నడిబజారులో భారత యువ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడెను అరెస్ట్ చేయడం, దుస్తులు విప్పి తనిఖీలు నిర్వహించి, న్యూయార్క్ పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉంచడంపై మన దేశ ప్రజల్లో, పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిజంగా ఇది ఎందుకు దౌత్య సంబంధాలు నెరపకూడదో చాలా స్పష్టంగా తెలియజేసిన గుణపాఠం. ముందుగా మనదేశ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్...ఒక భారత దౌత్యవేత్త పట్ల అమెరికా అతి హేయంగా, తుచ్ఛమైన రీతిలో వ్యవహరించిన తీరును తీవ్ర స్థాయిలో ఖండించినా, ఒబామా పాలనా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోని నిర్లక్ష్య వైఖరి అవలంబించడం గర్హనీయం. ఈవిధమైన వ్యవహారశైలి తాను అగ్రరాజ్యమన్న అమెరికా దురహంకారానికి ప్రత్యక్ష నిదర్శనం.
తన బిడ్డను స్కూల్లో దింపి వస్తున్న, ఇద్దరు బిడ్డల తల్లి అయిన దౌత్యవేత్త ఖోబ్రాగడేపై అమానవీయ రీతిలో పోలీసులు వ్యవహరించిన తీరుపై భారత్‌లో తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇంత జరుగుతున్నా అమెరికా ఆంతరంగిక భద్రతాశాఖ డొంకతిరుగుడుగా సమాధానమివ్వడానికి యత్నించడం నిజంగా తెంపరితనం కాక మరేంటి? అంతేకాదు దేవయాని పట్ల పోలీసులు, అమల్లో ఉన్న ‘ప్రామాణిక పద్ధతుల’నే అనుసరించారని చెప్పడం ఎంత దురన్యాయం? కాన్సులేట్‌లో పనిచేస్తున్న ఒక దౌత్యవేత్త పట్ల ఇంతటి నీచంగా వ్యవహరించవచ్చునా? ఒక దౌత్యవేత్తగా తనకు రక్షణ ఉంటుందని ఆమె ఎంతగా మొత్తుకున్నా పట్టించుకోని పోలీసుల వైఖరిని ఏమనాలి? ‘ప్రామాణిక పద్ధతుల’నే అనుసరించారని చెప్పడమంటే..ఒక సాధారణ నేరస్థుడిని చూసిన విధంగా చూడటమా? ఇంతకూ ఆమెపై ఉన్న అభియోగం ఏమిటి? ఇంట్లో సహాయకురాలిని భారత్ నుంచి రప్పించుకోవడానికి వీసా విషయంలో అక్రమానికి పాల్పడ్డారనేది అభియోగం.
అసలు వీసా విషయంలో తానెటువంటి అక్రమానికి పాల్పడలేదని ఖోబ్రాగడే స్పష్టంగా చెబుతున్నారు. గృహానికి సంబంధించిన ఈ కేసు ఇప్పటికే భారత కోర్టుల్లో నడుస్తున్నదని కూడా ఆమె చెప్పారు. ఒక భారతీయ మహిళా దౌత్యవేత్త వస్త్రాలు విప్పి తనిఖీ చేయడం వల్ల...సంస్కృతీ పరంగా భారత్ నుంచి తీవ్రస్థాయిలో నిరసన ఎదుర్కొనాల్సి ఉంటుందని అమెరికా అధికార్లకు తెలియదా? ఒక మహిళ.. అందునా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌కు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న దౌత్యాధికారిణి వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం ఎంతటి ఘోరమైన నేరమో...ప్రజాస్వామ్యానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే అమెరికన్లకు తెలియక కాదు. తామేం చేసినా చెల్లుతుందనే దురహంకారం.
న్యూయార్క్‌లో ఖోబ్రాగడేను అరెస్ట్ సహజంగానే భారత్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తక్షణమే స్పందించి తదనుగుణ్యంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం నిజంగానే ఆహ్వానించదగిన పరిణామం. అయితే, 9/11 దాడుల తర్వాత న్యూఢిల్లీలోని అమెరికన్ రాయబార కార్యాలయం ఉన్న రహదారిని మొత్తం పూర్తి రక్షణతో, దుర్భేద్యంగా గత పదేళ్ళుగా ఉంచడానికి గల కారణమేంటి? అంత అవసరముందా? అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది సంక్షేమానికి అంతటి స్థాయి చర్యలు తీసుకోవాలా? ఢిల్లీ పాలనా యంత్రాంగం ప్రజలకు దీనిపై సమాధానం చెప్పాలి. నిజంగా మన్మోహన్ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వానికి ‘జీ హుజూర్’ అనే రీతిలో వ్యవహరిస్తున్నదనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం అమెరికా రాయబార కార్యాలయం ఉండే ప్రాంతంలో, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించే రీతిలో ఉన్న బారికేడ్లను ఇప్పుడు తొలగించారు. అంతేకాదు దేశంలోని అనేక నగరాల్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయలపై కూడా పునఃసమీక్ష కొనసాగుతోంది.
1991లో యుఎస్‌ఎస్‌ఆర్ పతనం తర్వాత ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా అంటే భారత్ భయపడుతుండం వల్లనే ఆ దేశ దౌత్యవేత్తలకు ప్రత్యేక దౌత్య ప్రతిపత్తినిచ్చి గౌరవించడం కొనసాగుతోంది. మరి దౌత్యనీతి ప్రకారం అమెరికాలోని మన దౌత్య సిబ్బందికి కూడా సరీగ్గా ఇదేమాదిరి గౌరవాన్ని కల్పించాలి కదా! మరి అటువంటిదేమీ జరగడం లేదు. మరి మనదేశంలో, అమెరికన్లకు ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లోకి వెళ్ళేందుకు ప్రత్యేకమైన పాస్‌లు జారీ చేశారు. ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేసే భారతీయ సహాయకులకు కూడా అమెరికా చట్టాలే వర్తిస్తాయి! మరి భారతీయ సహాయకులకు అమెరికన్లు ఎంత చెల్లిస్తున్నారనేదానిపై అసలు లెక్కలుండవు. అదేవిధంగా అమెరికా స్కూళ్ళ లో పనిచేసే అమెరికన్లకు మన దేశ పన్ను చట్టాలు వర్తించవు!! మనదేశంలోని అమెరికాకు చెందిన దౌత్యేతర సంస్థలకు కూడా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నా...అమెరికానుంచి, ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో..మనదేశంలోని అమెరికా దౌత్యవేత్తలు, వారి ఇళ్ళలో పనిచేసే సహాయకుల గురించిన పూర్తి వివరాలను సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్‌లో భారతీయ దౌత్యవేత్తలను వారి గృహాల్లో పనిచేసే సహాయకులు నానా ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. గృహసహాయకులుగా వచ్చేవారు ముందుగా ఎంతో అణకువ గల ప్రవర్తనతో ఉంటారు. కొంతకాలం ముగిసాక అవకాశాలు పుష్కలంగా ఉండే అమెరికాలో ఏదో విధంగా స్థిరపడిపోవాలన్న ఉద్దేశంతో అడ్డదార్లు తొక్కుతుంటారు. ఈ క్రమంలోనే వారి చేతిలో మన దౌత్యవేత్తలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో మాన్‌హట్టన్‌లో పనిచేసిన భారతీయ కాన్సులేట్ జనరల్ ఇంట్లో నేను భోజనం చేయడం తటస్థించింది. మరి ఆయన ఉన్న కాంప్లెక్స్‌లో అపార్ట్‌మెంట్లో ఆ పని సహాయకుడికి పడక గది, స్నానాల గది ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దౌత్యవేత్తలతో కూడా వెళ్ళే గృహసహాయకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట విధానాన్ని రూపొందించి అమలు పరచాలి. అంతేకాదు వారికి అధికారిక పాస్‌లు ఇచ్చే సమయంలో, అమెరికా స్థానిక చట్టాలు వర్తించని విధంగా ఆ దేశంతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావాలి. నిజానికి ఈ సమస్య కేవలం భారత్‌కు చెందిన దౌత్యవేత్తలకు మాత్రమే పరిమితం కాదు. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పంచుకోవలసిన సమస్య. కాకపోతే భారతీయులు ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నారు.
ఇదిలావుండగా అమెరికా ఆక్షేపణీయ చర్య సృష్టించిన గందరగోళం..దేశంలోని విభిన్న వర్గాలనుంచి వేర్వేరు స్పందనకు కారణమైంది. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాజీ విదేశాంగశాఖ మంత్రి యశ్వంత్ సిన్హాను. అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారిలో ఉన్న స్వలింగ సంపర్కులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇటీవల స్వలింగ సంపర్కం క్రిమినల్ నేరమని సుప్రీంకోర్టు నిర్ధారించిన నేపథ్యంలో, అటువంటి అమెరికన్లను తక్షణమే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ‘గే సెక్స్’ క్రిమినల్ నేరమంటూ 153 సంవత్సరాల క్రితం నాటి బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసింది. దానే్న ప్రస్తుతం సుప్రీంకోర్టు ధ్రువీకరిం చింది. రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో, అమెరికా చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు మరింత తీవ్రస్థాయిలో వ్యక్తం కావడం సహజ పరిణామం. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు సన్నిహిత మిత్రుడిగా తలపోస్తున్న దేశం వ్యవహారశైలి..ముఖ్యంగా ఉన్నతస్థాయిలోని మహి ళా దౌత్యాధికారిని అవమానించిన తీరు.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలనుంచి, తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి ప్రధాన కారణం.
అయితే ఈ ప్రతిస్పందనలను మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్ళదగ్గ తరుణం కాదిది. సాధ్యమైనంత త్వరగా, పరిస్థితులు మామూలు స్థితికి రావాలి. ముఖ్యంగా భౌగోళికంగా భారత్-అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికి కూడా అతిముఖ్యం. అయితే ఇది భారతజాతికి అవమానకరమైన రీతిలో కొనసాగకూడదు. భవిష్యత్తులో మనదేశంలోని అమెరికా దౌత్యవేత్తలకు..సరికి సరి అనే రీతిలో..అంటే మన దౌత్యవేత్తలకు అమెరికాలో లభిస్తున్న గౌరవానికి సమానమైన హోదాను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు చాలా నిక్కచ్చిగా అమలు పరచాలి. ఇదే సమయంలో విస్తృత ప్రాతిపదికన దేశ ప్రయోనాలను దృష్టిలో ఉంచుకోవడం కూడా అవసరం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే రాహుల్ గాంధీ, భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లు..మనదేశంలో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధి బృందానికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా మన దేశ నిరసనను తెలియజెప్పారు.
ఈ చర్యల నేపథ్యంలో..మన దేశ దౌత్యాధికారిపై, తమ దేశ పోలీసులు వ్యవహరించిన తీరుపై అమెరికా అధికార యంత్రాంగం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని భారత్ వెనుకడుగు వేయకూడదు. మన దౌత్యవేత్తల ఇళ్ళలో సహాయకులుగా వెళ్ళేవారి విషయంలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ఇదే సరైన తరుణం. వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో అమెరికాతో చర్చించి.. ఖోబ్రాగడేకు జరిగిన అవమానం మరో దౌత్యవేత్తకు జరగకుండా భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
ఈ నేపథ్యంలో అమెరికన్లు తమను తామే వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. తాము అసాధారణ వ్యక్తులమన్న అహంకారాన్ని హద్దులు మీరే స్థాయికి తీసుకెళ్ళామా? అన్నదే ఆ ప్రశ్న. అమెరికాకు ఆవల కూడా ఎంతో సువిశాల ప్రపంచం ఉంది. అమెరికన్లకంటే అధికార దాహం కలిగినవారు ఎంతో మేధావులు ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఇతర దేశాలకు చెందిన ప్రజలు తమకంటూ స్వంత సంస్కృతి నాగరికతలను కలిగివున్నారు. తమ ప్రత్యేక సంస్కృతిని అనుసరించడం, కాపాడుకోవడం వారి హక్కు. బారత యువ దౌత్యవేత్త వస్త్రాలు ఊడదీసి తనిఖీ చేసిన అమెరికా వ్యవహారశైలి.. అక్కడి వ్యవస్థ పెద్ద అమోఘంగా ఏమీ లేద న్న సత్యాన్ని ఋజువు చేస్తున్నది.
నడిబజారులో భారత యువ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగడెను అరెస్ట్ చేయడం
english title:
america
Date:
Monday, December 23, 2013