పిల్లలకి పరీక్షల నిర్వహణలో పెద్దలకు శిక్షలు తప్పడం లేదు. పెద్దలు పరీక్షలు నిర్వహించటంలో తలమునకలయ్యేముందు జిల్లా కలెక్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎడారిలో ఒంటెల పందాల వలె పోటీ పందాలతో కలెక్టర్లు తమ జిల్లా రాష్ట్రంలో అందరికంటే ముందుండాలని పిల్లలపై ఒత్తిడి పెంచేశారు. అంతే కాకుండా టీచర్లకి కూడా కొరడా ఝుళిపించారు. ఇది అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించింది. సాక్షాత్తు జిల్లాకి గవర్నర్ లాంటి వ్యక్తి కలెక్టరు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించకుంటే తగిన విధంగా అయ్యవార్ల పనిపట్టి ఇంక్రిమెంట్లు కట్ చేస్తామని సస్పెండ్ చేస్తామని చెప్పటం జరిగింది. అంతేకాకుండా అయ్యవార్ల మీద అమ్మవార్ల మీద జులుం చెలాయించడానికి సదరు తాసీల్దార్లు ఆర్.డి.వోల స్థాయి ఇతర డిపార్టుమెంట్ల అధికారులు, రాష్టస్థ్రాయి అబ్జర్వర్లు ఇలా చెప్పుకుంటూపోతే సవాలక్ష మంది అధికారులని అందర్నీ స్కూళ్ళ వైపు పరుగులు తీయించారు. జనవరి నుండీ అదే పనిగా వీరంతా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. అనుక్షణం అటు పిల్లలని అయ్యవార్లని శెలవులు కూడా లేకుండా ఆదివారాలు రెండో శనివారాలు పండుగ శెలవులు వెరసి మొత్తం అన్ని దినాలు అయ్యవార్లు ఈ పన్లోనే ఉంటున్నారు. పిల్లలకి ఒకటే పరీక్షలు! రోజూ ఒక సబ్జెక్టులో పరీక్షలు పెట్టటం మళ్ళీ వారాంతపు పరీక్షలు నిర్వహించడం.. అవి పిల్లలు వ్రాయటం అయ్యవార్లు దిద్దటంతో కాలమంతా గడిచింది. ఇంతలో ఈ తంతంతా చూసిన పిల్లలు కొంతమంది బడంటే భయంవేసి కొందరు డిసెంబరులో, మరికొందరు జనవరినుండి చదువులను మానేసి పని పాటలకు వెళ్ళిపోయారు. కొంతమంది ఎనుములు మళ్ళేయటం కొంతమంది కంది పన్లకి అందర్లో కొందరు తలొక దిక్కుకి పోయారు. అయ్యవార్లు అమ్మవార్లు ఒకటే కంగారుపడి కబురెట్టి పిలిచినా తమకు చదువు వద్దంటే ఒద్దని వెళ్ళి(పారి)పోయారు. అయ్యవార్లకి కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఎలాగైనా వాళ్ళని రప్పించాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు.
మార్చి రానే వచ్చింది. ఇంతలో పిడుగులాంటి ఒక వార్త వచ్చింది. బడికి వచ్చినవారికి రాని వారికీ ఎవరికైనా పరీక్ష హాల్ టిక్కెట్లు ఇవ్వాలని హైకోర్టువారు ఆదేశించారట! మామూలుగా బడికి 75% హాజరు ఉంటే పరీక్షకి కూచునేందుకు వీలుంటుందని రూలు పొజిషన్. కోర్టువారి పుణ్యమా అంటూ చదివేవారూ చదవనివారూ అందరూ పరీక్షలకి కూర్చున్నారు. టీచర్లు సందిగ్ధంలో పడిపోయారు. అసలే కలెక్టర్లు. స్కూలుకి ఇంత అంత పర్సంటేజి రిజల్ట్సు ఉండాలని పదే పదే చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు రారు. ఎట్లా చచ్చేది అని అయ్యవార్లు చాలా బాధపడ్డారు. ఎలాచేయాలి? చదువరాని పిల్లలు మెట్టెక్కించాలంటే ఎట్లా? అన్న బాధ బయల్దేరింది. కరవమంటే కప్పకి కోపం విడువమంటే పాముకి కోపం. ఈ మాదిరిగా అయ్యవార్లు అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా అయ్యారు. చేసేది లేక పిల్లలని కాస్త చూసిచూడనట్లు పోవటం లేదా బిట్టు మార్కులు వచ్చేట్టు చేయటం మొదలెట్టారు. నిజానికి అయ్యవార్లకి ఈ పని చెయ్యటం అస్సలు ఇష్టం లేదు. పిల్లలకి చదువుబాగా రావాలని బాగా చదవాలని ఎప్పుడూ కష్టపడేవారికి ఇది ఇష్టం ఉండదు. నిజానికి ఇలా పాసయిన పిల్లలు ఎందుకూ పనికిరారు. అధికారుల అనవసర జోక్యంతోనే ఈ పదవ తరగతి పరీక్షలు అధోగతి పట్టాయి. నిఖార్సైన చదువు పూర్తిగా మంటకల్సింది. ఇక పరీక్షల తతంగం అంతా అన్యాయ అక్రమాలకి బడి స్థాయిలోనే తెరదీస్తే ఇక బిడ్డలకి చదువు అంటేదెలా? చదువురానివాడు తప్పితే వచ్చే నష్టమేంటి? చదువువచ్చేదాక ఆ తరగతిలోనే ఉంటేనే చదువు వస్తుంది. గతంలో అదే రకంగా ఉండేది. చదువులన్నీ చట్టుబండలైపొమ్మంటే అవవా? అయ్యవారు ఉద్యోగంకోసం, పిల్లవాడు పాసవటం కోసం, అధికారులు పేరు, ప్రాపకం, ప్రాభవంకోసం రాబోయే తరాల భవిష్యత్‌ని నాశనం చేస్తున్నారనటంలో ఎటువంటి అనుమానం లేదు. మన పిల్లలు రాబోయే రోజుల్లో ఏ దేశమూ రమ్మని పిలవదు. ఎందుకంటే మన చదువులు గతంలో బాగున్నాయి. అప్పుడు రమ్మని ఉద్యోగాలిచ్చారు. ఇట్లా చదువులుంటే ఎక్కడా ఉద్యోగాలు రావు. ఎవరికీ విలువ ఉండదు.
పిల్లలకి పరీక్షల నిర్వహణలో పెద్దలకు శిక్షలు తప్పడం లేదు.
english title:
exam phobia
Date:
Friday, March 9, 2012