
హైదరాబాద్, జనవరి 7: సినీనటుడు ఉదయ్ కిరణ్‌ది ఆత్మహత్యేనని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు. ఈమేరకు పోస్ట్‌మార్టం నివేదిక సిద్ధం చేశారు. వైద్యుల నివేదిక ప్రకారం ఉదయ్‌కిరణ్ రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉరి వేసుకున్న కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన చనిపోయారు. ఆ రోజు ఉదయం నుంచి ఉదయ్ కిరణ్ ఆహారం తీసుకోలేదని, బట్టతాడుతో ఉరివేసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. కాగా ఉరివేసుకునే ముందు ఉదయ్ కిరణ్ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ఫోరెన్సిక్ ప్రాథమికలో వెల్లడైంది. ఆయన తన చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకునే ప్రయత్నం చేశారని నివేదికలో తేలింది. వెస్ట్‌జోన్ పోలీసులు మంగళవారం ఉదయ్‌కిరణ్ నివాసాన్ని పరిశీలించి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ ఫోరెన్సిక్ నివేదికలో ఆత్మహత్యగా తేలింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. రెండు మూడు రోజుల్లో భార్య విషిత, అత్తమామలను విచారించనున్నట్లు తెలిసింది.