
న్యూఢిల్లీ, జనవరి 7: సోదరుడు రాహుల్‌గాంధీ నివాసంలో మంగళవారం కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్న సమావేశానికి ప్రియాంక హాజరైంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. నేతలందర్నీ పలకరించి ప్రియాంక సందడి చేయడం చర్చనీయాంశమైంది. ఈనెల 17న జరగనున్న కాంగ్రెస్ సదస్సులో రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కీలక భేటీకి ప్రియాంక హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ మిస్ర్తి, జనార్దన్ ద్వివేది, అజయ్ మాకేన్, పార్టీ సిద్ధాతకర్త మోహన్ గోపాల్‌వంటి ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు. అయితే సమావేశంలో రాహుల్ పాల్గొన్నారా? లేదా? అన్న విషయమై స్పష్టత ఇచ్చేందుకు పార్టీవర్గాలు నిరాకరించాయి. భేటీలో ప్రియాంక ప్రత్యక్షం కావడంపై నేతలు పెద్దగా స్పందించడం లేదు. ఆమె కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూనే ఉన్నారని, నేతల భేటీ సందర్భంగా హాజరుకావడంలో ఆశ్చర్యం ఏముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ రాహుల్, సోనియా నియోజకవర్గాలకే పరిమితమైన ప్రియాంక రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇక చురుకైన పాత్ర పోషిస్తారనే వాదనలు కొద్దిరోజులుగా ఊపందుకున్నాయి. కాగా, రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా, ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తే ఆమె కాంగ్రెస్ కీలక నేతల భేటీకి ఎందుకు హాజరయ్యారని మరికొందరు వాదిస్తున్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం, బిజెపి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీకి ప్రజాదరణ పెరగడం వంటి కారణాల రీత్యా ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు లేకపోలేదు.