శ్రీకాకుళం(కల్చరల్), డిసెంబర్ 24: పాపుల రక్షకుడుగా క్రైస్తవ సోదరులు భావించే ఏసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రార్ధనామందిరాలన్నీ ముస్తాబయ్యాయి. చిన్నబజారులోని తెలుగు బాప్టిస్టు చర్చి, టౌన్‌హాల్, ఆర్.సి.ఎం., మహిళా కళాశాల రోడ్డులోని క్రైస్తవ ఆరాధన మందిరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో చర్చిలను ఆకర్షణీయంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల మధ్య క్రిస్మస్ వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల పశువుల పాక పొత్తిళ్లలో బాలయేసు, దేవదూతలతో కూడిన సెట్లను ఏర్పాటు చేస్తున్నారు. యేసుక్రీస్తు జన్మ ప్రత్యేకతను ఉద్దేశించి బైబిల్ పాఠశాలలకు చెందిన చిన్నారులచే నాటికలు, నృత్యరూపకాలకు సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. ఏసుక్రీస్తు వారింటిలోనే ఉన్నట్లు జ్ఞానులకు తెలిసేలా నక్షత్రాలను ఇంటి పైన అలంకరించారు. క్రైస్తవులకు ఇదే ప్రధాన పండుగ కావడంతో కొత్త దుస్తులు, క్రిస్మస్ కేక్‌లు ప్రత్యేక వంటకాలకు అవసరమైన అన్నింటిని సమకూర్చుకున్నారు. కొందరు ఉత్సాహవంతులైన క్రైస్తవ విశ్వాసులు కేరల్స్ పార్టీపేరుతో రాత్రి నుంచి ఉదయం వరకు క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
...
జిల్లాలో వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు (హెచ్.ఎస్.ఆర్.పి) అమర్చ నున్నామని, ఈప్రక్రియను వచ్చే ఏడాది జనవరి నుంచి శ్రీకారం చుడుతున్నామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ నెల 11వ తేదీన హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్‌ను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిందన్నారు. ఇకపై వాహనాల పాత, కొత్త రిజిస్ట్రేషన్లు హెచ్.ఎస్.ఆర్.పి పరిధిలోకి వస్తాయని స్పష్టంచేశారు. జిల్లాలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలపై మంగళవారం తన కార్యాలయంలో జిల్లా రవాణా శాఖాధికారి ఎస్.వెంకటేశ్వరరావు ‘ఆంధ్రభూమి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తూ త్వరలో పాతవాహనాలకు సైతం ఈ తానులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ద్విచక్రవాహనాలకు 245 రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుముగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఆటోలకు, ఇతర వాహనాలకు 282 రూపాయలు, ఎల్.వి.ఎం.లకు 619 రూపాయలు, హెచ్.ఎం.వి.లకు 649 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 1.60 లక్షల అన్ని రకాల వాహనాలను గుర్తించామన్నారు. వాటిలో 1.30 లక్షలు మోటార్ టాక్సీలు, నాలుగువేల ట్రాక్టర్లు, 1800 మూడుచక్రాల వాహనాలు, నాలుగు వేల లారీలు, ఏడువేల ఆటోలు, రిక్షాలు, నాలుగువేల కార్లు ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి తగు రశీదులతోపాటు ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని సైతం ఎస్.ఎం.ఎస్.ల రూపంలో పంపించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లోగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 350 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారన్నారు. ముఖ్యంగా 17 ఏళ్లనుంచి 25 ఏళ్లలోపు వయసుగల వారే నూటికి 40 శాతం మంది ఈప్రమాదాల బారిన పడడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా పేర్కొన్నారు. కళాశాల, పాఠశాల, డివిజన్ స్థాయిల్లో ఒక కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ చదువుతున్న విద్యార్థులకు డ్రైవింగ్ జాగ్రత్తలపై అవగాహన కల్పించే సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఆటోడ్రైవర్లు, లారీ, ట్రాక్టర్, టూవీలర్, స్కూల్‌బస్ డ్రైవర్లకు రహదారి భద్రతపై ఆవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వస్తున్న 500 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 2,735 మంది నుంచి 41 లక్షల రూపాయలను అపరాధ రుసుముగా ఈ ఏడాది వసూలు చేశామన్నారు. అలాగే పర్మిట్ లేని ఆటోలు, లారీలు 2051 వాహనాలపై కేసులు నమోదు చేసి 42 లక్షల రూపాయలు, 1914 ఆటోలపై కేసులు నమోదుచేసి 19.14 లక్షలు, 341 లారీల నుంచి 5.11 లక్షలు, 352 ప్రైవేట్ స్కూల్ బస్సుల నుంచి 6.30 లక్షల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసినట్లు చెప్పారు. మీసేవా కేంద్రాలు, ఇంటర్నెట్‌ల ద్వారా రవాణా సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వంతెన నిర్మాణం కలేనా..
జలుమూరు, డిసెంబర్ 24: జలుమూరు మండలం కొమనాపల్లి వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణం లేక అటు సరుబుజ్జిలి, ఆమదాలవలస, ఎల్.ఎన్.పేట మండలాల నుంచి ఇటు సారవకోట, జలుమూరు మండలాల ప్రజల ప్రయాణానికి పడవే ప్రధాన వారధిగా నిలిచింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పడవపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అటు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లో ఉన్న ప్రజలకు అనేక మేలు జరుగుతుందన్న దృక్పథంతో ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనను పంపించారు. అయితే నాటి రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఈ వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించి, రూ.48కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు గాని, కనీసం సర్వేలను గాని నేటికీ జరుపకపోవడం విశేషం. దీనికంటే ముందే నదీపరివాహక ప్రాంత ప్రజలకు నీటిప్రవాహం ఉద్ధృతి లేకుండా కరకట్టలు నిర్మించినా నేటికీ అవి పూర్తికాకపోవడంతో ఇక వంతెన నిర్మాణం జరిగేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నో పార్టీలు, ఎందరో నాయకులు కొమనాపల్లి వద్ద వంతెనపై హామీలు గుప్పించినా అవి నేరవేరే దాఖలాలు కానరావడం లేదు. చివరకు 2003లో దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇదే నదిపై కొమనాపల్లి వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ నాడు జరిగిన బహిరంగసభలో నరసన్నపేట ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావు వంతెన సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 2004లో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా హామీ నెరవేర్చలేకపోయినా రోడ్లు, భవనాల శాఖామంత్రిగా ధర్మాన పట్టుదలతో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలతో మాట్లాడి ఎట్టకేలకు నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభించకపోవడంతో కొమనాపల్లి వంతెన కలగా మిగులుతుందేమోనని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
స్థలాలకు పెరిగిన విలువలు
ఈ వంతెనకు నిధులు మంజూరవ్వడంతో చల్లవానిపేట జంక్షన్ నుండి కొమనాపల్లి గ్రామం వరకు 17 కిలోమీటర్ల దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా పరిసరాల్లో ఉన్న వ్యవసాయ భూములకు ధరలు, విలువలు పెరిగాయి. బుడితి జంక్షన్ నుండి కొమనాపల్లి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వంతెన నిర్మాణం జరిగితే జిల్లా కేంద్రానికి, పాలకొండ డివిజన్ కేంద్రానికి, ఒడిశా ప్రాంతం రాయఘడకు అతితక్కువ సమయంలో చేరిపోవచ్చునన్న ఉద్దేశ్యంతో స్థలాలకు గిరాకీ పెరిగింది.
వచ్చారు.. వెళ్లారు
ఎచ్చెర్ల, డిసెంబర్ 24: మండలంలో చిలకపాలెం సమీపాన 15 లక్షల రూపాయల నిధులతో పునఃనిర్మించిన ఆర్.అండ్.బి రహదారి బంగ్లా శంకుస్థాపన కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న మంత్రులు మమ అనిపించారు. గత రెండురోజులుగా మంత్రుల పర్యటనపై విరివిగా సాగిన ప్రచారంపై నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి పెద్దఎత్తున కేడర్ ప్రారంభోత్సవానికి చేరుకున్నప్పటికీ మంత్రులు మాత్రం నోరుమెదపకపోవడంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వైద్య విద్యా శాఖామంత్రి కోండ్రు మురళీమోహన్, ఇరిగేషన్ శాఖామంత్రి టి.జి.వెంకటేష్‌లు నేరుగా విశాఖపట్నం నుంచి ఆర్.అండ్.బి బంగ్లాకు చేరుకుని ఐదు నిముషాలలో శంకుస్థాపన ప్రక్రియ ముగించారు. ఉదయం నుంచి ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడుతోపాటు అనేక మంది నేతలు నిరీక్షించడం కనిపించింది. మంత్రుల బృందానికి వీరంతా సాదరస్వాగతం పలికారు. ముగ్గురు మంత్రులు శిలాఫలకం వద్దకు చేరుకుని అతిథి గృహాన్ని ప్రారంభించారు. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాలకు చెందిన ముఖ్య నేతలంతా మంత్రుల ప్రారంభోత్సవానికి హాజరై ఎన్నో సమస్యలపై విన్నవించాల్సి ఉన్నప్పటికీ కేవలం గతంలో పనిచేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని సంబంధిత మంత్రి టి.జి.వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లడం కనిపించింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి మంత్రి కోండ్రుతోపాటు ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు కూడా తన క్యాంపు కార్యాలయానికి కలసి వస్తే సంబంధిత అధికారులతో చర్చించి ఈ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సనపల నారాయణరావు, జరుగుళ్ల శంకర్రావు, పైడి భాస్కరరావు, జీరు రామారావు, బోర సాయిరాం, బొడ్డేపల్లి సుధాకర్, కోటిపాత్రుని విశ్వనాధం, దన్నాన రాజినాయుడు, గొర్లె లక్ష్మణరావు, గొర్లె రాజగోపాల్, ఎఎంసి చైర్మన్ తదితరులు ఉన్నారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
రాజాం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఈ రహదారి బంగ్లా ప్రారంభోత్సవ కార్యక్రమం తన నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ డి.ఇ లోకనాధంపై ఎమ్మెల్యే నీలకంఠంనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే అంటే అంత చులకనా అంటూ మండిపడ్డారు. మంత్రి కోండ్రు చెప్పే వరకు ఈ విషయం తెలియజేయకపోవడం ఆంతర్యమని ఆవేశంలో ఊగిపోయారు. జరిగిన పొరపాటుకు డి.ఇ లోకనాధం క్షమాపణ చెప్పినప్పటికీ ఎమ్మెల్యే శాంతించలేదు.
రాష్ట్ర విభజన కోరుకునే వారు
చరిత్ర హీనులు
రాజాం, డిసెంబర్ 24: రాష్ట్ర విభజన కోరుకునే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని రాష్ట్ర మంత్రులు టి.జి.వెంకటేష్, ప్రతాప్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం వారు స్థానికంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. విభజనకు టిడిపి, వైసిపి కారణాలయ్యాయని, చివరికి కాంగ్రెస్ కూడా పాత్రధారి అయిందని, అయితే అన్ని పార్టీలు ఒక్కటైతే విభజన ఆగిపోతుందని అన్నారు. విభజన అనివార్యమైతే సమస్యలన్నీ పరిష్కరించి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా అన్నారు. కాగా, న్యాయశాఖ మంత్రి ప్రతాప్‌రెడ్డి మాత్రం సమైక్య రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు.
జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో
అంధవిద్యార్థి ప్రతిభ
పొందూరు, డిసెంబర్ 24: జాతీయ అంధుల జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 50 కేజీల విభాగంలో జిల్లాలోని పొందూరుకు చెందిన పాడిపాటి రమేష్ అనే 17 ఏళ్ల అంధ విద్యార్థి ఒకేసారి వరుసగా మూడు రజత పతకాలు సాధించి రాష్ట్ర, జిల్లా, మండల కీర్తిప్రతిష్ఠలను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశాడు. అస్సాం రాష్ట్రంలో గోవా హఠీలో సోమవారం జరిగిన ఈ వికలాంగ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రమేష్ మూడు రజత పతకాలను సాధించాడు. మంగళవారం ఈ విషయాన్ని తెలుసుకున్న మండల వాసుల ఆనందానికి అవధుల్లేవు. జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరపున ఓ అంధ విద్యార్థి మూడుపతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రమేష్ ప్రస్తుతం విజయనగరం అంధుల కళాశాలలో చదువు సాగిస్తున్నాడు. ఈయన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదివాడు. రమేష్ చూపిన ప్రతిభ పట్ల కేంద్రమంత్రి కృపారాణి, స్థానిక ఎమ్మెల్యే సత్యవతి, వైఎస్సార్‌సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూన రవికుమార్, సర్పంచ్ కోరుకుండ జయలక్ష్మీలు అభినందనలు తెలిపారు.
అంబేద్కర్ వర్సిటీ రెక్టార్ బాధ్యతలు స్వీకరణ
ఎచ్చెర్ల, డిసెంబర్ 24: ప్రిన్సిపాల్‌గా అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సేవలందిస్తున్న ప్రొఫెసర్ ఎం.చంద్రయ్యను రెక్టార్‌గా ఇటీవలి నియమిస్తూ వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక నుంచి రెక్టార్‌గా బాధ్యతలు నిర్వర్తించాలని వీసీ మంగళవారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మరింత సమర్ధవంతంగా సేవలందించి వర్శిటీ ఉన్నతికి ఎంతగానో కృషి చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ను నియమించేవరకూ రెక్టార్‌తోపాటు అదనపు బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. రెక్టార్‌గా బాధ్యతలు స్వీకరించడంపై వీసీతోపాటు రిజిస్ట్రార్ కృష్ణమోహన్, సిడిసి డీన్ తులసీరావు, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు.
టీచింగ్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
ఎచ్చెర్ల, డిసెంబర్ 24: అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న గణితం, జియోసైన్స్ సబ్జెక్టులను బోధించేందుకు టీచింగ్ అసోసియేట్స్‌ను భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి మూడు పోస్టులకు ఇద్దరే అభ్యర్థులు హాజరయ్యారు. జియోసైన్స్‌కు సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నప్పటికీ ఐదుగురు హాజరయ్యారు. వీరికి ఆచార్య శ్రీనివాస్, సత్యనారాయణ, రామారావులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, సిడిసి డీన్ జి.తులసీరావులు ఈ ఇంటర్వ్యూలను పర్యవేక్షించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుని నియామకాలు చేపడతామని స్పష్టంచేశారు.
రేపు స్వామీజీల రాక
శ్రీకాకుళం(కల్చరల్), డిసెంబర్ 24: జగద్గురు దత్త పీఠాధీశ్వరులు పరమపూజ్య గణపతి సచ్చితానందస్వామిజీ వారి అనుంగశిష్యుడు, శ్రీ దత్త విద్యానంద తీర్ధ స్వామిజీ ఈ నెల 26వ తేదీన శ్రీకాకుళం రానున్నారు. ఆ రోజు ఉదయం చిం దత్తనాథ క్షేత్రాన్ని దర్శించి అనుగ్రహభాషణము ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విశేషార్చన, శ్రీచక్రపూజ, మహాగణపతి హోమంలను నిర్వహిస్తున్నట్లు క్షేత్ర పాలక మండలి సభ్యులు పేర్ల బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా అరసవల్లి క్షేత్రంలో మహాసౌరయాగ మహోత్సవాలను కంచికామ కోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి సందర్శించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
మహాసౌరయాగానికి విశేష స్పందన
శ్రీకాకుళం(కల్చరల్), డిసెంబర్ 24: ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యుని సన్నిధిలో గత వారం రోజులుగా జరుగుతున్న మహాసౌరయాగ మహోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. ఆరోగ్య ప్రదాతగా కొలిచే భక్తులు కనులారా సౌరయాగాన్ని చూసి తరిస్తున్నారు. దాతలు, భక్తులు వ్యయ, సమయాల్ని వెచ్చిస్తూ అరుదైన యాగ మహోత్సవానికి తోడ్పడుతున్నారు. 36 యాగగుండాల్లో పూజలు నిర్వహిస్తున్న భక్తులకు సాయి కమ్యూనికేషన్ వారు స్వామివారి లేమినేషన్ చిత్రపటం, చరిత్రను తెలిపే పూర్వ చిత్రాల పుస్తకంలను స్వయంగా అందిస్తున్నారు. కొందరు పూలను అందిస్తున్నారు. మహోత్సవ కమిటీ వారువిరామ సమయంలో టీ, బిస్కెట్లు, అల్పాహారాన్ని పూజనంతరం స్వామివారి పేరున శేష వస్త్రాలు, అక్షతలు, తీర్ధప్రసాదాలు అందిస్తున్నారు. ఒంటిగంట నుండి ఏర్పాటు చేసిన స్వామివారి ప్రసాద విందుకు ప్రత్యేక పాకశాలల్లో అర్చక స్వాములు, భక్తులు సేవలందిస్తున్నార. ఎలియన్స్ క్లబ్ ప్రతినిధులు దీర్ఘాశి శ్యామల ఆధ్వర్యంలో మహిళా భక్తులు ఋత్వికులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఉదయం నుండి మండప దేవతా మంత్ర, తృచ, సౌర, అరుణమంత్ర శ్రీ భాస్కర, గాయత్రీ, సౌరాష్టాక్షరీ, ద్వాదశాదిత్య పూజలతో ప్రతీరోజు అరసవల్లి నుండి కిలోమీటరు దూరం వరకు వేదఘోషతో ఆధ్యాత్మిక శోభ వెదజల్లుతోంది. ప్రత్యేకంగా ఐదు శ్రీచక్రార్చనపూజలు నిరాటంకంగా జరుగుతున్నాయి. గూడెం సిద్ధాంతి పెంట సుబ్రహ్మణ్యశాస్ర్తీ, అంపోలు రుద్రకోటేశ్వరశర్మ, పెంటా చంద్రశేఖరశర్మ, వనమాలి వెంకట రమణశర్మ మంత్ర తపతర్పణ, హవన, శ్రీచక్రనావాధరణ అర్చనలు, వాస్తు బలిహరణం, దశవిధ హారతి, మంత్రపుష్ప, సవస్తి వాచనములు ప్రధాన యాగశాలలో జరుగుతున్నాయి. శృంగారం ధనుంజయ్‌శర్మచే చండీ పారాయణ, హోమపూజలు జరిగాయి.
* అలరించిన వాగ్ధేయ వైభవం
సౌరయాగ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం సంస్కృతీ సంరంభంలో వాగ్దేయ వైభవం కడురమ్యంగా ప్రదర్శించబడింది. విశాఖపట్నంకు చెందిన చైతన్య బ్రదర్స్ వారణాసి వెంకటేశ్వరశర్మ, బుక్కపట్నం కృష్ణమాచార్యులు వారిచే భక్తిసంగీత విభావరి కార్యక్రమంలో సంగీత కళానిధి నేదుసూరి కృష్ణమూర్తి శిష్యుడు వీణావాయిద్యంతో భక్తులను, అతిథులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఇప్పిలి శంకరశర్మ గుత్తి చిన్నారావు, మండవిల్లి రవిల నేతృత్వంలో కళాకారులను సత్కరించారు. పులకండం శ్రీనివాసరావు, దూసి ధర్మారావులు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జోగిసన్యాసిరావు, శ్రీకూర్మాం ట్రస్టు బోర్డు సభ్యులు దివిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.