
న్యూఢిల్లీ, మార్చి 21: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన స్వంత నియోజకవర్గమైన రాయబరేలీ నుండి ముచ్చటగా మూడోసారి పోటీ చేసేందుకు ఏప్రిల్ 2న తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు, తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక సమక్షంలో సోనియాగాంధీ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. సోనియా గాంధీ 2004 సంవత్సరం నుండి రాయబరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఆమె అమేథీ నుండి లోక్‌సభకు ఎన్నిక కావటం తెలిసిందే. అయితే కుమారుడు రాహుల్ కోసం ఆమె అమేథీ నుండి రాయబరేలీకి మారారు. సోనియా గాంధీ ఏప్రిల్ రెండో తేదీనాడు నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అంశాన్ని ఏఐసిసి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సోనియా ఆరోజు ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరి లక్నో వెళతారు. అమె అక్కడి నుండి కారులో రాయబరేలీ వెళ్తారు. మొదట పార్టీ కార్యాలయానికి వెళ్లి పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తారు. సోనియా గాంధీ మరోసారి రాయబరేలీ నుండి భారీ మెజారిటీ విజయం సాధించాలని కోరుకుంటూ స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంలో ఏప్రిల్ 2న పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేసే ముందు పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జిల్లా మేజిస్ట్రేటు, రిటర్నింగ్ అధికారి ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. సోనియా గాంధీ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు పెద్ద ఊరేగింపులో వెళతారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అమేథీ నుండి రాహుల్ గాంధీ కూడా నామినేషన్ వేసేందుకు మంచి ముహూర్తం కోసం చూస్తున్నట్లు తెలిసింది.
యుపి, బీహార్, ఢిల్లీలోనూ శివసేన పోటీ
ముంబయి, మార్చి 21: బిజెపి మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ థాకరేతో సమావేశం కావడానికి ప్రతీకారంగా శివసేన లోక్‌సభ ఎన్నికల్లో యుపి, బీహార్, ఢిల్లీలో తమ అభ్యర్థులను నిలబెట్టాలని శుక్రవారం నిర్ణయించింది. ‘మాకు బిజెపితో మహారాష్టల్రో మాత్రమే పొత్తు ఉంది. యుపిలో పొత్తు లేదు. మా పార్టీని దేశంలోని ఇతర ప్రాతాలకు కూడా విస్తరించడానికి మేము ప్రయత్నిస్తాం. ఉత్తరప్రదేశ్‌లో శివసేన 20 మంది అభ్యర్థులను బరిలోకి దించుతుంది’ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ విలేఖరులకు చెప్పారు. అలాగే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన బీహార్ (5 స్థానాలు), ఢిల్లీ (7 స్థానాలు)లో కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని రౌత్ చెప్పారు. ముంబయిలో ఈ నెల 3న నితిన్ గడ్కరీ ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరేతో విందు సమావేశం నిర్వహించడంతో తమ రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తినడంపై ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన గుర్రుగా ఉండడం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసినుంచి పోటీ చేస్తున్న బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, లక్నోనుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌పై శివసేన అభ్యర్థులను నిలబెట్టదని ఉద్ధవ్ థాకరే కుమారుడు, యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే ఒక ట్విట్టర్ సందేశంలో తెలియజేసారు. ‘అలాంటి తమాషా పుకార్లను సైతం నమ్మే వారిని చూసి నేను జాలిపడుతున్నాను. ఎందుకంటే మేము వారణాసి, లక్నోలలో పోటీ చేయడం లేదు’ అని ఆదిత్య ఆ ట్విట్టర్‌లో స్పష్టం చేసారు.