ఖమ్మం/గోదావరిఖని, డిసెంబర్ 22: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సింగరేణి బొగ్గు గనులు వెలుగులోకి వచ్చి 133 సంవత్సరాలు కావస్తోంది. అపార బొగ్గు నిల్వలు కలిగి ఉన్న సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 23 (సోమవారం రోజు)న అన్ని బొగ్గు గనుల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ యేటేటా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తులు జరుపుతూ సింగరేణి ముందుకు సాగుతుండగా, 1880వ సంవత్సరంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న సింగరేణి గ్రామ సమీపంలో తొలుత బొగ్గు గనులు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది భక్తులు కాలి నడకన ఎడ్లబండ్ల ద్వారా భద్రాచలం రామయ్యను దర్శించుకునేందుకు వెళ్తూ సింగరేణి గ్రామం వద్ద మజిలీ చేశారు. వారు వంట చేసుకునేందుకు కొన్ని రాళ్ళను తీసుకొచ్చి పొయ్యి ఏర్పాటు చేసి వంట చేస్తుండగా, కట్టెలతో పాటు రాళ్ళు కూడా మండటం గమనించారు. ఆశ్చర్యానికి లోనైన వారంతా వెంటనే ఈ విషయాన్ని బ్రిటిష్ అధికారులకు సమాచారాన్ని అందించారు. అక్కడ నుంచి డాక్టర్ విలియం కింగ్ అనే అధికారిని భూగర్భ అధికారిగా నియమించగా, దశాబ్ద కాలం పాటు ఆయన ఇక్కడ పరిశీలించి బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఆనాటి నుంచి మొదలైన బొగ్గు తవ్వకాలు కాలక్రమేణ గోదావరి పరివాహక ప్రాంతంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 350 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించాయ. నాడు సింగరేణి గ్రామ సమీపంలో బొగ్గు నిక్షేపాలు బయటపడటంతో ఈ గ్రామ పేరునే అధికారులు ఆ సంస్థకు నామకరణం చేశారు. ఈ క్రమంలోనే 1886లో హైదరాబాద్‌లో గల డెక్కన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తులను ప్రారంభించారు. అనంతరం 1921లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా రూపాంతరం చెంది లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ప్రపంచ మార్కెట్‌కు పరిచయమైంది. ఆదిలో కొంతకాలం తీవ్ర నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ నేడు కోట్లాది రూపాయల లాభాలతో దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం సింగరేణి 34 భూగర్భ గనులు, 14 ఓసిపి గనులతో రోజుకు 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని జరుపుతూ దక్షిణాదిలో గల థర్మల్ విద్యుత్ కేంద్రాలతోపాటు పలు బొగ్గు ఆధారిత పరిశ్రమలకు నిరాటంకంగా బొగ్గును సరఫరా చేస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు మరిన్ని కొత్త బొగ్గు గనులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇదేగాక ఆదిలాబాద్ జిల్లా జయపూర్ వద్ద ఎపి జెన్‌కో, సింగరేణి జాయింట్ వెంచర్‌గా 1,200 మెగవాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. బొగ్గు ఉత్పత్తుల కోసం పలు దేశాల్లో అమలులోకి వస్తున్న కొత్త యాంత్రీక విధానాలను దిగుమతి చేసుకుంటున్న సింగరేణి.. సంస్థలోని పలు బొగ్గు గనుల్లో ఉత్పత్తుల కోసం వాటిని వినియోగిస్తోంది. దీనివల్ల దశాబ్ద కాలం క్రితం సింగరేణి వ్యాప్తంగా 1.24లక్షల మంది కార్మికులు కలిగి ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి 64 వేల మంది కార్మికులతోనే కొనసాగుతోంది. యాంత్రీకరణ పెంచుకుని ఇంకా కార్మికుల సంఖ్యను తగ్గించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేసుకుంటోంది. కాగా, ఓపెన్‌కాస్ట్ గనులను మూసివేయాలని, కొత్త ఓపెన్ కాస్ట్‌లకు అనుమతులు ఇవ్వవద్దంటూ కార్మిక సంఘాలు ఆందోళనలు సైతం చేపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని చర్ల, సత్తుపల్లి, గుండాల, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపుర్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా గోదావరి ఖని ప్రాంతాల్లో ఓపెన్‌కాస్ట్ కొత్త గనులకు సర్వే నిర్వహిస్తూ ప్రారంభిస్తున్నారు కూడా. మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో విస్తరించి ఉన్న భూగర్భ గనుల్లో కొన్నింటిని మూసివేసేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అదే సమయంలో కొత్త ఓపెన్‌కాస్ట్‌లను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన అవసరంగా ఉన్న బొగ్గు అధిక భాగం సింగరేణి సంస్థ నుంచే ఉత్పత్తి అవుతుండటం విశేషం. 1945లో సింగరేణిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాల ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. సింగరేణిని గడిచిన వంద సంవత్సరాల క్రితం వరకు తట్టా చెమ్మస్, లాంథర్ విధానంతో జరిగిన బొగ్గు ఉత్పత్తులకు స్వస్తి పలికి నూతన యాంత్రీక విధానంలోకి ప్రవేశింపజేయగా, ఎందరో దీని ద్వరా ఉపాధి పొందుతున్నారు. ఇందులో భాగంగానే సింగరేణి ఓసిపి బొగ్గు గనుల విస్తరణ జరిపి హైవాల్, లాంగ్‌వాల్‌తోపాటు డంపర్లు తదితర భారీ యంత్రీక విధానాలతో ఉత్పత్తులను పెంచుతున్నారు. వీటితోపాటు భూగర్భ గనుల్లో కంట్యూనస్ మైనర్‌తోపాటు పలు భారీ యంత్రాలను వినియోగిస్తూ బొగ్గు ఉత్పత్తులను సంస్థ చేపడుతోంది. ఇంకా అనేక సాంకేతిక విధానాలను వినియోగించుకొని బొగ్గు ఉత్పత్తులను జరిపేందుకు యేటేటా కొత్త ప్రణాళికలతో దూసుకపోతోంది. ఇక 133 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలను సింగరేణి సంస్థ జరుపుకునే సమయంలో కొత్త భూగర్భ గనుల ప్రకటనలతో పాటు కార్మికులకు ప్రత్యేకమైన బెనిఫిట్స్‌ను కూడా యాజమాన్యం ప్రకటించే అవకాశం ఉంది. సంస్థ సాధిస్తున్న లాభాల్లో వాటాలు పెంచేందుకు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై యజమాన్యాన్ని నిలదీసేందుకు కార్మిక సంఘాలూ సమాయత్తమవుతున్నాయి. సింగరేణి పరిధిలోని గ్రామాల అభివృద్ధికి సింగరేణి సంస్థ విడుదల చేసే షేప్ నిధులు కొంతకాలంగా విడుదల చేయటం లేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని గత కొంతకాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణి గ్రామంలో తొలిసారి బొగ్గు నిక్షేపాలను కనుగొన్న డాక్టర్ విలియం బృందం