
తొక్కితే రాయి మొక్కితే - దేవుడు. చెట్టు, పుట్ట, మట్టి, కొండ, రాయి, ఆకాశం, నీళ్లు, నిప్పు, గాలి, ఇలా ఏదైనా సరే భగవంతుడి అంశనే అంటుంది భారతీయం. ఎందుకంటే సృష్టి చేసినవాడు భగవంతుడు. సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తాయో అలానే భగవంతుడి నుంచి సృష్టి జరిగింది. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ పరమాత్మ కానిది ఏదీలేదు. అటువంటి భగవంతుడిగా కొలవడానికి పనికిరాని వస్తువు అంటూ ఏదీ వుండదు కదా. అందుకే మూర్ఖంగా కొండను కొలిచినా, జ్ఞానంతో కోనేటిరాయుడ్ని కొలిచినా పలికేవాడు భగవంతుడే. తనను అలంకారప్రియుడని కీర్తించి కన్నులపండుగగా అలంకరించి స్తుతించినా కాపాడుతాడు. అలాకాక మనస్సనే పూవును సమర్పించి భౌతికంగా ఏపూవు ఇవ్వకపోయనా భగవంతుడు తన్నుతాను భక్తునకు సమర్పించుకుంటాడు.
ఒకనాడు తొండమానుడు తులసీతోను, వివిధ రకాల పూలతోను తాను నమ్మిన వేంకటేశ్వరునికి సమర్పించి పూజించేవాడు. ఇలానే ఓ కుమ్మరి భీమన్న తాను కుమ్మరి పనులు చేసుకొనేముందు భగవంతుడైన వేంకటేశ్వరునికి కుండలు చేయడానికి పెట్టుకున్న మట్టితో తులసీ దళాలను చేసి అర్పించి తన పని తాను ఆరంభించేవాడు.
తొండమానుడు తాను రోజు భగవంతునికి తులసిని సమర్పిస్తున్నాను కనుక నన్ను మించిన భక్తుడు ఈ ఇలా తలంలో మరొకడు లేడనుకొన్నాడు. వెంటనే అహంకారం ఆయనలో పొడసూపింది. భగవంతుడు తన భక్తుని స్థితిని తెలుసుకున్నాడు. అహంకారపు పొర పెరగకుండా తుడిచివేయాలనుకొన్నాడు. అంతే ఓరోజు తొండమానుడు పూజించేవేళకు తన పాదాలపై కుమ్మరి భీమన్న పెట్టిన మట్టితులసీదళాలను ఉంచుకున్నాడు. వాటిని చూచి తొండమానుడు ఆవేశపడ్డాడు. భగవంతుని పాదాలపై ఎవరు మట్టి పెట్టిందని చీదరించుకున్నాడు. నాలుగురోజులు వాటిని తీసివేసి తాను పరిశుభ్రమైన దళాలుంచినా తెల్లవారేసరికి మరలామరలా ఆ మట్టి తులసీదళాలే కనపడసాగితే అసలువిషయం వేంకటేశ్వరునే్న అడిగి తెలుసుకుందానుకున్నాడు. తనతో ముచ్చట్లాడే వేంకటేశ్వరుని నిలదీసాడు. ఎవరా ధూర్తుడునీ పాదాలపై మట్టిని పడవేస్తున్నాడంటూ ఆక్రోసించాడు. వేంకటేశ్వరుడు చిరునవ్వుతో అత్యంత ప్రియభక్తుడు వాడు నాకు అన్నాడు. ఆ మాటే తట్టుకోలేని తొండమానుడు అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలనుకొన్నాడు.
కుమ్మరి భీముణ్ణి చూడాలని కాలినడకన బయలుదేరాడు. నడక అలవాటు లేని తొండమానుడు కుమ్మరిభీముడిని చేరేసరికి అలసి స్పృహతప్పాడు. రాజుగారు స్పృహతప్పారని భీముడు హాడావుడి చేశాడు. సేదతీర్చాడు. అపుడే వేంకటేశ్వరుడు భీముని ముందు వచ్చి నిలిచారు. వేంకటేశ్వరుని చూచి ఉబ్బితబ్బుఅయ్యాడు. వేంకటేశ్వరుని పాదాలపై పడి ఎంతటి కరుణచూపించావయ్యాఅంటూ కొనియాడాడు. వేంకటేశ్వరుడు తనకు ఆకలిగా ఉందంటే తాను తనకోసం వండుకున్న సంకటి ముద్దనే ఉందంటూ కన్నీరు కారుస్తూ దానితో ఆకలి తీర్చుకోమన్నాడు ఆ భీముడు. వేంకటేశ్వరుడు దానే్న పరమాన్నంగా ఆరగించాడు. నీరు నిండిన కన్నులతో వేంకటేశ్వరుని స్తుతించటానికి తత్తరపడే భీముని దంపతులను ఆనందంగా చూచాడు వేంకటేశ్వరుడు. పాంచభౌతిక శరీరాలను వదిలి దివ్యశరీరాలుధరించి దివ్యవిమానంలోకూర్చునే భీముని దంపతులను చూచిన తొండమానుడు ఆశ్చర్యానందాలకు లోనైయ్యాడు.
భక్తికి పరవశించిపోయే వేంకటేశ్వరుని వాత్సల్యానికి అబ్బురం చెందాడు. తనలో మొలకెత్తబోయిన అహంకార బీజాన్ని చిదిమివేశాడు. కన్నీళ్లతో వేంకటేశ్వరుని పాదాలను కడిగాడు. అజ్ఞానాన్ని రూపుమాపి జాన భిక్ష పెట్టమని ప్రార్థించాడు. తన ప్రియభక్తుడైన తొండమానుడి చేయి పుచ్చుకుని వేంకటేశ్వరుడు తన నిజవాసానికి వెళ్లి చిరునవ్వు పాచికలాటకు కూర్చోబెట్టాడు.
భగవంతుని పై భక్తి కుదుర్చుకుంటే చాలు అహంకారమమకారాదులనే అరిషడ్వర్గాలను అణచివేయవచ్చు. అందుకే ప్రతివారు వారిమదిలో భక్త్భివాన్ని పెంచుకోవాలి. పరులలో పరమాత్మనుచూచే తత్వాన్ని అణవణువునా జీర్ణించుకోవాలి. భగవంతుని సర్వజ్ఞతను తెలుసుకుంటే చాలు భక్తి దానంతటే చిగురులు వేస్తుంది.