హైదరాబాద్, జూలై 6: నవంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో టిడిపి గెలవడం, కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పడం ఖాయం అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలోని ఐదు జిల్లాల పార్టీ శ్రేణులకు శనివారం కొంపల్లిలో టిడిపి ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదని, మహానాడులో తీర్మానం చేశామని, ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నానని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది టిడిపి ప్రభుత్వమేనని, గతంలో మాదిరిగానే కేంద్రంలో చక్రం తిప్పుతామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రంలో నాలుగు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడితే మూడు ప్రభుత్వాల ఏర్పాటులో టిడిపినే కీలక పాత్ర పోషించినట్టు చంద్రబాబు తెలిపారు. టిడిపి ఆధ్వర్యంలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందని, కేంద్రంలో టిడిపి మళ్లీ చక్రం తిప్పుతుందని అన్నారు. రాబోయేది టిడిపి ప్రభుత్వమే దీన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని, బెల్ట్‌షాపులను ఎత్తివేస్తూ రెండవ సంతకం చేస్తానని తెలిపారు. తాను నిప్పులా బతికానని భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటానని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించలేదని, తప్పని పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇది ఎన్నికల సంవత్సరం ప్రతి కార్యకర్త తిరిగి టిడిపిని అధికారంలోకి తీసుకు రావాలనే ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత ఎంపిటిసి, జడ్‌పిటిసి, జిల్లా పరిషత్తు ఎన్నికలు జరుగుతాయని, ఆ తరువాత పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ప్రతి క్షణం టిడిపిని అధికారంలోకి తీసుకు రావాలనే ఆలోచనతో కృషిచేయాలని అన్నారు. ప్రజలు మనకు ఓటు వేసేంత వరకు చెవిలో జోరీగలా వారికి పదే పదే చెప్పాలని అన్నారు. అమెరికాలో ఒబామా పోటీ చేసినప్పుడు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తే, తలుపు తీయకపోయినా అక్కడే నిలబడి తెరిచేంత వరకు ఉండి, తమ నాయకుడి గురించి వివరించారని, అదే విధంగా మీరు అందరికీ టిడిపి గురించి చెప్పాలని కోరారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్‌లో కలిసిపోతాయని అన్నారు. గతంలో చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఎన్‌జి రంగా వంటి ఎందరో రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి తిరిగి కాంగ్రెస్‌లో కలిసిపోయారని, ఒక్క టిడిపి మాత్రమే కాంగ్రెస్ వ్యతిరేకతతో పోరాడుతోందని అన్నారు. కాంగ్రెస్ బలహీనపడింది, బిజెపి ఎదగడం లేదు, కేంద్రంలో థర్డ్ ఫ్రంట్‌కే అవకాశాలు ఉన్నాయని, దీనిలో టిడిపి కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు తెలిపారు.
జగన్ లక్ష కోట్లు సంపాదించాడని, టిఆర్‌ఎస్ దందాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి అసమర్ధ, పనికి మాలిన పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జైలులో ఉండే పార్టీ, టిఆర్‌ఎస్ దందాలు చేసే పార్టీ అని మండిపడ్డారు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఆలోచించే ఏకైక పార్టీ టిడిపి మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం కల్పించింది, తెలంగాణ సమస్యలను పరిష్కరించడానికి ఉద్యమించింది టిడిపి మాత్రమేనని అన్నారు.
సిఎంగా, ప్రతిపక్ష నాయకునిగా నాదే రికార్డ్
తాను చూడని అధికారం లేదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు తనదేనని, అదే విధంగా అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకునిగా పని చేసిన రికార్డ్ సైతం తనదేనని అన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ప్రతిపక్షంగా సభకు వచ్చేవారు కాదని అలా సభకు వచ్చిన తొలి నాయకుడు ఎన్టీరామారావు కాగా, ఆ తరువాత తానే సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నానని అన్నారు. తన రికార్డును ఎవరూ బ్రేక్ చేసే అవకాశం లేదని చంద్రబాబు తెలిపారు. విఠలాచార్య సినిమాల్లో మాయలు చేసినట్టుగా జగన్ అక్రమంగా మాయలు చేశారని విమర్శించారు.
టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు తెలిపారు. టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. అమర వీరుల కుటుంబ సభ్యులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బ్రష్టుపట్టించారని, తిరిగి గాడిలో పడాలంటే టిడిపి అధికారంలోకి రావాలని అన్నారు. సమావేశంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన టిడిపి శ్రేణులు సదస్సులో పాల్గొన్నారు. (చిత్రం) తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న టిడిపి అధినేత చంద్రబాబు
టిడిపి ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు ధీమా * నవంబర్‌లో ఎన్నికలు వచ్చినా సిద్ధమే * తెలంగాణకు వ్యతిరేకం కాదు
english title:
chandra babu
Date:
Sunday, July 7, 2013