
విజయవాడ, మార్చి 21: ఎన్నికల పరంపరలో రాష్టవ్య్రాప్తంగా కోట్లాది రూపాయల తెల్లధనం, నల్లధనం మంచినీళ్ళ ప్రాయంలా ప్రవహిస్తోంది. దీన్ని అడ్డుకోటానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సరైన ఆధారాలు లేవంటూ కోట్లాది రూపాయల సొమ్మును అధికారులు సీజ్ చేశారు.
తీరా విచారిస్తే ఈ మొత్తం సొమ్ము బ్యాంకు ఖాతాలేకాదు పాన్ నెంబర్లు కూడా లేని అమాయక గ్రామీణ ప్రాంత ప్రజలకు చెందినదని వెల్లడౌతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఓవైపు ఆస్తుల విలువ తగ్గిపోతోందంటూ కొందరు, మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతోందంటూ మరికొందరు తమ స్థిరాస్తులను అవసరాల దృష్ట్యా ఎడాపెడా విక్రయాలు చేసుకుంటున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ఫీజు భారం తగ్గింపు కోసం దస్తావేజులో ఆస్తి విలువను తగ్గించి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సొమ్ము ఎక్కడిదని ప్రశ్నిస్తుంటే అమాయకులు ఆధారాలు చూపలేకపోతున్నారు. దాంతో ఆ మొత్తం సొమ్మును అధికారులు సీజ్ చేస్తున్నారు. మరోవైపు తెలివైన రాజకీయ నేతలు 108, ఇతర అంబులెన్సుల ద్వారా నల్లధనాన్ని ఇట్టే తేలిగ్గా చెక్‌పోస్టులను దాటించేస్తున్నారు!