ఒంగోలు, జూన్ 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమకూర్చి రాష్ట్రంలోని కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా తన వంతు కృషి చేస్తునట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్యక్షత అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు చాలావరకు దినదినాభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ఇటీవల పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా మూడు కార్పోరేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఒంగోలు, చిత్తూరు, ఖమ్మం కార్పోరేషన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించి కార్పోరేషన్‌కు మంచి పేరుప్రతిష్టలు తీసుకొని రావాలని, లేనిపక్షంలో అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. తొలుత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంత్రి మాట్లాడుతూ చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సేవ చేయాలని మంత్రి వారికి సూచించారు. వివిధ రకాల పనులు చేసే విషయంలో ఇంజనీరింగ్ అధికారులు ఆలసత్వం వ్యవహరిస్తున్నారని, ఇకనుండి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెండర్లు తీసుకొని పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను అవసరమైతే బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆయన సూచించారు. పనులు నిర్థేశించిన సమయంలో పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులన్నింటిని జూలై నెలాఖరు నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీని ఏర్పాటుచేసి సుందరంగా తీర్చిదిద్దేలన్నారు. ఒంగోలులో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు నెలలలోపు అన్ని పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడుతూ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా భవన నిర్మాణాలు చేస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీజనల్ డైరెక్టర్‌ను పిలిచి అవసరమైతే కొన్ని ప్రాంతాలను తనిఖీ చేసి అవసరమైన సలహాలు, సూచనలు ఆయన నుండి తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. రెవెన్యూ అధికారులతో మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 30వ తేదిలోగా పన్నులు ప్రజలు చెల్లిస్తే అలాంటి వారికి ఇంటిపన్నులో వడ్డీ రాయితీ ఇవ్వాలని సూచించారు. ఆస్తి, కుళాయిలు, ఇతర పన్నులు వసూలుచేయడంలో ఒంగోలు కార్పోరేషన్ కొంత వెనుకబడి ఉందని, నూటికి నూరు శాతం పన్నులను వసూలు చేసి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవాలని సూచించారు. తాను ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నానని, అయితే అధికారులు బాధ్యతారహితంగా పనిచేస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇదిలాఉండగా ఇటీవల పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో మంచి మార్కులు సాధించిన మున్సిపల్ పాఠశాలలు, కాలేజీ విద్యార్థులను మంత్రి మహీధర్‌రెడ్డి అభినందించారు.
స్థానిక సంస్థల ఎన్నికలే తెలుగుదేశం ఇన్‌చార్జ్‌లకు గీటురాయి
ఒంగోలు, జూన్ 27: స్థానిక సంస్థల ఎన్నికలే జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు గీటురాయి కానున్నాయి. పంచాయతీ, జడ్‌పిటిసి, ఎంపిటిసిలకు జరిగే ఎన్నికల్లో ఎవరు ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జికి అసెంబ్లీ సీటు ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో జిల్లాలోని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టారు. కాగా జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా సంతనూతలపాడు, చీరాల నియోజకవర్గాలకు మాత్రం ఇన్‌చార్జ్‌లను నియమించలేదు. మిగిలిన పది నియోజకవర్గాల్లో మాత్రం ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అగ్నిపరీక్షగా మారాయి. ఎక్కడ నియోజకవర్గంలో సీట్లు రాకపోతే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుండి తప్పించి కొత్తవారికి చోటు కల్పించే అవకాశాలు ఉండటంతో ప్రస్తుత ఇన్‌చార్జ్‌లు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకంటే మెరుగ్గానే తొలి విడత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఫలితాలు రావటంతో ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలను జరిపే పరిస్థితి ఉంది. అందులో భాగంగా తొలుత పంచాయతీ ఎన్నికల్లో తమసత్తా చాటితే ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో కూడా ఆ బలం కొనసాగుతుందన్న ఆలోచనలో టిడిపి ఇన్‌చార్జులు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. అదేవిధంగా స్థానిక సంస్ధల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వారిని ఓటర్లగా చేర్పించాలని కూడా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు ఆదేశాలు జారీచేశారు. ఈనేపధ్యంలో ఓటర్లను చేర్చే విషయంలో నేతలు ప్రత్యేక దృష్టిసారించారు. ఇదిలాఉండగా ముఖ్యనేతల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ముఖ్యనేతలు ఏకతాటిపై నిలిచి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీకార్యకర్తలు కోరుతున్నారు. ఈపాటికే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తిలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు ప్రారంభించారు. కాగా స్ధానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు అగ్నిపరీక్షగా మారింది. ఇదిలాఉండగా తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పార్టీల నేతలు ఎన్నికల వ్యూహంలో మునిగి తేలుతుండగా జిల్లాయంత్రాంగం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసిన వెంటనే ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టింది.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు మృతి
గుడ్లూరు, జూన్ 27: ఐదో నెంబర్ జాతీయ రహదారిపై మోచర్ల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు వైపు నుంచి వస్తున్న లారీని కావలి వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను దాటి ఢీకొట్టాడు. ఈ లారీలో ఉన్న కామరాజు (46), చెండ్రి (45) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చిత్తూరు ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉలవపాడు ఎస్సై జి చంద్రశేఖర్, సిఐ అక్కేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయాన్ని
ముట్టడించిన కార్మికులు
స్తంభించిన ట్రాఫిక్
నాయకుల అరెస్టు
ఒంగోలు అర్బన్, జూన్ 27: ఒంగోలు నగరపాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నగరంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్‌కు వెళ్ళే రహదారి పూర్తిగా స్తంభించి పోయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాంట్రాక్టు కార్మికులను, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను అరెస్టు చేశారు. కనీస వేతనం 12 వేల 500 రూపాయలు ఇవ్వాలని గత మూడు రోజుల నుండి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయానికి గేట్లు వేసి బైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు అనేక పోరాటాలు చేసి కనీస వేతనాలు సాధించుకున్న చరిత్ర ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారని వంద కోట్లు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వద్ద నుండి వేల కోట్ల రూపాయలు పిఎఫ్ డబ్బు తీసుకుంటున్నారని, కాని వారి ఖాతాల్లో ఆ డబ్బును జమ చేయకుండా కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటున్నారని విమర్శించారు. నగర కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సిఐటియు నాయకులు సునీల్ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రం చేసే కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే కలెక్టర్, జిల్లా మంత్రి, అధికారులు పట్టించుకొని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె సామ్రాజ్యం, వై రవికుమార్, పి కోటేశ్వరరావు, అన్నపూర్ణ, వెంకటరత్నం, వెంకటేశ్వర్లు, వెంకాయమ్మ, ఎ శ్రీనివాసరావు, రాములు, సైదులు, వెంకటేశ్వర్లు, నరసింహం, సింగయ్య, ప్రతాప్‌లతో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
కలెక్టర్ విజయకుమార్ స్పష్టం
మర్రిపూడి, జూన్ 27: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌కు కందుకూరు ఆర్‌డిఒ బాపిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలంటికి వీలైనంత త్వరలో పరిష్కారమార్గం చూపుతామని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. మండలం నుండి వచ్చిన అన్నిగ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీరూపంలో తెలుపుకోవాలని ఆయన కోరారు. సుమారు 12వందలకు పైగా వచ్చిన అర్జీలన్నింటిని స్వయంగా కలెక్టర్ ముఖాముఖీగా వీలైనంతవరకు ప్రజాదర్బారులోనే పరిష్కారమార్గం చూపారు. ఉదయం 11 నుండి సాయంత్రం మూడుగంటల వరకు అర్జీలను స్వీకరించారు. ముఖ్యంగా వికలాంగులకు ట్రైసైకిళ్ళు ఇప్పించేందుకు సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొంతమంది రైతులకు స్టేజీమిదే పట్టాదారు పుస్తకాలను తహశీల్దార్ చంద్రావతి ద్వారా అందచేయించారు. ఎన్‌ఆర్‌జిఎస్ కూలీలు కొంతమందికి మెడికల్ క్లైయిమ్‌లు ఇప్పించేందుకు ఆదేశాలు జారీచేశారు. ఇదిలాఉంటే ప్రజల సమస్యలు స్టేజీమీదే పరిష్కార మార్గం చూపటంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కొంతమంది మహిళా రైతులకు పట్టాదారు పుస్తకాలు కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె యాకూబ్‌నాయక్, జిల్లా పరిషత్ సిఇఒ గంగాధర్, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి రాజు, స్ట్ఫె సిఇఒ బి రవి, బిసి వెల్ఫేర్ ఇడి మయూరి, డ్వామా పిడి ఎం పోలప్ప, హౌసింగ్ పిడి ధనుంజయ్, ఉద్యానవన శాఖ ఎడి మర్రిపూడి మండల ప్రత్యేకాధికారి జెన్నమ్మ, డిప్యూటీ డిఇఒ కాశీంబేగ్, దర్శి ఎడిఏ మాలకొండారెడ్డి, ఎంపిడిఒ శ్రీనివాసరావు, పొదిలి సిఐ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ చంద్రావతి, ఎస్‌ఐ బాబాఖాదర్‌వలీ, ఎపిడి విజయకుమారి, ఎంఇఒ రాంసింగ్, ఐసిడిఎస్ సిడిపిఒ రేచల్‌సరళ, ఎఒ మధుబాబు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు సైరాబి, జరీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వెటర్నరీ సీట్లు ఇప్పిస్తామని మోసం
ఇద్దరిపై కేసు నమోదు
కొమరోలు, జూన్ 27: తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెటర్నరీ సీట్లు ఇప్పిస్తామని నమ్మపలికి 6లక్షల రూపాయలు తీసుకుని మోసగించిన కడపజిల్లా పోరుమామిళ్ళకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కొమరోలుకు చెందిన ఎన్‌వి నారాయణ అనే ఉపాధ్యాయుడు గురువారం తమకు ఫిర్యాదు చేశాడని ఎస్సై ఎం రామానాయక్ తెలిపారు. కొమరోలుకు చెందిన ఎన్‌వి నారాయణ, కె వెంకటేశ్వర్లు కుమారులకు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2012-13 సంవత్సరానికి ఎన్‌ఆర్‌ఐ కోటా కింద వెటర్నరీ సీట్లు ఇప్పిస్తామని వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన కల్లూరి విష్ణువర్ధన్‌రెడ్డి, తండ్రి భాస్కర్‌రెడ్డి గతఏడాది నమ్మబలికి నారాయణ వద్ద నుంచి 2లక్షల రూపాయలు, వెంకటేశ్వర్లు వద్ద నుంచి 4లక్షల రూపాయలు తీసుకున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు సీట్లు లభించలేదు. దీనితో జరిగిన మోసాన్ని గుర్తించిన నారాయణ, వెంకటేశ్వర్లు పోరుమామిళ్ళకు వెళ్ళి వారిని నిలదీశారు. దీనితో తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి రెండు లక్షలకు 3 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులను బ్యాంక్‌లో వేయగా ఖాతాలో నగదులేదని బ్యాంక్ అధికారులు చెప్పారని బాధితులు వాపోయారు. దీంతో నారాయణ గురువారం తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామనాయక్ తెలిపారు.
రోడ్డుపై విద్యార్థులకు పాఠాలు
కాంట్రాక్టు లెక్చరర్ల వినూత్న నిరసన
ఒంగోలు అర్బన్, జూన్ 27: జిల్లాలోని కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదురుగా కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నడిరోడ్డుపై విద్యార్థులకు కాంట్రాక్టు అధ్యాపకులు పాఠాలు బోధించారు. పాఠాలు బోధించే సమయంలో విద్యార్థులు సమ్మెను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈదీక్షను సిపిఎం నగర కమిటీ కార్యదర్శి జివి కొండారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. 13 సంవత్సరాల నుండి పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించక పోవడం దారుణమన్నారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెల నెలా జీతాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చేయిస్తూ రెగ్యులర్ చేయక పోవడం దారుణమన్నారు. పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ సంఘీభావం ప్రకటించారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించి నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థి సంఘాలతో అధ్యాపకులకు మద్దతుగా తాము కూడా సమ్మెకు దిగుతామన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాలకోటయ్య మాట్లాడుతూ కార్పోరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. తరగతి నాలుగు గోడల మధ్య విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన అధ్యాపకులు వీధినపడడం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుండి సమ్మె చేస్తున్నా విద్యాశాఖ మంత్రి అధ్యాపకుల సమస్యలను పట్టించుకోకుండా ఆబార్క విధానం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలోని 250 మంది కాంట్రాక్టు అధ్యాపకులు 30 జూనియర్ కళాశాలల నుండి హాజరైనారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు ఆపేది లేదని వారు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు కె సురేష్, ఆర్‌సిహెచ్ రంగయ్య , సిహెచ్ బాబూరావు, ఎస్‌కె రసూల్, పి సుబ్బారెడ్డి, కాశీరత్నం, విజయలక్ష్మి, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతిపైనే కాంగ్రెస్ దాడి
టిడిపి నేతల ధ్వజం
ఒంగోలు అర్బన్, జూన్ 27: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలుగుదేశం పార్టీపై కాకుండా తెలుగుజాతి పైనే దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన కేదార్‌నాధ్, చార్‌ధామ్, బద్రీనాధ్ యాత్రలకు వెళ్ళి అనుకోకుండా విపత్తు సంభవించడంతో వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. వీరిలో వందలాది మంది తెలుగువారు ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై స్పందించిన తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీశ్రేణులను అప్రమత్తం చేసి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని తెలుగు వారిని స్వస్థలాలకు పంపించేందుకు తీవ్రంగా కృషి చేశారన్నారు. ఈసందర్భంగా డెహ్రాడూన్ విమానాశ్రయంలో తమ పార్టీ పార్లమెంట్ సభ్యులైన రమేష్ రాధోడ్, కె నారాయణపై హనుమంతరావు దాడి చేయడం దారుణమన్నారు. ఈ దాడి తెలుగుదేశం ఎంపిలపైనే కాకుండా యావత్తు తెలుగు జాతిపై దాడిగా వారు పేర్కొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు వరదల్లో చిక్కుకొని అల్లాడిపోతుంటే రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని వారు ప్రశ్నించారు. రాష్ట్రం నుండి 13 మంది కేంద్రంలో మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తూ తమ బాధ్యతలు మరిచిపోయి బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక విమానంలో తెలుగు వారిని రాష్ట్రానికి పంపిస్తుంటే హర్షించాల్సింది పోయి సహాయం చేసే వారిపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. బాధితులకు వైద్యసేవలు చేయడం కోసం ఎపి భవన్‌లో తెలుగుదేశం పార్టీ వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేస్తే కనీసం మానవత్వం లేకుండా వైద్యశిబిరాన్ని తొలగించడం దారుణమన్నారు. వరదల్లో చిక్కుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్న తెలుగు వారిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. తక్షణమే హనుమంతరావు తమ పార్టీ ఎంపిలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో జిల్లా పార్టీ ప్రధానకార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు కొమ్మూరి రవిచంద్ర, కార్యనిర్వాహక కార్యదర్శులు బొల్లినేని వాసుకృష్ణ, పోగుల సుందరం, కమ్మ వెంకటేశ్వర్లు, పఠాన్ హనీఫ్‌ఖాన్, బాలిశెట్టి నాగేశ్వరరావు, పొనుగుపాటి వెంకటేశ్వర్లు, మల్లెల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మహీధర్‌రెడ్డి వెల్లడి
english title:
mahi
Date:
Friday, June 28, 2013