హైదరాబాద్, సెప్టెంబర్ 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆ పార్టీలో సమరోత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. జగన్ బెయిల్ పిటీషన్‌పై సోమవారం సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకోనున్నందున రెండు రోజుల నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. సాయంత్రం కోర్టు జగన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గుడా జైలు వద్దకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. పార్టీ కేంద్ర కార్యాలయం, లోటస్ పాండ్‌లోని జగన్ నివాసం సందడిగా మారింది. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు జగన్ నివాసానికి వెళ్ళి వైఎస్ విజయమ్మను అభినందించారు. ఈ రోజే పండుగ రోజు అని విజయమ్మ వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో నృత్యం చేశారు. సీట్లు పంచి పెట్టారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో, సీమాంధ్రలో కార్యకర్తల ఉత్సాహానికి అవధులు లేవు. సీమాంధ్రలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి.
ఇలాఉండగా సిబిఐ కోర్టు జగన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ హైదరాబాద్‌ను విడిచి వెళ్ళరాదన్న ఆంక్ష విధించడం కార్యకర్తలను, అభిమానులను నిరాశ పరిచింది. జగన్ జైలు నుంచి బయటకు రాగానే సీమాంధ్రలో రాత్రింభవళ్ళు కలియ తిరుగుతారని వారు ఆశించారు. జైలులో 16 నెలలు (485) రోజుల పాటు ఉన్నందున, కూడగట్టుకున్న శక్తితో తిరుగుతారని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావించారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్న వెంటనే, సమైక్యాంధ్ర కోసం మొట్ట మొదట ఉద్యమించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి సీమాంధ్రలో ప్రజాభిమానం చూరగొంటున్నామని, ఈ తరుణంలో జగన్ సీమాంధ్రకు వచ్చి ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి ఉండేవారని వారు అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కోర్టు బెయిల్
english title:
bail
Date:
Tuesday, September 24, 2013