ఈ వధూవర గణ సమ్మేళనం పట్టిక ఒక పెద్ద తప్పుల పట్టిక. గతంలో 1950 వరకు ఎక్కడా పుస్తకాలలో, పంచాంగాలలో దర్శనం ఇవ్వని ఈ పట్టిక ఇప్పుడు పంచాంగాలలో కంప్యూటర్లలో ప్రథమ స్థానాన్ని సంపాదించింది. అయితే ఈ అంశం పూర్తి స్థాయి తప్పులతోనే ఉంది. ప్రాచీన కాలంలో ఎవరో గమనించి ఏర్పరచిన ఈ పట్టికనే ఆధారం చేసుకొని చాలామంది వివాహ సంబంధాలు పాడు చేసుకుంటున్నారు. ‘యద్యదా చరతి శ్రేష్ఠః తత్తదేవేతరోజనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’ అని గీతాచార్యుడు బోధించిన రీతిగా ఎవరో శ్రేష్ఠుడు దీనిని గుర్తిస్తే ఇప్పుడు అదే అందరూ ఆచరిస్తూ చివరకు జ్యోతిష గ్రంథములు, సిద్ధాంతుల మాటలు కూడా పక్కన పెట్టేసి ఇది ఒక వజ్రాయుధం వంటిది అనుకొని ముందుకు పోతున్నారు. అయితే మీకు కొన్ని అంశాలు చెప్పాలి. అసలు ఈ పట్టికలోని ఆంతర్యం ఏమిటి అంటే అమ్మాయి నక్షత్రం నుండి అబ్బాయి నక్షత్రం వరకు చూచే ద్వాదశ కూటములలో వర్ణకూటమికి ఒక పాయింటు, వశ్యకూటమికి 2 పాయింట్లు, ధన కూటమి తారాబలానికి 3 పాయింట్లు, యోని కూటమికి 4 పాయింట్లు, గ్రహమైత్రి ఐదు పాయింట్లు గణ కూటమికి 6 పాయింట్లు, రాశి కూటమి ఏడు పాయింట్లు, నాడీ కూటమి విషయంలో ఎనిమిది పాయింట్లు ఇచ్చారు. సరే బాగుంది. రాశి కూటమికి భకూటమి అని పేరు. ద్విద్వాద శేవానవ పంచమేవా షష్ఠాష్టకే రాక్షస కన్యకాయాః - ఏకాధిపత్సే ప్యుభయోస్సుహృత్వే పాణిగ్రహో మంగళ మాతనోతి అని చెప్పబడింది. అనగా ద్విద్వాదశ షష్ఠ్ధాష్టకములు కలిగిన నక్షత్రముల వారికి ఆయా స్ర్తి పురుష రాశ్యాధిపతులకు మైత్రి ఉన్ననూ ఇరువురి రాశ్యాధిపతులూ ఒకరే అయిననూ చాలా శ్రేష్ఠము అని వున్నది. ఇది అగణ సమ్మేళనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే తారాబలం దినం కూటమితో వద్దు అని చెప్పినవి అన్నియు మహేంద్ర కూటమిలో సరియనెను. రెండవ నవకం మూడవ నవకంలోని జన్మతారలు మూడు నవకములలోని నైధన తారలు దిన కూటమి తారాబలంలో వద్దని చెబితే మహేంద్ర కూటమిలో అవి గ్రాహ్యమని చెప్పారు. అందుకే కాలామృతంలో తారాబలం అనేది ప్రాధాన్యత లేని కూటమి అని చెప్పారు. ఇక గ్రహమైత్రి కూటమి ‘ఉభయోస్సప్తమస్తత్రి గ్రహమైత్రం నశోధయేత్’ అని వున్న కారణంగా సమసప్తక రాశుల విషయంలో గ్రహమైత్రి చూడనవసరం లేదు. పాయింట్ల పట్టికలో సింహ కుంభరాశి దంపతులకు గ్రహమైత్రి విషయంగా సున్నా పాయింట్లు తీసుకొని గణన చేశారు. పై సిద్ధాంతం ప్రకారం ఐదుకు ఐదు పాయింట్లు ఇవ్వాలి. చిత్త 1,2 వారికి మృగశిర 1,2 వారికి వివాహం చేయవలసి వచ్చినప్పుడు పంచాంగం పట్టికలో 12 పాయింట్లు ఉంటాయి. కానీ పైన చెప్పుకున్న తారాబలం, రాశి కూటమి దోషాపవాద పాఠం ప్రకారం ఇంకా తొమ్మిది పాయింట్లు కలిపి 21గా చూపాలి. కేవలం దోషాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని దోషాపవాదములు పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పరచిన సిద్ధాంతమే ఈ పట్టిక. అందువలన పంచాంగాలలోని ఈ పట్టికను నమ్మవద్దని వినతి. ఇంకా వాడే కూటమి గూర్చి మీరు ముహూర్త దర్పణం, ముహూర్త చింతామణి, కాలామృతం, ముహూర్త సుధ వంటివి పరిశీలిస్తే ఈ పట్టిక దోషభూయిష్టమయినది అని మనకు ప్రత్యక్ష నిదర్శనం అవుతుంది.
జ
సందేహాలు - సమాధానాలు
యజ్ఞనారాయణ (కొత్తగూడెం)
ప్రశ్న: ద్వితీయ పుత్రుడు 15.11.91 ఉ.9.47కు పుట్టాడు. ఇతడికి ఏ విద్యలు వస్తాయి?
జ: మీ అబ్బాయి జాతకంలో కుజ శుక్రుల బలం బాగా వున్నది. అందువలన మీ వాడికి ఇంజనీరింగ్ మరియు లలిత కళలు రెండూ వస్తాయి.
పి.శంకర్ (హైదరాబాద్)
ప్రశ్న: పుట్టిన తేదీ 26.6.88 రాత్రి 12.40. ఊరు తెనాలి. భవిష్యత్తు ఎలా ఉంటుంది?
జ: 2008-09-19 నుండి బుధ దశ. బుధుడు సంచారం అనుకూలమే కానీ మీన లగ్న జాతకులకు పెద్ద రాజయోగం ఇవ్వడు. భక్తి మార్గాల ద్వారా శాంతిని ఇస్తాడు. మంచి అభివృద్ధి క్రమేణా రాగలదు. గోచారంలో శని రాహు సంచారం బాగాలేదు. రోజూ ‘శ్రీరామ శ్శరణం మమ’ అంటూ 11 ప్రదక్షిణలు రోజూ చేయుట వల్ల సమస్యలు తట్టుకోగలుగుతారు.
వి.సుధాకర్ (ఖమ్మం)
ప్రశ్న: 19.1.41 - 1.00 ఎ.ఎం. ఆర్థిక స్థితిలో వృద్ధి చేకూరుతుందా?
జ: తులాలగ్నమునకు చంద్రుడు వ్యయంలో వున్న కారణంగా స్థిరచిత్తం చెడగొడతాడు. అయితే రాబోవు కాలంలో శని ప్రభావం అనుకూలం. రాహు ప్రభావం అనుకూలం లేకపోవుట దృష్ట్యా ఆర్థిక స్థితి బాగుంది మానసిక స్థితి ఇబ్బందికరం అవుతుంది. రోజూ దుర్గాపూజ చేయడం శ్రేయస్కరం. తద్వారా మానసిక శాంతి ఉంటుంది.
=================
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి,
నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.