చ. పరువిడి పోయి తెచ్చి ఘనపాశ చయంబుల నంట ఁ గట్టి
గ్గురు భుజు లందఱుం గదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం
దరలఁగఁ దీయలేక దగ దట్టముగా మది దుట్ట గిల్ల నొం
డొరు గడవంగ వే చని పయోరు హనాభున కంతఁ జెప్పినన్
భావం: శ్రీకృష్ణుని కొడుకులంతా తమతమ పరివారమంతా పరుగు పరుగున వెళ్లి పెద్ద తాళ్లు తెచ్చారు. ఆ శౌర్యవంతులందరూ ఆ ఊసరవెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కాని లాభం లేకపోయింది. వారు వేగంగా వెళ్లి శ్రీకృష్ణునితో ఈ విషయం విన్నవించారు.వారికి నీరు బావిలో పడి ఉన్న ఊసరివెల్లి ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా పెద్దఆకారం గలది కావుననే పైకి రాలేక అవస్థపడుతుంది అనుకొన్నారు. వెంటనే వారికి దాన్ని తీసి బయటపడవేయాలినిపించింది. వారికున్న జ్ఞానంతో శౌర్యసంపదతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఊసరవెల్లిని మాత్రం బయటకు తీయలేకపోయారు. ఊసరవెల్లి తన శాపం తీరేసమయం వచ్చిందని వీరు చేసే ప్రయత్నాలను మిన్నకుండి చూస్తున్నది.
పోతన భాగవతము-దశమస్కంధము లోని నృగమహారాజు చరిత్రములోదీ పద్యం