
కర్నూలు, మార్చి 21: క్రమపద్ధతి లేకుండా జరిగిన రాష్ట్ర విభజనతో భవిష్యత్తులో విపత్తు పొంచిఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఫలితంగా జూన్ తరువాత రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితి ఎదురవ్వబోతోందని అన్నారు. కర్నూలులో శుక్రవారం నిర్వహించిన ప్రజాగర్జనలో బాబు మాట్లాడుతూ భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. విభజించే ముందు విపత్తుల గురించి ఒక్క క్షణం ఆలోచించమని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం, కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం విభజన కార్యక్రమం చేపట్టి ఉంటే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు కూడా నష్టమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందిందంటే అది తన హయాంలోనేనని పునరుద్ఘాటించారు. సమస్యలు ముందున్నాయి, ప్రజలు ఆలోచించాలి, వాటిని ఎదుర్కొనే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది, అధికారమిస్తే సుపరిపాలన అందిస్తామని బాబు అన్నారు. అధికారమిస్తే తెలుగు ప్రజల భవిష్యత్తును బాగుచేసే బాధ్యత తన భుజాలపై వేసుకుంటానని వెల్లడించారు. విభజన ఇబ్బందుల్లో భాగంగా జూన్ తరువాత జీతాలివ్వలేని పరిస్థితి రానుందన్నారు. గతంలో ఇలాంటి సమస్యే తనకు ఎదురైందని గుర్తుచేసుకున్నారు. రెండు నెలల పాటు జీతాలివ్వడానికి ఇబ్బందులు పడ్డామని, ఆవెంటనే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి సంవత్సరం కాలంలో మిగులు బడ్జెట్ సాధించామని తెలిపారు. ఒక ప్రణాళిక ప్రకారం, ప్రజా సంక్షేమం లక్ష్యంగా పరిపాలన అందించగల శక్తి సామర్థ్యాలు తనకున్నాయన్నారు.
మైనారిటీలపై ఈగ వాలనివ్వను
భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంపై ఇంత వరకు నోరుమెదపని చంద్రబాబు తొలిసారి కర్నూలులో శుక్రవారం జరిగిన ప్రజాగర్జనలో పరోక్షంగా ప్రస్తావించారు. ముస్లిం మైనారిటీల రక్షణ బాధ్యత తనదే అన్నారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ పేర కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను ఏకంచేసి ప్రధానికి ఎంపిక చేసిన అనుభవం ఉందన్నారు. ఆ తరువాత ఎన్డీయే కూటమిని తయారుచేసి ఇద్దరు ప్రధానుల ఎంపికలో కీలకంగా వ్యవహరించామని బాబు అన్నారు. ఆ రోజుల్లో ముస్లిం మైనారిటీలపై ఈగ వాలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. సమస్యలు, సవాళ్లు ఎన్నో ముందున్నాయి, మీరూ ఆలోచించాలి, కులాలు, మతాలను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే నేతలకు మైనారిటీలు బుద్ధి చెప్పాలన్నారు.
త్తులో మైనారిటీల సంరక్షణ, సంక్షేమం తాను చూసుకుంటానని తనపై విశ్వాసముంచాలని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని ముందుకు నడిపించాలంటే మైనారీటల సహకారం ఎంతో అవసరమంటూ బిజెపితో దోస్తీకి మైనారిటీలను ఒప్పించే ప్రయత్నం చేశారు. వారిని మానసికంగా సిద్ధం చేయడం కోసం మైనారిటీల విషయంలో ప్రత్యేకంగా గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలను బాబు ప్రస్తావించారు.
....................
కర్నూలు ప్రజాగర్జనలో చంద్రబాబు