Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తనదాకావస్తే..! (కథ )

$
0
0

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ మొదలయింది.
క్యాంపు కార్యాలయం సందడిగా వుంది. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ చేతబట్టుకొని ఆనందంగా వస్తున్న ఉపాధ్యాయులు కొందరైతే, ఈ వేసవి ఎండల్లో ఇదొక తప్పనిసరి గొడవరా బాబూ!.. అనుకుంటూ నిరుత్సాహంతో, నీరస మొహాలతో వస్తున్న వాళ్ళు మరికొందరు. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఓపిక వుండగానే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి.. అనుకొని స్పాట్ అపాయింట్‌మెంట్ కోసం చెట్ల కింద పడిగాపులు పడేవాళ్ళు ఇంకొందరు. ఇలా చిన్న తిరుణాళ్ళలా వుంది అక్కడి వాతావరణం.
అక్కడున్న వారిలో విశ్వనాథం ఒకడు. విశ్వనాథానికి స్పాట్ వాల్యుయేషన్ కొత్తేమీ కాదు. అతను ఇరవై సంవత్సరాల నుండి స్పాట్‌కు వస్తున్నాడు. అతనికి స్పాట్ ఒక ఆటవిడుపు. రోజూ బడికి వెళ్ళి చెప్పిన పాఠాలే చెప్పి విసుగుపుట్టిన మనస్సుకు స్పాట్ కాస్త ఉపశమనం కలిగిస్తుందని అతని అభిప్రాయం. అంతేకాదు, పాత మిత్రులందరినీ కలుసుకోవచ్చు. వచ్చే రెమ్యునరేషన్‌తో ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చన్నది అతని భావన. ఇదంతా తనకు సుపరిచితమైన వాతావరణమేననుకుంటూ అందరి మనోభావాలనూ పసిగడుతూ, తన అనుభవాన్ని మేళవించుకుంటూ హిందీ విభాగానికి వెళ్ళి అక్కడి అసిస్టెంట్ క్యాంపు ఆఫీసరు గారికి తన ఆర్డరు కాపీ, రిలీవింగ్ సర్ట్ఫికెట్ ఇచ్చి జాయిన్ అయినట్లు సంతకం చేసి క్యాంటీన్ వైపు నడిచాడు విశ్వనాథం. క్యాంటీన్ వద్ద కోలాహలంగా ఉంది.
తను గతంలో పనిచేసిన పాఠశాలల్లోని ఉపాధ్యాయ మిత్రులు కొందరు కనబడితే వారితో ట్రాన్స్‌ఫర్ల గురించి, ప్రమోషన్ల గురించి, రాబోయే పిఆర్‌సి గురించి కొంతసేపు బాతాఖానీ కొట్టాడు కాఫీ తాగుతూ.. తొలిరోజు ఇరవై పేపర్లే ఇచ్చారు. తనకున్న అనుభవంతో గంటలోపే వాటిని వాల్యూ చేశాడు. తరువాతి రోజు నుండి నలభై పేపర్ల చొప్పున ఇచ్చారు. అలా ఎన్ని పేపర్లు ఇచ్చినా ఒక గంటలో వాల్యుయేషన్ పూర్తిచేయటం విశ్వనాథం ప్రత్యేకత. ఏ పేపరునూ పూర్తిగా చదివి దిద్దే అలవాటే లేదు. చేతివాటంకొద్దీ మార్కులు వేసుకుంటూ వెళ్తాడు. ప్రతి అక్షరం చదివి దిద్దితే ఈ జన్మకు వాల్యుయేషన్ పూర్తికాదన్నది అతని విశ్వాసం.
‘విశ్వనాథం గారూ..! ఏమిటీ వాల్యుయేషన్ కొంచెం జాగ్రత్తగా చేయండి’ అని ఆఫీసరు గారు ఒకటికి రెండుమార్లు హెచ్చరించినా తన ధోరణి మార్చుకోలేదు విశ్వనాథం. ఇవన్నీ మామూలే కదా అని మనస్సులో నవ్వుకున్నాడు.
మధ్యాహ్నం క్యాంటీన్ దగ్గర ‘టీ’ తాగుతుంటే విశ్వనాథానికి నరహరి కనిపించాడు. విశ్వనాథం పనిచేసే స్కూలులోనే నరహరి కూడా పనిచేస్తున్నాడు.
‘సార్! ఎక్కడిదాకా వచ్చారు’ అడిగాడు నరహరి.
‘ఈరోజుకు వాల్యుయేషన్ అయిపోయిందోయ్!’ అన్నాడు హుందాగా కళ్ళజోడు సవరించుకుంటూ. ‘ఎలా అయినా మీరు సీనియర్ కదా’! అంటూ వ్యంగాస్త్రాన్ని సంధించి ‘నావింకా సగం పేపర్లు మిగిలివున్నాయి, వస్తాను’ అని చెప్పి తాను పేపర్లు దిద్దే గదివైపు నడిచాడు నరహరి.
‘కొత్తగదా! పిల్లకాకి’ అనుకున్నాడు విశ్వనాథం.
స్పాట్ వాల్యుయేషన్ పదిరోజులు జరిగింది. ఈ పదిరోజులూ సరదాగా గడిచిపోయాయి విశ్వనాథానికి.
***
సుజాత తెలివైన పిల్ల. చురుకైనది. బాగా చదువుతుంది. పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులందరిలోనూ సుజాత ముందుంటుంది. పాఠశాలలో నిర్వహించిన అన్ని పరీక్షలలోనూ మంచి మార్కులు తెచ్చుకొని ‘టాపర్’గా నిలిచింది. ‘పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి గ్రేడ్ తెచ్చుకొని ‘టౌన్ టాపర్’గా రావాలని ఉపాధ్యాయులందరూ సుజాతను ప్రోత్సహించేవారు. సుజాతకు బాగా చదువుకొని డాక్టరై పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేయాలని వుంది.
ఆరోజు ఫలితాలు వెలువడేరోజు. ఇంటర్నెట్‌లో ఫలితాలు చూసుకునేందుకు సుజాత తన స్నేహితురాళ్ళతో కలిసి ఇంట్లో కంప్యూటర్ గదిలో కబుర్లు చెబుతూ కూర్చుంది. ఎట్టకేలకు ఒక గంట గడిచాక మంత్రిగారు ఫలితాలను విడుదల చేశారనే వార్త టీవీలో చూసి నెట్ ఓపెన్ చేసింది. రిజల్ట్ చూసుకున్న సుజాత ముఖం వివర్ణమైంది. అప్పటివరకు వున్న ఉత్సాహం ఆవిరైపోయింది. అన్ని సబ్జెక్టులలోనూ మంచి గ్రేడు సంపాదించిన సుజాతకు హిందీలో మంచి గ్రేడు రాలేదు. సుజాత దుఃఖానికి అంతులేదు. వెక్కివెక్కి ఏడవటం మొదలుపెట్టింది. కూతురు ఏడుస్తుంటే విశ్వనాథం మనస్సు కరిగిపోయింది.
‘బాగా రాశాను నాన్నా! నాకు మార్కులు తగ్గటానికి వీల్లేదు. హిందీ పేపరు దిద్దిన వాళ్ళెవరో చదవకుండా మార్కులు వేసేశారు!’ అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆ మాటలు విశ్వనాథాన్ని ఇబ్బందిపెట్టాయి. బాణాళ్లా ఎక్కడో గుచ్చుకున్నాయి. చెంప చెళ్లుమనిపించినట్లు తగిలాయి. తను ఏదో తప్పుచేసినట్లు అంతరాత్మ హెచ్చరించింది. అనేక ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి. స్పాట్ వాల్యుయేషన్‌లో తాను త్వరత్వరగా పేపర్లు దిద్దుతూ తోటివాళ్ళని పిచ్చివాళ్లలా చూసిన సంఘటనలు కళ్ళముందు కదిలాయి. తను ఇరవై సంవత్సరాల నుండి నిర్లక్ష్యంగా పేపర్లు దిద్ది ఎందరి పిల్లల ఉసురుపోసుకున్నానోననే పశ్చాత్తాపం పొడచూపింది.విశ్వనాథం ఆత్మపరిశీలనలో పడ్డాడు!!

సంగాపు వెంకట కోటేశ్వరరావు, ఆంగ్లోపాధ్యాయుడు,
మంగళగిరి. సెల్: 9493501172

కార్డుముక్క కత..

పెద్దదిక్కు!
‘నగరంలో ఇళ్ళ అద్దెలు విపరీతంగా పెరిగేయి. మన దొడ్లో గదిలోని పాత సామాను తీసివేసి అద్దెకిస్తే నెలకి వెయ్యి రూపాయలు వస్తాయి. ఇంటి పన్నుకి, కరెంటు బిల్లుకి ... ఏడాదికి పనె్నండు వేలు ఆదాయం...’ శ్రీమతి చెప్పిన మాట నచ్చి గది బాగుచేసి గేటుకి ‘టు లెట్’ బోర్డ్ తగిలించి వెనుదిరిగేసరికి ఆమె..! స్వాతికిరణంలో రాధికలా.. ప్రశాంతమైన ముఖం.. చిరునవ్వు.. తలమీద నాలుగు వెండి తీగలు! ఇల్లు చూపించాను.. నచ్చింది.. వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి రేపు వస్తానని చెప్పి వెళ్ళింది.
పది రోజుల్లో మాలో ఒకరిగా కలిసిపోయిందామె.
మా ఇంటి ఎదురుగా భక్తవత్సలం నాయుడి బిల్డింగ్. మేమా పెంకుటిల్లు కొనుక్కుని ఇరవై సంవత్సరాలైనా ఆయనతో నాకు పెద్ద పరిచయం లేదు. వీధిలో అందరికీ ఆయనంటే అదో ఇది. ఆయన తల్లి ఆత్మహత్య చేసుకుందని.. తండ్రి ఆవేదనతో మరణించాడని అంటారు కొందరు. లేదు వీటిన్నిటికీ కారణం వాళ్ళ ఔట్‌హౌస్‌లో ఉండే ‘వింధ్యవాసిని’ అనే బ్రాహ్మణ స్ర్తి అని, ఆమె చాలా మంచిదని, తల్లి చనిపోతే నాయుడు ఆమెను ఇంటి నుంచి పంపేశాడని, అందుకే కొడుకు చేసిన పనికి బాధపడి ఆయన చనిపోయాడని, ఆమె చాలామంచిది కాబట్టి ఆమెను ఇంటి నుంచి పంపిన పాపానికే నాయుడికి పిల్లలు పుట్టలేదని... ఇలా ఏవేవో కథలు చెపుతుంటారు.
‘నాయుడుగారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు’ అని వాళ్ళ పనిమనిషి చెపితే వెళ్లేను. ‘మీ ఇంట్లో అద్దెకున్న ఆమెను మా ఇంటికి పంపాలి మీరు’ అన్నాడాయన. ‘ఎందుకలాగ?’ ఆశ్చర్యంగా అడిగేను.
ఆమె ఒకప్పుడు ఈ ఇంటి మనిషే. కొన్ని కారణాల వల్ల నేనే ఆమెను బయటకు పంపేను. అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు గదా. అమ్మా, నాన్న పోయారు. ఇప్పుడీ ఇంటికి పెద్దదిక్కు లేదు. అప్పట్లో ఆమె కోసం చాలాకాలం వెతికించాను. ఇప్పటికి మీ ఇంట్లో కనిపించారు. నాన్నగారి స్నేహితురాలు. నామాటగా చెప్పి ఆమెను ఈ ఇంటికి పంపితే కృతజ్ఞడినై వుంటాను’ అన్నారాయిన.
తండ్రి ఫ్రెండ్‌ని ఇంటికి పెద్దదిక్కుగా ఆహ్వానిస్తున్న ఆయన్ని అభినందించి మా ఇంటికి వచ్చాను.
ఉదయం సూర్యనమస్కారాలు చేస్తూ ఎదురింటి వైపు చూశాను. బాల్కనీలో వింధ్యవాసిని! చిరునవ్వుతో పలకరింపులు! పెద్దదిక్కు కదా అందుకే పైన..!!

- విఎస్ రామలక్ష్మి, విజయవాడ

ఆనాటి కథలు.. ఆణిముత్యాలు - 11

తొలితరం తెలంగాణ కథానికా రచయిత్రుల్లో ప్రముఖ విదుషీమణి - నందగిరి ఇందిరాదేవి గారు. ఆమె 1919 సెప్టెంబర్‌లో హన్మకొండలో జన్మించారు. నారాయణగూడ బాలికల పాఠశాలలో, తర్వాత మహారాష్టల్రోని థాకర్‌సే మహిళా విశ్వవిద్యాలయంలోనూ ఆమె చదువుకున్నారు. బిఏ పట్టా పొందారు. పధ్నాలుగో ఏట పాఠశాల తరపున సాహిత్య సంచికల్ని వెలువరించారు. ఎన్నడో 1940లోనే ఆమె అధ్యక్షతన హైదరాబాద్ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని నిర్వహించారు. 1995లో ‘మసకమాటున మంచి ముత్యాలు’ పేరున అరవై ఏళ్ల రేడియో ప్రసంగాల్ని ఎంపిక చేసి ప్రచురించారు. ఇందిరాదేవి గారు సాంఘిక సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేశారు. వాటిలో ముఖ్యమైనది బాల్య వివాహాల పట్ల నిరసన. అందువల్లనే తాను స్వయంగా మేజర్ అయిన తర్వాతనే ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె భర్త నందగిరి వెంకట్రావు గారు ఆంగ్ల, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసిద్ధ కథా రచయిత. ఇందిరాదేవి గారి కథలు భారతి, గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, ఆంధ్ర కేసరి, శోభ, ప్రజామిత్ర, వనితాజ్యోతి వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కుటుంబ వ్యవస్థ, స్ర్తి పురుష సంబంధాల్లోని వైరుధ్యాలు, సామాజిక సమస్యలు, మనిషి మనస్తత్వ వైచిత్రి వంటి అనేక అంశాల్ని ఇతివృత్తాలుగా చేసుకొని ఆమె ‘వాయిద్యం సరదా’, ప్రథమ పరిచయం’, ‘ప్రాప్తం’, ‘ఏకాకి’ వంటి చాలా కథలు రాసినా - సుమారు పాతిక మాత్రమే లభ్యమైనాయి. వాటిల్లో మనుషుల్లోని సున్నితమైన మానసిక విశే్లషణని ఆవిష్కరిస్తూ రాసిన చాలా మంచి కథ ‘పందెం’ ఈ వారం ఆణిముత్యం!

‘ఉరి’పై చర్చలో కొత్తకోణం.. ‘పందెం’!

సేట్ రాజారాం ఇంట్లో విందు, మందు. స్నేహితులంతా కబుర్లు చెప్పుకుంటున్నారు. చర్చలు సాగుతున్నై. సీసాలు ఖాళీ అవుతున్నై. చర్చ ఉరిశిక్ష మీదికి మళ్లింది. ‘మీరు ఏమన్నా అనండి. యావజ్జీవం ఖైదు శిక్ష అనుభవించటం చాలా ఘోరం. అంతకంటె రెండు నిమిషాల్లో ప్రాణం పోయేటట్లు ఉరి తీయటం మంచిది’ అన్నాడు రాంలాల్ పట్టుదలగా. నరోత్తం దాసు - బతికుంటే బలుసాకు తినొచ్చు, యావజ్జీవమే మేలన్నాడు. సేటు మాత్రం ఉరిననుభవించటమే తేలిక అనే అభిప్రాయాన్నిచ్చాడు. వాదప్రతివాదాలు రేగినై. వాదన ముదిరింది. నరోత్తం దాసుకీ, సేటుకీ మద్యం పందెం ఖాయమైంది. సేటు రాజారాం తోటలో పదేళ్లపాటు నరోత్తం దాసు ఏకాంతవాసం చేయాలి. పదేళ్లకు రెండు నిమిషాలు తక్కువయినా - పందెం నిలవదు. అలా పదేళ్లు గడిపితే సేటు రెండు లక్షలు నరోత్తం దాసుకు కుమ్మరించాలి! షరతులు, ఒప్పందం తయారయ్యాయి. ఖైదీకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. పుస్తకాలు, భోజనం, వస్తువులు సమకూరుస్తారు. కావాలంటే ఉత్తరాలూ రాసుకోవచ్చు.
మొదటి సంవత్సరం చాలా విసుగ్గా, విచారంగా గడిపాడు ఖైదీ. ఏడ్చేవాడు. ఆ తర్వాత - పగలూ రాత్రీ చదువే చదువు. కోకొల్లలుగా పుస్తకాలు తెప్పించుకుంటున్నాడు. ఒకనాడు సేటుకు పది భాషల్లో ఒక ఉత్తరం రాశాడు ఖైదీ! సేటుకి ధీమా. దాసు పదేళ్లు ఇలా ఒంటరిగా గడపబోయాడా? అని. నాలుగేళ్లు గడిచినై. దాసుకు బాధేం లేదని తెలిసింది.
పదేళ్ళు నిండే సమయం వచ్చింది - రేపు ఉదయమే. కాలంలో మార్పు పరిస్థితుల్లోనూ ఎన్నో మార్పుల్ని తెచ్చింది. సేటు ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. రేపు రెండు లక్షలిస్తే తాను బిచ్చమెత్తుకోవలసిందే! దిగులు పుట్టింది. ఆలోచించాడు. రాత్రి గడుస్తోంది. తుంపర మొదలైంది. చిన్న కత్తి, తాళంచెవుల గుత్తీ, టార్చిలైట్ తీసుకుని బయల్దేరాడు. అడుగడుగునా ఉత్కంఠ! తలుపు తీసి చివరికి లోపలికి వెళ్లాడు. చిక్కిశల్యమైంది ఖైదీ శరీరం. కుర్చీలో వాలి టేబుల్ మీద పడిపోయి వున్నాడు. ఇప్పుడు పొడిచేయటం తేలిక అనుకున్నాడు సేటు. ఇంతలో టేబుల్ మీద ఉత్తరం చూశాడు సేటు. చదివాడు. ‘ప్రపంచం అంతా మిథ్య. జీవితం బుద్బుదప్రాయం’. ‘ఇన్ని పుస్తకాల జ్ఞాన సారం వ్యర్థం. ఎంతటివాడికయినా చావు తప్పదు. ప్రపంచం అబద్ధాన్ని నిజం అంటుంది’. ‘నాకు ప్రపంచం మీద విసుగుపుట్టింది. ఇవేవీ నన్నాకర్షించవు’. ‘నాకీనాడు డబ్బు అవసరం లేదు’. ‘కనుక నేను నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లిపోయి మన ఒప్పందం విచ్ఛేదం చేస్తున్నాను’... ఇలా సాగింది ఉత్తరం.
‘సేటు ఇదంతా చదివి కాగితం అక్కడే పడేసి ‘నూరేళ్లు జీవించునాయనా’ - అని నెమ్మదిగా వెళ్లిపోయాడు. తెల్లవారి చౌకీదారు ఖైదీ పారిపోయాడని బిక్కమొహం వేసుకొని చెప్పాడు. రాజారాం సేటు తన బల్ల మీద వున్న రెండు లక్షల ఒప్పందం రాసిన పత్రం వంక ఒక్కమాటు చూసి డ్రాయరులో పడేశాడు’ అని కథ ముగిసింది!
మనుషుల స్వభావాల్లోని వైరుధ్యమేకాక, వైపరీత్యాన్ని చిత్రించింది ‘పందెం’ కథ. పందెంలో ఓడిపోతాననే భయంతో స్వార్థంతో విద్రోహానికే తెగించాడు సేటు. గెలుపు ఓటములు రెండూ ఒకటే అన్న వేదాంతంలోపడి జీవనలాలసకీ, ధనాశకీ మధ్యన వున్న విభజన రేఖని అర్థం చేసుకున్నాడు నరోత్తం దాసు. స్థితప్రజ్ఞుడిగా, భ్రష్టయోగిగా వెళ్లిపోయాడు. చిన్న కథలో ఎంతో విలువైన జీవన వేదాంతాన్నీ, శాశ్వతమైన విలువల్నీ ప్రతిపాదించి, కథాత్మక శిల్పంతో కథకే ఔన్నత్యం చేకూర్చారు ఇందిరాదేవి గారు. ఎన్నడో 1941 జనవరి ‘గృహలక్ష్మి’లో ప్రచురితమైనదీ కథ. ఆ తర్వాత ఉరి అంశంగా ఎంత సాహిత్యం వచ్చిందో పాఠకులకు తెలుసు! ఇందిరాదేవి గారు ఆవిధంగా స్రష్ట మాత్రమేకాదు ద్రష్ట కూడా!!

- విహారి, సెల్: 9848025600

మనోగీతికలు

నిన్న.. నేడు.. రేపు.. ఆమె!

నిన్న..
ఆమె అభిసారిక
అందం అప్సరసల వారసత్వం
నడక రాజహంసల రాజసత్వం
పిలుపులు
మమతల కోకిల గానాలు
ముచ్చట్లు
అందంగా సాగిపోయే
సన్నజాజి తీగలు
నవ్వులు
వర్షించే తొలకరి చిరుజల్లులు
ఆకారం అందమయిన
ఒంపుసొంపుల నయాగరం
నేడు..
ఆమె కామరాక్షస
డేగల సమ ఆహారం
అరుపులు ఆర్తనాద కాకుల గోలలు
నవ్వులు గుచ్చుకునే
మనోవేదనా ముళ్ల రోదనలు
ఆకారం హోరుగాలి
హోరెత్తించిన నిస్సత్తువ వృక్షం
రేపు..
ఆమె రోహిణీ సూర్యుని
విలయ తాండవం
చూపులు
అరుణకాంతులు వెదజల్లే
ఎర్రని జ్యోతులు
మాటలు
గర్జించే సింహగర్జనలు
పాటలు
విప్లవాగ్ని జ్వాలలు
ఆకారం
ఆవేశం, ఆగ్రహం
సమాహారాల
మరో
శక్తిస్వరూపం!

- మర్రి ప్రభాకర్ (అసాజీ), పెనుగంచిప్రోలు. సెల్: 9490357936

గుణపాఠాలు
పచ్చని చెట్టుకు
లేని స్వార్థం
మేధోజీవినన్న
మనిషికే వుంది
విశాలమనుకున్న
మనిషి మనస్సు ప్రాంగణం
అహంకార పొరలతో
గర్వాలంకారంతో
కుంచించుకుపోతోంది
మనిషీ.. ఏవీ నీ జపతపాలు
నీ ఆప్యాయతల
మాటల పలకరింపులు
నీ ఆరాధనోత్సవాలు
నీవేదో ఆ ధర్మాచరణాల్లో
ఆమడదూరం
మనుషుల డబ్బు
దసఖత్, ఖాన్‌దాన్
అన్నీ కాలగర్భంలో
ఒకనాటికి కనుమరుగు
అపార్ట్‌మెంట్లు, నీ మహల్‌లు
శాశ్వత సౌధాలుగా నిలుస్తాయా?
అన్నీ అలంకరించుకున్న
నిర్మాణ సమూహాలు
కృత్రిమ అందాలు
అసహజ పరిసరాలు
ప్రచారాల ప్రభావాలు
ప్రపంచం నడుస్తున్న తీరును
గ్రహించే సూక్ష్మదృష్టిపై
సాగిపోతున్న ఘనత
నేడు స్వయంకితాబుల
మతలబుల గ్రహణశక్తి
అయ్యాడు మనిషి
ఏదిఏమైనా...
మమతల నగలే
మానవతా
నవ్యకాంతులు
నిత్య నడవడిలో నేర్చుకునే
గుణపాఠాలు!!

- ఆంజనేయులు, ఖమ్మం. సెల్: 7702537453

ఇదేం పోకడ!
అస్తవ్యస్త వ్యవస్థకు
ఒక క్రమమార్గం చూపేందుకు
నాటి పాలకులకు
అండగా నిలిచిన మతం
మనిషి ఎలా జీవించాలో
నేర్పాల్సిన మతం
మనిషి జీవితానే్న
అంతం చేస్తోంది!
మనిషి కోసమే మతం అన్నది మరచి
మతం కోసం
మనిషి అనే చందంగా మారాడు
మానవత్వాన్ని నింపాల్సిన మతం
మానవుడన్న సంగతే మరిపిస్తోంది
మోక్షాన్ని చూపిస్తుందనుకున్న మతం
నిర్దాక్షిణ్యంగా
నరకంలోకి తోసేస్తోంది
మతాల కుమ్ములాటలతో
మతం చెప్పే కరుణ, జాలి, దయ
మచ్చుకు కూడా కానరాని
మతవ్ఢ్యౌం
దేవుణ్ని చూపిస్తుందనుకున్న మతం
తనతో ఉన్న మనిషిని కానడం లేదు
నిరాశా నిస్పృహలను
తొలగించాల్సిన మతం
మనిషికి శాంతిని మృగ్యం చేస్తోంది
మానవసేవే మాధవసేవ అన్నది
తారుమారై విరాజిల్లుతోంది
నిజంగా
మతం మనిషి కోసమా..
మనిషే మతం కోసమా?
ఓ మనిషీ తెలుసుకో
జ్ఞానివై మసలుకో!!

అద్దంకి సుధాకర్
జగ్గయ్యపేట
సెల్: 89850 61346

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ మొదలయింది.
english title: 
t
author: 
సంగాపు వెంకట కోటేశ్వరరావు

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>