న్యూఢిల్లీ, మార్చి 21: బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య జరిగిన సమాలోచనలు రాష్ట్రంలో సరికొత్త పొత్తులకు దారి తీసే అవకాశాలున్నాయని తెలిసింది. పవన్ కల్యాణ్ దృక్పథంపై మోడీ సంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. పార్టీ ప్రారంభోత్సవ సమావేశంలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, జాతీయ సమగ్రతపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మోడీ ముగ్ధులైనట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. రాష్ట్ర, జాతీయ నాయకులెవ్వరూ లేకుండా మోడీ పవన్‌తో జరిపిన సుదీర్ఘ చర్చలు కొత్త పొత్తులకు దారి తీయటం ఖాయమని సీనియర్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తుకోసం బిజెపి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణకు చెందిన భారతీయ జనతాపార్టీ నాయకులు తెలుగుదేశంతోనే కాక ఏ పార్టీతో పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. తెలంగాణలో అధిక స్థానాలను కేటాయించాలని తెలుగుదేశంపై ఒత్తిడి తెస్తున్నారు. బిజెపి విధిస్తున్న అన్ని షరతులకు తెలుగుదేశం అంగీకరించే అవకాశాలు లేనందున జనసేన మద్దతుతో తెలంగాణలో పోటీకి దిగే దిశలో పార్టీలోని ఒక వర్గం ఆలోచన చేస్తోంది. రాష్ట్ర విభజనను గట్టిగా సమర్ధించినందున సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఎదురయ్యే పరిస్థితే తమకూ తప్పదని బిజెపి నాయకత్వానికి తెలుసు. అంతేకాక తెలంగాణలో మాదిరి సీమాంధ్రలో తమ పార్టీబలంగా లేదని కూడా జాతీయ నాయకత్వానికి తెలుసు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తుపెట్టుకున్న పక్షంలో సీమాంధ్రలో ఇరుకున పడతామన్న భయం పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతోంది, సీమాంధ్రకు తమ వల్లే ప్రత్యేక ప్యాకేజి, ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా లభించాయని బిజెపి నాయకులు చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరామ్ రమేష్ తిప్పి కొడుతున్నారు. కాగా సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ప్రజలకు గట్టి సందేశం పంపుతున్నారు. మోడీకి పూర్తి మద్దతను ప్రకటించిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఆయనతో జరిపిన చర్చల్లో పెద్ద ఆసక్తి చూపించలేదని ఈ సమావేశానికి హాజరైన నాయకులు తెలియజేశారు. రెండు ప్రాంతాల్లో ఉన్న కుల సమీకరణలకు పవన్ సినీ గ్లామర్ తోడయి మంచి ఫలితాలను సాధించగలమన్న ధీమాను పార్టీనాయకులు వ్యక్తం చేస్తున్నారు. మోడీకి మా సంపూర్ణ మద్దతు
బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి తన పూర్తి మద్దతును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాంగ్రెస్‌తో తప్పించి ఏ పార్టీతోనైనా చేతులు కలుపుతానని ప్రకటించిన పవన్ కల్యాణ్ శుక్రవారం అహమ్మదాబాద్‌లో మోడీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో చెప్పలేనని తొలుత ప్రకటించిన పవన్ ఇప్పుడు పరిమిత స్థానాల్లో పోటీ చేసి బిజెపిని బలపరిచే అవకాశాలున్నాయని తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి మోడీ నాయకత్వం అత్యవసరమని భావించినందునే ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నట్లు పవన్ తెలియజేశారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను మోడీకి వివరించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తీరును ఆయనకు తెలియచేసినట్ల చెప్పారు. ఎన్నికల పొత్తుపై త్వరలోనే ఒక ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
టి-పిసిసి మ్యానిఫెస్టో వెబ్‌సైట్
ప్రారంభించిన భట్టి, శ్రీ్ధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 21: నవ తెలంగాణ నిర్మాణానికి తగు సలహాలు, సూచనలు మేధావులు, ప్రజల నుంచి సేకరించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టొ కమిటీ చైర్మన్ డి. శ్రీ్ధర్‌బాబు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా తమ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని చెప్పారు. సమాచార సేకరణకు, ప్రజల అభిప్రాయాలు, మేధావుల సూచనలు తీసుకునేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ ప్రజలు గొర్రెలు అని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించడం పట్ల అభ్యంతరం తెలిపారు. కెసిఆర్ ఆ విధంగా భావిస్తే ఆ గొర్రెలే సమాధానం చెబుతాయని ఆయన హెచ్చరించారు.
బిజెపితో వ్యూహాత్మక
ఒప్పందాలకు లోక్‌సత్తా సిద్ధం
హైదరాబాద్, మార్చి 21: వచ్చే ఎన్నికల్లో బిజెపితో అవసరమైన చోట్ల సర్దుబాట్లు, వ్యూహాత్మక ఒప్పందాలు పెట్టుకుని పోటీ చేసేందుకు లోక్‌సత్తా సిద్ధంగా ఉందని ఆ పార్టీ జాతీయాధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండే ప్రసక్తిలేదని, ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రెండురాష్ట్రాల్లో తెలుగు ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ వ్యవహరిస్తుందన్నారు.
అవినీతి మరకలు ఉన్న పార్టీతో ఎటువంటి పొత్తులు ఉండవన్నారు. తమ పార్టీ ఎన్నికల సంస్కరణలకు అనుకూలమన్నారు. రాజకీయ పార్టీలు నిధులను సమకూర్చడంలో పారదర్శకతతో వ్యవహరించాలన్నారు. పారదర్శకత లేనందు వల్ల రాజకీయాలంటే ప్రజలకు చులకన భావం ఏర్పడుతోందన్నారు. ప్రజలు భాగస్యామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు.
రాష్ట్ర విభజనపై సుప్రీంలో ‘స్టే’ వస్తుంది
ఉండవల్లి ఆశాభావం
హైదరాబాద్, మార్చి 21: రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో ‘స్టే’ లభిస్తుందని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు ఉండవల్లి అరుణకుమార్, డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విభజనపై కోర్టులో గెలుస్తామన్న నమ్మకాన్ని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3లో సవరణలు తీసుకుని రావాలని, రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సిపిఎం మ్యానిఫెస్టొలో పేర్కొనడాన్ని స్వాగతించారు. సమైక్యాంధ్ర కోసం వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీలో చేరాలని సమాధానమిచ్చారు. చంద్రబాబు ద్వంద్వ విధానాన్ని అవలంభిస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను మీరే ఎన్నుకోండి అని ప్రజలకు చెప్పిన చంద్రబాబు, నిన్న మాట మార్చి అభ్యర్తులను చూడవద్దని, తనను చూసి ఓట్లు వేయాలని అన్నారని వారు విమర్శించారు.
టిఆర్‌ఎస్ టార్గెట్ కాంగ్రెస్
హైదరాబాద్, మార్చి 21: తెలంగాణలో టిడిపి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ఇక ఆ పార్టీ గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు, కాంగ్రెస్‌నే ప్రధానంగా లక్ష్యం చేసుకోవాలని టిఆర్‌ఎస్ నాయకత్వం నిర్ణయించుకుంది. అంతర్గతంగా నిర్వహించిన పలు సర్వేలతో పాటు, పార్టీ శ్రేణుల సమాచారంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేదానిపై టిఆర్‌ఎస్ ఒక అంచనాకు వచ్చింది. మూడు సర్వేలు వేరువేరుగా నిర్వహించామని, 55 నుంచి 65 సీట్లు టిఆర్‌ఎస్‌కు కచ్చితంగా వస్తాయని తేలిందని, ఆ తరువాతనే ప్రధానంగా కాంగ్రెస్‌పై దృష్టిసారించి కొండా సురేఖ వంటి వారిని పార్టీలో చేర్చుకున్నట్టు టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కేవలం పది నియోజక వర్గాల్లో మాత్రమే టిడిపి ఓట్ల శాతం డబుల్ డిజిట్‌లో ఉంది, మిగిలిన అన్ని చోట్ల రెండు నుంచి 8శాతం లోపు మాత్రమే ఓటింగ్ శాతం ఉందని, ఇక ఆ పార్టీని పట్టించుకోవలసిన అవసరం లేదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ బలం దాదాపుగా 40 సీట్లలో విజయం సాధించేట్టుగా ఉందని, ప్రస్తుతం వాటిపై దృష్టిసారించి కాంగ్రెస్‌ను బలహీన పరచడమే తమ ప్రధాన లక్ష్యం అని టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఒక్క ఖమ్మం పార్లమెంటు నియోజక వర్గంలో తప్ప టిడిపికి ఎక్కడా బలం లేదని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గంలో అందరూ సీమాంధ్రులే అని అతిగా ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారంలో నిజం ఎంతో ఫలితాల్లో తేలుతుందని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు.
టిడిపి పూర్తిగా బలహీనంగా ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపినా తిరస్కరించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తారు, అక్కడ గతంలో టిఆర్‌ఎస్ అభ్యర్థికి డిపాజిట్ రాలేదు, ఆ సీటు ఇప్పుడు టిఆర్‌ఎస్ గెలవడం ఖాయం అని చెబుతున్నారు. మహబూబాబాద్ సంఘటన వల్ల కొండా సురేఖను చేర్చుకోవడంపై తెలంగాణ వాదులు ఆవేదన చెందడం సహజమేనని, అయితే అంతిమంగా పోల్ మేనేజ్‌మెంట్ అనేది చూసుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు.
తెలంగాణలో బిజెపికి ఓట్ల శాతం పెరగవచ్చు కానీ సీట్ల సంఖ్య పెరగదని టిఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. మాకు 70 అసెంబ్లీ సీట్లు కావాలని, ముఖ్యమంత్రి అభ్యర్థి మా పార్టీ నాయకుడే అని బిజెపి డిమాండ్ చేయడం చూస్తే తెలంగాణలో టిడిపి ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతోందని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. అందుకే టిడిపి సంగతి వదిలేసి ఇక కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకుని రాజకీయం నడపాలని నిర్ణయించుకున్నట్టు టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ మూడవ స్థానంలో నిలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఇక వైకాపా, పవన్ పార్టీల పేరు ఎత్తడం కూడా వృధా అని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.
రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాకే పంపకాలు: కెసిఆర్
హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇంకా ఎలాంటి పంపకాలు జరగలేదని, రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాతనే పంపకాలు జరుగుతాయని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. పంపకాలు జరిగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఉద్దేశ పూర్వకంగా రాస్తున్నారో, అజ్ఞానంతో రాస్తున్నారో తెలియదు కానీ ఇంకా పంపకాలు ఏమీ జరగలేదని అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడాలి, రెండు రాష్ట్రాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత పంపకాలు జరుగుతాయని అన్నారు. ఎస్‌ఆర్‌సిలో దీనికి సంబంధించి స్పష్టంగా ఉందని అన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సాగే పంపకాలు కొన్ని ఉంటాయి, ఇరు రాష్ట్రాల ఆమోదంతో ఆ పంపకాలు సజావుగా సాగుతాయని అన్నారు. కొన్నింటిపై అభ్యంతరాలు ఉంటే కేంద్రం జోక్యం చేసుకుని, దానిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గవర్నర్‌కు సైతం పంపకాలపై అధికారం లేదని అన్నారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత పంపకాల్లో వారికి ఇబ్బంది లేకుండా సజావుగా సాగడానికి ఇప్పుడు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అంతే తప్ప పంపకాలు జరగలేదని కెసిఆర్ తెలిపారు.
కెసిఆర్‌పై కాంగ్రెస్ నిప్పులు
ప్రజల్లో ఎండ గట్టేందుకు వ్యూహం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య ఉన్న దూరం పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ పార్టీతో సంబంధం ఉండదని, తమది కేవలం ఉద్యమ పార్టీయే కాబట్టి కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట ఇచ్చిన టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడు మాట మార్చారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్రోశంతో ఉన్నారు. తాజాగా కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. విలీనం సంగతి దేవుడెరుగు కనీసం పొత్తు కోసమైనా కెసిఆర్ దిగి రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఇక ఎదురు దాడికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో వంద శాతం పొత్తు ఉండదని కెసిఆర్ ఇటీవల ఖరాఖండిగా చెప్పారు. అటువంటప్పుడు కెసిఆర్ ఆ పార్టీ ఎంపి కె. కేశవరావు నేతృత్వంలో కమిటీని ఎందుకు నియమించినట్లు అని వారు ప్రశ్నిస్తున్నారు. లోగడ కెసిఆర్ కాంగ్రెస్‌ను కిలో మీటర్ అడుగున పాతి పెట్టాలని, సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపైనా నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సోనియా గాంధీని దేవత అంటామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మాట మార్చారని, విభజన ప్రకటన వెలువడగానే కెసిఆర్ కుటుంబ సభ్యులతో సోనియా వద్దకు వెళ్ళి గ్రూపు ఫొటో తీయించుకోవడం గురించి వారు ప్రస్తావిస్తూ, ఇదంతా ద్వంద్వ విధానమని భగ్గుమంటున్నారు. కెసిఆర్ మాటల ఉచ్చులో అధిష్ఠానం నాయకులు పడ్డారని వారు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలు తమకే పట్టం కడతారన్న భరోసాతో ఉన్నారు.
ఇదే మంచి అదను..
ఈ ఎన్నికలతోనే టిఆర్‌ఎస్‌ను నామరూపాలు లేకుండా తొక్కి వేయాలన్న దృఢ సంకల్పం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్నది. అందుకు తెలంగాణలోని పార్టీ నాయకులంతా విభేదాలు పక్కన పెట్టి కలిసి ఉండాలని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. టిఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో మట్టికరిపించగలిగితే వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా అడ్రసు గల్లంతు అవుతుందని వారంటున్నారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవని చెప్పేందుకు కెసిఆర్ ఎవరని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు భయభ్రాంతులయ్యే విధంగా కెసిఆర్ మాట్లాడడం మంచిది కాదని హెచ్చరించారు. ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కెసిఆర్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు.
నిరాశతో మాట్లాడుతున్నారు..
కెసిఆర్ నిరాశతోనే అలా మాట్లాడుతున్నారని టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల విమర్శించారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లభించకపోవడంతో, నిరాశతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌కు స్థానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు.
తెలుగు ప్రజలు కష్టాల్లో ఉన్నారు...
బజారులో వదల్లేను: బాబు
టిడిపిలో చేరిన తోట నర్సింహం, చిట్టూరి రవీంద్ర * త్వరలో డిఎల్ కూడా...
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: తెలుగు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు బజారులో వదిలేయలేనని వారికి అండగా నిలబడటం తన కర్తవ్యం అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న తనపై అందరికంటే ఎక్కువ బాధ్యత ఉండటంతో ఇరు ప్రాంతాల ప్రజలకు ఈ సమయంలో అండగా నిలబడ్డాడని ఆయన అన్నారు. మాజీ మంత్రి తోట నరసింహం, రాజమండ్రి మాజీ ఎంపి చిట్టూరి రవీంధ్ర, గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన కాంగ్రెస్ నాయకులు నుర్జాహాన్, చిలుకలూరిపేటకు చెందిన అనపర్తి లక్ష్మయ్య, జంపాల కోటిశ్వరీ తదితరులు శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణ, సీమాంధ్ర ఇరు ప్రాంతాలలోనూ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మరో 30 ఏళ్ల వరకు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనతో తెలుగు జాతి మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టిందని, తెలుగుజాతి మళ్లీ కలిపే సత్తా ఒక్క టిడిపికే ఉందని చంద్రబాబు అన్నారు. జగన్‌ది ఓ జైలు పార్టీ, కెసిఆర్‌దేమో వసూళ్ల పార్టీ అని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదన్న నమ్మకంతో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, ముస్లింను ఉప ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి మాట తప్పారని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని కెసిఆర్‌ను బిసిలు, దళితులు, మైనార్టీలు నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని
పూడ్చగలిగే శక్తి బాబుకే ఉంది: తోట
రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మాజీ మంత్రి తోట నరసింహం ఆరోపించారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని పూడ్చడటంతో పాటు, సీమాంధ్రను సింగపూర్‌గా తీర్చిదిద్దగల సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్న నమ్మకంతో టిడిపిలో చేరినట్టు తెలిపారు.
టిడిపిలో చేరతా: డిఎల్
టిడిపి అధినేత చంద్రబాబుతో శుక్రవారం ఆయన నివాసంలో మాజీ మంత్రి డిఎల్ రవీంధ్రారెడ్డి భేటీ అయ్యారు. టిడిపిలో చేరేందుకు రవీంధ్రారెడ్డి ఆసక్తి కనబర్చడంతో చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు పార్టీలు వర్గాలు తెలిపాయి.
భేటీ అనంతరం డిఎల్ రవీంధ్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టిడిపిలో చేరబోతున్నట్టు ప్రకటించారు. కడప జిల్లాలో నిర్వహించబోయే ప్రజాగర్జన సభలో టిడిపిలో చేరుతానని డిఎల్ తెలిపారు.