
విజయవాడ, మార్చి 21: సీమాంధ్ర భవిష్యత్ రాష్ట్ర విభజనపైనే ఆధారపడి ఉందనేది బిజెపి ఎప్పుడో గుర్తించి 1987లోనే కాకినాడలో ఒక ఓటు - రెండు రాష్ట్రాలంటూ ప్రకటించిందని పార్టీ జాతీయ, సీనియర్ నేతలు అన్నారు. విభజన సమయలో పార్లమెంట్‌లో చట్టబద్ధంగా, నోటిమాటగా లభించిన హామీలన్నింటినీ నెరవేర్చగలిగేది కూడా బిజెపి ఒక్కటేనని ఎం వెంకయ్యనాయుడు, ప్రకాష్ జవదేకర్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, సీమాంధ్ర నూతన అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు ప్రకటించారు. విజయవాడలో శుక్రవారం ఆర్భాటంగా జరిగిన సీమాంధ్ర ముఖ్యనేతల సమావేశంలో హరిబాబు రాష్ట్ర తొలి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు పివి చలపతిరావు, చిలకా రామచంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి యు కృష్ణంరాజు, మరెందరో ముఖ్యనేతలు హాజరయ్యారు. జిల్లాలవారీగా నాయకులు హరిబాబును ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తోందని, కాంగ్రెస్‌కు, కుటుంబ పాలనకు ఇదే చివరి ఎన్నిక కాబోతోందన్నారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేని స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్నారు. చిదంబరం వంటి సీనియర్లు పోటీ నుంచి వైదొలగుతుంటే మరికొందరు కాంగ్రెస్‌నే వీడిపోతున్నారన్నారు. విజయవాడలో బిజెపి రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. జవ్‌దేకర్ మాట్లాడుతూ దేశం నుంచి కాంగ్రెస్‌ను పారదోలాలంటూ నినాదాలిచ్చే పార్టీలన్నీ తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్క పార్టీతో వేర్వేరుగా మాట్లాడేందుకు తమకు సమయం లేదన్నారు. కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు యుపిఎ ప్రభుత్వం కుట్ర పన్నిందని, తాము వ్యతిరేకించినా ప్రయోజనం ఉండదనే ఆఖరి క్షణంలో సీమాంధ్ర అభివృద్ధికి అనేకానేక డిమాండ్లు తెరపైకి తెచ్చామని చెప్పారు. వీటిని అమలు చేయించగలిగే సామర్థ్యం ఒక్క బిజెపికే ఉందన్నారు. విభజన బిల్లు ఆమోదానికి యుపిఎ ప్రభుత్వం కుటిల పన్నాగాలు పన్నిందని, తమను దోషిగా నిలబెట్టేందుకు పదేపదే ప్రయత్నించిందన్నారు. సీమాంధ్ర కోసం రాజ్యసభలో వెంకయ్యనాయుడు ద్వారా ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి పలు హామీలు రాబట్టగలిగామని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో విలీనం చేసే విషయమై నేటికీ జీవో రాకపోవడం వల్లనే కెసిఆర్ ముంపు ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నోరుమెదపడం లేదన్నారు. రాష్ట్ర విభజన కోసం వీరిద్దరూ సోనియా ఎదుట పైనిర్ణయాలకు అంగీకారం తెలపలేదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ సీమాంధ్ర కోసం తాము చేసిన ప్రతిపాదనలన్నింటినీ సోనియా గాంధీ తుంగలోతొక్కి తమను అవమానపర్చారన్నారు. లోక్‌సభలో విభజన బిల్లుకు 32 సవరణలు తీసుకురాగా లేనిది తమ ప్రతిపాదనలను తోసివేయడం ఏమిటని ప్రశ్నించారు. అందుకే తాను పదవికి, పార్టీకి రాజీనామా చేశానన్నారు. ముందుగా జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ మృతికి సమావేశం సంతాపం ప్రకటించింది. ఈ సమావేశంలో టిడిపితో పొత్తు విషయమై అంతర్గతంగా చర్చలు జరిగాయి.
చిత్రం... విజయవాడలో శుక్రవారం జరిగిన బిజెపి సీమాంధ్ర శాఖ సమావేశంలో మాట్లాడుతున్న ప్రకాష్ జవదేకర్