యాభర్తలిద్దరూ యోగ సాధనలో ‘హాఫ్ కప్ - హాఫ్ కప్’గా సమభాగస్వామ్యం వహించటమే. మాస్టర్ యోగంలో ‘సంపూర్ణత’ అంటే ఈ రెండు హాఫ్‌లు ‘్ఫల్’గా ‘ఏకం’ కావటమే!
సృష్టికి ప్రతిసృష్టి సాధ్యమయ్యేది ఈ ఏకత్వంలోనే! భార్యాభర్తల డెల్టా వేవ్స్ సంయోగించటమే ఈథరల్ రిజనరేషన్. ఈ స్థితిలో సాధ్యమయ్యే పునరుత్పత్తే సృష్టి క్రమంలో తారసపడే ‘అయోనిజ’ సృష్టి. మనకు తెలిసి మాస్టర్ సి.వి.వి. తనయుడు ‘చందూ’ ఇటువంటి సృష్టే. మహాత్మా జీసస్‌ది కూడా ఇటువంటి సృష్టే.
ఇంకొక రహస్యం - వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో డెల్టా వేవ్స్ ప్రాతినిధ్యం పెరుగుతుంటుంది. మనసు పరుగులు పెట్టటం మానుతుంది. పద్ధతిగా కుదురుకోవటం జరుగుతుంది. అందుకే, వయసు పైబడుతున్న కొద్దీ స్ర్తిలలో యోగ వికాసం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. మహిళల్లో కనిపించే ఇంతటి ‘డెడికేటెడ్‌నెస్’ పురుషుల్లో కొరవడుతున్నట్లుంటుంది. కారణం - అతి త్వరగా ఏదో అయిపోవాలన్న తపన. ఏదో సాధించేయాలన్న ఆతృత. అయితే, పురుషులు అతి పిన్న వయసులోనే యోగ సాధనా మగ్నమవుతుంటే స్ర్తిలు మూడు పదులు దాటితే కానీ యోగంలో కుదురుకోరు. అయినా, ఈ గాప్ వయసు పైబడుతున్న కొద్దీ స్ర్తిలలో కవర్ అవుతుంటుంది. అంతెందుకు, పురుషులు యోగం విషయంలో కాస్తయినా చెదిరే అవకాశముంది. కానీ, స్ర్తిలలో ఒకసారి ఆక్సెప్ట్ చేసిన తర్వాత మనసు మార్చుకునే అవకాశం సామాన్యంగా ఉండదు.
* * *
డెల్టా వేవ్స్ వల్ల గికంగా ఇంతటి సంసిద్ధి, పునర్వికాసం, సంపూర్ణత్వం సాధ్యవైంది. ‘పిట్యుటరీ’కి ‘మహా ప్రాణశక్తి’ మిక్కుటంగా అందటం వల్లనే. పిట్యుటరీకి చేరే మహా ప్రాణ స్పందనల వల్లే గ్రోత్ హార్మోన్స్ విడుదలవుతూ కణ వ్యవస్థ ఆరోగ్యవంత మవుతుంటుంది. కణ ఆయుర్దాయం పెరుగుతూ మానవ ఆయుర్దాయమూ పెరుగుతుంటుంది.
డెల్టా వేవ్స్ ప్రభావం వల్ల సమాధి స్థితి అనేది యోగ నిద్రలా అనిపించినా అది నిత్య చైతన్య స్థితి. నిద్రా స్థితిలో అయినా, యోగావస్థలో అయినా చైతన్య గాఢత అనేది డిస్టర్బెన్స్‌గా మనసు గ్రహించనంత వరకు అది డిసరప్షన్ కాదు. డిసార్డర్ కానేరదు. అందుకే యోగులు నిద్రను యోగ నిద్ర అంటుంటే, విజ్ఞాన ప్రపంచం డెల్టా స్లీప్ అంటుంటుంది. ఇదే గికంగా చెప్పుకునే ‘జాగృత్ సషుప్తి’ ‘తురీయ’ స్థితి. ఈ కారణంగానే డెల్టా బ్రెయిన్ వేవ్స్‌ను ‘మిస్టీరియస్ బ్రెయిన్ వేవ్స్’ అనీ అంటుంటాం.
* ‘మిస్టీరియస్’ అనటానికి కారణం - మనం చైతన్యావస్థలోనే ఉంటున్నప్పటికీ ఆ స్థితిని మాటల్లో వ్యక్తీకరించలేక పోవటం వల్ల.
* మనస్సు శూన్యమయ్యే స్థితి - దాదాపుగా ఆలోచనల తాకిడి లేని స్థితి. ఒక విధంగా బ్రెయిన్ డెడ్‌లా అనిపించే స్థితి.
* విశ్వమూలాలకు అతీత మానసమయ్యే స్థితి. ప్రజ్ఞానం మనలో నెలకొనే స్థితి. దీనే్న ‘ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్’ అనీ అంటుంటాం.
* మాతృ గర్భం నుండి విడివడటానికి పూర్వం, అంటే ప్రసవ పూర్వ దశలో గర్భస్థ శిశువులో ‘ఈ డెల్టా వేవ్స్’ శక్తివంతంగా ఉంటాయి.
* మూడు నెలల నుండి ఏడాది వరకు శిశువు డెల్టా వేవ్స్ బలంగా కొనసాగుతాయి.
* మృత్యువుకు పూర్వ స్థితిలోను అంటే అంత్య దశలోను ఈ డెల్టావేవ్స్ శిశు బ్రెయిన్ వేవ్స్‌ను పోలి ఉంటాయి.
* ధ్యాన స్థితిలో డెల్టా వేవ్స్ ఫోర్స్ బాగా ఉన్నప్పటికీ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటుంటాయి. ఈ కారణంగానే ధ్యానం బాగా కుదరటం, కుదరకపోవటం అన్న వ్యక్తీకరణలు మన నుండి వస్తుంటాయి.
* డెల్టా వేవ్స్ ఫోర్స్ వల్ల ధ్యాన స్థితిలో దృశ్యమానమైనదేదీ జ్ఞాపకాలుగా కానీ, స్మృతిలో కానీ మిగలవు. అంటే, తురీయ స్థితిలోని అనుభవాలను మనసు రికార్డ్ చేయలేదు. అవి యోగానుభవాలుగా మిగులుతాయే తప్ప అక్షర ప్రపంచంలోకి యథాతథంగా రావు.
* డెల్టా వేవ్స్ మనల్ని అధిభౌతిక జగత్తులో నిలుపుతాయి.

మిణుగురులు

$
0
0

తనను తాను
చూసుకుంటూ
మురిసిపోతోంది
చెరువు పక్కనే వున్న
తరువు.

* కెరటానికెంతిష్టమో
తీరమంటే...
అడుగు వేయనీయదు
గీత గీయనీయదు.

* కెరటానికెప్పుడూ
తొందరే...
తీరంపై రాసినదేదీ
తనివితీరా
చూసుకోనివ్వదు.

* నదిలో నావ ననె్నత్తుకుంది
నాన్నలా...
అనుభూతుల ముద్దలు
తినిపించింది
అమ్మలా...

* అలలు జోకొడుతుంటే
హాయిగా నిద్రపోతోంది
నదీ ఒడ్డున
నావ.

* చేపలకేనా!
పిల్లకారుకూ నేర్పింది
ఈత కొట్టడం...
మా ఊరి చెరువు.

* కొమ్మల మాటున
నిండు చందమామ...
నేలపై!
వెలుగు పూలు

* పున్నమి చంద్రుడి
ద్విపాత్రాభినయం
నింగిలో
నీటి బావిలో.

మొదటికే మోసం( కథ)

$
0
0

గంగయ్య, రంగమ్మ భార్యాభర్తలు. గంగయ్య కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. రంగమ్మ మాత్రం ఇంటి పనులు చేసేది. ఇతరుల ఇంటి విషయాలు తెలుసుకోవాలంటే ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఇరుగు పొరుగున ఉన్న దంపతులు తగాదా పడినా, మాట్లాడుకుంటున్నా కిటికీ మాటున నక్కి వారి మాటలను రహస్యంగా వినేది. అలా వినే సమయంలో భర్తను కూడా పట్టించుకునేది కాదు. తాను పొరుగువారి ఇంటి విషయాలు విని పూర్తిగా తెలుసుకున్న తరువాతే భర్తను పట్టించుకునేది.
‘రంగమ్మా! ఇలా కిటికీల పక్కన నక్కి ప్రక్కవారి ఇంటి విషయాలు రహస్యంగా తెలుసుకోవాలనుకోవడం మంచి లక్షణం కాదు. ఈ పని మానుకో’ అని గంగయ్య ఎంత వారించినా రంగమ్మ పట్టించుకునేది కాదు.
‘నా ఇష్టం. నీకొచ్చిన నష్టం ఏమిటంట?’ అని ఎదురుప్రశ్న వేసేది.
విసిగి వేసారిన గంగయ్య భార్యతో వితండ వాదం చేయడం ఇష్టంలేక ఇరుగు పొరుగు వారి విషయాలు పట్టించుకోకు అని చెప్పడం కూడా మానేశాడు. దీంతో రంగమ్మ తెగ రెచ్చిపోయి ప్రతి ఇంటి విషయాలు తెలుసుకుని ఈ ఇంటి విషయాలు ఆ ఇంటి వారికి, ఆ ఇంటి విషయాలు ఈ ఇంటి వారికి చేరవేసి తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్న చందాన తగాదాలు పెట్టి ఆనందించేది.
ఒకరోజు రంగమ్మ ఒక ఇంటి కిటికీ చాటున నక్కి ఆ దంపతుల మాటలు వినసాగింది. ఆ ఇంటి పక్కనే ఒక చెట్టుకు అతి పెద్ద తేనె తుట్టె ఉంది. పక్కనే ఉన్న మైదానంలో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. కాకతాళీయంగా ఆ బంతి వచ్చి తేనె పట్టుకు తగలడంతో తేనెటీగలన్నీ ఝుమ్మని విజృంభించి సమీపాన ఉన్న రంగమ్మను చుట్టుముట్టాయి. కొన్ని తేనెటీగలు రంగమ్మ చెవిలోకి వెల్లి కర్ణ్భేరిని కుట్టేశాయి అప్పుడే భోజనానికి వచ్చిన గంగయ్యకు ఈ విషయం తెలిసి వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లాడు. డాక్టర్ వైద్యం చేసినప్పటికీ ఉపశమనమైతే కలిగింది కానీ రంగమ్మకు వినికిడి లోపం ఏర్పడింది. ఆ రోజు నుండి రంగమ్మకు చాటుమాటు మాటలే కాదు నేరుగా మాట్లాడిన మాటలు సైతం వినిపించడంలేదు. భర్త ఎంత వారించినా అతని మాటలు పెడచెవిన పెట్టినందుకు మొదటికే మోసం వచ్చి వినికిడి లోపంతో శిక్ష అనుభవించవలసి వచ్చిందని రంగమ్మ కుమిలిపోయింది. నాటి నుండి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చేతనైతే ఇరుగు పొరుగు వారికి తనకు చేతనైన మేలు చేయసాగింది. భార్యలో వచ్చిన ఈ మార్పునకు గంగయ్య సంతోషించాడు. కొంతకాలానికి విదేశాల నుండి ఒక వైద్యుడు వచ్చాడని తెలిసి, రంగమ్మను అతడి వద్దకు తీసుకుని వెళ్లాడు గంగయ్య. వైద్యుడి ప్రయత్నాలు సఫలం కావడంతో ఒక చిన్న పరికరం ద్వారా రంగమ్మ వినగలిగేలా చేశాడు. ఆ పరికరం సాయంతో రంగమ్మకు ఇప్పుడు అందరి మాటలూ వినిపిస్తున్నాయి. పరికరం సాయంతో వినికిడి లోపం దూరమైనప్పటికీ రంగమ్మ ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ రోజు నుండి ఇరుగు పొరుగు వారి మాటలు రహస్యంగా వినడం మానేసింది. తన కుటుంబ విషయాలు చూసుకుంటూ ఇతరులకు చేతనైన సాయం చేస్తూ హాయిగా జీవించింది.

పాతాళ స్వర్గం ( కొత్త సీరియల్ ప్రారంభం)

$
0
0

అర్ధరాత్రి కావస్తోంది.
నగరమంతా దాదాపు నిద్రావస్థలో ఉంది. మెయిన్ రోడ్లన్నీ దీపకాంతులతో వెలుగులు నిండి వున్నా, సి.ఎం. గారింటి పరిసరాలు మరీ పట్టపగల్లా వెలిగిపోతున్నాయి. విశాలమైన భవంతి. మెయిన్ గేటు కిరుపక్కలా వున్న సెక్యూరిటీ గార్డ్స్ గన్స్‌తో, రాతిబొమ్మల్లా స్టడీగా నిల్చున్నా డేగ కళ్లతో పరిసరాలను పరికిస్తున్నారు. భవంతి చుట్టూ వున్న మహావృక్షాలు, కోట గోడల్లావున్న కాంపౌండ్ వాల్‌ని ముద్దాడుతున్నట్టు తలలూపుతున్నాయి.
ఆ రోజు సి.ఎం. చంద్ర పెందళాడే బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు. ఆఫీస్ రూమ్‌లో అతని పి.ఎ. ప్రభు మాత్రం సీరియస్‌గా ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు.
అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ఫోన్ రింగయింది. తృళ్లిపడిన ప్రభు ఓసారి వాచ్ చూసుకున్నాడు. పనె్నండు దాటి పది నిమిషాలయింది. రిసీవర్ తీసి,
‘హలో!’ అన్నాడు మెల్లగా.
‘హలో! సి.ఎం గారున్నారా?’ అవతల్నించి ఓ ఆడగొంతు ఆదుర్దాగా అడిగింది.
‘ఆయన పడుకున్నారు. నేనాయన పి.ఏ.ని. చెప్పండి మీరెవరు?’ అన్నాడతను ఏదో ఆలోచిస్తూ.
‘నేనెవరన్నది ముఖ్యం కాదు. నేను అర్జంట్‌గా ఓ ముఖ్య విషయం ఆయనకే చెప్పాలి. ప్లీజ్.. చాలా ముఖ్య విషయం’ అందామె ఒకలాంటి ఉద్వేగంగా.
‘సారీ.. ఆయన నిద్రపోతున్నారు. విషయం నాతో చెప్పండి. మీరన్నట్టు అది ముఖ్య విషయమే అయితే ఇప్పుడే చెప్తాను’ అన్నాడు ప్రభు నిర్మొహమాటంగా.
ఆమెలో సహనం చచ్చిపోయింది.
‘ఏవిటండీ మీరు చెప్పేది? ఇంతకు ముందు కానిస్టేబుల్ దగ్గర్నుంచి డిజిపి దాకా చెప్పాను. కానీ ఎవరూ నా మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. చాలా రోజుల తర్వాత, పెద్ద దారుణం జరగబోతోందని స్వయంగా సి.ఎం. గారికి చెప్పాలని రిస్క్ తీసుకున్నాను. కానీ మీరూ పాత పాటే పాడుతున్నారు. ఇలా అయితే తర్వాత మీరు చాలా బాధ పడాల్సి వస్తుంది’ అంది చిరాగ్గా.
అయినా అతను సి.ఎం.ని నిద్ర లేపడానికి ఒప్పుకోలేదు. ఆమెకి మరింత చిరాకొచ్చేసింది. అప్పుడే చంద్ర వచ్చి, ప్రభుకి సైగ చేసి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్‌లో ఎలాంటి శబ్దం లేకపోవడంతో ఆ స్ర్తికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
‘్ఛ! సి.ఎం.గారు యువకుడు, కార్యదక్షత కలవాడు, అపర చాణక్యుడు. ఏం చేసినా ముందు చూపుతో చేస్తాడనీ, ప్రజలకు అందుబాటులో ఉంటాడనీ, తన పదవికి న్యాయం చేస్తాడనీ అనుకున్నాను. కానీ అదంతా నా భ్రమ అని ఇప్పుడు తెలిసింది. ఓ సామాన్య స్ర్తి అర్ధరాత్రి ఎంతో రిస్క్ తీసుకుని చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా రిసీవ్ చేసుకోలేని మూర్ఖుడని అర్థమయింది. ఓకే! రేపు తెల్లారాక, జరిగిన దారుణాన్ని పేపర్లలోని వార్తల్ని చూసి, లబోదిబో అని తలలు బాదుకోండి’ అంటూ ఫోన్ పెట్టేసింది.
చంద్ర మొహం గంభీరంగా మారింది. రిసీవర్ పెట్టేసి ప్రభుకేసి చూశాడు. ప్రభు ఆమె మాటలన్నీ చెప్పాడు. చంద్ర కళ్లు చిత్రంగా ముడుచుకున్నాయి.
‘మీరేం వర్రీ అవకండి సార్! ఇలాంటి ఫోన్‌కాల్స్ మనకి కొత్తేం కాదు. కొందరికి ఇలా ఫోన్లు చేసి కంగారు పెట్టడం సరదా’ నవ్వాడు ప్రభు. అయితే చంద్ర నవ్వలేదు.
‘లేదు ప్రభూ! అసలు తనేం చెప్పబోయిందో వింటే బావుండేది’ అన్నాడు.
‘మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యడం...’
‘అంతకు ముందు పోలీసు డిపార్ట్‌మెంట్‌కి కూడా ఏదో చెప్పానంది కదూ?’ అతని మాటలు పూర్తి కాకుండానే అన్నాడు చంద్ర. ‘ఎస్సార్’
‘అయితే ఓసారి డిజిపి కి ఫోన్ చేసి కనుక్కో’
‘ఓకే సర్! మీరెళ్లి పడుకోండి’ అన్నాడు ప్రభు.
చంద్ర లేచాడు. అప్పుడే మళ్లీ ఫోన్ మోగింది. గభాల్న రిసీవర్ తీసి ‘హలో’ అన్నాడు ప్రభు, ఒకలాంటి ఉద్వేగంగా.
అతననుకున్నట్టు ఫోన్ చేసింది ఇందాకటి స్ర్తియే.
‘జరగాల్సిన దారుణం జరిగిపోయింది. మీ సి.ఎం.ని హాయిగా నిద్రపోనీయండి. పొద్దున లేచాక ఇద్దరూ నెత్తిన చెంగేసుకుని ఏడుస్తూ కూర్చోండి.’ ఆవేశం, ఆవేదనా సమపాళ్లలో వున్నాయామె గొంతులో.
‘హలో! అసలేం జరిగింది?’ ఆమె మాట్లాడిన తీరుకి మనసులో మండిపడినా, పైకి సరళంగానే అడిగాడు ప్రభు. ఆమె చెప్పేలోపలే రిసీవర్ లాక్కున్నట్టు తీసుకున్నాడు చంద్ర.
‘ఏం జరిగిందా? సింగపడవి దగ్గరి అమ్మవారి గుళ్లోని అమూల్యాభరణాలన్నీ మాయమై పోయాయి’ అందామె కఠినంగా.
‘వ్వాట్?’ అరిచినట్టు అన్నాడు చంద్ర.
‘ఎవరు మాట్లాడేది?’ అందామె అనుమానంగా.
‘సి.ఎం. చంద్రని. మీరేమన్నారు?’ ఆతృతగా అన్నాడు చంద్ర.
‘అర్థం కాలేదా? సింగపడవి దగ్గర గుళ్లో అమ్మవారి అత్యంత విలువగల జహ్వరీ అంతా దొంగల పాలయింది. ఇలా జరుగుతుందని ఆర్నెల్ల క్రితమే నాకు తెలిసింది. అందుకే పిచ్చిదానిలా ఆ విషయాన్ని గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ ఏం లాభం? మీలాగే మీ సిబ్బంది కూడా నిద్రపోతున్నారు. నిద్రమత్తు వదిలి ఓసారి వెళ్లి చూసుకోండి. లేకపోతే తీరిగ్గా నిద్ర లేచాక వెళ్లి చూసుకోండి’ ఆవేశంగా అందామె.
‘మీరెవరు? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు?’ నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు చంద్ర.
‘ఎందుకు? ఆ దొంగతనానికీ, నాకూ సంబంధం అంటగట్టి నా వెంటపడ్డానికా?’ చిరాగ్గా అందామె.
‘ప్లీజ్! ఆవేశపడకుండా విషయం క్లియర్‌గా చెప్పండి’ అన్నాడు చంద్ర.
‘ఇంకా ఏం చెప్పను సర్? ఇప్పటికి చాలామందికి చెప్పాను. ఏ ఒక్కరూ... కనీసం ఇంతకు ముందు నా మాట విన్నా ఈ దారుణం జరిగేది కాదు!’
‘మీరెక్కణ్నించి మాట్లాడుతున్నారు?’ అసహనంగా అడిగాడు చంద్ర.
‘వల్లకాట్లోనించి!’ కసిగా అందిమె.
చంద్రకి పిచ్చి కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు.
‘జరిగిందేదో జరిగిపోయింది. ప్లీజ్! మాకు కాస్త కోపరేట్ చెయ్యండి. మీపేరేవిటి?’ అన్నాడు అనునయంగా.
‘ఇప్పుడదంత ముఖ్యం కాదు. నేనొక స్ర్తిని. దేశ ప్రగతే నా ప్రగతి అనుకునే పిచ్చిదాన్ని. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై పోయింది. ఇప్పటికైనా కళ్లు తెరచి తగిన చర్యలు తీసుకోండి. కనీసం దోషుల ఛాయలైనా దొరకొచ్చు’ అంటూ రిసీవర్ పెట్టేసిందామె.
‘మైగాడ్’ అంటూ కూలబడిపోయాడు చంద్ర.
కంగారుగా చూస్తున్న ప్రభుతో ‘హోమ్ మినిస్టర్‌కి కనెక్షనివ్వు’ అన్నాడు గంభీరంగా.
మారు మాట్లాడకుండా ప్రభు ఫోన్ చేస్తుంటే అసహనంగా చూస్తున్నాడు చంద్ర. క్షణాల్లో లైన్‌లోకొచ్చాడు హోమ్ మినిస్టర్.
విషయం చెప్పి ‘దీన్ని గురించి మీకేమైనా తెలుసా?’ అన్నాడు చంద్ర ఆతృతగా. అతను తేలిగ్గా నవ్వేశాడు.
‘అదంతా డ్రామా సర్! ఇలాంటి ఫోన్స్ వస్తూనే ఉంటాయి. వీటిని ఆధారంగా తీసుకుని కంగారుగా పరిగెత్తుకెళ్లిన మా వాళ్లు ఫూల్స్‌లా తిరిగి రావడం చాలాసార్లు జరిగింది’ అన్నాడు నవ్వుతూనే.
‘అలా కాదు. మీరోసారి డిజిపిని కనుక్కోండి’
‘ఓకే సర్. ఇప్పుడే కనుక్కుంటాను’ అంటూ డిజిపికి ఫోన్ చేశాడు హోమ్ మినిస్టర్.
‘ఆఁ! ఆ మధ్య ఎవరో ఒకామె అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆ గుడిని గురించి, నగల గురించి చెప్పింది. దాన్నంతగా పట్టించుకోలేదు. అయినా ఆ గుడికి బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉంది. అక్కడికి దొంగలు రావడం ఇంపాజిబుల్. మీరు నిశ్చింతగా వుండండి’ అన్నాడు డిజిపి.
అతని మాటలన్నీ తు.చ తప్పకుండా సిఎంకి చెప్పాడు హోమ్ మినిస్టర్.
‘నో! అలా కాదు. వెంటనే బయల్దేరా గుడి పరిసరాలు చూసి రమ్మనండి’ స్థిర స్వరంతో అన్నాడు చంద్ర.
‘ఎస్సార్’ అని పోలీసు బలగాన్ని క్షణాల్లో సిద్ధం చేశాడు హోమ్ మినిస్టర్.
అరగంట గడిచిందో లేదో ఓ దారుణమైన వార్త గుప్పుమంది. సింగపడవిలోని గుడిలో భారీ దొంగతనం జరిగింది. పోలీసు బృందానికే కాక పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాలతో కిటకిట లాడిపోతోందా ప్రాంతమంతా.
సింగపడవి చాలా పెద్దది. అడవి మొదట్లోనే వున్న పెద్ద కొండ మీద అమ్మవారు వెలసింది. దైవభక్తి గల జమీందార్లు, ధనికులు కలిసి బ్రహ్మాండమైన ఆలయం, దానికి తగ్గ హంగులు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలువైన వజ్రాలని తెప్పించి దైవాలను అలంకరించారు. ఇది ఏనాడో జరిగినా ఇప్పటికీ దాని వైభవం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు ఆ కొండ చుక్కల పర్వతంలా వెలిగిపోతూండేది.
(ఇంకా ఉంది)

పరీక్షల ఫలితాలే కీలకమా?

$
0
0

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా పదవతరగతి పరీక్షల ఫలితాలు ప్రస్తుత కాలంలో కీలకంగా మారుతున్నాయి. ఈ పరీక్షల్లో తమ పిల్లలు వందశాతం ఉత్తీర్ణత, అందులో అత్యధిక మంది 10కి10 జీపీఏ తో ఉత్తీర్ణత సాధిస్తే తమ పాఠశాలలకు పేరుప్రఖ్యాతులు వస్తాయని నానా తంటాలు పడటం గమనించదగ్గ విషయం. బడికెళ్తే పాఠాలు చెప్తున్నారా లేదా.. తమ పిల్లలు సరిగా చదువుకుంటున్నారా లేదా అనే విషయాలకంటే అత్యధికంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు పదవతరగతి పాస్ అయ్యారా లేదా అనే విషయం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పదవతరగతిలో విద్యార్థులు పాస్ అయ్యేందుకు పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రేవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులు కూడా అవలంభిస్తున్న చాలా అంశాలు విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోగా దిగజారుతున్నాయని విమర్శలూ లేకపోలేదు.
విద్యావ్యవస్థలో పెను మార్పులకు నాంది
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం విద్యావ్యవస్థను మార్గనిర్దేశం చేసేందుకు డాక్టర్ దౌలత్‌సింగ్ కొఠారి ఆధ్యక్షతన 1964-66 మధ్య కొఠారి కమీషన్ అనేది ఏర్పాటయ్యింది. ‘దేశభవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది’ అనే వాస్తవ ఆలోచనతో జాతీయ నూతన విద్యావిధానం రూపొందించబడింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న విధానాలన్నీ అప్పట్లో రూపొందించబడినవే. కొఠారి కమీషన్‌ను అనుసరిస్తూ మన దేశంలో మొట్టమొదటిసారిగా 1986లో జాతీయ విద్యావిధానం రూపొందించబడింది. ఈ కమీషన్ సూచనలు ఇప్పటికీ అమలులో వున్నాయి. నూతన విద్యావిధానం కోసం అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ 21వ శతాబ్దపు నూతన సవాళ్ళను ఎదుర్కొనే విధంగా వుండాలని పేర్కొంటూ విద్యారంగంలో మార్పులు సాధించడానికి ‘విద్యాసవాళ్ళు-విద్యా వికాస దృక్పధం’ అనే పేరుతో ఒక జాతీయ విద్యావిధానాన్ని రూపొందించి దానిని జాతీయవిద్యావిధానం - 1986గా అమలుపరిచారు. అప్పట్లోనే ప్రాథమిక పాఠశాలలు గ్రామాలకు ఒక కిలోమీటరు లోపు వుండాలి. మధ్యాహ్న భోజన వసతి, ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేయడం. 10+2+3 (పదవతరగతి, ఇంటర్, డిగ్రీ) పద్దతిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం. కుల,మత,వర్గ, విచక్షణ లేకుండా అందరికీ సమానంగా గుణాత్మక విద్యను అందజేయడం. విద్యావ్యాప్తిలో రాజకీయ నాయకులు, సమాజం, విద్యార్థుల తల్లిదండ్రుల పాత్రను గుర్తించడం. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడం. త్రిభాషా సూత్రాన్ని (మాతృభాష, జాతీయభాష, అంతర్జాతీయభాష) అమలు చేయడం. ఉన్నత విద్య అభివృద్ధి కొరకు సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఏర్పాటు, దూరవిద్య అందుబాటులోకి తీసుకురావడం. వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచడం, ప్రతి జిల్లాకు ఒక ఉపాధ్యాయ శిక్షణా (డైట్) కళాశాల ఏర్పాటు, నవోదయ విద్యాలయాల ఏర్పాటకు సిఫార్సు ఇలా అనేక అంశాలతో జాతీయ విద్యావిధానం రూపొందించబడింది. దాంతోపాటు పాఠ్యాంశాల బోధన విషయంలో ఉపాధ్యాయులు జవాబుదారీ తనంగా వ్యవహరించి విద్యాప్రమాణాలను పెంపొందించడానికి శ్రమించినప్పుడే ‘దేశభవిశ్యత్తు తరగతి గదుల్లో నిర్మింపబడతుందని’ అందులో ఉపాధ్యాయుడి పాత్ర కీలకమైనదిగా జాతీయ విద్యావిధానంలో సూచించింది.
ప్రభుత్వ పాఠశాలలు-విద్యావిధానం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అధ్వాన్నంగా వున్నాయనీ ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యనభ్యసిస్తున్న వారిలో సుమారు 50శాతానికి పైగా విద్యార్థులకు కనీసం రాయడం చదవడం కూడా రాదని అనేక జాతీయ సంస్థలు వారి సర్వేల ద్వారా వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయి నుంచే సరైన విద్యాబోధన జరగకపోవడమే ప్రధాన కారణంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1986లో అందరికీ అందుబాటులో వుండే విధంగా అనేక మార్పులు చేర్పులతో అమలు చేసిన జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి ప్రస్తుత పోటీప్రపంచానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటే సులువైన పద్దతుల్లో విద్యార్థుల్లో గ్రహణశక్తి పెరిగి వారిలో సామర్థ్యం పెంచే విధంగా విద్యాబోధన జరుగుతోందని ప్రస్తుత విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాలకులు చెప్తున్నారు. అయితే అది ఎంత వరకు పూర్తీ స్థాయిలో అమలవుతోంది, దానివల్ల విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతోందా అనే అంశాలపై ఎటువంటి పర్యవేక్షణ లేకుండానే బృహత్తరమైన ఫలితాలను సాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే జాతీయ స్థాయి సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల అడుగంటుతున్నాయని ఎందుకు పేర్కొంటున్నాయి? ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలకు చేరాక విద్యా బోధనా విధానంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న ఆరోపణలూ విద్యావ్యవస్థపై లేకపోలేదు. పదవతరగతిలో ఫలితాల సాధన కీలకం కావడంతో ఆరవతరగతి నుంచి ఉపాధ్యాయుల బోధనా విధానంలో, విద్యార్థులు చదువుకోవడంలో నాలుగు సంవత్సరాల పాటు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించి కేవలం పదవ తరగతిలోనే ఒత్తిడితో కూడిన విద్య ద్వారా ఎంతవరకు నిజాయితీతో కూడిన ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయో ప్రశ్నార్థకం. ఈనేపధ్యంలో విద్యాశాఖ అధికారుల ఒత్తిళ్ళకు ఎలాగైనా తమ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణతను సాధించాలన్న కేవలం ఫలితాల కోసమే పరీక్షా కేంద్రాల్లో అడ్డదారులు తొక్కే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
ప్రైవేటు పాఠశాలల భవిష్యత్తు...
తమ పాఠశాలల్లో చదివే కేవలం పదవతరగతి పరీక్షల విద్యార్థుల ఉత్తీర్ణత ఫలితాలు మాత్రమే అత్యధిక ప్రైవేటు పాఠశాలల భవిశ్యత్తును నిర్దేశిస్తున్నాయి. పాఠశాలలకు మంచి పేరు రావాలన్నా, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలన్నా పదవతరగతి పరీక్షల ఫలితాలపై తమదైన శైలిలో ప్రదర్శించే పబ్లిసిటీనే ప్రధానాంశంగా మారుతోంది. పదవతరగతి పరీక్షల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులే అత్యధిక జీపీఏతో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖనే తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి వరకు పాఠ్యాంశాలు బోధించి సిలబస్ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే సిలబస్ పూర్తి చేసి ఒత్తిడితో విద్యార్థులను విద్యాభ్యాసం చేయించడం ఓ ప్రక్రియగా మారిపోయింది. పదవతరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధించి తమ పాఠశాలకు మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకోవాలని 9వతరగతి చదివే విద్యార్థులకు ముందస్తుగా పదవతరగతి పాఠ్యాంశాల బోధన చేస్తున్న ప్రైవేటు పాఠశాలలూ లేకపోలేదు. విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేసి తర్ఫీదు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు కూడా పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలనే తమ గుప్పిట్లో పెట్టుకుని తమ కనుసన్నల్లో పరీక్షలు నిర్వహించుకుంటున్న వైఖరి షరా మామూలుగా మారింది.
గుణాత్మక విద్యకంటే ఫలితాలకే ప్రాధాన్యత
వ్యాపార సంస్థల నిర్వహణలా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలను పక్కనపెడితే పేదలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యనందజేయడం ఎలాగున్నా కేవలం ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించి చివర్లో వచ్చే ఫలితాలను చూసే పనితీరు చాలా బాగుందని కితాబునిస్తుండటం శోచనీయం. ఒక విధంగా ప్రస్తుతం అమలవుతున్న విద్యా హక్కు చట్టాలే చాలా వరకు ఉపాధ్యాయుల్లో కూడా తమకెందుకులే పాఠశాలకు వచ్చామా... పాఠాలు బోధించామా అనే ధోరణిని తీసుకువచ్చినట్టు స్పష్టమవుతోంది. గతంలో ఓ ఉపాధ్యాయుడు తప్పుచేసిన తన విద్యార్థిని దండిస్తే ఆ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుడిని సమర్థించేవారు. అయితే ప్రస్తుతం ఆ వాతావరణం కనిపించకపోగా విద్యార్థిని దండిస్తే ఉపాధ్యాయులపై దాడులు నిర్వహించడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఉపాధ్యాయులు కూడా కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా విద్యార్థులకు క్రమశిక్షణకూడా అలవరిచి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్న గురుతర భాద్యత నుంచి తప్పుకుంటూ కేవలం ఉద్యోగం మాత్రమే చేసుకుంటూ పోతున్నారు.
గుణాత్మక విద్యాబోధన ఎలాగున్నా కేవలం పదవతరగతి ఫలితాలకే ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు ప్రాధాన్యతనిస్తూ మెరుగు పరచాల్సిన విద్యాప్రమాణాలను విస్మరిస్తున్నారన్న ఆరోపణలను చూస్తే ‘తరగతి గదిలో దేశభవిష్యత్తు నిర్మించబడతుంది’ అని చెప్పిన మన దేశ మేధావుల మాటలు భవిశ్యత్తులో కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.


విద్యార్థులకు విషమ ‘పరీక్ష’!

$
0
0

విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే పరీక్ష ఫలితాలను శాసించవచ్చు.
విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు వత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్నచిన్న చిట్కాలను పరీక్ష ఫలితాలను శాసించవచ్చు.
* * *
సమాధానాలు వ్రాయడం ఒక కళ. ఎంత బాగా చదివినా, ఎంత గుర్తున్నా, వ్రాసే విధానం తెలియకపోతే మంచి మార్కులు సాధించడం కష్టం.
* చేతి వ్రాత బాగుండాలి. * నిర్వచనం ఉంటే యథాతథంగా వ్రాసే ప్రయత్నం చేయాలి. * చిన్న ప్రశ్నలకు వ్రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా వ్రాయాలి. * జవాబులో నిర్వచనం ఉంటే ముందుగా వ్రాయాలి. * సైడ్ హెడ్డింగ్స్ ముఖ్యమైన వాటికి అండర్‌లైన్ చేయాలి. * అవసరమైన చోట చిత్రపటాలను గీచి, భాగాలు గుర్తించాలి. * పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండాలి.
పరీక్షలకు ఎలా చదవాలి?
* సబ్జెక్టులన్నింటికీ సమయం కేటాయించి ప్రణాళికతో చదవాలి.
* ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మంచి ఫలితం ఉంటుంది.
* కష్టమైన, ఇష్టం లేని సబ్జెక్ట్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి.
* ప్రతిరోజూ అవసరమైనంత నిద్ర పోవాలి.
* ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.
* చల్లని పదార్థాలు తినడం, త్రాగడం చేయకండి.
పరీక్షలకు రెండు రోజుల ముందు -
* మొదటి పరీక్ష కోసమే చదవాలి.
* గతంలో చదివినంత మాత్రమే రివిజన్ చేయాలి. కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకండి.
* సరిపడా నిద్ర పోవాలి. కష్టపడి చదవడం వరకు మాత్రమే. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదని గుర్తించాలి.
* ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.
పరీక్ష రోజున-
* పరీక్ష సమయానికి కనీసం గంట ముందు చదవడం ఆపండి.
* పరీక్ష వ్రాయడానికి కావలసినవి సిద్ధం చేసుకోవాలి.
* స్నేహితులతో సరదాగా మాటలు తప్పించి పరీక్ష గురించి చర్చించకూడదు.
* పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరాలి.
పరీక్ష హాలులో -
* 2 నుండి 5 నిమిషాలు కళ్లు మూసుకొని ప్రశాంతంగా కూచోవాలి.
* ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు శ్రద్ధగా విని పాటించాలి.
* పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్ మెటీరియల్, ఇతరములు చిన్న ముక్క కూడా దగ్గర ఉంచుకోకూడదు.
* ప్రశ్నపత్రంపై గానీ, బెంచ్‌పై గానీ, పాడ్‌లపై గానీ ఏమీ వ్రాయకూడదు. తనిఖీ బృందాలు డిబార్ చేస్తారు.
* ప్రశ్నపత్రం శ్రద్ధగా చదవాలి.
* తేలికగా ఉన్న ప్రశ్నకు సమాధానం మొదటగా వ్రాయాలి.
* మొదటి పేజీ అందంగా వ్రాసే ప్రయత్నం చేయాలి.
* ప్రశ్నలు కష్టంగా అనిపిస్తే కంగారు పడొద్దు. మీకే కాదు. అందరికీ అలాగే అనిపిస్తాయి.
* సమాధానాలు వ్రాయడం పూరె్తైన తర్వాత ప్రశ్నల నంబర్లు సరి చూసుకోండి.
* సమయం మిగిలితే వ్రాసిన సమాధానాలు పునః పరిశీలించుకోవాలి.
పరీక్ష హాలు నుండి బయటకు వచ్చాక-
* స్నేహితులతో తప్పొప్పుల గురించి చర్చించకూడదు.
* ఆహారం తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకుని తరువాతి పరీక్షకు ప్రిపేర్ కావాలి.
అన్ని పరీక్షలు అయినాక...
* నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఫలితం నా చేతుల్లో లేదనుకోవాలి.
ఫలితాలు విడుదలయిన తర్వాత
* వచ్చిన మార్కులను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
* ఫెయిలయిన విద్యార్థులు, చదువు జీవితంలో ఒక భాగమని, మంచిగా బ్రతకడానికి చాలా మార్గాలున్నాయని అర్థం చేసుకోవాలి. చావడం అనేది మూర్ఖులు మాత్రమే చేస్తారు. తెలివిగల వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.
* * *
లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లిన వారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధన దిశగా మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతల సహకారం తీసుకోవడం, సీనియర్స్ సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది.
నీ వెనుక ఏముంది... ముందేముంది.. అనేది నీ కనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తిసామర్థ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు. ఇలా ఎందరో సాధించారు. మనమూ సాధిద్దాం. ఇతరులకూ స్ఫూర్తినిద్దాం.

వారం వారం గోచారం (17-2-2019 నుంచి 23-2-2019 వరకు)

$
0
0

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు పెంచుకుంటారు. విద్యాత్మకాంశాలపై దృష్టి. గౌరవ లోపాలు జరుగకుండా పెద్దలను గౌరవించండి. గురుదక్షిణలు చెల్లించుకోండి. ఆధ్యాత్మిక ప్రయాణావకాశాలు. అసంతృప్తి. వ్యాపార లాభాలుంటాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. క్రమంగా మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ అనుకూలత. అన్ని రకాలైన ప్రయోజనాలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. సామాజిక గౌరవం తగ్గవచ్చు. సుదూర ప్రయాణాలపై దృష్టి. కీర్తిప్రతిష్టలు క్రమంగా పెరుగుతాయి. అధికారిక ప్రయోజనాలుంటాయి. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శత్రువులు రుణాలపై విజయం. రోగ నిరోధక శక్తి పెంచుకుంటారు. గృహ వాహనాదులపై ప్రత్యేక దృష్టి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ఖర్చులు పెట్టుబడులు అధికం. విశ్రాంతి కోసం ప్రయత్నం. ప్రయాణాలుంటాయి. ఆహార విహారాదులకు అవకాశం. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. గృహ వాహనాదులపై దృష్టి. అభీష్టాలు నెరవేరుతాయి. సృజనాత్మకత, ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. నిర్ణయాదుల్లో ఆలస్యం వల్ల సమస్యలు. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే అవకాశం. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త పనులపై దృష్టి. సంతానవర్గంతో అనుకూలత. నూతన కార్యక్రమాల నిర్వహణ. భాగస్వామ్యాల్లో సమస్యలుంటాయి. అధికారిక పరిచయాలకు అవకాశం. కుటుంబ, ఆర్థికాంశాలపై దృష్టి. మాట విలువ పెరుగుతుంది. చమత్కారంగా మాట్లాడుతారు. వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలం.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. నిర్ణయాదులను వాయిదా వేయడం మంచిది. శుభ కార్యక్రమాలకు వెచ్చించాల్సి ఉంటుంది. దాన ధర్మాల వల్ల పుణ్యం, పురుషార్థం. అన్ని పనులకు ఆలస్యంగా స్పందిస్తారు. కార్యనిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. వార్తలు ఇబ్బంది పెట్టవచ్చు. క్రమంగా లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తిప్రతిష్ఠలపై దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత ఒత్తిడులున్నా అధిగమిస్తారు. మాటల్లో కొంత నైరాశ్య ధోరణి ఉంటుంది. విలాసాలకు విందులకు ప్రయాణాలకు ఖర్చులు అధికం. సంతోషంగా గడిపేందుకు ప్రయత్నం. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం సంప్రదింపులకు అనుకూలం. సహకార లాభాలుంటాయి. దగ్గర ప్రయాణాలకు అనుకూలత. సోదర వర్గంతో వ్యవహార నిర్వహణ. కొన్ని ముఖ్యమైన వార్తలు తెలుస్తాయి. పెద్దల పరిచయాలుంటాయి. గురువుల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోని నష్టాలు, అనారోగ్య భావనలకు అవకాశం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ పరిణామాలుంటాయి. క్రమంగా సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలకు అనుకూలం. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. మాతృవర్గ వ్యవహారాలుంటాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. నిర్ణయాదుల్లో లోపాలు రాకుండా చూసుకోవాలి. ఊహించని సంఘటనలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. సామాజికమైన గుర్తింపు. గౌరవాదులకు అవకాశం. అధికారుల ఆదరణ, అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వర్గంతో సంతోషం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వార ప్రారంభంలో అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతృప్తి ఆశించినంతగా ఉండకపోవచ్చు. సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలకు అవకాశం ఉంది. ఆహార విహారాదులపై జాగ్రత్త. పోటీల్లో విజయం లభిస్తుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలుంటాయి. క్రమంగా ఖర్చులు, పెట్టుబడులు అధికం. ప్రయాణావకాశాలుంటాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. సంతానవర్గ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి. ఆలోచనల్లో నిర్లిప్తత. నిరాశాజనక భావనలు. గృహ వాహనాది సౌకర్యాలు మెరుగుపరచుకునే ప్రయత్నం. లలిత కళారంగాల వారికి అనుకూలత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పోటీ రంగంలో శ్రమతో విజయం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాల నిర్వహణకు అనుకూలం. సంతోషంగా గడుపుతారు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. గౌరవం పెంచుకుంటారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొన్ని వ్యర్థమైన ఖర్చులుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో అనుకూలత. చమత్కార సంభాషణ. అందరినీ ఆకట్టుకుంటారు. అనుకోని సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. నిర్ణయాదులలో లోపాలుంటాయి. నిరాశ, అసంతృప్తి, నిర్లిప్తతలుంటాయి. ఖర్చులు పెట్టుబడుల్లో సంతోషం. విందులు విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో ఉన్నత వ్యవహారాలు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. నిల్వధనంపై దృష్టి. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులకు అవకాశం. సుదూర ప్రయాణాలు. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం. మాటల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రుత్వాలు పెరగకుండా చూసుకోవాలి. క్రమంగా అధికారిక సంప్రదింపులకు అవకాశం. ప్రయాణాలుంటాయి. కొన్ని వార్తల వల్ల కీలకమైన నిర్ణయాదులు తీసుకోవాల్సి వస్తుంది. అనుకోని సమస్యలుంటాయి. నిరాశా ధోరణి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం. కమ్యూనికేషన్ విషయంలో అనుకూలత. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. కుటుంబ అనుబంధాల వల్ల వృత్తిలో వ్యాపారాల్లో ఉన్నతి పెరుగుతుంది. సేకవ వర్గ సహకారం లభిస్తుంది. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన సంబంధమైన అంశాల్లో మంచి మార్పులకు అవకాశం. క్రమంగా అన్ని రూపాల్లో ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయం పెంచుకుంటారు. లాభాల వల్ల సంతోషం. ఆశించిన సంతృప్తి కొంత తక్కువ. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. వార్తల వల్ల కొంత ఇబ్బంది పడతారు. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. ఆకర్షణీయమైన మాటలుంటాయి. ఖర్చులు పెట్టుబడులు క్రమంగా వారాంతంలో వృద్ధి పొందే అవకాశం.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలు అధికంగా ఉంటాయి. పోటీలు, ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది. మనసు చికాకుగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండి దైవధ్యానం చేసుకోవాలి. సామాజిక గౌరవం శ్రమతో లభిస్తుంది. లాభాలు ఆశించిన సంతృప్తిని ఇవ్వవు. నిర్ణయాదులకు అనుకూలత. వ్యాపారస్తుల్లో శుభ పరిణామాలు. క్రమంగా పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో గడిపే ప్రయత్నం. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. వ్యర్థమైన ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. దానధర్మాల వల్ల మరింత మేలు. లాభాలు అత్యంత సంతోషాన్నిస్తాయి. హాయిగా విలాసవంతంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులుంటాయి. వారాంతంలో అనుకోని సమస్యలకు అవకాశం. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలు. కార్యనిర్వహణలో సంతానవర్గ సహకారం లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. తక్కువ శ్రమతో కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. వ్యతిరేకతలున్నా శ్రమతో విజయం సాధిస్తారు. పోటీ రంగాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినా చివరకు అనుకూలత ఉంటుంది. క్రమంగా కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం. మాటల్లో కొంత అధికారిక ధోరణి ఉన్నా శుభ పరిణామాలు. భాగస్వామితో కొంత జాగ్రత్త. వ్యతిరేకతలున్నా విజయం వరిస్తుంది. సంప్రదింపులుంటాయి. సహకార వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశాలున్నా అప్రమత్తంగానే మెలగాలి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. సుదూర ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. నూతన కార్యక్రమాలను చేపడుతారు. నిర్ణయాదులకు అనుకూలం. కొత్త పనులపై ప్రత్యేక దృష్టి. ఆత్మవిశ్వాసం. కుటుంబ సంబంధాల్లో కొంత వత్తిడి తప్పకపోవచ్చు. ఆర్థిక సమస్యలుంటాయి. మాట విలువ తగ్గే సూచనలు. క్రమంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులపై ప్రత్యేక దృష్టి. అధికారిక వ్యవహారాలుంటాయి. సామాజికమైన గుర్తింపు. గౌరవాదులు విస్తరించే అవకాశం. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యనిర్వహణపై దృష్టి. అన్ని పనుల్లోనూ అనుకూలత. వ్యవహారాల్లో శుభ పరిణామాలు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరుతాయి. నూతన కార్యక్రమాల నిర్వహణ. సృజనాత్మకత. భావనలకు క్రియా రూపం ఏర్పడుతుంది. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. పితృవర్గ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. కార్యనిర్వహణలో అనుకూలత. వ్యతిరేకతలు పెరిగే అవకాశం. పోటీ రంగంలో విజయావకాశాలు అయినా లాభాలు తగ్గే సూచనలు. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. గొప్పకోసం కాలం ధనం వ్యర్థమయ్యే సూచన. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సామాజిక అనుబంధాలు పెంచుకునే సూచన. భాగస్వామితో గడిపే ప్రయత్నం.

ఇంద్రియ జయం.. ‘యోగ’ మహిమే (రాస క్రీడాతత్త్వము)-14

$
0
0

గోపికలు అలా రాసక్రీడా నృత్యానికై చేతులు కలిపే సరికి, శ్రీకృష్ణ్భగవానుడు కరుణాపూరిత హృదయుడై, ప్రతి ఇద్దరి గోపికల మధ్యా తాను ప్రత్యేకంగా కృష్ణరూపాలను ధరించి నిలబడ్డాడు.
అలా బహురూపధారి అయిన శ్రీకృష్ణుడు ఇటు ఈమె మెడ మీదా, అటు ఆమె మెడ మీదా చెరో చెయ్యి వేసి, నృత్యానికి కాలు కదిపే సరికి, ఆ గోపికలిద్దరికీ పులకలు మొలకలై, వారిద్దరూ చెరో, చేతిని స్వామి నడుం చుట్టూ వేసి, ఒళ్ళు తెలియని ఉత్సాహంతో నృత్యం చేయసాగారు.
ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఒకే సమయంలో వేల కొలది రూపాలను స్వీకరించే సన్నివేశం వచ్చేసరికి, ఆకాశంలో దేవతలు గుంపులు గుంపులుగా క్రిక్కిరిసి నిలబడ్డారు. క్రింద స్వామి గోపికలతో కలిసి చేసే గానంతో, పైనున్న గంధర్వ దంపతులు గొంతు కలిపి తన్మయులై గానం చేస్తూ, పుష్ప వృష్టిని కురిపించారు. ఆ సన్నివేశాన్ని దేవతలందరూ ఇలా కీర్తించారు.
శ్లో॥ అంగనా మంగనా మంతరే మాధవో
మాధవం మాధవం చాంతరే చాంగనా
ఇత్థమాకల్పితే మండలే మధ్యగః
సంజగౌ వేణునా దేవకీనందనః ॥ (శ్రీకృష్ణ కర్ణామృతం)
(్భవం : గోపికకూ, గోపికకూ నడుమ శ్రీకృష్ణుడు - కృష్ణుడికీ కృష్ణుడికీ నడుమ గోపిక. ఇలా ఏర్పడిన మండలం మధ్యలో మరో కృష్ణుడు నిలబడి వేణువు ఊదుతున్నాడు.)
శ్లో॥ బాలికా తాళికా తాళలీలాలయా
సంగ సందర్శిత భ్రూలతావిభ్రమః
గోపికాగీత దత్తావధానస్స్వయం
సంజగౌ వేణునా దేవకీనందనః ॥ (శ్రీకృష్ణ కర్ణామృతం)
(్భవం : గోపికలు వేసే తాళ్ఱా కనుగుణంగా కనుబొమలు కదిలిస్తూ, దానికోసమై వారి పాటలను శ్రద్ధగా వింటూ, దేవకీనందనుడు వేణుగానం చేశాడు.)
అలా రాసక్రీడలో మైమరచిన గోపికలలో -
(i) కొందరికి ఆభరణాలు తొలగిపోయాయి.
(ii) కొందరికి కొప్పులు వీడిపోయాయి.
(iii) కొందరికి పైటలు జారిపోయాయి.
(iv) కొందరు విడిగా వెళ్ళి పాడారు.
v) కొందరు స్వామిని కౌగలించుకున్నారు.
(vi) కొందరు విడిగా గంతులు వేశారు.
ఈ విధంగా గోపికలు ఆనందపరవశలై క్రీడిస్తూ వుంటే, భగవంతుడైన శ్రీకృష్ణుడు, పసివాడు అద్దంలోని బొమ్మలతో ఆడుకుంటున్నట్లు, ఆ గోపికలతో క్రీడించాడు. ఇలా స్వామి లీలా పరవశుడై క్రీడిస్తూ వుంటే, ఆకాశంలో తిలకిస్తున్న దేవతాస్ర్తిలు మోహపరవశలవుతున్నారు.
ఆకాశాన మెరిసే చందమామ కూడా ఆశ్చర్యంతో బిగిసి పోయి నిలచిపోయాడా? అన్నట్లు, ఆ రాత్రులు దీర్ఘంగా సాగాయి. చాలా సేపు నాట్యం చేసి చేసి, అలసిపోయిన గోపికల ముఖాల నిండా స్వేద బిందువులు కదలాడడం చూసిన శ్రీకృష్ణుడు, వారందరినీ వెంటబెట్టుకుని యమునా జలాల్లోకి దిగి, జలక్రీడ సాగించాడు. అనంతరం మళ్ళీ కొంత సేపు వనక్రీడలు జరిపాడు. మదపుటేనుగు చుట్టూ మూగిన ఆడ ఏనుగుల్లాగా, శ్రీకృష్ణుడి చుట్టూ చేరిన ఆ గోపికలు జలక్రీడలు చేస్తుంటే, ఆకాశంలోని దేవతలు పుష్పవృష్టులు కురిపించారు.
ఈ విధంగా అనేక విధాలుగా ఆ శరత్కాలపు రాత్రులలో భగవానుడైన శ్రీకృష్ణుడు గోపికల మనోరథాలకు అనుగుణంగా రాసక్రీడలు సాగించినా, ఆయన సత్య కాముడు కావడంవల్లా, ఆత్మారాముడు కావడంవల్లా, ఆయనకు ఇంద్రియవ్యయం జరుగలేదు. శ్రీకృష్ణుడి యొక్క యోగచర్యలను తమ దివ్యదృష్టులతో గమనిస్తున్న నారదాది యోగీంద్రులు ఈ విషయాన్ని గ్రహించి ఆశ్చర్య చకితులయ్యారు. ఈ విషయానే్న వ్యాస ప్రారంభంలో ‘‘కామవిజయ ప్రదర్శన’’ అనే శీర్షిక దగ్గర ప్రస్తావించుకొని వున్నాం.
వజ్రోళీ ప్రక్రియ :-
యోగీంద్రుల ఆశ్చర్యానికి కారణమేమిటో తెలియా లంటే, మనం వజ్రోళీ ప్రయోగం గురించి కొంచెం ప్రస్తావించుకోవాలి.
యోగశాస్త్రంలో ‘‘వజ్రోళీ’’ అనే పేరుతో ఒక క్లిష్టతరమైన ప్రక్రియ వుంది. దీనిలో నాడీశుద్ధిని, ప్రాణజయాన్నీ సాధించిన యోగసాధకుడు, తన మూత్రద్వారం ద్వారా మొదట నీటినీ, తరువాత తైలాన్నీ, తరువాత పాదరసాన్నీ, లోపలికి పీల్చుకొని, మళ్ళీ తన సంకల్పం ప్రకారం బయటకు విసర్జించగలుగుతాడు. ఈ సాధనలో సిద్ధి సంపాదించిన యోగి, అటు తరువాత తన సొంత వీర్యానే్న లోపలికీ బయటకు తన సంకల్పానుసారం పీల్చుకొని వదల గలుగుతాడు. ఈ సాధనలో ఆరితేరినవాడికి సంపూర్ణమైన సర్వేంద్రియ జయం లభిస్తుందని యో గశాస్త్రం నిర్దేశిస్తోంది.
ఇప్పటికి (2018 నాటికి) 50, 60 ఏళ్ళ క్రిందట మన ఆంధ్రదేశంలో ఓరుగంటి నరసింహయోగిగారనే యోగి ఒకాయన వుండేవారు. ఆయన రామ్‌లాల్ ప్రభుజీగారి శిష్యులు. నరసింహయోగిగారు ఆ రోజుల్లో వివిధ కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి, సమావేశాలు ఏర్పాటు చేసి, వజ్రోళీ విద్యద్వారా పాదరసాన్ని పీల్చుకోవటాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారట! నర సింహయోగి గారిని నేను వారి వార్ధక్యదశలో దర్శించాను గానీ, వారి వజ్రోళీ ప్రదర్శనలు చూడలేదు. మా అన్నలు చూశారు.
అలాగే, పురాణతత్త్వదర్శన గ్రంథ రచయిత అయిన పండిత మాధవాచార్య శాస్ర్తీగారు 1935లో ప్రకటించిన తమ గ్రంథంలో ఇలాంటి యోగిని ఒకరిని స్వయంగా చూశానని వ్రాశారు.

మరణంతో మెదడు పోరాడుతుందా?

$
0
0

చనిపోయేముందు మెదడు పోరాడుతుందా.. అనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే పరిశోధనల ద్వారా శాస్తవ్రేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు శాస్తవ్రేత్తలు. జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ చారిటీ, అమెరికాలోని సిన్సినాటి యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించారు. నాడీవ్యవస్థకు సంబంధించిన కొత్త విషయాలను కనిపెట్టారు. ఈ పరిశోధనకు జెన్స్ డ్రీర్ నాయకత్వం వహించారు. నాడీవ్యవస్థ దెబ్బతిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి మెదడుపై ఈ బృందం పరిశోధనలు చేసింది. వారందరూ వేర్వేరు కారణాలతో చనిపోయారు. కొందరికి గుండెనొప్పి వచ్చింది. మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. వీటిని ఒక క్రమపద్ధతిలో చెప్పడానికి వీలులేదు. ఈ రోగులపై అధ్యయనం సమయంలో సైంటిస్టులు ఒక విషయం గుర్తించారు. మనుషుల మెదడు, పశువుల మెదడు ఒకేరకంగా నశించడాన్ని కనిపెట్టారు. అంతేకాదు సరైన సమయంలో ప్రయత్నిస్తే మెదడును మళ్లీ పనిచేసేలా చేయవచ్చని ఊహిస్తున్నారు. వీళ్ల పరిశోధన ప్రధాన లక్ష్యం కూడా ఇదే.. మరణానికి ముందు మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడమే కాదు.. ఆ ప్రమాదం నుంచి, మరణం నుంచి మనుషుల్ని ఎలా కాపాడాలో తెలుసుకోవడమే ఈ పరిశోధనల ఉద్దేశం.
జంతువుల్లో ఇలా.. 20వ శతాబ్దంలో జంతువులపై చేసిన పరిశోధనల ఫలితంగా మెదడు మరణానికి సంబంధించి పలు విషయాలు శాస్తవ్రేత్తలకు తెలిశాయి. శాస్తవ్రేత్తలు చెప్పిన వివరాల ప్రకారం.. గుండె పనిచేయడం ఆగిపోవడంతోనే మెదడుకు ఆక్సిజన్ అందదు. ఆ తర్వాత మెదడుకు రక్తసరఫరా ఆగిపోతుంది. అంటే మెదడు పరిచేయడానికి అవసరమైన రక్తం గుండె నుంచి సరఫరా కాదన్నమాట. ఈ స్థితిని వైద్య పరిభాషలో 3సెరెబ్రల్ ఇస్కీమియా2 అంటారు. క్రమంగా మెదడు అచేతనంగా మారిపోతుంది. ఆ స్థితిలో మెదడులోని న్యూరాన్లు తమ శక్తిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తాయి. కానీ మరణానికి కొన్ని క్షణాల ముందు వాటి ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలించవు. అడెనోసిన్ ట్రిఫాస్పేట్ క్షీణించడంతో మెదడు నుంచి ముఖ్యమైన ఆయాన్లు అన్నీ వెళ్లిపోతాయి. శక్తిని నిల్వ చేయడంతోపాటు దాన్ని శరీరం మొత్తం పంపిణీ చేయడానికి అడెనోసిన్ ట్రైఫాస్పేట్ సహకరిస్తుంది. మెదడులో అడెనోసిన్ ట్రై ఫాస్పేట్ క్షీణించడంతో కణాల రికవరీ అసాధ్యంగా మారుతుంది. ఇదంతా కేవలం 10 నిముషాల్లోనే జరిగిపోతుంది. ఆక్సిజన్, రక్తసరఫరా నిలిచిపోయిన పది నిముషాల్లో మెదడులోని కణాలు పూర్తిగా చనిపోతాయి.
మనుషుల్లో.. చనిపోవడానికి ముందు మనుషుల మెదడు ఎలా స్పందిస్తుంది? అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ శాస్తవ్రేత్తల బృందం ప్రయత్నించింది. ఇందుకోసం చావు బతుకుల్లో ఉన్న తొమ్మిదిమంది రోగులపై శాస్తవ్రేత్త జెన్స్ డ్రీర్ పరిశోధన చేశారు. ఎలక్రోడ్ స్ట్రిప్‌ల సహాయంతో వారి నరాల పనితీరును అధ్యయనం చేశారు. తొమ్మిది మందిలో ఎనిమిది మంది రోగుల మెదడు కణాలు జరుగుతున్న పరిణామాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. మృత్యువు కబళించకుండా మెదడు కణాలు ప్రయత్నం చేసినట్లుగా తేల్చారు. సాధారణంగా న్యూరాన్లు ఆయాన్ల శక్తిని సంగ్రహించి పనిచేస్తాయి. తమలో, పరిసరాల్లో ఎలక్ట్రానిక్ అసమతౌల్య స్థితిని సృష్టించి జీవిస్తాయి. ఈ క్రమంలో అవి చిన్న చిన్న షాక్‌ల రూపంలో ఒక చోటు నుంచి మరోచోటికి సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ అసమతౌల్య స్థితిని న్యూరాన్లు నిరంతరం కొనసాగిస్తాయి. కణాలు రక్తం నుంచి శక్తిని, ఆక్సిజన్‌ను గ్రహించి న్యూరాన్లకు కావలసిన శక్తిని అందిస్తాయి. అయితే చనిపోయిన తర్వాత మెదడుకు రక్తసరఫరా ఆగిపోతుంది. ఫలితంగా న్యూరాన్లకు ఆక్సిజన్ అందదు. ఆ పరిస్థితిలో తమలో మిగిలిపోయిన శక్తిని న్యూరాన్లు సమీకరించుకుంటాయని పరిశోధకులు చెప్పారు. చివరి క్షణాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకి సిగ్నల్స్ పంపించడం వృథా ప్రయాస. అందుకే న్యూరాన్లు నిశ్శబ్దంగా ఉంటాయి. తిరిగి రక్తప్రసరణ కోసం న్యూరాన్లు ఎదురుచూస్తూ ఉంటాయి. కానీ అది జరగదు. ఇలాంటి పరిస్థితి మెదడు జీవితంలో ఒకేసారి ఎదురవుతుంది. దీనే్న వైద్య పరిభాషలో 3అన్‌డిస్పర్స్‌డ్ డిప్రెషన్2 అంటారు. ఆ తర్వాత మెదడులో ఉష్ణ సునామీ వస్తుంది. దీన్ని 3డీపోలరైజేషన్ ఆఫ్ డిఫ్యూజన్2 అంటారు. మెదడు కణాలను సజీవంగా ఉంచే ఎలక్ట్రో-కెమికల్ సమతౌల్యం దెబ్బతినడం వల్ల ఈ అసాధారణ ఉష్ణశక్తి వెలువడుతుంది. మెదడు కణాలు మొద్దుబారడానికి, ధ్వంసం కావడానికి ఇది కారణం అవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా తగ్గిపోవడంతో మెదడు మొత్తం మొద్దుబారిపోయింది. పరిశోధకులు అధ్యయనం చేసిన అందరు రోగుల్లోనూ ఇలాగే జరిగింది. అయితే మరణానికి ఇదొక్కటే కారణం కాదని.. ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు మరణాన్ని ఆపడం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ రోజు మాత్రం ఎంతో దూరంలో లేదని శాస్తవ్రేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వెన్నె తగ్గని శరత్‌జ్యోత్స్న

$
0
0

మన భారతదేశం గర్వించే రచయిత శరత్‌చంద్ర. వీరు బెంగాలీ రచయిత అయినా, వీరి నవలలు, కథలు అన్ని భాషలలోకి అనువదింపబడ్డాయి. వీరు సెప్టెంబర్ 1876లో హగ్లీ దేవానందపూర్‌లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు భువల మోహిని, మోతీలాల్. తోబుట్టువులు అనిలాదేవి, ప్రకాశ్, ప్రభాస్, సుశీల. వీరి జీవితం సారా, నల్లమందు, ప్రేమానే్వషణ సత్యానే్వషణలో గడిచిపోయింది. ఇతడే దేవదాసు కదా! మానవుడిలో కనిపించే భగవంతుడినే మానవుడు ఎందుకు తిరస్కరిస్తాడు? అని సత్యాన్ని అనే్వషించేవాడు శరత్‌బాబు. చిన్నప్పటి నుండి కూడా అతనికి వయసుకు మించిన అనుభవం, దుఃఖ నిర్వచనం, బహుశ కటిక దారిద్య్రంలో పెరగటం వల్ల వచ్చిందేమో!
చిన్నప్పుడు శరత్‌బాబుకి పొడవైన జుట్టు ఉండేది. ‘రవీంద్రుడు కావాలనుకుంటున్నాడు’ అని వెక్కిరించేవారు. కాని డబ్బులేక కేశ ఖంఢనం చేయించలేదని ఎందరు గుర్తించారు? నాటకాలలో వేయడం ఆ రోజుల్లో నిషిద్ధం. అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవలసి వచ్చేది. శరత్ ఆడ, మగ పాత్రలు ఎంతో బాగా వేసేవాడు. అలీబాబాలో ముస్త్ఫాగా, బంకించంద్ ‘మృణాళిని’లో నాయికగా వేసేవాడు. తన జీవిత స్మృతులను ‘శ్రీకాంత్’లో రాసుకున్నాడు. తల్లి ప్రేమామయి, తండ్రి ఎందుకూ పనికిరాని ఇల్లరికపుటల్లుడు, పలాయనవాది. తండ్రి అస్థిరత శరత్‌కు వచ్చింది.
ఆ రోజుల్లో పాములు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఇంట్లో ముంగిస ఉండేది. శరత్ కూడా ప్రాణప్రదంగా ఒక ముంగిసని పెంచేవాడు. ఒకరోజు అది ఒక పాముని చంపి, శరత్ ప్రాణరక్షణకు దోహదం చేసి రుణం తీర్చుకుంది. 1896లో పబ్లిక్ పరీక్షకు ఫీజు కట్టడానికి డబ్బుల్లేక చదువుకు దూరమయ్యాడు. ఎప్పుడూ చంచల స్వభావం, మనస్సులో అశాంతి, ప్రవర్తనలో అస్థిరత. ఇతను, సాహసి, దుస్సాహసి, నిరుపేద, నిరాశ్రయుడు, తాగుబోతు, తిరుగుబోతు. చిన్నప్పుడు అతని ప్రేమ ఫలించలేదు. దాని ఫలితమే దేవదాసు, బడదీదీ రచనలు. చిన్ననాడు అతని ప్రేమ ఫలించి ఉంటే వ్యక్తిగతంగా అతనికి సంతృప్తి మిగిలినా, ఇంతటి గొప్ప రచయిత అవలేక పోయేవాడేమో! ప్రేమ అనే క్షీర సాగర మథనంలో పుట్టిన హాలాహలం తను మింగి, రసామృతాన్ని ప్రపంచానికి పంచాడు శరత్. ఇతను మంచి చిత్రకారుడు, గాయకుడు. ఈయన గీసిన చిత్రాలు గృహ దహనంలో బూడిదయిపోయాయి. ‘మహాశే్వత’ మాత్రం మిగిలింది. ఎక్కడ ఉందో? తబలా, హార్మొనీ, వేణువు, తీయగా వాయించేవాడు. ఇతనికి ఆత్మవిశ్వాసం తక్కువ. అందుకని తెర వెనుక నుండి పాడి, ముఖ్య అతిథిని కూడా కలిసేవాడు కాదు. పాడటం కూడా అస్థిరత వల్ల మెల్లగా మానివేశాడు. తన కుక్క ‘ఖేలీ’ అంటే పిచ్చిప్రేమ. అది చనిపోయినప్పుడు, సొంత కొడుకు చనిపోయినట్లు ఏడ్చాడు. గృహ దహనంలో చరిత్రహీనులు, స్ర్తి జాతి చరిత్ర అనే దీర్ఘన్యాసం, వీరి పెయింటింగ్స్ దగ్ధమై పోయాయి. మళ్లీ చరిత్ర హీనులు రాశారు కాని, స్ర్తి జాతి చరిత్ర రాయలేదు. పెయింటింగ్ జోలికి వెళ్లలేదు. 1913లో బాల్యమిత్రుడు విభూతి భూషణ్‌కు బంగారు కలం చేయించి పంపాడు. తన స్నేహితులందరికీ ‘పెన్ను’ బహూకరించేవాడు.
ఆ రోజుల్లో శరత్‌కు నోబుల్ బహుమతి వస్తుందని వార్తలు వచ్చాయి. రవీంద్రుడు అప్పటికే నోబుల్ పురస్కారాన్ని గ్రహించాడు. కాని శరత్‌బాబుని మాత్రం రవీంద్రుడు నోబుల్‌కి సిఫారసు చేయలేదు. ఎందువల్లనో? రవీంద్రుని తన గురువుగా భావించేవాడు శరత్. ‘ఎలాంటి దురవస్థలో సైతం మనిషిని ద్వేషించరాదు. చెడుగా కనిపించేవారని సంస్కరించే ప్రయత్నం చేయాలి. ఇది చాలా పెద్ద పని’ అనేవాడు శరత్. యుక్త వయసులో శాంతితో వివాహం జరిగింది. ఒక శిశువు కూడా జన్మించింది. కానీ, ఆ దాంపత్య సుఖం రెండేళ్లు కూడా మిగలలేదు. ప్లేగు మహమ్మారి శాంతిని, బిడ్డను పొట్టన పెట్టుకుంది. ఈయన జీవితమంతా ఒక ఉద్దేశ రహితమైన, దిశాహీన యాత్ర. తరువాత వివాహం గాంధర్వ పద్ధతిలో హిరణ్మయితో జరిగింది. జీవితం మారాకు వేసింది. రోజూ 10 లేదా 12 గంటలు చదివి, రెండు గంటలు రాసేవాడు. కుక్క ఖేలీ అతని ఆరు నెలల కష్టం ‘మాలిని’ వ్రాతప్రతిని చింపేసింది. మళ్లీ దానిని రాయలేదు శరత్‌బాబు. ప్రమథుడికి రాసిన ఉత్తరంలో ‘ప్రమథా! ఒక అహంభావ విషయం. క్షమిస్తానంటే చెబుతాను. ఒక్క రవీంద్రుని మినహాయిస్తే నాలాగా మంచి కథను, నవలను ఎవరూ రాయలేరు.’
22 ఆగస్టు 1913 తన మామ ఉపేంద్రనాథుడికి ఇంకా స్పష్టంగా రాశాడు. ‘నాకంటే ఎక్కువ తెలిసిన మర్మజ్ఞుడు రవీంద్రుడు. అతడు తప్ప మరొకడు లేడు. నేను గర్వపడుతున్నానని అనుకోకు. కాని ఇది నా పరిపూర్ణత్వం కావచ్చు. గర్వమూ కావచ్చు. నా అభిప్రాయం మాత్రం ఇదే!’
ఆ రోజుల్లో రవీంద్రుని ఇంట్లో సమావేశాలు జరిగేవి. ఎందువల్లో ప్రతిసారి అక్కడ ఎవరివో బూట్లు మాయం అయ్యేవి. ఒకరోజు శరత్‌బాబు కొత్త జోళ్లు వేసుకువెళ్లాడు. కొత్త జోళ్లు పేపర్లో దాచి చంకలో జాగ్రత్త పరిచాడు. రవీంద్రుడు ‘శరత్ చేతిలో ఆ పేకెట్ ఏమిటి?’ ‘ఏదో పుస్తకం’ రవీంద్రుడు - ‘ఏ పుస్తకం? బహుశా పాదుకా పురాణమా?’ శరత్ అవాక్కయ్యాడు కాని, అందరూ నవ్వేశారు.
శరత్ ప్రమథునికి రాసిన లేఖలో ‘మర్మాంగాలను విప్పి ఎవ్వరికీ చూపరు నిజమే! కానీ గాయపడ్డ అంగాలని చూపరా? గాయాలని నయం చేసే డాక్టర్ ఇవన్నీ పట్టించుకుంటాడా? సౌందర్య సృష్టిని మినహాయించి రచయిత గాయాలను కూడా చూడాలి. అది నయం చేయడానికి గాని, భయభీతిని కలిగించడానికి’ రచయిత వ్యక్తిగత జీవితం, రచనా జీవితం రెండూ ఒకటికావు అనేవాడు.
16 జనవరి 1938, అద్వితీయ రచయిత శరత్‌బాబు చనిపోయారు. కవికి వ్యక్తిత్వం ముఖ్యం అని విమర్శకులు అంటారు. మహా కవుల విషయంలో అది నిజమే! ఐతే శరత్ పాత్రలు శ్రీరామచంద్రులు కాదు. ఆయన కథనంలో, మథనంలో సామాజిక స్పృహలో నుండి ఆవిర్భవించిన వాస్తవ కుసుమాలు. వాటికి కళారూపాన్ని సంతరింపచేశాడు. అంటే ఆదర్శవాదానికి, యధార్థ వాదానికి సిద్ధాంతకంగా జరిగే సంఘర్షణలో శరత్ పాత్రలు వాస్తవానికి, సహజత్వానికి సన్నిహితంగా ఉంటాయి. అదే ఆయన విజయం, పరాజయం కూడా!

Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>