
రాష్టవ్య్రాప్తంగా పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జన సమ్మర్థం వున్న ప్రాంతాలలో సెల్‌టవర్ల నిర్మాణం ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. అధిక శాతం టవర్లు సరైన అనుమతులు లేకుండా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీనివలన ఏటా ప్రభుత్వానికి టాక్సుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడ్తోంది. పైగా జనావాస ప్రాంతాలలో సెల్‌టవర్లు వుండరాదన్న సుప్రీంకోర్టు నిబంధనలకు నీళ్లొదిలి కంపెనీలు అపార్ట్‌మెంట్ భవనాలపై కూడా టవర్లు నిర్మిస్తున్నారు. సెల్‌టవర్ల నుండి వచ్చే రేడియేషన్లవలన కేన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు అత్యధికం అన్న శాస్తవ్రేత్తల హెచ్చరికలను విస్మరించడం బాధాకరం. ఇప్పటికే సెల్ టవర్ల పుణ్యమా అని కాకులు, పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. ఇక మానవజాతి కూడా అదృశ్యమైపోతుందేమో ఎవరు చెప్పగలరు? జీవజాతికి పెనుప్రమాదమైన సెల్‌టవర్ల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
రైతుల పరిస్థితి అగమ్యగోచరం
కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా మిగులు జలాలపై హక్కు ఇవ్వకపోవడంవల్ల ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపైన రాష్ట్ర రైతాంగం ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. కృష్ణానది మిగులు జలాలనే నమ్ముకుని ఇప్పటికే నిర్మించిన, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పైబడి సాగులో ఉన్న పంట భూములు బీడుగా మారే ప్రమాదం పొంచి ఉందన్న ఊహే అన్నదాతకు తీవ్ర ఆందోళన కల్గిస్తూ కుంగదీస్తున్నది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు విపరీత నష్టం సంభవిస్తుందని మొత్తుకోవడం మినహా మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కచ్చితమైన, సహేతుకమైన రుజువులుగానీ, ఆధారాలుగానీ చూపించలేక చతికిలపడి పోయింది. ఏ విధంగా చూసినా ఈ దుస్థితికి పూర్తి కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులోనైనా రైతాంగానికి తగిన రీతిలో సాంత్వన చేకూరటానికి అవిశ్రాంత కృషిచేసి తీరాలి.
- పట్టెం వెంకట నాగేశ్వరరావు, చెరుకుపల్లి
విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి
విద్యుత్తు బకాయిలను గడువులోపుగా చెల్లించలేదని రాష్ట్రంలోని మేజర్ పంచాయతీలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఫలితం గ్రామాల్లో వీధి దీపాలు వెలగక చీకట్లు అలముకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2009 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీఓ నెం.80 ప్రకారం మేజర్ పంచాయతీలు నయాపైసా కూడా విద్యుత్తు బిల్లు చెల్లించవలసి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ జీఓ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా హైదరాబాద్‌లోనే పంచాయతీరాజ్ శాఖనుండి విద్యుత్‌శాఖకు జమ చేయాల్సి ఉంది. అయితే వాస్తవానికి అలా జమకాకపోవడమే ప్రస్తుత సమస్యకు మూలకారణమయింది. వీధి లైట్లకు, తాగు నీటికి విద్యుత్‌ను నిలుపుదల చేయడంతో లక్షలాది మంది ప్రజలు భరించలేక గగ్గోలుపెడుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రస్తుతం విడుదలైన నిధులను కొంతమేరకైనా చెల్లింపులు జరిపి సత్వరం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలి.
- పి.వి.ఎన్.రావు, చెరుకుపల్లి
అమ్మో! దోమలు
రాష్ట్రంలో పైలిన్ పోయి తుఫాను, తుఫాన్ పోయి లెహర్ ఇలా.. గత రెండు నెలలుగా వర్షాలతో జనం, సర్కారు హడలెత్తిపోయారు. ఈ వర్షాలవల్ల ఎక్కడ నీళ్ళు అక్కడే నిల్వ అయి దోమలు వృద్ధిచెందాయి. వీటివల్ల దోమలు పెరిగి స్వైన్‌ఫ్లూ, మలేరియా, డయేరియా, కలరా, డెంగీ, చికెన్‌ఫాక్స్, ఫైలేరియాలు పెరిగాయి. గతంలో దోమల్ని నివారించడానికి మేజర్ పంచాయితీల్లో ఫాగింగ్ జరిపేవారు. కానీ నేడు ఆ యంత్రం కనబడటం లేదు. నిల్వ వున్న ప్రాంతాల్లో ఎం.ఎల్. ఆయిల్ స్ప్రే చేసేవారు. కానీ అవీ కనబడటంలేదు. బ్లీచింగ్ చల్లేవారు అదీ లేదు కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి దోమల నివారణ చేయాలి.
- ఈవేమన, శ్రీకాకుళం
ప్రభుత్వ భూముల పరిరక్షణ అవసరం
రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణకై ‘ప్రత్యేక డ్రైవ్’ చేపడతామని రెవెన్యూశాఖామంత్రి రఘవీరారెడ్డి ప్రకటించడం హర్షణీయం. వందల వేల కోట్ల రూపాయలు ఖరీదుచేసే ఎన్నో ప్రభుత్వ భూములు, ఆస్తులు సమాజంలోని కొందరు బడాబాబుల ఆక్రమణలోనున్నాయ. రాజకీయంగా అండ కలిగిన వారిపై ఈగైనా వాలలేని దుస్థితి ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లుతెరచి ప్రభుత్వ భూములను కాపాడే దిశగా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలి.
- గుర్రం శ్రీనివాస్, చెరుకుపల్లి