
వసుంధర ఎంతో మనస్థయిర్యంతో ఒంటరిగా కొడుకును చదివించుకుంటూ జీవించసాగింది.
తరువాత కాలం చకచకా జరిగిపోయింది.
తల్లి ఆశయానుకనుగుణంగా బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
కొడుకు ఉద్యోగంలో చేరినప్పట్నించి అతని పెళ్లి దిగులు పట్టుకుంది. కొడుకుకు పెళ్లి చేస్తే కోడలు వస్తుంది.
అతనికో కుటుంబం ఏర్పడుతుంది.
వారిని చూసుకుంటూ తన తతిమ్మా జీవితం వెళ్ళదీయాలన్నది ఆమె ఆకాంక్ష.
ఆ రోజు కోసం ఎంతో ఆశతో ఎదురుచూడసాగింది.
అతనికి బ్యాంకిలో మొదటి పోస్టింగ్ అనంతపురంకు వేశారు.
క్రొత్త ప్రదేశం.. క్రొత్త పరిచయాలు.
ఆ రోజుల్లోనే ప్రియతో మొదటిసారిగా పరిచయమేర్పడింది. ఆమె ఏదో డ్రాఫ్ట్ కోసమని బ్యాంకికి వచ్చింది.
అది మొదటివారం కావటంతో బ్యాంకి రద్దీగా ఉంది. ప్రతి కౌంటర్ వద్ద జనం క్యూ కట్టి ఉన్నారు. తన సీటులో కూర్చుని యధాలాపంగా తలెత్తి ఓ వైపు చూసిన సిద్ధార్థకు ఒక అందమైన అమ్మాయి కన్పించింది.
ముఖంలో ఆదుర్దా- విసుగు- టెన్షన్- మాటిమాటికి రిస్టువాచి చూసుకుంటూ ఏదో గొణుక్కుంటుంది.
అంతమంది జనంలో ఆమె ఎందుకోగాని ప్రత్యేకంగా కన్పించింది అతని కళ్ళకి.
చక్కని రంగు తీర్చిదిద్దినట్టుండే ముఖం.. ముఖ్యంగా విశాలమైన ఆ కళ్ళు ఎంతో ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి.
అంతేకాక- ఆమెలో ఏదో ఠీవి- దర్పం. హుందాతనం ద్యోతకమవుతున్నాయి. అతని సీటుకి దగ్గరగా నిలబడి ఉందా అమ్మాయి.
ఇంతలో కౌంటర్లో కూర్చున్న క్యాషియర్ ఎవరిమీదో కేకలేస్తున్నాడు.
‘‘మీరు ఎంత పెద్ద మనుష్యులయినా కోటీశ్వరులయినా ఇక్కడ మాత్రం అందరితో సమానంగా క్యూలో వచ్చి నిలబడాల్సిందే. మీ వంతు రాగానే మీ పని ముగించుకుని పోండి. ఇక్కడ అధికారం చెలాయిస్తే చెల్లదు’’.
అసలే రద్దీగా వుండటంతో కాబోలు సహనం నశించిన ఆ క్యాషియర్ ఇంతెత్తున మండిపడుతున్నాడు.
‘‘ఏమిటయ్యా.. కష్టమర్లతో మాట్లాడే విధానం ఇదేనా? అటుచూడు ఏమి వ్రాసి వుందో. మాలాంటి కస్టమర్లకు సేవ చెయ్యడానికే కదా మీరుండేది’’.
క్యూలో నిలబడ్డ ఎవరో ఒకతను తగువు పెట్టుకున్నాడు. మాటా మాటా పెరిగి అక్కడంతా గలాభాగా తయారయింది.
ఆమె గాభరాగా వచ్చి సరిగ్గా సిద్ధార్థ కూర్చున్న సీటు దగ్గరికి వచ్చి ఆగింది.
సిద్ధార్థ ఇక చూస్తూ ఉండలేకపోయాడు.
‘‘చూడండి మిస్.. మీరు ఏ పని మీద వచ్చారో చెబితే నేను తప్పక సహాయపడగలను’’ అన్నాడు ఆమెనుద్దేశిస్తూ.
ఆమె యిటు తిరిగి అతని వొంక అదోలా చూసింది.
తరువాత, మెల్లని స్వరంతో, ‘‘ప్లీజ్ సార్, ఎగ్జామినేషన్ ఫీ కట్టాలి. ఈ రోజే లాస్ట్ డేట్ అప్లికేషన్‌తోపాటు డ్రాఫ్టు పంపించాలి. టైమైపోతోంది. నేను యింకా యూనివర్సిటీ వెళ్లాలి’’ చెప్పింది గబగబా. ఆమె దగ్గరనుండి డబ్బు తీసుకుని మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుని ‘‘ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాను. జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్’’ అంటూ మరో సీటువైపు కదిలాడు.
ఆమె అటే చూడసాగింది.
సరిగ్గా ఓ ఐదు నిమిషాల తరువాత ఓ డ్రాఫ్ట్ తెచ్చి ఆమెకందించాడు. వెంటనే ఆమె ‘‘్థంక్స్.. థ్యాంక్స్ ఎలాట్..’’ అని చెప్పింది కృతజ్ఞతగా.
ఆమె కళ్ళు కూడా అతని వొంక కృతజ్ఞతగా చూశాయి.
మళ్లీ మరోసారి థ్యాంక్స్ చెబుతూ వెనుదిరిగింది.
ఆమె గొంతు సన్నగా తియ్యగా ఉంది.
ఆమె వెళ్లిపోయినా చాలాసేపటికి వరకు ఆమెను మరచిపోలేకపోయాడు. మనసంతా సరికొత్త అనుభూతితో నిండిపోయింది.
ఆమెను మళ్లీ మళ్లీ చూడాలనిపించింది ఎందుకో.
‘‘ఆమె మీకు తెలుసా? ప్రక్కనే వున్న అతని కొలీగ్ శేఖర్ అడిగాడు.
‘‘అబ్బే లేదు. ఇదే మొదటిసారి చూడ్డం..’’ అన్నాడు రవ్వంత సిగ్గుపడుతూ.
‘‘ఆమె ఇక్కడే యూనివర్సిటీలో చదువుకొంటోంది. పేరు ప్రియదర్శిని తండ్రి బాగా ఉన్నవాడుట..’’ చెప్పాడతను.
ఆ తరువాత కూడా ఆమె బ్యాంకికి అప్పుడప్పుడు వస్తుండేది.
అలా వచ్చినప్పుడు నేరుగా అతని సీటు దగ్గరికి వెళ్లి తను వచ్చినపని చేయించుకుని వెళ్తుండేది.
కాని వాళ్ళిద్దరి నడుమ కనీసం పరిచయ వాక్యాలు కూడా జరుగలేదు.
****
ప్రతిరోజూ తల్లి దగ్గర్నుంచి ఫోన్లు, అడపదడపా ఉత్తరాలు వస్తున్నాయి.
‘‘బాబు సిద్ధూ.. నీకు ఉద్యోగం వచ్చింది. ఇక జీవితంలో స్థిరపడినట్లే. నేను పెద్దదాన్నయిపోతున్నాను. ఈమధ్య ఆరోగ్యం కూడా బాగుండటంలేదు. నీ వివాహం తొందరగా జరగాలని కోరుకుంటున్నాను. నీకు నచ్చిన అమ్మాయితోనే పెళ్లి జరిపిస్తాను. నేను కూడా ఇక్కడ నా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాను...
ఇలా సాగేది తల్లి ధోరణి
దానికి సమాధానమిస్తూ ‘‘అమ్మా! నా పెళ్లికి మరీ తొందర పడ్తున్నావు. తొందరపాటులో నీకాబోయే కోడల్ని ఎంచుకోవటంలో పొరబాటు చేయవచ్చు. అందుకే నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు’’ చెప్పేవాడు.
‘‘ఏమిటో బాబు- నువ్వు పెళ్లి చేసుకుంటే మనిల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందని- అది కనులారా చూడాలని ఉంది బాబు.’’
‘‘అమ్మా- నువ్వు అప్పుడే ముసలిదానివి కావులే. నిన్ను చూసి నా స్నేహితులు చాలామంది ‘మీ అక్కయ్యా’ అని అడిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. కొన్నాళ్ళు ఓపిక పట్టు. అన్నీ నువ్వు అనుకున్నట్లే నెరవేరతాయి. తల్లిని కన్విన్స్ చేసేవాడు.
తల్లికి అలా నచ్చచెప్పాడేకాని అతనికి లోలోన ఏదో తెలియని భయం లేకపోలేదు.
అతనికి జ్ఞానం కలిగిన నాటినుంచి తల్లి పడ్డ కష్టాలు అతను మరచిపోలేకపోతున్నాడు. తండ్రి జీవించినంతకాలం ఆమె జీవచ్ఛవంలా బ్రతికింది. ఆమెకంటూ ప్రత్యేకంగా యిష్టాయిష్టాలుండేవి కావు. భర్త యొక్క ఆజ్ఞను శిరోధార్యం వహిచటం తప్ప మరో లోకం తెలియదు. తండ్రి యొక్క అనాదరణ, నిర్లక్ష్యం ఆమెను ఒక యోగినిలా మార్చాయి.
-ఇంకాఉంది