
హైదరాబాద్, మార్చి 21: శాసన సభ ఎన్నికల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. కెసిఆర్ తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య, అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణలోని పది జిల్లాల ప్రతినిధులు శుక్రవారం కెసిఆర్‌ను, పొన్నాలను వేరువేరుగా కలిసి చట్టసభల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు హామీ ఇచ్చినట్టు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. సమాఖ్య కన్వీనర్ వెనె్నంపల్లి జగన్‌మోహన్ శర్మ, అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.వి. సౌందర రాజన్, అధ్యక్షులు గంగు ఉపేందర్ శర్మ, రాష్ట్ర బ్రాహ్మాణ యువజన నాయకుడు ద్రోణంరాజు రవికుమార్, మతైక ఉద్యోగుల సంఘం నాయకులు భానుమూర్తి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుట్టు మహేష్‌బాబు తదితరులు కెసిఆర్‌ను, పొన్నాలను కలిశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో బ్రాహ్మాణులకు తగిన స్థానం కల్పించాలని తెలంగాణలోని 11వేల దేవాలయాల అభివృద్ధికి, లక్షా 40వేల కుటుంబాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. పురోహితులు, అర్చకులకు తెలంగాణలో 2 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. బ్రాహ్మణులకు మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం కేటాయించనున్నట్టు కెసిఆర్ హామీ ఇచ్చారన్నారు. నమస్తే తెలంగాణ ఎండి లక్ష్మీరాజంకు రాజ్యసభ సభ్యత్వం, కెవి రమణాచారికి పార్లమెంటు సీటు, బడితల సతీష్ కుమార్‌కు కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గం సీటు, ఆదిలాబాద్ వేణుగోపాలాచారికి, నల్లగొండ అనిల్ కుమార్‌కు కేటాయించనున్నట్టు కెసిఆర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు కెసిఆర్ హామీ ఇచ్చినట్టు సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. టిడిపి, బిజెపి నాయకులకు సైతం అర్చక సమాఖ్య ప్రతినిధులు వినతిపత్రాలు అందజేశారు.
చిత్రం... టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌ను కలిసిన తెలంగాణ బ్రాహ్మణ సంఘ నాయకులు సౌందరరాజన్,
గంగు ఉపేంద్రశర్మ తదితరులు