
శ్రీకాకుళం, మార్చి 21: సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రచార రథచక్రాలు శ్రీకాకుళం నుంచి కదిలాయి. అయితే ప్రారంభమే పేలవంగా సాగింది. కోరి కష్టాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు కల్పించాలన్న తపనతో పదేళ్లపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పదవులు అనుభవించిన పెద్దలు శుక్రవారం బస్సులో శ్రీకాకుళం చేరుకున్నారు. వీరి నోట ఒకటే మాట. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన తెచ్చింది తెలుగుదేశం, వైకాపా అధినేతలు నారా చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలైతే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సమైక్య చిచ్చుపెట్టింది మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. తెలంగాణ విభజన ఉద్యమంలో ఎంతోమంది నేతలు, పార్టీలున్నా, వీరు ముగ్గురే రాష్ట్రాన్ని ముక్కలు చేశారన్న ప్రచారానికి శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఏది నిజం.. ఏది అబద్ధం.. అంటూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రచార సారథి కె చిరంజీవి రాష్ట్ర విభజనకు మలుపు తిప్పిన పరిస్థితులను వివరించారు. ఉదయం తొమ్మిది గంటలకు బస్సుయాత్ర ప్రారంభిస్తారంటూ ఎంపి కిల్లి కృపారాణి, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌లు రెండు రోజులుగా చెబుతున్నప్పటికీ ఆలస్యంగా కాంగ్రెస్ పెద్దలు శ్రీకాకుళంలోని ఇందిరావిజ్ఞాన్ భవన్‌కు చేరుకుని ముందుగా కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వేదికకు చేరారు. అప్పటికే ఎండ మండిపోతుండటంతో ఉదయం పది గంటల నుంచి మెగాస్టార్‌ను చూసేందుకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా వెళ్లిపోయారు. వారంతా వెళ్లినతర్వాత సభ ప్రారంభిస్తే గంటన్నరకే ముగిసిపోయింది. సభలో కేవలం చిరంజీవి అభిమానులు మాత్రమే వందల సంఖ్యలో ఉన్నారు.
అయిష్టంగానే విభజనకు
సోనియా అంగీకారం: చిరంజీవి
విజయనగరం: కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి విజయనగరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇతర పార్టీల ఒత్తిడి వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అయిష్టంగానే రాష్ట్ర విభజనకు పూనుకున్నారని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవడమే తమ లక్ష్యమన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుందన్నారు.
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తీర్మానం చేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు అసెంబ్లీలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
చిత్రం... శ్రీకాకుళంలో శుక్రవారం జనం లేని సభలో మాట్లాడుతున్న చిరంజీవి