నేత్రదానం, అవయవ దానంపై మన ప్రజలలో చైతన్యం వస్తోంది. అయితే తమ కుటుంబ సభ్యులెవరైనా మరణిస్తే తక్షణమే ఎవరికి తెలియజేయాలనే విషయం ఎక్కువ మందికి తెలియదు. కనుక అందరికీ పరిచయమున్న 108, అత్యవసర సేవల విషయంలో వలె నేత్రదానం, అవయవ దానం గురించి వారికే తెలిపి, వారు వైద్య విభాగం ద్వారా సేకరించే ఏర్పాటుచేయాలి. తద్వారా లక్షలాది మంది నిర్భాగ్యులకు మేలుజరుగుతుంది. మరియు కల్తీ సారా, కల్తీ మందులు, కల్తీ నూనెలు, నకిలీ ఎరువులు, అవినీతి వంటి అక్రమాల గురించి కూడా నిరక్షరాస్యులు గుర్తుపెట్టుకోలేని వివిధ ఫోను నెంబర్లకు తెలియజేసే బదులు, 108 నెంబర్ ఫోనుకే తెలిపే ఏర్పాటుచేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి సౌకర్యంగా వుంటుంది. వారికి అందిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించి, అందుకు అవసరమైన అదనపు సిబ్బందిని కూడా నియమిస్తే బాగుంటుంది.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నరసరావుపేట
ప్రైవేటు కార్యక్రమాలకు ప్రభుత్వ వాహనాలా?
ఈమధ్య కాలంలో ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయివేటు ఆసుపత్రులు, షాపింగ్స్, ఎగ్జిబిషన్స్ మొదలైన ప్రారంభోత్సవాలకు చురుకుగా హాజరవడం గమనించదగ్గ విషయం. వారు కేవలం ప్రజల అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అన్న విషయం అవగాహనా లోపం అయి ఉన్నది. ఈ విధంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాలు, సిబ్బందితో హాజరవడం వల్ల ప్రభుత్వ సొమ్ము మరియు వారి అమూల్యమైన కాలం వృధా అవుతున్నాయన్న వాస్తవం వారు గ్రహించలేకపోవడం చాలా విచారకరం. కేంద్ర ప్రభుత్వంవారు ఈ విషయంపై ప్రజాప్రతినిధులు ప్రయివేటు కార్యక్రమాలకు హాజరుకాకుండా చట్టం తేవాల్సిన అవసరంపై ఆలోచన తప్పనిసరై ఉన్నది.
- బొడ్డుపల్లి వెంకట సుబ్రమణ్యశాస్ర్తీ, బాపట్ల
కృష్ణా ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి
దక్షిణమధ్య రైల్వే 1973లో ప్రవేశపెట్టిన కృష్ణాఎక్స్‌ప్రెస్ (17406/17405) తొలుత సికింద్రాబాదు నుంచి విజయవాడ మీదుగా గుంటూరుకు చేరేది. తరువాత గుంటూరుకు బదులుగా విజయవాడ మీదుగా తిరుపతి వరకు పొడిగించారు. ఆ తరువాతి కాలంలో ఆ రైలు సికింద్రాబాదు నుంచి బయలుదేరటంకాక నిజామాబాదు, ఆ తరువాత ఆదిలాబాదునుంచి బయలుదేరేవిధంగా అధికారులు నిర్ణయించారు. ఈ రైలు సుదూరప్రాంతాలకు వెళ్తూ బహుళ ప్రయోజనాలను అందిస్తోంది. ఆ రైలుకు అప్పట్లో పెట్టిన కృష్ణాఎక్స్‌ప్రెస్ పేరునే నేటికీ కొనసాగిస్తున్నారు. దానితో ఆ రైలు అది ప్రయాణించే ప్రాంతాలతో సంబంధం లేని పేరుతో అలాగే ఉండిపోయింది. కాబట్టి కృష్ణాఎక్స్‌ప్రెస్ పేరును మార్చివేసి శ్రీ వేంకటేశ్వర ఎక్స్‌ప్రెస్‌గానో, శ్రీకాళహస్తి ఎక్స్‌ప్రెస్‌గానో లేదా బాసర సరస్వతి ఎక్స్‌ప్రెస్‌గానో పేరుమార్చాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాదునుంచి విజయవాడ మీదుగా గుంటూరుకు వెళ్ళే ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12706/12705)కు ఈనాటి వరకు పేరు పెట్టనేలేదు. కాబట్టి ఈ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కృష్ణా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయటం ఎంతో సబబు. దానితో అసలైన రైలు రూటుకు అసలైన పేరు పెట్టినట్లవుతుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ రైళ్ళ పేర్లు మార్చాలని కోరుతున్నాను.
- కె.వి.రమణమూర్తి, సికింద్రాబాద్
వయో పరిమితిని పెంచండి
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సవరించిన వయోపరిమితి మరీ తక్కువగా ఉంది. అదీకాక దాన్ని కొన్ని ఉద్యోగాలకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు. ఆర్టీసి లాంటి చిరు ఉద్యోగాలకు కూడా దీన్ని వర్తింపచేస్తే రాష్ట్రంలో కొంతమందికైనా ఉపాధి దొరుకుతుంది. ఆర్టీసిలో ఉద్యోగాలు వేట్‌కాలర్ జాబ్స్ కాదుకదా? అందువల్ల వయోపరిమితిని 39కు పెంచుతూ, ఆర్టీసికి కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రిని కోరడమైనది.
- వై.నాగశ్రీనివాస్, తెనాలి