జగ్గయ్యపేట, మార్చి 21: మనమంతా సమైక్యంగా వుండి ఢిల్లీ దిమ్మదిరిగేలా తెలుగువారి దెబ్బను రుచిచూపుదామని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం ఆయన రోడ్ షోలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి పదవి వదులుకొని తెలుగువారి ఆత్మగౌరవం చాటాలని తాను ప్రజల ముందుకు వచ్చానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, వైసిపి అధినేత జగన్‌బాబు మాత్రం ముఖ్యమంత్రి పదవి కోసం మీ ముందుకు వస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముందుగా లేఖ ఇచ్చిన చంద్రబాబు అసెంబ్లీలో గానీ, గత ఆరునెలలుగా కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఒక్కమాట కూడా మాట్లాడలేదని, మీ ముందుకు వచ్చినప్పుడు ఆయన్ను నిలదీయాలని ప్రజలను కోరారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని జగన్ లేఖ ఇచ్చారని, పెద్దబాబు, చినబాబుల లేఖలతో పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మాస్వరాజ్ రాష్ట్రాన్ని విడదీశారని కిరణ్ ధ్వజమెత్తారు. తాను తన కోసం పార్టీ పెట్టలేదని, జై సమైక్యాంధ్ర పార్టీ ప్రజల గుండెచప్పుడు అని చెప్పారు. అహంకారంతో రాష్ట్రాన్ని విడదీసిన ఢిల్లీకి తెలుగువారి ఆత్మగౌరవం ఏమిటో చాటిచెప్పేందుకే తమ పార్టీ పనిచేస్తుందన్నారు. లేచినదగ్గర నుండి పాదరక్షలు మనకు రక్షణ కల్పిస్తాయని, తెలుగువారికి జై సమైక్యాంధ్ర పార్టీ అండగా నిలుస్తుందని కిరణ్ వివరించారు. పార్టీ నియోజకవర్గ నేత పాటిబండ్ల వెంకట్రావు సారథ్యంలో ఆయనకు పట్టణంలో ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి గంగాధర్, స్థానిక నేతలు కనె్నగంటి నర్శింహరావు, తదితరులు పాల్గొన్నారు.
వైకాపా ఎమ్మెల్యే అరెస్టు
* ఇంట్లో పోలీసుల సోదాలు
* భారీగా చీరలు, క్రికెట్ కిట్లు, గడియారాలు
రాయదుర్గం, మార్చి 21: ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్న అభియోగంపై అనంతపురం జిల్లా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఆయనకు బెయిల్ మంజూరైంది. రాయదుర్గం, బళ్లారిలోని కాపు ఇళ్లలో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు. రాయదుర్గంలోని ఇంటిలో చీరలు, జాకెట్‌పీస్‌లు, గోడ గడియారాలతో పాటు విదేశీ మద్యం లభించింది. అదేవిధంగా బళ్లారిలోని ఇంట్లో వేలాది చీరలు, ప్రెషర్ కుక్కర్లు, క్రికెట్‌బ్యాట్‌లు, వికెట్‌లు, రూ..43 లక్షల విలువచేసే ఖాళీ బ్యాంక్ చెక్‌లు లభించాయి. రానున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాపు వీటిని ఇంట్లో దాచినట్లు అభియోగాలు మోపిన పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం కాపును కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరుచేయడంతో కాపు విడుదలయ్యారు. అనంతరం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.
కాంగ్రెస్ పని ఖాళీ!
కడప, మార్చి 21: వైఎస్సార్ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పున తెలుగుదేశం పార్టీలోకి దూకేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో వైఎస్ సమకాలీకుడు, మాజీమంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఎన్ వరదరాజులురెడ్డి, తాజామాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, ఆర్.శ్రీనివాసరెడ్డి, మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి, కందుల శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు, స్వర్గీయ ఆదినారాయణరెడ్డి తనయుడు వై శివరామిరెడ్డి, ఎద్దల సుబ్బరాయుడు, బి.హరిప్రసాద్ తదితరులు ఒకరి వెంట ఒకరుగా దేశం పార్టీలోకి వలస వెళ్లారు. అనివార్యమైన పరిస్థితుల్లో వారి అనుచరులు కూడా క్యూ కట్టారు. గత దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో ఉంటూ టిడిపి నేతలపై కత్తులు నూరిన నేతలు అదే పార్టీ పంచకు చేరడం జనంలో ఇప్పుడిప్పుడే ఏవగింపు బహిర్గతమవుతోంది. పదేళ్లపాటు ఈ నేతలంతా పదవులు అనుభవించారు. పదవులు నిలబెట్టుకోవడానికి ఎదుటి పార్టీపై బురద చల్లాలనే సిద్ధాంతంతో టిడిపి నేతలపై నోటికొచ్చిన విధంగా విమర్శించారు. పదవుల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం టిడిపి గూటికి చేరుతున్న నేతలపై ప్రజలతోపాటు అనుచరులు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. వలస వెళ్లిన నేతల్లో కొంతమంది పార్లమెంట్, కొంతమంది అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురికి మాత్రమే చంద్రబాబు గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా వలస వచ్చిన నేతలు శ్రద్ధ వహించి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే సీనియర్లను గెలిపించాలని అధినేత షరతు విధించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పని చేసిన వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు కల్పిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆ మాత్రం భరోసా లభించని నేతలు భంగపాటుకు గురై పార్టీ కార్యాలయంలో జరిగిన చర్చలు బయటకు పొక్కకుండా టిడిపి అధినేత తమకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పారని, తాము మాత్రం ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ బలోపేతానికి, సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి వచ్చామని చెప్పుకుంటున్నారు. అయితే సాంప్రదాయ కాంగ్రెస్ వాదుల మాటలు మరోలా వినిపిస్తున్నాయి. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ నేతల సొత్తు కాదని వారు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ తుడిచిపెట్టుకు పోయిందని ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతలే పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. మళ్లీ నిలదొక్కుకుంటే పోయిన నేతలంతా సొంతగూడంటూ వెనక్కు వస్తారని ఎద్దేవా చేస్తున్నారు.
నేతలకు శిరోభారంగా
‘స్థానిక’ అభ్యర్థుల ఎంపిక
విశాఖపట్నం, మార్చి 21: జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడం అన్ని పార్టీల నాయకులకు శిరోభారంగా పరిణమించింది. ఇప్పటి వరకూ సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు విడివిడిగా జరిగేవి. అయితే, ఈసారి ఈ ఎన్నికలన్నీ ఒకేసారి రావడంతో అభ్యర్థుల ఎంపిక చాలా ఇబ్బందికరంగా మారింది. గతంలో ఈ సమస్య జిల్లా పార్టీ అధ్యక్షులకు, అక్కడి నుంచి పార్టీ అధిష్ఠానానికి ఉండేది. కానీ ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ప్రకటించిన వారికి ఈ తలనొప్పి మొదలైంది. గతంలో ఎమ్మెల్యేలు పదవుల్లో ఉన్నప్పుడు అభ్యర్థులను తేలిగ్గా ఎంపిక చేసుకునేవారు. ఒకే స్థానానికి ఇద్దరు, ముగ్గురు టిక్కెట్లను ఆశించినా, ఎమ్మెల్యే హోదాలో సర్దుబాటు చేసేవారు. కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే స్థానిక ఎన్నికలు జరుగుతుండడంతో సమస్య మొదలైంది. ఇప్పటికే ఆయా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో కొన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. అదే నియోజకవర్గాల్లో జెడ్‌పి, మండల ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టతరమవుతోంది. ఒకే సీటును ఇద్దరు, ముగ్గురు ఆశిస్తున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఇందులో ఎవరిని కాదన్నా, సదరు అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని భావిస్తున్నారు. ’
కుదరని పొత్తులు
ఖమ్మం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, టిడిపి ఒంటరి పోరు
ఖమ్మం, మార్చి 21: ఖమ్మం జిల్లాలో ఈ నెలాఖరున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలు వుండగా, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌లో డివిజన్ల విభజన సరిగా జరగలేదని, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల పరిధిలో 1/70 ఏజెన్సీ చట్టానికి సంబంధించి కోర్టు కేసులు వుండటంతో ఎన్నికలు జరగటం లేదు. ఎన్నికలు జరుగుతున్న నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థులు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఒంటరిగానే బరిలో ఉన్నారు. అయితే ఈ మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పొత్తు పెట్టుకోవటం గమనార్హం. కొత్తగూడెంలో సిపిఐ, టిఆర్‌ఎస్, తెలంగాణ జెఏసి పొత్తు పెట్టుకున్నాయి. సత్తుపల్లి, మధిరలో సిపిఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరినట్లు చెప్పుకున్నా రెండు పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గడువు ముగిసినప్పటికీ ఉపసంహరించుకోలేదు. అభ్యర్థులకు పార్టీలు బి.్ఫరం కూడా ఇచ్చేశాయి. సత్తుపల్లిలో తెలుగుదేశం, టిఆర్‌ఎస్, మధిరలో టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి ఒంటరిగానే బరిలో నిలిచాయి. ఇల్లెందులో న్యూడెమోక్రసీ, టిఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు విడివిడిగా పోటీ చేస్తుండగా, సిపిఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిందని చెప్పుకున్నా రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం మధ్య పూర్తిస్థాయిలో అవగాహన కుదిరింది. రెండు పార్టీల మధ్య ఒప్పందం మేరకు వార్డులు కూడా పంచుకోవటంతో ఎవరు ఎక్కువ వార్డులు గెలిస్తే వారికే మున్సిపల్ చైర్మన్ పదవి, మరో పార్టీ వైస్ చైర్మన్ పదవి పంచుకునేలా కూడా అంగీకారం కుదిరింది. కాగా అన్ని పార్టీల తరపున ఆ పార్టీల అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇల్లెందులో న్యూడెమోక్రసీలోని మరో వర్గం కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది.
అధికార్లకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ఓట్ల చేర్పు!
చిలకలూరిపేటలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుంటూరు, మార్చి 21: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న సామెతను నిజం చేశారు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ముగ్గురు ప్రబుద్ధులు. ఎన్నికల అధికారుల ప్రమేయం లేకుండా ఓ మీ సేవ కేంద్రం ఆపరేటర్ సహకారంతో ఆన్‌లైన్‌లో ఓట్లు చేర్చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల వివిధ వార్డుల్లో అర్హులైన ఓటర్ల జాబితాను చిలకలూరిపేటలో ఎన్నికల అధికారి సుధాకర్ బాబు ప్రకటించారు. అయితే ఆ జాబితాలో లేని నాలుగు పేర్లు ఆన్‌లైన్ ఓటరు జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అధికారులకు మతిపోయినంత పనైంది. వెంటనే అప్రమత్తమైన సుధాకర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సిఐ చెంచుబాబు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి రమేష్, హరి, అల్లాభ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరిపేటకు చెందిన రమేష్ గుంటూరులోని మీ సేవ కేంద్రంలో డిటిపి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన సహకారంతోనే ఆన్‌లైన్ కోడ్ తెలుసుకొని నాలుగు ఓట్లను చేర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాజా పరిణామంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు.
‘దేశం’లో వలసల పోరు
రాజమండ్రి, మార్చి 21: తూర్పు గోదావరి దేశం పార్టీలో వలస పోరాటం మొదలవుతోంది. ఇతర పార్టీల నుండి, ముఖ్యంగా కాంగ్రెస్ నుండి టిడిపిలోకి ఎడతెరిపి లేకుండా సాగుతున్న వలసలు ఆ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తోంది. తాజాగా మాజీ మంత్రి తోట నరసింహం టిడిపిలో చేరడంతో జగ్గంపేట నియోజకవర్గం టిక్కెట్టు ఆయనకే కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనితో ఇప్పటివరకు ఆ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలు కినుక వహిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సహకరించేది లేదని పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇస్తున్నారు. దీనితో నాయకులు రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత రెండుసార్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగ ఎన్నికైన మాజీ మంత్రి తోట నరసింహం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎప్పుడూ దరి చేరనిచ్చేవారు కాదు. అలాంటి నరసింహంను ఇపుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటాన్ని ఆ నియోజకవర్గంలోని క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. పార్టీలో చేర్చుకోవటంతో పాటు జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తామన్న హామీని అధిష్ఠానం ఇవ్వటంతో టిక్కెట్టుపై ఆశలు పెంచుకున్న జ్యోతుల చంటిబాబు వర్గంలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. తమకు టిక్కెట్టు ఇవ్వకపోతే జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింపచేస్తామంటూ అల్టిమేటం ఇస్తున్నారు. దాంతో పార్టీ అధిష్ఠానం జగ్గంపేట నియోజకవర్గంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నియోజకవర్గ టిడిపి బాధ్యతలు నిర్వహిస్తున్న ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు, జ్యోతుల రామస్వామిని బుజ్జగించే ప్రయత్నాలను చేపట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్ధిత్వానికి జ్యోతుల రామస్వామిని ఎంపికచేయటం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది.
పార్టీని నట్టేట ముంచుతారా?
కాంగ్రెస్ మాజీలపై రఘువీరారెడ్డి విసుర్లు
శ్రీకాకుళం, మార్చి 21: పెంచి పెద్దచేసిన కన్నతల్లి అనారోగ్యంతో ఉంటే వదిలేసి వెళ్లిన కసాయి కొడుకుల్లా ప్రస్తుతం పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై వస్తున్న విమర్శలను నివృత్తి చేసి పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్ ఆవరణలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్ర వారం రోజుల పాటు రోజుకు రెండు జిల్లాల చొప్పున సాగుతుందన్నారు. తెలంగాణకు అనుకూలమేనని చెప్పిన టిడిపి, వైకాపాలు నేడు కాంగ్రెస్‌ను మాత్రమే దోషిగా చూపిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్‌లో ఒడిదుడుకులు సహచమేనన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి కార్యకర్తలు బుద్ధి చెప్పాలన్నారు. విభజన తరువాత సీమాంధ్ర అభివృద్ధికి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా ఉత్తరకోస్తా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారన్నారు. పదేళ్లు ఎటువంటి పన్నులు లేనందున పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ప్రతి నగరం మరో హైదరాబాద్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించమంటూ వివిధ పార్టీల రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయన్నారు. సభకు హాజరైన వారందరికీ ఆ లేఖలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార సారధి, కేంద్ర మంత్రి కె చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఒడిదుడుకులు సర్వసాధారణమని, పార్టీని వీడిన వారు తల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందాన వెళ్లిపోతుంటే మేమున్నామంటూ కార్యకర్తలు ఇస్తున్న భరోసాకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. తనను కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేయమని పలువురు కోరినా వ్యక్తిత్వమున్న నాయకుడిగా వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వివిధ పదవులు అనుభవించి గతంలో ఎవరిని ఛీ అంటూ చీదరించుకున్నారో నేడు వారి గుమ్మాల ముందే పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇంతకంటే అవమానం, పదవీ దాహం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు టిడిపి, వైకాపాతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా కారణమన్నారు. ఆయన నిర్లక్ష్యం, తాత్సారం కారణంగానే రాష్ట్ర విభజనకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. చివరి వరకు పదవి అనుభవించి, తాత్సార ధోరణితో ఏమీ చెప్పకుండా విభజనకు కారకులై, నేడు ఆయనే కాంగ్రెస్ పార్టీని హత్య చేశారని విమర్శించారు. ఏది నిజం.. ఎది అబద్ధం.. అంటూ రాష్ట్ర విభజన అంశాన్ని మలుపుతిప్ని పరిస్థితులను ఆయన వివరించారు. ముఖ్యమంత్రిగా తన పదవిని కాపాడుకునేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీ వద్ద సమైక్య ఉద్యమాన్ని తానే సర్దుబాటు చేసుకుంటానంటూ ఎన్నో మాటలు చెప్పారన్నారు. అవన్నీ మేడమ్ తనతో చెప్పారన్నారు. కిరణ్ తప్పుదోవ పట్టించారంటూ మేడమ్ స్వయంగా తనతో చెప్పారన్నారు. అందుకే రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ తప్పుమీ చేయలేదంటూ వివరించేందుకే తాను వచ్చానన్నారు. సీమాంధ్ర భవితకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే భరోసా అంటూ మళ్లీ మెగాస్టార్ సినీఫక్కీలో అభయ‘హస్తం’ ఇచ్చారు. కాంగ్రెస్ కష్టకాలంలో కార్యకర్తలు ఎవరైనా పార్టీ బి ఫారం తీసుకోవచ్చని, మీలోవున్న వారే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, మంత్రులు కావచ్చునంటూ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, వివిధ పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకత్వాన్ని, సామాన్య కార్యకర్తలను మోసగించారని, పార్టీని వీడిన వారిని దుయ్యబట్టారు. సమావేశంలో కేంద్ర మంత్రులు పల్లం రాజు, జెడి శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, మాజీ మంత్రులు బాలరాజు, కోండ్రు మురళీమోహన్, ఎమ్మెల్యేలు నిమ్మక సుగ్రీవులు, బొడ్డేపల్లి సత్యవతి, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డిసిసి అధ్యక్షుడు డోల జగన్, తదితరులు పాల్గొన్నారు.