విశాఖపట్నం, ఆగస్టు 5: రాష్ట్రం ముక్కలైపోడానికి మరెంతో కాలం పట్టేట్టు లేదు. ఇది సమైక్య వాదల్లో రగులుకుంటున్న వేదన. విభజన జరగరాదన్నది సీమాంధ్రుల కోరిక. సమైక్య వాదం బలంగా వినిపిస్తున్న విశాఖ నగరంలో వారికి అండగా నిలబడ్డ నాయకుడు ఒక్కడు కూడా కనిపించకపోవడం దురదృష్టకరం. చిన్న వారి నుంచి వృద్ధులవరకూ ఉద్యమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. యువకులు లాఠీ దెబ్బలు తింటున్నారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. విద్యార్థులు చదువులు మానుకుని మరీ రోడ్లెక్కి సమైక్య నినాదాన్ని వినిపిస్తున్నారు. కార్మికులు విధులను బహిష్కరిస్తున్నరు. ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముస్లింలు మానవహారంగా ఏర్పడి తమ నిరసన తెలుపుతున్నారు. ఉద్యమ నేపథ్యంలో పలువురు జైళ్ళకు వెళుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రాణ త్యాగాలు చేశారు. ఇవేవీ మనం నేతలుగా కొలుచుకుంటున్న వారి కంట పడడం లేదా? ఇవి ప్రజల మనోభావాలు కావా? ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పదవులకు రాజీనామాలు చేసిన వారంతా ఉద్యమాన్ని నడిపించే బాధ్యత ఎందుకు తీసుకోలేదు?
రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన అనంతరం సుదీర్ఘ మంతనాలు తరువాత గంటా శ్రీనివాసరావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత విశాఖ వచ్చినప్పుడు సమైక్య వాదులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ రోజంతా హడావుడిగా గడిపిన ఆయన నాన్ పొలిటికల్ జెఎసిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి మర్నాడు హైదరాబాద్ వెళ్లిపోయి ఇంత వరకూ తిరిగి రాలేదు. అప్పటి వరకూ ఉద్యమానికి ఎవరెవరో నాయకత్వం వహిస్తున్నారు. ఇక నుంచి గంటా ఈ బాధ్యతలు స్వీకరిస్తారని చాలా మంది భావించారు. కానీ ఇప్పటికీ అలా జరగలేదు. మంత్రి బాలరాజు కూడా సమ్యైవాదిననే చెపుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తాము కోరుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. పాడేరు, అరకు, నర్సీపట్నం ప్రాంతాల్లో బంద్ విజయవంతంగా జరిగింది. ఉద్యమకారుల వత్తిడో, స్వచ్ఛందంగానో వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. మంత్రి పదవికి రాజీనామా చేయనక్కర్లేదన్న బాలరాజు కనీసం ఉద్యమం వైపు కనె్నతె్తైనా చూడ్డం లేదు. ఆయన జిల్లాలో పర్యటించినప్పుడైనా ఉద్యమానికి మద్దతు తెలపలేదు. ఇక ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఆ తరువాత ఆయన ఉద్యమంలోకే రాలేదు. జరుగుతున్న ఆందోళనలన్నీ వన్ టౌన్ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. వాటికి మద్దతుగా ఆయన బయటకు రాకపోవడం గమనార్హం. అలాగే, తైనాల విజయకుమార్ కూడా ఉద్యమంలో పాల్గొనకపోవడానికి కారణాలేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేసి, ఉద్యమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్నారే కానీ, దిశా నిర్దేశం చేయడానికి ముందుకు రావడం లేదు. పోలీసులతో ముందే కుదుర్చుకున్న ఒప్పందంతో ధర్నాల పేరుతో హడావుడి చేసి, కాసేపు వీడియోలు, ఫొటోలు తీయించుకుని వెళ్లిపోతున్నారు కొంతమంది నాయకులు.
ఇక సమైక్య నినాదాన్ని అందరికన్నా ముందుగానే వినిపించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధిష్ఠానం మనోభావాన్ని తెలుసుకుని ఇక్కడున్న ఆ పార్టీ నాయకులైనా ఉద్యమాన్ని భుజనా వేసుకోవచ్చు కదా! వారూ దీని గురించి పట్టించుకోవడం లేదు. ఆ పార్టీలోని ఏ కొద్దిమందో అప్పుడప్పుడు పత్రికల వారి తృప్తి..వారి సంతృప్తి కోసం ఉద్యమిస్తున్నారే తప్ప, సమైక్య రాష్ట్రం కోసం కాదన్నది వాస్తవం.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అథిష్ఠానం వెలువరించిన తరువాత టిడిపికి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. బాబు చెవిలో ఉపదేశించారో..లేక వీరి బుర్రలో పుట్టిందో కానీ ఇక్కడి తెలుగుదేశం నాయకులు సమైక్య నినాదంతో వీధుల్లోకి వస్తున్నారు. ఎప్పటిలాగానే విచిత్ర నిరసనలు చేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రయత్నం కూడా అంతంతమాత్రంగానే ఉంది.
విశాఖ జిల్లాలో ఉద్యమం కాస్త నిలదొక్కుకుందంటే ఈ ప్రజా ప్రతినిధుల వల్ల కాదన్నది ముమ్మాటికీ నిజం. వీరు ఉద్యమాన్ని కొనసాగించకపోయినా ఫరవాలేదు. పోలీసులను ఉసిగొలిపి, వారితో ఉద్యమంపై నీళ్ళు చల్లే ప్రయత్నాన్ని విజయవంతంగా చేయిస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తెలంగాణలో ఉద్యమం మహోద్యమంగా మారడానికి పోలీసుల సహకారం కూడా ఒక కారణం కాదా? మరి ఇక్కడెందుకు చిన్నపాటి ధర్నాను కూడా పోలీసులు భూతద్దంలో చూస్తున్నారు? విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులే లేకుంటే సమైక్యోద్యమ చరిత్రలో విశాఖ జిల్లాకు స్థానం ఉండేది కాదు. వీరంతా ఉద్యమానికి ముఖం చాటేయడాన్ని చూస్తుంటే, విభజనకే వీరు భజన చేస్తున్నారనుకోవాలా? ప్రజలను మోసగిస్తున్నారని అనుకోవాలా? ఉద్యమం చేయడం చేతకాక చేతులేత్తేశారని భావించాలా?
సమైక్య ఉద్యమంతో ఈపిడిసిఎల్‌కు తీవ్ర నష్టం
విశాఖటప్నం, ఆగస్టు 5: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగాను, సమైక్యాంధ్రకు మద్ధతినస్తూ గత వారం రోజులు జరుగుతున్న ఉద్యమాలు విద్యుత్, ఆర్టీసీ సంస్థలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. విద్యుత్ సంస్థకు వచ్చే రెవెన్యూ వసూళ్ళు కాస్త పడిపోయాయి. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లా పరిధిలో పనిచేస్తున్న పలు విభాగాల ఉద్యోగులు, ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీని ప్రభావం కాస్త రెవెన్యూ వసూళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సంస్థ పరిధిలో దాదాపు 50 లక్షల మంది వినియోగదారులుండగా, వీరి అందరి ద్వారా ప్రతినెల రూ.500 కోట్లకు పైగానే ఆదాయం వస్తోంది. సమైక్య ఉద్యమాలతో ఇపుడు ఇది కాస్త పడిపోయి, దాదాపు 30 శాతం మేర ఆదాయం తగ్గిందనేది స్పష్టమవుతోంది. విశాఖ జిల్లాకు సంబంధించి 11లక్షలకు పైగా వినియోగదారులుండగా ప్రతినెల దాదాపు వంద కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇపుడు ఇది కాస్త తగ్గిపోతోందని చెబుతున్నారు. ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నందున బిల్లుల చెల్లింపుల కోసం వినియోగదారులు అంతగా చూపడంలేదు. దీనివల్ల 10 నుంచి 20 శాతం మేర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
* ఆర్టీసీకి పెరుగుతున్న నష్టాలు
సమైక్య ఉద్యమంతో ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. విశాఖ నుంచి బెంగుళూరు, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు బయలుదేరి వెళ్ళే ఏసి బస్సులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేస్తున్నందున దాదాపు కోటిన్నర రూపాయల వరకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల అద్దాల పగులుగొట్టడం, ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఏసి బస్సులను నిలిపివేయడం వంటి కారణాలతో విశాఖ రీజియన్‌కు నష్టాలు తప్పడంలేదు.
నిధుల కోసం నిరీక్షణ
* పంచాయితీల్లో తీరని సమస్యలు
విశాఖపట్నం, ఆగస్టు 5: పంచాయితీలకు గత రెండేళ్ళుగా రావాల్సి ఉన్న నిధుల కోసం ఇవి నిరీక్షిస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి ఏడాది కనీసం పది కోట్ల రూపాయల మేర గత రెండేళ్ళ నుంచి రావాల్సి ఉంది. అలాగే 13వ ఆర్ధిక ప్రణాళిక ద్వారా రూ. 45 కోట్లు నిధులు మంజూరు కావాల్సి ఉంది. అయితే గత రెండేళ్ళుగా ఒక్క పైసా కూడా రాకపోవడంతో పంచాయితీలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఇందులో తాగునీటి సదుపాయానికి రూ. 6.63 కోట్లు, ఈ ఏడాది నాలుగు త్రైమాసికాలకు సంబంధించి 24 కోట్ల రూపాయలు, అలాగే 2011-12 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి రూ.2.34 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. అయితే వీటిలో కొంతమేర వచ్చినా దేనికి సర్ధుబాటుకావడంలేదు. కొన్నాళ్ళపాటు ప్రీజింగ్ సమస్య నెలకొవడంతో వీటికి మోక్షం లభించలేదు. మొత్తం మీద అన్ని రకాలైన నిధులు రూ. 65 కోట్ల మేర రావాల్సి ఉండటంతో వీటి కోసం పంచాయితీలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాయి.