హిందూపురం రూరల్, మే 27: విచ్చల విడిగా బెల్ట్‌షాపుల ఏర్పాటుతో తమ భర్తలు వ్యసనాలకు లోనై ఆర్థికంగా కుటుంబాలను దెబ్బతీస్తున్నారని మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వీవర్స్‌కాలనీ పరిధిలో నిర్వహిస్తున్న పలు మద్యం, కల్లు బెల్ట్‌షాపులపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అనంతరం బెంగళూరు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రూరల్ మండల పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన పలు మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున బెల్ట్‌షాపులు తొలగించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు శాంతమ్మ, నాయకులు హెచ్‌ఎన్ రాము, ఆంజనేయులు, వివిధ మహిళా సంఘాల సభ్యులు, మదర్‌థెరిసా ట్రస్టు సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఎవరికీ పట్టని నెహ్రూ విగ్రహం!
అనంతపురం సిటీ, మే 27: నెహ్రూ వర్థంతి జరుపుకోవడంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. నగరంలో రెండు నెహ్రూ విగ్రహాలు ఉన్నా వాటివైపు కనె్నత్తి చూసిన వారు లేరు. సోమవారం నెహ్రూ వర్థంతి సందర్భంగా విగ్రహాలను శుభ్రం చేయడంగానీ, దుమ్ము దులపడం గానీ చేయలేదు. సర్ థామస్ మన్రో జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రులు, ఎంపి, ఇన్‌చార్జి కలెక్టర్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అయితే కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న నెహ్రూ విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడం గమనార్హం. జెఎన్‌టియూ ఇంజనీరింగ్ కాలేజి ముందు 2011 మార్చి 31 నెహ్రూ విగ్రహం ఏర్పాటు చేశారు. సోమవారం నెహ్రూ వర్థంతి అన్న విషయాన్ని వర్శిటీ అధికారులు మరచినట్టున్నారు. అందుకే అటువైపు కనె్నత్తయినా చూడలేదు. దేశనేతల విగ్రహాలు ఏర్పాటుచేయడమే కాదు, వారి జయంతులు, వర్ధంతులు నిర్వహించుకోవాల్సిన కనీస కర్తవ్యం మనదే అన్న విషయం మరచిపోతే ఎలా.