Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యం

$
0
0

నార్కట్‌పల్లి, మే 15: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బుధవారం సూర్యాపేటకు వెళ్తూ నార్కట్‌పల్లి వద్ద జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. నార్కట్‌పల్లిలో ఆయనను పూల మాలలతో ఘనంగా సత్కరించి ఆహ్వానించారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర పాలకుల పక్షపాత వైఖరి వలన వెనుకబాటుతనానికి గురైందని అందుకే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమను కూడా ఆంధ్రకు తరలించేందుకు కుట్రపన్నుతున్నారని తెలంగాణ ప్రజలంతా ఏకమై సీమాంధ్ర కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎండి రహీంఖాన్, జిల్లా నాయకులు సాగర్ల సైదులు, వెంకన్న, సత్తయ్య, అహ్మద్‌పటేల్, మండల నాయకులు కల్లూరి రఘుపతి, దేవేందర్, పసుపతి, రవి, ఎండి జాంద్, ఎం. సైదులు, సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం
వలిగొండ, మే 15: మండలంలోని సంగెంలో బుధవారం శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా, అంగరంగా వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా హోమం అనంతరం స్వామివారి తిరుకల్యాణోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణాలతో నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి, వలిగొండ సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకట్‌రెడ్డితో పాటు పరిసర గ్రామాల నుండి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కల్యాణోత్సవంలో చైర్మన్ కీసరి రాంరెడ్డి, బద్దం మల్లారెడ్డి, గర్థాసు మల్లయ్య, బద్దం సంజీవరెడ్డి, పబ్బతి మల్లేషం, కాసుల కృష్ణగౌడ్, కీసరి రంగారెడ్డి, నర్సింహ్మా, వెంకటరావు, బాజార్, సత్యనారాయణ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిసి ప్రణాళిక కోసం కలెక్టరేట్ ముట్టడి
నల్లగొండ టౌన్, మే 15: వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం 20వేల కోట్లతో బిసి ప్రణాళిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బిసిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, వైద్యుల సత్యనారాయణలు మాట్లాడుతు జనాభాలో 52శాతం మేరకు ఉన్న బిసిల అభివృద్దికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం 4వేల కేటాయించిందని, ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ మాదిరిగా బిసి సబ్ ప్లాన్‌ను 20వేల కోట్లతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చట్ట సభల్లోనూ బిసిలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, నాయకులు వైద్యం వెంకటేశ్వర్లు, నాగులపల్లి శ్యాంసుందర్, సిరిప్రోలు రమేష్, గంజి బిక్షమయ్య, చీకొండ వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, కూరెళ్ల విజయ్‌కుమార్, జినుకల శ్యాంసుందర్, దుడుకు లక్ష్మినారాయణ, గండిచెర్వు వెంకన్నగౌడ్, అరవిందర్, సతపూరి నారాయణ, శ్రీనివాస్‌యాదవ్, పిన్న వెంకటేశ్వర్లు, వావిరాల రమేష్, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా
* ఎడి ధర్మానాయక్ చొరవతో ఆందోళన విరమణ
* ఫోన్‌లో విద్యార్థులకు క్షమాపణ చెప్పిన రిజిస్ట్రర్
నల్లగొండ టౌన్, మే 15: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో తనిఖీకి వచ్చిన ఫ్లైయింగ్ స్క్వాడ్ మహిళా విద్యార్థులపై అసభ్య కరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ బుధవారం నల్లగొండలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కో ఆర్డినేషన్ సెంటర్ ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. పరీక్షా హల్‌లో ఫ్లైయింగ్‌స్క్వాడ్ బృందంలోని కంట్రోలర్‌లు డాక్టర్ వడ్డెమాన్ శ్రీనివాస్ అందరి ముందే మహిళా విద్యార్థులను స్వయంగా తడుముతు తనిఖీ చేశాడంటు విద్యార్థులు ధర్నాకు దిగారు. మహిళ విద్యార్థులను చెక్ చేయాల్సిన అవసరం వస్తే మహిళా అధికారులు మాత్రమే చేయాలని అదికూడా ప్రత్యేక హల్‌లోకి తీసుకెళ్లి చెక్ చేయాలని ఇతర విద్యార్థుల ఎదుట చేయడం మహిళలను కించపరచడమేనని ఆందోళన ఉదృతం చేశారు. మరోవైపు యూనివర్సిటీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ద్వంసం చేసేందుకు యత్నించారు. స్పందించిన నల్లగొండ రీజనల్ కో ఆర్డినేటర్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.్ధర్మానాయక్ విద్యార్థులకు నచ్చజెప్పి, యూనివర్సిటీ అధికారుల నిర్వాకానికి పదేపదే క్షమాపణలు చెప్పినప్పటికి వారు వినిపించుకోలేదు. యూనివర్సిటీ విసి, రిజిస్ట్రర్ వచ్చి జరిగిన సమస్యపై విచారణ జరుపాలని సదరు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మరోమారు ధర్మానాయక్ వారికి నచ్చచెప్పి చెబుతూ సమస్యను ప్రత్యేక యూనివర్సిటీ రిజిస్ట్రర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రర్ సుధాకర్, కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేష్ అధికారి కిరణ్మయిలు ఫోన్‌లో విద్యార్థులకు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

రాజకీయాల్లో ఉండాలంటేనే ఇబ్బందిగా ఉంది
వైరాగ్యంతో మాట్లాడిన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి
దేవరకొండ, మే 15: రాజకీయాల్లో ఉండాలంటేనే ఇబ్బందిగా ఉంది రాజకీయ విలువలు పడిపోతున్న ప్రస్తుత పరిస్ధితుల్లో రాజకీయనాయకునిగా పని చేయాలంటే మనసు చంపుకోవాల్సి వస్తోందని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుదవారం దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో ఉంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండలేక నమ్ముకున్న వారికి న్యాయం చేయలేక ఇబ్బంది పడుతున్నానని ఆయన తీవ్ర నైరాశ్యంతో చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకపోతుండడం, తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాలకు అనుగుణంగా పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం లేదన్న కారణం గానే ఇలా నిరాశతో మాట్లాడుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన నవ్వుతూ సమాధానాన్ని దాటవేశారు. 2014 ఎన్నికల్లో మీరు వేరే పార్టీలో చేరబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలు నిజమేనా అని విలేకరులు ప్రశ్నించగా అప్పటి వరకు ఎలాంటి పరిణామాలు ఉంటాయో వేచి చూడాల్సిందేనని చెప్పారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వైరాగ్యంతో మాట్లాడడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణను ప్రకటించాలని పార్టీ అధిష్టానం వద్ద గట్టిగా డిమాండ్ చేస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ అధిష్టానం పట్ల విసుగు చెందే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని ఆయన అభిమానులే గుసగసలాడడం కనిపించింది.

విషజ్వరాల బారినపడ్డ గిరిజనులను కాపాడండి
* సిపిఎం బృందం
నేరేడుచర్ల, మే 15: నేరేడుచర్ల మండలం శూన్యపహడ్ గ్రామాల్లో విషజ్వరాల బారి నుండి మెరుగైన వైద్య సేవలందించి గిరిజనులను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యుడు ములకలపల్లి రాములు కోరారు. ఆయన బుధవారం శూన్యపహడ్‌లో సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు పారేపల్లి శేఖర్‌రావు, మండల కన్వీనర్ కె.అనంతప్రకాష్ నాయకులు కె.నాగేష్, మర్రి నాగేశ్వర్‌రావు, ఎడ్ల సైదులు, ముశం నర్సింహ్మా, ఎన్.సైదులులతో కలిసి విషజ్వరాలతో బాధపడుతున్న గిరిజనులను పరామర్శించి అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటికీ అనారోగ్యంతో ముగ్గురు మృతిచెందారని మరో 70 మంది వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారన్నారు. గత ఐదు రోజులుగా గిరిజనులు విషజ్వరాలతో బాధపడుతున్న అధికారులు పారిశుద్యంపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. గిరిజనులకు నామమాత్రపు, అరకొర వైద్య సేవలందిస్తున్నారని ఆరోపించారు. కాలుష్యానికి కారణమైన పెన్నాథర్మల్ ప్రాజెక్టును, దక్కన్ క్రోమైట్ పరిశ్రమను మూసి వేయించాలని డిమాండ్ చేశారు. కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. మంత్రి చొరవ తీసుకుని గిరిజనులకు కార్పోరేట్ వైద్యసేవలందించి మృతులకు పది లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. పారిశ్రామిక, నదీపరివాహక ప్రాంతాల్లో వ్యాపించే వ్యాధులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
భువనగిరి, మే 15: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని గృహ నిర్మాణశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట సమీక్షా సమావేశానికి వెళ్తున్న మంత్రికి భువనగిరిలో నియోజకవర్గ ఇన్‌చార్జి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం పేదలకు పది లక్షల ఇండ్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా దేశంలోనే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి దానిని పటిష్టంగా అమలు చేసేందుకు కృషిచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీల కాలనీల అభివృద్ధి కోసం 1000కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల కోసం అవసరమయ్యే రుణ పరిమితిని ఎస్సీలకు లక్ష, ఎస్టీలకు లక్ష ఐదువేలు, ఇతరులకు 70వేల చొప్పున పెంచడం జరిగిందన్నారు. అదే విధంగా బాలికల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా బంగారు తల్లి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా బాలికలకు ఒకటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ప్రత్యేక ఉపకార వేతనాలు అందజేస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ప్రధానమని ప్రతీ కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. భువనగిరి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికొత్త పార్టీలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కార్యకర్తలకు తాము అండగా ఉంటామని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై యు పి ఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొత్నక్ ప్రమోద్‌కుమార్, నాయకులు కూర లక్ష్మయ్య, ఎండి.మజీద్‌బాబా, చామల ఉదయ్‌చందర్‌రెడ్డి, కొల్పుల కమలాకర్, రామాంజనేయులుగౌడ్, గోద శ్రీనివాస్, కుతాడి సురేష్, పంగరెక్కల స్వామి, దేవరకొండ నర్సింహాచారి, తోటకూరి వెంకటేష్‌యాదవ్, చిన్నం శ్రీనివాస్, చిందం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రా పార్టీల అంతం తెలంగాణ ప్రజల పంతం
* రాజకీయ శిక్షణ శిబిరంలో హరీష్‌రావు
సూర్యాపేట, మే 15: తెలంగాణ రాష్ట్రా ఏర్పాటును అడ్డుకుంటున్న ఆంధ్రా పార్టీలను ఈప్రాంతంలో అంతమొందించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ముందుకుసాగుతున్న టిఆర్‌ఎస్‌ను రాజకీయశక్తిగా మార్చడమే తెలంగాణ ప్రజల పంతంగా ముందుకుసాగాలని టిఆర్‌ఎస్ శాసనసభా ఉపపక్ష నాయకుడు టి హరీష్‌రావు పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ కార్యక్రమం బుధవారం పట్టణంలోని పాత మార్కెట్‌యార్డులో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణను సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా సమైఖ్యవాద పార్టీల కుట్రలను ప్రజలకు తెలియజేప్పి చైతన్యంకల్పించి వచ్చేఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించడంకోసం కార్యకర్తలు, నాయకులు శ్రమించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమానికి 2014 ఎన్నికలే చివరి పోరాటామని, ఇప్పుడు తెలంగాణ సాధించుకోకపోతే తెలంగాణవాదం తెరమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇచ్చిన తెలంగాణను టిడిపి అడ్డుకుందని, జగన్ పార్టీ తెలంగాణకు బద్ద శత్రువని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని కల్గించిదని, అందువల్లే నీళ్లు, నిదులు, ఉద్యోగాల్లో తమ హక్కులపై పోరాడే తత్వాన్ని ఇచ్చిందన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాకుండా అడ్డుపడటంతోపాటు ఉద్యమాన్ని అపహాస్యం చేశారన్నారు. ఆయన కొడుకు జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డు ప్రదర్శించారని, ఆయన పార్టీలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. డిప్యూటీ సిఎం, డిప్యూటీ చైర్మెన్ ఇలా అంతగా ప్రాధాన్యత లేని పదవులను ఇస్తున్నారన్నారు. తెలంగాణకు పైసానిధులుకూడా ఇచ్చేదిలేదని అహంకారంగా మాట్లాడిన సిఎం కిరణ్‌కు వచ్చే ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వేయకుండా తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. గతంలో కాంగ్రెస్, టిడిపిలతో పొత్తులు పెట్టుకున్నా ఆ పార్టీలు మోసగించినందున వచ్చే ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు స్పష్టంచేశారు. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణకు దక్కల్లోవద్దో అన్న విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు తనవైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కెవి.రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు. ప్రభుత్వానికి తెలంగాణ నుంచి 40 వేల కోట్లు, ఆంధ్రా నుంచి 13 వేల కోట్ల ఆదాయం లభిస్తుందని అయినప్పటికీ అందుకు అనుగుణంగా ఈప్రాంతానికి నిధులు కేటాయించకపోవడం వివక్షకు నిదర్శనమన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్స్ జెఎసి చైర్మన్ డాక్టర్ బూర నర్సయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు ఒంటేద్దు నర్సింహ్మరెడ్డి, రసమయి బాలకిషన్, గాదరి కిషోర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, కాకి దయాకర్‌రెడ్డి, తుముల ఇంద్రాసేనరావు, మిర్యాల వెంకటేశం, కాకి కృపాకర్‌రెడ్డి, కొణతం అప్పిరెడ్డి, నాగిరెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, శోభన్‌బాబు, వై.వెంకటేశ్వర్లు, హజారి రంగయ్య, గండూరి రమేష్, లవకుశ, కరుణకర్‌రెడ్డి, నాతి సవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ కళా బృందం అలపించిన పాటలు సభికులను ఊర్రూతలుగించాయి.

పాఠ్యపుస్తకాల సరఫరాపై సందేహలు..!
* సకాలంలో పుస్తకాలు జిల్లా చేరేనా..?
* జిల్లాకు కావాల్సినవి 25లక్షలు, అందినవి 16శాతం మాత్రమే
నల్లగొండ టౌన్, మే 15: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2013-14విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలు సకాలంలో చేరుతాయో లేదోనన్న సందేహాలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న వాటి అమల్లో మాత్రం విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యంతో ముందుసాగడంలేదు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన విద్యాశాఖ తమ విధుల నిర్వాహణలో మాత్రం ఇంకా తప్పటడుగులే వేస్తుంది. నిరక్షరాస్యులైన రైతులు సైతం వ్యవసాయ సీజన్‌కు ముందుగానే అసరాలకు అనుగుణంగా ముందస్తుగా ఎరువులను, విత్తనాలు సిద్ధం చేసుకుంటారు. కానీ... ఎంతో ఉన్నత చదువులు చదివిన విద్యాధికారులు మాత్రం తమ నిర్లక్ష్య పనితీరుతో విద్యాసంవత్సరం ప్రారంభంకల్లా పాఠ్యపుస్తకాలను సిద్ధం చేసుకోకపోవడం శోచనీయం. వాస్తవానికి ఇప్పటి వరకు 50శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాల్సిఉండగా కేవలం 16శాతం మాత్రమే అందాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, కస్తూర్బాగాంధీ పాఠశాలలలో 1నుండి 10వతరగతి వరకు దాదాపు 5లక్షలకు పైగా విద్యార్థులు ఉంగా వారికి 25లక్షకుపైగా పాఠ్యపుస్తకాలు అవసరమని అంచనా. తెలుగు, ఇంగ్లీషు మీడియం వారికి 22లక్షల పుస్తకాలు, ఉర్థు మీడియం వారికి 10వేల పుస్తకాలు అవసరం ఉన్నాయి. గత ఏడాడి జిల్లాకు వచ్చిన పుస్తకాలల్లో ప్రస్తుతం 9వేల పుస్తకాలు గోదాంలోనే ఉన్నాయి. జిల్లాలో గత ఏడాదితోపాటు ప్రస్తుతం అందిన పుస్తకాలతో కలిసి 3లక్షల 50వేల పుస్తకాలు ఉండగా సుమారు మరో 22లక్ష పుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది. ఇందులో పాఠ్యపుస్తకా ముద్రణలో ఆలస్యం కారణంగా సకాలంలో పుస్తకాలు విద్యార్థులకు అందే పరిస్థి కారణరావడంలేదు. గత ఏడాది సహితం ఇదే పరిస్థి నెలకొనగా విద్యా సంవత్సరం ఆరంభమై మూడు నెలలు గడిచి పాఠ్యపుస్తకాల పంపిణీ కొనసాగింది.
మారనున్న 4,5, 8, 9 పాఠ్యపుస్తకాలు ..!
ప్రస్తుత విద్యాసంవత్సం (2013-14) 4,5,8,9 తరగతుల పాఠ్యపుస్తకాలు సిలబస్ మారనుండగా వాటి ముద్రణలో తీవ్ర జాప్యం జరుగుతుంది. జిల్లాకు కావాల్సి పాఠ్యపుస్తకాల ఇండెంట్ ప్రతిపాదనను డైరెక్టరేట్‌కు ముందస్తుగానే పంపినప్పటికీ పుస్తకాల సరఫరాలో ఆలస్యం తప్పడంలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ 12నాటికి విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడం సందేహంగా కనిపిస్తుంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి తీవ్ర ఆందోళ వ్యక్తమవుతుండగా ఇకనైన విద్యాశాఖ మేల్కోని పాఠ్యపుస్తకాల పంపిణీ వేగవంతం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బదిలీల గడువు ముగిసినా...కొనసాగుతున్న కౌన్సిలింగ్
పగలు..రాత్రిళ్లూ ఉపాధ్యాయుల పడిగాపులు
వివాదాల మధ్య సాగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియ
మిగిలిపోయిన మరో 2500ఉపాధ్యాయుల కౌన్సిలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, మే 15: ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గడువు బుధవారం నాటితో ముగిసిపోయినా నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. గత ఏడాది కౌన్సిలింగ్ సందర్భంగా ఏర్పడిన వివాదాల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోని విద్యాశాఖ నిర్వాకం కారణంగా ఈ ఏడాది కూడా ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ పగలు..రాత్రి తెల్లవార్లు అంతరాయాలతో సాగుతు ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష పెడుతుంది. తమ వంతు బదిలీ తతంగం ఎప్పుడు వస్తుందో తెలియక ఉపాధ్యాయులు, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు రెండు రోజుల పాటు నల్లగొండ కౌన్సిలింగ్ కేంద్రం డైట్ కళాశాల ప్రాంగణంలో పగలు..రాత్రి పడిగాపులు పడుతున్న తీరు కౌన్సిలింగ్ ప్రక్రియ వైఫల్యానికి అద్దం పడుతుంది. మంగళవారం నాటికి ఎస్‌జిటి ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు 1వ నెంబర్ నుండి 1500వరకు జరుగాల్సివుండగా బుధవారం అర్ధరాత్రి వరకు కూడా 600వరకే పూర్తయింది. వీరిలో మిగిలిపోయిన 900మందితో పాటు బుధవారం కౌన్సిలింగ్‌కు హాజరైన 1501నుండి 3157ఉపాధ్యాయులు 1657మందితో కలిపి మొత్తం 2557మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ కేంద్రంలోనే శుక్రవారం తెల్లవారుజాము వరకు కూడా ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. స్పౌజ్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ఉపాధ్యాయులు పోటీ పడుతున్న నేపధ్యంలో నెలకొంటున్న వివాదాల కారణంగా కౌన్సిలింగ్‌లో జాప్యానికి దారితీస్తుందన్న విమర్శలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ జాబితా మేరకు కొంత మంది ఉపాధ్యాయులు తమకున్న అర్హతల కంటే ఎక్కువ అర్హతలు చూపిస్తుండటం, సినీయార్టీ జాబితాల తయారీలో విద్యాశాఖ అధికారులు తప్పులు, ఉపాధ్యాయ సంఘాల నేతల పైరవీలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా ఉపాధ్యాయ కౌన్సిలింగ్‌కు అంతరాయాలు కల్పిస్తున్నాయంటు సాధారణ ఉపాధ్యాయులు ఆరోపించారు. ఈ నేపధ్యంలో నిబంధనల మేరకు కౌన్సిలింగ్ కొనసాగించేందుకు పట్టుదలతో ఉన్న డిఇవో ఆచార్య జగదీష్ పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సిలింగ్ కొనసాగిస్తుండటం గమనార్హం. అయితే పిఆర్‌టియుకు చెందిన ఎమ్మెల్సీ పూల రవిందర్ కౌన్సిలింగ్ తీరుతెన్నులను పరిశీలించే పేరుతో పదేపదే కౌన్సిలింగ్ కేంద్రానికి రావడంతో మిగతా ఉపాధ్యాయ సంఘాల వారు కూడా కౌన్సిలింగ్ వద్ధ తమ సంఘాల ఉపాధ్యాయులకు అండగా ఉంటామంటు అక్కడికి వస్తుండటం కూడా కౌన్సిలింగ్‌కు ఇబ్బందికరంగా తయారైంది. కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసే వరకు గురువారం అర్ధరాత్రి వరకు కూడా సమయం పట్టవచ్చని ఉపాధ్యాయులు భావిస్తు అప్పటిదాక అరకొర సౌకర్యాల మధ్య వేసవి ఎండల తాపం..మంచినీటి కొరతలతో ఎట్లా ఉండేదంటు ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టడం కనిపించింది. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చిన మహిళా ఉపాధ్యాయుల బాధతలు వర్ణాతీతంగా ఉండగా కౌన్సిలింగ్ ఆలస్యంపై వారు విమర్శలు గుప్పిస్తు తమవంతు కోసం రాత్రుళ్లు కూడా అక్కడే నిరీక్షించడం విశేషం.

శాసన సభపక్ష ఉప నాయకులు హరీష్‌రావు
english title: 
trs

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>