పుష్పకం దిగి అవనిపయి కూర్చుండి అవనీశుడు ఆ మంత్రులతో ఈ విధంగా వచించాడు.
‘‘ఈ గృహం ఎవరు కట్టారు? కట్టి ఎన్నినాళ్లు అయింది? కలహం దేనికి? మీరు యథాస్థితి తెలియచెయ్యండి’’ అని కోరాడు. అప్పుడు గృధ్రము ‘‘నరపాలా! నా విన్నపం నువ్వు కృపతో విను. బ్రహ్మ ఎప్పుడు ఉద్భవించాడో అప్పుడే నేను ఈ యిల్లు నిర్మించాను. కాన ఇదీ నా గృహమే’ అని తెలిపింది.
అంత గూబ మానవాధిపుడిని కనుగొని ‘‘రాజా! ఈ తరువుల సృష్టి ఏనాడు జరిగిందో అది మొదలుగా ఇది నా ఇల్లే!’’ అని మనవి చేసింది. అపుడు ఆ నరలోకపాలకుడు ఆ రెండు వాక్యాలు ఊహించి ‘‘ఏ సభలోనైనా పెద్దవారు ఆసీనులై పల్కినంత మాత్రాన అది సభ కాదు. పరీక్షించి ధర్మం పలుకనివారు లోకంలో పెద్దలు కారు. జగాలన్నీ కొనియాడే సత్యాలయినా అరిసి చూస్తే ధర్మాలు కావు. ఒక్కొక్క పలుకు ఆలోచించి, చక్కగా పలికినా అది సత్యం కాబోదు. తెలిసివుండిన్నీ సభలో ఎవరైనా న్యాయం పలుకకుంటే అట్టివారు బొంకినట్లే. అట్టివారి వాక్యాలు పట్టి పరీక్షించి చూసి, కామరోషాదులవల్ల ధర్మం చెప్పనివాడు ధర్మఘాతకుడు అవుతాడు. ఆ విధంగా ధర్మహానికి తలపడేవాడు వెయ్యి వరుణపాశాలకి తనకి తాను బద్ధుడై నశిస్తాడు.
కనుక మీరందరూ ఈ ఇద్దరి తగవూ ఎరిగి, ఇది తెరగు అని నాకు తెలుపండి’’ అని అడిగాడు. అంత మంత్రులు సమాహిత చిత్తులై భావించి ‘‘కాకుత్‌స్థ వంశదీప! ఉలూకం మాట గెలిచింది. ఈ గ్రద్ద పలికిన వాక్య పద్ధతి అరసి చూడు. నీవే ప్రమాణం. రాజ దండభీతితో లోకం తగు రీతిని వర్తిస్తుంది. పాడి తప్పిన వాళ్లని రాజు ధర్మమార్గంలో దండిస్తాడు. అట్టి రాజ దండనము పొందినవాణ్ణి యముడు శిక్షింపడు’’ అని పలికారు. శ్రీరామవిభుడు ఆ పలుకులు ఆలకించి, మంత్రుల్ని కని కడు ప్రీతితో ‘‘పౌరాణికమైన అర్థాన్ని పరిపాటితో పరిమితోక్తులతో చెప్పుతాను. వినండి. మేరునగం తప్ప, సృష్టి అంతా ఏకార్ణవం అయిన కాలంలో ఆ ఉదక మధ్యంలో అచ్యుతుడు పలు సంవత్సరాలు నిద్దురపోవసాగాడు. ఆ తరిని బ్రహ్మ ఆ విష్ణువు జఠరం చొచ్చి, అందు ఒక గొందిలో వున్నాడు. పదపడి విష్ణువు నాభి నుంచి ఒక పద్మం పుట్టింది. ఆ పద్మం నాళం నుంచి బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మ జరాయుజాలను ముందుగా పుట్టించాడు. కనుక ఈ గ్రద్ద గుడ్లగూబని చాలాకాలంగా కారిస్తున్నది. కనుక ఈ గృధ్ర రాజాన్ని దండించక తీరదు’’ అని అడిదం కేలదాల్చాడు. వెంటనే ఆకాశవాణి ఈ కరణి వినవచ్చింది.
‘‘రామావనీశా! కోపం వుడుగు. ఈ గ్రద్ద అసమాన తేజుడు. అధికశూరుడు. సత్యవ్రతుడు. నిర్మలాత్ముడు అయిన భూనాథుడు. పూర్వజన్మలో బ్రహ్మదత్తుడు అనే రాజు. మరి అంతటి పుణ్యాత్ముడైన నరనాథుడు ఈ గ్రద్ధ ఏ రీతిగా అయాడు?’’ అని అడుగుతావేమో? విశదపరుస్తాను. వినవలసింది.
బ్రహ్మదత్తుడి కథ
ఒకప్పుడు గౌతమ మహర్షి ఈ బ్రహ్మదత్త నరపాలుడి వద్దకు చనుదెంచి ‘‘నువ్వు నాకు ప్రీతితో అన్నం పెట్టవలసింది’’ అని కోరాడు. బ్రహ్మదత్తుడు మిక్కిలి హర్షించి ఆ గౌతమ ముని చంద్రుడికి అర్ఘ్య పాద్యాలు సమర్పించి నేను ధన్యుణ్ణి అయాను అని తలపోసి కడు భక్తితో నూట ఇరవై అయిదు అబ్దములు ఇష్టమృష్టాన్నం పెట్టాడు. ఒక రోజున గౌతముడు సంతుష్టుడై ఆహారం భుజిస్తున్నాడు. ఆ ఆహారంలో అల్పమైన మాంసఖండం మునికి కనిపించింది. గౌతముడు పట్టరాని కోపంతో ఆ బ్రహ్మదత్తుణ్ణి ‘‘మహారణ్యంలో గ్రద్దవై చిరకాలం పడి వుండు’’ అని శపించాడు.
వెంటనే బ్రహ్మదత్తుడు ముని శాపవాక్కుకి అతి భీతుడై కేలుగవ ముడిచి ‘‘మునీంద్రా! ఈ దోషం అజ్ఞానకృతం. ఈ దొసగుని విజ్ఞానమయ దృష్టితో వీక్షించి, నన్ను కరుణించు’’ అని ప్రార్థించాడు. అప్పుడు గౌతముడు దివ్య దృష్టితో ఊహించి, దయాళువయి ఒక వాక్యం పలికాడు. ‘‘బ్రహ్మదత్తా! ఇక్ష్వాకువంశంలో అసమాన పరాక్రమవంతుడు శ్రీరాముడు. దిక్కుల కీర్తి చంద్రికలు నిండార జన్మిస్తాడు.
-ఇంకాఉంది
పుష్పకం దిగి అవనిపయి కూర్చుండి అవనీశుడు ఆ మంత్రులతో ఈ విధంగా వచించాడు.
english title:
ranganatha
Date:
Monday, March 24, 2014