విశాఖపట్నం, డిసెంబర్ 1: పర్యాటకంగా అభివృద్ధి చెందితే అన్ని రంగాలు పురోభివృద్ధి సాధించినట్టే. దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగితే వ్యాపార, వాణిజ్యపరంగా పురోగతి సాధించి, దేశ ఆర్థిక పరిపుష్టికి అవకాశం ఉంటుంది. ఇంత ముఖ్యమైన పర్యాటక రంగం ఏడాదికాలంగా తిరోగమనంలో పయనిస్తోంది. ఇందుకు కారణాలు అనేకం. ప్రత్యేకించి పర్యాటకులను అకర్షించే వౌలిక వసతులు లోపిస్తున్నాయి. రవాణా, వసతి సదుపాయాలు మృగ్యమయ్యాయి. ప్రముఖ పర్యాటక కేంద్రాల నిర్వహణ సాధ్యపడటంలేదు. విశాఖ జిల్లా సంగతే తీసుకుంటే అనకాపల్లిలో బొజ్జన్నకొండ, బౌద్ధ రామాలు, విశాఖ నగరం సమీపానున్న ఎర్రమట్టి దిబ్బలు, కంబాలకొండ, తొట్లకొండ, భీమిలి డచ్‌హౌస్ తదితర ప్రముఖ పర్యాటక కేంద్రాల నిర్వహణ సరిగా లేదు. ఈ ప్రదేశాల్లో పురాతన కట్టడాలు, చారిత్రక ఘట్టాల ఉనికి కనుమరుగుమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని మరింత అభివృద్ధిపరిచి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం మాట ఎలా ఉన్నా ఉన్నవాటిని పరిరక్షించుకునే క్రమంలో చర్యలు తీసుకోవడంలేదు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోని మూడు కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లభించడంలేదు.
చలనం లేని భారీ ప్రాజెక్టులు
కనీసం కొనే్నళ్ళుగా ప్రతిపాదించిన భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలపడంలేదు. మధురవాడ, ఎండాడ కొండలను కలుపుతూ వీటి మధ్యన దాదాపు రూ.200 కోట్లతో ‘టూరిజం పార్కు’ నిర్మాణానికి నాలుగేళ్ళ కిందటనే పర్యాటకశాఖకు ప్రతిపాదనలు పంపారు. వీటికి ఇంకా చలనం లేదు. అలాగే విశాఖ-తిరుపతి మధ్య ‘టూరిజం విమానం’ను నిర్వహించాలనే నిర్ణయం ప్రతిపాదనకే పరిమితమైంది. కనీసం ప్రయాణికుల విమానంలోనైనా కొన్ని సీట్లను పర్యాటకులకు కేటాయించాలని చేసిన నిర్ణయాలు కార్యరూపం దాల్చడంలేదు. ప్రయోగాత్మకంగా దీనిని ప్రవేశపెట్టిన తర్వాత ఆదరణ లభిస్తే ప్రత్యేక విమానం అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు రెండేళ్ళ కిందట ప్రతిపాదించారు. ఇది కాస్త తెర వెనక్కు వెళ్ళిపోయింది. శ్రీకాకుళం బడ్జెట్ హోటల్, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పుణ్యక్షేత్రాల వద్ద పర్యాటక వసతులు కల్పించడంలోను ఈ శాఖ విఫలమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా విశాఖ-అరకు మధ్య ‘అద్దాల రైలు’ను ప్రవేశపెట్టాలని రైల్వే నిర్ణయించి ఏడేళ్ళు కావస్తోంది. అయినా ఇంతవరకు దీని ఊసే లేకుండా పోయింది. కనీసం రోడ్ కం రైలు పద్ధతిలో ఆర్టీసీ బస్సులు, రైళ్ళు నడపాల్సి ఉన్నా దీనికి అతీగతీ లేకుండా పోతోంది. ఈ కారణాలతోనే బొర్రా గుహలు, అరకు గిరిజన మ్యూజియం, రిస్టార్ట్స్‌కు ఆదరణ కొరవడుతోంది. ఇందులో పనిచేసే దినసరి కార్మికులు 4 మాసాలుగా సమ్మెబాట పట్టడంతో పర్యాటకం కాస్త తిరోగమనంవైపు పయనిస్తోంది. బెంగాలీయులు నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే అధికంగా అరకు, బొర్రా గుహల సందర్శనకు తరలివస్తుంటారు. అటువంటిది ఈ ఏడాది వీరి తాకిడి అంతగా కనిపించడంలేదు.
‘అరకు ఉత్సవ్’కు కనిపించని ఆదరణ
ప్రచారానికే తప్ప పర్యాటకంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడంతో ఈ ఏడాది అరకు ఉత్సవ్‌కు పర్యాటకుల తాకిడి లేకుండాపోయింది. ప్రధానంగా రవాణా, వసతి సదుపాయాలు మృగ్యమయ్యాయి. అలాగే ఏటా విశాఖ జిల్లా పర్యాటకశాఖకు సంబంధించి 25 కోట్లకు పైగానే వచ్చే ఆదాయం కాస్తపడిపోయింది.
డివిజన్లు పెరిగినా ఫలితం సున్నా
పరిపాలన సౌలభ్యం, పర్యాటక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలుండటంతో రాష్ట్రంలోని 6 పర్యాటక డివిజన్లను రెట్టింపు చేసినా.. ప్రయోజనం లేకపోతోందని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయి ప్రక్షాళనలో భాగంగా ఇటీవల ఉన్నతాధికారులను మార్పు చేసిన ప్రభుత్వం.. నాలుగు రోజుల కిందట పర్యాటకం వెనుకబడటంపై కారణాలను అనే్వషించి కాయకల్ప చికిత్స కోసం హైదరాబాద్‌లో సమీక్ష కూడా నిర్వహించింది. ఇది కూడా తూతూమంత్రమే అయ్యింది తప్పితే కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులకు ఆమోదం, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటివి జరగనేలేదు.
కానరాని టూరిస్టులు * ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికి గండి
english title:
t
Date:
Monday, December 2, 2013